
నిజామాబాద్ అర్బన్: నిజామాబాద్ ప్రభుత్వాస్పత్రిలో కొవిడ్ మృతదేహం తారుమారైంది. పూర్తిగా పరిశీలించకుండానే తమకు చెందిన మృతదేహమే అనుకుని అంత్యక్రియలు నిర్వహించేశారు. తీరా మృతదేహానికి సంబంధించిన బంధువులు ఆరాతీసేసరికి అసలు విషయం బయటపడింది. నిజామాబాద్ ప్రభుత్వాస్పత్రిలో శుక్రవారం జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. జిల్లా కేంద్రంలోని అహ్మద్‌పురకాలనీకి చెందిన మైనారిటీ వర్గానికి చెందిన మహిళ (78) కొవిడ్ తో బాధపడుతూ రెండ్రోజుల నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మరణించింది.
కాగా, ఇదే సమయంలో గాయత్రినగర్‌కు చెందిన మరో మహిళ (65) కొవిడ్ చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ రెండు మృతదేహాలను ప్యాక్‌చేసి పోస్టుమార్టం గది పక్కకు తీసుకొచ్చారు. ఆ సమయంలో ఈ రెండు మృతదేహాలకు సంబంధించిన బంధువులెవరూ లేరు. గాయత్రినగర్‌కు చెందిన ఓ వ్యక్తి కొవిడ్‌తో మహిళ చనిపోయిందని గాయత్రినగర్ వాసులకు సమాచారం అందించారు. వారు వచ్చి ప్యాక్ చేసి ఉన్న మృతదేహాన్ని పరిశీలించకుండానే తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించేశారు. అనంతరం మైనారిటీ వర్గం వారు వచ్చి తమ బంధువు మృతదేహం గురించి వెదకగా కనిపించలేదు.
దీంతో అనుమానం వచ్చిన ఆస్పత్రి అధికారులు గాయత్రి నగర్ వాసులను పిలిపించారు. అక్కడ ఉన్న మృతదేహాలను మళ్లీ పరిశీలించగా గాయత్రినగర్ మహిళ మృతదేహం అక్కడే ఉంది. ఇంతకు ముందు తీసుకెళ్లిన మృతదేహాన్ని చూడలేదని తెలపడంతో మైనారిటీకి చెందిన నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పోలీసులు, అడిషనల్ కలెక్టర్ ఆస్పత్రికి వచ్చి విచారణ జరిపారు. రెండు వర్గాలను సముదాయించారు. దీంతో మైనారిటీ వర్గం వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాగా మృతదేహం తారుమారుపై ఆస్పత్రి అధికారులు విచారణ చేపడుతున్నారు.
చదవండి: కరోనా టీకా వేయించుకున్న 105 ఏళ్ల బామ్మ
Comments
Please login to add a commentAdd a comment