నిందితులు భార్యాభర్తలు రాజు, లతశ్రీ
సాక్షి, గచ్చిబౌలి: గచ్చిబౌలిలోని టిమ్స్ ఆస్పత్రిలో కోవిడ్ కేర్ టేకర్లుగా పనిచేసిన భార్యభర్తలు ఆ వృత్తికే కళంకం తెచ్చారు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న రోగులతో పాటు కోవిడ్‌తో చనిపోయిన వారి మృతదేహాల నుంచీ నగలు, సొత్తు కాజేశారు. మొత్తం ఏడు కేసులు నమోదైన ఉన్న వీళ్లని ఇలా చోరీ చేసిన సెల్‌ఫోన్ ఆధారంగానే గచ్చిబౌలి పోలీసులు పట్టుకున్నారు. మాదాపూర్ డీసీపీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ వెంకటేశ్వర్లు పూర్తి వివరాలు వెల్లడించారు.
2017లో నాగర్‌కర్నూల్ జిల్లా ధర్మపురికి చెందిన చింతపల్లి రాజు, లతశ్రీ ప్రేమ వివాహం చేసుకుని కూకట్‌పల్లి రాజీవ్ గృహకల్పలో నివాసం ఉంటున్నారు. క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్న రాజును సెకండ్ వేవ్ సమయంలో వైద్య సిబ్బంది జగద్గిరిగుట్ట నుంచి టిమ్స్‌కు తీసుకొచ్చేందుకు నియమించుకున్నారు. ఇలా ఏర్పడిన పరిచయాలతోనే తన భార్య లతశ్రీని టిమ్స్‌లో పేషెంట్ కేర్ టేకర్‌గా చేర్చాడు. కొన్నాళ్లకు రాజు కూడా అలాంటి ఉద్యోగంలోనే చేరాడు.
అప్పుల్లో కూరుకుపోయిన వారి దృష్టి టిమ్స్‌లోని కోవిడ్ రోగులపై ఉన్న బంగారు ఆభరణాలపై పడింది. ఏప్రిల్ 17–మే 25 మధ్య ఏడు నేరాలు చేశారు. లతశ్రీ ముందుగా మృతదేహాలు ఉన్న చోటుకు వెళ్లి పరిశీలించేది. అక్కడ ఎవరూ లేకపోతే తన భర్త రాజును పిలిచేది. అక్కడకు వెళ్లే అతగాడు శవాలపై ఉన్న నగలు తీసి జేబులో వేసుకుని ఏమీ తెలియనట్లు డ్యూటీ చేసేవాడు. ఈ సొత్తును జగద్గిరిగుట్టలోని జగదాంబ జువెల్లర్స్‌లో కుదువ పెట్టి అప్పులు తీర్చడంతో పాటు జల్సాలు చేశారు.
కేసు వివరాలను వెల్లడిస్తున్న మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు
కోవిడ్‌తో మరణించిన ఉప్పరపల్లికి చెందిన ఉమాదేవి నుంచి మూడు తులాల బంగారు పుస్తెల తాడు, చెవి దిద్దులు, యూసూఫ్‌గూడకు చెందిన పరహత్ సుల్తానా ఒంటిపై ఉన్న మూడు తులాల బంగారు గాజులు, దిద్దులు, జవహర్‌నగర్‌కు చెందిన భిక్షపతి తల్లి మెడలోంచి గుండ్ల మాల తస్కరించారు. నాచారానికి చెందిన కోటమ్మ ఐసీయూలో ఉండగానే ఆమె ఒంటిపై ఉన్న నాలుగు బంగారు గాజులు కాజేశారు. ఈమెను మరో హాస్పిటల్‌కు తరలిస్తుండగా ఈ విషయం గుర్తించారు.
ఈ మేరకు గచ్చిబౌలి పోలీసుస్టేషన్‌లో మొత్తం ఏడు కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది మే చివరి వారం నుంచి ఈ భార్యభర్తలు టిమ్స్‌లో డ్యూటీకి వెళ్లడం మానేశారు. ఓ మృతదేహం నుంచి వీళ్లు ఆభరణాలతో పాటు సెల్‌ఫోన్ కూడా తస్కరించారు. ఇటీవల దీన్ని ఆన్ చేయడంతో పోలీసులకు క్లూ లభించి ఇద్దరూ చిక్కారు. విచారణలో తాము చేసిన నేరాలు అంగీకరించారు. వీరి నుంచి పది తులాల బంగారం సహా రూ.10 లక్షల విలువైన సొత్తు స్వాదీనం చేసుకున్నారు. మరో రెండు సంస్థల్లో తాకట్టు పెట్టిన నాలుగు బంగారు గాజులు స్వాధీనం చేసుకోవాల్సి ఉంది. నిందితుల్ని పట్టుకున్న గచ్చిబౌలి ఇన్‌స్పెక్టర్ గోనె సురేష్ తదితరుల్ని అభినందించిన డీసీపీ రివార్డు ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment