టిమ్స్ ఆసుపత్రిగా మార్చిన గచ్చిబౌలిలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్
సాక్షి, హైదరాబాద్: కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీచేసింది. ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ, వైద్య విద్యా సంచాలకులు (డీఎంఈ), వైద్య విధాన పరిషత్, యోగాధ్యయన పరిషత్, ఆయుష్ వంటి విభాగాలకు నిధులు మంజూరు చేసింది. మొత్తం రూ. 274 కోట్లు మంజూరు చేస్తూ వైద్య, ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి వేర్వేరు ఉత్తర్వులు జారీ చేశారు. అందులో ప్రధానంగా గచ్చిబౌలి స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో కరోనా చికిత్సకోసం ఏర్పాటు చేసిన టిమ్స్ ఆస్పత్రికి రూ.25 కోట్లు కేటాయించారు. 1,500 పడకలతో ఏర్పాటు చేసిన ఈ ఆస్పత్రి ఆధునీకరణ, మరమ్మతుల పనుల కోసం ఈ నిధులను ఉపయోగిస్తారు.
ఆయా పనులను నామినేషన్ పద్ధతిలో చేపట్టాలని టీఎస్‌ఎంఎస్‌ఐడీసీని ఆదేశించారు. ఇదిలావుండగా వైద్య విధాన పరిషత్‌కు రూ. 107.43 కోట్లు, ఇంకో పద్దు కింద రూ.12 కోట్లు, నిమ్స్‌కు రూ. 28.46 కోట్లు, డీఎంఈ పరిధిలోకి వచ్చే బోధనాసుపత్రుల కోసం ఒక పద్దు కింద రూ. 41.66 కోట్లు, మరో పద్దుకింద రూ. 1.18 కోట్లు మంజూరు చేశారు. ఇక మెడికల్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డుకు రూ. 23 లక్షలు మంజూరు చేశారు. ఎంఎన్‌జే కేన్సర్ ఆసుపత్రికి రూ. 12 కోట్లు, ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనరేట్‌కు ఒక పద్దుకింద రూ. 37.38 కోట్లు, ఇంకో పద్దు కింద రూ. 1.20 కోట్లు మంజూరు చేశారు.
టిమ్స్ ఆస్పత్రిగా గచ్చిబౌలి స్పోర్ట్స్ భవనం
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలోని గచ్చిబౌలి వద్ద ఉన్న స్పోర్ట్స్ హాస్టల్ భవనాన్ని ఇకపై తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, రీసెర్చ్ (టిమ్స్)గా పిలవాలని ప్రభుత్వం ఆదేశించింది. దీన్ని తొలుత కరోనా ఆస్పత్రిగా అభివృద్ధి చేస్తామని, అనంతరం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, మెడికల్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఎమినెన్స్‌గా విస్తరిస్తామని శనివారం రాత్రి జారీ చేసిన ఉత్తర్వులో వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి వెల్లడించారు. కరోనా మహమ్మారిని దృష్టిలో పెట్టుకొని ఈ భవనంలో ఆస్పత్రిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఇటీవల నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయానికి అనుగుణంగా ఈ ఆదేశాలు జారీ చేశారు. స్పోర్ట్స్ హాస్టల్ భవనంతో పాటు, 9.16 ఎకరాల్లో ఆస్పత్రి ప్రారంభించి, ఆపై మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ కమ్ ప్రీమియర్ మెడికల్ కాలేజీగా అభివృద్ధి చేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment