లక్నో/ పాట్నా: పవిత్రమైన గంగానదిలో కరోనా మృతదేహాలు పడి ఉండడం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. మూడు, నాలుగు కిలో మీటర్ దూరం వరకు దాదాపు వందకు పైగా కరోనా మృతదేహాలు పడి ఉన్నాయి. తెల్లటి వస్త్రాల్లో కప్పి ఉంచిన కరోనా మృతదేహాలను నది ఒడ్డున పడవేశారు. మరికొన్ని మృతదేహాలు నది మధ్యలో నీటిలో తేలియాడుతూ కనిపించాయి. సోమవారం మధ్యాహ్నం సమయంలో వాటిని స్థానికులు గుర్తించి అధికారులకు సమాచారం ఇచ్చారు.
ఉత్తరప్రదేశ్‌లోని హమీర్‌పూర్, బిహార్‌లోని బక్సార్ జిల్లాలో పారుతున్న గంగానది చెంత ఈ దుస్థితి ఏర్పడింది. యూపీలో అత్యధికంగా కరోనా కేసులు, మరణాలు సంభవిస్తున్నాయి. మృతదేహాలకు అంత్యక్రియలు చేసే శ్మశానం కూడా నిండి ఉండడం.. కుటుంబసభ్యులు నిరాకరించడం వంటి వాటితో ఇక విధిలేక కొందరు ఆస్పత్రుల నిర్వాహకులతో పాటు స్థానిక అధికారులు గంగానది ఒడ్డున కరోనా మృతదేహాలను పడేశారని తెలుస్తోంది. దీంతోపాటు బిహార్‌లోని బక్సర్ జిల్లా నగర్ పరిషద్ పట్టణంలో పారుతున్న గంగానదిలోనూ మృతదేహాలు ప్రత్యక్షమవుతున్నాయి. దీనిపై సమాచారం అందుకున్న అధికారులు విచారణ చేపట్టారు.
గంగానదిలో మృతదేహాలు తేలడంపై యూపీలోని హమీర్‌పూర్ ఏఎస్పీ అనూప్‌కుమార్ స్పందించారు. హమీర్‌పూర్, కాన్పూర్ జిల్లాల్లోని కొన్ని తెగల్లో మృతదేహాలను కాల్చడం.. పూడ్చడం వంటివి చేయరని.. అలా నదిలో పారవేస్తారని ఏఎస్పీ తెలిపారు. అప్పుడప్పుడు నదిలో మృతదేహాలు కనిపిస్తుంటాయని చెప్పారు. అయితే ప్రస్తుతం కరోనా భయంతో కూడా చాలా మంది అంత్యక్రియలు చేసేందుకు భయపడుతూ మృతదేహాలను నది నీటిలో వదిలేస్తున్నారని ఆయన వివరించారు. మొత్తం గంగానది ఒడ్డున 150కి పైగా మృతదేహాలు లభించాయని తెలుస్తోంది.
చదవండి: ‘నా వయసు 97 ఏళ్లు.. ఆ రోజు కోసం ఎదురుచూస్తున్నా’
చదవండి: కరోనా కల్లోలం: 14 రాష్ట్రాల్లో లాక్‌డౌన్
Comments
Please login to add a commentAdd a comment