తమ గ్రామానికి వెళ్లేందుకు లక్నో నుంచి సామానంతా సర్దుకొని వెళుతున్న కార్మికులు
కూటి కోసం కూలి కోసం పట్టణంలో బతుకుదామని వలస వచ్చిన బాటసారికి ఎంత కష్టం ఎంత కష్టం
మహాకవి శ్రీశ్రీ రాసిన ఈ కవితకి దృశ్యరూపం ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లోనూ కనిపిస్తోంది. కోవిడ్–19 మహమ్మారిని అడ్డుకోవడానికి దేశం లాక్‌డౌన్ ప్రకటించడంతో వారికి పనుల్లేవు. తిండి లేదు, నీళ్లు లేవు. ఉండడానికి చోటు లేదు. ఏదో మహమ్మారి పెనుభూతమై కాటేస్తుందన్న భయంతో సొంతింటికి చేరుకోవాలన్న ఆరాటం ఎక్కువైపోయింది. రవాణా సౌకర్యాలు లేకపోవడంతో వలసదారులు తమ కాళ్లకి పని చెప్పారు.
నెత్తి మీద ఒక మూట, చంకలో పిల్ల, రెండు చేతుల నిండా పెద్ద పెద్ద బ్యాగుల్లో సామాన్లతో వలస కార్మికులు నడుస్తున్న దృశ్యాలు అన్నిచోట్లా కనిపిస్తున్నాయి. గమ్యస్థానం ఎప్పుడొస్తుందో తెలీదు, ఇల్లు చేరడానికి ఎన్నాళ్లవుతుందో అర్థం కాదు. అయినా ప్రాణాలను నిలుపుకోవాలన్న ఒకే ఒక్క ఆరాటంతో పళ్ల బిగువున అన్ని కష్టాలను నొక్కిపెట్టి కిలో మీటర్లకి కిలోమీటర్లు నడుస్తున్నారు. ఢిల్లీ, హరియాణా, గుజరాత్ నుంచి ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాలకు కర్ణాటక నుంచి రాజస్తాన్‌కు వేలాది మంది రోడ్లపై నడుస్తున్న దృశ్యాలు అందరి గుండెల్ని పిండేస్తున్నాయి. మన దేశంలో బెంగాల్, ఒడిశా, బిహార్ నుంచి అత్యధికంగా ఇతర రాష్ట్రాలకు వెళ్లి పని చేస్తుంటారు.
చాలా ప్రాంతాల్లో కాలినడకన వెళుతున్న కార్మికుల్ని స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి ఆదుకుంటున్నాయి. వారికి మంచినీళ్లు, ఆహారపొట్లాలు అందిస్తూ గమ్యస్థానాలు చేరుకునేలా ఏర్పాట్లు చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఎక్కడ వాళ్లు అక్కడే ఉండాలని విజ్ఞప్తి చేసి, వారి బసకి ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ ఇంటికి తొందరగా చేరాలన్న ఆత్రుతలో వందలాది కిలోమీటర్లు నడిచి వెళుతున్నారు. బెంగళూరులో వెల్డర్‌గా పనిచేసే శశిరామ్ అనే వెల్డర్ బెంగళూరు నుంచి 1300 కి.మీ. దూరంలో ఉన్న రాజస్తాన్‌లో తన స్వగ్రామానికి కాలినడకన వెళ్లే సాహసం చేశాడు.
‘‘నేను ఇల్లు చేరడానికి 10 రోజులైనా పట్టొచ్చు, 12 రోజులైనా పట్టొచ్చు. కానీ నాకు వేరే దారి లేదు. బెంగళూరులో పని లేదు. తిండి లేదు. అందుకే రాజస్తాన్‌లో ఉన్న మా సొంతింటికి బయల్దేరాను’’అని శశిరామ్ అనే వెల్డర్ చెప్పారు. ‘‘మా స్వగ్రామం యూపీలో ఝాన్సీ. మా కుటుంబం అంతా భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్నాం. దేశం లాక్‌డౌన్‌తో ఒక్కసారిగా పనులు నిలిచిపోవడంతో మాకు దిక్కు తోచలేదు. చేతిలో చిల్లిగవ్వ లేదు. ఎక్కడ ఉండాలో తెలీదు. అందుకే నడక మొదలు పెట్టాం’’అని పానిపట్‌కు చెందిన రోహిత్ తెలిపారు.
బస, ఆహారం ఏర్పాటు చేయండి
వలస కార్మికుల కష్టాలను తీర్చడానికి రంగంలోకి దిగిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడి ఎక్కడి వారు అక్కడే ఉండే ఏర్పాట్లు చేయాలన్నారు. వారందరికీ బస ఏర్పాటు చేసి ఆహారం అందించాలన్నారు. ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు ఎన్ని ఏర్పాట్లు చేస్తున్నా వందలాది మంది జట్లు జట్లుగా గమ్యస్థానాలకు బయల్దేరిపోతున్నారు. దీంతో కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ హైవే అధికారుల్ని వారు క్షేమంగా ఇళ్లకు వెళ్లేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. యూపీలో ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు వెళుతున్న వారి కోసం యోగి ఆదిత్యనాథ్ సర్కార్ 300 బస్సుల్ని ఏర్పాటు చేసింది. ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వం కార్మికులు సురక్షితంగా స్వస్థలాలకి చేరడానికి 100 బస్సుల్ని ఏర్పాటు చేసింది. పాఠశాలలన్నింటినీ బసలుగా మారుస్తామని ఎవరూ ఎక్కడికీ వెళ్లవద్దని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా కార్మికులకి విజ్ఞప్తి చేస్తున్నారు.
ప్రభుత్వానిదే బాధ్యత: రాహుల్
వలస కార్మికుల దుస్థితికి కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ప్రజల్ని ఇలాంటి పరిస్థితుల్లోకి నెట్టేయడం అతి పెద్ద నేరమని చెప్పారు. ఈ సంక్షోభ పరిస్థితుల్లో నడుస్తూ వెళుతున్న వారందరికీ మద్దతుగా నిలవడం మన బాధ్యత. ఈ సమస్య మరింత దుర్భరంగా మారడానికి ముందే ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవాలి’’అని రాహుల్ ట్వీట్ చేశారు.
ఢిల్లీ– ఘజియాబాద్ సరిహద్దుల్లో...
న్యూఢిల్లీ: లాక్‌డౌన్ కారణంగా అన్ని వ్యవస్థలూ మూసుకుపోవడంతో ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వలస కార్మికులు శనివారం తమ స్వస్థలాలకు పయనమయ్యారు. ఢిల్లీ–ఘజియాబాద్ సరిహద్దుకు చేరుకొని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన బస్సుల్లో తమ ఊర్లకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అయితే బస్సులు సరిపడా లేకపోవడంతో సీట్ల కోసం కార్మికులు తమలో తాము గొడవపడ్డారు. బస్సు నిండిపోయాక, బస్సు పైన కూడా కూర్చొని ప్రయాణం చేయడానికి సిద్ధమయ్యారు. బస్సుల్లో పరిస్థితి లాక్‌డౌన్ ఏమాత్రం అమలవుతున్నట్లుగా కనిపించడం లేదు.
కొంత మంది ముఖాలకు మాస్కులు పెట్టుకున్నప్పటికీ అందులో ఎక్కువ కర్చీఫులనే కట్టుకొని కనిపించారు. ఢిల్లీలోని చార్కి దాద్రి నుంచి 110 కిలోమీటర్లు నడిచి సరిహద్దు వరకు చేరుకున్న సంతోశ్ సింగ్ (23)కు బస్సులో సీటు దొరకలేదు. దీంతో మరో 20 కిలోమీటర్లు నడిచి లాల్ కౌన్‌కు చేరుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అక్కడి నుంచైనా బస్సు దొరుకుతుందనే ఆశతో నడిచి వెళుతున్నట్లు చెప్పాడు. సరిహద్దుల వద్ద పోలీసులు ఉన్నప్పటికీ కార్మికులు ఎక్కువగా ఉండటంతో నియంత్రించలేకపోతున్నారు. ఎంత మంది సరిహద్దు దాటి రాష్ట్రంలోకి వచ్చారన్న విషయాన్ని కూడా చెప్పలేమని వారు పేర్కొన్నారు.
వృద్ధుడిని తమ సొంత గ్రామానికి మోసుకెళుతున్న కార్మికులు
Comments
Please login to add a commentAdd a comment