600 కి.మీ.. ఆకలి కడుపుతో! | COVID-19: cycle to cover 600 kms on an hunger stomach | Sakshi
Sakshi News home page

600 కి.మీ.. ఆకలి కడుపుతో!

Published Tue, May 5 2020 4:33 AM | Last Updated on Tue, May 5 2020 4:33 AM

COVID-19: cycle to cover 600 kms on an hunger stomach - Sakshi

హరియాణాలోని కర్నాల్‌ నుంచి ఉత్తరప్రదేశ్‌ లోని తమ గ్రామానికి ఖాళీ కడుపులతో దాదాపు 600 కిలోమీటర్ల దూరం సైకిల్‌పై వెళ్లిన వలస కూలీల విషాద కథనమిది.

ఉత్తర ప్రదేశ్‌లోని ఒక గ్రామానికి చెందిన శివం రాథోడ్, రామానంద్‌ రాథోడ్‌లు నిర్మాణ కార్మికులు. వారు కర్నాల్‌లో ఎనిమిది అంతస్తుల భవన నిర్మాణ ప్రాజెక్టులో కూలీలుగా మార్చి 19న చేరారు. రోజుకు రూ. 400 కూలీగా వారి ఊరి నుంచి పలువురు ఆ ప్రాజెక్టులో కూలీలుగా చేరారు. కూలీ తక్కువైనా.. వర్షాకాలం ప్రారంభమయ్యే సమయానికి కొంత డబ్బు సంపాదించుకుని వారి స్వగ్రామానికి వెళ్లాలనేది వారి ఆలోచన. కానీ దురదృష్టం వారిని వెన్నాడింది. పనిలో చేరిన మూడు రోజులకే జనతా కర్ఫ్యూ. ఆ తరువాత లాక్‌డౌన్‌.

దాంతో పనులు ఆగిపోయాయి. కొన్నాళ్లు ఆ ప్రాజెక్టు కాంట్రాక్టర్‌ నిత్యావసరాల కోసం రోజుకు ఒక్కొక్కరికి రూ. 100 ఇచ్చేవాడు. కొన్ని రోజులు గడిచాక.. తన వల్ల కాదని చేతులెత్తేశాడు. ఏప్రిల్‌ 29న వీరుంటున్న తాత్కాలికంగా ఏర్పాటు చేసిన వసతి వద్దకు వచ్చి.. తన ఆదాయం కూడా పడిపోయిందని, తానేం చేయలేనని చేతులెత్తి దండం పెట్టి, వెళ్లిపోయాడు. ఆ కూలీల పరిస్థితి అగమ్యగోచరమైంది. స్థానిక ప్రభుత్వం ఇచ్చే రేషన్‌.. స్థానికేతరులు కావడంతో వీరికి అందలేదు. స్వచ్ఛంద సంస్థలు కూడా ఎలాంటి సాయం అందించలేదు.

ఆ కాంట్రాక్టరే దయ దలిచి శివం, రామానంద్, మరో ఇద్దరికి కలిపి మూడు పాత సైకిళ్లను సమకూర్చాడు. వాటిపైననే వారు 600 కిమీల దూరంలోని తమ గ్రామానికి బయల్దేరారు. మే 2 నాటికి ఆగ్రా సమీపా నికి చేరుకున్నారు. అంత దూరం ఎండలో ఎలా సైకిల్‌పై వెళ్తున్నారన్న ప్రశ్నకు.. కొద్ది, కొద్ది దూరం తొక్కుతూ వెళ్తున్నామని చెప్పారు. మరి భోజనమెలా? అన్న ప్రశ్నకు.. అప్పట్నుంచి అన్నం తినలేదని, తాము దాటి వచ్చిన హరియాణా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌ల్లో హైవేపై పలు టోల్‌గేట్స్‌ ఉన్నా, ఎక్కడా, ఎలాంటి ఆహార సదుపాయాలు ఏర్పాటు చేయలేదని చెప్పారు.

తామే కాకుండా, ఈ హైవేపై వందలాదిగా కూలీలు నడుస్తూ సొంతూళ్లకు వెళ్తున్నారని, వారు కూడా ఆకలితోటే ప్రయాణిస్తున్నారని చెప్పారు. ఒక టోల్‌ గేట్‌ వద్ద మాత్రం ఒక పోలీస్‌ 2 డజన్ల అరటి పండ్లు, నమ్కీన్‌ ప్యాకెట్లు, బిస్కట్‌ ప్యాకెట్లు ఇచ్చాడని, వాటితోనే కడుపు నింపుకుంటున్నామని చెప్పారు. ఇంటివద్ద తనకు అమ్మ, చెల్లి ఉన్నారన్న శివం రాథోడ్‌.. ‘వారు డబ్బులు పంపిస్తాం.. అక్కడే ఉండు’అని చెప్పారు కానీ డబ్బు పంపించలేకపోయారని చెబుతూ కన్నీటి పర్యంతమయ్యాడు. ప్రభుత్వం వలస కూలీలను స్వగ్రామాలకు పంపించేందుకు నిర్ణయించిన విషయం తమకు తెలియదని, అయినా ప్రభుత్వాన్ని నమ్మలేమని వ్యాఖ్యానించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement