Hunger Shouting
-
600 కి.మీ.. ఆకలి కడుపుతో!
హరియాణాలోని కర్నాల్ నుంచి ఉత్తరప్రదేశ్ లోని తమ గ్రామానికి ఖాళీ కడుపులతో దాదాపు 600 కిలోమీటర్ల దూరం సైకిల్‌పై వెళ్లిన వలస కూలీల విషాద కథనమిది. ఉత్తర ప్రదేశ్‌లోని ఒక గ్రామానికి చెందిన శివం రాథోడ్, రామానంద్ రాథోడ్‌లు నిర్మాణ కార్మికులు. వారు కర్నాల్‌లో ఎనిమిది అంతస్తుల భవన నిర్మాణ ప్రాజెక్టులో కూలీలుగా మార్చి 19న చేరారు. రోజుకు రూ. 400 కూలీగా వారి ఊరి నుంచి పలువురు ఆ ప్రాజెక్టులో కూలీలుగా చేరారు. కూలీ తక్కువైనా.. వర్షాకాలం ప్రారంభమయ్యే సమయానికి కొంత డబ్బు సంపాదించుకుని వారి స్వగ్రామానికి వెళ్లాలనేది వారి ఆలోచన. కానీ దురదృష్టం వారిని వెన్నాడింది. పనిలో చేరిన మూడు రోజులకే జనతా కర్ఫ్యూ. ఆ తరువాత లాక్డౌన్. దాంతో పనులు ఆగిపోయాయి. కొన్నాళ్లు ఆ ప్రాజెక్టు కాంట్రాక్టర్ నిత్యావసరాల కోసం రోజుకు ఒక్కొక్కరికి రూ. 100 ఇచ్చేవాడు. కొన్ని రోజులు గడిచాక.. తన వల్ల కాదని చేతులెత్తేశాడు. ఏప్రిల్ 29న వీరుంటున్న తాత్కాలికంగా ఏర్పాటు చేసిన వసతి వద్దకు వచ్చి.. తన ఆదాయం కూడా పడిపోయిందని, తానేం చేయలేనని చేతులెత్తి దండం పెట్టి, వెళ్లిపోయాడు. ఆ కూలీల పరిస్థితి అగమ్యగోచరమైంది. స్థానిక ప్రభుత్వం ఇచ్చే రేషన్.. స్థానికేతరులు కావడంతో వీరికి అందలేదు. స్వచ్ఛంద సంస్థలు కూడా ఎలాంటి సాయం అందించలేదు. ఆ కాంట్రాక్టరే దయ దలిచి శివం, రామానంద్, మరో ఇద్దరికి కలిపి మూడు పాత సైకిళ్లను సమకూర్చాడు. వాటిపైననే వారు 600 కిమీల దూరంలోని తమ గ్రామానికి బయల్దేరారు. మే 2 నాటికి ఆగ్రా సమీపా నికి చేరుకున్నారు. అంత దూరం ఎండలో ఎలా సైకిల్‌పై వెళ్తున్నారన్న ప్రశ్నకు.. కొద్ది, కొద్ది దూరం తొక్కుతూ వెళ్తున్నామని చెప్పారు. మరి భోజనమెలా? అన్న ప్రశ్నకు.. అప్పట్నుంచి అన్నం తినలేదని, తాము దాటి వచ్చిన హరియాణా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌ల్లో హైవేపై పలు టోల్‌గేట్స్ ఉన్నా, ఎక్కడా, ఎలాంటి ఆహార సదుపాయాలు ఏర్పాటు చేయలేదని చెప్పారు. తామే కాకుండా, ఈ హైవేపై వందలాదిగా కూలీలు నడుస్తూ సొంతూళ్లకు వెళ్తున్నారని, వారు కూడా ఆకలితోటే ప్రయాణిస్తున్నారని చెప్పారు. ఒక టోల్ గేట్ వద్ద మాత్రం ఒక పోలీస్ 2 డజన్ల అరటి పండ్లు, నమ్కీన్ ప్యాకెట్లు, బిస్కట్ ప్యాకెట్లు ఇచ్చాడని, వాటితోనే కడుపు నింపుకుంటున్నామని చెప్పారు. ఇంటివద్ద తనకు అమ్మ, చెల్లి ఉన్నారన్న శివం రాథోడ్.. ‘వారు డబ్బులు పంపిస్తాం.. అక్కడే ఉండు’అని చెప్పారు కానీ డబ్బు పంపించలేకపోయారని చెబుతూ కన్నీటి పర్యంతమయ్యాడు. ప్రభుత్వం వలస కూలీలను స్వగ్రామాలకు పంపించేందుకు నిర్ణయించిన విషయం తమకు తెలియదని, అయినా ప్రభుత్వాన్ని నమ్మలేమని వ్యాఖ్యానించారు. -
అక్షర కేంద్రాల్లో ఆకలి కేకలు
జి.సిగడాం, న్యూస్‌లైన్:వయోజనుల్లో అక్షర దీపాలు వెలిగించి గ్రామీణ ప్రాంతాల్లో అక్షరాస్యత పెంచేందుకు పాటుపడుతున్న సాక్షర భారత్ కో ఆర్డినేటర్ల జీవితాల్లో చీకట్లు అలుముకుంటున్నాయి. గత ఏడాదిగా ప్రభుత్వం వేతనాలు చెల్లించకపోవడంతో వీరు ఆర్థికంగా చితికిపోతున్నారు. వీరిపైనే ఆధారపడిన కుటుంబాలు ఆకలి మంటల్లో చిక్కుకుంటున్నాయి. అక్షరాస్యత కార్యక్రమాల్లో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో వయోజనులను గుర్తించి, చదువు చెప్పేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాక్షర భారత్ కేంద్రాలను నిర్వహిస్తున్నాయి. ఒక్కో కేంద్రానికి ఇద్దరు కో ఆర్డినేటర్ల(ఒక పురుషుడు, ఒక మహిళ)ను నియమించారు. వీరు గుర్తించిన వయోజనులకు చదవడం, రాయడం నేర్పించి పరీక్షలు కూడా నిర్వహించాల్సి ఉంటుంది. ఈ పనులు నిర్వర్తించేందుకు కో ఆర్డినేటర్లకు గౌరవ భృతితోపాటు రవాణా ఖర్చులు, పేపరు బిల్లులు కూడా చెల్లించాల్సి ఉంది. ఆ మేరకు జిల్లాలోని 38 మండలాల పరిధిలో 65,945 మంది వయోజనులను సాక్షర భారత్ కేంద్రాల్లో నమోదు చేసి చదువు చెబుతున్నారు. ఈ కేంద్రాల నిర్వహణకు అవసరమైన వసతి సౌకర్యం కల్పించడంతోపాటు ఇతరత్రా అవసరమైన సామగ్రి అందిస్తున్న ప్రభుత్వం గౌరవ భృతి చెల్లించడంలో మాత్రం నిర్లక్ష్యం వహిస్తోంది. ఏడాదిగా అందని గౌరవభృతి, పేపర్ బిల్లులు ప్రతి పంచాయతీలో ఒక కేంద్రం చొప్పున జిల్లాలో సుమారు 1100 సాక్షర భారత్ కేంద్రాలు ఉండగా వాటిలో 2200 మంది కో ఆర్డినేటర్లు పని చేస్తున్నారు. వీరికి ఒక్కొక్కరికి నెలకు రూ.2వేలు గౌరవ భృతిగా నిర్ణయించారు. అయితే జనవరి నుంచి ఈ నెల వరకు అంటే సంవత్సర కాలంగా గౌరవ భృతి చెల్లించలేదు. దీంతోపాటు ప్రతి నెలా పేపర్లకు రూ.320, కరెంటు బిల్లు రూ.400, నిర్వహణ ఖర్చుల కింద రూ.300 మొత్తం రూ.1020 చెల్లించాలి. కానీ గౌరవ భృతితోపాటు పేపర్ బిల్లు కూడా ఏడాది నుంచి చెల్లించడం లేదని కో ఆర్డినేటర్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఎప్పటికప్పుడు సమావేశాలంటూ మండల కేంద్రాలకు పిలిపించడం, పలు రకాల బాధ్యతలు అప్పగించడమే తప్ప అధికారులు తమకు వేతనాలు చెల్లించే విషయం పట్టించుకోవడం లేదని ఆవేదన చెందుతున్నారు. దాంతో ఒకవైపు కుటుంబ పోషణ, మరోవైపు కేంద్రాల నిర్వహణ ఖర్చులకు ఎక్కడి నుంచి డబ్బులు తేవాలో అర్థం కాక ఇబ్బంది పడుతున్నారు. ప్రతి గురువారం నిర్వహించే గ్రామదర్ళిని కార్యక్రమానికి వచ్చిన అధికారులకు పలుమార్లు వినతులు ఇచ్చినా పట్టించుకునే నాథుడు కరువయ్యాడని వాపోతున్నారు. కేంద్రాలను సమర్థవంతంగా నిర్వహించాలని చెబుతున్న అధికారులు.. తాము అలా పనిచేయగలగాలంటూ ఆర్థిక ఇబ్బందులు లేకుండా చూడాలన్న విషయాన్ని విస్మరిస్తున్నారని అంటున్నారు. ఎప్పటికప్పుడు వేతనాలు, నిర్వహణ ఖర్చులు చెల్లిస్తే కేంద్రాలను ఇంకా బాగా నిర్వహించగలమంటున్నారు.