అక్షర కేంద్రాల్లో ఆకలి కేకలు | Akshara Centers in Hunger Shouting | Sakshi
Sakshi News home page

అక్షర కేంద్రాల్లో ఆకలి కేకలు

Published Mon, Jan 6 2014 1:35 AM | Last Updated on Sat, Sep 2 2017 2:19 AM

Akshara Centers in Hunger Shouting

 జి.సిగడాం, న్యూస్‌లైన్:వయోజనుల్లో అక్షర దీపాలు వెలిగించి గ్రామీణ ప్రాంతాల్లో అక్షరాస్యత పెంచేందుకు పాటుపడుతున్న సాక్షర భారత్ కో ఆర్డినేటర్ల జీవితాల్లో చీకట్లు అలుముకుంటున్నాయి. గత ఏడాదిగా ప్రభుత్వం వేతనాలు చెల్లించకపోవడంతో వీరు ఆర్థికంగా చితికిపోతున్నారు. వీరిపైనే ఆధారపడిన కుటుంబాలు ఆకలి మంటల్లో చిక్కుకుంటున్నాయి. అక్షరాస్యత కార్యక్రమాల్లో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో వయోజనులను గుర్తించి, చదువు చెప్పేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాక్షర భారత్ కేంద్రాలను నిర్వహిస్తున్నాయి. ఒక్కో కేంద్రానికి ఇద్దరు కో ఆర్డినేటర్ల(ఒక పురుషుడు, ఒక మహిళ)ను నియమించారు. వీరు గుర్తించిన వయోజనులకు చదవడం, రాయడం నేర్పించి పరీక్షలు కూడా నిర్వహించాల్సి ఉంటుంది. ఈ పనులు నిర్వర్తించేందుకు కో ఆర్డినేటర్లకు గౌరవ భృతితోపాటు రవాణా ఖర్చులు, పేపరు బిల్లులు కూడా చెల్లించాల్సి ఉంది. ఆ మేరకు జిల్లాలోని 38 మండలాల పరిధిలో 65,945 మంది వయోజనులను సాక్షర భారత్ కేంద్రాల్లో నమోదు చేసి చదువు చెబుతున్నారు. ఈ కేంద్రాల నిర్వహణకు అవసరమైన వసతి సౌకర్యం కల్పించడంతోపాటు ఇతరత్రా అవసరమైన సామగ్రి అందిస్తున్న ప్రభుత్వం గౌరవ భృతి చెల్లించడంలో మాత్రం నిర్లక్ష్యం వహిస్తోంది.
 
 ఏడాదిగా అందని గౌరవభృతి, పేపర్ బిల్లులు
 ప్రతి పంచాయతీలో ఒక కేంద్రం చొప్పున జిల్లాలో సుమారు 1100 సాక్షర భారత్ కేంద్రాలు ఉండగా వాటిలో 2200 మంది కో ఆర్డినేటర్లు పని చేస్తున్నారు. వీరికి ఒక్కొక్కరికి నెలకు రూ.2వేలు గౌరవ భృతిగా నిర్ణయించారు. అయితే జనవరి నుంచి ఈ నెల వరకు అంటే సంవత్సర కాలంగా గౌరవ భృతి చెల్లించలేదు. దీంతోపాటు ప్రతి నెలా పేపర్లకు రూ.320, కరెంటు బిల్లు రూ.400, నిర్వహణ ఖర్చుల కింద రూ.300 మొత్తం రూ.1020 చెల్లించాలి. కానీ గౌరవ భృతితోపాటు పేపర్ బిల్లు కూడా ఏడాది నుంచి చెల్లించడం లేదని కో ఆర్డినేటర్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఎప్పటికప్పుడు సమావేశాలంటూ మండల కేంద్రాలకు పిలిపించడం, పలు రకాల బాధ్యతలు అప్పగించడమే తప్ప అధికారులు తమకు వేతనాలు చెల్లించే విషయం పట్టించుకోవడం లేదని ఆవేదన చెందుతున్నారు.
 
 దాంతో ఒకవైపు కుటుంబ పోషణ, మరోవైపు కేంద్రాల నిర్వహణ ఖర్చులకు ఎక్కడి నుంచి డబ్బులు తేవాలో అర్థం కాక ఇబ్బంది పడుతున్నారు. ప్రతి గురువారం నిర్వహించే గ్రామదర్ళిని కార్యక్రమానికి వచ్చిన అధికారులకు పలుమార్లు వినతులు ఇచ్చినా పట్టించుకునే నాథుడు కరువయ్యాడని వాపోతున్నారు. కేంద్రాలను సమర్థవంతంగా నిర్వహించాలని చెబుతున్న అధికారులు.. తాము అలా పనిచేయగలగాలంటూ ఆర్థిక ఇబ్బందులు లేకుండా చూడాలన్న విషయాన్ని విస్మరిస్తున్నారని అంటున్నారు. ఎప్పటికప్పుడు వేతనాలు, నిర్వహణ ఖర్చులు చెల్లిస్తే కేంద్రాలను ఇంకా బాగా నిర్వహించగలమంటున్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement