Transportation costs
-
ఇంటింటికీ రక్ష.. జగనన్న ఆరోగ్య సురక్ష
సాక్షి, అమరావతి: పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్య సురక్ష కార్యక్రమం కింద ప్రతి ఇంటిని జల్లెడ పట్టి ప్రజల ఆరోగ్య సమస్యల్ని ప్రభుత్వం గుర్తించింది. వివిధ రుగ్మతలతో బాధపడుతున్న వారందరికీ ఉచితంగా చికిత్సలు చేయించి సాంత్వన చేకూరుస్తోంది. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారిని సురక్ష క్యాంపుల్లో గుర్తించి వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచిత చికిత్సలు చేయించడంతోపాటు బాధితులపై రవాణా ఖర్చుల భారం కూడా పడకుండా సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం భరోసా ఇస్తోంది. చికిత్సల అనంతరం కూడా బాధితులకు బాసటగా నిలుస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే బాధితులను చేయిపట్టి సీఎం జగన్ ముందుకు నడిపిస్తూ సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మారుస్తున్నారు. విజయవంతంగా 2.O ఆరోగ్య సురక్ష రెండో దశ కార్యక్రమం ఈ ఏడాది జనవరి నెలలో ప్రారంభించగా విజయవంతంగా కొనసాగుతోంది. ఇప్పటివరకూ రాష్ట్రవ్యాప్తంగా వైద్య శాఖ 6,710 శిబిరాలు నిర్వహించగా.. ఒక్కోచోట సగటున 359 చొప్పున 24,11,785 మంది వైద్య సేవలు పొందారు. హైపర్‌టెన్షన్, డయాబెటీస్, హెచ్‌బీ, యూరిన్, మలేరియా, డెంగీ సహా ఇతర 32.64 లక్షల స్పాట్ టెస్ట్‌లను శిబిరాల వద్ద నిర్వహించారు. రెండో దశలో భాగంగా శిబిరాల వద్దకు వచ్చిన ప్రజల్లో 8,179 మందికి తదుపరి వైద్య సేవలు అవసరం ఉన్నట్టుగా వైద్యులు నిర్ధారించి ఆస్పత్రులకు రిఫర్ చేశారు. వీరిలో ఇప్పటికే 2,030 మంది ఆస్పత్రుల్లో చికిత్సలు అందుకున్నారు. ఇక 2.13 లక్షల మందికి కంటి స్క్రీనింగ్ చేపట్టగా.. 60 వేల మందికి మందులతో నయమయ్యే సమస్యలను గుర్తించి అక్కడికక్కడే మందులు అందించారు. మరో 1.50 లక్షల మందికి అద్దాలను, 2,090 మందికి కేటరాక్ట్ సర్జరీలను సూచించారు. 98 శాతం మందికి చికిత్సలు పూర్తి గత ఏడాది ఆరోగ్య సురక్ష తొలి దశ కార్యక్రమంలో ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 12 వేలకు పైగా శిబిరాలు నిర్వహించింది. వీటిలో 60.27 లక్షల మంది అవుట్ పేషెంట్ సేవలు పొందారు. వీరిలో తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న 86,713 మందిని వైద్యులు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు రిఫర్ చేశారు. వారందరికీ చికిత్సలు చేయించేలా వైద్య శాఖ పర్యవేక్షించింది. వీరిలో ఇప్పటివరకూ 98 శాతం అంటే.. 84,982 మందికి ప్రభుత్వమే చికిత్సలు చేయించింది. చిన్న పిల్లలకు కాక్లియర్ ఇంప్లాంటేషన్, పుట్టుకతో గుండెలో రంధ్రాలు, ఇతర సమస్యలతోపాటు, పెద్దల్లో న్యూరో, కార్డియాలజీ, నెఫ్రాలజీ, యూరాలజీ, వంటి ఇతర సమస్యలకు ఉచిత చికిత్సలు అందించారు. చిత్తూరు, ఏలూరు, కాకినాడ, కృష్ణా, ఎన్టీఆర్, శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నం, పశి్చమ గోదావరి జిల్లాల్లో వంద శాతం మందికి చికిత్సలు చేయించారు. మొత్తం రోగుల్లో 1,731 మందికి చికిత్సలు అందించేలా వైద్య శాఖ పర్యవేక్షిస్తోంది. కాగా.. తొలి దశలో కంటి సమస్యలతో బాధపడుతున్న 80,155 మందికి కేటరాక్ట్ సర్జరీలు అవసరమని వైద్యులు సూచించగా.. 41633 మందికి ఇప్పటికే సర్జరీలు పూర్తి అయ్యాయి. 5.73 లక్షల మందికి కళ్లద్దాలు అవసరమని గుర్తించగా.. 5.63 లక్షల మందికి పంపిణీ పూర్తయింది. నెల్లూరు జిల్లా విడవలూరు మండలం దండిగుంట గ్రామానికి చెందిన రైతు అనిల్ దంపతులకు ముగ్గురు సంతానం. రెండో కుమార్తె మధుప్రియ గ్రహణం మొర్రితో పుట్టడంతో వెంటనే తిరుపతిలోని బర్డ్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ నిర్వహించిన వైద్య పరీక్షల్లో మధుప్రియ గుండెకు రంధ్రం కూడా ఉన్నట్టు నిర్ధారణ అయింది. పాప పెద్దయ్యాక గానీ ఆపరేషన్ చేయడానికి వీలుండదని అప్పట్లో చెప్పారు. ప్రస్తుతం మధుప్రియకు మూడేళ్లు నిండాయి. పాప గుండెకు ఆపరేషన్ చేయించాలనుకుంటున్న తరుణంలో ప్రభుత్వం ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ కార్యక్రమం మొదలు పెట్టింది. ఇందులో భాగంగా వైద్య సిబ్బంది నిర్వహించిన ఇంటింటి సర్వేలో మధుప్రియ సమస్యను తల్లిదండ్రులు తెలియజేశారు. దీంతో వైద్య శిబిరానికి హాజరవ్వమని చెప్పారు. గ్రామంలో శిబిరం నిర్వహించిన రోజు పాపను తీసుకు వెళ్లగా వైద్యులు తొలుత నెల్లూరు ఆస్పత్రికి రిఫర్ చేశారు. అక్కడి నుంచి మధుప్రియను తిరుపతిలోని చిన్న పిల్లల హృదయాలయానికి తరలించారు. ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా ఆపరేషన్ పూర్తయింది. బాలిక పూర్తిగా కోలుకుంది. మధుప్రియ తరహాలోనే వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వేలాది మందికి ఆరోగ్య సురక్ష వరంగా మారింది. -
కూల్ కావాలంటే పర్స్ ఖాళీనే
న్యూఢిల్లీ: నూతన సంవత్సరం తొలి రోజుల్లోనే ఎయిర్ కండీషనర్లు, రిఫ్రిజిరేటర్లు మొదలైన వినియోగ ఉత్పత్తుల రేట్లు.. కొనుగోలుదారులకు షాక్ ఇస్తున్నాయి. ముడి వస్తువుల వ్యయాలు, రవాణా చార్జీలు పెరిగిపోవడంతో కంపెనీలు ఆ భారాన్ని కొనుగోలుదారులకు బదలాయిస్తున్నాయి. ఈ నెలాఖరులో లేదా మార్చి ఆఖరు నాటికి ఫ్రిజ్‌లు, ఏసీలు, వాషింగ్ మెషీన్లు వంటి ఉత్పత్తుల రేట్లు 5–10 శాతం మేర పెంచబోతున్నాయి. పానసోనిక్, ఎల్జీ, హయర్ వంటి సంస్థలు ఇప్పటికే పెంచగా.. సోనీ, హిటాచీ, గోద్రెజ్ అప్లయెన్సెస్ మొదలైనవి ఈ త్రైమాసికం ఆఖరు నాటికి నిర్ణయం తీసుకోనున్నాయి. కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ అండ్ అప్లయెన్సెస్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ (సీఈఏఎంఏ) నివేదిక ప్రకారం జనవరి–మార్చి వ్యవధిలో ధరలు 5–7 శాతం మేర పెరగనున్నాయి. ‘కమోడిటీల ధరలు, అంతర్జాతీయంగా రవాణా, ముడి వస్తువుల రేట్లు అసాధారణంగా పెరిగిపోవడంతో ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషీన్లు, ఏసీలు వంటి ఉత్పత్తుల రేట్లను 3–5 శాతం పెంచేందుకు మేము చర్యలు తీసుకున్నాం‘ అని హయర్ అప్లయెన్సెస్ ఇండియా ప్రెసిడెంట్ సతీష్ ఎన్ఎస్ తెలిపారు. ఏసీల రేట్లు ఇప్పటికే 8 శాతం వరకూ పెంచిన పానసోనిక్ .. ధరలను మరింత పెంచే యోచనలో ఉంది. ఇతర గృహోపకరణాల రేట్లను పెంచే అంశం పరిశీలిస్తోంది. ‘ఏసీల రేట్లు 8 శాతం వరకూ పెరిగాయి. కమోడిటీల వ్యయాలు, సరఫరా వ్యవస్థ పరిస్థితులు బట్టి ఇవి మరింత పెరగవచ్చు. సమీప భవిష్యత్తులో గృహోపకరణాల రేట్ల పైనా ప్రభావం పడే అవకాశం ఉంది‘ అని పానసోనిక్ ఇండియా డివిజనల్ డైరెక్టర్ ఫుమియాసు ఫ్యుజిమోరి తెలిపారు. దేశీ గృహోపకరణాలు, కన్జూమర్ డ్యూరబుల్ పరిశ్రమ పరిమాణం రూ. 75,000 కోట్ల స్థాయిలో ఉంటుందని అంచనా. పండుగ సీజన్లో వాయిదా.. పండుగల సీజన్ కావడంతో రేట్ల పెంపును కంపెనీలు వాయిదా వేస్తూ వచ్చాయని సీఈఏఎంఏ ప్రెసిడెంట్ ఎరిక్ బ్రగాంజా తెలిపారు. ‘అయితే, ప్రస్తుతం భారాన్ని కస్టమర్లకు బదలాయించడం తప్ప తయారీ సంస్థలకు వేరే మార్గం లేకుండా పోయింది. జనవరి నుంచి మార్చి మధ్యకాలంలో ధరల పెంపు 5–7 శాతం మేర ఉండొచ్చని అంచనా వేస్తున్నాం‘ అని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే కొన్ని సంస్థలు రేట్లు పెంచేయగా మరికొన్ని దానికి సంబంధించిన ప్రక్రియలో ఉన్నందున పెంపు పరిమాణం వివిధ రకాలుగా ఉండొచ్చని బ్రగాంజా చెప్పారు. అయితే, డిమాండ్ మందగించినా, ముడి వస్తువుల ధరలు తగ్గినా .. ఏప్రిల్ లేదా మే లో రేట్లు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందన్నారు. సోనీ ఇండియా, గోద్రెజ్ అప్లయెన్సెస్ వంటి సంస్థలు రేట్ల పెంపుపై తాము ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉందని పేర్కొన్నాయి. వివిధ రకాల ఉత్పత్తుల ధరలు ఈ ఆర్థిక సంవత్సరం ఆఖరు త్రైమాసికంలో పెరిగే అవకాశాలు ఉన్నాయని థామ్సన్, కోడక్ వంటి బ్రాండ్ల తయారీ సంస్థ సూపర్ ప్లాస్ట్రోనిక్స్ (ఎస్పీపీఎల్) సీఈవో అవ్నీత్ సింగ్ మార్వా తెలిపారు. మార్కెట్ పరిస్థితులను పరిశీలిస్తున్నామని, తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై వచ్చే నెలలో నిర్ణయం తీసుకుంటామని వీడియోటెక్స్ ఇంటర్నేషనల్ (దైవా, షింకో తదితర బ్రాండ్స్ తయారీ సంస్థ) తెలిపింది. తప్పని పరిస్థితి.. ధరల భారాన్ని వీలైనంత వరకూ తామే భరించేందుకు అన్ని ప్రయత్నాలూ చేశామని, కానీ వ్యాపారం నిలదొక్కుకునేందుకు పెంపు తప్పటం లేదని ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ దీపక్ పన్నసల్ తెలిపారు. రేట్ల పెంపు తప్పదని జాన్సన్ కంట్రోల్స్–హిటాచీ ఎయిర్ కండీషనింగ్ ఇండియా సీఎండీ గుర్మీత్ సింగ్ తెలిపారు. ముడివస్తువులు, పన్నులు, రవాణా వ్యయాలు మొదలైనవి పెరిగిపోవడం వల్ల ఏప్రిల్ నాటికి బ్రాండ్లు దాదాపు 10% వరకూ ధరలు పెంచవచ్చని ఆయన పేర్కొన్నారు. ‘ఏప్రిల్ వరకూ దశలవారీగా ధరల పెంపు కనీసం 8–10% మేర ఉండవచ్చు. గతేడాది కూడా ఇదే విధంగా 6–7% వరకూ పెరిగాయి. ముడి వస్తువుల ధరలు పెరిగిపోవడం, అల్యూమినియం .. రిఫ్రిజిరెంట్స్ వంటివాటిపై యాంటీ డంపింగ్ సుంకాల విధింపుతో రేట్లు మరో 2–3 శాతం పెరగవచ్చు‘ అని సింగ్ వివరించారు. -
ట్రాఫిక్ చిక్కులు.. తీర్చే దిక్కులు!
సాక్షి, హైదరాబాద్: కోటి జనాభా దాటిన మహా నగరంలో ‘ట్రాఫిక్’తీర్చలేని ప్రధాన సమస్య. 10 కిలోమీటర్ల ప్రయాణానికి 30 నుంచి 45 నిమిషాలు సమయం వెచ్చించాల్సిందే. రద్దీ సమయాల్లో గంట కంటే ఎక్కువే పడుతుంది. దీన్ని తగ్గించడం కోసం హైదరాబాద్ మహానగరాభి వృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) పలు కార్యక్రమాలు చేపడు తూనే ఉంది. ఇందులో భాగంగా వచ్చిన ఆలో చనే.. వస్తు నిల్వ కేంద్రాలు (లాజిస్టిక్ హబ్స్). నగరంలోకి భారీ వాహనాలు రాకుండా శివారు ప్రాంతాల్లోని హబ్స్‌లోనే ఆపేసి, వస్తువులను అక్కడే నిల్వ చేస్తారు. చిన్న వాహనాల్లో నగరంలోకి తీసుకొస్తారు. ఇలా మహా నగరం నలువైపులా నయా హబ్స్ రానున్నాయి. మంగల్‌పల్లి, బాటసిం గారం ప్రాంతాల్లో లాజిస్టిక్ హబ్స్ పనుల్లో వేగిరం పెరగగా... పటాన్చెరులో భూమిని చదును చేసి పనులు చేస్తున్నారు. అలాగే మహాత్మాగాంధీ బస్ స్టేషన్‌పై పడుతున్న ఒత్తిడిని తగ్గించేందుకు మియాపూర్‌లో ఇంటర్సిటీ బస్‌టెర్మినల్ (ఐసీబీటీ) పనులపై కూడా హెచ్ఎండీఏ దృష్టి సారించింది. ఈ నాలుగు అందుబాటులోకొస్తే నగ రంపై పడే సగం ట్రాఫిక్ తగ్గడంతో పాటు రోడ్డు ప్రమాదాలు తగ్గే అవకాశముందని హెచ్ఎండీఏ అధికారులు చెబుతున్నారు. ఇవేకాక పెద్దఅం బర్‌పేటలో ఐసీబీటీ, శంషాబాద్‌లో మల్టీ మోడల్ ట్రాన్స్‌పోర్టు సాధ్యాసాధ్యాలపైనా దృష్టిసారిం చారు. శంషాబాద్, మనోహరాబాద్, పటాన్చెరు, శామీర్‌పేటలోనూ లాజిస్టిక్ హబ్‌లపై అధ్యయనం చేసి అందుకయ్యే వ్యయాన్ని అంచనా వేసే పనిలో హెచ్ఎండీఏ అధికారులు నిమగ్నమయ్యారు. ప్రభుత్వ ప్రైవేట్భాగస్వామ్యంతో చేపడితే 200 కోట్ల వరకు వ్యయమవుతుందని అంచనా. ప్రయోజనాలు ఇవి.... బాటసింగారం, మంగల్పల్లిల్లోని లాజిస్టిక్ హబ్‌ల్లో అన్ని రకాల వస్తువులను నిల్వ చేయొచ్చు. పెద్దెత్తున సరుకులు తీసుకొచ్చిన భారీ వాహనాలు ఇక్కడే ఆగిపోతాయి. అక్కడి నుంచి నగర వ్యాపారులకు కావల్సినప్పుడు చిన్న వాహనాల్లో తీసుకెళ్లవచ్చు. తద్వారా కొంత వరకు రవాణా చార్జీలు తగ్గి సరుకుల ధరలూ తగ్గుతాయి. మినీ ట్రక్కులు, ఆటోలు, చిన్న వాహనాలకు గిరాకీ పెరుగుతుంది. భారీ వాహనాలు రాక ఆగడంతో ట్రాఫిక్ ఇబ్బందులు, ప్రమాదాలు తప్పుతాయి. ఐసీబీటీ ప్రత్యేకతలు ఇవి... - మంగల్‌పల్లి, బాటసింగారంలో ఒకేసారి 500 ట్రక్కులు పార్క్ చేయవచ్చు. - 2 లక్షల చ.అ. గోదాములు, 10 వేల టన్నుల సామర్థ్యంతో కోల్డ్ స్టోరేజ్. - ఆటోమొబైల్ సర్వీస్కేంద్రం, పరికరాల నిల్వకు 10 వేల టన్నుల సామర్థ్యంతో గోదాములు. - 100 మంది ఉండటానికి వీలుగా డార్మిటరీ, 5 వేల చ.అ. విస్తీర్ణంలో రెస్టారెంట్, 2,500 చ.అ.ల్లో పరిపాలన కార్యాలయం. 2011లోనే ఆలోచన... ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి నగరానికి వస్తున్న వందలాది ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులతో ఎంజీ బీ ఎస్పై రద్దీ పెరిగింది. దీన్ని నియంత్రిం చేందుకు మియాపూర్‌లో భారీ బస్టాండ్‌ను నిర్మిం చాలని 2011లో అప్పటి ప్రభుత్వం ఆలోచించిం ది. రాష్ట్రాలు, జిల్లాల నుంచి ఐసీబీటీకి వచ్చివెళ్లే ప్రజలు నగరంలోకి వెళ్లేందుకు, తిరిగి వచ్చేందుకు మెట్రో సర్వీసులు కూడా ఉండేలా చూసుకున్నారు. మంగల్‌పల్లి(లాజిస్టిక్ హబ్) ప్రాంతం: నాగార్జునసాగర్ హైవేపై ఓఆర్ఆర్ బొంగళూరు జంక్షన్ నుంచి 500 మీటర్ల దూరంలోని రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని మంగల్‌పల్లి. విధానం: పబ్లిక్ ప్రేవేట్ భాగస్వామ్యం, విస్తీర్ణం: 22 ఎకరాలు, వ్యయం: రూ.20 కోట్లు, ప్రారంభం: 2017, ప్రస్తుత స్థితి: 40 శాతం పూర్తి మరో మూడు నెలలు పట్టే అవకాశం బాటసింగారం(లాజిస్టిక్ హబ్) ప్రాంతం: విజయవాడ హైవేపై ఓఆర్ఆర్కి 7కి.మీ. దూరంలోని హయత్‌నగర్ మండలం బాటసింగారం. విధానం: పబ్లిక్ ప్రేవేట్ భాగస్వామ్యం విస్తీర్ణం:40 ఎకరాలు వ్యయం:రూ.35 కోట్లు ప్రారంభం:2017 ప్రస్తుత స్థితి:70 శాతం పూర్తి కమర్షియల్ ఆపరేషన్‌కు గ్రీన్‌సిగ్నల్ పటాన్చెరు(లాజిస్టిక్ హబ్) విధానం: పబ్లిక్ ప్రేవేట్ భాగస్వామ్యం, విస్తీర్ణం: 17 ఎకరాలు ప్రస్తుత స్థితి: 5 ఎకరాల్లో పార్కింగ్ పనులు పూర్తి, చేసిన ఖర్చు: రూ.5 కోట్లు -
ఆంధ్రప్రదేశ్‌లో రూ.150 కోట్లతో బ్లూ స్టార్ ప్లాంటు..
♦ నౌకాశ్రయానికి సమీపంలో ఏర్పాటు ♦ 5 లక్షల యూనిట్ల తయారీ సామర్థ్యం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ఎయిర్ కండిషనర్ల (ఏసీ) తయారీ సంస్థ బ్లూ స్టార్ దక్షిణాదిన ప్లాంటును ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. 5 లక్షల యూనిట్ల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో రానున్న ఈ ప్లాంటుకు సంస్థ రూ.150 కోట్లు ఖర్చు చేయనుంది. అన్నీ అనుకూలిస్తే 2016లో ఉత్పత్తి ప్రారంభం అవుతుంది. రూమ్ ఏసీ, డీప్ ఫ్రీజర్లను ప్లాంటులో తయారు చేస్తారు. నెల్లూరు జిల్లా తడ లేదా తెలంగాణలోని హైదరాబాద్‌లో ప్లాంటు స్థాపించాలని కొన్నేళ్ల నుంచి కంపెనీ ప్రయత్నిస్తోంది. పన్ను ప్రోత్సాహకాలు అధికంగా ఇచ్చే రాష్ట్రంలో ప్లాంటు పెట్టాలని భావించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలతో కంపెనీ ఉన్నతాధికారులు చర్చలు జరిపారు కూడా. అయితే పన్ను ప్రయోజనాలు ఉన్నా లేకపోయినా రవాణా వ్యయాలను తగ్గించుకోవాలంటే దక్షిణాదిన ప్లాంటు ఏర్పాటు చేయడం మినహా కంపెనీకి మరో మార్గం లేదు. మరోవైపు ఎగుమతులను 2017-18 నాటికి మూడింతలు చేయాలని బ్లూ స్టార్ లక్ష్యంగా చేసుకుంది. ప్లాంటుకు నౌకాశ్రయం సమీపంలో ఉన్న ప్రాంతం అనువైందని సంస్థ భావిస్తోంది. దక్షిణ ఆంధ్రప్రదేశ్‌లో ప్లాంటు వచ్చే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని కంపెనీ ఉన్నతాధికారి సాక్షి బిజినెస్ బ్యూరోకు ముంబై నుంచి ఫోన్లో తెలిపారు. దక్షిణాదిన ఎందుకంటే.. ప్రస్తుతమున్న 7 ప్లాంట్లలో రెండింటిని కంపెనీ మూసివేసింది. అన్ని ప్లాంట్లు పశ్చిమ, ఉత్తర భారత్‌కే పరిమితమయ్యాయి. ఎక్సైజ్, సెన్‌వ్యాట్ ప్రయోజనాల కోసం కొన్నింటిని గతంలో ఏర్పాటు చేసింది. అయితే జీఎస్టీ అమలైతే ఈ ప్రయోజనాలు ఏవీ ఉండవు. పెపైచ్చు రవాణాకు ఏటా రూ.150 కోట్లు ఖర్చు అవుతోంది. ఉద్యోగుల వేతనాల తర్వాత రవాణా వ్యయాలు రెండో స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. దక్షిణాదిన ప్లాంటు ఉంటే మూడింట రెండొంతుల వ్యయాలు ఆదా అవుతాయని సంస్థ భావిస్తోంది. దీర్ఘకాలిక వ్యూహంలో భాగంగా ఎగుమతులను దృష్టిలో పెట్టుకుని నౌకాశ్రయానికి దగ్గరగా ప్లాంటు ఉండేలా కంపెనీ అడుగులేస్తోంది. స్థల ఎంపిక కోసం కేపీఎంజీని నియమించింది. కేపీఎంజీ నివేదిక సెప్టెంబరులో రానుంది. అమ్మకాల్లో 55 శాతం వాటా దక్షిణాది రాష్ట్రాలదేనని బ్లూ స్టార్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ బి.త్యాగరాజన్ తెలిపారు. ఇన్వర్టర్ వీఆర్ఎఫ్ ఏసీ సిస్టమ్స్‌ను ఆవిష్కరించిన సందర్భంగా శుక్రవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. దక్షిణాది ప్లాంటు వచ్చేలోపు ఉత్తరాదిన మరో ప్లాంటు పెట్టే అవకాశాలూ లేకపోలేదని ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ముకుందన్ మీనన్ పేర్కొన్నారు. ఈ-కామర్స్ బుడగ పేలిపోతుంది.. భారత్‌లో ఏసీల అమ్మకాల్లో ఆన్లైన్ వాటా కేవలం 1 శాతం మాత్రమే. వాస్తవ ధర కంటే తక్కువ ధరలో ఇ-కామర్స్ కంపెనీలు ఏసీలను విక్రయిస్తుండడం ఆశ్చర్యంగా ఉందని త్యాగరాజన్ అన్నారు. ‘నష్టాలొచ్చినా ఎలా విక్రయిస్తారు. ధరను తక్కువ చేసి విక్రయించడం వల్ల బ్రాండ్ విలువ తగ్గించినట్టే. మా దగ్గర శక్తి లేక మిన్నకుండిపోతున్నాం. ఇ-కామర్స్ కంపెనీలు వాటి విలువ పెంచుకోవడానికే డిస్కౌంట్లను ఇస్తున్నాయి. ఏదో ఒక రోజు ఇ-కామర్స్ రంగం బుడగ పేలిపోవడం ఖాయం’ అని అన్నారు. ఏసీల బీఈఈ స్టార్ రేటింగ్ ప్రమాణాలు 2016 జనవరి నుంచి మరింత కఠినం కానున్నాయని చెప్పారు. 2018 జనవరికి 5 స్టార్ కాస్తా 3 స్టార్ అవుతుందని వివరించారు. గతేడాది మాదిరిగా 2015-16లో 37 లక్షల యూనిట్ల ఏసీలు అమ్ముడవుతాయని పరిశ్రమ అంచనా వేస్తోంది. -
భవిష్యత్ బంగారమే
గజ్వేల్: ఆరుగాలం కష్టపడే కూరగాయల రైతులకు ఇక మంచిరోజులు రాబోతున్నాయి. జిల్లాను ‘వెజిటబుల్ జోన్’గా మార్చాలని ప్రభుత్వం మూడేళ్ల కిందట నిర్ణయించినా, అమలులో నిర్లక్ష్యం అలుముకుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ప్రభుత్వం కూరగాయల సాగును ప్రోత్సహించేందుకు సరికొత్త పథకానికి రూపకల్పన చేసింది. నాబార్డ్ అధ్వర్యంలో చేపట్టనున్న ఈ పథకానికి ఈనెల 11న జరిగిన జిల్లా కన్సల్టెంట్ కమిటీ (డీసీసీ) సమావేశంలో కలెక్టర్ ఆమోదముద్ర వేశారు. తెలంగాణలోనే పెలైట్ ప్రాజెక్ట్‌గా సీఎం ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గాన్ని ఎంపిక చేశారు. ఈ పథకం ద్వారా రైతులకు ‘పందిరి’ విధానంలో కూరగాయల సాగుకు సుమారు 50 శాతం సబ్సిడీపై రుణాలను అందించడమే కాకుండా మార్కెటింగ్ అవకాశాలు కల్పించనున్నారు. కార్పొరేట్ కంపెనీల రాకతో పెరిగిన సాగు ఒకప్పుడు కూరగాయలు పండించాలంటే రైతులు జంకే పరిస్థితి. ఆరుగాలం శ్రమించి పండించిన ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకెళ్తే కనీసం రవాణా చార్జీలు సైతం గిట్టుబాటుకాని దుస్థితి. దీంతో కూరగాయల సాగు తగ్గింది. అయితేఆరేళ్లలో పరిస్థితులు కాస్త మారాయి. రోజురోజుకూ పెరుగుతున్న జనాభా అవసరాలకు కూరగాయలను అందించేందుకు పెద్ద పెద్ద కంపెనీలు సైతం ఈ వ్యాపారంలోకి అడుగు పెట్టాయి. ఈ క్రమంలో కూరగాయలను సాగుచేస్తున్న ప్రాంతాలపై దృష్టిసారించి ఇక్కడ రైతుల ఉత్పత్తులను కొనుగోలు చేయడం ప్రారంభించాయి. ఇందులో భాగంగానే గజ్వేల్ నియోజకవర్గంలో వంటిమామిడి గ్రామాన్ని కేంద్రంగా ఎంచుకుని ఇక్కడ రిలయన్స్ఫ్రెష్, హెరిటేజ్, స్పెన్సర్, ఐటీసీ లాంటి సంస్థలు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడంతో కూరగాయల సాగు ప్రాధాన్యత ఏర్పడింది. జిల్లాలో ప్రస్తుతం 35 వేల ఎకరాల్లో కూరగాయలు, మరో 15ఎకరాల్లో పండ్ల తోటలు సాగవుతున్నాయి. పందిరి విధానంలో బీర, కాకర, పొట్లకాయ, సొరకాయ, దొండతోపాటు సాధారణ విధానాల్లో టమాటా, ఆలుగడ్డ, బీర్నీస్, మిర్చి, బెండ తదితర రకాలతోపాటు ఆకుకూరలను జిల్లా రైతులు సాగు చేస్తున్నారు. విన్నవించినా.. పట్టించుకోలేదు గజ్వేల్ నుంచి హైదరాబాద్‌కే కాకుండా రాష్ట్రీయ మార్కెట్లకు కూడా కూరగాయలు ఎగుమతవుతుండటం ఈ ప్రాంతం ‘వెజిటబుల్ హబ్’గా ఆవిర్భవించింది. అందువల్లే మూడేళ్ల కిందట అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి జిల్లాలో పర్యటించిన సందర్భంలోనూ వెజిటబుల్ జోన్‌గా మార్చి మరింత చేయూతనివ్వాలని, దీని ద్వారా కూరగాయల సాగు అభివృద్ధి చెందుతుందని రైతుల నుంచి వినతులు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే జిల్లాలోని గజ్వేల్, ములుగు, వర్గల్, జగదేవ్‌పూర్, కొండపాక, తొగుట, నంగునూరు, సిద్దిపేట, దుబ్బాక, చిన్నకోడూరు, చేగుంట, దౌల్తాబాద్, శివ్వంపేట, నర్సాపూర్, జిన్నారం, సంగారెడ్డితో పాటు మరో నాలుగు మండలాలను వెజిటబుల్ జోన్లుగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ ఈ నిర్ణయం పూర్తిస్థాయిలో కార్యరూపం దాల్చలేదు. కొత్తసర్కార్..సరికొత్త పథకం కూరగాయల రైతుల ఇబ్బందులపై దృష్టిసారించిన టీఆర్ఎస్ ప్రభుత్వం సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. ‘నాబార్డ్’ అధ్వర్యంలో ఈ పథకానికి రూప కల్పన చేస్తోంది. ఈ నెల 11న జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జా అధ్యక్షతన జరిగిన డిస్ట్రిక్ట్ కన్సల్టెంట్ కమిటీ(డీసీసీ) సమావేశంలో ఈ పథకానికి ఆమోదముద్ర వేశారు. తొలిదశలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గానికి పెలైట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేశారు. నియోజకవర్గంలోని సుమారు నాలుగు గ్రామాల్లో ప్రప్రథమంగా 200 మంది వరకు కూరగాయల రైతులను ఎంపిక చేసి వారికి ‘పందిరి’ విధానంలో కూరగాయల సాగుకు ఒక్కో యూనిట్‌కు రూ.2 లక్షల బ్యాంకు రుణం అందిస్తారు. సుమారు 50 శాతం వరకు సబ్సీడీ రైతుకు వర్తించేలా చేస్తున్నారు. అంతటితో సరిపెట్టకుండా రైతుకు మార్కెటింగ్ సౌకర్యాలను సైతం కల్పించనున్నారు. గజ్వేల్‌లో పథకాన్ని విజయవంతంగా అమలుచేసిన తర్వాత జిల్లాలోని ఇతర నియోజకవర్గాలకు వర్తింపజేయనున్నారు. -
జీతం తక్కువైనా ఇతర ప్రయోజనాలు ఉంటే!
జాబ్ స్కిల్స్ ఇష్టమైన కంపెనీలో కోరుకున్న ఉద్యోగం సాధించాలంటే మొదట రాత పరీక్ష, ఇంటర్వ్యూలో నెగ్గాలి. తర్వాత జీతభత్యాలు, ఇతర ప్రయోజనాలపై బేరసారాలు సాగించాలి. ఇవి సంతృప్తికరంగా ఉంటే కొలువులో చేరిపోవచ్చు. సాధారణంగా సంస్థలు తమ విధానంలో భాగంగా ఉద్యోగులతో వేతనాలపై సంప్రదింపులను అంగీకరించవు. జీతభత్యాలపై బేరసారాలకు అవకాశం లేకపోయినా ఇతర ప్రయోజనాలు ఇచ్చేందుకు కంపెనీ ముందుకొస్తుంది. వీటివల్ల సంస్థకు పెద్దగా నష్టం ఉండదు. కాబట్టి ప్రయోజనాలపై కంపెనీతో స్పష్టంగా మాట్లాడుకోవాలి. జీతం తక్కువైనా ఇవి నచ్చితే ఉద్యోగంలో చేరొచ్చు. రవాణా ఖర్చులు: ఆఫీస్‌కు ఎలా వెళ్తారు? సొంత వాహనమా? లేక ప్రజా రవాణా వ్యవస్థను ఉపయోగించుకుంటారా? ఎలా వెళ్లినా చేతిలోంచి డబ్బు ఖర్చు చేయక తప్పదు. కొన్ని సంస్థలు ఉద్యోగులకు రవాణా వసతి కల్పిస్తుంటాయి. అలాగే ప్రతినెలా రవాణా ఖర్చులను చెల్లిస్తుంటాయి. ఇలాంటి ప్రయోజనం ఏదైనా కల్పించాలని కోరండి. దీనివల్ల ఆర్థికంగా మీకు ఎంతో వెసులుబాటు దక్కుతుంది. డేకేర్ వసతి: మీరు స్వయంగా చూసుకోవాల్సిన చిన్న పిల్లలుంటే.. ఆఫీస్‌లో డే కేర్ వసతి కల్పించాలని విన్నవించండి. కార్పొరేట్ కార్యాలయాల్లో చైల్డ్ కేర్ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. బయట బేబీ సిట్టింగ్‌కు రూ.వేలల్లోనే ఖర్చవుతోంది. చైల్డ్ కేర్ వసతి లేకపోతే.. అందుకు కొంత మొత్తం అదనంగా చెల్లించాలని కోరండి. దీన్ని కంపెనీలు ఆమోదిస్తుంటాయి. ఎడ్యుకేషన్ ఫీజు రియంబర్స్మెంట్ : కెరీర్లో రాణించాలంటే స్కిల్స్, అనుభవం పెంచుకోవాలి. కొత్తకొత్త డిగ్రీలను సొంతం చేసుకోవాలి. ఇందుకోసం వీలును బట్టి దూర విద్య కోర్సుల్లో చేరాలి. సదస్సులు, సమావేశాలు, శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొనాలి. మీ నైపుణ్యాలు పెరిగితే కంపెనీకే లాభం. మీ చదువుకయ్యే ఖర్చులను సంస్థ భరించేలా మాట్లాడుకోండి. తమ ఉద్యోగుల ఎడ్యుకేషన్ ఫీజు రియంబర్స్మెంట్కు కంపెనీలు అంగీకరిస్తాయి. మంచి హోదా: సంస్థలో హోదాకు ఎంతో విలువుంటుంది. మీకు గౌరవప్రదమైన హోదాను కోరుకోండి. ఇది మీలో ఆత్మవిశ్వాసం నింపడంతోపాటు ఇతర సంస్థల్లో కొలువుకు దరఖాస్తు చేసుకున్నప్పుడు ఎంతోగానో ఉపయోగపడుతుంది. అక్కడ మంచి జాబ్ వచ్చేందుకు అవకాశం ఉంటుంది. సెలవులు: సిబ్బందికి సెలవులిచ్చే విషయంలో కంపెనీ పాలసీ ఏమిటో తెలుసుకోండి. అత్యవసర పరిస్థితుల్లో అడిగిన వెంటనే సెలవులు ఇచ్చేలా బేరమాడండి. వీలైతే అదనపు సెలవులను కూడా కోరండి. ఆఫీస్‌లో పనివేళలు మీకు అనుకూలంగా ఉన్నాయో లేదో తెలుసుకోండి. ఆఫీస్‌లో స్థానం: కార్యాలయంలో ఎక్కడో ఒక మూలన మీ డెస్క్ ఉంటే ఇబ్బందే. కాబట్టి ధారాళంగా గాలి, వెలుతురు వచ్చే చోట మీకు సౌలభ్యంగా ఉండేలా డెస్క్ కేటాయించాలని విజ్ఞప్తి చేయండి. -
అక్షర కేంద్రాల్లో ఆకలి కేకలు
జి.సిగడాం, న్యూస్‌లైన్:వయోజనుల్లో అక్షర దీపాలు వెలిగించి గ్రామీణ ప్రాంతాల్లో అక్షరాస్యత పెంచేందుకు పాటుపడుతున్న సాక్షర భారత్ కో ఆర్డినేటర్ల జీవితాల్లో చీకట్లు అలుముకుంటున్నాయి. గత ఏడాదిగా ప్రభుత్వం వేతనాలు చెల్లించకపోవడంతో వీరు ఆర్థికంగా చితికిపోతున్నారు. వీరిపైనే ఆధారపడిన కుటుంబాలు ఆకలి మంటల్లో చిక్కుకుంటున్నాయి. అక్షరాస్యత కార్యక్రమాల్లో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో వయోజనులను గుర్తించి, చదువు చెప్పేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాక్షర భారత్ కేంద్రాలను నిర్వహిస్తున్నాయి. ఒక్కో కేంద్రానికి ఇద్దరు కో ఆర్డినేటర్ల(ఒక పురుషుడు, ఒక మహిళ)ను నియమించారు. వీరు గుర్తించిన వయోజనులకు చదవడం, రాయడం నేర్పించి పరీక్షలు కూడా నిర్వహించాల్సి ఉంటుంది. ఈ పనులు నిర్వర్తించేందుకు కో ఆర్డినేటర్లకు గౌరవ భృతితోపాటు రవాణా ఖర్చులు, పేపరు బిల్లులు కూడా చెల్లించాల్సి ఉంది. ఆ మేరకు జిల్లాలోని 38 మండలాల పరిధిలో 65,945 మంది వయోజనులను సాక్షర భారత్ కేంద్రాల్లో నమోదు చేసి చదువు చెబుతున్నారు. ఈ కేంద్రాల నిర్వహణకు అవసరమైన వసతి సౌకర్యం కల్పించడంతోపాటు ఇతరత్రా అవసరమైన సామగ్రి అందిస్తున్న ప్రభుత్వం గౌరవ భృతి చెల్లించడంలో మాత్రం నిర్లక్ష్యం వహిస్తోంది. ఏడాదిగా అందని గౌరవభృతి, పేపర్ బిల్లులు ప్రతి పంచాయతీలో ఒక కేంద్రం చొప్పున జిల్లాలో సుమారు 1100 సాక్షర భారత్ కేంద్రాలు ఉండగా వాటిలో 2200 మంది కో ఆర్డినేటర్లు పని చేస్తున్నారు. వీరికి ఒక్కొక్కరికి నెలకు రూ.2వేలు గౌరవ భృతిగా నిర్ణయించారు. అయితే జనవరి నుంచి ఈ నెల వరకు అంటే సంవత్సర కాలంగా గౌరవ భృతి చెల్లించలేదు. దీంతోపాటు ప్రతి నెలా పేపర్లకు రూ.320, కరెంటు బిల్లు రూ.400, నిర్వహణ ఖర్చుల కింద రూ.300 మొత్తం రూ.1020 చెల్లించాలి. కానీ గౌరవ భృతితోపాటు పేపర్ బిల్లు కూడా ఏడాది నుంచి చెల్లించడం లేదని కో ఆర్డినేటర్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఎప్పటికప్పుడు సమావేశాలంటూ మండల కేంద్రాలకు పిలిపించడం, పలు రకాల బాధ్యతలు అప్పగించడమే తప్ప అధికారులు తమకు వేతనాలు చెల్లించే విషయం పట్టించుకోవడం లేదని ఆవేదన చెందుతున్నారు. దాంతో ఒకవైపు కుటుంబ పోషణ, మరోవైపు కేంద్రాల నిర్వహణ ఖర్చులకు ఎక్కడి నుంచి డబ్బులు తేవాలో అర్థం కాక ఇబ్బంది పడుతున్నారు. ప్రతి గురువారం నిర్వహించే గ్రామదర్ళిని కార్యక్రమానికి వచ్చిన అధికారులకు పలుమార్లు వినతులు ఇచ్చినా పట్టించుకునే నాథుడు కరువయ్యాడని వాపోతున్నారు. కేంద్రాలను సమర్థవంతంగా నిర్వహించాలని చెబుతున్న అధికారులు.. తాము అలా పనిచేయగలగాలంటూ ఆర్థిక ఇబ్బందులు లేకుండా చూడాలన్న విషయాన్ని విస్మరిస్తున్నారని అంటున్నారు. ఎప్పటికప్పుడు వేతనాలు, నిర్వహణ ఖర్చులు చెల్లిస్తే కేంద్రాలను ఇంకా బాగా నిర్వహించగలమంటున్నారు. -
అరటిపండుతోంది!
అ‘ధర’హో = చాగంటిపాడులో సొంత మార్కెట్‌కు రైతుల శ్రీకారం = గిట్టుబాటు ధరే లక్ష్యం లాభాలతో ఆనందం చాగంటిపాడు అరటి మార్కెట్ రైతులకు లాభాల పంట పండిస్తోంది. స్వయంగా రైతులే ఏర్పాటుచేసుకున్న ఈ మార్కెట్లో న్యాయబద్ధమైన ధర లభిస్తోంది. మార్కెట్ మాయాజాలం, అడ్డూఅదుపూ లేని కమీషన్ల భారం, తడిసిమోపెడవుతున్న రవాణాఖర్చుల బారినుంచి వారిని అరటి మార్కెట్ ఆదుకుంటోంది. వారు పండించిన పంటకు కనీస మద్దతు ధర లభిస్తుండడంతో అరటి రైతుల మోముల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. తోట్లవల్లూరు, న్యూస్‌లైన్ : వాణిజ్య పంటల్లో ప్రధానమైన అరటిని లంక, మెట్ట భూముల్లో విస్తారంగా సాగుచేస్తున్నారు. తోట్లవల్లూరు, వల్లూరుపాలెం, రొయ్యూరు, భద్రిరాజుపాలెం, చాగంటిపా డు, కళ్లంవారిపాలెం, దేవరపల్లి, పొట్టిదిబ్బలంక ప్రాంతాల్లో అరటి సాగవుతోంది. ఉద్యానశాఖ అంచనా ప్రకారం 700 నుంచి 800 ఎకరాల్లో అరటిని పండిస్తున్నారు. మద్దతు ధర కోసం.. అరటి రైతులు మార్కెట్ మాయాజాలానికి బలవుతున్నారు. ఓ వైపు సాగు ఖర్చులు, ప్రకృతి విపత్తుల కారణంగా ఎదురయ్యే నష్టాలతో అల్లాడుతున్న రైతులకు మార్కెట్లో లభించే ధర గిట్టుబాటు కావడం లేదు. వచ్చే అరకొర ధరలో కమీషన్, రవాణా ఖర్చులు పోగా మిగిలేది అంతంతమాత్రమే. దీన్నుంచి బయటపడేందుకు చాగంటిపాడు రైతులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నాబార్డు సహకారంతో గ్రామంలోని ఔత్సాహిక రైతులు రైతుక్లబ్‌గా ఏర్పడి రెండు నెలల కిందట అరటి మార్కెట్‌ను ప్రారంభించారు. వారి పంటకు వారే ధర నిర్ణయించుకోవడం విశేషం. ముమ్మరంగా కొనుగోళ్లు.. రైతుల ఆధ్వర్యంలో ప్రారంభమైన మార్కెట్లో అరటి కొనుగోళ్లు ముమ్మరంగా సాగుతున్నాయి. తోట్లవల్లూరు, భద్రిరాజుపాలెం, దేవరపల్లి, కళ్లంవారిపాలెం, వల్లూరుపాలెం, ఐలూరు, ఐనపూరు, పెనమకూరు గ్రామాల రైతులు పం టను మార్కెట్‌కు తీసుకువస్తున్నారు. ప్రతి సోమ, గురువారం వేలంపాటలు నిర్వహిస్తున్నారు. వారానికి సగటున 1800కు పైగా గెలలు వస్తున్నాయి. చల్లపల్లి, అవనిగడ్డ, నూజివీడు, ఆగిరిపల్లి, ఉయ్యూరు, కంకిపాడు, పామర్రు, గుంటూరు జిల్లా నుంచి వ్యాపారులు అరటి కొనుగోలు కోసం వస్తున్నారు. రవాణావ్యయం, కమీషన్ ఖర్చులు తగ్గడంతో కనీస మద్దతు ధర లభిస్తోంది. ఒక్కో గెలకు రూ. 15 నుంచి రూ. 20 వరకు బయటి మార్కెట్ల కంటే అదనంగా నగదు లభిస్తుండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. న్యాయమైన ధర కోసమే.. వ్యాపారుల మాయాజాలం కారణంగా అరటికి బయట మార్కెట్లలో సరైన ధర లభించడం లేదు. రైతులకు మేలు చేయాలనే సదుద్దేశంతో మార్కెట్‌ను ప్రారంభించాం. రైతులు, వ్యాపారుల సహకారంతో విజయవంతంగా నిర్వహిస్తున్నాం. - కొల్లి కేశవచంద్రమోహనరెడ్డి, చీఫ్ కోఆర్డినేటర్, రైతుక్లబ్, చాగంటిపాడు ఎంతో ఉపయుక్తం.. చాగంటిపాడులో అరటి మార్కెట్ ఏర్పాటుచేయడం వల్ల రైతులకు ఎంతో ఉపయోగంగా ఉంది. వ్యాపారుల మోసాల నుంచి రైతులను రక్షించడంతోపాటు రవాణా వ్యయం బాగా కలిసివస్తోంది. దీంతో కొంతవరకు మెరుగైన ధర లభిస్తోంది. మార్కెట్ ఏర్పాటులో రైతుక్లబ్ తీసుకున్న చొరవ అభినందనీయం. - కలకోట వెంకటరామిరెడ్డి, రైతు, చాగంటిపాడు