జీతం తక్కువైనా ఇతర ప్రయోజనాలు ఉంటే!
జాబ్ స్కిల్స్
ఇష్టమైన కంపెనీలో కోరుకున్న ఉద్యోగం సాధించాలంటే మొదట రాత పరీక్ష, ఇంటర్వ్యూలో నెగ్గాలి. తర్వాత జీతభత్యాలు, ఇతర ప్రయోజనాలపై బేరసారాలు సాగించాలి. ఇవి సంతృప్తికరంగా ఉంటే కొలువులో చేరిపోవచ్చు. సాధారణంగా సంస్థలు తమ విధానంలో భాగంగా ఉద్యోగులతో వేతనాలపై సంప్రదింపులను అంగీకరించవు. జీతభత్యాలపై బేరసారాలకు అవకాశం లేకపోయినా ఇతర ప్రయోజనాలు ఇచ్చేందుకు కంపెనీ ముందుకొస్తుంది. వీటివల్ల సంస్థకు పెద్దగా నష్టం ఉండదు. కాబట్టి ప్రయోజనాలపై కంపెనీతో స్పష్టంగా మాట్లాడుకోవాలి. జీతం తక్కువైనా ఇవి నచ్చితే ఉద్యోగంలో చేరొచ్చు.
రవాణా ఖర్చులు: ఆఫీస్‌కు ఎలా వెళ్తారు? సొంత వాహనమా? లేక ప్రజా రవాణా వ్యవస్థను ఉపయోగించుకుంటారా? ఎలా వెళ్లినా చేతిలోంచి డబ్బు ఖర్చు చేయక తప్పదు. కొన్ని సంస్థలు ఉద్యోగులకు రవాణా వసతి కల్పిస్తుంటాయి. అలాగే ప్రతినెలా రవాణా ఖర్చులను చెల్లిస్తుంటాయి. ఇలాంటి ప్రయోజనం ఏదైనా కల్పించాలని కోరండి. దీనివల్ల ఆర్థికంగా మీకు ఎంతో వెసులుబాటు దక్కుతుంది.
డేకేర్ వసతి: మీరు స్వయంగా చూసుకోవాల్సిన చిన్న పిల్లలుంటే.. ఆఫీస్‌లో డే కేర్ వసతి కల్పించాలని విన్నవించండి. కార్పొరేట్ కార్యాలయాల్లో చైల్డ్ కేర్ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. బయట బేబీ సిట్టింగ్‌కు రూ.వేలల్లోనే ఖర్చవుతోంది. చైల్డ్ కేర్ వసతి లేకపోతే.. అందుకు కొంత మొత్తం అదనంగా చెల్లించాలని కోరండి. దీన్ని కంపెనీలు ఆమోదిస్తుంటాయి.
ఎడ్యుకేషన్ ఫీజు రియంబర్స్‌మెంట్ : కెరీర్‌లో రాణించాలంటే స్కిల్స్, అనుభవం పెంచుకోవాలి. కొత్తకొత్త డిగ్రీలను సొంతం చేసుకోవాలి. ఇందుకోసం వీలును బట్టి దూర విద్య కోర్సుల్లో చేరాలి. సదస్సులు, సమావేశాలు, శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొనాలి. మీ నైపుణ్యాలు పెరిగితే కంపెనీకే లాభం. మీ చదువుకయ్యే ఖర్చులను సంస్థ భరించేలా మాట్లాడుకోండి. తమ ఉద్యోగుల ఎడ్యుకేషన్ ఫీజు రియంబర్స్‌మెంట్‌కు కంపెనీలు అంగీకరిస్తాయి.
మంచి హోదా: సంస్థలో హోదాకు ఎంతో విలువుంటుంది. మీకు గౌరవప్రదమైన హోదాను కోరుకోండి. ఇది మీలో ఆత్మవిశ్వాసం నింపడంతోపాటు ఇతర సంస్థల్లో కొలువుకు దరఖాస్తు చేసుకున్నప్పుడు ఎంతోగానో ఉపయోగపడుతుంది. అక్కడ మంచి జాబ్ వచ్చేందుకు అవకాశం ఉంటుంది.
సెలవులు: సిబ్బందికి సెలవులిచ్చే విషయంలో కంపెనీ పాలసీ ఏమిటో తెలుసుకోండి. అత్యవసర పరిస్థితుల్లో అడిగిన వెంటనే సెలవులు ఇచ్చేలా బేరమాడండి. వీలైతే అదనపు సెలవులను కూడా కోరండి. ఆఫీస్‌లో పనివేళలు మీకు అనుకూలంగా ఉన్నాయో లేదో తెలుసుకోండి.
ఆఫీస్‌లో స్థానం: కార్యాలయంలో ఎక్కడో ఒక మూలన మీ డెస్క్ ఉంటే ఇబ్బందే. కాబట్టి ధారాళంగా గాలి, వెలుతురు వచ్చే చోట మీకు సౌలభ్యంగా ఉండేలా డెస్క్ కేటాయించాలని విజ్ఞప్తి చేయండి.