ఆంధ్రప్రదేశ్‌లో రూ.150 కోట్లతో బ్లూ స్టార్ ప్లాంటు.. | Blue Star plant with Rs 150 crore in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

ఆంధ్రప్రదేశ్‌లో రూ.150 కోట్లతో బ్లూ స్టార్ ప్లాంటు..

Published Sat, Aug 22 2015 1:34 AM | Last Updated on Sun, Sep 3 2017 7:52 AM

ఆంధ్రప్రదేశ్‌లో రూ.150 కోట్లతో బ్లూ స్టార్ ప్లాంటు..

ఆంధ్రప్రదేశ్‌లో రూ.150 కోట్లతో బ్లూ స్టార్ ప్లాంటు..

♦ నౌకాశ్రయానికి సమీపంలో ఏర్పాటు
♦ 5 లక్షల యూనిట్ల తయారీ సామర్థ్యం
 
 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ఎయిర్ కండిషనర్ల (ఏసీ) తయారీ సంస్థ బ్లూ స్టార్ దక్షిణాదిన ప్లాంటును ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. 5 లక్షల యూనిట్ల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో రానున్న ఈ ప్లాంటుకు సంస్థ రూ.150 కోట్లు ఖర్చు చేయనుంది. అన్నీ అనుకూలిస్తే 2016లో ఉత్పత్తి ప్రారంభం అవుతుంది. రూమ్ ఏసీ, డీప్ ఫ్రీజర్లను ప్లాంటులో తయారు చేస్తారు. నెల్లూరు జిల్లా తడ లేదా తెలంగాణలోని హైదరాబాద్‌లో ప్లాంటు స్థాపించాలని కొన్నేళ్ల నుంచి కంపెనీ ప్రయత్నిస్తోంది. పన్ను ప్రోత్సాహకాలు అధికంగా ఇచ్చే రాష్ట్రంలో ప్లాంటు పెట్టాలని భావించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలతో కంపెనీ ఉన్నతాధికారులు చర్చలు జరిపారు కూడా.

అయితే పన్ను ప్రయోజనాలు ఉన్నా లేకపోయినా రవాణా వ్యయాలను తగ్గించుకోవాలంటే దక్షిణాదిన ప్లాంటు ఏర్పాటు చేయడం మినహా కంపెనీకి మరో మార్గం లేదు. మరోవైపు ఎగుమతులను 2017-18 నాటికి మూడింతలు చేయాలని బ్లూ స్టార్ లక్ష్యంగా చేసుకుంది. ప్లాంటుకు నౌకాశ్రయం సమీపంలో ఉన్న ప్రాంతం అనువైందని సంస్థ భావిస్తోంది. దక్షిణ ఆంధ్రప్రదేశ్‌లో ప్లాంటు వచ్చే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని కంపెనీ ఉన్నతాధికారి సాక్షి బిజినెస్ బ్యూరోకు ముంబై నుంచి ఫోన్‌లో తెలిపారు.

 దక్షిణాదిన ఎందుకంటే..
 ప్రస్తుతమున్న 7 ప్లాంట్లలో రెండింటిని కంపెనీ మూసివేసింది. అన్ని ప్లాంట్లు పశ్చిమ, ఉత్తర భారత్‌కే పరిమితమయ్యాయి. ఎక్సైజ్, సెన్‌వ్యాట్ ప్రయోజనాల కోసం కొన్నింటిని గతంలో ఏర్పాటు చేసింది. అయితే జీఎస్‌టీ అమలైతే ఈ ప్రయోజనాలు ఏవీ ఉండవు. పెపైచ్చు రవాణాకు ఏటా రూ.150 కోట్లు ఖర్చు అవుతోంది. ఉద్యోగుల వేతనాల తర్వాత రవాణా వ్యయాలు రెండో స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. దక్షిణాదిన ప్లాంటు ఉంటే మూడింట రెండొంతుల వ్యయాలు ఆదా అవుతాయని సంస్థ భావిస్తోంది.

దీర్ఘకాలిక వ్యూహంలో భాగంగా ఎగుమతులను దృష్టిలో పెట్టుకుని నౌకాశ్రయానికి దగ్గరగా ప్లాంటు ఉండేలా కంపెనీ అడుగులేస్తోంది. స్థల ఎంపిక కోసం కేపీఎంజీని నియమించింది. కేపీఎంజీ నివేదిక సెప్టెంబరులో రానుంది. అమ్మకాల్లో 55 శాతం వాటా దక్షిణాది రాష్ట్రాలదేనని బ్లూ స్టార్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ బి.త్యాగరాజన్ తెలిపారు. ఇన్వర్టర్ వీఆర్‌ఎఫ్ ఏసీ సిస్టమ్స్‌ను ఆవిష్కరించిన సందర్భంగా శుక్రవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. దక్షిణాది ప్లాంటు వచ్చేలోపు ఉత్తరాదిన మరో ప్లాంటు పెట్టే అవకాశాలూ లేకపోలేదని ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ముకుందన్ మీనన్ పేర్కొన్నారు.

 ఈ-కామర్స్ బుడగ పేలిపోతుంది..
 భారత్‌లో ఏసీల అమ్మకాల్లో ఆన్‌లైన్ వాటా కేవలం 1 శాతం మాత్రమే. వాస్తవ ధర కంటే తక్కువ ధరలో ఇ-కామర్స్ కంపెనీలు ఏసీలను విక్రయిస్తుండడం ఆశ్చర్యంగా ఉందని త్యాగరాజన్ అన్నారు. ‘నష్టాలొచ్చినా ఎలా విక్రయిస్తారు. ధరను తక్కువ చేసి విక్రయించడం వల్ల బ్రాండ్ విలువ తగ్గించినట్టే. మా దగ్గర శక్తి లేక మిన్నకుండిపోతున్నాం. ఇ-కామర్స్ కంపెనీలు వాటి విలువ పెంచుకోవడానికే డిస్కౌంట్లను ఇస్తున్నాయి. ఏదో ఒక రోజు ఇ-కామర్స్ రంగం బుడగ పేలిపోవడం ఖాయం’ అని అన్నారు. ఏసీల బీఈఈ స్టార్ రేటింగ్ ప్రమాణాలు 2016 జనవరి నుంచి మరింత కఠినం కానున్నాయని చెప్పారు. 2018 జనవరికి 5 స్టార్ కాస్తా 3 స్టార్ అవుతుందని వివరించారు. గతేడాది మాదిరిగా 2015-16లో 37 లక్షల యూనిట్ల ఏసీలు అమ్ముడవుతాయని పరిశ్రమ అంచనా వేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement