రూ.3,793 కోట్లు లాభం.. ఏసీలకు గిరాకీ | quarterly results of indian companies pgcil and bluestar | Sakshi
Sakshi News home page

రూ.3,793 కోట్లు లాభం.. ఏసీలకు గిరాకీ

Published Thu, Nov 7 2024 9:09 AM | Last Updated on Thu, Nov 7 2024 9:09 AM

quarterly results of indian companies pgcil and bluestar

పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌ (పీజీసీఐఎల్‌) సెప్టెంబర్‌ త్రైమాసికానికి రూ.3,793 కోట్ల కన్సాలిడేటెడ్‌ నికర లాభాన్ని ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో లాభం రూ.3,781 కోట్లతో పోలిస్తే కేవలం రూ.12 కోట్లు పెరిగింది. ఆదాయం రూ.11,530 కోట్ల నుంచి రూ.11,846 కోట్లకు వృద్ధి చెందింది. స్థిరాస్తుల స్థూల విలువ రూ.2,78,983 కోట్లకు చేరింది. సెప్టెంబర్‌ క్వార్టర్‌లో రూ.38,575 కోట్ల విలువ చేసే ఎనిమిది ప్రాజెక్టులకు పవర్‌గ్రిడ్‌ విజయవంతమైన బిడ్డర్‌గా అర్హత సాధించింది.

రూ.4.5 డివిడెండ్‌..

వాటాదారుల వద్దనున్న ప్రతి షేరుకు రూ.4.50 చొప్పున మధ్యంతర డివిడెండ్‌ ఇచ్చేందుకు కంపెనీ బోర్డు నిర్ణయించింది. అలాగే పవర్‌గ్రిడ్‌ కాలా అంబ్‌ ట్రాన్స్‌మిషన్, పవర్‌గ్రిడ్‌ పర్లి ట్రాన్స్‌మిషన్, పవర్‌గ్రిడ్‌ వరోరా ట్రాన్స్‌మిషన్, పవర్‌గ్రిడ్‌ జబల్‌పూర్‌ ట్రాన్స్‌మిషన్‌ను పవర్‌గ్రిడ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్ట్‌ (పీజీఇని్వట్‌)కు విక్రయించేందుకు బోర్డు ఆమోదం తెలిపింది. ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో షేరు ధర పెద్దగా మార్పుచెందకుండా రూ.318 వద్ద క్లోజ్‌ అయింది.  

బ్లూస్టార్‌ ఆకర్షణీయ ఫలితాలు

కూలింగ్‌ ఉత్పత్తుల సంస్థ బ్లూస్టార్‌ లిమిటెడ్‌ సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో మెరుగైన పనితీరు ప్రదర్శించింది. నికర లాభం క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.71 కోట్ల నుంచి రూ.96 కోట్లకు దూసుకుపోయింది. 35 శాతం వృద్ధి నమోదైంది. ఆదాయం 22 శాతం వృద్ధితో రూ.2,276 కోట్లుగా నమోదైంది. బలమైన ఆర్డర్ల పైప్‌లైన్‌తో అన్ని విభాగాల్లోనూ మెరుగైన పనితీరు చూపించినట్టు.. కంపెనీ ఉత్పత్తులకు డిమాండ్‌ కొనసాగినట్టు బ్లూస్టార్‌ తెలిపింది. ఎలక్ట్రో మెకానికల్‌ ప్రాజెక్టులు, వాణిజ్య ఏసీ సిస్టమ్స్‌ ఆదాయం 33 శాతం పెరిగి రూ.1,428 కోట్లకు చేరింది. ఈ విభాగం మార్జిన్లు 2.2 శాతం బలపడ్డాయి. ఎలక్ట్రో మెకానికల్‌ ప్రాజెక్టుల విభాగంలో తయారీ రంగం, డేటా సెంటర్‌ల నుంచి వృద్ధి కనిపించింది. యూనిటీ ప్రొడక్టుల (రూమ్‌ ఏసీలు కూడా) ఆదాయం 5 శాతం వృద్ధితో రూ.767 కోట్లుగా నమోదైంది. ప్రొఫెషనల్‌ ఎల్రక్టానిక్స్, ఇండ్రస్టియల్‌ సిస్టమ్స్‌ ఆదాయం స్వల్పంగా క్షీణించి రూ.80 కోట్లుగా ఉంది.

ఇదీ చదవండి: ట్యాక్సీ మాఫియానే ప్రధాన ఓటు బ్యాంకు!

ఏసీల వ్యాపారం సానుకూలం

అన్ని విభాగాల్లోనూ అవకాశాలు ఆశావహంగా ఉన్నట్టు, రూమ్‌ ఏసీలు, వాణిజ్య ఏసీల వ్యాపారం మంచి పనితీరు చూపిస్తున్నట్టు సంస్థ చైర్మన్, ఎండీ ఎస్‌ అద్వానీ తెలిపారు. 2024–25 సంవత్సరం పట్ల సానుకూలంగా ఉన్నట్టు చెప్పారు. డైరెక్టర్‌ పీవీ రావును ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా (ప్రాజెక్టులు, సొల్యూషన్లు) నియమించినట్టు సంస్థ ప్రకటించింది. ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో బ్లూస్టార్‌ షేరు ఒక శాతానికి పైగా పెరిగి రూ.1,878 వద్ద క్లోజ్‌ అయింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement