ఎలక్ట్రిఫికేషన్, ఆటోమేషన్ దిగ్గజం ఏబీబీ ఇండియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024) మూడో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. కంపెనీ జనవరి–డిసెంబర్ కాలాన్ని ఆర్థిక సంవత్సరంగా పరిగణించే సంగతి తెలిసిందే. జులై–సెప్టెంబర్(క్యూ3)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 21 శాతం జంప్‌చేసి రూ.440 కోట్లకు చేరింది. ఇతర ఆదాయం పుంజుకోవడం ఇందుకు సహకరించింది. గతేడాది(2023) ఇదే కాలంలో రూ.362 కోట్లు మాత్రమే ఆర్జించింది. కాగా.. మొత్తం ఆదాయం సైతం రూ.2,846 కోట్ల నుంచి రూ.3,005 కోట్లకు ఎగసింది. ఈ కాలంలో 11 శాతం అధికంగా రూ.3,342 కోట్ల విలువైన ఆర్డర్లు అందుకుంది. దీంతో మొత్తం ఆర్డర్ల విలువ రూ.9,995 కోట్లకు చేరింది. ఇది 25 శాతం వృద్ధి.
ఇదీ చదవండి: ఐపీఓకు సిద్ధమవుతున్న కంపెనీలివే..
ఐఆర్‌ఎఫ్‌సీ లాభం ప్లస్
ప్రభుత్వ రంగ ఎన్‌బీఎఫ్‌సీ..ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్(ఐఆర్‌ఎఫ్‌సీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25) రెండో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. జులై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 4 శాతం పుంజుకుని రూ.1,613 కోట్లను తాకింది. గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ.1,545 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ.6,762 కోట్ల నుంచి రూ.6,900 కోట్లకు బలపడింది. అయితే మొత్తం వ్యయాలు రూ.5,218 కోట్ల నుంచి రూ.5,288 కోట్లకు స్వల్పంగా పెరిగాయి. మినీరత్న కంపెనీ నిర్వహణలోని ఆస్తులు(ఏయూఎం) 2024 సెప్టెంబర్‌కల్లా రూ.4,62,283 కోట్లకు చేరాయి. వాటాదారులకు కంపెనీ బోర్డు షేరుకి రూ. 0.8 చొప్పున డివిడెండ్ ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment