న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) మూడో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. అక్టోబర్–డిసెంబర్ (క్యూ3)లో స్టాండెలోన్ నికర లాభం 2% నామమాత్ర వృద్ధితో రూ.16,736 కోట్లను తాకింది. గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ.16,373 కోట్లు ఆర్జించింది. కన్సాలిడేటెడ్ నికర లాభం రూ. 17,258 కోట్ల నుంచి రూ.17,657 కోట్లకు స్వల్పంగా బలపడింది. రుణ వృద్ధి నెమ్మదించడం ప్రభావం చూపింది. అయితే మొత్తం ఆదాయం రూ. 1,15,016 కోట్ల నుంచి రూ. 1,12,194 కోట్లకు క్షీణించింది.
వడ్డీ ఆదాయం ప్లస్...
ప్రస్తుత సమీక్షా కాలంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం 8 శాతం పుంజుకుని రూ.30,650 కోట్లను తాకింది. వడ్డీయేతర ఆదాయం 3 శాతం వృద్ధితో రూ.11,450 కోట్లకు చేరింది. నికర వడ్డీ మార్జిన్లు 3.43 శాతం వద్ద నిలకడను చూపాయి. ఆస్తుల (రుణాల) నాణ్యత విషయానికివస్తే తాజా స్లిప్పేజీలు రూ. 6,400 కోట్లుగా నమోదయ్యాయి. స్థూల మొండిబకాయిలు (ఎన్‌పీఏలు) 1.26 శాతం నుంచి 1.42 శాతానికి పెరిగాయి. నికర ఎన్‌పీఏలు సైతం 0.31 శాతం నుంచి 0.46 శాతానికి ఎగశాయి. అనుబంధ సంస్థలలో హెచ్‌డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్ నికర లాభం రూ. 470 కోట్లను తాకగా.. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ఇన్సూరెన్స్ రూ. 410 కోట్లు, అసెట్ మేనేజ్‌మెంట్ రూ. 640 కోట్లు, సెక్యూరిటీస్ రూ. 270 కోట్లు చొప్పున లాభాలు ఆర్జించాయి.
టాటా కమ్యూనికేషన్స్ లాభం హైజంప్
రూ.257 కోట్లుగా నమోదు
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ కంపెనీ టాటా కమ్యూనికేషన్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) మూడో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం భారీగా ఎగసి రూ. 257 కోట్లకు చేరింది. గతేడాది(2023–24) ఇదే కాలంలో కేవలం రూ. 45 కోట్లు ఆర్జించింది. అయి తే పన్ను సంబంధిత రూ. 185 కోట్ల వన్‌టైమ్ ప్రొవిజన్ ఇందుకు కారణం. కాగా.. మొత్తం ఆదా యం 3% బలపడి రూ. 5,798 కోట్లను తాకింది.
ఇదీ చదవండి: ఐపీవో గ్రే మార్కెట్‌పై సెబీ కన్ను
రాణించిన హడ్కో
డిసెంబర్ క్వార్టర్‌లో రూ.735 కోట్ల లాభం
న్యూఢిల్లీ: పట్టణ గృహ, మౌలిక వసతుల ప్రాజెక్టులకు రుణాలు అందించే ప్రభుత్వరంగ హడ్కో డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో పనితీరు పరంగా రాణించింది. సంస్థ కన్సాలిడేటెడ్ నికర లాభం క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు 42 శాతం వృద్ధితో రూ.735 కోట్లకు చేరింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.519 కోట్లుగా ఉండడం గమనార్హం. మొత్తం ఆదాయం ఇదే కాలంలో రూ.2,023 కోట్ల నుంచి రూ.2,770 కోట్లకు వృద్ధి చెందింది. వాద్వాన్ పోర్ట్ ప్రాజెక్ట్ లిమిటెడ్ (వీపీపీఎల్)తో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) చేసుకున్నట్టు కంపెనీ తెలిపింది. రూ.25,000 కోట్ల వరకు రుణాన్ని సమకూర్చే అవకాశాలను ఈ ఒప్పందం కింద పరిశీలిస్తున్నట్టు వెల్లడించింది. వీపీపీఎల్ అన్నది జవహర్‌లాన్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్, మహారాష్ట్ర మారిటైమ్ బోర్డ్ ఏర్పాటు చేసిన జాయింట్ వెంచర్.
Comments
Please login to add a commentAdd a comment