Kpmg report
-
హైదరాబాద్ టాలెంట్ హబ్!
సాక్షి, హైదరాబాద్: దేశంలోని కీలక నగరాల్లో హైదరా బాద్ డైనమిక్ టాలెంట్ హబ్‌గా నిలిచింది. హైదరా బాద్‌తో పాటు నవీ ముంబై, పుణే కూడా మంచి నైపుణ్యం, విభిన్న ప్రతిభకు కేంద్రాలుగా అభివృద్ధి చెందాయని ప్రముఖ కేపీఎంజీ సంస్థ తమ టాలెంట్ ఫీజబులిటీ నివేదికలో వెల్లడించింది. క్లిష్టమైన నైపుణ్యాలు, విభిన్న ప్రతిభను కోరుకునే రిక్రూటర్ల డిమాండ్లను తీర్చే విధంగా ఈ హబ్‌లు ఎదిగాయని తెలిపింది. ముంబై, ఢిల్లీ, బెంగళూరు నగరాలు వివిధ పరిశ్రమలకు అవసరమైన ప్రతిభను ఆకర్షిస్తున్నాయని పేర్కొంది. జీవన నాణ్యత, ప్రయాణ సమయం, భద్రత, కనెక్టివిటీ, ఆరోగ్య సంరక్షణ, మెరుగైన గాలి నాణ్యత అంశాల్లో ఈ మూడు నగరాలు తొలి మూడు స్థానాల్లో నిలిచాయని వివరించింది. చెన్నై, హైదరాబాద్, ఢిల్లీ నగరాల్లో జీవన వ్యయ సూచికలు తక్కువగా ఉన్నాయని.. బెంగళూరు, గుర్గావ్, పుణే నగరాలు స్థానికంగా అధిక కొనుగోలు శక్తిని అందిస్తున్నాయని పేర్కొంది. ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో దేశంలోని 10 రంగాలకు చెందిన 40కిపైగా కంపెనీలు, హెచ్ఆర్ ప్రతినిధులు, నియామక బృందాలతో కలసి ఈ అధ్యయనం చేసినట్టు తెలిపింది.సులభతర వ్యాపారానికి వీలు..నవీ ముంబై, హైదరాబాద్, చెన్నై నగరాల్లో వాణిజ్య లీజు ధరలు అందుబాటులో ఉన్నాయని.. ఇది సులభతర వ్యాపారానికి వీలు కల్పిస్తుందని కేపీఎంజీ నివేదిక పేర్కొంది. దీనితో ఈ నగరాల్లో కార్యకలాపాలపై సంస్థలు ఆసక్తిగా ఉన్నాయని తెలిపింది. అయితే పన్ను రాయితీలు, సరళీకృత విధానాలు, ఇతర అంశాలను పరిశీలించాల్సిన అవసరం ఉందని తెలిపింది. ప్రతిభ, ప్రభుత్వ మద్దతు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, జీవన నాణ్యత, వ్యయాలు వంటి అంశాలు సంస్థల ఏర్పాటుకు, అత్యుత్తమ ప్రతిభను ఆకర్షించడానికి కీలకమని పేర్కొంది. -
KPMG report: 2050 నాటికి ‘నెట్ జీరో’ లక్ష్యం కష్టమే!
న్యూఢిల్లీ: సున్నా కర్బన ఉద్గారాల లక్ష్యాన్ని 2050 నాటికి సాధించేందుకు ప్రపంచ దేశాలు తీసుకుంటున్న చర్యలు చాలవని కేపీఎంజీ సంస్థ పేర్కొంది. ఈ విషయంలో ప్రభుత్వాలు, పరిశ్రమలు గుణాత్మక మార్పు దిశగా కృషి చేయాల్సి ఉందని తెలిపింది. అయితే, ఎన్నో అడ్డంకులు, గణనీయ స్థాయిలో ప్రభుత్వాల రుణ భారం, అంతర్గత ఉద్రిక్తతలు, కర్బన ఉద్గారాల తగ్గింపు ప్రణాళికలపై పెరుగుతున్న వ్యతిరేకత, ఇంధన సరఫరా విషయంలో భరోసా కలి్పంచాల్సిన అవసరం కర్బన ఉద్గారాల విషయంలో అవరోధంగా మారుతున్నట్టు వివరించింది. ఈ మేరకు కేపీఎంజీ ఓ నివేదికను విడుదల చేసింది. కాలుష్యాన్ని అధికంగా విడుదల చేసే యూఎస్, చైనా, బ్రెజిల్, కెనడా, యూఈ దేశాల్లో తక్కువ కర్బన ఆధారిత ఇంధనాల ఉత్పత్తి విషయంలో కొంత పురోగతి సాధించినప్పటికీ.. ఈ విషయంలో భారీగా అవుతున్న ఖర్చు, దేశీయ పరిశ్రమపై పడే ప్రభావం దృష్ట్యా వస్తున్న వ్యతిరేకత అవరోధంగా మారినట్టు తెలిపింది. విడిగా దేశాల వారీగా చూస్తే.. ప్రజల జీవనోపాధికి గణనీయమైన నష్టాన్ని కలిగిస్తాయన్నవ్యతిరేకతతో అర్థవంతమైన పురోగతికి ఆటంకం కలుగుతున్నట్టు వెల్లడించింది. వివిధ రంగాల్లో కర్బన ఉద్గారాల తగ్గింపు విషయంలో పురోగతి వేర్వేరుగా ఉందని తెలిపింది. ఎలక్ట్రిక్ వాహనాల విషయంలో పెద్ద ఎత్తున వృద్ధి.. కొన్ని రంగాల్లో వేగంగా కర్బన ఉద్గారాలను ఎలా తగ్గించవచ్చన్న దానికి విజయవంతమైన నమూనాగా పేర్కొంది. విమానయానం, షిప్పింగ్ పరిశ్రమల్లో దీనికి సంబంధించి పురోగతి చాలా నిదానంగా ఉన్నట్టు వివరించింది. 2050 నాటికి సున్నా కర్బన ఉద్గారాల లక్ష్యాన్ని సాధించడం అన్నది సుస్థిర విమానయాన ఇంధనాలను అభివృద్ధి చేయడంపై ఆధారపడి ఉంటుందని అభిప్రాయపడింది. భారత్‌లో పురోగతి.. భారత్ పునరుత్పాదక ఇంధనాల విషయంలో వేగవంతమైన పురోగతి సాధిస్తున్నట్టు కేపీఎంజీ నివేదిక వెల్లడించింది. 2047 నాటికి ఇంధనాల విషయంలో స్వతంత్ర దేశంగా అవతరించాలన్న ప్రధానమంత్రి లక్ష్యానికి అనుగుణంగా అడుగులు పడుతున్నట్టు తెలిపింది. ఫేమ్ పథకం ద్వారా ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తుండడాన్ని పస్త్రావించింది. కాకపోతే వ్యవసాయ రంగం నుంచి వెలువడుతున్న వ్యర్థాల తగ్గింపు భారత్‌కు సవాలేనని పేర్కొంది. సబ్సిడీతో అందిస్తున్న ఎరువులను అధికంగా వాడుతుండడంతో, పశుగ్రాసం నుంచి మీథేన్ విడుదల తగ్గించడం కష్టమని అభిప్రాయపడింది. ‘‘భారత్ సోలార్, విండ్, హైడ్రోజన్ నుంచి మరింత విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తోంది. అయితే, భారత్ ఏటా 6 శాతానికి పైగా వృద్ధి చెందే క్రమంలో ఏర్పడే ఇంధన అవసరాల దృష్ట్యా.. శిలాజ ఇంధనాలపై ఆధారపడడం ఇక ముందూ కొనసాగుతుంది. కాకపోతే కొంత కాలానికి సంప్రదాయ ఇంధనాల వినియోగం మొత్తం ఇంధన వినియోగంలో తగ్గుతుంది’’అని కేపీఎంజీ ఇంటర్నేషనల్ ఎనర్జీ హెడ్ అనిష్ అన్నారు. -
ఫ్లాట్‌గా వెంచర్ క్యాపిటల్ పెట్టుబడులు
న్యూఢిల్లీ: భారతీయ కంపెనీలు జూన్ క్వార్టర్లో 8 బిలియన్ డాలర్ల వీసీ నిధులను సంపాదించాయి. మార్చి త్రైమాసికంతో పోలిస్తే పెరగ్గా, క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే స్తబ్దుగానే ఉన్నట్టు కేపీఎంజీ నివేదిక తెలిపింది. టాప్ డీల్స్‌లో బైజూస్ 700 మిలియన్ డాలర్లు, లెన్స్‌కార్ట్ 600 మిలియన్ డాలర్లు, ట్రూబ్యాలన్స్ 168 మిలియన్ డాలర్ల సమీకరణ ఉన్నాయి. ఫిన్‌టెక్, ఎడ్యుటెక్, గేమింగ్ కంపెనీలు దేశంలో ఎక్కువ వీసీ నిధులను ఆకర్షించాయి. ఆ తర్వాత అగ్రిటెక్ కూడా వీసీ ఇన్వెస్టర్ల ప్రాధాన్య క్రమంలో ఉంది. ఈ వివరాలను కేపీఎంజీ సంస్థ ‘వెంచర్పల్స్ క్యూ 2023’ పేరుతో విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. అంతర్జాతీయంగా వెంచర్ క్యాపిటల్ (వీసీ) పెట్టుబడులు జూన్ త్రైమాసికంలో స్వల్పంగా తగ్గి 77.4 బిలియన్ డాలర్లుగా (రూ.6.34 లక్షల కోట్లు) ఉన్నాయి. మొత్తం 7,783 డీల్స్ నమోదయ్యాయి. అంతర్జాతీయంగా అనిశి్చత పరిస్థితుల్లోనూ భారీ డీల్స్‌కు ఇన్వెస్టర్ల నుంచి మద్దతు ఉందని ఈ నివేదిక తెలిపింది. అమెరికాకు చెందిన స్ట్రైప్ 6.8 బిలియన్ డాలర్లను జూన్ త్రైమాసికంలో సంపాదించింది. సింగపూర్‌కు చెందిన షీన్ 2 బిలియన్ డాలర్లు, అమెరికాకు చెందిన ఏఐ స్టార్టప్ ఇన్ఫ్లెక్షన్ 1.3 బిలియన్ డాలర్ల నిధులను సొంతం చేసుకున్నాయి. కొత్త నిధుల సమీకరణ విషయంలో ప్రముఖ వీసీ సంస్థలు కొంత వేచి చూసే ధోరణితో ఉన్నట్టు కేపీఎంజీ నివేదిక తెలిపింది. అంతర్జాతీయంగా అధిక ద్రవ్యోల్బణం, భౌగోళిక రాజకీయ అస్థిరతలు, వడ్డీ రేట్లను ఇంకా పెంచే అవకాశాలు ఉండడంతో సవాళ్లు ఇప్పట్లో ముగిసే పరిస్థితులు కనిపించడం లేదని ఈ నివేదిక అభిప్రాయపడింది. -
డబ్బే డబ్బు.. భారత్ కంపెనీల్లోకి పెట్టుబడుల వరద !
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయ ఫిన్‌టెక్ కంపెనీల్లోకి పెట్టుబడుల వరద సాగుతోంది. 2021 జనవరి–జూన్ కాలంలో రూ.14,900 కోట్లకుపైగా నిధులు వెల్లువెత్తాయని కేపీఎంజీ తన నివేదికలో వెల్లడించింది. 2020 సంవత్సరంలో వచ్చిన ఫండింగ్‌తో ఇది దాదాపు సమానం కావడం గమనార్హం. పైన్‌ల్యాబ్స్ రూ.2,860 కోట్లు, క్రెడ్ రూ.1,597 కోట్లు, రేజర్‌పే రూ.1,189 కోట్లు, క్రెడిట్‌బీ రూ.1,137 కోట్లు, ఆఫ్‌బిజినెస్ రూ.817 కోట్లు, భారత్‌పే రూ.802 కోట్లు అందుకున్నాయి. కంపెనీలు డిజిటల్ బ్యాంకింగ్ విభాగంలో పెద్ద మొత్తంలో పెట్టుబడులు చేజిక్కించుకున్నాయి. ఆ తర్వాతి స్థానంలో ఇన్సూరెన్స్ టెక్నాలజీ కంపెనీలు ఉన్నాయి. టర్టిల్‌మింట్ రూ.342 కోట్లు, రెన్యూబీ రూ.334 కోట్లు, డిజిట్ ఇన్సూరెన్స్ రూ.134 కోట్లు స్వీకరించాయి. చిన్న స్థాయి ప్రైవేట్ ఈక్విటీ, వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ ఈ స్టార్టప్స్‌లో పెట్టుబడులు చేశాయి. టాప్–10లో నాలుగు.. ఆసియాలో టాప్–10 డీల్స్‌లో పైన్‌ల్యాబ్స్ మూడవ స్థానంలో, క్రెడ్ నాల్గవ, రేజర్‌పే ఎనమిదవ, క్రెడిట్‌బీ 10వ స్థానంలో నిలిచింది. ఇక ఐపీవోలు కొనసాగుతాయని కేపీఎంజీ నివేదిక తెలిపిం ది. పాలసీ బజార్ రూ.6,500 కోట్లు, పేటీఎం రూ.16,500 కోట్ల ఐపీవో ప్రకటించిన సంగతి తెలిసిందే. విలీనం, కొనుగోళ్ల విషయంలో ఫిన్‌టెక్ కంపెనీలను బ్యాంకులు, ఈ రంగంలోని పెద్ద సంస్థలు, సర్వీసులు అందిస్తున్న దిగ్గజాలు లక్ష్యంగా చేసుకున్నాయి. రానున్న ఏడాదిలో ముందు వరుసలో ఉన్న ఫిన్‌టెక్ యూనికార్న్ కంపెనీలు క్యాపిటల్ మార్కెట్‌పై దృష్టిసారిస్తాయి. బ్యాంకులు సైతం ఫిన్‌టెక్ కంపెనీలు, కొత్త బ్యాంకులు, వెల్త్‌టెక్ కంపెనీలతో భాగస్వామ్యానికి సిద్ధంగా ఉన్నాయి. అంతర్జాతీయంగా సైతం.. తొలి ఆరు నెలల్లో అంతర్జాతీయంగా నిధులు వెల్లువెత్తాయి. రూ.7,28,140 కోట్లు ఫిన్‌టెక్ కంపెనీల చేతుల్లోకి వెళ్లాయి. 2020లో ఈ మొత్తం రూ.9,02,745 కోట్లుగా ఉంది. ఈ ఏడాది జనవరి–జూన్‌లో యూఎస్ కంపెనీల్లోకి రూ.3,78,930 కోట్లు, యూరప్, మధ్యప్రాచ్య, ఆఫ్రికా రూ.2,90,513 కోట్లు, ఆసియా పసిఫిక్ సంస్థల్లోకి రూ.55,725 కోట్లు వచ్చి చేరాయి. విలీనాలు, కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి. ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో రూ.3,02,400 కోట్ల విలువైన 353 డీల్స్ జరిగాయి. 2020లో 502 డీల్స్ నమోదయ్యాయి. వీటి విలువ రూ.5,49,820 కోట్లు. జూలై–డిసెంబరు కాలంలోనూ అన్ని ప్రాంతాల్లో ఇదే స్థాయిలో పెట్టుబడులు, డీల్స్ ఉండొచ్చని కేపీఎంజీ అంచనా వేస్తోంది. పేమెంట్స్, ఫైనాన్షియల్ సొల్యూషన్స్, బ్యాంకింగ్ యాజ్ ఏ సర్వీస్, బీ2బీ సర్వీసెస్, సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్స్‌లో పెట్టుబడులు ఉంటాయని వివరించింది. చదవండి: భారత్ ఎగుమతులు ట్రిలియన్ డాలర్లకు చేరడం ఖాయం -
ఆన్లైన్లో ఆడేస్తున్నారు!!
న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో లాక్డౌన్లు, కర్ఫ్యూల కారణంగా ఇళ్లకే పరిమితమవ్వాల్సిన పరిస్థితుల్లో చాలా మంది.. కాస్త టైమ్ పాస్ కోసం ఆన్లైన్ గేమ్స్ వైపు మళ్లుతున్నారు. ప్రస్తుతం దేశీయంగా ప్రాథమిక స్థాయిలోనే ఉన్న గేమింగ్ రంగానికి ఇది వరంగా మారుతోంది. కన్సల్టెన్సీ సంస్థ కేపీఎంజీ నివేదిక ప్రకారం 2020 తొలి త్రైమాసికంలో దేశీయంగా మొబైల్ గేమ్స్ డౌన్లోడ్స్ 200 కోట్ల లోపే ఉండగా.. మూడో త్రైమాసికంలో ఏకంగా 290 కోట్లకు పెరిగాయి. ఇక 2018 ఆర్థిక సంవత్సరం ఆఖరు నాటికి 25 కోట్లుగా ఉన్న గేమర్స్ సంఖ్య గత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం నాటికి 40 కోట్లకు పెరిగింది. తద్వారా చైనా తర్వాత అత్యధికంగా ఆన్లైన్ గేమ్స్ ఆడేవారున్న రెండో దేశంగా భారత్ నిల్చింది. తొలి సారి విధించిన లాక్డౌన్ సడలింపు తర్వాత కార్యకలాపాలు యథాప్రకారం ప్రారంభమయ్యాక.. గేమర్స్ దూకుడు కాస్త తగ్గినప్పటికీ, ఈ ధోరణి మాత్రం కొనసాగే అవకాశాలే ఉన్నాయని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. నెలవారీ యాక్టివ్ యూజర్ల (ఎంఏయూ) సంఖ్య ఇప్పటికీ కోవిడ్–పూర్వ స్థాయికి మించి నమోదవుతుండటమే ఇందుకు నిదర్శనంగా చెబుతున్నారు. 2025 నాటికి 66 కోట్లకు యూజర్లు.. ఇదే ధోరణి కొనసాగితే 2025 ఆర్థిక సంవత్సరం నాటికి భారత్‌లో గేమింగ్ యూజర్ల సంఖ్య 65.7 కోట్లకు చేరుతుందని అంచనా. అలాగే ఈ రంగానికి సంబంధించిన ఆదాయాలు ప్రస్తుతం రూ. 13,600 కోట్లుగా ఉండగా 2025 ఆర్థిక సంవత్సరం నాటికి రూ. 29,000 కోట్లకు చేరవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. స్మార్ట్ఫోన్లు అందుబాటు ధరల్లో లభ్యమవుతుండటం, డేటా చార్జీలు చౌకగా ఉండటం తదితర అంశాలు గేమింగ్ రంగం మరింత విస్తరించడానికి తోడ్పడుతున్నాయి. మెట్రో నగరాలు, ప్రథమ శ్రేణి నగరాలతో పాటు ద్వితీయ శ్రేణి నగరాల్లోకి కూడా ఆన్లైన్ గేమ్స్ క్రమంగా చొచ్చుకుపోతున్నాయి. ఆన్లైన్ గేమింగ్‌పై సామాజికంగా ఉండే విముఖత తొలగిపోతోందని, మహిళా గేమర్స్ సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోందని కేపీఎంజీ వర్గాలు పేర్కొన్నాయి. ఇక కొత్త యూజర్లకి చేరువయ్యేందుకు డెవలపర్లు స్థానిక కంటెంట్‌కు ప్రాధాన్యమిస్తుండటం కూడా గేమింగ్ సంస్కృతి విస్తరించడానికి దోహదపడుతోందని వివరించాయి. ఆక్ట్రో సంస్థకు చెందిన తీన్ పత్తీ, గేమెషన్ తయారు చేసిన లూడో కింగ్ లాంటి ప్రాచుర్యం పొందిన గేమ్స్‌ను హిందీ, గుజరాతీ, మరాఠీ లాంటి ప్రాంతీయ భాషల్లోనూ ఆడే సౌలభ్యం ఉంటోందని పేర్కొన్నాయి. ఇన్వెస్టర్ల ఆసక్తి.. గేమింగ్‌కి ప్రాచుర్యం పెరిగే కొద్దీ .. గేమ్ డెవలపర్స్ సంఖ్య కూడా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో భారీ స్థాయిలో ఇన్వెస్టర్లు సైతం పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారు. 2020 ఆగస్టు – 2021 జనవరి మధ్య కాలంలో దాదాపు 544 మిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు గేమింగ్ రంగంలోకి వచ్చాయి. స్థానిక కంపెనీలు తమ కార్యకలాపాలను మరింతగా విస్తరించేందుకు, అంతర్జాతీయ మార్కెట్లలోకి కూడా ప్రవేశించేందుకు ఈ నిధులు తోడ్పడగలవని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక 5జీ టెక్నాలజీ గానీ అందుబాటులోకి వచ్చిన పక్షంలో క్లౌడ్ గేమింగ్ కూడా ప్రాచుర్యంలోకి రాగలదని వారు తెలిపారు. -
ఆంధ్రప్రదేశ్‌లో రూ.150 కోట్లతో బ్లూ స్టార్ ప్లాంటు..
♦ నౌకాశ్రయానికి సమీపంలో ఏర్పాటు ♦ 5 లక్షల యూనిట్ల తయారీ సామర్థ్యం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ఎయిర్ కండిషనర్ల (ఏసీ) తయారీ సంస్థ బ్లూ స్టార్ దక్షిణాదిన ప్లాంటును ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. 5 లక్షల యూనిట్ల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో రానున్న ఈ ప్లాంటుకు సంస్థ రూ.150 కోట్లు ఖర్చు చేయనుంది. అన్నీ అనుకూలిస్తే 2016లో ఉత్పత్తి ప్రారంభం అవుతుంది. రూమ్ ఏసీ, డీప్ ఫ్రీజర్లను ప్లాంటులో తయారు చేస్తారు. నెల్లూరు జిల్లా తడ లేదా తెలంగాణలోని హైదరాబాద్‌లో ప్లాంటు స్థాపించాలని కొన్నేళ్ల నుంచి కంపెనీ ప్రయత్నిస్తోంది. పన్ను ప్రోత్సాహకాలు అధికంగా ఇచ్చే రాష్ట్రంలో ప్లాంటు పెట్టాలని భావించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలతో కంపెనీ ఉన్నతాధికారులు చర్చలు జరిపారు కూడా. అయితే పన్ను ప్రయోజనాలు ఉన్నా లేకపోయినా రవాణా వ్యయాలను తగ్గించుకోవాలంటే దక్షిణాదిన ప్లాంటు ఏర్పాటు చేయడం మినహా కంపెనీకి మరో మార్గం లేదు. మరోవైపు ఎగుమతులను 2017-18 నాటికి మూడింతలు చేయాలని బ్లూ స్టార్ లక్ష్యంగా చేసుకుంది. ప్లాంటుకు నౌకాశ్రయం సమీపంలో ఉన్న ప్రాంతం అనువైందని సంస్థ భావిస్తోంది. దక్షిణ ఆంధ్రప్రదేశ్‌లో ప్లాంటు వచ్చే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని కంపెనీ ఉన్నతాధికారి సాక్షి బిజినెస్ బ్యూరోకు ముంబై నుంచి ఫోన్లో తెలిపారు. దక్షిణాదిన ఎందుకంటే.. ప్రస్తుతమున్న 7 ప్లాంట్లలో రెండింటిని కంపెనీ మూసివేసింది. అన్ని ప్లాంట్లు పశ్చిమ, ఉత్తర భారత్‌కే పరిమితమయ్యాయి. ఎక్సైజ్, సెన్‌వ్యాట్ ప్రయోజనాల కోసం కొన్నింటిని గతంలో ఏర్పాటు చేసింది. అయితే జీఎస్టీ అమలైతే ఈ ప్రయోజనాలు ఏవీ ఉండవు. పెపైచ్చు రవాణాకు ఏటా రూ.150 కోట్లు ఖర్చు అవుతోంది. ఉద్యోగుల వేతనాల తర్వాత రవాణా వ్యయాలు రెండో స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. దక్షిణాదిన ప్లాంటు ఉంటే మూడింట రెండొంతుల వ్యయాలు ఆదా అవుతాయని సంస్థ భావిస్తోంది. దీర్ఘకాలిక వ్యూహంలో భాగంగా ఎగుమతులను దృష్టిలో పెట్టుకుని నౌకాశ్రయానికి దగ్గరగా ప్లాంటు ఉండేలా కంపెనీ అడుగులేస్తోంది. స్థల ఎంపిక కోసం కేపీఎంజీని నియమించింది. కేపీఎంజీ నివేదిక సెప్టెంబరులో రానుంది. అమ్మకాల్లో 55 శాతం వాటా దక్షిణాది రాష్ట్రాలదేనని బ్లూ స్టార్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ బి.త్యాగరాజన్ తెలిపారు. ఇన్వర్టర్ వీఆర్ఎఫ్ ఏసీ సిస్టమ్స్‌ను ఆవిష్కరించిన సందర్భంగా శుక్రవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. దక్షిణాది ప్లాంటు వచ్చేలోపు ఉత్తరాదిన మరో ప్లాంటు పెట్టే అవకాశాలూ లేకపోలేదని ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ముకుందన్ మీనన్ పేర్కొన్నారు. ఈ-కామర్స్ బుడగ పేలిపోతుంది.. భారత్‌లో ఏసీల అమ్మకాల్లో ఆన్లైన్ వాటా కేవలం 1 శాతం మాత్రమే. వాస్తవ ధర కంటే తక్కువ ధరలో ఇ-కామర్స్ కంపెనీలు ఏసీలను విక్రయిస్తుండడం ఆశ్చర్యంగా ఉందని త్యాగరాజన్ అన్నారు. ‘నష్టాలొచ్చినా ఎలా విక్రయిస్తారు. ధరను తక్కువ చేసి విక్రయించడం వల్ల బ్రాండ్ విలువ తగ్గించినట్టే. మా దగ్గర శక్తి లేక మిన్నకుండిపోతున్నాం. ఇ-కామర్స్ కంపెనీలు వాటి విలువ పెంచుకోవడానికే డిస్కౌంట్లను ఇస్తున్నాయి. ఏదో ఒక రోజు ఇ-కామర్స్ రంగం బుడగ పేలిపోవడం ఖాయం’ అని అన్నారు. ఏసీల బీఈఈ స్టార్ రేటింగ్ ప్రమాణాలు 2016 జనవరి నుంచి మరింత కఠినం కానున్నాయని చెప్పారు. 2018 జనవరికి 5 స్టార్ కాస్తా 3 స్టార్ అవుతుందని వివరించారు. గతేడాది మాదిరిగా 2015-16లో 37 లక్షల యూనిట్ల ఏసీలు అమ్ముడవుతాయని పరిశ్రమ అంచనా వేస్తోంది.