న్యూఢిల్లీ: భారతీయ కంపెనీలు జూన్ క్వార్టర్‌లో 8 బిలియన్ డాలర్ల వీసీ నిధులను సంపాదించాయి. మార్చి త్రైమాసికంతో పోలిస్తే పెరగ్గా, క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే స్తబ్దుగానే ఉన్నట్టు కేపీఎంజీ నివేదిక తెలిపింది. టాప్ డీల్స్‌లో బైజూస్ 700 మిలియన్ డాలర్లు, లెన్స్‌కార్ట్ 600 మిలియన్ డాలర్లు, ట్రూబ్యాలన్స్ 168 మిలియన్ డాలర్ల సమీకరణ ఉన్నాయి. ఫిన్‌టెక్, ఎడ్యుటెక్, గేమింగ్ కంపెనీలు దేశంలో ఎక్కువ వీసీ నిధులను ఆకర్షించాయి. ఆ తర్వాత అగ్రిటెక్ కూడా వీసీ ఇన్వెస్టర్ల ప్రాధాన్య క్రమంలో ఉంది. ఈ వివరాలను కేపీఎంజీ సంస్థ ‘వెంచర్‌పల్స్ క్యూ 2023’ పేరుతో విడుదల చేసిన నివేదికలో పేర్కొంది.
అంతర్జాతీయంగా వెంచర్ క్యాపిటల్ (వీసీ) పెట్టుబడులు జూన్ త్రైమాసికంలో స్వల్పంగా తగ్గి 77.4 బిలియన్ డాలర్లుగా (రూ.6.34 లక్షల కోట్లు) ఉన్నాయి. మొత్తం 7,783 డీల్స్ నమోదయ్యాయి. అంతర్జాతీయంగా అనిశి్చత పరిస్థితుల్లోనూ భారీ డీల్స్‌కు ఇన్వెస్టర్ల నుంచి మద్దతు ఉందని ఈ నివేదిక తెలిపింది. అమెరికాకు చెందిన స్ట్రైప్ 6.8 బిలియన్ డాలర్లను జూన్ త్రైమాసికంలో సంపాదించింది. సింగపూర్‌కు చెందిన షీన్ 2 బిలియన్ డాలర్లు, అమెరికాకు చెందిన ఏఐ స్టార్టప్ ఇన్‌ఫ్లెక్షన్ 1.3 బిలియన్ డాలర్ల నిధులను సొంతం చేసుకున్నాయి. కొత్త నిధుల సమీకరణ విషయంలో ప్రముఖ వీసీ సంస్థలు కొంత వేచి చూసే ధోరణితో ఉన్నట్టు కేపీఎంజీ నివేదిక తెలిపింది. అంతర్జాతీయంగా అధిక ద్రవ్యోల్బణం, భౌగోళిక రాజకీయ అస్థిరతలు, వడ్డీ రేట్లను ఇంకా పెంచే అవకాశాలు ఉండడంతో సవాళ్లు ఇప్పట్లో ముగిసే పరిస్థితులు కనిపించడం లేదని ఈ నివేదిక అభిప్రాయపడింది.
Comments
Please login to add a commentAdd a comment