![Patent expiry of key drugs to open up extra market space for Indian pharma manufacturers](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/15/PHARMA-PATENT.jpg.webp?itok=HKYzJ2Qm)
25 ఔషధాలకు ముగియనున్న పేటెంట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధ తయారీ రంగంలో ఉన్న భారతీయ కంపెనీలకు 2025–26లో మరిన్ని కొత్త అవకాశాలు అందనున్నాయి. భారీ అమ్మకాలను నమోదు చేస్తున్న సుమారు 25 ఔషధాల పేటెంట్ల గడువు ముగియనుండడమే ఇందుకు కారణం. భారతీయ సంస్థలకు మరింత సరసమైన ప్రత్యామ్నాయాలను అంతర్జాతీయంగా పరిచయం చేయడానికి ఇదొక పెద్ద అవకాశం కానుంది. ప్రపంచ జెనెరిక్ ఔషధ మార్కెట్లో తయారీ, ఎగుమతుల పరిమాణం పరంగా ఇప్పటికే అగ్రస్థానంలో నిలిచిన భారత్ 20 శాతంపైగా ఉత్పత్తులను సరఫరా చేస్తోంది. భారత్ బలమైన స్థానాన్ని కైవసం చేసుకుని తన హవాను కొనసాగిస్తోంది. వచ్చే 14 నెలల్లో పేటెంట్ల కాల పరిమితి ముగిసే ఔషధాలు భారత్ పాత్రను మరింత మెరుగుపర్చనున్నాయి.
ఏటా రూ. 25.80 వేల కోట్లకుపైగా..
క్యాన్సర్ ఇమ్యునోథెరపీ కోసం యూఎస్ ఫార్మా దిగ్గజం మెర్క్ అభివృద్ధి చేసిన కీట్రూడా, అలాగే మధుమేహం, స్థూలకాయం చికిత్సకై డెన్మార్క్ కంపెనీ నోవో నార్డిస్క్ ఉత్పత్తి చేసిన ఓజెంపిక్ వంటి కీలక ఔషధాల పేటెంట్లు 2025–26లో ముగుస్తాయి. కీట్రూడా ఒక్కటే 2024లో రూ.2,15,000 కోట్లకుపైగా అమ్మకాలను ఆర్జించింది.
బ్రిస్టల్–మేయర్స్ స్క్విబ్ తయారీ బ్లడ్ థిన్నర్ అయిన ఎలిక్విస్, నోవారి్టస్ ఉత్పత్తి చేసిన ఇమ్యునాలజీ డ్రగ్ కోసెంటిక్స్ వంటి ఇతర ముఖ్య ఔషధాలు సైతం ఈ జాబితాలో ఉన్నాయి. 2023–2029 మధ్య క్యాన్సర్, మధుమేహం, హృదయ సంబంధ వ్యాధులు, రోగ నిరోధక వ్యవస్థకు వచ్చే రుగ్మతల చికిత్సలో ఉపయోగించే 100 కంటే ఎక్కువ క్లిష్ట ఔషధాల పేటెంట్ల గడువు ముగుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ మందుల వార్షిక అమ్మకాలు రూ.25,80,000 కోట్లకు పైమాటే. ఇది జెనెరిక్స్, బయోసిమిలర్ల తయారీలో ఉన్న దేశీయ కంపెనీలకు అదనపు అవకాశాలను సృష్టించనుందని అనడంలో అతిశయోక్తి కాదు.
వార్షిక వృద్ధి 7 శాతంపైగా..
యూరోపియన్ ఫార్మాస్యూటికల్ రివ్యూ ప్రకారం ప్రధానంగా ఈ పేటెంట్ల గడువు ముగియడంతో జెనెరిక్స్ డిమాండ్ ప్రపంచవ్యాప్తంగా సగటు వార్షిక వృద్ధి 7 శాతంపైగా నమోదవుతుందని అంచనా. సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, బయోకాన్, అరబిందో, హెటిరో, లీ ఫార్మా వంటి భారతీయ సంస్థలు దీని నుండి లాభపడతాయి. బయోసిమిలర్ల విభాగంలోనూ దేశీయ కంపెనీలు ముందుకు దూసుకెళ్తున్నాయి. అయినప్పటికీ ఈ కంపెనీలు చవక జెనెరిక్స్ తయారీదారుల నుండి ముఖ్యంగా చైనాలో ఉన్న సంస్థల నుంచి పోటీని ఎదుర్కొంటున్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. యూఎస్ వంటి మార్కెట్లలో ధరల ఒత్తిడి, ఫార్మసీల నుండి గణనీయ తగ్గింపుల కోసం డిమాండ్లు కంపెనీల లాభాలను ప్రభావితం చేయవచ్చని నివేదికల ద్వారా తెలుస్తోంది.
డిసెంబర్‌లో రూ.21,183 కోట్లు..
భారత్ నుంచి ఔషధాల ఎగుమతులు 2024 డిసెంబర్‌లో రూ.21,183 కోట్లు నమోదయ్యాయి. అంత క్రితం ఏడాదితో పోలిస్తే ఇవి 2.69 శాతం అధికం అయ్యాయి. ఏప్రిల్–డిసెంబర్‌లో ఎగుమతులు 7.85% దూసుకెళ్లి రూ.1,82,021.36 కోట్లకు చేరాయి. ఫార్మా దిగుమతులు డిసెంబర్‌లో 12.85 % పెరిగి రూ.7,033 కోట్లను తాకాయి. ఏప్రిల్–డిసెంబర్ కాలంలో ఇవి 7.94% ఎగసి రూ. 55,551.4 కోట్లు నమోదు చేశాయి. దేశం నుంచి 2023–24లో సుమారు రూ.2,36,300 కోట్ల విలు వైన ఔషధాలు పలు దేశాలకు సరఫరా అయ్యాయి.
జెనెరిక్ మెడిసిన్ అంటే..
బ్రాండెడ్ మెడిసిన్ అనేది పేటెంట్ పొందిన, బ్రాండ్ పేరుతో విక్రయించే ఒక కొత్త ఔషధం. నూతన ఔషధాన్ని నిరీ్ణత వ్యవధిలో తయారు చేయడానికి, అలాగే విక్రయించడానికి ప్రత్యేక హక్కును చట్టపరంగా కల్పించడమే పేటెంట్. పేటెంట్ పొందిన ఔషధం యొక్క కాపీయే జెనెరిక్ మెడిసిన్. పేటెంట్ గడువు ముగిసిన తర్వాత నియంత్రణ సంస్థల అనుమతితో జెనెరిక్స్ ఔషధాలు తయారు చేసి విక్రయించవచ్చు. భారతీయ ఔషధ కంపెనీలకు యూఎస్, యూకే, రష్యా, దక్షిణాఫ్రికా ప్రధాన మార్కెట్లు.
Comments
Please login to add a commentAdd a comment