expiration
-
భారత ఫార్మాకు కొత్త అవకాశాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధ తయారీ రంగంలో ఉన్న భారతీయ కంపెనీలకు 2025–26లో మరిన్ని కొత్త అవకాశాలు అందనున్నాయి. భారీ అమ్మకాలను నమోదు చేస్తున్న సుమారు 25 ఔషధాల పేటెంట్ల గడువు ముగియనుండడమే ఇందుకు కారణం. భారతీయ సంస్థలకు మరింత సరసమైన ప్రత్యామ్నాయాలను అంతర్జాతీయంగా పరిచయం చేయడానికి ఇదొక పెద్ద అవకాశం కానుంది. ప్రపంచ జెనెరిక్ ఔషధ మార్కెట్లో తయారీ, ఎగుమతుల పరిమాణం పరంగా ఇప్పటికే అగ్రస్థానంలో నిలిచిన భారత్ 20 శాతంపైగా ఉత్పత్తులను సరఫరా చేస్తోంది. భారత్ బలమైన స్థానాన్ని కైవసం చేసుకుని తన హవాను కొనసాగిస్తోంది. వచ్చే 14 నెలల్లో పేటెంట్ల కాల పరిమితి ముగిసే ఔషధాలు భారత్ పాత్రను మరింత మెరుగుపర్చనున్నాయి. ఏటా రూ. 25.80 వేల కోట్లకుపైగా.. క్యాన్సర్ ఇమ్యునోథెరపీ కోసం యూఎస్ ఫార్మా దిగ్గజం మెర్క్ అభివృద్ధి చేసిన కీట్రూడా, అలాగే మధుమేహం, స్థూలకాయం చికిత్సకై డెన్మార్క్ కంపెనీ నోవో నార్డిస్క్ ఉత్పత్తి చేసిన ఓజెంపిక్ వంటి కీలక ఔషధాల పేటెంట్లు 2025–26లో ముగుస్తాయి. కీట్రూడా ఒక్కటే 2024లో రూ.2,15,000 కోట్లకుపైగా అమ్మకాలను ఆర్జించింది. బ్రిస్టల్–మేయర్స్ స్క్విబ్ తయారీ బ్లడ్ థిన్నర్ అయిన ఎలిక్విస్, నోవారి్టస్ ఉత్పత్తి చేసిన ఇమ్యునాలజీ డ్రగ్ కోసెంటిక్స్ వంటి ఇతర ముఖ్య ఔషధాలు సైతం ఈ జాబితాలో ఉన్నాయి. 2023–2029 మధ్య క్యాన్సర్, మధుమేహం, హృదయ సంబంధ వ్యాధులు, రోగ నిరోధక వ్యవస్థకు వచ్చే రుగ్మతల చికిత్సలో ఉపయోగించే 100 కంటే ఎక్కువ క్లిష్ట ఔషధాల పేటెంట్ల గడువు ముగుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ మందుల వార్షిక అమ్మకాలు రూ.25,80,000 కోట్లకు పైమాటే. ఇది జెనెరిక్స్, బయోసిమిలర్ల తయారీలో ఉన్న దేశీయ కంపెనీలకు అదనపు అవకాశాలను సృష్టించనుందని అనడంలో అతిశయోక్తి కాదు. వార్షిక వృద్ధి 7 శాతంపైగా.. యూరోపియన్ ఫార్మాస్యూటికల్ రివ్యూ ప్రకారం ప్రధానంగా ఈ పేటెంట్ల గడువు ముగియడంతో జెనెరిక్స్ డిమాండ్ ప్రపంచవ్యాప్తంగా సగటు వార్షిక వృద్ధి 7 శాతంపైగా నమోదవుతుందని అంచనా. సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, బయోకాన్, అరబిందో, హెటిరో, లీ ఫార్మా వంటి భారతీయ సంస్థలు దీని నుండి లాభపడతాయి. బయోసిమిలర్ల విభాగంలోనూ దేశీయ కంపెనీలు ముందుకు దూసుకెళ్తున్నాయి. అయినప్పటికీ ఈ కంపెనీలు చవక జెనెరిక్స్ తయారీదారుల నుండి ముఖ్యంగా చైనాలో ఉన్న సంస్థల నుంచి పోటీని ఎదుర్కొంటున్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. యూఎస్ వంటి మార్కెట్లలో ధరల ఒత్తిడి, ఫార్మసీల నుండి గణనీయ తగ్గింపుల కోసం డిమాండ్లు కంపెనీల లాభాలను ప్రభావితం చేయవచ్చని నివేదికల ద్వారా తెలుస్తోంది. డిసెంబర్లో రూ.21,183 కోట్లు.. భారత్ నుంచి ఔషధాల ఎగుమతులు 2024 డిసెంబర్లో రూ.21,183 కోట్లు నమోదయ్యాయి. అంత క్రితం ఏడాదితో పోలిస్తే ఇవి 2.69 శాతం అధికం అయ్యాయి. ఏప్రిల్–డిసెంబర్లో ఎగుమతులు 7.85% దూసుకెళ్లి రూ.1,82,021.36 కోట్లకు చేరాయి. ఫార్మా దిగుమతులు డిసెంబర్లో 12.85 % పెరిగి రూ.7,033 కోట్లను తాకాయి. ఏప్రిల్–డిసెంబర్ కాలంలో ఇవి 7.94% ఎగసి రూ. 55,551.4 కోట్లు నమోదు చేశాయి. దేశం నుంచి 2023–24లో సుమారు రూ.2,36,300 కోట్ల విలు వైన ఔషధాలు పలు దేశాలకు సరఫరా అయ్యాయి. జెనెరిక్ మెడిసిన్ అంటే.. బ్రాండెడ్ మెడిసిన్ అనేది పేటెంట్ పొందిన, బ్రాండ్ పేరుతో విక్రయించే ఒక కొత్త ఔషధం. నూతన ఔషధాన్ని నిరీ్ణత వ్యవధిలో తయారు చేయడానికి, అలాగే విక్రయించడానికి ప్రత్యేక హక్కును చట్టపరంగా కల్పించడమే పేటెంట్. పేటెంట్ పొందిన ఔషధం యొక్క కాపీయే జెనెరిక్ మెడిసిన్. పేటెంట్ గడువు ముగిసిన తర్వాత నియంత్రణ సంస్థల అనుమతితో జెనెరిక్స్ ఔషధాలు తయారు చేసి విక్రయించవచ్చు. భారతీయ ఔషధ కంపెనీలకు యూఎస్, యూకే, రష్యా, దక్షిణాఫ్రికా ప్రధాన మార్కెట్లు. -
కర్నూలు నుంచి ‘ఏపీఈఆర్సీ’ కార్యకలాపాలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) ప్రధాన కార్యాలయం కార్యకలాపాలు శనివారం నుంచి కర్నూలులో ప్రారంభమయ్యాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు హైదరాబాద్ పదేళ్లు రాజధానిగా ఉంటుందనే గడువు ఆదివారంతో ముగుస్తుండడంతో ఒకరోజు ముందుగానే ఏపీఈ ఆర్సీ తన కార్యకలాపాలను ఆంధ్రప్రదేశ్‌కు తరలించింది. ఈఆర్సీ భవనంతోపాటు ఓ అతిథి గృహాన్ని నిర్మించడానికి రాష్ట్ర ప్రభుత్వం రెండెకరాల స్థలం కేటాయించడంతో పాటు రూ.23 కోట్ల నిధులు అందించింది. ఈ నిధులతో 15 వేల చదరపు అడుగుల భవన నిర్మాణం జరిగింది. మరో 5 వేల చదరపు అడుగుల్లో గెస్ట్‌హౌస్ నిర్మిస్తున్నారు. నిర్మాణం పూర్తయిన భవనాన్ని ఈనెల 23న ప్రారంభించారు. శనివారం నుంచి అందులో అధికారికంగా కార్యకలాపాలు మొదలుపెట్టారు. పాతికేళ్ల క్రితం పుట్టిన ‘మండలి’1999 మార్చిలో హైదరాబాద్ కేంద్రంగా ఏపీఈఆర్సీ ఏర్పడింది. రాష్ట్ర విభజన తరువాత అమరావతి ప్రాంతానికి తరలిస్తూ 2014 ఆగస్టులో ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే, మండలి మాత్రం ఇన్నాళ్లూ హైదరాబాద్ కేంద్రంగానే పనిచేస్తూ వచ్చింది. ఏపీఈఆర్సీ ప్రధాన కార్యాలయం కర్నూలులో ఉండాలని రాష్ట్ర ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ గతేడాది ఆగస్టు 25న నోటిఫికేషన్ విడుదల చేశారు. అనంతరం.. అక్కడ భవన నిర్మాణం మొదలైంది. ఏపీఈఆర్సీకి ఒక చైర్మన్‌తో పాటు ఇద్దరు సభ్యులు ఉంటారు.వీరి తరువాత ఒక డైరెక్టర్ హోదాలో కమిషన్ సెక్రటరీ, ఆ తరువాత జాయింట్ డైరెక్టర్, ఐదుగురు డిప్యూటీ డైరెక్టర్లు, ఒక లీగల్ కన్సల్టెంట్, ఒక ఐటీ కన్సల్టెంట్, కార్యాలయ సిబ్బంది ఉంటారు. వీరంతా తమ ఆ«దీనంలోని ఫైళ్లను తరలించేందుకు సిద్ధంచేసి భద్రపరచాలని ఈ ఏడాది ఏప్రిల్‌లో కమిషన్ ఆదేశించింది. అలాగే, ఉద్యోగులు తమ నివాసాన్ని కర్నూలుకు మార్చుకోవాలని, వసతి ఏర్పాట్లుచేసుకోవాలని సూచించింది. అందుకు స్థానికంగా ముగ్గురు డిప్యూటీ ఎలక్ట్రికల్ ఇంజనీర్ స్థాయి అధికారుల సహాయ సహకారాలను తీసుకోవాల్సిందిగా సూచించింది. అన్ని పనులు పూర్తవడంతో సిబ్బందితో పాటు ఫైళ్లు, సామగ్రి కర్నూలుకు తరలివెళ్లాయి.ఏపీఈఆర్సీ ఏం చేస్తుందంటే..విద్యుత్ చట్టంలోని సెక్షన్–86 ద్వారా కమిషన్‌కు పలు విధులను నిర్దేశించారు. అవి ఏమిటంటే.. ⇒ విద్యుత్ ప్రసారం, పంపిణీ, రిటైల్ సరఫరా కార్యకలాపాలు, నిర్వహణను మెరుగుపరిచి, విద్యుత్ చార్జీలను నిర్ణయించడం మండలి లక్ష్యం. ⇒ ఇంట్రా–స్టేట్ ట్రాన్స్‌మిషన్‌లో ఓపెన్ యాక్సెస్‌ను సులభతరం చేయడం, ఇంట్రా–స్టేట్ ట్రేడింగ్, పవర్ మార్కెట్ అభివృద్ధిని ప్రోత్సహించడం, విద్యుత్ అంతర్రాష్ట్ర ప్రసారం, పంపిణీ రిటైల్ సరఫరాలో పోటీ మార్కెట్ల అభివృద్ధికి అవసరమైన సాంకేతిక, సంస్థాగత మార్పులను తీసుకురావడం వంటివి చేయాలి. ⇒ రాష్ట్రంలో పంపిణీ, సరఫరా కోసం విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, విద్యుత్ కొనుగోలు, సేకరణ ప్రక్రియను నియంత్రిస్తుంది. ⇒ రాష్ట్రంలో కార్యకలాపాలకు సంబంధించి ట్రాన్స్మిషన్ లైసెన్సులు, డి్రస్టిబ్యూషన్ లైసెన్సులు, విద్యుత్ వ్యాపారులుగా వ్యవహరించాలనుకునే వారికి లైసెన్స్‌లను జారీచేస్తుంది. ⇒ పునరుత్పాదక శక్తిని ప్రోత్సహించేందుకు మొత్తం విద్యుత్ వినియోగంలో దాని శాతాన్ని నిర్ణయిస్తుంది. ⇒ డిస్కంలు, ఉత్పాదక సంస్థల మధ్యనున్న వివాదాలపై విచారణ జరిపి తీర్పుల ద్వారా పరిష్కరిస్తుంది. ⇒ వినియోగదారుల ప్రయోజనాలను పెంపొందించడంపై ప్రభుత్వానికి సలహాలివ్వడం వంటివి కమిషన్ చేస్తుంది. ⇒ అలాగే, కోస్తా, ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలకు అందుబాటులో ఉండేలా విశాఖపట్నంలో ఇప్పటికే ఏపీఈఆర్సీ క్యాంపు కార్యాలయం గతేడాది ఆగస్టు 18న ప్రారంభమైంది. -
సీజేఐ పరిశీలనకు.. కేజ్రీవాల్ పిటిషన్
న్యూఢిల్లీ: మధ్యంతర బెయిల్ గడువును పొడిగించాలంటూ ఆప్ నేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ వేసిన పిటిషన్‌పై అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఆ పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ పరిశీలనకు పంపించనున్నట్లు వెల్లడించింది. మద్యం కుంభకోణం కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలపై అరెస్టయిన కేజ్రీవాల్‌కు అనారోగ్య కారణాలతో సుప్రీంకోర్టు జూన్ ఒకటో తేదీ వరకు బెయిలిచ్చిన విషయం తెల్సిందే.జూన్ 2వ తేదీన తిహార్ జైలు అధికారుల ఎదుట లొంగిపోవాల్సి ఉంది. మంగళవారం కేజ్రీవాల్ పి టిషన్ వెకేషన్ బెంచ్‌లోని జస్టిస్ మహేశ్వరి, జస్టిస్ విశ్వనాథన్‌ల ముందుకు వచ్చింది. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న కేజ్రీవాల్ కొన్ని అత్యవసర వైద్య పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుందని, బెయిల్ మరో వారం పొడిగించాలంటూ ఆయన తరఫున సీనియర్ లాయర్ అభిషేక్ మనుసింఘ్వి కోరారు. పిటిషన్‌పై బుధవారం విచారణ చేపట్టాలని తెలిపారు. అయితే, ధర్మాసనం ‘వాదనలు విన్నాం. తీర్పు రిజర్వు చేశాం. ఈ పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి ఎదుట ఉంచుతున్నాం’ అని తెలిపింది. -
జనవరి 10 కల్లా తేల్చండి: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: శివసేన పార్టీలోని రెండు వర్గాలు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ పెట్టుకున్న పిటిషన్లపై నిర్ణయం తీసుకునేందుకు మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నర్వేకర్‌కు సుప్రీంకోర్టు గడువు పెంచింది. గతంలో డిసెంబర్ 31వ తేదీలోగా ఏదో ఒకటి తేల్చాలంటూ ఇచ్చిన గడువును తాజాగా మరో 10 రోజులు పొడిగించింది. ‘డిసెంబర్ 20వ తేదీతో అసెంబ్లీ కార్యకలాపాలు ముగుస్తున్నందున, ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకునేందుకు గడువు పొడిగించాలంటూ స్పీకర్ పెట్టుకున్న వినతిని సహేతుకమైందిగా భావిస్తున్నాం. అందుకే, గడువును మరో 10 రోజులపాటు, వచ్చే ఏడాది జనవరి 10వ తేదీ వరకు పొడిగిస్తున్నాం’అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం శుక్రవారం పేర్కొంది. -
సత్యేందర్ జైన్ బెయిల్ గడువు మళ్లీ పొడిగింపు
న్యూఢిల్లీ: మనీల్యాండరింగ్ ఆరోపణలెదుర్కొంటున్న ఢిల్లీ మాజీ మంత్రి సత్యేందర్ జైన్ మధ్యంతర బెయిల్ గడువును సుప్రీంకోర్టు మరోసారి పొడిగించింది. బెయిల్ గడువు శుక్రవారంతో ముగియడంతో జస్టిస్ ఏఎస్ బొపన్న సారథ్యంలోని ధర్మాసనం విచారించాల్సి ఉంది. ఆయన అందుబాటులో లేకపోవడంతో జస్టిస్ బేలా ఎం. త్రివేది బెయిల్ గడువును డిసెంబర్ 4వ తేదీ వరకు పొడిగిస్తూ ఆదేశాలిచ్చారు. జైన్ పెట్టుకున్న రెగ్యులర్ బెయిల్ దరఖాస్తుపై విచారణ కూడా అదే రోజున ఉంటుందని స్పష్టం చేశారు. మనీ ల్యాండరింగ్ ఆరోపణలపై గత ఏడాది మేలో జైన్‌ను ఈడీ అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. -
రూ.2 వేల నోట్ల మార్పిడికి 7 వరకు గడువు
ముంబై: రూ.2 వేల నోట్ల ఉపసంహరణ గడువును రిజర్వ్ బ్యాంక్ మరో వారంపాటు, అక్టోబర్ 7వ తేదీ వరకు పొడిగించింది. మే 19వ తేదీ నుంచి మొదలైన రూ.2 వేల నోట్ల ఉపసంహరణ, మార్పిడి ప్రక్రియలో సెప్టెంబర్ 19వ తేదీ వరకు ప్రజలు రూ. 3.42 లక్షల కోట్ల విలువైన నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేశారని శనివారం ఒక ప్రకటనలో ఆర్బీఐ వెల్లడించింది. దేశంలో మే 19వ తేదీ వరకు చెలామణిలో ఉన్న కరెన్సీలో ఇది 96 శాతానికి సమానమని పేర్కొంది. ప్రస్తుతం రూ.14 వేల కోట్ల విలువైన రూ.2 వేల నోట్లు మాత్రమే చెలామణిలో ఉన్నాయని తెలిపింది. అక్టోబర్ 7వ తేదీ తర్వాత కూడా రూ.2 వేల నోట్ల మార్పిడి చేసుకోవచ్చని, అయితే ఆ అవకాశం దేశవ్యాప్తంగా ఉన్న 19 ఆర్బీఐ కార్యాలయా ల్లో మాత్రమే ఉంటుందని స్పష్టం చేసింది. -
ఆఖరి నిముషంలో ఈ తప్పులొద్దు
పన్ను ఆదా కోసం... పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్, ఎన్ఎస్సీ, పన్ను ఆదా ఎఫ్డీలు, యులిప్‌లు, ఈఎల్ఎస్ఎస్లు... వీటిల్లో ఏది అన్న ఎంపిక అంత సులభం కాదు. మార్చి 31తో పన్ను ఆదా కోసం పెట్టుబడులకు గడువు ముగిసిపోతోంది. ఈ స్వల్ప వ్యవధిలోనే పన్ను ఆదా కోసం ఎంత మేర ఇన్వెస్ట్ చేయాలి, అదే సమయంలో మీరు ఆశించే రాబడులు ఏ పథకంలో వచ్చే అవకాశం ఉంది వంటి అంశాల ఆధారంగా పెట్టుబడి సాధనాలను ఎంచుకోవడం క్లిష్టమైనదే. ప్రస్తుతానికి మీకు పన్ను ఆదా చేయాలి, అదే సమయంలో దీర్ఘకాలంలో మెరుగైన రాబడులు తెచ్చిపెట్టాలి... అప్పుడే మీరు ఎంచుకున్న సాధనం మీకోసం పనిచేసినట్టు అవుతుంది. ఒకటికి మించిన సాధనాలు ఉన్న నేపథ్యంలో కాస్త ముందే మీ ఆదాయం, మీ రిస్క్, మీ రాబడులు, మీ లక్ష్యానికి ఉన్న కాలం ఇలాంటి అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఆర్థిక ప్రణాళిక డిజైన్ చేసుకోవాలి. ముందు నుంచే ఓ పద్ధతి ప్రకారం క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేస్తూ వెళ్లాలని ఆర్థిక నిపుణుల సలహా. ఇన్వెస్టర్లు ముందస్తు ప్రణాళిక లేకుండా, చివరి నిమిషాల్లో చేసే పెట్టుబడుల్లో పొరపాట్లు చేస్తుంటారు. సంపద సృష్టికి ఇవి విఘ్నాలుగా మారకుండా చూసుకోవాలంటే... వీటిని ఫాలో అయిపోతే బెటర్... ఇన్వెస్ట్మెంట్ ప్రణాళిక లేకుండా... ఆర్థిక లక్ష్యాలు, ప్రాధాన్యతలు వ్యక్తికీ, వ్యక్తికీ వేర్వేరుగా ఉంటాయి. వీటికి అనుగుణంగా పెట్టుబడి మొత్తం, అనువైన పన్ను సాధనాలను ఎంచుకోవాలి. కొన్ని పెట్టుబడులపై పన్ను ఆదా ప్రయోజనాన్ని కల్పించేది ప్రజల్ని పొదుపు, మదుపుల దిశగా ప్రోత్సహించేందుకే. ముం దు మీ ఆర్థిక లక్ష్యాలను నిర్ణయించుకున్న తర్వాత, వాటిని చేరుకునేందుకు ఉపయోగపడే సాధనాలను ఎంపిక చేసు కుని ఇన్వెస్ట్ చేస్తూ వెళ్లాలి. అందుకే పెట్టుబడుల ప్రణాళిక అన్నది చాలా జాగ్రత్తగా చేసుకోవా ల్సి ఉంటుందని నిపుణులు సూచిస్తుంటా రు. ఇందులో విఫలమైతే అంచనాలు కూడా తప్పుతాయని మరువద్దు. ఆలస్యం చేయకుండా... ఆర్థిక సంవత్సరం చివరి వరకు పన్ను ఆదా పెట్టుబడుల కోసం వేచి చూడొద్దు. ఎందుకంటే పెట్టుబడి నిర్ణయాలను ఆఖరి సమయంలో హడావుడిగా తీసుకుంటే పెద్ద తప్పులకు దారితీయవచ్చు. ‘‘గడువు సమీపిస్తున్నప్పుడు పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్ ఆరాటపడాల్సి వస్తుంది. సరైన సమయం లేకపోవడంతో వారు తమ లక్ష్యాలు, రిస్క్‌ను విశ్లేషించి, తగిన సాధనాన్ని ఎంచుకోవడం సాధ్యం కాదు’’ అని ఎల్ఐసీ మ్యూచువల్ ఫండ్ ప్రొడక్ట్ హెడ్ లవ్‌కుమార్ తెలిపారు. సరైన సాధనం ఎంచుకోకపోతే... మీ ఆర్థిక లక్ష్యాలను చేరుకునేందుకు సరిపడని ఏ పెట్టుబడి అయినా మీ ఆర్థిక భవిష్యత్తును అంధకారంలోకి నెట్టే ప్రమాదం ఉంటుంది. ఇక సెక్షన్ 80సీ కింద పన్ను ఆదా కోసం ఎంపిక చేసుకున్న సాధనంలో, గడువు తీరిన తర్వాత వచ్చే మెచ్యూరిటీ మొత్తంపై పన్ను ఉంటే అది నష్టాన్ని కలిగిస్తుంది. మీరు పొదుపు చేసిన దానితో పోలిస్తే భారీగా పన్ను చెల్లించాల్సి వస్తుంది. అత్యవసర నిధి జోలికెళ్లొద్దు... ఇక పన్ను ఆదా సాధనాల కోసం చేతుల్లో తగినంత లేక అత్యవసరాల కోసం పక్కన పెట్టిన నిధిని వాడుకునేవారూ ఉన్నారు. ఇలా చేస్తే గనుక ఆ తర్వాత ప్రాణావసరం ఎదురైతే చేతిలో చిల్లిగవ్వ కూడా ఉండని పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది. పన్ను ఆదా పథకాలన్నీ కూడా దీర్ఘకాలానికి ఉద్దేశించినవే. పైగా వీటిల్లో పెట్టుబడులకు మూడేళ్లు, ఆపైనే లాకిన్ పీరియడ్ కూడా ఉంటుంది. దీంతో అత్యవసర పరిస్థితుల్లో నిధుల కొరత ఏర్పడుతుంది. దీంతో రుణాలను ఆశ్రయించాల్సి రావచ్చు. ఇదే జరిగితే మీ ఆర్థిక ప్రణాళిక మరింత ఒత్తిడిలోకి వెళ్లినట్టే అవుతుంది. తొందరపాటుతో అధిక రిస్క్ ఆర్థిక సంవత్సరం చివర్లో పన్ను ఆదా చేసుకోవాలన్న తొం దర్లో మీ స్థాయికి మించిన రిస్క్ ఉండే సాధనంలో ఇన్వెస్ట్ చేశారనుకోండి... అప్పుడు మీ పెట్టుబడిలో గణనీయ మొత్తాన్ని కూడా కోల్పోయే ప్రమాదం ఉంటుంది. మార్కె ట్ అస్థిరతల భయంతో లాకిన్ తీరిన వెంటనే పెట్టుబడులు వెనక్కి తీసుకుంటే ఇదే జరిగే అవకాశం ఉంటుంది. మొత్తం ఒకేసారి... రిస్కీ సాధనంలో ఏక మొత్తంలో ఒకేసారి పెట్టుబడి పెట్టడం వల్ల, క్రమానుగత పెట్టుబడులతో పోలిస్తే మరింత రిస్క్ తీసుకున్నట్టు అవుతుంది. ఈక్విటీ మార్కెట్ ఆధారిత సాధనాల్లో ఒకేసారి కాకుండా సిప్ రూపంలో క్రమానుగతంగా ఇన్వెస్ట్ చేసుకోవడమే సరైనది. దీనివల్ల కొనుగోలు ధర యావరేజ్ అవుతుంది. దీంతో రిస్క్ తగ్గుతుంది. ఇక సమయం లేక, ఆర్థిక సంవత్సరం చివరి మాసంలో ఉంటే ఒకేసారి ఇన్వెస్ట్ చేయడం తప్ప మరో పరిష్కారం లేదు. గతమూ కొలమానమే పెట్టుబడి పెట్టే ముందు సంబంధిత పథకాలు అంతకుముందు కాలంలో ఏ విధంగా రాబడులు ఇచ్చాయన్న అధ్యయనం తప్పకుండా చేయాలి. అలా చూసినప్పుడు మీ ఆర్థిక లక్ష్యాలకు సరిపడే పథకాలను ఎంచుకోవడం సాధ్యపడుతుంది. అంతేకాదు రిస్క్‌ను కూడా తగ్గించుకున్న వారవుతారు. అయితే, మ్యూచువల్ ఫండ్స్ పథకాల గత పనితీరు ఓ అంచనా కోసమే గానీ, వాటిపైనే పూర్తిగా ఆధారపడడం కూడా సరికాదంటున్నారు నిపుణులు. ఉదాహరణకు ఓ మ్యూచువల్ ఫండ్ పథకాన్ని ఎంచుకునే ముందు మార్కెట్ పతనాల్లో సంబంధిత ఫండ్ మేనేజర్ ఏ విధంగా వ్యవహరించారు, అదే సమయంలో మార్కెట్ ర్యాలీల్లో ఎంత మేర ఆల్ఫా రిటర్నులు తీసుకొచ్చారన్నది పరిశీలించడం మంచిదేనని లవ్‌కుమార్ తెలిపారు. డైవర్సిఫికేషన్ లేకుండా... ఇక పన్ను ఆదా కోసమని మొత్తం పెట్టుబడులన్నింటినీ ఒకే సాధనంలో ఇన్వెస్ట్ చేయడం కూడా సరైనది కాదు. ఉదాహరణకు సెక్షన్80సీ కింద రూ.1.5 లక్షల మొత్తాన్ని ఈఎల్ఎస్ఎస్ పథకాల్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల రిస్క్ ఎక్కువగా తీసుకున్నట్టు అవుతుంది. దీనికంటే ప్రతీ సాధనంలోని సదుపాయాలను పరిశీలించి భిన్న సాధనాలతో కూడిన వైవిధ్యం ఉండేలా చూసుకోవాలి. ఇక ఈఎల్ఎస్ఎస్ పథకాల విషయంలో గ్రోత్ ఆప్షన్‌కు బదులు డివిడెండ్ ఆప్షన్‌ను ఎంచుకోవడం దీర్ఘకాలంలో సంపద సృష్టికి విరుద్ధమని, అలాగే, క్లోజ్ ఎండెడ్ పథకాలు కూడా సూచనీయం కాదన్నది నిపుణుల విశ్లేషణ. సమీక్ష మీ కుటుంబ సభ్యుల సంఖ్య పెరగొచ్చు... లేదా ఆదాయం పెరగొచ్చు... ఇటువంటి మార్పులకు అనుగుణంగా ఆర్థిక ప్రణాళిక కూడా మారాలి. అలా కాకుండా పాత ప్రణాళికనే పాటిస్తుండడం వల్ల చాలా ఆర్థిక లక్ష్యాలకు దూరంగా ఉండిపోవాల్సి రావచ్చు. పర్యవేక్షణ పెట్టుబడులు పెట్టేయడంతో పనైపోదు. మీ పెట్టుబడులను క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తూ ఉండాలి. మీ లక్ష్యాలను చేరుకునే దిశగానే వాటి రాబడులు ఉన్నాయా అన్నది పరిశీలించాలి. వాటి పనితీరు ఆధారంగా అవసరమైతే అదనంగా పెట్టుబడి పెంచుకోవడం లేదా ఉన్న వాటిల్లో తొలగింపులు చేసుకోవాల్సి ఉంటుంది. ‘‘తప్పులను తగ్గించుకునేందుకు ఇన్వెస్టర్లు ఓపిక వహించాలి. అనుకున్న దానికి వ్యతిరేకంగా ఉన్నా సరే. ఇతరులను అనుసరించొద్దు. భావోద్వేగాలతో కూడిన ఇన్వెస్టింగ్ నష్టాలకు దారితీస్తుంది’’ అని లవ్‌కుమార్ సూచించారు. ‘‘ఎక్కువ మంది ఈఎల్ఎస్ఎస్ పథకాల విషయంలో చేసే తప్పిదం జనవరి/ఫిబ్రవరి వరకు వేచి ఉండడమే. హెచ్ఆర్ విభాగం అడిగిన తర్వాతే పన్ను ఆదా పథకాల గురించి అన్వేషణ మొదలవుతుంది. చక్కని ప్రణాళికతో కూడిన సిప్... చివరి నిమిషాల్లో ఇబ్బందులను తప్పించడంతోపాటు మంచి రాబడులు ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది’’ – ప్రసన్న పాఠక్, టారస్ అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఫండ్ మేనేజర్ -
50 వేల కోట్ల బ్లాక్‌మనీ!
-
50 వేల కోట్ల బ్లాక్‌మనీ!
న్యూఢిల్లీ: స్వచ్ఛంద ఆదాయ వెల్లడి పథకం గడువు శుక్రవారంతో ముగిసింది. చివరిరోజు కావడంతో అనేక మంది పెద్దఎత్తున తమ బ్లాక్‌మనీని వెల్లడించారు. మొత్తమ్మీద దేశవ్యాప్తంగా రూ.40 వేల కోట్ల నుంచి రూ.50 వేల కోట్ల నల్లధనం వెలుగుచూసే అవకాశం ఉన్నట్లు సీబీడీటీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. చివరిరోజున ఢిల్లీలోని ఐటీ కార్యాలయాలైన సెంట్రల్ రెవెన్యూ బిల్డింగ్, సివిక్ సెంటర్లకు పలువురు లాయర్లు, చార్టెడ్ అకౌంటెంట్లు వచ్చారు. వారి సంస్థలు, యజమానుల తాలూకు నల్లధనం వివరాలను కార్యాలయాల్లో అందించారు.