ఆఖరి నిముషంలో ఈ తప్పులొద్దు | Best Tax Saving Investment option under Sec 80C | Sakshi
Sakshi News home page

ఆఖరి నిముషంలో ఈ తప్పులొద్దు

Published Mon, Mar 25 2019 4:25 AM | Last Updated on Mon, Mar 25 2019 5:20 AM

Best Tax Saving Investment option under Sec 80C - Sakshi

పన్ను ఆదా కోసం... పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన, నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్, ఎన్‌ఎస్‌సీ, పన్ను ఆదా ఎఫ్‌డీలు, యులిప్‌లు, ఈఎల్‌ఎస్‌ఎస్‌లు... వీటిల్లో ఏది అన్న ఎంపిక అంత సులభం కాదు. మార్చి 31తో పన్ను ఆదా కోసం పెట్టుబడులకు గడువు ముగిసిపోతోంది. ఈ స్వల్ప వ్యవధిలోనే పన్ను ఆదా కోసం ఎంత మేర ఇన్వెస్ట్‌ చేయాలి, అదే సమయంలో మీరు ఆశించే రాబడులు ఏ పథకంలో వచ్చే అవకాశం ఉంది వంటి అంశాల ఆధారంగా పెట్టుబడి సాధనాలను ఎంచుకోవడం క్లిష్టమైనదే.

ప్రస్తుతానికి మీకు పన్ను ఆదా చేయాలి, అదే సమయంలో దీర్ఘకాలంలో మెరుగైన రాబడులు తెచ్చిపెట్టాలి... అప్పుడే మీరు ఎంచుకున్న సాధనం మీకోసం పనిచేసినట్టు అవుతుంది. ఒకటికి మించిన సాధనాలు ఉన్న నేపథ్యంలో కాస్త ముందే మీ ఆదాయం, మీ రిస్క్, మీ రాబడులు, మీ లక్ష్యానికి ఉన్న కాలం ఇలాంటి అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఆర్థిక ప్రణాళిక డిజైన్‌ చేసుకోవాలి. ముందు నుంచే ఓ పద్ధతి ప్రకారం క్రమం తప్పకుండా ఇన్వెస్ట్‌ చేస్తూ వెళ్లాలని ఆర్థిక నిపుణుల సలహా. ఇన్వెస్టర్లు ముందస్తు ప్రణాళిక లేకుండా, చివరి నిమిషాల్లో చేసే పెట్టుబడుల్లో పొరపాట్లు చేస్తుంటారు. సంపద సృష్టికి ఇవి విఘ్నాలుగా మారకుండా చూసుకోవాలంటే... వీటిని ఫాలో అయిపోతే బెటర్‌...

ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రణాళిక లేకుండా...
ఆర్థిక లక్ష్యాలు, ప్రాధాన్యతలు వ్యక్తికీ, వ్యక్తికీ వేర్వేరుగా ఉంటాయి. వీటికి అనుగుణంగా పెట్టుబడి మొత్తం, అనువైన పన్ను సాధనాలను ఎంచుకోవాలి. కొన్ని పెట్టుబడులపై పన్ను ఆదా ప్రయోజనాన్ని కల్పించేది ప్రజల్ని పొదుపు, మదుపుల దిశగా ప్రోత్సహించేందుకే. ముం దు మీ ఆర్థిక లక్ష్యాలను నిర్ణయించుకున్న తర్వాత, వాటిని చేరుకునేందుకు ఉపయోగపడే సాధనాలను ఎంపిక చేసు కుని ఇన్వెస్ట్‌ చేస్తూ వెళ్లాలి. అందుకే పెట్టుబడుల ప్రణాళిక అన్నది చాలా జాగ్రత్తగా చేసుకోవా ల్సి ఉంటుందని నిపుణులు సూచిస్తుంటా రు. ఇందులో విఫలమైతే అంచనాలు కూడా తప్పుతాయని మరువద్దు.  

ఆలస్యం చేయకుండా...
ఆర్థిక సంవత్సరం చివరి వరకు పన్ను ఆదా పెట్టుబడుల కోసం వేచి చూడొద్దు. ఎందుకంటే పెట్టుబడి నిర్ణయాలను ఆఖరి సమయంలో హడావుడిగా తీసుకుంటే పెద్ద తప్పులకు దారితీయవచ్చు. ‘‘గడువు సమీపిస్తున్నప్పుడు పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్‌ ఆరాటపడాల్సి వస్తుంది. సరైన సమయం లేకపోవడంతో వారు తమ లక్ష్యాలు, రిస్క్‌ను విశ్లేషించి, తగిన సాధనాన్ని ఎంచుకోవడం సాధ్యం కాదు’’ అని ఎల్‌ఐసీ మ్యూచువల్‌ ఫండ్‌ ప్రొడక్ట్‌ హెడ్‌ లవ్‌కుమార్‌ తెలిపారు.  

సరైన సాధనం ఎంచుకోకపోతే...
మీ ఆర్థిక లక్ష్యాలను చేరుకునేందుకు సరిపడని ఏ పెట్టుబడి అయినా మీ ఆర్థిక భవిష్యత్తును అంధకారంలోకి నెట్టే ప్రమాదం ఉంటుంది. ఇక సెక్షన్‌ 80సీ కింద పన్ను ఆదా కోసం ఎంపిక చేసుకున్న సాధనంలో, గడువు తీరిన తర్వాత వచ్చే మెచ్యూరిటీ మొత్తంపై పన్ను ఉంటే అది నష్టాన్ని కలిగిస్తుంది. మీరు పొదుపు చేసిన దానితో పోలిస్తే భారీగా పన్ను చెల్లించాల్సి వస్తుంది.

అత్యవసర నిధి జోలికెళ్లొద్దు...
ఇక పన్ను ఆదా సాధనాల కోసం చేతుల్లో తగినంత లేక అత్యవసరాల కోసం పక్కన పెట్టిన నిధిని వాడుకునేవారూ ఉన్నారు. ఇలా చేస్తే గనుక ఆ తర్వాత ప్రాణావసరం ఎదురైతే చేతిలో చిల్లిగవ్వ కూడా ఉండని పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది. పన్ను ఆదా పథకాలన్నీ కూడా దీర్ఘకాలానికి ఉద్దేశించినవే. పైగా వీటిల్లో పెట్టుబడులకు మూడేళ్లు, ఆపైనే లాకిన్‌ పీరియడ్‌ కూడా ఉంటుంది. దీంతో అత్యవసర పరిస్థితుల్లో నిధుల కొరత ఏర్పడుతుంది. దీంతో రుణాలను ఆశ్రయించాల్సి రావచ్చు. ఇదే జరిగితే మీ ఆర్థిక ప్రణాళిక మరింత ఒత్తిడిలోకి వెళ్లినట్టే అవుతుంది.  

తొందరపాటుతో అధిక రిస్క్‌
ఆర్థిక సంవత్సరం చివర్లో పన్ను ఆదా చేసుకోవాలన్న తొం దర్లో మీ స్థాయికి మించిన రిస్క్‌ ఉండే సాధనంలో ఇన్వెస్ట్‌ చేశారనుకోండి... అప్పుడు మీ పెట్టుబడిలో గణనీయ మొత్తాన్ని కూడా కోల్పోయే ప్రమాదం ఉంటుంది. మార్కె ట్‌ అస్థిరతల భయంతో లాకిన్‌ తీరిన వెంటనే పెట్టుబడులు వెనక్కి తీసుకుంటే ఇదే జరిగే అవకాశం ఉంటుంది.  

మొత్తం ఒకేసారి...
రిస్కీ సాధనంలో ఏక మొత్తంలో ఒకేసారి పెట్టుబడి పెట్టడం వల్ల, క్రమానుగత పెట్టుబడులతో పోలిస్తే మరింత రిస్క్‌ తీసుకున్నట్టు అవుతుంది. ఈక్విటీ మార్కెట్‌ ఆధారిత సాధనాల్లో ఒకేసారి కాకుండా సిప్‌ రూపంలో క్రమానుగతంగా ఇన్వెస్ట్‌ చేసుకోవడమే సరైనది. దీనివల్ల కొనుగోలు ధర యావరేజ్‌ అవుతుంది. దీంతో రిస్క్‌ తగ్గుతుంది. ఇక సమయం లేక, ఆర్థిక సంవత్సరం చివరి మాసంలో ఉంటే ఒకేసారి ఇన్వెస్ట్‌ చేయడం తప్ప మరో పరిష్కారం లేదు.

గతమూ కొలమానమే
పెట్టుబడి పెట్టే ముందు సంబంధిత పథకాలు అంతకుముందు కాలంలో ఏ విధంగా రాబడులు ఇచ్చాయన్న అధ్యయనం తప్పకుండా చేయాలి. అలా చూసినప్పుడు మీ ఆర్థిక లక్ష్యాలకు సరిపడే పథకాలను ఎంచుకోవడం సాధ్యపడుతుంది. అంతేకాదు రిస్క్‌ను కూడా తగ్గించుకున్న వారవుతారు. అయితే, మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాల గత పనితీరు ఓ అంచనా కోసమే గానీ, వాటిపైనే పూర్తిగా ఆధారపడడం కూడా సరికాదంటున్నారు నిపుణులు. ఉదాహరణకు ఓ మ్యూచువల్‌ ఫండ్‌ పథకాన్ని ఎంచుకునే ముందు మార్కెట్‌ పతనాల్లో సంబంధిత ఫండ్‌ మేనేజర్‌ ఏ విధంగా వ్యవహరించారు, అదే సమయంలో మార్కెట్‌ ర్యాలీల్లో ఎంత మేర ఆల్ఫా రిటర్నులు తీసుకొచ్చారన్నది పరిశీలించడం మంచిదేనని లవ్‌కుమార్‌ తెలిపారు.

డైవర్సిఫికేషన్‌ లేకుండా...
ఇక పన్ను ఆదా కోసమని మొత్తం పెట్టుబడులన్నింటినీ ఒకే సాధనంలో ఇన్వెస్ట్‌ చేయడం కూడా సరైనది కాదు. ఉదాహరణకు సెక్షన్‌80సీ కింద రూ.1.5 లక్షల మొత్తాన్ని ఈఎల్‌ఎస్‌ఎస్‌ పథకాల్లో ఇన్వెస్ట్‌ చేయడం వల్ల రిస్క్‌ ఎక్కువగా తీసుకున్నట్టు అవుతుంది. దీనికంటే ప్రతీ సాధనంలోని సదుపాయాలను పరిశీలించి భిన్న సాధనాలతో కూడిన వైవిధ్యం ఉండేలా చూసుకోవాలి.  ఇక ఈఎల్‌ఎస్‌ఎస్‌ పథకాల విషయంలో గ్రోత్‌ ఆప్షన్‌కు బదులు డివిడెండ్‌ ఆప్షన్‌ను ఎంచుకోవడం దీర్ఘకాలంలో సంపద సృష్టికి విరుద్ధమని, అలాగే, క్లోజ్‌ ఎండెడ్‌ పథకాలు కూడా సూచనీయం కాదన్నది నిపుణుల విశ్లేషణ.

సమీక్ష
మీ కుటుంబ సభ్యుల సంఖ్య పెరగొచ్చు... లేదా ఆదాయం పెరగొచ్చు... ఇటువంటి మార్పులకు అనుగుణంగా ఆర్థిక ప్రణాళిక కూడా మారాలి. అలా కాకుండా పాత ప్రణాళికనే పాటిస్తుండడం వల్ల చాలా ఆర్థిక లక్ష్యాలకు దూరంగా ఉండిపోవాల్సి రావచ్చు.

పర్యవేక్షణ
పెట్టుబడులు పెట్టేయడంతో పనైపోదు. మీ పెట్టుబడులను క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తూ ఉండాలి. మీ లక్ష్యాలను చేరుకునే దిశగానే వాటి రాబడులు ఉన్నాయా అన్నది పరిశీలించాలి. వాటి పనితీరు ఆధారంగా అవసరమైతే అదనంగా పెట్టుబడి పెంచుకోవడం లేదా ఉన్న వాటిల్లో తొలగింపులు చేసుకోవాల్సి ఉంటుంది. ‘‘తప్పులను తగ్గించుకునేందుకు ఇన్వెస్టర్లు ఓపిక వహించాలి. అనుకున్న దానికి వ్యతిరేకంగా ఉన్నా సరే. ఇతరులను అనుసరించొద్దు. భావోద్వేగాలతో కూడిన ఇన్వెస్టింగ్‌ నష్టాలకు దారితీస్తుంది’’ అని లవ్‌కుమార్‌ సూచించారు.

‘‘ఎక్కువ మంది ఈఎల్‌ఎస్‌ఎస్‌ పథకాల విషయంలో చేసే తప్పిదం జనవరి/ఫిబ్రవరి వరకు వేచి ఉండడమే. హెచ్‌ఆర్‌ విభాగం అడిగిన తర్వాతే పన్ను ఆదా పథకాల గురించి అన్వేషణ మొదలవుతుంది. చక్కని ప్రణాళికతో కూడిన సిప్‌... చివరి నిమిషాల్లో ఇబ్బందులను తప్పించడంతోపాటు మంచి రాబడులు ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది’’  
– ప్రసన్న పాఠక్, టారస్‌ అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ ఫండ్‌ మేనేజర్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement