అటు రాబడి... ఇటు భద్రత | Best mutual fund SIP portfolios to invest in 2020 | Sakshi
Sakshi News home page

అటు రాబడి... ఇటు భద్రత

Published Mon, Jun 1 2020 5:04 AM | Last Updated on Mon, Jun 1 2020 8:07 AM

Best mutual fund SIP portfolios to invest in 2020 - Sakshi

వడ్డీ రేట్లు అంతకంతకూ తగ్గిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో రాబడుల కోసం నూరు శాతం రిస్క్‌ తీసుకోవడం సూచనీయం కాదు. రాబడులు తక్కువే ఉన్నా ప్రతి ఒక్కరి పెట్టుబడుల పోర్ట్‌ఫోలియోలో డెట్‌ సాధనాలకూ(స్థిరాదాయ పథకాలు) తప్పకుండా చోటు ఉండాలి. ఈక్విటీలు దీర్ఘకాలంలో అధిక రాబడులను ఇచ్చిన చరిత్ర ఉన్నప్పటికీ.. గడిచిన మూడేళ్ల కాలంలో చూసుకుంటే అధిక శాతం ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌లో రాబడులు ప్రతికూలంగా ఉన్నాయి. కనుక డెట్‌ సాధనాలను ఎంత మాత్రం విస్మరించలేము. మరి డెట్‌ విభాగంలో పెట్టుబడులకు ఏది ఉత్తమమైన ఎంపిక? అన్న సందిగ్ధత ఉంటే.. ఈ గణాంకాలను పరిశీలిస్తే ఆ విషయమై స్పష్టత వస్తుంది.   

బ్యాంకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు
ఐదేళ్ల ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌పై ఎస్‌బీఐ 5.70 శాతం వార్షిక వడ్డీని ఆఫర్‌ చేస్తోంది. సీనియర్‌ సిటిజన్లకు (వృద్ధులకు) 6.50 శాతంగా ఉంది. 20 శాతం పన్ను శ్లాబులో ఉన్న వృద్ధులకు నికరంగా మిగిలే రాబడి 5.15 శాతం కాగా, ఇతరులకు ఇది 4.51 శాతంగా ఉంది. అదే 30 శాతం శ్లాబు పరిధిలో ఉన్న వృద్ధులకు నికర రాబడి 4.47 శాతం అయితే, ఇతరులకు 3.92 శాతం రాబడి లభిస్తుంది. పన్ను రేటు సెస్సులతో కలిపి గణించడం జరిగింది.  

పన్ను ప్రయోజనాలు: సెక్షన్‌ 80సీ ప్రయోజనం లేదు. అందుకునే రాబడి కూడా పన్ను పరిధిలోకి వస్తుంది.  
అనుకూలం: ఎప్పుడు కోరుకుంటే అప్పుడు డిపాజిట్‌ను రద్దు చేసుకుని వెనక్కి తీసేసుకోవచ్చు.  
ప్రతికూలం: అధిక పన్ను పరిధిలో ఉన్న వారికి పన్ను చెల్లించగా మిగిలేది చాలా తక్కువే.  
ఎవరికి అనుకూలం?: కోరుకున్నప్పుడు వెంటనే డబ్బులు తీసుకునే వీలుండాలని అనుకునేవారికి.  
 
పన్ను ఆదా ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌
బ్యాంకులు పన్ను ఆదా ప్రయోజనంతో కూడిన ఐదేళ్ల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను ఆఫర్‌ చేస్తున్నాయి. ఎస్‌బీఐలో పన్ను ఆదా ఎఫ్‌డీని పరిగణనలోకి తీసుకుంటే వృద్ధులకు 6.50 శాతం, ఇతరులకు 5.70 శాతం వడ్డీ రేటు అమల్లో ఉంది. సెక్షన్‌ 80సీ ప్రయోజనాన్ని వినియోగించుకుంటే 20 శాతం పన్ను పరిధిలోని వృద్ధులకు నికర రాబడి 6.50 శాతంగాను, ఇతరులకు 5.70 శాతంగాను ఉంటుంది. 
 
పన్ను ప్రయోజనం: ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.50 లక్షల వరకు పెట్టుబడిపై సెక్షన్‌ 80సీ కింద పన్ను మినహాయింపును క్లెయిమ్‌ చేసుకోవచ్చు. రాబడిపై పన్ను పడుతుంది.   
అనుకూలం: సెక్షన్‌ 80సీ కింద పన్ను ఆదా ప్రయోజనం.
ప్రతికూలం: ఐదేళ్ల లాకిన్‌తో వస్తుంది. కనుక ఆ తర్వాతే ఇన్వెస్ట్‌మెంట్‌ మొత్తాన్ని వెనక్కి తీసుకునే వీలుంటుంది.  
ఎవరికి అనుకూలం?: పన్ను ఆదా కోసం బ్యాంకుల్లోనే ఇన్వెస్ట్‌ చేసుకుంటాననే వారికి.
నోట్‌: చిన్న బ్యాంకులు అధిక రాబడులను ఆఫర్‌ చేస్తున్నాయి. రిస్క్‌ తీసుకునే వారు వాటిని పరిశీలించొచ్చు.

సుకన్య సమృద్ధి యోజన
ప్రస్తుతం వడ్డీ రేటు 7.60 శాతం. పెట్టుబడులపై సెక్షన్‌ 80సీ పన్ను ప్రయోజనాన్ని వినియోగించుకుంటే 20 శాతం, 30 శాతం పన్ను పరిధిలోని వారికి నికర రాబడి 7.60 శాతంగానే ఉంటుంది.  

పన్ను ప్రయోజనాలు: ఈ పథకంలో పెట్టుబడులకు సెక్షన్‌ 80సీ కింద పన్ను మినహాయింపు ఉంది. రాబడిపై పన్ను పడుతుంది.  
అనుకూలం: అధిక వడ్డీ రేటు, ఎటువంటి రిస్క్‌ లేకపోవడం.
పరిమితులు: గరిష్టంగా ఇద్దరు కుమార్తెల పేరిట తల్లిదండ్రులు మాత్రమే ఈ ఖాతాను తెరిచేందుకు ఉంటుంది. ఒక ఏడాదిలో గరిష్టంగా రూ.1.5 లక్షల వరకే ఇన్వెస్ట్‌ చేసుకునే పరిమితి ఉంటుంది. కుమార్తె విద్యా, వివాహ అవసరాలకు ఉపయోగపడుతుంది.

పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌
ప్రస్తుత రేటు 7.10 శాతం.  

పన్ను ప్రయోజనాలు: పెట్టుబడులకు సెక్షన్‌ 80సీ ప్రయోజనాలు వర్తిస్తాయి. రాబడిపైనా పన్ను ఉండదు.  
అనుకూలతలు: పన్ను లేని అధిక రాబడి రేటు. రిస్క్‌ ఉండదు.  
పరిమితులు: 15 ఏళ్ల పథకం. ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా రూ.1.5 లక్షల వరకే ఇన్వెస్ట్‌ చేసుకోగలరు.
రాబడులు: సెక్షన్‌ 80సీ పన్ను ఆదాను కలిపి చూసుకుంటే 20% పన్ను పరిధిలోని వారికి నికర రాబడి రేటు 8.96 శాతం, 30% పన్ను పరిధిలోని వారికి ఇది 10.32 శాతం.
ఎవరికి?: పన్ను పరిధిలోని వ్యక్తుల దీర్ఘకాల అవసరాలకు.

సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్స్‌ స్కీమ్‌
ప్రస్తుతం అమల్లో ఉన్న వడ్డీ రేటు 7.40%. 20% పన్ను పరిధిలోని వారికి 5.86%, 30% పన్ను పరిధిలోని వారికి నికర రాబడి రేటు 5.09 శాతంగాను ఉంటుంది. సెక్షన్‌ 80సీ ప్రయోజనాన్ని వినియోగిం చుకుంటే 20 % పన్ను శ్లాబులోని వారికి నికర రాబడి రేటు 7.40%గానే ఉంటుంది.  

పన్ను ప్రయోజనం: సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్స్‌ స్కీమ్‌లో చేసే పెట్టుబడులను సెక్షన్‌ 80సీ కింద చూపించి పన్ను ఆదా పొందొచ్చు. వడ్డీ ఆదాయం మాత్రం పన్ను పరిధిలోకి వస్తుంది.  
అనుకూలం: అధిక వడ్డీ రేటుతోపాటు రిస్క్‌ అస్సలు ఉండదు.  
పరిమితులు: 60 ఏళ్లు పైబడిన వారికే పరిమితం. గరిష్ట పెట్టుబడి రూ.15 లక్షల వరకే. ఐదేళ్ల లాకిన్‌ అమలవుతుంది.  

నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్స్‌
ఇందులో ఆఫర్‌ చేస్తున్న ప్రస్తుత వడ్డీ రేటు 6.80%.  

పన్ను ప్రయోజనాలు: సెక్షన్‌ 80సీ పన్ను ఆదాకు అర్హత ఉంది. వడ్డీ రాబడిపై పన్ను ఉంటుంది.  
అనుకూలం: ఎటువంటి రిస్క్‌ లేకపోవడం.
ప్రతికూలం: ఐదేళ్ల లాకిన్‌ అమలవుతుంది.
రాబడులు: 20% పన్ను పరిధిలో ఉన్న వారికి పన్ను పోను నికర రాబడి 5.39 శాతం. 30% పన్ను పరిధిలోని వారికి నికర రాబడి 4.68 %.  
ఎవరికి?: రిస్క్‌ వద్దనుకునే వారు పరిశీలించదగినది.  

డెట్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌
ఇందులో రిస్క్‌ లేని రెండు విభాగాలు లిక్విడ్‌ ఫండ్స్, ఓవర్‌నైట్‌ ఫండ్స్‌ను తీసుకుంటే.. లిక్విడ్‌ ఫండ్స్‌లో రాబడులు వార్షికంగా 5.58% వరకు ఉంటాయి. ఓవర్‌నైట్‌ ఫండ్స్‌లో 4.70% వరకు ఉండొచ్చు.  

పన్ను ప్రయోజనాలు: ఇందులో పెట్టుబడులకు, రాబడులు ఎటువంటి
పన్ను ప్రయోజనాల్లేవు.  
అనుకూలతలు: ఎటువంటి లాకిన్‌ ఉండదు. అవసరమైనప్పుడు వేగంగా ఉపసంహరించుకోవచ్చు.  
ప్రతికూలతలు: భవిష్యత్తులో వడ్డీ రేట్లు తగ్గే అవకాశం ఉన్న నేపథ్యంలో రాబడులు ఇంకా తగ్గొచ్చు.
ఎవరికి?: అధిక లిక్విడిటీ కోరుకునే వారికి.   

వాలంటరీ ప్రావిడెంట్‌ ఫండ్‌
ప్రైవేటు రంగంలోని ఉద్యోగులకు ఈపీఎఫ్‌కు అనుబంధంగా ఇన్వెస్ట్‌ చేసుకునే వీలున్న సాధనం. ఇందులో 2018–19లో అమల్లో ఉన్న రేటు 8.65 శాతం.  

పన్ను ప్రయోజనాలు: ఇందులో పెట్టుబడులకు సెక్షన్‌ 80సీ కింద పన్ను మినహాయింపులు ఉన్నాయి. రాబడిపైనా పన్ను ఉండదు. వీటిని పరిగణనలోకి తీసుకుంటే 20 శాతం శ్లాబులోని వారికి నికర రాబడి రేటు 10.92 శాతంగాను, 30 శాతం పన్ను పరిధిలోని వారికి 12.57 శాతంగాను ఉంటుంది.  
అనుకూలతలు: మార్కెట్‌ కంటే అధిక రాబడులు ఇందులో ఉంటున్నాయి.  
పరిమితులు: ఈపీఎఫ్‌ పరిధిలో ఉన్న వారికే ఇది పరిమితం. అలాగే, ఉపసంహరణలకు పరిమితులు ఉన్నాయి.
ఎవరికి?: రిస్క్‌ రహితంగా దీర్ఘకాలంలో సంపదను సృష్టించుకోవాలని అనుకునే వారికి.  

ఐదేళ్ల కంపెనీ డిపాజిట్‌
కంపెనీలు తమ అవసరాల కోసం వివిధ మార్గాల్లో నిధులను సమీకరిస్తుంటాయి. ఫైనాన్షియల్‌ ఇనిస్టిట్యూషన్స్, ఎన్‌బీఎఫ్‌సీలు డిపాజిట్ల రూపంలో నిధులు సేకరిస్తుంటాయి. వీటిల్లో హెచ్‌డీఎఫ్‌సీ ఆఫర్‌ చేస్తున్న డిపాజిట్‌పై వడ్డీ రేటు పెద్దలకు 7.55 శాతం, ఇతరులకు 7.30 శాతంగా ఉంది. 20 శాతం పన్ను పరిధిలో ఉన్న వృద్ధులకు నికరంగా వచ్చే రాబడి 5.98 శాతం.. ఇతరులకు 5.78%. 30% పన్ను పరిధిలోని వృద్ధులకు నికరంగా అందే రాబడి 5.19%, ఇతరులకు 5.02 శాతంగా ఉంటుంది.  

పన్ను ప్రయోజనాలు: పన్ను ప్రయోజనాలు కంపెనీల
డిపాజిట్లపై ఉండవు.
అనుకూలతలు: బ్యాంకు ఎఫ్‌డీల కంటే అధిక వడ్డీ రేటు లభిస్తుంది.
ప్రతికూలతలు: అధిక రిస్క్‌ ఉంటుంది. ముందస్తుగా డబ్బులను వెనక్కి తీసుకోవాలంటే నియంత్రణలు ఉంటాయి.  
ఎవరికి?: అధిక రిస్క్‌ ఉన్నా ఫర్వాలేదనుకునే వారికి. ఏఏఏ రేటింగ్‌ కలిగిన సంస్థల డిపాజిట్లనే పరిశీలించడం మంచిది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement