Tax savings mutual funds
-
అటు రాబడి... ఇటు భద్రత
వడ్డీ రేట్లు అంతకంతకూ తగ్గిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో రాబడుల కోసం నూరు శాతం రిస్క్ తీసుకోవడం సూచనీయం కాదు. రాబడులు తక్కువే ఉన్నా ప్రతి ఒక్కరి పెట్టుబడుల పోర్ట్‌ఫోలియోలో డెట్ సాధనాలకూ(స్థిరాదాయ పథకాలు) తప్పకుండా చోటు ఉండాలి. ఈక్విటీలు దీర్ఘకాలంలో అధిక రాబడులను ఇచ్చిన చరిత్ర ఉన్నప్పటికీ.. గడిచిన మూడేళ్ల కాలంలో చూసుకుంటే అధిక శాతం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో రాబడులు ప్రతికూలంగా ఉన్నాయి. కనుక డెట్ సాధనాలను ఎంత మాత్రం విస్మరించలేము. మరి డెట్ విభాగంలో పెట్టుబడులకు ఏది ఉత్తమమైన ఎంపిక? అన్న సందిగ్ధత ఉంటే.. ఈ గణాంకాలను పరిశీలిస్తే ఆ విషయమై స్పష్టత వస్తుంది. బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్లు ఐదేళ్ల ఫిక్స్డ్ డిపాజిట్‌పై ఎస్బీఐ 5.70 శాతం వార్షిక వడ్డీని ఆఫర్ చేస్తోంది. సీనియర్ సిటిజన్లకు (వృద్ధులకు) 6.50 శాతంగా ఉంది. 20 శాతం పన్ను శ్లాబులో ఉన్న వృద్ధులకు నికరంగా మిగిలే రాబడి 5.15 శాతం కాగా, ఇతరులకు ఇది 4.51 శాతంగా ఉంది. అదే 30 శాతం శ్లాబు పరిధిలో ఉన్న వృద్ధులకు నికర రాబడి 4.47 శాతం అయితే, ఇతరులకు 3.92 శాతం రాబడి లభిస్తుంది. పన్ను రేటు సెస్సులతో కలిపి గణించడం జరిగింది. పన్ను ప్రయోజనాలు: సెక్షన్ 80సీ ప్రయోజనం లేదు. అందుకునే రాబడి కూడా పన్ను పరిధిలోకి వస్తుంది. అనుకూలం: ఎప్పుడు కోరుకుంటే అప్పుడు డిపాజిట్‌ను రద్దు చేసుకుని వెనక్కి తీసేసుకోవచ్చు. ప్రతికూలం: అధిక పన్ను పరిధిలో ఉన్న వారికి పన్ను చెల్లించగా మిగిలేది చాలా తక్కువే. ఎవరికి అనుకూలం?: కోరుకున్నప్పుడు వెంటనే డబ్బులు తీసుకునే వీలుండాలని అనుకునేవారికి. పన్ను ఆదా ఫిక్స్డ్ డిపాజిట్ బ్యాంకులు పన్ను ఆదా ప్రయోజనంతో కూడిన ఐదేళ్ల ఫిక్స్డ్ డిపాజిట్లను ఆఫర్ చేస్తున్నాయి. ఎస్బీఐలో పన్ను ఆదా ఎఫ్డీని పరిగణనలోకి తీసుకుంటే వృద్ధులకు 6.50 శాతం, ఇతరులకు 5.70 శాతం వడ్డీ రేటు అమల్లో ఉంది. సెక్షన్ 80సీ ప్రయోజనాన్ని వినియోగించుకుంటే 20 శాతం పన్ను పరిధిలోని వృద్ధులకు నికర రాబడి 6.50 శాతంగాను, ఇతరులకు 5.70 శాతంగాను ఉంటుంది. పన్ను ప్రయోజనం: ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.50 లక్షల వరకు పెట్టుబడిపై సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపును క్లెయిమ్ చేసుకోవచ్చు. రాబడిపై పన్ను పడుతుంది. అనుకూలం: సెక్షన్ 80సీ కింద పన్ను ఆదా ప్రయోజనం. ప్రతికూలం: ఐదేళ్ల లాకిన్‌తో వస్తుంది. కనుక ఆ తర్వాతే ఇన్వెస్ట్మెంట్ మొత్తాన్ని వెనక్కి తీసుకునే వీలుంటుంది. ఎవరికి అనుకూలం?: పన్ను ఆదా కోసం బ్యాంకుల్లోనే ఇన్వెస్ట్ చేసుకుంటాననే వారికి. నోట్: చిన్న బ్యాంకులు అధిక రాబడులను ఆఫర్ చేస్తున్నాయి. రిస్క్ తీసుకునే వారు వాటిని పరిశీలించొచ్చు. సుకన్య సమృద్ధి యోజన ప్రస్తుతం వడ్డీ రేటు 7.60 శాతం. పెట్టుబడులపై సెక్షన్ 80సీ పన్ను ప్రయోజనాన్ని వినియోగించుకుంటే 20 శాతం, 30 శాతం పన్ను పరిధిలోని వారికి నికర రాబడి 7.60 శాతంగానే ఉంటుంది. పన్ను ప్రయోజనాలు: ఈ పథకంలో పెట్టుబడులకు సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు ఉంది. రాబడిపై పన్ను పడుతుంది. అనుకూలం: అధిక వడ్డీ రేటు, ఎటువంటి రిస్క్ లేకపోవడం. పరిమితులు: గరిష్టంగా ఇద్దరు కుమార్తెల పేరిట తల్లిదండ్రులు మాత్రమే ఈ ఖాతాను తెరిచేందుకు ఉంటుంది. ఒక ఏడాదిలో గరిష్టంగా రూ.1.5 లక్షల వరకే ఇన్వెస్ట్ చేసుకునే పరిమితి ఉంటుంది. కుమార్తె విద్యా, వివాహ అవసరాలకు ఉపయోగపడుతుంది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ప్రస్తుత రేటు 7.10 శాతం. పన్ను ప్రయోజనాలు: పెట్టుబడులకు సెక్షన్ 80సీ ప్రయోజనాలు వర్తిస్తాయి. రాబడిపైనా పన్ను ఉండదు. అనుకూలతలు: పన్ను లేని అధిక రాబడి రేటు. రిస్క్ ఉండదు. పరిమితులు: 15 ఏళ్ల పథకం. ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా రూ.1.5 లక్షల వరకే ఇన్వెస్ట్ చేసుకోగలరు. రాబడులు: సెక్షన్ 80సీ పన్ను ఆదాను కలిపి చూసుకుంటే 20% పన్ను పరిధిలోని వారికి నికర రాబడి రేటు 8.96 శాతం, 30% పన్ను పరిధిలోని వారికి ఇది 10.32 శాతం. ఎవరికి?: పన్ను పరిధిలోని వ్యక్తుల దీర్ఘకాల అవసరాలకు. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ ప్రస్తుతం అమల్లో ఉన్న వడ్డీ రేటు 7.40%. 20% పన్ను పరిధిలోని వారికి 5.86%, 30% పన్ను పరిధిలోని వారికి నికర రాబడి రేటు 5.09 శాతంగాను ఉంటుంది. సెక్షన్ 80సీ ప్రయోజనాన్ని వినియోగిం చుకుంటే 20 % పన్ను శ్లాబులోని వారికి నికర రాబడి రేటు 7.40%గానే ఉంటుంది. పన్ను ప్రయోజనం: సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌లో చేసే పెట్టుబడులను సెక్షన్ 80సీ కింద చూపించి పన్ను ఆదా పొందొచ్చు. వడ్డీ ఆదాయం మాత్రం పన్ను పరిధిలోకి వస్తుంది. అనుకూలం: అధిక వడ్డీ రేటుతోపాటు రిస్క్ అస్సలు ఉండదు. పరిమితులు: 60 ఏళ్లు పైబడిన వారికే పరిమితం. గరిష్ట పెట్టుబడి రూ.15 లక్షల వరకే. ఐదేళ్ల లాకిన్ అమలవుతుంది. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్స్ ఇందులో ఆఫర్ చేస్తున్న ప్రస్తుత వడ్డీ రేటు 6.80%. పన్ను ప్రయోజనాలు: సెక్షన్ 80సీ పన్ను ఆదాకు అర్హత ఉంది. వడ్డీ రాబడిపై పన్ను ఉంటుంది. అనుకూలం: ఎటువంటి రిస్క్ లేకపోవడం. ప్రతికూలం: ఐదేళ్ల లాకిన్ అమలవుతుంది. రాబడులు: 20% పన్ను పరిధిలో ఉన్న వారికి పన్ను పోను నికర రాబడి 5.39 శాతం. 30% పన్ను పరిధిలోని వారికి నికర రాబడి 4.68 %. ఎవరికి?: రిస్క్ వద్దనుకునే వారు పరిశీలించదగినది. డెట్ మ్యూచువల్ ఫండ్స్ ఇందులో రిస్క్ లేని రెండు విభాగాలు లిక్విడ్ ఫండ్స్, ఓవర్‌నైట్ ఫండ్స్‌ను తీసుకుంటే.. లిక్విడ్ ఫండ్స్‌లో రాబడులు వార్షికంగా 5.58% వరకు ఉంటాయి. ఓవర్‌నైట్ ఫండ్స్‌లో 4.70% వరకు ఉండొచ్చు. పన్ను ప్రయోజనాలు: ఇందులో పెట్టుబడులకు, రాబడులు ఎటువంటి పన్ను ప్రయోజనాల్లేవు. అనుకూలతలు: ఎటువంటి లాకిన్ ఉండదు. అవసరమైనప్పుడు వేగంగా ఉపసంహరించుకోవచ్చు. ప్రతికూలతలు: భవిష్యత్తులో వడ్డీ రేట్లు తగ్గే అవకాశం ఉన్న నేపథ్యంలో రాబడులు ఇంకా తగ్గొచ్చు. ఎవరికి?: అధిక లిక్విడిటీ కోరుకునే వారికి. వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్ ప్రైవేటు రంగంలోని ఉద్యోగులకు ఈపీఎఫ్‌కు అనుబంధంగా ఇన్వెస్ట్ చేసుకునే వీలున్న సాధనం. ఇందులో 2018–19లో అమల్లో ఉన్న రేటు 8.65 శాతం. పన్ను ప్రయోజనాలు: ఇందులో పెట్టుబడులకు సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపులు ఉన్నాయి. రాబడిపైనా పన్ను ఉండదు. వీటిని పరిగణనలోకి తీసుకుంటే 20 శాతం శ్లాబులోని వారికి నికర రాబడి రేటు 10.92 శాతంగాను, 30 శాతం పన్ను పరిధిలోని వారికి 12.57 శాతంగాను ఉంటుంది. అనుకూలతలు: మార్కెట్ కంటే అధిక రాబడులు ఇందులో ఉంటున్నాయి. పరిమితులు: ఈపీఎఫ్ పరిధిలో ఉన్న వారికే ఇది పరిమితం. అలాగే, ఉపసంహరణలకు పరిమితులు ఉన్నాయి. ఎవరికి?: రిస్క్ రహితంగా దీర్ఘకాలంలో సంపదను సృష్టించుకోవాలని అనుకునే వారికి. ఐదేళ్ల కంపెనీ డిపాజిట్ కంపెనీలు తమ అవసరాల కోసం వివిధ మార్గాల్లో నిధులను సమీకరిస్తుంటాయి. ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషన్స్, ఎన్బీఎఫ్సీలు డిపాజిట్ల రూపంలో నిధులు సేకరిస్తుంటాయి. వీటిల్లో హెచ్డీఎఫ్సీ ఆఫర్ చేస్తున్న డిపాజిట్‌పై వడ్డీ రేటు పెద్దలకు 7.55 శాతం, ఇతరులకు 7.30 శాతంగా ఉంది. 20 శాతం పన్ను పరిధిలో ఉన్న వృద్ధులకు నికరంగా వచ్చే రాబడి 5.98 శాతం.. ఇతరులకు 5.78%. 30% పన్ను పరిధిలోని వృద్ధులకు నికరంగా అందే రాబడి 5.19%, ఇతరులకు 5.02 శాతంగా ఉంటుంది. పన్ను ప్రయోజనాలు: పన్ను ప్రయోజనాలు కంపెనీల డిపాజిట్లపై ఉండవు. అనుకూలతలు: బ్యాంకు ఎఫ్‌డీల కంటే అధిక వడ్డీ రేటు లభిస్తుంది. ప్రతికూలతలు: అధిక రిస్క్ ఉంటుంది. ముందస్తుగా డబ్బులను వెనక్కి తీసుకోవాలంటే నియంత్రణలు ఉంటాయి. ఎవరికి?: అధిక రిస్క్ ఉన్నా ఫర్వాలేదనుకునే వారికి. ఏఏఏ రేటింగ్ కలిగిన సంస్థల డిపాజిట్లనే పరిశీలించడం మంచిది. -
ఆఖరి నిముషంలో ఈ తప్పులొద్దు
పన్ను ఆదా కోసం... పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్, ఎన్ఎస్సీ, పన్ను ఆదా ఎఫ్డీలు, యులిప్‌లు, ఈఎల్ఎస్ఎస్లు... వీటిల్లో ఏది అన్న ఎంపిక అంత సులభం కాదు. మార్చి 31తో పన్ను ఆదా కోసం పెట్టుబడులకు గడువు ముగిసిపోతోంది. ఈ స్వల్ప వ్యవధిలోనే పన్ను ఆదా కోసం ఎంత మేర ఇన్వెస్ట్ చేయాలి, అదే సమయంలో మీరు ఆశించే రాబడులు ఏ పథకంలో వచ్చే అవకాశం ఉంది వంటి అంశాల ఆధారంగా పెట్టుబడి సాధనాలను ఎంచుకోవడం క్లిష్టమైనదే. ప్రస్తుతానికి మీకు పన్ను ఆదా చేయాలి, అదే సమయంలో దీర్ఘకాలంలో మెరుగైన రాబడులు తెచ్చిపెట్టాలి... అప్పుడే మీరు ఎంచుకున్న సాధనం మీకోసం పనిచేసినట్టు అవుతుంది. ఒకటికి మించిన సాధనాలు ఉన్న నేపథ్యంలో కాస్త ముందే మీ ఆదాయం, మీ రిస్క్, మీ రాబడులు, మీ లక్ష్యానికి ఉన్న కాలం ఇలాంటి అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఆర్థిక ప్రణాళిక డిజైన్ చేసుకోవాలి. ముందు నుంచే ఓ పద్ధతి ప్రకారం క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేస్తూ వెళ్లాలని ఆర్థిక నిపుణుల సలహా. ఇన్వెస్టర్లు ముందస్తు ప్రణాళిక లేకుండా, చివరి నిమిషాల్లో చేసే పెట్టుబడుల్లో పొరపాట్లు చేస్తుంటారు. సంపద సృష్టికి ఇవి విఘ్నాలుగా మారకుండా చూసుకోవాలంటే... వీటిని ఫాలో అయిపోతే బెటర్... ఇన్వెస్ట్మెంట్ ప్రణాళిక లేకుండా... ఆర్థిక లక్ష్యాలు, ప్రాధాన్యతలు వ్యక్తికీ, వ్యక్తికీ వేర్వేరుగా ఉంటాయి. వీటికి అనుగుణంగా పెట్టుబడి మొత్తం, అనువైన పన్ను సాధనాలను ఎంచుకోవాలి. కొన్ని పెట్టుబడులపై పన్ను ఆదా ప్రయోజనాన్ని కల్పించేది ప్రజల్ని పొదుపు, మదుపుల దిశగా ప్రోత్సహించేందుకే. ముం దు మీ ఆర్థిక లక్ష్యాలను నిర్ణయించుకున్న తర్వాత, వాటిని చేరుకునేందుకు ఉపయోగపడే సాధనాలను ఎంపిక చేసు కుని ఇన్వెస్ట్ చేస్తూ వెళ్లాలి. అందుకే పెట్టుబడుల ప్రణాళిక అన్నది చాలా జాగ్రత్తగా చేసుకోవా ల్సి ఉంటుందని నిపుణులు సూచిస్తుంటా రు. ఇందులో విఫలమైతే అంచనాలు కూడా తప్పుతాయని మరువద్దు. ఆలస్యం చేయకుండా... ఆర్థిక సంవత్సరం చివరి వరకు పన్ను ఆదా పెట్టుబడుల కోసం వేచి చూడొద్దు. ఎందుకంటే పెట్టుబడి నిర్ణయాలను ఆఖరి సమయంలో హడావుడిగా తీసుకుంటే పెద్ద తప్పులకు దారితీయవచ్చు. ‘‘గడువు సమీపిస్తున్నప్పుడు పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్ ఆరాటపడాల్సి వస్తుంది. సరైన సమయం లేకపోవడంతో వారు తమ లక్ష్యాలు, రిస్క్‌ను విశ్లేషించి, తగిన సాధనాన్ని ఎంచుకోవడం సాధ్యం కాదు’’ అని ఎల్ఐసీ మ్యూచువల్ ఫండ్ ప్రొడక్ట్ హెడ్ లవ్‌కుమార్ తెలిపారు. సరైన సాధనం ఎంచుకోకపోతే... మీ ఆర్థిక లక్ష్యాలను చేరుకునేందుకు సరిపడని ఏ పెట్టుబడి అయినా మీ ఆర్థిక భవిష్యత్తును అంధకారంలోకి నెట్టే ప్రమాదం ఉంటుంది. ఇక సెక్షన్ 80సీ కింద పన్ను ఆదా కోసం ఎంపిక చేసుకున్న సాధనంలో, గడువు తీరిన తర్వాత వచ్చే మెచ్యూరిటీ మొత్తంపై పన్ను ఉంటే అది నష్టాన్ని కలిగిస్తుంది. మీరు పొదుపు చేసిన దానితో పోలిస్తే భారీగా పన్ను చెల్లించాల్సి వస్తుంది. అత్యవసర నిధి జోలికెళ్లొద్దు... ఇక పన్ను ఆదా సాధనాల కోసం చేతుల్లో తగినంత లేక అత్యవసరాల కోసం పక్కన పెట్టిన నిధిని వాడుకునేవారూ ఉన్నారు. ఇలా చేస్తే గనుక ఆ తర్వాత ప్రాణావసరం ఎదురైతే చేతిలో చిల్లిగవ్వ కూడా ఉండని పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది. పన్ను ఆదా పథకాలన్నీ కూడా దీర్ఘకాలానికి ఉద్దేశించినవే. పైగా వీటిల్లో పెట్టుబడులకు మూడేళ్లు, ఆపైనే లాకిన్ పీరియడ్ కూడా ఉంటుంది. దీంతో అత్యవసర పరిస్థితుల్లో నిధుల కొరత ఏర్పడుతుంది. దీంతో రుణాలను ఆశ్రయించాల్సి రావచ్చు. ఇదే జరిగితే మీ ఆర్థిక ప్రణాళిక మరింత ఒత్తిడిలోకి వెళ్లినట్టే అవుతుంది. తొందరపాటుతో అధిక రిస్క్ ఆర్థిక సంవత్సరం చివర్లో పన్ను ఆదా చేసుకోవాలన్న తొం దర్లో మీ స్థాయికి మించిన రిస్క్ ఉండే సాధనంలో ఇన్వెస్ట్ చేశారనుకోండి... అప్పుడు మీ పెట్టుబడిలో గణనీయ మొత్తాన్ని కూడా కోల్పోయే ప్రమాదం ఉంటుంది. మార్కె ట్ అస్థిరతల భయంతో లాకిన్ తీరిన వెంటనే పెట్టుబడులు వెనక్కి తీసుకుంటే ఇదే జరిగే అవకాశం ఉంటుంది. మొత్తం ఒకేసారి... రిస్కీ సాధనంలో ఏక మొత్తంలో ఒకేసారి పెట్టుబడి పెట్టడం వల్ల, క్రమానుగత పెట్టుబడులతో పోలిస్తే మరింత రిస్క్ తీసుకున్నట్టు అవుతుంది. ఈక్విటీ మార్కెట్ ఆధారిత సాధనాల్లో ఒకేసారి కాకుండా సిప్ రూపంలో క్రమానుగతంగా ఇన్వెస్ట్ చేసుకోవడమే సరైనది. దీనివల్ల కొనుగోలు ధర యావరేజ్ అవుతుంది. దీంతో రిస్క్ తగ్గుతుంది. ఇక సమయం లేక, ఆర్థిక సంవత్సరం చివరి మాసంలో ఉంటే ఒకేసారి ఇన్వెస్ట్ చేయడం తప్ప మరో పరిష్కారం లేదు. గతమూ కొలమానమే పెట్టుబడి పెట్టే ముందు సంబంధిత పథకాలు అంతకుముందు కాలంలో ఏ విధంగా రాబడులు ఇచ్చాయన్న అధ్యయనం తప్పకుండా చేయాలి. అలా చూసినప్పుడు మీ ఆర్థిక లక్ష్యాలకు సరిపడే పథకాలను ఎంచుకోవడం సాధ్యపడుతుంది. అంతేకాదు రిస్క్‌ను కూడా తగ్గించుకున్న వారవుతారు. అయితే, మ్యూచువల్ ఫండ్స్ పథకాల గత పనితీరు ఓ అంచనా కోసమే గానీ, వాటిపైనే పూర్తిగా ఆధారపడడం కూడా సరికాదంటున్నారు నిపుణులు. ఉదాహరణకు ఓ మ్యూచువల్ ఫండ్ పథకాన్ని ఎంచుకునే ముందు మార్కెట్ పతనాల్లో సంబంధిత ఫండ్ మేనేజర్ ఏ విధంగా వ్యవహరించారు, అదే సమయంలో మార్కెట్ ర్యాలీల్లో ఎంత మేర ఆల్ఫా రిటర్నులు తీసుకొచ్చారన్నది పరిశీలించడం మంచిదేనని లవ్‌కుమార్ తెలిపారు. డైవర్సిఫికేషన్ లేకుండా... ఇక పన్ను ఆదా కోసమని మొత్తం పెట్టుబడులన్నింటినీ ఒకే సాధనంలో ఇన్వెస్ట్ చేయడం కూడా సరైనది కాదు. ఉదాహరణకు సెక్షన్80సీ కింద రూ.1.5 లక్షల మొత్తాన్ని ఈఎల్ఎస్ఎస్ పథకాల్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల రిస్క్ ఎక్కువగా తీసుకున్నట్టు అవుతుంది. దీనికంటే ప్రతీ సాధనంలోని సదుపాయాలను పరిశీలించి భిన్న సాధనాలతో కూడిన వైవిధ్యం ఉండేలా చూసుకోవాలి. ఇక ఈఎల్ఎస్ఎస్ పథకాల విషయంలో గ్రోత్ ఆప్షన్‌కు బదులు డివిడెండ్ ఆప్షన్‌ను ఎంచుకోవడం దీర్ఘకాలంలో సంపద సృష్టికి విరుద్ధమని, అలాగే, క్లోజ్ ఎండెడ్ పథకాలు కూడా సూచనీయం కాదన్నది నిపుణుల విశ్లేషణ. సమీక్ష మీ కుటుంబ సభ్యుల సంఖ్య పెరగొచ్చు... లేదా ఆదాయం పెరగొచ్చు... ఇటువంటి మార్పులకు అనుగుణంగా ఆర్థిక ప్రణాళిక కూడా మారాలి. అలా కాకుండా పాత ప్రణాళికనే పాటిస్తుండడం వల్ల చాలా ఆర్థిక లక్ష్యాలకు దూరంగా ఉండిపోవాల్సి రావచ్చు. పర్యవేక్షణ పెట్టుబడులు పెట్టేయడంతో పనైపోదు. మీ పెట్టుబడులను క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తూ ఉండాలి. మీ లక్ష్యాలను చేరుకునే దిశగానే వాటి రాబడులు ఉన్నాయా అన్నది పరిశీలించాలి. వాటి పనితీరు ఆధారంగా అవసరమైతే అదనంగా పెట్టుబడి పెంచుకోవడం లేదా ఉన్న వాటిల్లో తొలగింపులు చేసుకోవాల్సి ఉంటుంది. ‘‘తప్పులను తగ్గించుకునేందుకు ఇన్వెస్టర్లు ఓపిక వహించాలి. అనుకున్న దానికి వ్యతిరేకంగా ఉన్నా సరే. ఇతరులను అనుసరించొద్దు. భావోద్వేగాలతో కూడిన ఇన్వెస్టింగ్ నష్టాలకు దారితీస్తుంది’’ అని లవ్‌కుమార్ సూచించారు. ‘‘ఎక్కువ మంది ఈఎల్ఎస్ఎస్ పథకాల విషయంలో చేసే తప్పిదం జనవరి/ఫిబ్రవరి వరకు వేచి ఉండడమే. హెచ్ఆర్ విభాగం అడిగిన తర్వాతే పన్ను ఆదా పథకాల గురించి అన్వేషణ మొదలవుతుంది. చక్కని ప్రణాళికతో కూడిన సిప్... చివరి నిమిషాల్లో ఇబ్బందులను తప్పించడంతోపాటు మంచి రాబడులు ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది’’ – ప్రసన్న పాఠక్, టారస్ అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఫండ్ మేనేజర్ -
నెలకు రూ.15,000 పెన్షన్ కావాలంటే..?
గత కొంత కాలం నుంచి యాక్సిస్ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఈ ఫండ్‌కు లాక్ ఇన్ పీరియడ్ మూడేళ్లు. ఈ లాక్ ఇన్ పీరియడ్ పూర్తయిన తర్వాత ఈ ఫండ్‌లో ఇన్వెస్ట్మెంట్స్ కొనసాగించమంటారా ? లేకుంటే ఫండ్ నుంచి వైదొలగమంటారా? తగిన సూచనలివ్వండి? - దేవేందర్, గుంటూరు యాక్సిస్ లాంగ్‌టర్మ్ ఫండ్ వంటి ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్(ఈఎల్ఎస్ఎస్) లేదా ట్యాక్స్ సేవింగ్స్ మ్యూచువల్ ఫండ్స్‌కు తప్పనిసరిగా లాక్ ఇన్ పీరియడ్ మూడేళ్లుగా ఉంటుంది. ఈ లాక్ ఇన్ పీరియడ్ పూర్తయిన తర్వాత ఇన్వెస్టర్లు ఈ ఫండ్ నుంచి తప్పనిసరిగా వైదొలగాల్సిన అవసరం లేదు. ఈ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసిన డబ్బులు మీకు అవసరం లేనంత కాలం, ఈ ఫండ్ పనితీరు సంతృప్తికరంగా ఉన్నంత కాలం మీరు ఫండ్‌లో ఎలాంటి అనుమానాలు లేకుండా కొనసాగవచ్చు. ఐదేళ్ల తర్వాత నాకు నెలకు రూ.15,000 పెన్షన్ కావాలి. ఈ పెన్షన్ కనీసం పదేళ్ల పాటు అందాలి. ఇలా పొందాలంటే నేను ఏ స్కీమ్‌లో ఎంత మొత్తం ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది? - సత్యనారాయణ, విజయవాడ మీకు నెలకు రూ.15,000 పెన్షన్ కావాలంటే రూ.20 లక్షల నిధిని ఏర్పాటు చేసుకోవాలి. బ్యాంక్ డిపాజిట్లు, సీనియర్ సిటిజెన్ సేవింగ్స్ స్కీమ్(ఎస్సీఎస్ఎస్), పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్, ట్యాక్స్-ఫ్రీ బాండ్లు వంటివి సురక్షితమైన, భద్రమైన ఇన్వెస్ట్మెంట్ సాధనాలు. ఇవి అధిక రాబడులను ఇవ్వలేవు. సీనియర్ సిటిజెన్ సేవింగ్స్ స్కీమ్ మాత్రం ఏడాదికి 9.3 శాతం రాబడిని ఇస్తుంది. మిగిలినవి ఏడాదికి 7.5 శాతం వరకూ రాబడులను ఇస్తాయి. ఇక మీరు ఐదేళ్ల పాటు ఇన్వెస్ట్చేయాలనుకుంటున్నారు. కాబట్టి ఒకటి లేదా రెండు బ్యాలెన్స్డ్ మ్యూచువల్ ఫండ్స్ ఎంచుకోండి. వీటిల్లో నెలకు రూ.24,000 చొప్పున ఇన్వెస్ట్ చేయడం మొదలు పెట్టండి. ఈ బ్యాలెన్సెడ్ ఫండ్స్ కనీసం ఏడాదికి 12 శాతం రాబడులను ఇస్తాయని అంచనాలతో మీకు మీరు కోరుకున్న పెన్షన్ నెలవారీ పొందగలరు. మీరు ఇన్వెస్ట్ చేయడానికి ఈ బ్యాలెన్స్డ్ ఫండ్స్‌ను ఎంచుకోవచ్చు. కెనరా రెబెకొ బ్యాలెన్స్డ్ ఫండ్, ఫ్రాంక్లిన్ ఇండియా బ్యాలెన్స్డ్ ఫండ్, హెచ్డీఎఫ్సీ బ్యాలెన్స్డ్ ఫండ్, హెచ్డీఎఫ్సీ చిల్డ్రన్స్ గిఫ్ట్ ఫండ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ బ్యాలెన్స్డ్ ఫండ్, ఎల్ అండ్ టీ ఇండియా ప్రుడెన్షియల్ ఫండ్, ఎస్బీఐ మ్యాగ్నమ్ బ్యాలెన్స్డ్ ఫండ్, టాటా బ్యాలెన్స్డ్ ఫండ్ మొదలైనవి. మూడేళ్ల క్రితం ఎల్ఐసీ జీవన్ ఆనంద్ పాలసీ తీసుకున్నాను. ఏడాదికి రూ.68,000 చొప్పున ఇప్పటికే మూడేళ్ల ప్రీమియం చెల్లించాను. ఈ పాలసీ టర్మ్ పదేళ్లు. సమ్ అస్యూర్డ్ రూ.10 లక్షలు. ఈ పాలసీని సరెండర్ చేయమంటారా? కొనసాగమంటారా? ఒకవేళ సరెండర్ చేస్తే నాకు ఎల్ఐసీ నుంచి ఎంత వస్తుంది? ఈ సరెండర్ డబ్బులను ఎలా ఇన్వెస్ట్ చేయాలి? - సతీష్, హైదరాబాద్ ఎల్ఐసీ జీవన్ఆనంద్ అనేది ఎండోమెంట్ ఎష్యూరెన్స్, హోల్ లైఫ్ ప్లాన్ల సమ్మేళనంగా రూపొందిన పాలసీ. పాలసీ తీసుకున్న వ్యక్తి మరణిస్తే, బీమా మొత్తం నామినీకి వస్తుంది. లేకుంటే పాలసీ టర్మ్ పూర్తయితే మెచ్యూరిటీ ప్రయోజనాలు పాలసీ తీసుకున్న వ్యక్తికి లభిస్తాయి. టర్మ్ పూర్తయిన తర్వాత పాలసీదారుడు మరణిస్తే, నామినీకి డెత్ బెనిఫిట్స్ లభిస్తాయి. వ్యయాల వివరాలను ఈ పాలసీ వెల్లడించడం లేదు. మూడేళ్ల తర్వాత ఈ పాలసీని సరెండర్ చేయాలనుకుంటే, మీరు చెల్లించిన అన్ని ప్రీమియమ్‌ల (మొదటి ప్రీమియం మినహాయించి) మొత్తంలో 30 శాతం గ్యారంటీడ్ సరెండర్ వాల్యూగా చెల్లిస్తారు. మీ కేసులో సరెండర్ విలువ రూ.40,800గా వస్తుంది. ఎల్ఐసీ సంస్థ ప్రత్యేకమైన సరెండర్ విలువను చెల్లించవచ్చు. ఈ పాలసీని సరెండర్ చేసిన తర్వాత వచ్చిన మొత్తాలను మొదట్లో బ్యాలెన్స్డ్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చు. ఇక మీ దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల కోసం కనీసం ఐదు నుంచి ఏడేళ్ల పాటు డైవర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే మంచి రాబడులు పొందగలరు. ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లను పెంచిన నేపథ్యంలో ఏ కేటగిరి డెట్ ఫండ్స్(బాండ్ ఫండ్స్, ఆర్బిట్రేజ్ ఫండ్స్, డైనమిక్ బాండ్ ఫండ్స్)లో ఇన్వెస్ట్ చేయాలి? - జాన్సన్, సికింద్రాబాద్ అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపు వంటి సంఘటనల ఆధారంగా కాకుండా మీరు ఇన్వెస్ట్ చేయాలనుకున్న కాలాన్ని పరిగణనలోకి తీసుకొని డెట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలి. కొన్ని రోజులు, ఒక వారానికి మాత్రమే ఇన్వెస్ట్ చేయాలనుకుంటే, లిక్విడ్ డెట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయండి. కొన్ని నెలలు లేదా ఏడాది పాటు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే, ఆల్ట్రా షార్ట్ టర్మ్ ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్ చేయడం ఉత్తమం.. మూడు నుంచి ఐదేళ్ల కాలానికి ఇన్వెస్ట్ చేయాలనుకుంటే డైనమిక్ బాండ్ ఫండ్లను ఎంచుకోండి.