నెలకు రూ.15,000 పెన్షన్ కావాలంటే..? | Per month 15,000 If wants pension ..? | Sakshi
Sakshi News home page

నెలకు రూ.15,000 పెన్షన్ కావాలంటే..?

Published Mon, Dec 21 2015 4:04 AM | Last Updated on Sun, Sep 3 2017 2:18 PM

నెలకు రూ.15,000 పెన్షన్ కావాలంటే..?

నెలకు రూ.15,000 పెన్షన్ కావాలంటే..?

గత కొంత కాలం నుంచి యాక్సిస్ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఈ ఫండ్‌కు లాక్ ఇన్ పీరియడ్ మూడేళ్లు. ఈ లాక్ ఇన్ పీరియడ్ పూర్తయిన తర్వాత ఈ ఫండ్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్ కొనసాగించమంటారా ? లేకుంటే ఫండ్ నుంచి వైదొలగమంటారా? తగిన సూచనలివ్వండి?
 - దేవేందర్, గుంటూరు

 
యాక్సిస్ లాంగ్‌టర్మ్  ఫండ్ వంటి ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్(ఈఎల్‌ఎస్‌ఎస్) లేదా ట్యాక్స్ సేవింగ్స్ మ్యూచువల్ ఫండ్స్‌కు తప్పనిసరిగా లాక్ ఇన్ పీరియడ్ మూడేళ్లుగా ఉంటుంది. ఈ లాక్ ఇన్ పీరియడ్ పూర్తయిన తర్వాత ఇన్వెస్టర్లు ఈ ఫండ్ నుంచి తప్పనిసరిగా వైదొలగాల్సిన అవసరం లేదు. ఈ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసిన డబ్బులు మీకు అవసరం లేనంత కాలం, ఈ ఫండ్ పనితీరు సంతృప్తికరంగా ఉన్నంత కాలం మీరు ఫండ్‌లో ఎలాంటి అనుమానాలు లేకుండా కొనసాగవచ్చు.
 
ఐదేళ్ల తర్వాత నాకు నెలకు రూ.15,000 పెన్షన్ కావాలి. ఈ పెన్షన్ కనీసం పదేళ్ల పాటు అందాలి. ఇలా పొందాలంటే నేను  ఏ స్కీమ్‌లో ఎంత మొత్తం ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది?
 - సత్యనారాయణ, విజయవాడ

 
మీకు నెలకు రూ.15,000 పెన్షన్ కావాలంటే రూ.20 లక్షల నిధిని ఏర్పాటు చేసుకోవాలి. బ్యాంక్ డిపాజిట్లు, సీనియర్ సిటిజెన్ సేవింగ్స్ స్కీమ్(ఎస్‌సీఎస్‌ఎస్), పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్,  ట్యాక్స్-ఫ్రీ బాండ్లు వంటివి సురక్షితమైన, భద్రమైన ఇన్వెస్ట్‌మెంట్ సాధనాలు. ఇవి అధిక రాబడులను ఇవ్వలేవు.  సీనియర్ సిటిజెన్ సేవింగ్స్ స్కీమ్ మాత్రం ఏడాదికి 9.3 శాతం రాబడిని ఇస్తుంది. మిగిలినవి  ఏడాదికి 7.5 శాతం వరకూ రాబడులను ఇస్తాయి.  

ఇక మీరు ఐదేళ్ల పాటు ఇన్వెస్ట్‌చేయాలనుకుంటున్నారు. కాబట్టి ఒకటి లేదా రెండు బ్యాలెన్స్‌డ్ మ్యూచువల్ ఫండ్స్ ఎంచుకోండి. వీటిల్లో నెలకు రూ.24,000 చొప్పున ఇన్వెస్ట్ చేయడం మొదలు పెట్టండి. ఈ బ్యాలెన్సెడ్ ఫండ్స్ కనీసం ఏడాదికి 12 శాతం రాబడులను ఇస్తాయని అంచనాలతో మీకు మీరు కోరుకున్న పెన్షన్ నెలవారీ పొందగలరు. మీరు ఇన్వెస్ట్ చేయడానికి  ఈ బ్యాలెన్స్‌డ్ ఫండ్స్‌ను ఎంచుకోవచ్చు.

కెనరా రెబెకొ బ్యాలెన్స్‌డ్ ఫండ్, ఫ్రాంక్లిన్ ఇండియా బ్యాలెన్స్‌డ్ ఫండ్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాలెన్స్‌డ్ ఫండ్, హెచ్‌డీఎఫ్‌సీ చిల్డ్రన్స్ గిఫ్ట్ ఫండ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ బ్యాలెన్స్‌డ్ ఫండ్, ఎల్ అండ్ టీ ఇండియా ప్రుడెన్షియల్ ఫండ్, ఎస్‌బీఐ మ్యాగ్నమ్ బ్యాలెన్స్‌డ్ ఫండ్, టాటా బ్యాలెన్స్‌డ్ ఫండ్ మొదలైనవి.
 
మూడేళ్ల క్రితం ఎల్‌ఐసీ జీవన్ ఆనంద్ పాలసీ తీసుకున్నాను. ఏడాదికి రూ.68,000 చొప్పున ఇప్పటికే మూడేళ్ల ప్రీమియం చెల్లించాను. ఈ పాలసీ టర్మ్ పదేళ్లు. సమ్ అస్యూర్డ్ రూ.10 లక్షలు. ఈ పాలసీని సరెండర్ చేయమంటారా? కొనసాగమంటారా? ఒకవేళ సరెండర్ చేస్తే నాకు ఎల్‌ఐసీ నుంచి ఎంత వస్తుంది? ఈ సరెండర్ డబ్బులను ఎలా ఇన్వెస్ట్ చేయాలి?                                 - సతీష్, హైదరాబాద్
 
ఎల్‌ఐసీ జీవన్‌ఆనంద్ అనేది ఎండోమెంట్ ఎష్యూరెన్స్, హోల్ లైఫ్ ప్లాన్‌ల సమ్మేళనంగా రూపొందిన పాలసీ. పాలసీ తీసుకున్న వ్యక్తి మరణిస్తే, బీమా మొత్తం నామినీకి వస్తుంది. లేకుంటే పాలసీ టర్మ్ పూర్తయితే మెచ్యూరిటీ ప్రయోజనాలు పాలసీ తీసుకున్న వ్యక్తికి లభిస్తాయి. టర్మ్ పూర్తయిన తర్వాత పాలసీదారుడు మరణిస్తే, నామినీకి డెత్ బెనిఫిట్స్ లభిస్తాయి. వ్యయాల వివరాలను ఈ పాలసీ వెల్లడించడం లేదు.

మూడేళ్ల తర్వాత ఈ పాలసీని సరెండర్ చేయాలనుకుంటే, మీరు చెల్లించిన అన్ని ప్రీమియమ్‌ల (మొదటి ప్రీమియం మినహాయించి) మొత్తంలో 30 శాతం గ్యారంటీడ్ సరెండర్ వాల్యూగా చెల్లిస్తారు. మీ కేసులో సరెండర్ విలువ రూ.40,800గా వస్తుంది. ఎల్‌ఐసీ సంస్థ ప్రత్యేకమైన సరెండర్ విలువను చెల్లించవచ్చు.

ఈ పాలసీని సరెండర్ చేసిన తర్వాత వచ్చిన మొత్తాలను మొదట్లో బ్యాలెన్స్‌డ్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చు. ఇక మీ దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల కోసం కనీసం ఐదు నుంచి ఏడేళ్ల పాటు డైవర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే మంచి రాబడులు పొందగలరు.
 
ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లను పెంచిన నేపథ్యంలో ఏ కేటగిరి డెట్ ఫండ్స్(బాండ్ ఫండ్స్, ఆర్బిట్రేజ్ ఫండ్స్, డైనమిక్ బాండ్ ఫండ్స్)లో ఇన్వెస్ట్ చేయాలి?
 - జాన్సన్, సికింద్రాబాద్


అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపు వంటి సంఘటనల ఆధారంగా కాకుండా మీరు ఇన్వెస్ట్ చేయాలనుకున్న కాలాన్ని పరిగణనలోకి తీసుకొని డెట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలి. కొన్ని రోజులు, ఒక వారానికి మాత్రమే ఇన్వెస్ట్ చేయాలనుకుంటే, లిక్విడ్ డెట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయండి. కొన్ని నెలలు లేదా ఏడాది పాటు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే, ఆల్ట్రా షార్ట్ టర్మ్ ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్ చేయడం ఉత్తమం.. మూడు నుంచి ఐదేళ్ల కాలానికి ఇన్వెస్ట్ చేయాలనుకుంటే డైనమిక్ బాండ్ ఫండ్‌లను ఎంచుకోండి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement