‘సిప్’ ప్రారంభించడం ఎలా...? | how to start Systematic Investment Plan | Sakshi
Sakshi News home page

‘సిప్’ ప్రారంభించడం ఎలా...?

Published Mon, Nov 23 2015 3:05 AM | Last Updated on Sun, Sep 3 2017 12:51 PM

‘సిప్’ ప్రారంభించడం ఎలా...?

‘సిప్’ ప్రారంభించడం ఎలా...?

నేను ఒక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిని. సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (ఎస్‌ఐపీ) విధానంలో 15 సంవత్సరాల పాటు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. సిప్ విధానాన్ని ఎలా ప్రారంభించాలి? మంచి ప్లాన్‌ను ఎలా ఎంచుకోవాలి?
 - సైరాబాను, హైదరాబాద్

 
మీరు సిప్ విధానంలో మ్యూచువల్ ఫండ్స్‌లో 15 ఏళ్లపాటు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు. కాబట్టి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్‌ను మీ ఇన్వెస్ట్‌మెంట్స్ కోసం పరిశీలించవచ్చు. తొలిసారిగా మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు. కాబట్టి ఈక్విటీ-ఓరియంటెడ్ బ్యాలెన్స్‌డ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయమని సూచిస్తాం. ఈక్విటీ, డెట్‌ల సమ్మేళనంగా ఈ స్కీమ్స్‌ను రూపొందిస్తారు. అందుకని ఇవి ఈక్విటీ స్కీమ్స్ కంటే తక్కువ ఒడిదుడుకులమయంగా ఉంటాయి.

మంచి రేటింగ్ ఉన్న ఈక్విటీ ఓరియంటెడ్ బ్యాలెన్స్‌డ్ ఫండ్స్‌ను ఎంచుకొని ఇన్వెస్ట్ చేయండి. ఇక సిప్‌ను ప్రారంభించడం చాలా సులువైన విషయం. మీరు చేయాల్సిందల్లా మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌కు దరఖాస్తు చేసేటప్పుడు సిప్ ఆప్షన్‌పై టిక్ చేయండి. ఇక మీ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ నుంచిప్రతి నెలా నిర్ణీత మొత్తం ఆ స్కీమ్‌లోకి డెబిట్ అయ్యేలా బ్యాంక్‌కు ఆదేశాలు ఇస్తే సరి. సిప్ ప్రారంభమవుతుంది.
 
నేను ఎస్‌బీఐ లైఫ్ స్మార్ట్ పెర్ఫామర్  యులిప్ పాలసీ తీసుకున్నాను. ఏడాదికి రూ.85,000 చొప్పున ఇప్పటికే మూడు వార్షిక ప్రీమియమ్‌లు చెల్లించాను. నేను చెల్లించిన ప్రీమియమ్‌ల విలువ రూ.2.55 లక్షలుగా ఉండగా, ప్రస్తుతం ఈ ఫండ్ విలువ రూ.2.94 లక్షలుగా ఉంది. ఫండ్ పనితీరు సంతృప్తికరంగా లేదు. లాకిన్ పీరియడ్ పూర్తయిన వెంటనే ఈ పాలసీని సరెండర్ చేద్దామనుకుంటున్నాను. అందుకని ఎలాంటి ప్రీమియమ్‌లు చెల్లించాలనుకోవడం లేదు. నేను చెల్లించిన ప్రీమియమ్‌లన్నింటికీ, సెక్షన్ 80 సీ కింద పన్ను మినహాయింపులు పొందాను. ఈ పాలసీని సరెండర్ చేయమంటారా? ఒక వేళ ఈ పాలసీని సరెండర్ చేస్తే నాపై పన్ను భారం అధికంగా ఉంటుందా?
 - సూర్య శేఖర్, విశాఖపట్టణం

 
యులిప్‌లకు సాధారణంగా లాన్ ఇన్ పీరియడ్ ఐదేళ్లుగా ఉంటుంది. ఈ లాకిన్ పీరియడ్(ఐదేళ్లకు) ముందే ఈ పాలసీని సరెండర్ చేస్తే, ఇంతకు ముందు మీరు పొందిన పన్ను మినహాయింపులన్నింటినీ మీ ఆదాయానికి కలిపి మీ ట్యాక్స్ స్లాబ్ ప్రకారం ఆదాయపు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇక మ్యూచువల్ ఫండ్ కంపెనీ మీ సరెండర్ విలువపై టీడీఎస్ కోత వేస్తుంది.  

మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను, బీమా అవసరాలను వేర్వేరుగా చూడండి. బీమా కోసం లైఫ్ ఇన్సూరెన్స్ కవర్ ఉన్న టర్మ్ ప్లాన్ తీసుకోండి. దీర్ఘకాల ఆర్థిక లక్ష్యాల కోసం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయండి. సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్(ఎస్‌ఐపీ-సిప్) అంటే ఏమిటి ? రోజువారీ, వారం వారీ, నెలవారీ- ఏ సిప్‌ను అనుసరిస్తే మంచి ప్రయోజనాలు లభిస్తాయి?
 - జార్జ్, గుంటూరు

 
నిర్ణీత కాలానికి నిర్ణీత మొత్తంలో క్రమం తప్పకుండా ఇన్వెస్ట్‌చేయడాన్ని సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్(సిప్)గా వ్యవహరిస్తారు. ఈ సిప్ విధానం వల్ల మార్కెట్ ఒడిదుడుకులను అధిగమించవచ్చు. దీర్ఘకాలంలో గరిష్ట రాబడులను పొందవచ్చు.  మీ ఇన్వెస్ట్‌మెంట్స్ మొత్తం రూ. 2 లక్షల రేంజ్‌లో ఉంటే నెలవారీ సిప్‌ను ఎంచుకుంటే సముచితంగా ఉంటుంది. రోజువారీ, వారం వారీ సిప్‌ను అనుసరిస్తే ఒక నెలలో లావాదేవీలు అధికంగా ఉండి, ఇన్వెస్ట్‌మెంట్స్ మదింపు, గణన చాలా గందరగోళంగా ఉం టుంది.

మూలధన లాభాల పన్ను లెక్కించడం కూడా కష్టసాధ్యమైన పనే. పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్‌మెంట్స్ ఉంటేనే రోజువారీ, వారం వారీ సిప్ విధానాన్ని అనుసరించాలి. అయితే దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే, రోజువారీ అయినా, వారం వారీ అయినా, నెలవారీ- ఏ సిప్ విధానాన్ని అనుసరించినా, రాబడుల్లో చెప్పుకోదగ్గ తేడా ఉండదని చెప్పొచ్చు.
- ధీరేంద్ర కుమార్
సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement