దీర్ఘకాల ఇన్వెస్ట్‌మెంట్స్‌కు ఎన్‌పీఎస్ ఓకేనా? | NPS long-term investments? | Sakshi
Sakshi News home page

దీర్ఘకాల ఇన్వెస్ట్‌మెంట్స్‌కు ఎన్‌పీఎస్ ఓకేనా?

Published Mon, Apr 18 2016 2:47 AM | Last Updated on Sun, Sep 3 2017 10:08 PM

దీర్ఘకాల ఇన్వెస్ట్‌మెంట్స్‌కు ఎన్‌పీఎస్ ఓకేనా?

దీర్ఘకాల ఇన్వెస్ట్‌మెంట్స్‌కు ఎన్‌పీఎస్ ఓకేనా?

నేషనల్ పెన్షన్ సిస్టమ్(ఎన్‌పీఎస్)లో  ఇన్వెస్ట్ చేసిన మొత్తానికి  2016-17 ఆర్థిక సంవత్సరంలో  పన్ను ప్రయోజనం పొందవచ్చా? నాకు ఇటీవలే కూతురు పుట్టింది. తన ఉన్నత విద్య నిమిత్తం ఇప్పటి నుంచే పొదుపు చేయాలనుకుంటున్నాను. అంటే 20 ఏళ్ల పాటు పొదుపు చేస్తాను. ఈ దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యం కోసం నేషనల్ పెన్షన్ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేయాలా లేక ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్(ఈఎల్‌ఎస్‌ఎస్)లో ఇన్వెస్ట్ చేయాలా? దేన్ని ఎంచుకుంటే నాకు పన్ను ప్రయోజనాలతో పాటు, అధిక రాబడులు వస్తాయి?
 - సాయి లీల, రాజమండ్రి

 
నేషనల్ పెన్షన్ సిస్టమ్(ఎన్‌పీఎస్)లో ఇన్వెస్ట్ చేసి, 2016-17 ఆర్థిక సంవత్సరానికి సెక్షన్ 80సీసీడీ(వన్‌బి) కింద రూ.50,000 వరకూ అదనపు పన్ను మినహాయింపులు పొందవచ్చు. రిటైర్మెంట్ కోసం ఇన్వెస్ట్ చేయాలి, అదీ ప్రభుత్వం స్పాన్సర్ చేసిన పథకంలో అంటే ఎన్‌పీఎస్‌ను ఎంచుకోవచ్చు. మీరు అరవై ఏళ్లు వచ్చేవరకూ ఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను హోల్డ్ చేయాల్సి ఉంటుంది. మీరు అరవై ఏళ్లు వచ్చి, రిటైరైన తర్వాత ఈ మొత్తం కార్పస్‌లో 40 శాతంతో యాన్యుటీని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. మిగిలిన 60 శాతం మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు.

ఈ మొత్తాన్ని మీ ఆదాయానికి కలిపి మీ ఆదాయపు పన్ను స్లాబ్‌ననుసరించి మీరు ఆదాయపు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇక అరవై ఏళ్లకు ముందే డబ్బులను విత్‌డ్రా చేయాలనుకుంటే, మీ కార్పస్‌లో కనీసం 80 శాతం మొత్తాన్ని యాన్యుటీని కొనుగోలుకు ఉపయోగించాల్సి ఉంటుంది. మిగిలిన మొత్తం మీ ఆదాయానికి కలిపి మీ ఆదాయపు పన్నుస్లాబ్‌ననుసరించి పన్ను కట్టాల్సి ఉంటుంది.  

ఇక మీ దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యం(కూతురి ఉన్నత విద్య) కోసమైతే, ఇన్వెస్ట్‌మెంట్స్ మీరే స్వయంగా చూసుకోగలిగితే, ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్(ఈఎల్‌ఎస్‌ఎస్)ను ఎంచుకోండి. ఈ స్కీమ్స్‌కు లాక్ ఇన్ పీరియడ్ మూడేళ్లుగా ఉంటుంది. మూడేళ్ల తర్వాత వీటిని ఖచ్చితంగా విక్రయించాల్సిన అవసరం లేదు. ఈఎల్‌ఎస్‌ఎస్‌లు తమ మొత్తం కార్పస్‌ను ఈక్విటీల్లోనే ఇన్వెస్ట్ చేస్తాయి. కాబట్టి మీకు మంచి రాబడులు వస్తాయి. అదే ఎన్‌పీఎస్‌లో అయితే ఈక్విటీలో ఇన్వెస్ట్ చేసేది 50 శాతం వరకు మాత్రమే ఉంటుంది.

ఏడాది కాలం తర్వాత విక్రయించే ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై ఎలాంటి దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను లేనందున ఈఎల్‌ఎస్‌ఎస్‌పై వచ్చే రాబడులపై ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన పనిలేదు. అందుకని దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల కోసం ఎన్‌పీఎస్ కంటే ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ బెటర్. పన్ను ప్రయోజనాలు లభిస్తాయి. అధిక రాబడులూ వస్తాయి.

మ్యూచువల్ ఫండ్స్‌కు సంబంధించి రెగ్యులర్ ప్లాన్‌ల కంటే డెరైక్ట్ ప్లాన్‌లకు ఉండే ప్రయోజనాలు, ప్రతికూలతలను వివరించండి ?
 - క్రిష్టోఫర్, నెల్లూరు

 
డెరైక్ట్ ప్లాన్‌ల వల్ల మీకు కమీషన్లు, మార్కెటింగ్ సంబంధిత వ్యయాల నుంచి రక్షణ లభిస్తుంది. ఇది ఎంత చిన్నమొత్తమైనా సరే దీర్ఘకాలం ఇన్వెస్ట్‌మెంట్ కారణంగా మీకు మంచి రాబడులు వస్తాయి. డెరైక్ట్ ప్లాన్‌లో ఇన్వెస్ట్ చేయడం వల్ల లభించే అతి పెద్ద ప్రయోజనం ఇది. ఇక డెరైక్ట్ ప్లాన్‌లకు సంబంధించి ఉన్న అతి పెద్ద ప్రతికూలాంశం ... మీ పెట్టుబడి నిర్ణయాలన్నింటిని మీరే స్వంతంగా తీసుకోవలసి రావడం.

మీరు డెరైక్ట్ ప్లాన్‌ను మ్యూచువల్ ఫండ్ సంస్థ నుంచి నేరుగా కొనుగోలు చేస్తారు కాబట్టి. మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్ సలహాలు మీకు అందుబాటులో ఉండవు. మీరే సొంతంగా రీసెర్చ్ చేసి. నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్, ఇన్వెస్ట్‌మెంట్స్‌కు సంబంధించి పూర్తి అవగాహన ఉన్నప్పుడు మాత్రమే డెరైక్ట్ ప్లాన్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్‌కు సంబంధించి నిర్ణయాలు తీసుకోవాలి.
 
నా వయస్సు 65 సంవత్సరాలు. సీనియర్ సిటిజన్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను తీసుకోవాలనుకుంటున్నాను. రెలిగేర్, స్టార్, టాటా ఏఐజీ, అపోలో మ్యూనిక్ వంటి కంపెనీలవి షార్ట్‌లిస్ట్ చేశాను. వీటిల్లో దేనిని ఎంచుకోవాలో సూచిస్తారా?                         
- కిరణ్, వరంగల్

 
మీరు తీసుకునే హెల్త్ పాలసీ.. తగినంత కవరేజ్ ఇచ్చేదిగానూ, మీరు చెల్లించాల్సిన ప్రీమియమ్ మీ బడ్జెట్‌కు తగినట్లుగానూ ఉండాలి.  బీమా తీసుకునే వ్యక్తికి ఇంతకు ముందే ఏవైనా రుగ్మతలు ఉంటే వాటికి  సంబంధించిన కవరేజ్ క్లాజ్‌ను తప్పనిసరిగా చెక్ చేసుకోవాలి. ఇంతకు ముందే ఉన్న జబ్బులకు సంబంధించి కవరేజ్ పీరియడ్ ఒక్కో కంపెనీకి ఒక్కోలా ఉంటుంది. ఈ పీరియడ్ రెండు నుంచి నాలుగేళ్లుగా ఉంటుంది. తక్కువ వెయిటింగ్ పీరియడ్ ఉన్న పాలసీలకు ప్రాధాన్యత ఇవ్వండి.

పాలసీ తీసుకున్న 30 రోజుల్లోపే మీరు చికిత్స తీసుకుంటే ఈ చికిత్సకయ్యే ఖర్చులు చాలా హెల్త్ పాలసీల్లో రీయింబర్స్ కావు. చాలా బీమా కంపెనీలు నగదు రహిత(క్యాష్‌లెస్), రీయింబర్స్‌మెంట్ ఫీచర్లున్న పాలసీలను ఆఫర్ చేస్తున్నాయి. నగదు రహిత సౌకర్యాన్నే ఎంచుకుంటే మంచిది. రీయింబర్స్‌మెంట్ ఫీచరున్న పాలసీలో అయితే మీ చికిత్సకయ్యే ఖర్చులు  మీరు ముందుగానే  చెల్లించాల్సి ఉంటుంది.

ఈ డబ్బులు సమకూర్చుకోవడం కొంచెం శ్రమతో కూడుకున్న పనే. మరోవైపు రీయింబర్స్‌మెంట్ కోసం చాలా డాక్యుమెంట్లు సమర్పించాల్సి ఉంటుంది. ఇక నగదు రహిత సౌకర్యం తీసుకుంటే మీ నగరంలో ఉన్న నెట్‌వర్క్ హాస్పిటల్స్‌ను చెక్ చేసుకోవాలి. సదరు బీమా సంస్థ వెబ్‌సైట్‌లో మీరు తీసుకోవాలనుకుంటున్న ప్లాన్ బ్రోచర్‌ను క్షుణ్ణంగా పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోండి.

ఇక వివిధ సంస్థల పాలసీల వివరాలు చూద్దాం...  స్టార్ హెల్త్ సీనియర్ సిటిజన్స్ రెడ్ కార్పెట్ హెల్త్ ఇన్సూరెన్స్ విషయానికొస్తే,.. ఈ పాలసీలో ఇంతకు ముందే ఉన్న జబ్బుల కవరేజ్ రెండో ఏట నుంచి లభిస్తుంది. 61-75 ఏళ్ల ఏజ్‌గ్రూప్ వారికి రూ.5 లక్షల బీమాకు ప్రీమియం రూ.20,610గా ఉంది.

ఇక రెలిగేర్ సీనియర్ సిటిజన్ హెల్త్ ఇన్సూరెన్స్‌లో ఇంతకు ముందే ఉన్న జబ్బులకు కవరేజ్ నాలుగో ఏడాది నుంచి లభిస్తుంది. రూ. 5 లక్షల హెల్త్ పాలసీకి ప్రీమియం 61-65 ఏళ్ల వయస్సుకు రూ.16,898-రూ.23,466 వరకూ ఉంటుంది. అపోలో మ్యూనిక్ ఆప్టిమా సీనియర్ పాలసీలోనూ ఇంతకు ముందే ఉన్న జబ్బుల కవరేజ్ 4వ ఏడాది నుంచి లభిస్తుంది. రూ. 5 లక్షల బీమాకు ప్రీమియమ్‌లు 61-65 ఏళ్లకు రూ.18,137గానూ, 66-70 ఏళ్ల వయస్సుకు రూ. 29,254గానూ, 71-75 ఏళ్ల వయస్సుకు రూ.38,136గానూ ఉన్నాయి.
- ధీరేంద్ర కుమార్
 సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement