Equity Mutual Fund
-
స్టాక్ మార్కెట్ ఎఫెక్ట్ : భారీగా తగ్గిన ఈక్విటీ ఎంఎఫ్ పెట్టుబడులు
న్యూఢిల్లీ: ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్(ఎంఎఫ్‌లు)లో పెట్టుబడులు గత నెల నీరసించాయి. అంతక్రితం నెలతో పోలిస్తే సెప్టెంబర్‌లో 30 శాతం తక్కువగా రూ. 14,091 కోట్లకు పరిమితమయ్యాయి. స్టాక్ మార్కెట్లో బలహీన సెంటిమెంటు కారణంగా ఇన్వెస్టర్లు రిస్క్ పెట్టుబడుల నుంచి దృష్టి మరల్చడం ప్రభావం చూపింది. దేశీ ఎంఎఫ్ అసోసియేషన్(యాంఫి) గణాంకాల ప్రకారం ఈ ఏడాది(2023) ఆగస్ట్‌లో ఈక్విటీ ఎంఎఫ్లకు రూ. 20,245 కోట్ల పెట్టుబడులు లభించాయి. కాగా.. గత నెలలో క్రమానుగత పెట్టుబడి పథకాల(సిప్)కు మాత్రం రూ. 16,042 కోట్ల పెట్టుబడులు ప్రవహించాయి. ఇవి ఈక్విటీ ఫండ్స్ చరిత్రలోనే అత్యధికంకాగా.. ఈ ఆర్థిక సంవత్సరం(2023–24) తొలి ఆరు నెలల్లో(ఏప్రిల్–సెప్టెంబర్) సిప్ ద్వారా రూ. 90,304 కోట్ల పెట్టుబడులు నమోదయ్యాయి. కొత్త రికార్డ్స్‌తో.. గత నెలలో ఈక్విటీ మార్కెట్లు సరికొత్త గరిష్టాలకు చేరడంతో రిస్క్ అసెట్స్ నుంచి ఇన్వెస్టర్ల దృష్టి మరలినట్లు విశ్లేషకులు తెలియజేశారు. అయినప్పటికీ ఈక్విటీ ఎంఎఫ్లకు రూ. 14,091 కోట్ల పెట్టుబడులు లభించినట్లు మోతీలాల్ ఓస్వాల్ ఏఎంసీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ అఖిల్ చతుర్వేది వివరించారు. వెరసి వరుసగా 31వ నెలలోనూ నికరంగా పెట్టుబడులు ప్రవహించినట్లు తెలియజేశారు. సెప్టెంబర్‌లో ఆరు కొత్త ఫండ్స్ ప్రారంభంకాగా.. రూ. 2,503 కోట్ల పెట్టుబడులను సమకూర్చుకున్నాయి. అంతర్గతంగా సానుకూల సెంటిమెంటు నెలకొనడంతో సిప్ పెట్టుబడులు కొనసాగుతున్నట్లు యూనియన్ ఏఎంసీ సీఈవో జి.ప్రదీప్‌కుమార్ పేర్కొన్నారు. ఎఫ్‌పీఐలు నికరంగా అమ్మకాలకు ఆసక్తి చూపుతున్నప్పటికీ ఇన్వెస్టర్లు పెట్టుబడులు చేపడుతున్నట్లు తెలియజేశారు. థీమాటిక్(సెక్టోరల్) ఫండ్స్ సెప్టెంబర్‌లో రూ. 3,147 కోట్ల పెట్టుబడులను ఆకట్టుకోగా.. 4 కొత్త ఫండ్స్ విడుదలయ్యాయి. ఆగస్ట్‌లోనూ 5 కొత్త ఫండ్స్ ప్రవేశించగా.. రూ. 4,805 కోట్ల పెట్టుబడులు లభించాయి. లార్జ్ క్యాప్స్ డీలా సెప్టెంబర్‌లో లార్జ్ క్యాప్ ఫండ్స్ వరుసగా ఐదో నెలలోనూ డీలా పడ్డాయి. నికరంగా రూ. 110 కోట్ల పెట్టుబడులు వెనక్కి మళ్లాయి. అయితే మిడ్ క్యాప్ విభాగంలో పెట్టుబడులు తగ్గినప్పటికీ రూ. 2,000 కోట్లకు చేరాయి. ఆగస్ట్‌లో ఇవి రూ. 2,512 కోట్లుగా నమోదయ్యాయి. మే నుంచి ఆగస్ట్ మధ్యలో సగటున రూ. 4,298 కోట్ల పెట్టుబడులు లభించిన స్మాల్ క్యాప్ ఫండ్స్‌లోనూ గత నెలలో ఇన్వెస్ట్మెంట్స్ రూ. 2,678 కోట్లకు పరిమితమైనట్లు ఫైయర్స్ రీసెర్చ్ వైస్‌ప్రెసిడెంట్ గోపాల్ కావలిరెడ్డి తెలియజేశారు. స్మాల్ క్యాప్ విభాగంలో విలువలు భారీగా పెరగడంతో కొంతవరకూ లాభాల స్వీకరణ నెలకొనడం ప్రభావం చూపుతున్నట్లు మార్నింగ్‌స్టార్ ఇన్వెస్ట్మెంట్ అడ్వయిజర్ ఇండియా రీసెర్చ్ మేనేజర్ మెల్విన్ శాంటారిటా వివరించారు. రుణ పథకాల నేలచూపు రుణ సెక్యూరిటీ ఆధారిత పథకాలు వరుసగా రెండో నెలలోనూ నేలచూపులకే పరిమితమయ్యాయి. ఆగస్ట్‌లో నికరంగా రూ. 25,873 కోట్ల పెట్టుబడులను ఇన్వెస్టర్లు ఉపసంహరించుకోగా.. సెప్టెంబర్‌లో మరింత అధికంగా రూ. 1.01 లక్షల కోట్లు వెనక్కి మళ్లాయి. అంచనాలకు అనుగుణంగా లిక్విడ్ ఫండ్స్‌లో భారీగా రూ. 74,000 కోట్ల పెట్టుబడులు తరలిపోయాయి. కార్పొరేట్ల అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లింపు అవసరాలు ఇందుకు కారణమైనట్లు శాంటారియా అభిప్రాయపడ్డారు. ఎంఎఫ్ పరిశ్రమ మొత్తం నిర్వహణలోని ఆస్తులు(ఏయూఎం) సెప్టెంబర్ చివరికల్లా 46.58 లక్షల కోట్లకు చేరింది. -
‘సిప్’ ప్రారంభించడం ఎలా...?
నేను ఒక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిని. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (ఎస్ఐపీ) విధానంలో 15 సంవత్సరాల పాటు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. సిప్ విధానాన్ని ఎలా ప్రారంభించాలి? మంచి ప్లాన్‌ను ఎలా ఎంచుకోవాలి? - సైరాబాను, హైదరాబాద్ మీరు సిప్ విధానంలో మ్యూచువల్ ఫండ్స్‌లో 15 ఏళ్లపాటు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు. కాబట్టి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్‌ను మీ ఇన్వెస్ట్మెంట్స్ కోసం పరిశీలించవచ్చు. తొలిసారిగా మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు. కాబట్టి ఈక్విటీ-ఓరియంటెడ్ బ్యాలెన్స్డ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయమని సూచిస్తాం. ఈక్విటీ, డెట్ల సమ్మేళనంగా ఈ స్కీమ్స్‌ను రూపొందిస్తారు. అందుకని ఇవి ఈక్విటీ స్కీమ్స్ కంటే తక్కువ ఒడిదుడుకులమయంగా ఉంటాయి. మంచి రేటింగ్ ఉన్న ఈక్విటీ ఓరియంటెడ్ బ్యాలెన్స్డ్ ఫండ్స్‌ను ఎంచుకొని ఇన్వెస్ట్ చేయండి. ఇక సిప్‌ను ప్రారంభించడం చాలా సులువైన విషయం. మీరు చేయాల్సిందల్లా మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌కు దరఖాస్తు చేసేటప్పుడు సిప్ ఆప్షన్‌పై టిక్ చేయండి. ఇక మీ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ నుంచిప్రతి నెలా నిర్ణీత మొత్తం ఆ స్కీమ్‌లోకి డెబిట్ అయ్యేలా బ్యాంక్‌కు ఆదేశాలు ఇస్తే సరి. సిప్ ప్రారంభమవుతుంది. నేను ఎస్బీఐ లైఫ్ స్మార్ట్ పెర్ఫామర్ యులిప్ పాలసీ తీసుకున్నాను. ఏడాదికి రూ.85,000 చొప్పున ఇప్పటికే మూడు వార్షిక ప్రీమియమ్‌లు చెల్లించాను. నేను చెల్లించిన ప్రీమియమ్‌ల విలువ రూ.2.55 లక్షలుగా ఉండగా, ప్రస్తుతం ఈ ఫండ్ విలువ రూ.2.94 లక్షలుగా ఉంది. ఫండ్ పనితీరు సంతృప్తికరంగా లేదు. లాకిన్ పీరియడ్ పూర్తయిన వెంటనే ఈ పాలసీని సరెండర్ చేద్దామనుకుంటున్నాను. అందుకని ఎలాంటి ప్రీమియమ్‌లు చెల్లించాలనుకోవడం లేదు. నేను చెల్లించిన ప్రీమియమ్లన్నింటికీ, సెక్షన్ 80 సీ కింద పన్ను మినహాయింపులు పొందాను. ఈ పాలసీని సరెండర్ చేయమంటారా? ఒక వేళ ఈ పాలసీని సరెండర్ చేస్తే నాపై పన్ను భారం అధికంగా ఉంటుందా? - సూర్య శేఖర్, విశాఖపట్టణం యులిప్‌లకు సాధారణంగా లాన్ ఇన్ పీరియడ్ ఐదేళ్లుగా ఉంటుంది. ఈ లాకిన్ పీరియడ్(ఐదేళ్లకు) ముందే ఈ పాలసీని సరెండర్ చేస్తే, ఇంతకు ముందు మీరు పొందిన పన్ను మినహాయింపులన్నింటినీ మీ ఆదాయానికి కలిపి మీ ట్యాక్స్ స్లాబ్ ప్రకారం ఆదాయపు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇక మ్యూచువల్ ఫండ్ కంపెనీ మీ సరెండర్ విలువపై టీడీఎస్ కోత వేస్తుంది. మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను, బీమా అవసరాలను వేర్వేరుగా చూడండి. బీమా కోసం లైఫ్ ఇన్సూరెన్స్ కవర్ ఉన్న టర్మ్ ప్లాన్ తీసుకోండి. దీర్ఘకాల ఆర్థిక లక్ష్యాల కోసం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయండి. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(ఎస్ఐపీ-సిప్) అంటే ఏమిటి ? రోజువారీ, వారం వారీ, నెలవారీ- ఏ సిప్‌ను అనుసరిస్తే మంచి ప్రయోజనాలు లభిస్తాయి? - జార్జ్, గుంటూరు నిర్ణీత కాలానికి నిర్ణీత మొత్తంలో క్రమం తప్పకుండా ఇన్వెస్ట్చేయడాన్ని సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్)గా వ్యవహరిస్తారు. ఈ సిప్ విధానం వల్ల మార్కెట్ ఒడిదుడుకులను అధిగమించవచ్చు. దీర్ఘకాలంలో గరిష్ట రాబడులను పొందవచ్చు. మీ ఇన్వెస్ట్మెంట్స్ మొత్తం రూ. 2 లక్షల రేంజ్లో ఉంటే నెలవారీ సిప్‌ను ఎంచుకుంటే సముచితంగా ఉంటుంది. రోజువారీ, వారం వారీ సిప్‌ను అనుసరిస్తే ఒక నెలలో లావాదేవీలు అధికంగా ఉండి, ఇన్వెస్ట్మెంట్స్ మదింపు, గణన చాలా గందరగోళంగా ఉం టుంది. మూలధన లాభాల పన్ను లెక్కించడం కూడా కష్టసాధ్యమైన పనే. పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్స్ ఉంటేనే రోజువారీ, వారం వారీ సిప్ విధానాన్ని అనుసరించాలి. అయితే దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే, రోజువారీ అయినా, వారం వారీ అయినా, నెలవారీ- ఏ సిప్ విధానాన్ని అనుసరించినా, రాబడుల్లో చెప్పుకోదగ్గ తేడా ఉండదని చెప్పొచ్చు. - ధీరేంద్ర కుమార్ సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
పీఎఫ్.. ఈక్విటీ ఎంఎఫ్.. ఎందులో ఇన్వెస్ట్ చేయాలి?
నేనొక ప్రభుత్వ ఉద్యోగిని. ఇప్పటివరకూ నా ప్రావిడెండ్ ఫండ్‌లో కనీస మొత్తమే ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఇక ఇప్పటి నుంచి వచ్చే పదేళ్ల వరకూ నెలకు రూ.5,000 చొప్పున ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. ఇలా కాకుండా ఆ మొత్తాన్ని ఏదైనా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయమని మిత్రులు చెబుతున్నారు. ఈ రెండిటిలో దేంట్లో ఇన్వెస్ట్ చేస్తే మంచి రాబడులు వస్తాయి? ఒక వేళ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తేనే మంచి రాబడులు వచ్చే పక్షంలో నేను ఇన్వెస్ట్ చేయడానికి కొన్ని మంచి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ సూచించగలరు? -ప్రసన్న, హైదరాబాద్ పదేళ్ల దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు. కాబట్టి ప్రావిడెండ్ ఫండ్‌లో కన్నా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్‌లోనే ఇన్వెస్ట్ చేస్తే మంచి రాబడులు పొందవచ్చు. ఈపీఎఫ్ఓ సురక్షితమైనదే కానీ, ద్రవ్యోల్బణాన్ని తట్టుకునే రాబడులను ఇవ్వలేదు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్.. కొంత నష్ట భయం ఉన్నప్పటికీ, పదేళ్ల పాటు ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి దీర్ఘకాల పెట్టుబడుల ప్రయోజనాలు పొందవచ్చు. ఇక మీరు అనుకున్నట్లే నెలకు రూ.5,000 చొప్పున ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) విధానంలో ఇన్వెస్ట్ చేయండి. ఒక లార్జ్ క్యాప్ ఫండ్‌లో కానీ, ఒక మిడ్ క్యాప్ ఫండ్‌లో కానీ ఇన్వెస్ట్ చేయవచ్చు. లేదా ఒక లార్జ్‌క్యాప్ ఫండ్‌లో కొంత, మరో మిడ్‌క్యాప్ ఫండ్‌లో మరికొంత చొప్పున ఇన్వెస్ట్ చేయవచ్చు. లార్జ్‌క్యాప్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే..., హెచ్డీఎఫ్సీ క్యాపిటల్ బిల్డర్, ఫ్రాంక్లిన్ ఇండియా ఫ్లెక్సిక్యాప్, క్వాంటమ్ లాంగ్ టెర్మ్ ఈక్విటీ.. లను పరిశీలించవచ్చు. మిడ్ క్యాప్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయడానికైతే.., బిర్లా సన్‌లైఫ్ ఫ్రంట్‌లైన్ ఈక్విటీ ఫండ్, హెచ్డీఎఫ్సీ మిడ్-క్యాప్ ఆపర్చ్యునిటీస్ ఫండ్లను పరిశీలించవచ్చు. ఈ ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్ చేసిన 7,8 సంవత్సరాల తర్వాత మీ ఇన్వెస్ట్మెంట్స్ అన్నింటిని సిస్టమాటిక్ ట్రాన్సఫర్ ప్లాన్(ఎస్టీపీ) ద్వారా డెట్ ఫండ్స్‌కు బదిలీ చేస్తే, అప్పటి మార్కెట్ ఒడిదుడుకుల నుంచి గట్టెక్కవచ్చు. కనీసం ఏడాదికొకసారైనా మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను సమీక్షించడం మాత్రం మరచిపోకండి. గ్రీస్ రుణ సంక్షోభం, చైనా స్టాక్ మార్కెట్ సూచీ భారీ పతనం... ఈ రెండు అంశాల కారణంగా ఇటీవల కాలంలో స్టాక్ మార్కెట్ తీవ్రమైన ఒడిదుడుకులకు గురవడం మాలాంటి రిటైల్ ఇన్వెస్టర్లను బాగా ఆందోళన పరుస్తోంది. భవిష్యత్తులో ఈ రెండు అంశాల ప్రభావం ఎలా ఉండబోతోంది ? రిటైల్ ఇన్వెస్టర్లుగా మేము ఏం చేయాలి? -రాజేష్, విశాఖపట్నం మీరన్నట్లు గ్రీస్ రుణ సంక్షోభం, చైనా షాంఘై స్టాక్ మార్కెట్ సూచీ భారీ పతనం కారణంగా స్టాక్ మార్కెట్ తీవ్రమైన ఒడిదుడుకులకు గురైంది. ఇది ఒకింత ఆందోళన కలిగించే విషయమే. అయితే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) విధానంలో దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్టర్లు భయపడాల్సిన పని లేదు. మీ ఆర్థిక లక్ష్యాలకనుగుణంగా మీ ఆర్థిక ప్రణాళికకు కట్టుబడి ఉండండి. మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయండి. ఇప్పటికే ఇలాంటి ఫండ్స్‌లో ఇన్వెస్ట్మెంట్స్ ఉంటే వాటిని నిస్సంకోచంగా కొనసాగించండి. డైవర్సిఫికేషన్‌ను పాటించడం మాత్రం మరచిపోకండి. డివిడెండ్లు క్రమం తప్పకుండా చెల్లించే ఒక మంచి మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. అలాంటి ఫండ్స్ ఏమైనా ఉన్నాయా? ఉంటే వాటి వివరాలు వెల్లడించండి. -శ్రీనివాస్, ఈమెయిల్ ఇన్వెస్ట్‌మెంట్‌కు సంబంధించి ఇది సరైన విధానం కాదు. మ్యూచువల్ ఫండ్స్ విషయంలో డివిడెండ్లు అసలు పరిగణించే విషయమే కాదు. ఒపెన్ ఎండ్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే, ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు, ఎంత కావాలనుకుంటే అంత, లేకపోతే మొత్తం ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఉపసంహరించుకోవచ్చు. దీర్ఘకాలం పాటు మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే, మంచి రాబడులు పొందవచ్చు. డివిడెండ్ చెల్లింపులను బట్టి మ్యూచువల్ ఫండ్స్‌లో ఎప్పుడూ ఇన్వెస్ట్ చేయకూడదు. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లాంగ్-టెర్మ్ ఫండ్ రెగ్యులర్ ఆప్షన్లో ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. ఆ తర్వాత కొంత కాలానికి ఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ డైనమిక్ ఫండ్‌కు సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్(ఎస్టీపీ) ద్వారా బదిలీ చేయాలనుకుంటున్నాను. ఇది సరైన నిర్ణయమేనా? -నీరజ, తిరుపతి పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేయాలనుకునే మీలాంటి వారికి ఇది సరైన నిర్ణయమే. ఇంతకు ముందు మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయని వారికి, ఐదేళ్ల పాటు ఇన్వెస్ట్ చేయాలనుకునేవారికి ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ డైనమిక్ ఫండ్ అనేది సరైన ఎంపికే. మీరనుకుంటున్నట్లుగా మీ నిర్ణయాన్ని అమలుపరచండి.