పీఎఫ్.. ఈక్విటీ ఎంఎఫ్.. ఎందులో ఇన్వెస్ట్ చేయాలి? | Either to invest? | Sakshi
Sakshi News home page

పీఎఫ్.. ఈక్విటీ ఎంఎఫ్.. ఎందులో ఇన్వెస్ట్ చేయాలి?

Published Mon, Jul 20 2015 2:03 AM | Last Updated on Sun, Sep 3 2017 5:48 AM

Either to invest?

నేనొక ప్రభుత్వ ఉద్యోగిని. ఇప్పటివరకూ నా ప్రావిడెండ్ ఫండ్‌లో కనీస మొత్తమే ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఇక ఇప్పటి నుంచి వచ్చే పదేళ్ల వరకూ నెలకు రూ.5,000 చొప్పున ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. ఇలా కాకుండా ఆ మొత్తాన్ని ఏదైనా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయమని మిత్రులు చెబుతున్నారు. ఈ రెండిటిలో దేంట్లో ఇన్వెస్ట్ చేస్తే మంచి రాబడులు వస్తాయి? ఒక వేళ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తేనే మంచి రాబడులు వచ్చే పక్షంలో నేను ఇన్వెస్ట్ చేయడానికి కొన్ని మంచి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ సూచించగలరు?
 -ప్రసన్న, హైదరాబాద్

 పదేళ్ల దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు. కాబట్టి ప్రావిడెండ్ ఫండ్‌లో కన్నా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్‌లోనే ఇన్వెస్ట్ చేస్తే మంచి రాబడులు పొందవచ్చు. ఈపీఎఫ్‌ఓ సురక్షితమైనదే కానీ, ద్రవ్యోల్బణాన్ని తట్టుకునే రాబడులను ఇవ్వలేదు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్.. కొంత నష్ట భయం ఉన్నప్పటికీ, పదేళ్ల పాటు ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి దీర్ఘకాల పెట్టుబడుల ప్రయోజనాలు పొందవచ్చు. ఇక మీరు అనుకున్నట్లే నెలకు రూ.5,000 చొప్పున ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్(సిప్) విధానంలో ఇన్వెస్ట్ చేయండి. ఒక లార్జ్ క్యాప్ ఫండ్‌లో కానీ, ఒక మిడ్ క్యాప్ ఫండ్‌లో కానీ ఇన్వెస్ట్ చేయవచ్చు.

లేదా ఒక లార్జ్‌క్యాప్ ఫండ్‌లో కొంత, మరో మిడ్‌క్యాప్ ఫండ్‌లో మరికొంత చొప్పున ఇన్వెస్ట్ చేయవచ్చు. లార్జ్‌క్యాప్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే..., హెచ్‌డీఎఫ్‌సీ క్యాపిటల్ బిల్డర్, ఫ్రాంక్లిన్ ఇండియా ఫ్లెక్సిక్యాప్, క్వాంటమ్ లాంగ్ టెర్మ్ ఈక్విటీ.. లను పరిశీలించవచ్చు. మిడ్ క్యాప్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయడానికైతే.., బిర్లా సన్‌లైఫ్ ఫ్రంట్‌లైన్ ఈక్విటీ ఫండ్, హెచ్‌డీఎఫ్‌సీ మిడ్-క్యాప్ ఆపర్చ్యునిటీస్ ఫండ్‌లను పరిశీలించవచ్చు. ఈ ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్ చేసిన 7,8 సంవత్సరాల తర్వాత మీ ఇన్వెస్ట్‌మెంట్స్ అన్నింటిని సిస్టమాటిక్ ట్రాన్సఫర్ ప్లాన్(ఎస్‌టీపీ) ద్వారా డెట్ ఫండ్స్‌కు బదిలీ చేస్తే, అప్పటి మార్కెట్ ఒడిదుడుకుల నుంచి గట్టెక్కవచ్చు. కనీసం ఏడాదికొకసారైనా మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను సమీక్షించడం మాత్రం మరచిపోకండి. గ్రీస్ రుణ సంక్షోభం, చైనా స్టాక్ మార్కెట్ సూచీ భారీ పతనం... ఈ రెండు అంశాల కారణంగా ఇటీవల కాలంలో స్టాక్ మార్కెట్ తీవ్రమైన ఒడిదుడుకులకు గురవడం మాలాంటి రిటైల్ ఇన్వెస్టర్లను బాగా ఆందోళన పరుస్తోంది. భవిష్యత్తులో ఈ రెండు అంశాల ప్రభావం ఎలా ఉండబోతోంది ? రిటైల్ ఇన్వెస్టర్లుగా మేము ఏం చేయాలి?
 -రాజేష్, విశాఖపట్నం

 మీరన్నట్లు గ్రీస్ రుణ సంక్షోభం, చైనా షాంఘై స్టాక్ మార్కెట్ సూచీ భారీ పతనం కారణంగా స్టాక్ మార్కెట్ తీవ్రమైన ఒడిదుడుకులకు గురైంది. ఇది ఒకింత ఆందోళన కలిగించే విషయమే. అయితే సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్(సిప్) విధానంలో దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్టర్లు భయపడాల్సిన పని లేదు. మీ ఆర్థిక లక్ష్యాలకనుగుణంగా మీ ఆర్థిక ప్రణాళికకు కట్టుబడి ఉండండి. మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయండి. ఇప్పటికే ఇలాంటి ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్ ఉంటే వాటిని నిస్సంకోచంగా కొనసాగించండి. డైవర్సిఫికేషన్‌ను పాటించడం మాత్రం మరచిపోకండి. డివిడెండ్‌లు క్రమం తప్పకుండా చెల్లించే ఒక మంచి మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. అలాంటి ఫండ్స్ ఏమైనా ఉన్నాయా? ఉంటే వాటి వివరాలు వెల్లడించండి.
 -శ్రీనివాస్, ఈమెయిల్

 ఇన్వెస్ట్‌మెంట్‌కు సంబంధించి ఇది సరైన విధానం కాదు. మ్యూచువల్ ఫండ్స్ విషయంలో డివిడెండ్‌లు అసలు పరిగణించే విషయమే కాదు. ఒపెన్ ఎండ్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే, ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు, ఎంత కావాలనుకుంటే అంత, లేకపోతే  మొత్తం ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఉపసంహరించుకోవచ్చు. దీర్ఘకాలం పాటు మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే, మంచి రాబడులు పొందవచ్చు. డివిడెండ్ చెల్లింపులను బట్టి మ్యూచువల్ ఫండ్స్‌లో ఎప్పుడూ ఇన్వెస్ట్ చేయకూడదు. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లాంగ్-టెర్మ్ ఫండ్ రెగ్యులర్ ఆప్షన్‌లో ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. ఆ తర్వాత కొంత కాలానికి ఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ డైనమిక్ ఫండ్‌కు సిస్టమాటిక్ ట్రాన్స్‌ఫర్ ప్లాన్(ఎస్‌టీపీ) ద్వారా బదిలీ చేయాలనుకుంటున్నాను. ఇది సరైన నిర్ణయమేనా?
 -నీరజ, తిరుపతి

 పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేయాలనుకునే మీలాంటి వారికి ఇది సరైన నిర్ణయమే. ఇంతకు ముందు మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయని వారికి, ఐదేళ్ల పాటు ఇన్వెస్ట్ చేయాలనుకునేవారికి ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ డైనమిక్ ఫండ్ అనేది సరైన ఎంపికే. మీరనుకుంటున్నట్లుగా మీ నిర్ణయాన్ని అమలుపరచండి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement