ఉద్యోగుల భవిష్య నిధి (పీఎఫ్) వాటాను ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ)కు చెల్లించడంలో యాజమాన్యాలు విఫలమవుతున్నాయి. ఈపీఎఫ్‌ఓ డిఫాల్ట్‌ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. 2023-24లో ఈపీఎఫ్ఓ డిఫాల్ట్‌లు రూ.25,820.88 కోట్లకు చేరుకున్నాయి. ఇది అంతకుముందు ఏడాదితో పోలిస్తే 69.3 శాతం అధికంగా ఉంది. ఇది గతంలో రూ.15,254.06 కోట్లు ఉండేదని అధికారిక గణాంకాలు తెలియజేస్తున్నాయి.
పీఎఫ్ కాంట్రిబ్యూషన్ల బకాయిలు తెలంగాణలోనే అధికంగా ఉన్నట్లు తెలిసింది. కొన్ని కంపెనీల్లో తలెత్తుతున్న ఆర్థిక ఇబ్బందులు, పరిపాలనాపరమైన లోపాలు లేదా ఉద్దేశపూర్వకంగానే ఈ ఎగవేతలు జరుగుతున్నట్లు అంచనా వేస్తున్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి ఈపీఎఫ్ఓ రాష్ట్ర ప్రభుత్వ సహాయం కోరడం, ఎగవేతదారుల వివరాలను పబ్లిక్ డొమైన్‌లో ప్రచారం చేయడం, ఎగవేతదారుల చరాస్తులు, స్థిరాస్తులను జప్తు చేయడం వంటి అనేక చర్యలు తీసుకుంటోంది.
ఇదీ చదవండి: స్పామ్ కాల్స్, ఆన్‌లైన్ మోసాల కట్టడికి సూచనలు
ఈపీఎఫ్ఓ రికవరీ ఇలా..
రాష్ట్ర ప్రభుత్వ సహాయం: బకాయిల రికవరీకి వీలుగా ఈపీఎఫ్‌ఓ రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తోంది. స్థానిక ప్రభుత్వాల మద్దతుతోపాటు అక్కడి పరిపాలనా యంత్రాంగాన్ని ఉపయోగించడం వల్ల రికవరీకి అవకాశం ఉంటుందని నమ్ముతుంది.
డిఫాల్టర్ల వివరాలు ప్రచారం చేయడం: కొత్తగా ఉద్యోగంలో చేరాలనుకునే వారికి అవగాహన కల్పించడంతోపాటు నిబంధనలు పాటించకపోవడంపై సంస్థలకు సమాచారం అందించేందుకు డిఫాల్ట్ కంపెనీల పేర్లను ప్రచారం చేస్తున్నారు.
ఆస్తుల అటాచ్‌మెంట్: ఈపీఎఫ్‌వో యాజమాన్యాల చరాస్తులు, స్థిరాస్తులను జప్తు చేస్తోంది. ఈ చట్టపరమైన చర్యల వల్ల నగదుగా మార్చగల ఆస్తులను స్వాధీనం చేసుకుని బకాయి వసూలు చేస్తోంది.
చట్టపరమైన చర్యలు: దీర్ఘకాలిక ఎగవేతదారులపై ఈపీఎఫ్ఓ చట్టపరమైన చర్యలు తీసుకుంటోంది. నిబంధనలు పాటించని వారిపై కేసులు నమోదు చేయడం, కఠిన శిక్షలు విధించేలా చూస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment