
చాలా మంది మహిళలకు, ముఖ్యంగా గృహిణులకు ఇంటి బడ్జెట్లు చూసుకోవడం, ఖర్చుల విషయంలో నిర్ణయాలు తీసుకోవడం, భవిష్యత్తు కోసం ప్రణాళికలు వేసుకోవడమనేది దైనందిన చర్యగానే ఉంటుంది. ఈ బాధ్యతలే ఆర్థిక వ్యవహారాలను చక్కబెట్టడం, కమ్యూనికేషన్, సమస్యలను పరిష్కరించగలిగే సామర్థ్యాల్లాంటి అమూల్యమైన నైపుణ్యాలను అలవర్చుకోవడానికి ఉపయోగపడతాయి. విజయవంతమైన జీవిత బీమా అడ్వైజరు/ కన్సల్టెంటుగా మారాలంటే అచ్చంగా ఇలాంటి నైపుణ్యాలే అవసరం.
అడ్వైజరు, కన్సల్టెంటుగా మారడమనేది, జీవిత లక్ష్యాలకు సంబంధించి ప్రణాళికలు వేసుకోవడంలో ఇతరులకు తోడ్పడటంతో పాటు తమ దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల కోసం కూడా కృషి చేయడానికి ఉపయోగపడుతుంది. ఐఆర్‌డీఏఐ ప్రకారం 2022 మార్చి నాటికి దేశీయంగా మొత్తం జీవిత బీమా ఏజెంట్లలో మహిళల వాటా 29 శాతంగా ఉంది. సుమారు 24.43 లక్షల మంది ఏజంట్లలో దాదాపు 7 లక్షల మంది మహిళా ఏజంట్లు ఉన్నారు. మహిళలు ముందుకొచ్చి, అవకాశాలను అందిపుచ్చుకుంటే, ఈ సంఖ్య మరింతగా పెరగొచ్చు.
అడ్వైజరుగా ఇలా మారొచ్చు..
1. ప్రాథమిక అర్హతలు, శిక్షణ: బీమా పథకాలు, విక్రయించేందుకు టెక్నిక్‌లు, ఆర్థిక ప్రణాళిక సూత్రాలు మొదలైన విషయాల్లో అభ్యర్థులకు అవగాహన కల్పించేలా చాలా మటుకు కంపెనీలు శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తుంటాయి. సమర్ధవంతంగా క్లయింట్లకు మార్గదర్శకత్వం వహించేందుకు మహిళలకు అవసరమయ్యే సాధన సంపత్తిని వీటి ద్వారా సమకూర్చుకోవచ్చు.
2. నెట్‌వర్కింగ్: క్లయింట్ల నమ్మకాన్ని చూరగొనాలంటే సంభాషించే నైపుణ్యాలు, ఇతరులతో కలిసి పని చేయగలగడం, అవసరమైతే సారథ్య బాధ్యతలు చేపట్టడం, పరిస్థితులకు అనుగుణంగా తమను తాము మల్చుకోగలిగే సామర్థ్యాల్లాంటివి చాలా ముఖ్యం. తాము అడ్వైజరుగా వ్యవహరించే సంస్థల సహాయంతో మహిళలు సామర్థ్యాలను మెరుగుపర్చుకుని, దీర్ఘకాలిక ప్రొఫెషనల్ కనెక్షన్లను ఏర్పర్చుకోవచ్చు.
3. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగించుకోవడం: డిజిటల్ యుగంలో భావి కస్టమర్లను చేరుకునేందుకు సోషల్ మీడియా, డిజిటల్ మార్కెటింగ్ అనేవి శక్తివంతమైన సాధనాలుగా ఉంటున్నాయి. తమ అనుభవాన్ని తెలియజేసేందుకు, భావి కస్టమర్లలో అవగాహనను పెంపొందించేందుకు మహిళలు ఈ ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగించుకోవచ్చు.
4. నిరంతరం నేర్చుకోవడం, అభివృద్ధి చెందడం: పరిశ్రమలో వచ్చే కొత్త పోకడలు, కొత్త ప్రోడక్టులు, నియంత్రణ నిబంధనలపరమైన మార్పుల గురించి ఎప్పటికప్పుడు అప్‌డేట్‌గా ఉంటే దీర్ఘకాలికంగా విజయాలకు దోహదపడుతుంది. సంబంధిత సర్టిఫికేషన్ల పొందితే కెరియర్‌లో పురోగమించడానికి ఉపయోగకరంగా ఉంటుంది.
చివరగా చెప్పేదేమిటంటే మహిళలు, ముఖ్యంగా గృహిణులు తమకు అంతర్గతంగా ఉండే నైపుణ్యాలను పూర్తి స్థాయిలో ఉపయోగించుకుని, కెరియర్‌ను నిర్మించుకోవడానికి జీవిత బీమా రంగం అవకాశం కల్పిస్తుంది.
సరైన శిక్షణ, సంకల్పం, నెట్‌వర్కింగ్ సామర్థ్యాలను అలవర్చుకుంటే ఫైనాన్షియల్ అడ్వైజర్లుగా మహిళలూ విజయవంతగా రాణించగలరు. ఫైనాన్షియల్ అడ్వైజర్లు కావడం ద్వారా ఆర్థిక స్వాతంత్య్రం, వర్క్–లైఫ్ సమతుల్యత, ఇతరులకు సాధికారత కల్పించే సంతృప్తిని పొందవచ్చు.
ఇదీ చదవండి: ఇక ఒక రాష్ట్రం–ఒక ఆర్‌ఆర్‌బీ!
జీవిత బీమాలో కెరియర్‌తో ఆర్థిక స్వాతంత్య్రం
జీవిత బీమా రంగంలో మహిళలు కెరియర్‌పరంగా పురోగమించడంతో పాటు ఆర్థికంగా సాధికారతను కూడా పొందేందుకు అవకాశాలు ఉన్నాయి. లైఫ్ ఇన్సూరెన్స్ కన్సల్టెంటుగా కెరియర్ ఇటు వ్యక్తిగత బాధ్యతలు, అటు ప్రొఫెషనల్ ఆకాంక్షల మధ్య సమతౌల్యం పాటిస్తూ, ఆర్థికంగా స్థిరత్వాన్ని పొందేందుకు వెసులుబాటు కల్పిస్తుంది. స్థిరమైన ఆదాయార్జన పొందడంతో పాటు అర్థవంతమైన ప్రభావాన్ని చూపేందుకు ఇందులో పుష్కలంగా అవకాశాలు ఉన్నాయి. తద్వారా తమ కుటుంబ ఆర్థిక పరిస్థితులను మెరుగుపర్చుకోవడంలో తోడ్పడటమే కాకుండా ఆర్థిక స్వాతంత్య్రం పొందేందుకు కూడా ఇది ఉపయోగపడగలదు.
-సమీర్ జోషి, చీఫ్ ఏజెన్సీ ఆఫీసర్, బజాజ్ అలయంజ్ లైఫ్ ఇన్సూరెన్స్