defaulters
-
రూ.25,820 కోట్లకు చేరిన పీఎఫ్ బకాయిలు!
ఉద్యోగుల భవిష్య నిధి (పీఎఫ్) వాటాను ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ)కు చెల్లించడంలో యాజమాన్యాలు విఫలమవుతున్నాయి. ఈపీఎఫ్ఓ డిఫాల్ట్‌ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. 2023-24లో ఈపీఎఫ్ఓ డిఫాల్ట్‌లు రూ.25,820.88 కోట్లకు చేరుకున్నాయి. ఇది అంతకుముందు ఏడాదితో పోలిస్తే 69.3 శాతం అధికంగా ఉంది. ఇది గతంలో రూ.15,254.06 కోట్లు ఉండేదని అధికారిక గణాంకాలు తెలియజేస్తున్నాయి.పీఎఫ్ కాంట్రిబ్యూషన్ల బకాయిలు తెలంగాణలోనే అధికంగా ఉన్నట్లు తెలిసింది. కొన్ని కంపెనీల్లో తలెత్తుతున్న ఆర్థిక ఇబ్బందులు, పరిపాలనాపరమైన లోపాలు లేదా ఉద్దేశపూర్వకంగానే ఈ ఎగవేతలు జరుగుతున్నట్లు అంచనా వేస్తున్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి ఈపీఎఫ్ఓ రాష్ట్ర ప్రభుత్వ సహాయం కోరడం, ఎగవేతదారుల వివరాలను పబ్లిక్ డొమైన్లో ప్రచారం చేయడం, ఎగవేతదారుల చరాస్తులు, స్థిరాస్తులను జప్తు చేయడం వంటి అనేక చర్యలు తీసుకుంటోంది.ఇదీ చదవండి: స్పామ్ కాల్స్, ఆన్లైన్ మోసాల కట్టడికి సూచనలుఈపీఎఫ్ఓ రికవరీ ఇలా..రాష్ట్ర ప్రభుత్వ సహాయం: బకాయిల రికవరీకి వీలుగా ఈపీఎఫ్ఓ రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తోంది. స్థానిక ప్రభుత్వాల మద్దతుతోపాటు అక్కడి పరిపాలనా యంత్రాంగాన్ని ఉపయోగించడం వల్ల రికవరీకి అవకాశం ఉంటుందని నమ్ముతుంది.డిఫాల్టర్ల వివరాలు ప్రచారం చేయడం: కొత్తగా ఉద్యోగంలో చేరాలనుకునే వారికి అవగాహన కల్పించడంతోపాటు నిబంధనలు పాటించకపోవడంపై సంస్థలకు సమాచారం అందించేందుకు డిఫాల్ట్ కంపెనీల పేర్లను ప్రచారం చేస్తున్నారు.ఆస్తుల అటాచ్మెంట్: ఈపీఎఫ్‌వో యాజమాన్యాల చరాస్తులు, స్థిరాస్తులను జప్తు చేస్తోంది. ఈ చట్టపరమైన చర్యల వల్ల నగదుగా మార్చగల ఆస్తులను స్వాధీనం చేసుకుని బకాయి వసూలు చేస్తోంది.చట్టపరమైన చర్యలు: దీర్ఘకాలిక ఎగవేతదారులపై ఈపీఎఫ్ఓ చట్టపరమైన చర్యలు తీసుకుంటోంది. నిబంధనలు పాటించని వారిపై కేసులు నమోదు చేయడం, కఠిన శిక్షలు విధించేలా చూస్తోంది. -
డీహెచ్ఎఫ్ఎల్ స్కామ్.. నిందితులకు బెయిల్ రద్దు చేసిన సుప్రీంకోర్టు
దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్(డీహెచ్ఎఫ్ఎల్), దాని మాజీ ప్రమోటర్లు కపిల్ వాధ్వాన్, దీరజ్ వాధ్వాన్‌పై సీబీఐ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. యూనియన్ బ్యాంక్ నేతృత్వంలోని కన్షార్షియాన్ని రూ.34,615 కోట్ల మేర డీహెచ్ఎఫ్ఎల్ మోసగించిందన్న అభియోగాలపై సీబీఐ గతంలో కేసు నమోదు చేసింది. ఈ కేసుకు సంబంధించి కపిల్, ధీరజ్లకు దిల్లీ హైకోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను సుప్రీంకోర్టు బుధవారం రద్దు చేసింది. జస్టిస్ బేల ఎం త్రివేదితో కూడిన ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది. నిందితులకు బెయిల్ మంజూరు చేయడంలో హైకోర్టు, ట్రయల్ కోర్టు ఇంకాస్త మెరుగ్గా స్పందించాల్సిందని సుప్రీంకోర్టు తెలిపింది. డీహెచ్ఎఫ్ఎల్ లోన్ స్కామ్‌కు సంబంధించి సమగ్ర దర్యాప్తు జరిపిన సీబీఐ ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. సీఆర్పీసీ ప్రకారం 90 రోజుల దర్యాప్తు గడువులోపు క్రిమినల్ కేసులో ఛార్జ్‌షీట్ దాఖలు చేయడంలో విఫలమైతే నిందితులకు బెయిల్ మంజూరు చేసే అవకాశం ఉంది. అయితే ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన 88వ రోజు సీబీఐ ఛార్జ్‌షీట్ దాఖలు చేయగా, ట్రయల్ కోర్టు నిందితులకు కోర్టు డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేసింది. దాన్ని సవాలుచేస్తూ అధికారులు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ఈతీర్పు వెలువడినట్లు తెలిసింది. అసలేం జరిగిందంటే.. డీహెచ్ఎఫ్ఎల్ మోసాలు 2019 జనవరి నుంచి వెలుగులోకి రావడం మొదలైంది. ఈ సంస్థ నిధులు మళ్లిస్తోందంటూ ప్రసార మాధ్యమాల్లో వార్తలు వచ్చాయి. డీహెచ్ఎఫ్ఎల్పై ‘ప్రత్యేక ఆడిట్’ నిర్వహించాలంటూ కేపీఎమ్‌జీ సంస్థను 2019 ఫిబ్రవరి 1న బ్యాంకులు నియమించాయి. 2015 ఏప్రిల్ 1-2018 డిసెంబరు మధ్యకాలానికి, ఆ సంస్థ ఖాతా పుస్తకాలపై సమీక్ష నిర్వహించాలని కేపీఎమ్‌జీని అప్పట్లో కోరాయి. కపిల్, ధీరజ్ వాధ్వాన్లు దేశం విడిచిపెట్టకుండా ఉండేందుకు 2019 అక్టోబరు 18న ‘లుక్అవుట్ సర్క్యులర్’లను బ్యాంకులు జారీ చేశాయి. కేపీఎమ్‌జీ నిర్వహించిన ఆడిట్లో.. రుణాలు, అడ్వాన్సులు పొందిన తర్వాత డీహెచ్ఎఫ్ఎల్కు చెందిన సంస్థలు, వ్యక్తులు, డైరెక్టర్ల ఖాతాలకు నిధుల మళ్లింపు జరిగిందని తేలినట్లు యూనియన్ బ్యాంకు పేర్కొంది. డీహెచ్ఎఫ్ఎల్ ప్రమోటర్లకు రూ.29,100 కోట్ల మేర పంపిణీ జరిగినట్లు తెలుస్తుంది. ఇందులో చాలా వరకు లావాదేవీలు భూములు, ఆస్తుల రూపంలో పెట్టుబడులు పెట్టినట్లు బ్యాంకు ఖాతా పుస్తకాల పరిశీలనలో తేలినట్లు వివరించింది. రుణాలిచ్చిన నెలరోజుల్లోనే ఆ నిధులు సుధాకర్ షెట్టికి చెందిన కంపెనీల్లోకి పెట్టుబడుల రూపంలో మళ్లినట్లు తేలింది. రూ.వందల కోట్ల చెల్లింపులకు సంబంధించిన వివరాలు బ్యాంకు స్టేట్మెంట్లలో కనిపించలేదు. రుణాల అసలు, వడ్డీలపై సహేతుకం కాని రీతిలో మారటోరియం కనిపించింది. పలు సందర్భాల్లో డీహెచ్ఎఫ్ఎల్, తన ప్రమోటర్లకు భారీ ఎత్తున నిధులను పంపిణీ చేసింది. వాటిని తమ ఖాతా పుస్తకాల్లో రిటైల్ రుణాలుగా పేర్కొన్నారు. రూ.14,000 కోట్ల గల్లంతు ప్రాజెక్ట్ ఫైనాన్స్ కింద రూ.14,000 కోట్లు ఇచ్చినట్లు చూపారు. ఇందు కోసం 1,81,664 మందికి రిటైల్ రుణాలు ఇచ్చినట్లు తప్పుగా సృష్టించారు. ఇవ్వని రుణాల విలువ రూ.14,095 కోట్లుగా తేలింది. తరుచుగా.. ‘బాంద్రా బుక్స్’ పేరిట రుణాలను పేర్కొంటూ, వాటికి విడిగా డేటాబేస్ నిర్వహించారు. ఆ తర్వాత వాటన్నింటినీ ‘అదర్ లార్జ్ ప్రాజెక్ట్ లోన్స్’(ఓఎల్‌పీఎల్)లో విలీనం చేశారు. కాగా, కంపెనీకి చెందిన గృహ రుణాలు, ప్రాజెక్టు రుణాల హామీలు, ప్రమోటర్ల వాటా అమ్మకం తదితరాల ద్వారా కంపెనీపై ఒత్తిడి తగ్గించడానికి ప్రయత్నిస్తున్నట్లు ఎప్పటికప్పుడు డీహెచ్ఎఫ్ఎల్, ఆ కంపెనీ డైరెక్టర్లు, ఎగ్జిక్యూటివ్‌లు చెబుతూ వచ్చారు. ఇదీ చదవండి: సేవింగ్స్ ఖాతాలపై 7.75 శాతం వడ్డీ కావాలా..! 2019 మే నుంచి రుణాల చెల్లింపులు, వడ్డీలను డీహెచ్ఎఫ్ఎల్ ఆలస్యం చేస్తూ వచ్చింది. ఆ తర్వాత నిరర్థక ఆస్తులుగా కంపెనీ ఖాతాలను ప్రకటించారు. దాంతో బ్యాంకులపై ఒత్తిడి పెరిగింది. ఫలితంగా రూ.34,615 కోట్ల మోసానికి పాల్పడినట్లు తేలింది. ఎఫ్ఐఆర్లో మాజీ ప్రమోటర్లతోపాటు అమిలిస్ రియల్టర్స్‌కు చెందిన సుధాకర్ షెట్టి, మరో ఎనిమిది మంది బిల్డర్లు కూడా ఉన్నారు. -
ప్రభుత్వ బ్యాంక్ ‘స్వీట్’ ఐడియా! మిఠాయిలిచ్చి ప్రేమగా అడుగుదాం..
మొండి బకాయిలను రికవరీ చేసే ప్రయత్నాల్లో భాగంగా ప్రభుత్వ రంగ యూకో బ్యాంక్ (UCO Bank) సరికొత్త ఆలోచన చేసింది. ప్రతి శాఖలోని టాప్ 10 డిఫాల్టర్లకు 'స్వీట్ ప్యాకెట్లు' పంపాలని నిర్ణయించింది. ఈ మేరకు సర్క్యులర్ జారీ చేసింది. వాళ్లూ ఒకప్పుడు విలువైన కస్టమర్లే ప్రస్తుతం డిఫాల్టర్‌గా మారినవాళ్లు ఒకప్పుడు విలువైన కస్టమర్ అనే విషయాన్ని బ్యాంకు మరచిపోదని యూకో బ్యాంక్ జనరల్ మేనేజర్ (రికవరీ) ధీరజ్ పట్వర్ధన్ అన్ని జోనల్ హెడ్లకు జారీ చేసిన సర్క్యులర్‌లో పేర్కొన్నారు. ఇదీ చదవండి: రూ.2వేల నోట్లు మార్చడానికి కిరాయి మనుషులు.. ఆర్బీఐ ఆఫీస్ వద్ద హల్చల్! కాబట్టి, అటువంటి కస్టమర్లతో "సరైన అనుసంధానం"తో వారికి, బ్యాంకుకు మధ్య ఏర్పడిన అంతరాన్ని తగ్గించవచ్చని ఆయన అన్నారు. దీనివల్ల బ్యాంక్ పట్ల సానుభూతి, సామరస్యం పెరుగుతాయని, కొంత మంది రుణగ్రహీతలు తమ బకాయిలు సెటిల్ చేయడానికి ముందుకు వస్తారని వివరించారు. స్వీట్లిచ్చి దీపావళి శుభాకాంక్షలు దీనికి సంబంధించి యూకో బ్యాంక్ జారీ సర్కులర్‌ను ప్రముఖ బ్యాంకింగ్ కాలమిస్ట్ తమల్ బందోపాధ్యాయ తన ‘ఎక్స్’ (ట్విటర్) ఖాతాలో షేర్ చేశారు. ప్రతి బ్రాంచ్‌లోని టాప్ 10 ఎన్పీఏ రుణగ్రహీతలకు స్వీట్ ప్యాకెట్లను పంపిణీ చేయాలని, బ్రాంచ్ హెడ్లు వారిని వ్యక్తిగతంగా కలుసుకుని, దీపావళి శుభాకాంక్షలు తెలియజేయాలని సర్క్యులర్‌లో బ్యాంక్ యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది. ఇదీ చదవండి: ప్రైవేటు బ్యాంకుల్లో ఎక్కువగా ఉద్యోగ వలసలు.. ఆర్బీఐ డేగకన్ను! గత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో రూ. 124 కోట్లతో పోలిస్తే ఈ ఏడాది ఇదే త్రైమాసికంలో బ్యాంక్ నికర లాభం రూ. 223 కోట్లకు పెరిగి 80.80 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఈ త్రైమాసికంలో నికర వడ్డీ ఆదాయం గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ. 1,650 కోట్ల నుంచి 21.78 శాతం పెరిగి రూ. 2,009 కోట్లకు చేరుకున్నట్లు యూకో బ్యాంక్ పేర్కొంది. బ్యాంక్ ఎన్పీఏ రుణాలు ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో 4.48 శాతంగా ఉన్నాయి. ఇవి మార్చిలో 4.78 శాతం కాగా గతేడాది ఇదే త్రైమాసికంలో 7.42 శాతంగా ఉన్నాయి. Wonderful idea. UCO Bank plans to celebrate Diwali, greeting top ten #NPA borrowers of every branch with sweets. @UCOBankOfficial @ChairmanIba @ChiefIba pic.twitter.com/HZJMenPnz5 — Tamal Bandyopadhyay (@TamalBandyo) November 2, 2023 -
ఉద్దేశపూర్వక ఎగవేతదార్ల నిబంధనలు కఠినతరం
ముంబై: ఉద్దేశపూర్వక ఎగవేతదారుల నిబంధనలకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ సవరణలను ప్రతిపాదించింది. రూ. 25 లక్షలకు పైన బాకీ పడి, స్థోమత ఉన్నా చెల్లించడానికి నిరాకరిస్తున్న వారిని ఈ పరిధిలోకి చేర్చేలా నిర్వచనాన్ని మార్చనున్నట్లు ముసాయిదా ప్రతిపాదనల్లో పేర్కొంది. ఈ కోవకు చెందిన డిఫాల్టర్లకి రుణ సదుపాయాన్ని పునర్వ్యవస్థీకరించుకునేందుకు అర్హత ఉండదు. అలాగే ఇతరత్రా ఏ కంపెనీ బోర్డులోనూ పదవులు చేపట్టే వీలుండదు. బాకీలను వేగవంతంగా రాబట్టుకునేందుకు అవసరాన్ని బట్టి సదరు రుణగ్రహీతలు, హామీదారులపై బ్యాంకులు చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. మొండిబాకీగా వర్గీకరించిన పద్దుకు సంబంధించి ఆరు నెలల వ్యవధిలో ఉద్దేశపూర్వక ఎగవేత అవకాశాలను సమీక్షించి, తగు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ముసాయిదాపై సంబంధిత వర్గాలు అక్టోబర్ 31లోగా ఆర్బీఐకి తమ అభిప్రాయాలు తెలియజేయాల్సి ఉంటుంది. -
వారికి 6 నెలలే సమయం.. ఆర్బీఐ కీలక నిబంధనలు
అప్పుల ఎగవేతదారులకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక నిబంధనలు ప్రతిపాదించింది. అకౌంట్లు నిరర్థకంగా మారిన ఆరు నెలల్లోపు సదరు రుణగ్రహీతలను ఉద్దేశపూర్వక ఎగవేతదారులు (Wilful Defaulters)గా ప్రకటించాలని బ్యాంకులకు, రుణ సంస్థలకు సూచించింది. (20 శాతం ట్యాక్స్.. అక్టోబర్ 1 నుంచే..) బకాయిలను చెల్లించగల సామర్థ్యం ఉండీ కూడా రుణాలు తిరిగి చెల్లించకుండా నిధులను ఇతర మార్గాలకు మళ్లీంచేవారిని ఆర్బీఐ ‘ఉద్దేశపూర్వక ఎగవేతదారులు’ పరిగణిస్తుంది. అయితే దీనికి నిర్ధిష్ట కాల వ్యవధిని మాత్రం ఆర్బీఐ ఇంతవరకూ నిర్దేశించలేదు. ఇప్పుడు ప్రతిపాదించిన 6 నెలల కాలవ్యవధి నిబంధనలకు అనుగుణంగా నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు (NBFC) కూడా ఉద్దేశపూర్వక ఎగవేతదారులను ప్రకటించవచ్చు. ఈ ప్రక్రియలో భాగంగా సమీక్షా కమిటీని ఏర్పాటు చేయాలని బ్యాంకులకు, ఎన్‌బీఎఫ్‌సీలకు ఆర్బీఐ సూచించింది. అలాగే రుణగ్రహీత రాతపూర్వకంగా సమాధానమిచ్చేందుకు 15 రోజుల సమయం ఇవ్వాలని, అవసరమైతే వ్యక్తిగతంగా విచారణకు సైత అవకాశం ఇవ్వాలని ఆర్బీఐ తన డ్రాఫ్ట్ మాస్టర్ ఆదేశాలలో పేర్కొంది. ఒక ఖాతా ఉద్దేశపూర్వకంగా డిఫాల్ట్ అయినట్లు ప్రకటిస్తే.. తిరిగి ఆ ట్యాగ్ తొలగించిన ఒక సంవత్సరం వరకు బ్యాంకులు అదనపు రుణాలు మంజూరు చేయకూడదని ఆర్బీఐ నిర్దేశించింది. డిఫాల్ట్ అయిన ఖాతాను మరొక బ్యాంకుకు, రుణ సంస్థకు లేదా అసెట్ రీకన్‌స్ట్రక్షన్‌కు బదిలీ చేయడానికి ముందు 'విల్‌ఫుల్ డిఫాల్ట్'ని నిర్ధారించడానికి లేదా తోసిపుచ్చడానికి దానిపై విచారణ పూర్తి చేయాల్సి ఉంటుందని సెంట్రల్ బ్యాంక్ తెలిపింది. అటువంటి ఖాతాలను రీస్ట్రక్చర్ చేయడానికి వీలుండదని స్పష్టం చేసింది. ముసాయిదా నిబంధనలపై వాటాదారులు అక్టోబర్ 31 వరకు తమ అభిప్రాయాన్ని తెలియజేయవచ్చు. -
కొంపముంచుతున్న క్రెడిట్ కార్డు బకాయిలు: డిఫాల్ట్ అయితే ఏం చేయాలో తెలుసా?
ప్రస్తుతకాలంలో క్రెడిట్ కార్డు వినియోగం బాగా పెరిగింది. దాదాపు ప్రతీ బ్యాంకు ఖాతాదారుడికి క్రెడిట్ కార్డు ఉంటుందనడంలో సందేహం లేదు. ఎందుకంటే అకౌంట్లో తగినంత డబ్బు లేకపోయినా, క్రెడిట్ ద్వారా సులువుగా కొనుగోళ్లు చేసుకునే వెసులుబాటుతోపాటు, క్యాష్‌బ్యాక్, రివార్డ్ పాయింట్ల , డిస్కౌంట్ల వంటి ప్రయోజనాలు లభిస్తాయి. అంతేకాదు క్రెడిట్ స్కోరుతో లోన్లను సులువుగా పొందవచ్చు. ఈనేపథ్యంలోనే గత రెండేళ్లలో క్రెడిట్ కార్డ్ హోల్డర్లు తమ లిమిట్‌ను భారీగా పెంచు కున్నారు. క్రెడిట్ కార్డ్‌లపై బకాయిల మొత్తం రెండేళ్లలో దాదాపు నాలుగు రెట్లు పెరిగింది. అదేసమయంలో క్రెడిట్ కార్డ్‌లపై లావాదేవీ విలువ రెండింతల పెరిగిందని TruBoardPartners అధ్యయనం తెలిపింది. రూ. 951 కోట్లు పెరిగిన క్రెడిట్ కార్డ్ డిఫాల్ట్స్ సమాచార హక్కు చట్టం (RTI) కింద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) డేటా ప్రకారం, క్రెడిట్ కార్డ్ డిఫాల్ట్‌లు 2022 ఆర్థిక సంవత్సంలో లో రూ. 3,122 కోట్ల నుండి 2023లో రూ.951 కోట్లు పెరిగి రూ. 4,073 కోట్లకు చేరాయి. (ప్రౌడ్ ఫాదర్ జస్ప్రీత్ బుమ్రా నెట్‌వర్త్, లగ్జరీ కార్లు, ఈ వివరాలు తెలుసా?) క్రెడిట్ కార్డ్ డిఫాల్ట్ అంటే ఏమిటి? అవకాశం ఉంది కదా అని ఇబ్బబిముబ్బడిగావాడటం, చెల్లింపులు చేయకపోవడం ఆందోళన కరంగా మారుతోంది. విచక్షణా రహితంగా క్రెడిట్ కార్డు వాడేసి, తరువాత చెల్లించడంలో విఫలమైనా, అనుకోని కారణాలతో చెల్లింపులు చేయలేకపోయినా కూడా తిప్పలు తప్పవు. ఈ క్రమంలో క్రెడిట్ కార్డ్ డిఫాల్ట్ అంటే ఏమిటి? క్రెడిట్ కార్డ్ చెల్లింపు డిఫాల్ట్ అయితే పరిష్కారం ఏమిటి అనే విషయాలను ఒకసారి చూద్దాం. (జీతాల పెంపు: దిగ్గజ ఐటీ కంపెనీల ఉద్యోగులకు షాక్! ) క్రెడిట్ కార్డ్ ద్వారా సాధారణ ఖర్చులు, మెడికల్ బిల్లు,తదితర అత్యవసర కొనుగోళ్లు చేయవచ్చు. ఆ తరువాత వీటిని బ్యాంకు నిర్దేశించిన గడువు లోపల చెల్లించాలి. ఒకవేళ భారీగా ఖర్చు చేసి, దానిని చెల్లించలేకపోతే, వాయిదా పద్దతిలో చెల్లించే విధానాన్ని ఎంచుకోవచ్చు. అయితే, దురదృష్టవశాత్తూ, ఉద్యోగం కోల్పోవడం, లేదా వ్యాపారంలో నష్టాలు, ఇతర అత్యవసర పరిస్థితుల కారణంగా క్రెడిట్ కార్డ్ బిల్ తిరిగి చెల్లించడం మీకు కష్టంగా అనిపించే సందర్భాలు ఉండవచ్చు. కష్టం కావచ్చు.కానీ క్రెడిట్ కార్డ్ బిల్లును సకాలంలో చెల్లించడంలో విఫలమైతే, మీరు అనేక పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. వాటిలో ఒకటి క్రెడిట్ కార్డ్ డిఫాల్టర్. నెలల తరబడి క్రెడిట్ కార్డ్ బిల్లుకనీస మొత్తాన్ని కూడా చెల్లించడంలో విఫలమైతే..దానినే క్రెడిట్ కార్డ్ పేమెంట్ డిఫాల్ట్ అంటారు. 30 రోజుల పాటు చెల్లింపు చేయడంలో విఫలం కావడం తొలి తప్పు. ఆరు నెలలు పాటు కనీస చెల్లింపులు చేయకుండా ఉంటే మాత్రం క్రెడిట్ కార్డ్ ఖాతా వెంటనే డియాక్టివేట్ అవుతుంది. డిఫాల్ట్ లిస్ట్‌లోకి వెళుతుంది. రీపేమెంట్‌కు సంబంధించి సదరు బ్యాంకు ఆయా ఖాతాదారులను సంప్రదిస్తాయి. దీని తర్వాత కూడా మీరు చెల్లించకపోతే, ఖాతా మూతపడుతుంది. ఈ సమాచారాన్ని క్రెడిట్ బ్యూరోలకు నో పేమెంట్ రిపోర్ట్ చేస్తారు.దీంతో క్రెడిట్ స్కోర్‌పై నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది. భవిష్యత్తులో రుణం తీసుకోవడం లేదా కొత్త క్రెడిట్ కార్డ్‌ని పొందడం కష్టం. క్రెడిట్ కార్డ్ డిఫాల్ట్ పరిణామాలు ఆలస్య చెల్లింపు రుసుములు ,అదనపు వడ్డీ ఛార్జీలు బ్యాంకులు బకాయిలపై 38 నుండి 42 శాతం వరకు వడ్డీ రేట్లను వసూలు చేస్తాయి. క్రెడిట్ స్కోర్‌పై ప్రతికూల ప్రభావం పడుతుంది. లోన్లు రావడం కష్టం. క్రెడిట్ పరిమితి తగ్గుతుంది. క్రెడిట్ కార్డ్ చెల్లింపును డిఫాల్ట్ అధిక-రిస్క్ రుణగ్రహీతగా మారిపోతారు. చట్టపరమైన చర్యలు: రికవరీ కోసం బ్యాంక్ సివిల్ దావా వేయవచ్చు.కొన్ని సందర్భాల్లో, బ్యాంక్ మోసం చేసినందుకు క్రిమినల్ కేసు కూడా నమోదు చేయవచ్చు.లీగల్ నోటీసును పంపవచ్చు. రికవరీ ఏజెంట్ల బాధలు: క్రెడిట్ కార్డ్ చెల్లింపును తిరిగి పొందడానికి బ్యాంకు రుణ సేకరణ ఏజెన్సీల ద్వారా రికవరీ ఏజెంట్లను నియమిస్తే, వారి దూకుడుని, వేధింపులను తట్టు కోవడం కష్టం. ఇది లేనిపోని అవమానాలు,ఆందోళనకు కారణం కావచ్చు. క్రెడిట్ కార్డ్ చెల్లింపు డిఫాల్ట్ అయితే ఏమి చేయాలి? ఫస్ట్చేయాల్సిన పని: బ్యాంక్‌ని సంప్రదించి పరిస్థితిని వివరించడం, క్రెడిట్ స్కోర్‌కు మరింత నష్టం జరగకుండా ఉండాలంటే పాక్షిక చెల్లింపు చేయడం. తక్కువ వడ్డీ రేటు, తగ్గిన ఫీజులు లేదా ఆలస్య చెల్లింపు ఛార్జీల మినహాయింపు కోసంబ్యాంక్ అధికారులతో చర్చించాలి. వృత్తిపరమైన సహాయం కోరవచ్చు. తద్వారా రుణ చెల్లింపు, అలాగే క్రెడిట్ కార్డును తిరిగి ట్రాక్‌లోకి తెచ్చుకోవచ్చు. అలాగే వన్-టైమ్ సెటిల్మెంట్ అవకాశముందేమో పరిశీలించి సెటిల్ చేసుకోవడం. మరిన్ని విషయాలు కాబట్టి, సకాలంలో చెల్లింపులు చేయడం, క్రెడిట్ కార్డ్‌ను బాధ్యతాయుతంగా నిర్వహించడం చాలా అవసరం. ఒక వేళ ఆర్థిక ఇబ్బందులెదురైతే, మీ క్రెడిట్ కార్డ్ చెల్లింపులో డిఫాల్ట్ కాకుండా ఉండటానికి మీ బ్యాంక్‌ను సంప్రదించి, సంబంధిత ఆప్షన్స్ ఎంచుకోవడం బెటర్.జూలై 1, 2022 నుండి అమలులోకి వచ్చే RBI మార్గదర్శకాల ప్రకారం, కార్డ్ జారీచేసేవారు కార్డ్ హోల్డర్లకు 7-రోజుల నోటీసు వ్యవధిని ఇవ్వాలి, క్రెడిట్ బ్యూరోలకు డిఫాల్టర్‌గా నివేదించాలనే ఉద్దేశ్యం గురించి సంబంధిత ఖాతాదారులకు తెలియజేయాలి. బకాయిలనుచెల్లించడానికి గడువు ఇవ్వాలి. సెటిల్మెంట్ , డిఫాల్ట్‌లు మీ క్రెడిట్ స్కోర్‌ను దెబ్బతీస్తాయి. ఇవి 7 సంవత్సరాల వరకు మీ రికార్డ్‌లో కనిపిస్తాయి! -
ఎగవేతదారులతో బ్యాంకుల రాజీకి వ్యతిరేకత
న్యూఢిల్లీ: ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారులతో బ్యాంకులు రాజీ పరిష్కారానికి ఆర్బీఐ అనుమతించడాన్ని ఉద్యోగ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. రాజీ పరిష్కారం, సాంకేతికంగా రుణాల మాఫీ పేరుతో ఆర్బీఐ ఇటీవలే ఓ కార్యాచరణను ప్రకటించింది. ఇది బ్యాంకుల సమగ్రత విషయంలో రాజీపడడమేనని, ఉద్దేశపూర్వక ఎగవేతదారులకు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటాన్ని నీరుగార్చడమేనని ఉద్యోగ సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. ఉద్దేశపూర్వక ఎగవతేదారుల సమస్య పరిష్కారానికి కఠిన చర్యలనే తాము సమర్థిస్తామని ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ (ఏఐబీవోసీ), ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ) ప్రకటించాయి. మోసం లేదా ఉద్దేశపూర్వక ఎగవేతదారులంటూ వర్గీకరించిన ఖాతాల విషయంలో రాజీ పరిష్కారానికి అనుమతించడం అన్నది న్యాయ సూత్రాలకు, జవాబుదారీకి అవమానకరమని వ్యాఖ్యానించాయి. నిజాయితీ పరులైన రుణ గ్రహీతలను నిరుత్సాహపరచడమేనన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. ఆర్బీఐ తాజా ఆదేశాలు షాక్‌కు గురి చేశాయని పేర్కొన్నాయి. ఇది బ్యాంకింగ్ రంగం పట్ల ప్రజల్లో విశ్వాసాన్ని నీరు గారుస్తుందని, డిపాజిట్ల నమ్మకాన్ని కూడా దెబ్బతీస్తుందని ఆందోళన వ్యక్తం చేశాయి. ఆర్బీఐ తన నిర్ణయాన్ని ఉపంసహరించుకోవాలని డిమాండ్ చేశాయి. -
ఆర్బీఐ కీలక ఆదేశాలు - డిఫాల్ట్ కస్టమర్లకు గుడ్ న్యూస్
ముంబై: రుణాలు డిఫాల్ట్ అయిన కస్టమర్లపై బ్యాంకులు అదనపు వడ్డీ, చార్జీలు విధించి దాన్ని అసలుకు కలిపే విధానానికి చెక్ పెట్టేలా రిజర్వ్ బ్యాంక్ ప్రతిపాదనలు చేసింది. జరిమానాగా వడ్డించే చార్జీల పరిమాణం అనేది డిఫాల్ట్ అయిన మొత్తానికి అనుగుణంగా మాత్రమే ఉండాలని సహేతుక రుణ విధానాలపై విడుదల చేసిన ఒక సర్క్యులర్ ముసాయిదాలో పేర్కొంది. తీసుకున్న రుణాన్ని రుణగ్రహీత సక్రమంగా తిరిగి చెల్లించేలా చూడటమే జరిమానాల ప్రధాన ఉద్దేశ్యమని, వాటిని ఆదాయ వనరుగా బ్యాంకులు భావించరాదని సూచించింది. -
సమాచారం ఇవ్వండి.. రూ.20 లక్షలు అందుకోండి!
ఎగవేతదార్లు(డిఫాల్టర్లు) నుంచి జరిమానా బకాయిలు వసూలు చేసేందుకు మార్కెట్ నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ) సరికొత్త ప్రణాళిక రచించింది. డిఫాల్టర్ల ఆస్తులు, ఇతర సమాచారాన్ని తెలియచేసే వారికి రూ.20 లక్షల వరకు నజరానా అందించే కార్యక్రమాన్ని ప్రారంభించింది. 515 మంది ఎగవేతదార్ల జాబితాను సెబీ విడుదల చేసింది. వీళ్లకు సంబంధించిన సమాచారాన్నే తెలియజేయాల్సి ఉంది. రెండు దశల్లో చెల్లింపు ఇలా డిఫాల్టర్ల ఆస్తుల సమాచారాన్ని తెలియజేస్తే సెబీ రెండు దశల్లో నజరానా అందిస్తుంది. ఎగవేతదారు నుంచి వసూలు చేసిన బకాయి విలువలో 2.5 శాతం లేదా రూ.5 లక్షలు.. ఏది తక్కువైతే అది తొలిదశలో చెల్లిస్తుంది. ఇక తుది దశ కింద బకాయి విలువలో 10 శాతం లేదా రూ.20 లక్షలు ఏది తక్కువైతే అది ఇవ్వనుంది. సమాచారమిచ్చే వారి వివరాలు గోప్యం సెబీ ప్రకటన ప్రకారం.. డిఫాల్టర్లను నుంచి బకాయి వసూలుకు అన్ని రకాల మార్గాల్లో ప్రయత్నించినా పూర్తి బకాయి వసూలు కాకపోతే అలాంటి పరిస్థితుల్లో ఆ ఎగవేతదారు ఆస్తులకు సంబంధించి విశ్వసయనీయ సమాచారం అందించేవారికి ఈ నజరానా అందిస్తారు. ఇదే సమయంలో సమాచారం ఇచ్చే వ్యక్తి వివరాలను, నజరానా మొత్తాన్ని గోప్యంగా ఉంచనున్నట్లు సెబీ పేర్కొంది. ఇదీ చదవండి: రతన్ టాటా ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవుతున్న ఏకైక ప్రొఫైల్.. ఎవరో తెలుసా? సమాచారం అందించేవారికి ఎంత మేర నజరానాకు అర్హత ఉందనే అంశంపై సిఫారసు చేసేందుకు ఒక కమిటీని సెబీ ఏర్పాటు చేసింది. ఈ నజరానాను ఇన్వెస్టర్ల భద్రత, అవగాహన నిధి నుంచి చెల్లిస్తారు. మార్చి 8 నుంచే ఈ మార్గదర్శకాలు అమల్లోకి వచ్చాయి. 2021-22 సెబీ వార్షిక నివేదిక ప్రకారం.. వసూలు కష్టంగా మారిన బకాయిల విభాగం కింద 2022 మార్చి చివరి నాటికి రూ.67,228 కోట్ల బకాయిలను సెబీ గుర్తించింది. నజరానా ప్రకటించడం వల్ల బకాయిలు పూర్తిస్థాయిలో వసూలు చేసేందుకు దోహదం చేస్తుందని సెబీ భావిస్తోంది. -
పాతది మాఫీ కాక..కొత్త రుణం రాక.. తెలంగాణ రైతుల అరిగోస
సాక్షి, హైదరాబాద్: రుణమాఫీ పూర్తిస్థాయిలో జరగకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు రైతుబంధు సొమ్మును ప్రభుత్వం రైతుల ఖాతాల్లో వేస్తుంటే, ఆ మొత్తాన్ని కొన్ని బ్యాంకులు అప్పుల కింద జమ చేసుకుంటున్నాయి. రుణాలు రెన్యువల్ కాని వారు డిఫాల్టర్లుగా మారిపోతున్నారు. కొన్ని బ్యాంకులు అప్పులు పెరిగిపోయాయని పేర్కొంటూ కొత్త రుణాలు ఇవ్వడం లేదు. దీంతో రైతన్నలు లబోదిబోమంటున్నారు. రైతుల లక్షలోపు రుణాలు మాఫీ చేయాల్సి ఉండగా, 2021–22 ఆర్థిక సంవత్సరంలో రూ.25 వేల నుంచి 50 వేల వరకున్న రుణాలు మాఫీ చేస్తామని ప్రభు త్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా రూ.37 వేల వరకు రుణాలు మాఫీ చేసింది. ఆ తర్వాత రూ.38 వేల వరకున్న రుణాలతో ఒక బిల్లు, రూ.38 వేల నుంచి రూ. 39 వేల వరకున్న రుణాలతో మరో బిల్లును వ్యవసాయ శాఖ తయారు చేసి ఆర్థిక శాఖకు పంపించింది. అయితే రుణమాఫీకి నిధులు సర్దుబాటు చేయకపోవటంతో సొ మ్ము మంజూరు కాలేదని వ్యవసాయ వర్గాలు తెలిపాయి. సర్కారు సూచన పట్టించుకోని బ్యాంకర్లు రుణమాఫీని ప్రభుత్వం విడతల వారీగా చేస్తోంది. ఈ విధంగా లక్షలోపు రుణమాఫీలో కేవలం రూ.37 వేల వరకు రుణాలను మాత్రమే ప్రభుత్వం విడుదల చేసిన నేపథ్యంలో మిగతా వారికి రెన్యువల్ సమస్య వచ్చింది. రుణాలు రెన్యువల్ చేసుకోకపోతే డిఫాల్టర్లుగా మారుతారు. అయితే కొన్నిచోట్ల బ్యాంకులు ప్రభుత్వ సూచనను పట్టించుకోకుండా రైతుబంధు సొమ్మును రుణమాఫీ కింద జమ చేసుకుంటున్నాయి. దీంతో కొందరి రుణాలు రెన్యువల్ అవుతున్నా, అధిక సంఖ్యలో రైతులు రెన్యువల్ సమస్యను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం రైతులు తొలుత బకాయిలు చెల్లించాలని, తర్వాత రుణమాఫీ సొమ్మును వారి ఖాతాలో వేస్తామని సూచించింది. కొందరు రైతులు అలా చెల్లించగా, కొందరు రైతులు మాత్రం డబ్బులు లేకపోవడంతో బ్యాంకులకు చెల్లించలేకపోయారు. దీంతో లక్షలాది మంది రైతులు డిఫాల్టర్లుగా మారినట్లు అంచనా. రుణమాఫీకి అర్హులైన రైతుల సొమ్మును ఇస్తామని, వారిని ఎవరినీ డిఫాల్టర్లుగా ప్రకటించవద్దని వ్యవసాయశాఖ బ్యాంకులకు విన్నవించినా ప్రయోజనం లేకుండా పోతోంది. ఈసారి బడ్జెట్లో అయినా రుణమాఫీకి ప్రభుత్వం పూర్తిస్థాయిలో సొమ్ము కేటాయించి విడుదల చేయాలని రైతులు కోరుతున్నారు. రూ.20,164.20కోట్లు కేటాయించినా.. 2018 ఎన్నికల సమయంలో లక్ష రూపాయల వరకు రైతుల పంట రుణాలు మాఫీ చేస్తామని అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. మొత్తంగా 36.66 లక్షల మంది రైతులకు చెందిన రూ.19,198.38 కోట్ల రుణాలను మాఫీ చేయాల్సి ఉంటుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఇప్పటివరకు రుణమాఫీ కోసం రూ.20,164.20 కోట్లు కేటాయించినా, అందులో రూ.1,171.38 కోట్లు మాత్రమే విడుదల చేసింది. వాటితో 5.66 లక్షల మంది రైతుల రుణాలను మాఫీ చేయగా, మరో 31 లక్షల మంది ఎదురుచూపులు చూస్తున్నారు. 2020లో రూ.25 వేలలోపు రుణాల కోసం రూ. 408.38 కోట్లు రుణమాఫీకి బదిలీ చేసింది. 2021 ఆగస్టులో రూ.25 వేల నుంచి రూ.50 వేల వరకు రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించింది. ఇందుకోసం రూ.1,790 కోట్లు ఇవ్వాల్సి ఉంది. ఇప్పటివరకు రూ.25 వేల నుంచి రూ.37 వేల లోపు రైతులకు చెందిన రూ.763 కోట్ల రుణాలను మాత్రమే మాఫీ చేసింది. ఈ నేపథ్యంలోనే పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయాల్సిందిగా రైతులు కోరుతున్నారు. ఒక్క రూపాయి కూడా మాఫీ కాలేదు పంట పెట్టుబడి కోసం బ్యాంకులో లక్ష రూపాయల రుణం తీసుకున్నా. దిగుబడి రాకపోవడంతో తిరిగి చెల్లించలేకపోయా. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పడంతో సంతోషపడ్డా. లక్ష రూపాయలు మాఫీ అయిపోతాయని ఆశగా ఎదురుచూశా. కానీ ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా మాఫీ కాలేదు. పైగా వడ్డీ లక్షకు పెరిగింది. ఇప్పుడు యాసంగి సాగుకు బ్యాంకులో రుణం ఇచ్చే పరిస్థితిలేకుండా పోయింది. దీంతో బయట అధిక వడ్డీకి అప్పు తీసుకుని 4.26 ఎకరాల్లో పత్తి, మొక్కజొన్న సాగు చేశా. - కముటం స్వామి రైతు, కేసముద్రం, ఉమ్మడి వరంగల్ జిల్లా -
బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టిన ప్రబుద్ధుల్లో ఈయనే నెంబర్ వన్!
పార్లమెంటు శీతాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సమావేశాల్లో బ్యాంకు రుణాల ఎగవేతదారులపై చర్చి జరిగింది. సభలోని ఓ సభ్యుడు లేవనెత్తిన ప్రశ్నపై కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కరాద్ లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. మార్చి 31,2022 నాటికి మనదేశంలో సుమారు 50 మంది బ్యాంకులకు రూ.92,570 కోట్లు బాకీ పడినట్లు తెలిపారు. వారిలో వజ్రాల వ్యాపారి మెహుల్ ఛోక్సీ నంబర్ వన్ స్థానంలో ఉన్నాడు.ఛోక్సీకి చెందిన గీతాంజలి జెమ్స్ కంపెనీ నుంచి బ్యాంకులకు రావాల్సిన మొత్తం రూ.7,848 కోట్లని వివరించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి సేకరించిన రిపోర్ట్ ఆధారంగా కరాద్ బ్యాంకు రుణాలు ఎవరు? ఎంతంత? రుణ ఎగవేతకు పాల్పడ్డారో స్పష్టం చేశారు.రుణ ఎగవేత దారుల్లో ఛోక్సీ తర్వాత ఎరా ఇన్ఫ్రా (రూ.5879 కోట్లు),రేగో ఆగ్రో (రూ.4803), కాస్ట్ స్టీల్ అండ్ పవర్ (రూ.4,596 కోట్లు), ఎబిజి షిప్‌యార్డ్ (రూ.3,708 కోట్లు), ఫ్రాస్ట్ ఇంటర్నేషనల్ (రూ.2,893కోట్లు),విన్సమ్ డైమండ్స్ అండ్ జ్యువెలరీ (రూ.2,931కోట్లు), రోటోమాక్ గ్లోబల్ (రూ.2,893 కోట్లు), కోస్టల్ ప్రాజెక్ట్ రూ.2,311కోట్లు, జూమ్ డెవలపర్లు (రూ.2,147 కోట్లు) జాబితాలో ఉన్నట్లు తెలిపారు. తగ్గిన ఎన్పీఏలు ప్రభుత్వరంగ బ్యాంకుల నిరర్ధక ఆస్తులు లేదా నాన్ ఫర్మామెన్స్ అసెట్స్ (NPA)రూ.8.9లక్షల కోట్లుకు చేరాయి. అయితే మొండి బకాయిల్ని తగ్గించేందుకు కేంద్రం కృషి చేయడంతో అవికాస్త రూ.3లక్షల కోట్లు తగ్గాయి. రైట్ - ఆఫ్‌లో ఎస్బీఐ అగ్రస్థానం దేశీయ అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ మొండి బకాయిల్ని రైట్ ఆఫ్ చేయడంలో రూ.2లక్షల కోట్లతో ముందంజలో ఉంది. ఆ తర్వాత రూ.67,214 కోట్లతో పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లు ఉన్నాయి.ప్రైవేట్ బ్యాంకుల్లో ఐసీఐసీఐ బ్యాంక్ రూ.50,514 కోట్లు,హెచ్డీఎఫ్సీ రూ.34,517కోట్లు ఉన్నాయని కరాద్ పార్లమెంట్లో రుణాల ఎగవేతపై మాట్లాడారు. ఈ సందర్భంగా రుణ ఎగవేత దారులపై చర్యలు తీసుకునేలా కేంద్రం చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. మెహుల్ చోక్సీపై మూడు కొత్త ఎఫ్ఐఆర్లు పంజాబ్ నేషనల్ బ్యాంక్ డిప్యూటీ జనరల్ మేనేజర్ ఫిర్యాదు మేరకు పరారీలో ఉన్న మెహుల్ చోక్సీపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) గత వారం మూడు కొత్త ఎఫ్ఐఆర్లను నమోదు చేసింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ నేతృత్వంలోని మూడు సభ్య బ్యాంకుల కన్సార్టియంకు చోక్సీ మరియు ఇతరులు ₹ 375.71 కోట్ల తప్పుడు నష్టం కలిగించారని ఈ తాజా ఎఫ్ఐఆర్లో మూడవది ఆరోపించింది . వీల్ చైర్లో కోర్టుకు కాగా,పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణంలో నిందితుడు, వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీకి గతేడాది కరేబియన్ దేశం డొమినికా న్యాయస్థానం బెయిల్ మంజూరుకు నిరాకరించింది. అంటిగ్వా నుంచి తమ దేశంలోకి చట్టవిరుద్ధంగా ప్రవేశించిన చోక్సికి బెయిల్ ఇవ్వలేమని పిటిషన్‌ను కొట్టివేసింది. చోక్సీ(62) వీల్ చైర్లో కోర్టుకు హాజరయ్యారు. చోక్సీ అక్రమంగా డొమినికాకు రాలేదని, ఆయనని ఎవరో కిడ్నాప్ చేసి తీసుకువచ్చారని అందుకే బెయిల్ ఇవ్వాలంటూ చోక్సీ తరఫు లాయర్ వాదించారు. చివరిగా ::::: రైట్ - ఆఫ్ అంటే ఏమిటి? ప్రతి ఏడాది ఆర్ధిక సంవత్సరం(మార్చి ముగిసే) నాటికి అన్నీ బ్యాంకులు బ్యాలెన్స్ షీట్లను బహిరంగంగా ప్రకటిస్తాయి. అంటే బ్యాంకుకు ఎంత లాభం వచ్చింది. నష్టం ఎంత వచ్చింది. మొండి బకాయిలు ఎంత ఉన్నాయని చెబుతాయి. అయితే ఆ సమయంలో బ్యాలెన్స్ షీట్లో మొండి బకాయిలు కనిపించకుండా ఉండేందుకు ప్రయత్నిస్తాయి. ఉదాహరణకు సురేష్ అనే వ్యక్తి ఎక్స్ అనే బ్యాంకు నుంచి రూ.10వేల కోట్లు రుణం తీసుకున్నాడు. ఆ రుణాన్ని చెల్లించకుండా ఎగవేతకు (మొండి బకాయిలు) పాల్పడ్డాడు. అప్పుడు ఆ ఎక్స్ బ్యాంక్ యాజమాన్యం తనకు వచ్చిన లాభాల్ని మొడి బకాయిల స్థానంలో చూపిస్తారు. అంటే సురేష్ ఎగొట్టిన రూ.10వేల కోట్లు మనకు కనిపించవు. దీన్నే రైట్ - ఆఫ్ అని పిలుస్తారు. మొండి బకాయిలు అంటే ఏమిటి? బ్యాంకులు అనేక విధాలుగా లోన్లు ఇస్తూ ఉంటాయి.పెద్ద మొత్తంలో లోన్లు తీసుకుని అవి ఎగొట్టి కొందరు, బకాయిలు తీర్చే స్థోమత లేక కొందరు.ఇలా చాలామంది బ్యాంకులకు మోత మోగిస్తున్నారు.వీటినే మొండి బకాయిలు,నిరర్థక ఆస్తులు అంటారు.ఆర్ధిక పరిభాషలో వీటిని ఏన్పీఏ(non-performing assets)అని పిలుస్తారు. -
స్టాక్ మార్కెట్ డిపాల్టర్లు.. జాబితా ఇదిగో..
న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా 25 మంది వ్యక్తులతో కూడిన డిఫాల్టర్ల జాబితాను విడుదల చేసింది. వీరంతా జాడలేని వారేనని సెబీ పేర్కొంది. సెక్యూరిటీల మార్కెట్లో వివిధ అక్రమాలకుగాను విధించిన జరిమానాలు చెల్లించడం లేదా ఇన్వెస్టర్ల సొమ్మును వాపసు చేయడంలో వీరంతా విఫలమైనట్లు సెబీ తెలియజేసింది. వెబ్సైట్లో వీరి వివరాలను పబ్లిష్ చేయడంతోపాటు.. రికవరీ సర్టిఫికెట్లను జారీ చేయనున్నట్లు వెల్లడించింది. తెలిస్తే చెప్పండి రికవరీ అధికారుల ద్వారా జారీ చేసిన నోటీసులు చివర్లో నమోదైన చిరునామాల ద్వారా వీరికి అందలేదని పేర్కొంది. నోటీసులను 2014 జులై నుంచి 2022 జనవరి వరకూ జారీ చేసినట్లు తెలియజేసింది. ఈ నెల 24కల్లా వీరంతా రికవరీ అధికారులను లేఖలు లేదా ఈమెయిల్ ద్వారా సంప్రదించవలసి ఉన్నట్లు ఆదేశాలు జారీ చేసింది. ఈ జాబితాలోని వ్యక్తుల వివరాలు ఎవరికైనా తెలిస్తే రికవరీ అధికారికి 2022 మార్చి 24లోగా నివేదించమంటూ పబ్లిక్కు సూచించింది. ఇదీ జాబితా సెబీ విడుదల చేసిన జాడలేని డిఫాల్టర్ల జాబితాలో కనైయలాల్ జోషి, సంతోష్ కృష్ణ పవార్, చేతన్ మెహతా, ముకుంద్ యదు జంభాలే, అంకిత్ కే అగర్వాల్, జయేష్ షా, సురేష్ కుమార్ పి.జైన్, ప్రవీణ్ వసిష్ట్, రాజేష్ తుకారం డాంబ్రే, జయేష్ కుమార్ షా, దహ్యాభాయ్ జి.పటేల్, దాల్సుఖ్భాయ్ డి.పటేల్, విఠల్‌భాయ్ వి.గజేరా తదితరులున్నారు. చదవండి: నష్టాల కంపెనీలకు సెబీ షాక్...! -
పత్తాలేని వాళ్లని పట్టేద్దాం, ఎగవేత దారులకు సెబీ నోటీసులు
న్యూఢిల్లీ: పత్తాలేకుండా పోయిన ఎగవేత సంస్థలు, వ్యక్తులతో కూడిన జాబితాను క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా ప్రకటించింది. సెబీ రికవరీ ఆఫీసర్ల ద్వారా ఆయా సంస్థలు, వ్యక్తులపై రికవరీ సర్టిఫికెట్లను జారీ చేసినట్లు పేర్కొంది. అయితే చిరునామాలు లేనందున ఈ నోటీసులను ఎగవేతదారులకు దించలేకపోయినట్లు వెల్లడించింది. 2015 ఏప్రిల్ నుంచి 2021 జులై మధ్య కాలంలో వీటిని జారీ చేసినట్లు తెలియజేసింది. ఎగవేతదారులు 2022 జనవరి 22లోగా సెబీ రికవరీ ఆఫీసర్‌ను లేఖ లేదా ఈమెయిల్ ద్వారా సంప్రదించవలసి ఉంటుందని ఆదేశించింది. జాబితాలో ఎంసీఎక్స్ బిజ్ సొల్యూషన్స్, ఈ సంస్థ ప్రొప్రయిటర్ సైయద్ సాదక్తోపాటు, భారత్ వాఘేలా, గిరిధర్ జే వగాడియా, కల్పేష్ బాబరియా, విఠల్‌భాయి గజేరా, లక్ష్మీనారాయణ వీరమల్లు దూసా, ఉమేష్ చౌకేకర్, బిందు ఆర్ మీనన్, నీలేష్ పాలండే, ఘనశ్యామ్ దయాభాయి పటేల్ పేర్లను సెబీ పేర్కొంది. ఈ ఎగవేతదారులు పెట్టుబడిదారుల సొమ్మును తిరిగి చెల్లించడం లేదా సెబీ విధించిన జరిమానా చెల్లింపులో విఫలమైనట్లు వివరించింది. సెక్యూరిటీల మార్కెట్లలో నమోదైన వివిధ అక్రమాలకుగాను జరిమానాలు విధించినట్లు తాజా నోటీసులో తెలియజేసింది. -
ఉద్దేశపూర్వక ఎగవేత రూ. 1.47 లక్షల కోట్లు
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా బ్యాంకులకు మొండి బకాయిలు సుమారు రూ. 8 లక్షల కోట్లు ఉంటే అందులో ఉద్దేశపూర్వకం(విల్‌ఫుల్)గా ఎగ్గొట్టిన రుణాల విలువ రూ.1,47,350 కోట్లుగా ఉన్నట్లు ఆలిండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ) అంచనా వేసింది. రూ. 5 కోట్ల పైన రుణం తీసుకొని ఉద్దేశపూర్వకంగా రుణాలు ఎగ్గొట్టిన కంపెనీల వివరాలను బ్యాంకుల వారీగా ఏఐబీఈఏ విడుదల చేసింది. 2019, సెప్టెంబర్ నాటికి 2,426 సంస్థలు రూ. 1.47 లక్షల కోట్లు బ్యాంకులకు ఎగ్గొట్టాయి. ఇందులో అత్యధికంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు 685 సంస్థలు రూ. 43,887 కోట్లు ఎగనామం పెట్టాయి. రూ. 500 కోట్లుపైగా రుణం తీసుకొని ఎగ్గొట్టిన కంపెనీలు ఎగ్గొట్టిన రుణాల విలువ రూ. 32,737 కోట్లుగా ఉందని ఏఐబీఈఏ అంచనా వేసింది. రూ. 200 కోట్లుపైన రుణం తీసుకొని ఎగ్గొట్టిన కంపెనీలన్నీ కలిపి రూ. 67,609 కోట్లు రుణం ఎగవేశాయి. టాప్–20లో రెండు తెలుగు కంపెనీలు ► రుణాలు ఎగ్గొట్టిన టాప్–20 కంపెనీల్లో రెండు తెలుగు కంపెనీలున్నాయి. ► టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందిన ట్రాన్స్ట్రాయ్ రెండు బ్యాంకులకు రూ. 1,217 కోట్లు బకాయి పడింది. ► హైదరాబాద్ కేంద్రంగా ఉన్న కోస్టల్ ప్రాజెక్టŠస్ రూ. 984 కోట్లు ఎగవేసింది. ► ఉద్యోగులు కష్టపడి బ్యాంకులను లాభాల్లోకి తీసుకువస్తే ఉద్దేశపూర్వక ఎగవేతదారులతో రూ. లక్షల కోట్లు నష్టపోవాల్సి వస్తోందని ఏఐబీఈఏ జాతీయ కార్యదర్శి బీఎస్ రాంబాబు అన్నారు. ► గడిచిన నాలుగేళ్లుగా ప్రభుత్వరంగ బ్యాంకులు అన్ని కలిపి రూ. 8,16,135 కోట్ల నిర్వహణ లాభం సంపాదిస్తే ఎగవేతదారుల రుణాలకు ఎన్పీఏలకు కేటాయింపు చేయడం వల్ల చివరికి రూ. 1,81,358 కోట్ల నష్టాలను ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇలా పెద్ద మొత్తంలో ప్రజాధనం ఎగువేతదారుల వల్ల నష్టపోవాల్సి వస్తోందని, కాబట్టి వీరందరిపై తక్షణం క్రిమినల్ కేసులు నమోదు చేసి ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని ఏఐబీఈఏ డిమాండ్ చేస్తోందన్నారు. -
ఉద్దేశపూర్వక ఎగవేతదారుల లిస్ట్ ఇదే..
ముంబై: ప్రభుత్వ బ్యాంకులకు టోకరా ఇస్తున్న ఉద్ధేశపూర్వక ఎగవేతదారులు (డిఫాల్టర్ల్స్ లిస్ట్)ను సెప్టెంబర్ 2019 వరకు బ్యాంక్ అసోసియేషన్ ప్రకటించింది. 2019 వరకు బ్యాంకులకు ఎగనామాలు పెట్టిన కంపెనీల లిస్ట్‌ను ఆల్ ఇండియా బ్యాంక్స్ ఎంప్లాయ్స్ అసోసియేషన్ ప్రకటించింది. ఇందులో 2426 అకౌంట్స్ ద్వారా బ్యాంకులకు లక్షా 47 వేల 350 కోట్ల నష్టం వాటిల్లిందని తెలిపింది. దేశ ఆర్థిక వ్యవస్ధకు పెనుసవాల్‌గా భావిస్తున్న ఎగవాతదారుల జాబితాను విడుదల చేయడం హర్షనీయమని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాగా, 17 ప్రభుత్వ రంగ బ్యాంకులకు టోకరా ఇచ్చిన ఎగవేతదారుల వివరాలు.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఉద్దేశపూర్వక ఎగవేత దారులు 685 మంది కాగా చెల్లించని మొత్తం 43వేల 887 కోట్లు పంజాబ్ నేషనల్ బ్యాంక్ డిఫ్లాల్టర్స్ (ఎగవేత దారులు)సంఖ్య 325, చెల్లించని మొత్తం 22వేల 370 కోట్లు బ్యాంక్ ఆఫ్ బరోడా డిఫ్లాల్టర్స్ (ఎగవేత దారులు)సంఖ్య 355, చెల్లించని మొత్తం 14వేల 661 కోట్లు బ్యాంక్ ఆఫ్ ఇండియా డిఫ్లాల్టర్స్ (ఎగవేత దారులు)సంఖ్య 184, చెల్లించని మొత్తం 11వేల 250 కోట్లు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిఫ్లాల్టర్స్(ఎగవేత దారులు) సంఖ్య 69, చెల్లించని మొత్తం 9 వేల 663 కోట్లు యునైట్‌డ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిఫ్లాల్టర్స్ (ఎగవేత దారులు)సంఖ్య 128, చెల్లించని మొత్తం 7 వేల 028 కోట్లు యుకో బ్యాంక్ డిఫ్లాల్టర్స్ (ఎగవేత దారులు)సంఖ్య 87, చెల్లించని మొత్తం 6 వేల 813 కోట్లు ఒబిసి డిఫ్లాల్టర్స్ (ఎగవేత దారులు)సంఖ్య 138, చెల్లించని మొత్తం 6 వేల 549 కోట్లు కెనరా బ్యాంక్ డిఫ్లాల్టర్స్ (ఎగవేత దారులు)సంఖ్య 96, చెల్లించని మొత్తం 5 వేల 276 కోట్లు ఆంధ్రా బ్యాంక్ డిఫ్లాల్టర్స్(ఎగవేత దారులు) సంఖ్య 84 , చెల్లించని మొత్తం 5 వేల 165 కోట్లు అలాహాబాద్ బ్యాంక్ డిఫ్లాల్టర్స్ సంఖ్య 57, చెల్లించని మొత్తం 4 వేల 339 కోట్లు ఇండియన్ ఓవర్సిస్ బ్యాంక్ డిఫ్లాల్టర్స్ (ఎగవేత దారులు)సంఖ్య 49 , చెల్లించని మొత్తం 3 వేల 188 కోట్లు కార్పొరేషన్ బ్యాంక్ డిఫ్లాల్టర్స్ (ఎగవేత దారులు)సంఖ్య 58 , చెల్లించని మొత్తం 2 వేల 450 కోట్లు ఇండియన్ బ్యాంక్ డిఫ్లాల్టర్స్ (ఎగవేత దారులు)సంఖ్య 27 , చెల్లించని మొత్తం 1 వేల 613 కోట్లు సిండికేట్ బ్యాంక్ డిఫ్లాల్టర్స్ (ఎగవేత దారులు) సంఖ్య 36 , చెల్లించని మొత్తం 1 వేల 438 కోట్లు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర డిఫ్లాల్టర్స్(ఎగవేత దారులు) సంఖ్య 42, చెల్లించని మొత్తం 1 వేల 405 కోట్లు పంజాబ్ అండ్ సింథ్ బ్యాంక్ డిఫ్లాల్టర్స్ (ఎగవేత దారులు)సంఖ్య 6 , చెల్లించని మొత్తం 255 కోట్లు -
‘ఆ జాబితాలో వారే అధికం’
సాక్షి, న్యూఢిల్లీ : ఆర్బీఐ వెల్లడించిన బ్యాంకు రుణాల ఉద్దేశపూర్వక ఎగవేతదారుల జాబితాలో బీజేపీ సన్నిహిత మిత్రులే ఎక్కువగా ఉన్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. బ్యాంకులను మోసం చేసిన 50 మంది ప్రముఖ ఎగవేతదారుల జాబితాలో పాలక పార్టీ మిత్రులే ఉన్నందున బీజేపీ పార్లమెంట్లో ఈ జాబితాను వెల్లడించలేదని అన్నారు. అత్యధిక మొత్తంలో బ్యాంకు రుణాలను ఎగవేసిన 50 మంది పేర్లను చెప్పాలని తాను పార్లమెంట్లో ప్రశ్నిస్తే ఆర్థిక మంత్రి సమాధానం ఇచ్చేందుకు నిరాకరించారని రాహుల్ చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఆర్బీఐ వెల్లడించిన జాబితాలో నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ, ఇతర బీజేపీ మిత్రులు ఆ జాబితాలో ఉన్నారు..అందుకే పార్లమెంట్లో వాస్తవాలను ప్రభుత్వం కప్పిపుచ్చిందని రాహుల్ ట్వీట్ చేశారు. సామాజిక కార్యకర్త సాకేత్ గోఖలే సమాచార హక్కు చట్టం కిందట కోరిన మీదట ఆర్బీఐ 50 మంది ఉద్దేశపూర్వక ఎగవేతదారుల జాబితాను అందచేసింది. ఈ జాబితా ఆధారంగా కాంగ్రెస్ పార్టీ పాలక బీజేపీ లక్ష్యంగా విమర్శల దాడికి పదును పెట్టింది. రుణాలు ఎగవేసి విదేశాల్లో తలదాచుకున్న నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ, విజయ్ మాల్యా సహా 50 మంది డిఫాల్టర్ల రుణాలను మోదీ ప్రభుత్వం రద్దు చేసిందని కాంగ్రెస్ ఆరోపించింది. దేశంలో ప్రముఖ లోన్ డిఫాల్టర్ల జాబితాను విడుదల చేసిన కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జీవాలా వీరి రుణాలను ఎందుకు రద్దు చేశారో వెల్లడించాలని ప్రధాని నరేంద్ర మోదీని ప్రశ్నించారు. మోదీ ప్రభుత్వ దురుద్దేశాలను ఈ జాబితా ప్రతిబింబిస్తోందని, దీనిపై ఆయన వివరణ ఇవ్వాలని నిలదీశారు. చదవండి : ఆపత్కాలంలోనూ సొమ్ము చేసుకుంటారా! -
ఫుట్‌బాల్ టికెట్లు, వాచీలు..!
న్యూఢిల్లీ: వేల కోట్ల రుణాల డిఫాల్ట్‌తో మార్కెట్లను అతలాకుతలం చేసిన ఇన్ఫ్రా ఫైనాన్స్ సంస్థ ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ కుంభకోణంలో విస్తుగొలిపే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. అధిక రేటింగ్ పొందేందుకు కంపెనీ మేనేజ్మెంట్ ఏవిధంగా అడ్డదారులు తొక్కారన్న వివరాలన్నీ ఒక్కొక్కటిగా బైటికొస్తున్నాయి. రేటింగ్ ఏజెన్సీల అధికారులకు ఫుట్‌బాల్ మ్యాచ్ టికెట్ల నుంచి వాచీలు, షర్టుల దాకా తాయిలాలిచ్చి ఏవిధంగా కుంభకోణానికి తెరతీసినది గ్రాంట్ థార్న్టన్ మధ్యంతర ఆడిట్లో వెల్లడయింది. దాదాపు రూ. 90,000 కోట్ల రుణభారం ఉన్న ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ గ్రూప్ సంస్థలు పలు రుణాల చెల్లింపుల్లో డిఫాల్ట్ అయిన సంగతి తెలిసిందే. సంక్షోభంలో ఉన్న ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ గ్రూప్ సంస్థలకు మెరుగైన రేటింగ్స్ ఇచ్చిన వివాదంలో ఇప్పటికే ఇద్దరు సీఈవోలను రెండు రేటింగ్ ఏజెన్సీలు సెలవుపై పంపాయి. ఇక, కొత్తగా ఏర్పాటైన బోర్డు... గత మేనేజ్మెంట్ వ్యవహారాల నిగ్గు తేల్చేలా ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించే బాధ్యతలను కన్సల్టెన్సీ సంస్థ గ్రాంట్ థార్న్‌టన్‌కు అప్పగించింది. 2008–2018 మధ్య కాలంలో గ్రూప్ సంస్థల బాండ్లు తదితర సాధనాలకు అధిక రేటింగ్ ఇచ్చి, ఆయా సంస్థలు భారీగా నిధులు సమీకరించుకోవడంలో రేటింగ్ ఏజెన్సీలు పోషించిన పాత్రపై ఆడిట్ నిర్వహిస్తున్న గ్రాంట్ థార్న్టన్ మధ్యంతర నివేదికను రూపొందించింది. ఇండియా రేటింగ్స్ అధికారికి లబ్ధి.. ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ ట్రాన్స్‌పోర్టేషన్ నెట్వర్క్స్ (ఐటీఎన్‌ఎల్), ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (ఐఎఫ్ఐఎన్), ఐఎల్ అండ్ ఎఫ్ఎస్కు 2008–2018 మధ్యకాలంలో ప్రధానంగా కేర్, ఇక్రా, ఇండియా రేటింగ్స్, బ్రిక్‌వర్క్ సంస్థలు రేటింగ్ సేవలు అందించాయి. 2012 సెప్టెంబర్– 2016 ఆగస్టు మధ్యకాలంలో ఐఎఫ్ఐఎన్ మాజీ సీఈవో రమేష్ బవా, ఫిచ్ రేటింగ్స్‌లో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ విభాగం హెడ్ అంబరీష్ శ్రీవాస్తవ మధ్య జరిగిన ఈమెయిల్స్ సంభాషణలను గ్రాంట్ థార్న్టన్ పరిశీలించింది (ఇండియా రేటింగ్స్‌కి ఫిచ్ మాతృసంస్థ). శ్రీవాస్తవ భార్య ఓ విల్లా కొనుక్కోవడంలోనూ, డిస్కౌంటు ఇప్పించడంలోనూ రమేష్ తోడ్పాటునిచ్చినట్లు వీటి ద్వారా తెలుస్తోంది. అలాగే, విల్లా కొనుగోలు మొత్తాన్ని చెల్లించడంలో జాప్యం జరగ్గా.. దానిపై వడ్డీని మాఫీ చేసేలా చూడాలంటూ యూనిటెక్ ఎండీ అజయ్ చంద్రను కూడా రమేష్ కోరినట్లు నివేదికలో పేర్కొంది. -
ఏడున్నర లక్షల వాటర్ బిల్లు ఎగ్గొట్టిన సీఎం
ముంబై : మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఏకంగా ఏడున్నర లక్షల రూపాయల వాటర్ బిల్లు ఎగ్గొట్టారంట. ఈ విషయాన్ని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) వెల్లడించింది. ముఖ్యమంత్రితో పాటు మరో 18 మంది మంత్రులను ఎగవేతదారులుగా ప్రకటించింది. షకీల్ అహ్మద్ అనే సామాజక కార్యకర్త సమాచార హక్కు చట్టం ద్వారా చేసిన దరఖాస్తుకు బీఎంసీ ఈ మేరకు సమాధానమిచ్చింది. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అధిరారిక నివాసం ‘వర్షా’ బంగ్లాకు ఏడు కనెక్షన్ల ద్వారా నీటి సరఫరా జరుగుతుంది. అయితే కొన్ని సంవత్సరాలుగా ఈ బిల్డింగ్ పేరు మీద దాదాపు 7,44,891 రూపాయల వాటర్ బిల్లు బకాయి పడ్డట్లు ఆర్టీఐ దరఖాస్తు ద్వారా వెల్లడైంది. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు సుధీర్ ముంగతివార్, పంకజా ముండే, రామ్‌దాస్ కదమ్ సహా 18 మంది మంత్రుల పేర్లను కూడా ఎగవేతదారుల జాబితాలో చేర్చినట్లు బీఎంసీ తెలిపింది. అయితే బిల్లు కట్టని సీఎం, మంత్రులపై బీఎంసీ ఇంతవరకూ ఎలాంటి చర్యలు తీసుకోనట్లు తెలుస్తోంది. ముంబైలో వీవీఐపీల పెండింగ్ నల్లా బిల్లు ఏకంగా రూ. 8కోట్ల పైనే ఉందట. -
ఎగవేతదారులకు ఆ హక్కు లేదు: సుప్రీం
న్యూఢిల్లీ : బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలు ఓ వ్యక్తిని ఉద్దేశపూర్వక ఎగవేతదారుడిగా ప్రకటించే రహస్య విధివిధానాల్లో లాయర్‌తోపాటు పాల్గొనే హక్కు సదరు వ్యక్తికి ఉండదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఢిల్లీకి చెందిన జా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను ఉద్దేశ పూర్వక ఎగవేత దారుగా ప్రకటించే క్రమంలో జరిగే బ్యాంకు అంతరంగిక సమావేశానికి సంస్థ ప్రతినిధులు లాయర్‌తో సహా హాజరుకావొచ్చంటూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఎస్బీఐ వేసిన పిటిషన్‌ను జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్, జస్టిస్ వినీత్ సరన్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. జూలై 1, 2015న ఆర్బీఐ జారీ చేసిన ఉత్తర్వు ఉద్దేశపూర్వక ఎగవేతదారునకు సంబంధిత బ్యాంకు అంతర్గత విధివిధానాల సమావేశాల్లో న్యాయవాదితో పాటు పాల్గొనే హక్కుండదని చెబుతోందని, ఇది సంబంధిత కేసులోని వాస్తవ అంశాలపై ఆధారపడి ఉంటుందని ధర్మాసనం పేర్కొంది. ‘రుణం చెల్లించగలిగిన స్థితిలో ఉన్నప్పటికీ ఎగవేతదారుగా సంబంధిత సంస్థ ప్రకటించిందా లేక పొందిన నిధులను ఇతరత్రా దారి మళ్లించారా? సాయాన్ని నిర్దేశిత ఉద్దేశానికి వాడటానికి బదులుగా ఖర్చుపెట్టారా అనేది కూడా పరిశీలించాల్సి ఉంటుంది’అని అభిప్రాయపడింది. -
డిఫాల్టర్ల నుంచి బ్యాంకుల వసూళ్లు రూ. 40,400 కోట్లు
ముంబై: వివిధ కొత్త చట్టాల ఆసరాతో 2018తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో బ్యాంకులు...డిఫాల్టర్ల నుంచి రూ. 40,400 కోట్లు వసూలు చేయగలిగాయి. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ఈ వసూళ్లు రూ.38,500 కోట్లుకాగా, గత ఆర్థిక సంవత్సరం అంతకుమించిన మొండి బకాయిల్ని వసూలు చేయడం గమనార్హం. ఇన్సాల్వెన్సీ బాంక్రప్టసీ కోడ్ (ఐబీసీ) అమలులోకి రావడం, సెక్యూరిటైజేషన్, రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్, ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ సెక్యూరిటీ అసెట్స్ (ఎస్ఏఆర్ఎఫ్ఏఈఎస్ఐ) చట్ట సవరణలు జరగడంతో భారీగా మొండి బకాయిల్ని ఈ చట్ట ప్రయోగాల ద్వారా, డెట్ రికవరీ ట్రిబ్యునళ్లు, లోక్ అదాలత్‌ల ద్వారా బ్యాంకులు వసూలు చేసినట్లు తాజాగా రిజర్వుబ్యాంకు విడుదల చేసిన నివేదికలో వివరించారు. ఐబీసీ ద్వారా రూ. 4,900 కోట్లు, (ఎస్‌ఏఆర్‌ఎఫ్‌ఏఈఎస్‌ఐని ప్రయోగించి రూ. 26,500 కోట్లు వసూలుచేసినట్లు ఈ వారాంతంలో విడుదలైన ఆర్బీఐ నివేదిక తెలిపింది. -
ఆర్బీఐ డీఫాల్టర్లను ఎందుకు వెల్లడించడం లేదు?
సాక్షి, న్యూఢిల్లీ : బ్యాంకులకు ఉద్దేశపూర్వకంగా వేల కోట్ల రూపాయలను ఎగ్గొట్టిన బడా బాబుల పేర్లును వెల్లడించాల్సిందిగా కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ) ఎన్నిసార్లు ఆదేశించినా, ఈ విషయంలోనే సుప్రీం కోర్టు తీవ్రంగా మందలించినప్పటికీ భారతీయ రిజర్వ్ బ్యాంక్ పదే పదే ఒకే మాట చెబుతూ వస్తోంది. దేశం, బ్యాంకుల ఆర్థిక ప్రయోజనాలను దష్టిలో పెట్టుకొని ఆ సమాచారాన్ని వెల్లడించలేక పోతున్నామంటూ పాడిందే పాటగా పాడుతూ వస్తోంది. 2015 నుంచి ఆర్బీఐ తంతూ ఇదే. చివరకు విసిగిపోయిన కేంద్ర సమాచార కమిషన్ ఇదే విషయమై ఆర్బీఐకి షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఈ నోటీసుకు స్పందించిన ఆర్బీఐ సమాధానం ఇవ్వడానికి నవంబర్ 26వ తేదీ వరకు గడువు కావాలని సీఐసీని కోరింది. గడువు కావడానికి కారణం ఏమిటో సులభంగానే ఊహించవచ్చు. చీఫ్ సమాచార కమిషనర్ సతీష్ ఆచార్యులు నవంబర్ 20వ తేదీన పదవీ విరమణ చేస్తున్నారు. బ్యాంకుల నుంచి భారీ ఎత్తున రుణాలు తీసుకొని ఉద్దేశ పూర్వకంగానే ఎగ్గొడుతున్న డీఫాల్టర్ల పేర్లను వెల్లడించాల్సిందిగా సతీష్ ఆచార్యులు పట్టుబడుతుండడంతో ఆయన పోయే వరకు నిరీక్షిద్దామనే వైఖరితో ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ వ్యవహిరిస్తున్నట్లు కనిపిస్తోంది. ఆ స్థానంలో వచ్చే కొత్తవారిని ఏదో విధంగా మేనేజ్ చేసుకోవచ్చన్నది ఆయన ఆలోచనగా కనిపిస్తోంది. కొన్ని బడా బ్యాంకులు ఇప్పటికే తమ వెబ్సైట్లలో డీ ఫాల్టర్లయిన బడా బాబుల పేర్లను వెల్లడించాయని ఆదివారం నాడు ఎన్డీటీవీ ఓ కథనాన్ని ప్రచురించింది. సమాచార హక్కు కింద ఆర్బీఐని సీఐసీ కోరుతున్న సమాచారం ఇప్పటికే బ్యాంకుల వెబ్సైట్లలో ఉన్నాయని ఆ వార్తా కథనం పేర్కొంది. ఈ సమాచారం బయటకు రావడంతో ఆర్బీఐ చెబుతున్నట్లుగా లేదా భయపడుతున్నట్లుగా దేశ ఆర్థిక వ్యవస్థగానీ, బ్యాంకుల ఆర్థిక పరిస్థితిగానీ దెబ్బ తినే సూచనలుగానీ, అల్లకల్లోలం అలికిడిగానీ కనిపించడం లేదే! డీఫాల్టర్ల సమాచారాన్ని వెల్లడించాల్సిన విధి ఆర్బీఐదని 2015లోనే సుప్రీం కోర్టు స్పష్టంగా ప్రకటించినప్పటికీ ఇప్పటి వరకు ఆర్బీఐలో చలనం లేదు. ‘స్వచ్ఛమైన, పారదర్శకమైన పద్ధతిలో చాలా ఆర్థిక సంస్థలు తమ లావా దేవీలను నిర్వహించడం లేదన్నది మాకు బలమైన అనుమానం. వాటితో సంఘటితమైన ఆర్బీఐ, వాటి లావాదేవీలను ప్రజల దష్టికి రాకుండా కప్పి పుచ్చుతోంది. అది భావ్యం కాదు. అగౌర వ్యాపార లావాదేవీలను నిర్వహిస్తున్న ప్రభుత్వరంగ బ్యాంకులపై కఠిన చర్యలు తీసుకోవడం ఆర్బీఐ విధి’ అంటూ సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. ప్రభుత్వం మాటలను పెడ చెవిన పెడితే రాజ్యాంగంలోని ఏడవ షెడ్యూల్ కింద జోక్యం చేసుకోవాల్సి వస్తుందని ఇటీవల ఆర్బీఐని తీవ్రంగా హెచ్చరించిన కేంద్ర ప్రభుత్వం బడా డీఫాల్టర్ల పేర్లను వెల్లడించాల్సిందిగా ఈ మూడేళ్లలో ఒక్కసారి కూడా ఎందుకు ఆర్బీఐని ఆదేశించలేదు? ఆ బడా డీఫాల్టర్లే ఎన్నికల సమయంలో అధికార పార్టీకి భారీగా విరాళాలు ఇస్తున్న వారే అవడం వల్లనా?! -
డిఫాల్టర్ల లిస్టు ఎందుకు బైటపెట్టలేదు?
న్యూఢిల్లీ: ఉద్దేశపూర్వకంగా రుణాలు ఎగ్గొట్టిన వారి (డిఫాల్టర్లు) బైటపెట్టే విషయంపై సుప్రీం కోర్టు తీర్పును గౌరవించకపోవడం మీద వివరణనివ్వాలంటూ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఉర్జిత్ పటేల్‌కు కేంద్రీయ సమాచార కమిషన్ (సీఐసీ) షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఇందుకు సంబంధించి పటేల్‌పై గరిష్ట పెనాల్టీ ఎందుకు విధించరాదో వివరించాలని సూచించింది. మొండిబాకీలపై ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ రాసిన లేఖను కూడా బహిర్గతం చేయాలంటూ ప్రధాని కార్యాలయం, కేంద్ర ఆర్థిక శాఖ, రిజర్వ్ బ్యాంక్‌నకు సూచించింది. ముందుగా రూ. 1,000 కోట్ల పైగా డిఫాల్ట్ అయిన రుణాలతో మొదలుపెట్టి ఆ తర్వాత రూ. 500 కోట్ల దాకా రుణాలకు సంబంధించిన వివరాలను అయిదు రోజుల్లోగా ఆర్బీఐ వెల్లడించాల్సి ఉంటుందని చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ మాడభూషి శ్రీధరాచార్యులు పేర్కొన్నారు. -
డిఫాల్టర్లపై ఏ చర్యలు తీసుకున్నారు?
న్యూఢిల్లీ: బ్యాంకుల నుంచి రూ. 50 కోట్ల పైబడి రుణాలు తీసుకుని ఉద్దేశపూర్వకంగా ఎగవేసిన వారిపై (డిఫాల్టర్లు) ఏమేం చర్యలు తీసుకున్నారో బహిర్గతం చేయాలంటూ కేంద్ర ఆర్థిక శాఖ, రిజర్వ్ బ్యాంక్, గణాంకాలు.. పథకాల అమలు శాఖను కేంద్ర సమాచార కమిషన్(సీఐసీ) ఆదేశించింది. ఒకవేళ అలా చేయని పక్షంలో డిఫాల్టర్ల పేర్లు బయటపెట్టాలని ఎందుకు ఆదేశించకూడదో సెప్టెంబర్ 20లోగా తగిన వివరణనివ్వాలని సూచించింది. ఒకవైపు స్వల్ప రుణాలను కట్టలేని పరిస్థితుల్లో ఉన్న చిన్న రైతులను బహిరంగంగా పరువు తీస్తూ.. మరోవైపు కోట్ల రూపాయలు ఎగవేసిన డిఫాల్టర్లకు మాత్రం కావాల్సినంత సహకారం అందించడం జరుగుతోందని సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు విమర్శించారు. సమాచార హక్కు చట్టం సెక్షన్ 4 (1) (సీ) ప్రకారం ప్రజలపై ప్రభావం చూపే కీలక నిర్ణయాలు, విధానాలన్నింటి గురించి ప్రభుత్వ విభాగాలన్నీ సమగ్రమైన వివరాలను ప్రచురించాల్సిందేనని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రూ. 50 కోట్ల పైబడిన రుణాలను ఉద్దేశపూర్వకంగా ఎగవేసిన డిఫాల్టర్లపై ఏమేం చర్యలు తీసుకున్నారు, ప్రజాధనాన్ని.. ఎకానమీని కాపాడటానికి తీసుకుంటున్న చర్య లేమిటో ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత కేంద్ర ఆర్థిక శాఖ, గణాంకాల శాఖ, ఆర్బీఐకి ఉంటుందని ఆచార్యులు చెప్పారు. కార్పొరేట్లకో రూలు.. రైతులకో రూలా? రుణాలు చెల్లించలేక పరువు పోగొట్టుకున్నామన్న అవమానభారంతో 1998 నుంచి 2018 దాకా దేశవ్యాప్తంగా 30,000 మంది పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆచార్యులు పేర్కొన్నారు. మరోవైపు, రూ. 50 కోట్ల పైబడి రుణాలను ఉద్దేశపూర్వకంగా ఎగవేసిన డిఫాల్టర్లకు వన్‌టైమ్ సెటిల్మెంట్లు, వడ్డీ మాఫీ వంటి మినహాయింపులతో పాటు పలు ప్రయోజనాలు కల్పిస్తున్నారని, వారి ప్రతిష్ట దెబ్బతినకుండా ఎక్కడా పేర్లను కూడా బైటికి రానివ్వడం లేదని ఘాటుగా విమర్శించారు. -
నీరవ్ ఎఫెక్ట్: విల్‌ఫుల్ డిఫాల్టర్లకు చెక్?
సాక్షి, న్యూఢిల్లీ : అతిపెద్ద బ్యాంకింగ్స్కాం పీఎన్బీ (పంజాబ్ నేషనల్ బ్యాంకు) కుంభకోణం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగుతోంది.. భారీ ఎత్తున బ్యాంకుల నుంచిరుణాలను తీసుకొని విదేశాలకు చెక్కేస్తున్న ఘరానాబాబులకు చెక్ పెట్టేలా కఠిన చర్యలు తీసుకునేందుకు కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో బ్యాంకు మోసాలకు పాల్పడేవారు దేశం విడిచి వెళ్లిపోకుండా ఆంక్షలు తీసుకురావాలని యోచిస్తోంది. గతంలో జరిగిన తప్పులు మళ్లీ రిపీట్ కాకూడదనే యోచనలోనే బ్యాంకులకు భారీగా బకాయి బడిన, అక్రమాలకు పాల్పడిన వారికి సంబంధించి ఒక భారీ జాబితాను కూడా తయారుచేసినట్టు సమాచారం. బ్యాంకు రుణాలు ఎగవేయడంతోపాటు, మోసపూరిత లావాదేవీలకు పాల్పడిన కేసుల్లో నిందితులు లేదా ఆ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు ఉన్నారట. పేరు చెప్పడానికి నిరాకరించిన ఓ అధికారి ఈ విషయాలను వెల్లడించారు. ఇలాంటి కేసులకు సంబంధించి మొత్తం 400 మంది ఉద్దేశపూర్వక ఎగవేతదార్లను గుర్తించిందని తెలిపారు. వీరిలో దాదాపు 91 మంది ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారుల లిస్ట్‌ను తయారు చేసినట్టు వెల్లడించారు. అంతేకాదు వీరు దేశం విడిచి వెళ్లకుండా నిషేధం విధించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందట. అయితే దీనిపై ఆర్థికశాఖ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. కాగా వేలకోట్ల రూపాయల ఎగ్గొట్టిన విదేశాలకు పారిపోయిన విజయ్‌మాల్యాను తిరిగి దేశానికి రప్పించేందుకు కేంద్రచేస్తున్న ప్రయత్నాలు ఇప్పటికీ ఫలింతచలేదు. దీనికితోడు ఇటీవలి వజ్రాల వ్యాపారి నీరవ్‌మోదీ, మెహుల్ చోక్సీ, రొటోమ్యాక్ కుంభకోణాలు ప్రకంపనలు రేపాయి. ఈ నేపథ్యంలో రూ. 50కోట్లకు పైబడి బ్యాంకు రుణాలు పొందాలంటే ఆ ఖాతాదారులు పాస్‌పోర్టు వివరాలను అందించడం తప్పనిసరని ఇటీవల ప్రభుత్వం స్పష్టం చేసిన విషయం తెలిసిందే. -
డిఫాల్టర్లకు చైనా ప్రభుత్వం చుక్కలు!
బీజింగ్: ఇచ్చిన రుణాలను వసూలు చేసుకోవడానికే భారత్‌లో నానా కష్టాలు పడుతుంటే చైనా ప్రభుత్వం అక్కడి డిఫాల్టర్లకు చుక్కలు చూపిస్తోంది. 2017 చివరినాటికి రుణాల ఎగవేతకు పాల్పడిన 95.9 లక్షల మంది ప్రజల్ని కోర్టులు నిషేధిత జాబితాలో చేర్చినట్లు సుప్రీం పీపుల్స్ కోర్టు(ఎస్పీసీ) తెలిపింది. డిఫాల్టర్ల రూ.1.76 లక్షల కోట్ల(27.7 బిలియన్ డాలర్లు) డిపాజిట్లను జప్తు చేశారు. పాస్‌పోర్టులు, గుర్తింపు కార్డుల ఆధారంగా విమానాలు, హైస్పీడ్ రైళ్లలో టికెట్లు కొనకుండా అడ్డుకున్నారు. డిఫాల్టర్లు దాఖలు చేసే రుణ, క్రెడిట్ కార్డ్ దరఖాస్తుల్ని తిరస్కరించేందుకు బ్యాంకులతో కలిసి పనిచేశారు. నిషేధిత జాబితాలోని వ్యక్తులు కార్పొరేట్ సంస్థల ప్రతినిధులుగా ఇకపై ఉండలేరు.