సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా బ్యాంకులకు మొండి బకాయిలు సుమారు రూ. 8 లక్షల కోట్లు ఉంటే అందులో ఉద్దేశపూర్వకం(విల్‌ఫుల్)గా ఎగ్గొట్టిన రుణాల విలువ రూ.1,47,350 కోట్లుగా ఉన్నట్లు ఆలిండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ) అంచనా వేసింది. రూ. 5 కోట్ల పైన రుణం తీసుకొని ఉద్దేశపూర్వకంగా రుణాలు ఎగ్గొట్టిన కంపెనీల వివరాలను బ్యాంకుల వారీగా ఏఐబీఈఏ విడుదల చేసింది. 2019, సెప్టెంబర్ నాటికి 2,426 సంస్థలు రూ. 1.47 లక్షల కోట్లు బ్యాంకులకు ఎగ్గొట్టాయి. ఇందులో అత్యధికంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు 685 సంస్థలు రూ. 43,887 కోట్లు ఎగనామం పెట్టాయి. రూ. 500 కోట్లుపైగా రుణం తీసుకొని ఎగ్గొట్టిన కంపెనీలు ఎగ్గొట్టిన రుణాల విలువ రూ. 32,737 కోట్లుగా ఉందని ఏఐబీఈఏ అంచనా వేసింది. రూ. 200 కోట్లుపైన రుణం తీసుకొని ఎగ్గొట్టిన కంపెనీలన్నీ కలిపి రూ. 67,609 కోట్లు రుణం ఎగవేశాయి.
టాప్–20లో రెండు తెలుగు కంపెనీలు
► రుణాలు ఎగ్గొట్టిన టాప్–20 కంపెనీల్లో రెండు తెలుగు కంపెనీలున్నాయి.
► టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందిన ట్రాన్స్‌ట్రాయ్ రెండు బ్యాంకులకు రూ. 1,217 కోట్లు బకాయి పడింది.
► హైదరాబాద్ కేంద్రంగా ఉన్న కోస్టల్ ప్రాజెక్టŠస్ రూ. 984 కోట్లు ఎగవేసింది.
► ఉద్యోగులు కష్టపడి బ్యాంకులను లాభాల్లోకి తీసుకువస్తే ఉద్దేశపూర్వక ఎగవేతదారులతో రూ. లక్షల కోట్లు నష్టపోవాల్సి వస్తోందని ఏఐబీఈఏ జాతీయ కార్యదర్శి బీఎస్ రాంబాబు అన్నారు.
► గడిచిన నాలుగేళ్లుగా ప్రభుత్వరంగ బ్యాంకులు అన్ని కలిపి రూ. 8,16,135 కోట్ల నిర్వహణ లాభం సంపాదిస్తే ఎగవేతదారుల రుణాలకు ఎన్‌పీఏలకు కేటాయింపు చేయడం వల్ల చివరికి రూ. 1,81,358 కోట్ల నష్టాలను ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇలా పెద్ద మొత్తంలో ప్రజాధనం ఎగువేతదారుల వల్ల నష్టపోవాల్సి వస్తోందని, కాబట్టి వీరందరిపై తక్షణం క్రిమినల్ కేసులు నమోదు చేసి ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని ఏఐబీఈఏ డిమాండ్ చేస్తోందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment