AIBEA
-
బ్యాంకు కస్టమర్లకు అలర్ట్: మోగనున్న సమ్మె సైరన్
సాక్షి,ముంబై: దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు మరోసారి సమ్మె బాట పట్టనున్నారు. తమ వివిధ డిమాండ్ల సాధన కోసం జనవరి 30 నుంచి రెండు రోజుల పాటు సమ్మె చేయాలని పలు బ్యాంకు యూనియన్ల గొడుగు సంస్థ యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్‌బీయూ) గురువారం నిర్ణయించినట్లు ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ) వెల్లడించింది, గురువారం ముంబైలో జరిగిన యూఎఫ్‌బీయూ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. తతమ డిమాండ్లపై ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబిఎ) లేఖలు రాసినా స్పందన రాకపోవడంతో, తమ ఆందోళనను పునరుద్ధరించాలని భావించామని, జనవరి 30, 31 తేదీల్లో ( సోమ, మంగళవారం) సమ్మెకు పిలుపు నివ్వాలని నిర్ణయించామని ఏఐబీఈఏ ప్రధాన కార్యదర్శి సీహెచ్ వెంకటాచలం ఐఏఎన్ఎస్కు తెలిపారు. ముఖ్యంగా ఐదు రోజుల వర్కింగ్ డేస్, పెన్షన్ అప్డేట్, నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్‌పిఎస్) రద్దు, వేతన సవరణ డిమాండ్ల చార్టర్‌పై తక్షణ చర్చలు, అన్ని విభాగాల్లో తగిన నియామకాలు తదితర డిమాండ్స్‌తో ఈ సమ్మెకు దిగుతున్నట్టు వెల్లడించారు. -
All India bank strike: 19న బ్యాంకు ఉద్యోగుల సమ్మె
న్యూఢిల్లీ: ఉద్యోగాల అవుట్‌సోర్సింగ్‌ను వ్యతిరేకిస్తూ బ్యాంకు ఉద్యోగుల యూనియన్ ఏఐబీఈఏ ఈ నెల 19న (రేపు) సమ్మెకు పిలుపునిచ్చింది. అధికారులు ఇందులో పాల్గొనకపోయినప్పటికీ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో (పీఎస్బీ) కొన్ని కార్యకలాపాలపై ప్రభావం పడనుంది. నగదు డిపాజిట్, విత్‌డ్రాయల్, చెక్కుల క్లియరింగ్ వంటి లావాదేవీలపై కొంత ప్రభావం ఉండవచ్చని అంచనా. సమ్మె జరిగితే పరిస్థితుల గురించి బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ మొదలైన పలు బ్యాంకులు ఇప్పటికే తమ కస్టమర్లకు సమాచారం అందించాయి. కొన్ని బ్యాంకులు ఉద్యోగాలను అవుట్సోర్స్ చేయడం వల్ల కస్టమర్ల ప్రైవసీకి, వారి సొమ్ముకు రిస్కులు పొంచి ఉండటంతో పాటు కింది స్థాయిలో రిక్రూట్మెంట్ తగ్గిపోతోందని అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల అసోసియేషన్ (ఏఐబీఈఏ) జనరల్ సెక్రటరీ సీహెచ్ వెంకటాచలం తెలిపారు. కొన్ని బ్యాంకులు పారిశ్రామిక వివాదాల (సవరణ) చట్టాన్ని కూడా ఉల్లంఘిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించడం, సమ్మెలు జరపడం మినహా తమ ఆందోళనను వ్యక్తపర్చేందుకు మరో ప్రత్యామ్నాయం లేదని ఆయన చెప్పారు. ప్రైవేట్ బ్యాంకులపై సమ్మె ప్రభావం ఉండదు. -
స్పాన్సర్ బ్యాంకుల్లో గ్రామీణ బ్యాంకుల విలీనం!
న్యూఢిల్లీ: పునర్వ్యవస్థీకరణ ప్రక్రియలో భాగంగా బలహీన ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను (ఆర్ఆర్బీ) స్పాన్సర్ బ్యాంకుల్లో విలీనం చేసే అంశాన్ని కేంద్రం పరిశీలించాలని అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల అసోసియేషన్ (ఏఐబీఈఏ) కోరింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాసింది. ఆర్ఆర్బీలను లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వం మరిన్ని సంస్కరణలు చేపట్టనున్న వార్తల నేపథ్యంలో ఈ మేరకు లేఖ రాసినట్లు ఏఐబీఏఈఏ తెలిపింది. ‘ఆర్ఆర్బీలను స్పాన్సర్ బ్యాంకుల్లో విలీనం చేయడం వల్ల స్పాన్స్ బ్యాంకులకు గ్రామీణ నెట్వర్క్ మరింతగా పెరుగుతుంది. అలాగే ఆర్ఆర్బీలు ప్రస్తుతం ఎదుర్కొంటున్న బలహీనతలను కూడా తొలగించవచ్చు‘ అని పేర్కొంది. బ్యాంకులో భాగంగా మారడంతో పాటు నేరుగా స్పాన్సర్ బ్యాంకు మేనేజ్‌మెంట్‌లోకి రావడం వల్ల మరింత సమర్ధమంతంగా పర్యవేక్షించడానికి వీలవుతుందని ఏఐబీఈఏ జనరల్ సెక్రటరీ సీహెచ్ వెంకటాచలం తెలిపారు. ఆర్ఆర్బీలు అందిస్తున్న సేవలు ప్రశంసించతగ్గవే అయినప్పటికీ వాటి వ్యాపార స్వభావరీత్యా అవి బలహీనంగానే ఉంటున్నాయని ఆయన పేర్కొన్నారు. వాటిని పటిష్టం చేసేందుకు అనేక ప్రయత్నాలు జరిగినా.. పలు అంశాల కారణంగా అంత ఆశావహ ఫలితాలు రావడం లేదని వెంకటాచలం తెలిపారు. ఈ నేపథ్యంలోనే బలహీనంగా ఉన్న ఆర్ఆర్బీలను స్పాన్సర్ బ్యాంకుల్లో విలీనం చేయడం శ్రేయస్కరం కాగలదని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో చిన్న రైతులు, వ్యవసాయ కూలీలకు రుణాలు, ఇతరత్రా ఆర్థిక సర్వీసులను అందించేందుకు ఆర్ఆర్బీ చట్టం 1976 కింద ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను ఏర్పాటు చేశారు. చట్టం ప్రకారం వీటిలో కేంద్రానికి 50 శాతం, ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలకు 15 శాతం, స్పాన్సర్ (ప్రమోటర్) బ్యాంకులకు 35 శాతం వాటాలు ఉంటాయి. అప్పట్లో 196 ఆర్ఆర్బీలు ఉండగా.. కాలక్రమేణా వీటి సంఖ్య 43కి తగ్గింది. -
నవంబర్ 26 సార్వత్రిక సమ్మెలో బ్యాంకు ఉద్యోగులు
సాక్షి, ముంబై: కేంద్ర కార్మిక సంఘాలు పిలుపు మేరకు నవంబర్ 26న జరగనున్న ఒక రోజు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు బ్యాంకు ఉద్యోగుల సంఘం మద్దతు ప్రకటించింది. ఈ సమ్మెలో తామూ పాల్గొంటామని ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ) ప్రకటించింది. ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు నిర్ణయించామని మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇటీవల నిర్వహించిన లోక్‌సభ సెషన్లో 'ఈజీ ఆఫ్ బిజినెస్' పేరిట మూడు కొత్త కార్మిక చట్టాలను ఆమోదించిందని, ప్రస్తుత 27 చట్టాలను తుంగలో తొక్కి పూర్తిగా కార్పొరేట్ల ప్రయోజనాల కోసమే ఈ కొత్త చట్టాలను తీసుకొస్తోందని ఏఐబీఈఏ ఒక ప్రకటనలో వ్యాఖ్యానించింది. తద్వారా 75 శాతం మంది కార్మికులను చట్టపరిధిలోంచి తప్పించి వారికి రక్షణ లేకుండా కేంద్రం చేస్తోందని ఆరోపించింది. కేంద్ర కార్మిక సంఘాలు, స్వతంత్ర ఫెడరేషన్లు, అసోసియేషన్ల జాతీయ కార్మిక సదస్సు పిలుపులో భాగంగా దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె చేపట్టాలని నిర్ణయించాయి. భారతీయ మజ్దూర్ సంఘ్ మినహా పది కేంద్ర కార్మిక సంఘాలు నవంబర్ 26 న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను నిర్వహించనున్న సంగతి తెలిసిందే. -
ఉద్దేశపూర్వక ఎగవేత రూ. 1.47 లక్షల కోట్లు
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా బ్యాంకులకు మొండి బకాయిలు సుమారు రూ. 8 లక్షల కోట్లు ఉంటే అందులో ఉద్దేశపూర్వకం(విల్‌ఫుల్)గా ఎగ్గొట్టిన రుణాల విలువ రూ.1,47,350 కోట్లుగా ఉన్నట్లు ఆలిండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ) అంచనా వేసింది. రూ. 5 కోట్ల పైన రుణం తీసుకొని ఉద్దేశపూర్వకంగా రుణాలు ఎగ్గొట్టిన కంపెనీల వివరాలను బ్యాంకుల వారీగా ఏఐబీఈఏ విడుదల చేసింది. 2019, సెప్టెంబర్ నాటికి 2,426 సంస్థలు రూ. 1.47 లక్షల కోట్లు బ్యాంకులకు ఎగ్గొట్టాయి. ఇందులో అత్యధికంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు 685 సంస్థలు రూ. 43,887 కోట్లు ఎగనామం పెట్టాయి. రూ. 500 కోట్లుపైగా రుణం తీసుకొని ఎగ్గొట్టిన కంపెనీలు ఎగ్గొట్టిన రుణాల విలువ రూ. 32,737 కోట్లుగా ఉందని ఏఐబీఈఏ అంచనా వేసింది. రూ. 200 కోట్లుపైన రుణం తీసుకొని ఎగ్గొట్టిన కంపెనీలన్నీ కలిపి రూ. 67,609 కోట్లు రుణం ఎగవేశాయి. టాప్–20లో రెండు తెలుగు కంపెనీలు ► రుణాలు ఎగ్గొట్టిన టాప్–20 కంపెనీల్లో రెండు తెలుగు కంపెనీలున్నాయి. ► టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందిన ట్రాన్స్ట్రాయ్ రెండు బ్యాంకులకు రూ. 1,217 కోట్లు బకాయి పడింది. ► హైదరాబాద్ కేంద్రంగా ఉన్న కోస్టల్ ప్రాజెక్టŠస్ రూ. 984 కోట్లు ఎగవేసింది. ► ఉద్యోగులు కష్టపడి బ్యాంకులను లాభాల్లోకి తీసుకువస్తే ఉద్దేశపూర్వక ఎగవేతదారులతో రూ. లక్షల కోట్లు నష్టపోవాల్సి వస్తోందని ఏఐబీఈఏ జాతీయ కార్యదర్శి బీఎస్ రాంబాబు అన్నారు. ► గడిచిన నాలుగేళ్లుగా ప్రభుత్వరంగ బ్యాంకులు అన్ని కలిపి రూ. 8,16,135 కోట్ల నిర్వహణ లాభం సంపాదిస్తే ఎగవేతదారుల రుణాలకు ఎన్పీఏలకు కేటాయింపు చేయడం వల్ల చివరికి రూ. 1,81,358 కోట్ల నష్టాలను ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇలా పెద్ద మొత్తంలో ప్రజాధనం ఎగువేతదారుల వల్ల నష్టపోవాల్సి వస్తోందని, కాబట్టి వీరందరిపై తక్షణం క్రిమినల్ కేసులు నమోదు చేసి ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని ఏఐబీఈఏ డిమాండ్ చేస్తోందన్నారు. -
మార్చి 27న బ్యాంకుల సమ్మె
చెన్నై: బ్యాంకుల విలీనానికి వ్యతిరేకంగా బ్యాంకు సంఘాలు మరోసారి సమ్మె చేపట్టనున్నాయి. కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన మెగా బ్యాంక్ విలీనాలను వ్యతిరేకిస్తూ బ్యాంకింగ్ రంగంలోని రెండు ప్రధాన యూనియన్లు (ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్, ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్) మార్చి 27 న సమ్మెకు దిగనున్నాయి. బ్యాడ్ లోన్ల కారణంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు సంక్షోభంలో చిక్కుకుంటున్నాయని ఏఐబీఈఏ ప్రధాన కార్యదర్శి వెంకటచలం అన్నారు. చెడు రుణాల మొత్తం రూ. 216,000 కోట్లుగా వుండటంతో, 2019 మార్చి 31 తో ముగిసిన సంవత్సరానికి ప్రభుత్వ రంగ బ్యాంకులు మొత్తం రూ .150,000 కోట్ల స్థూల లాభాలకు పరిమితమైనాయని తెలిపారు. దీంతో రూ .66,000 కోట్ల నికర నష్టం వాటిల్లిందని విమర్శించారు. తాజా బ్యాంకుల విలీనం వల్ల భారీ ఎత్తున పేరుకు పోయిన కార్పొరేట్ బ్యాడ్ లోన్లు తిరిగి వస్తాయని ఎలా నమ్మగలమని ఆయన ప్రశ్నించారు. దీనికి ఉదాహరణగా ఎస్బీఐ విలీనం విలీనం తరువాత ఈ బెడదమరింత పెరిగిందనే విషయాన్ని గుర్తుచేశారు. కేవలం 323 మిలియన్ల జనాభా ఉన్న అమెరికాలో బ్యాంకుల సంఖ్య భారతదేశంలోని బ్యాంకుల కంటే ఎక్కువ ఉందని, అలాంటిది 1.35 బిలియన్ల జనాభా కలిగిన భారతదేశంలో మరిన్ని బ్యాంకుల అవసరం ఉందన్నారు. ఈ నేపథ్యంలో బ్యాంకుల ఏకీకరణ అవసరం లేదని వెంకటాచలం అభిప్రాయం వ్యక్తం చేశారు. -
అంత డబ్బు ఎలా ఇచ్చేస్తారండీ!
న్యూఢిల్లీ: కేంద్రానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) భారీ నిధుల బదలాయింపుపై అఖిల భారత బ్యాంక్ ఉద్యోగుల సంఘం (ఏఐబీఈఏ) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆర్బీఐ అదనపు నిధుల బదలాయింపును ప్రస్తావిస్తూ, ‘‘ఇది తీవ్ర ఆందోళనకర అంశం’’ అని పేర్కొంది. ఆర్థిక మంత్రిత్వశాఖకు ఆర్బీఐ అదనపు బ్రాంచ్ ఆఫీస్ (ఎక్స్టెన్షన్ కౌంటర్) కారాదని స్పష్టంచేసింది. ఒక స్వతంత్ర సంస్థగా ఆర్బీఐ ఏర్పాటయ్యిందని పేర్కొంటూ, ఆర్థిక వ్యవస్థలో స్థిరత్వం, విదేశీ అనిశ్చితి పరిస్థితుల నుంచి దేశ ఆర్థిక వ్యవస్థకు రక్షణ, ద్రవ్య స్థిరత్వం, దవ్య లభ్యత, సరఫరాల్లో ఇబ్బందులు లేకుండా చూడ్డం వంటివి ఆర్బీఐ ప్రధాన లక్ష్యాలుగా ఉన్న విషయాన్ని ప్రస్తావించింది. ఆర్బీఐ మిగులు నిధులను కేంద్రానికి బదలాయింపులపై ఏర్పాటయిన బిమల్ జలాన్ కమిటీ ఇచ్చిన సిఫారసులను ఆర్బీఐ ఆమోదించిన నేపథ్యంలో ఏఐబీఈఏ తాజా వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రూ.1,23,414 కోట్లు మిగులు లేదా డివిడెండ్ రూపంలో, మరో రూ. 52,637 కోట్లు మిగులు మూలధనం రూపంలో మొత్తం రూ.1,76,051 కోట్లను కేంద్రానికి బదలాయించాలని ఆర్బీఐ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. -
మళ్లీ సమ్మె బాటలో బ్యాంక్ సిబ్బంది
సాక్షి, న్యూఢిల్లీ : ఇటీవల బ్యాంక్ యూనియన్ల సమ్మెకు తోడు వరుస సెలవలతో ఐదు రోజులు బ్యాంకింగ్ సేవలకు అంతరాయం ఏర్పడటంతో ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సమ్మె కష్టాలు మరువక ముందే వచ్చే ఏడాది జనవరి 8, 9 తేదీల్లో మరోసారి బ్యాంకు ఉద్యోగ సంఘాలు సమ్మెకు సన్నద్ధమవుతున్నాయి. ప్రభుత్వ రంగ యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు వ్యతిరేకంగా అఖిల భారత బ్యాంక్ ఉద్యోగుల సంఘం (ఏఐబీఈఏ), బ్యాంక్ ఉద్యోగుల సమాఖ్య (బీఈఎఫ్ఐ)లు బ్యాంకింగ్ పరిశ్రమకు సంబంధించిన అంశాలపై రెండు రోజుల సమ్మెకు పిలుపు ఇచ్చాయని యునైటెడ్ బ్యాంక్ నోటిఫికేషన్లో పేర్కొంది. సమ్మె నేపథ్యంలో బ్యాంకు సేవలకు విఘాతం కలగకుండా అన్ని చర్యలు చేపడతామని తెలిపింది. సమ్మె యునైటెడ్ బ్యాంక్ వరకే పరిమితమా అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులకు వర్తిస్తుందా అనే దానిపై ఇంకా స్పష్టత లేదని అధికారులు వెల్లడించారు. ఇటీవల బ్యాంక్ ఉద్యోగుల సమ్మెతో బ్యాంకింగ్ సేవలు, ఏటీఎం విత్డ్రాయల్స్పై ప్రభావం చూపడంతో ఖాతాదారులు ఇబ్బందులు ఎదుర్కొన్న క్రమంలో జనవరి 8, 9 తేదీల్లో సమ్మె పిలుపుతో బ్యాంకింగ్ పనులను ఈలోగా పూర్తిచేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. -
బ్యాంకు ఉద్యోగుల సమ్మె : వరుస సెలవులున్నాయా?
సాక్షి, ముంబై: దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు డిసెంబర్ 26న సమ్మెను చేపట్టనున్నారు. బ్యాంక్ బరోడా, దేనా బ్యాంక్, విజయ బ్యాంక్‌ల విలీనానికి నిరసనగా ఉద్యోగ సంఘాలు ఈ సమ్మెకు పిలుపునిచ్చాయి. డిసెంబర్ 26న సమ్మె చేస్తున్నట్లు యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్(యూఎఫ్‌బీయూ), ఆల్ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐబీఇఏ) వెల్లడించాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఇతర బ్యాంకుల విలీనం ఆర్బీఐకు ఎలాంటి లాభదాయకం కానందున మరిన్ని బ్యాంకుల విలీనం మంచి పరిణామం కాదని యూనియన్స్ వాదిస్తున్నాయి. మరోవైపు డిసెంబరు నాలుగవ వారంలో అటు సెలవులు, ఇటు బంద్ నేపథ్యంలో ఈ ప్రభావం సామాన్యులపై ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉంది. తాజా విలీనం బ్యాంకింగ్ పరిశ్రమలో ఉపాధి అవకాశాలను కూడా ప్రభావితం చేస్తుందని అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సి హెచ్ వెంకటాచలం పేర్కొన్నారు. పెద్ద సంఖ్యలో గ్రామాలు బ్యాంకింగ్ సేవలను కోరుకుంటున్న క్రమంలో ఏకీకరణ చర్య అవాంఛనీయమన్నారు. ఈ దేశవ్యాప్త సమ్మెలో పది లక్షలమంది బ్యాంకు ఉద్యోగులు, అధికారులు పాల్గొంటున్నారని తెలిపారు. బ్యాంకు సెలవులను ఒకసారి పరిశీలిద్దాం : డిసెంబర్ 22 - 4వ శనివారం సెలవు డిసెంబర్ 23 - ఆదివారం సెలవు డిసెంబర్ 24 - సోమవారం బ్యాంకులు పని చేస్తాయి. డిసెంబర్ 25 - మంగళవారం క్రిస్మస్ సెలవు డిసెంబర్ 26 - బుధవారం బ్యాంకు ఉద్యోగుల దేశవ్యాప్త సమ్మె -
దేనా బ్యాంక్‌పై ఆంక్షలు ఎత్తివేయండి
వడోదరా: భారీ మొండిబాకీల కారణంగా తదుపరి రుణాలు మంజూరు చేయకుండా ప్రభుత్వ రంగ దేనా బ్యాంకుపై విధించిన ఆంక్షలు ఎత్తివేయాలంటూ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఉర్జిత్ పటేల్‌ను అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం ఏఐబీఈఏ అభ్యర్థించింది. ఆంక్షల మూలంగా బ్యాంకు ఆర్థిక పరిస్థితి మరింత దిగజారుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. మొండిబాకీలు భారీగా పెరిగిపోయిన నేపథ్యంలో దేనా బ్యాంకును రిజర్వ్ బ్యాంక్ సత్వర దిద్దుబాటు చర్యల (పీసీఏ) పరిధిలోకి చేర్చడం తెలిసిందే. దీనివల్ల కొత్తగా రుణాలు మంజూరు చేయటం, ఉద్యోగ నియామకాలు చేపట్టడం వంటి అంశాల్లో బ్యాంకు పలు నియంత్రణలకు లోబడి పనిచేయాల్సి ఉంటుంది. ఇలా చేయటం వల్ల బ్యాంకు ఆర్థిక పరిస్థితి మరింత దిగజారుతుందని జూన్ 10న ఉర్జిత్ పటేల్‌కు రాసిన లేఖలో ఏఐబీఈఏ జనరల్ సెక్రటరీ సీహెచ్ వెంకటాచలం పేర్కొన్నారు. బ్యాంకు ఖాతాదారులు, ఉద్యోగులను ఇది అనవసర ఆందోళనకు గురి చేస్తోందన్నారు. వ్యాపార పరిమాణం ప్రకారం భారీ బ్యాంకు కాకపోయినప్పటికీ ముఖ్యమైన ప్రాంతాల్లో ఆర్థికాభివృద్ధిలో దేనా బ్యాంక్ కీలక పాత్ర పోషిస్తోందని వెంకటాచలం వివరించారు. 2018 మార్చి 31 నాటికి దేనా బ్యాంకులో స్థూల మొండిబాకీలు 16.27% నుంచి 22.4 శాతానికి ఎగిశాయి. విలువపరంగా చూస్తే రూ. 12,619 కోట్ల నుంచి రూ.16,361 కోట్లకు చేరాయి. నికర ఎన్పీఏలు 10.66% (రూ.7,735 కోట్లు) నుంచి 11.95 శాతానికి (రూ.7,839 కోట్లు) చేరాయి. దేనా బ్యాంక్‌తో పాటు అలహాబాద్ బ్యాంక్, ఐడీబీఐ, యూకో తదితర బ్యాంకులు కూడా పీసీఏ పరిధిలోనే ఉన్నాయి. ఎన్సీఎల్టీ ముందుకు 65 మొండిపద్దులు: అలహాబాద్ బ్యాంక్ కోల్‌కతా: గత ఆర్థిక సంవత్సరం(2017–18) సుమారు రూ.12,566 కోట్ల మొండిబాకీలకు సంబంధించిన 65 ఖాతాదారులపై దివాలా చట్టం కింద చర్యల కోసం నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)ని ఆశ్రయించినట్లు ప్రభుత్వ రంగ అలహాబాద్ బ్యాంక్ వెల్లడించింది. -
అనధికారిక లావాదేవీల నుంచి భద్రత కల్పించాలి
చెన్నై: డిజిటల్ మాధ్యమం వినియోగం భారీగా పెరుగుతున్న నేపథ్యంలో అనధికారిక లావాదేవీల నుంచి వినియోగదారులకు భద్రత కల్పించేలా తగు వ్యవస్థను ఏర్పాటు చేయాలని రిజర్వ్ బ్యాంకును, కేంద్ర ఆర్థిక శాఖను అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం (ఏఐబీఈఏ) కోరింది. ఈ మేరకు ఆర్బీఐ గవర్నర్, ఆర్థిక శాఖకు మెమోరాండం సమర్పించింది. డిజిటల్ లావాదేవీలు జరిపేలా ఖాతాదారులను కేంద్రం మరింతగా ప్రోత్సహిస్తున్నప్పటికీ... అనధికారిక లావాదేవీల నుంచి ఖాతాదారులకు తగినంత భద్రత కల్పించేలా అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు భారత బ్యాంకుల్లో లేవని ఏఐబీఈఏ తెలిపింది. ఈ నేపథ్యంలో కస్టమర్లకు భద్రత కల్పించేలా తగు యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని, ఈ దిశగా ఆర్బీఐ మాస్టర్ సర్క్యులర్ జారీ చేయాలని ఏఐబీఈఏ జనరల్ సెక్రటరీ సీహెచ్ వెంకటాచలం కోరారు. అలాగే, టెలికంలో విజయవంతమైన నంబర్ పోర్టబిలిటీ తరహాలోనే బ్యాంకింగ్లోనూ అకౌంటు పోర్టబిలిటీని ప్రవేశపెట్టాలన్నారు. అలాగే, ఖాతాదారుల ఫిర్యాదుల పరిష్కారానికి ఖచ్చితమైన గడువు, లోపభూయిష్ట సేవలకు పెనాల్టీ విధించడం వంటి నిబంధనలతో చార్టర్ ఆఫ్ కస్టమర్ రైట్స్‌ని పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని వెంకటాచలం తెలిపారు. -
భారీ మూలధనం తాత్కాలిక ఊరటే!!
చెన్నై: ప్రభుత్వ రంగ బ్యాంకులకి మరింత మూలధనం సమకూర్చాలన్న కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం ఏఐబీఈఏ స్వాగతించింది. అయితే, ఇది తాత్కాలిక ఊరట మాత్రమేనని... మొండిబాకీల సమస్య పరిష్కారానికి ఇదొక్కటే పరిష్కారం కాదని ఏఐబీఈఏ జనరల్ సెక్రటరీ సీహెచ్ వెంకటాచలం ఒక ప్రకటనలో తెలిపారు. ‘కొండలా పెరిగిపోతున్న మొండి బాకీలతో బ్యాంకులు సతమతమవుతున్నాయి. ఇప్పటిదాకా స్థూల మొండి బాకీలు రూ.8 లక్షల కోట్లుగా ఉన్నాయి. పునర్వ్యవస్థీకరించిన వాటిని కూడా కలిపితే మొత్తం రూ.15 లక్షల కోట్ల పైగా ఉంటుంది‘ అని ఆయన వివరించారు. ఎన్పీఏలతో కుదేలవుతున్న ప్రభుత్వ రంగ బ్యాంకులకు రెండేళ్లలో రూ. 2.11 లక్షల కోట్ల మేర అదనపు మూలధనాన్ని సమకూర్చనున్నట్లు కేంద్రం మంగళవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. కార్పొరేట్లు.. ఎగవేతదారులదే పాపం.. కార్పొరేట్లు, ఉద్దేశపూర్వక ఎగవేతదారులే మొండి బాకీల్లో అత్యధిక భాగానికి కారణమని వెంకటాచలం చెప్పారు. దీనివల్ల ఆయా ఖాతాలకు బ్యాంకులు తప్పనిసరిగా తమ లాభాల్లో నుంచి భారీగా కేటాయింపులు జరపాల్సి వస్తోందన్నారు. -
10 బలహీన బ్యాంకులకు కేంద్రం 8,586 కోట్లు
చెన్నై: ప్రభుత్వ రంగంలోని బలహీన బ్యాంకులకు కేంద్రం త్వరలో తాజా మూలధనాన్ని సమకూర్చనుంది. మొత్తం 10 బ్యాంకులకు ఈ ఆర్థిక సంవత్సరం(2017–18)లో రూ.8,586 కోట్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు అఖిల భారత బ్యాంక్ ఉద్యోగుల సంఘం(ఏఐబీఈఏ) జనరల్ సెక్రటరీ సీహెచ్ వెంకటాచలం వెల్లడించారు. ఈ మేరకు ఆయా బ్యాంకు చీఫ్‌లకు కేంద్రం లేఖ కూడా రాసిందని తెలిపారు. అయితే, ఈ నిధులను దక్కించుకోవాలంటే బ్యాంకుల డైరెక్టర్ల బోర్డులు, యాజమాన్యం ఉద్యోగులు, యూనియన్లు పనితీరుకు సంబంధించి త్రైమాసిక మైలురాళ్ల విషయంలో హామీనివ్వాల్సి ఉంటుందని చెప్పారు. బ్యాంకుల వారీగా కార్యాచరణ ప్రణాళికను ఎస్బీఐ క్యాప్స్ రూపొందించనుందని.. దీని ఆధారంగా బ్యాంకు యాజమాన్యం, ఉద్యోగ సంఘాలు, ప్రభుత్వం మధ్య త్రైపాక్షిక అవగాహన ఒప్పందం(ఎంఓయూ)పై సంతకాలు జరుగుతాయని ఆయన వివరించారు. ఎంఓయూపై సంతకం చేసేందుకు ఏఐబీఈఏ సిద్ధంగా ఉందని కూడా వెంకటాచలం పేర్కొన్నారు. కాగా, నిధులు లభించనున్న బ్యాంకుల్లో ఆంధ్రా బ్యాంక్(రూ.1,100 కోట్లు), బ్యాంక్ ఆఫ్ ఇండియా(రూ.1,500 కోట్లు), బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర(రూ.300 కోట్లు), ఐడీబీఐ బ్యాంక్(రూ.1,900 కోట్లు), ఐఓబీ(రూ.1,100 కోట్లు) వంటివి ఉన్నాయి. -
7న బ్యాంకు ఉద్యోగుల సమ్మె సైరన్!
న్యూఢిల్లీ: కొన్ని బ్యాంక్ ట్రేడ్ యూనియన్లు ఫిబ్రవరి 7న ఒకరోజు దేశవ్యాప్త సమ్మె చేస్తామని హెచ్చరించాయి. డీమోనిటైజేషన్ సమయంలో విధించిన అన్ని నియంత్రణలను ఎత్తివేసి, రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) స్వయం ప్రతిపత్తిని పరిరక్షించాలని యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి. ‘నోట్ల రద్దు వల్ల బ్యాంకులు, ప్రజలు ఎదుర్కొంటోన్న సమస్యల పరిష్కారానికి కేంద్రం, రిజర్వు బ్యాంక్ తగిన చర్యలు తీసుకుంటాయని భావించాం. కానీ ఇప్పటికీ బ్యాంకులకు సరిపడా నగదు సరఫరా జరగడం లేదు. దీంతో అవి కస్టమర్లకు నిర్దేశించిన విత్‌డ్రాయల్స్‌ను సక్రమంగా ఇవ్వలేకపోతున్నాయి’ అని ఏఐబీఈఏ జనరల్ సెక్రటరీ సి.హెచ్.వెంకటాచలం తెలిపారు. ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ)తోపాటు ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ (ఏఐబీఓఏ), బ్యాంక్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వంటి యూనియన్లు కూడా సమ్మెలో పాల్గొంటాయని పేర్కొన్నారు. రూ.కోటి, ఆపై తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించని వారి పేర్లను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. రుణాల రికవరీకి కఠిన చర్యలు అవసరమని అభిప్రాయపడ్డారు. ఆర్బీఐ స్వయం ప్రతిపత్తికి సంబంధించిన క్యాష్ మేనేజ్మెంట్ అంశంలో ఎవరి జోక్యం ఉండకూడదని చెప్పారు. డీమోనిటైజేషన్ వల్ల ప్రాణాలు కోల్పోయిన ప్రజలు/బ్యాంకు ఉద్యోగులు/కస్టమర్లకు పరిహారమివ్వాలని, 50 రోజుల డీమోనిటైజేషన్ సమయంలో అదనపు పని చేసినందుకు బ్యాంకు ఉద్యోగులకు పేమెంట్ చెల్లించాలని కోరారు. కాగా కొత్త గవర్నర్‌గా ఉర్జిత్ పటేల్ బాధ్యతలు చేపట్టిన దగ్గరి నుంచి ఆర్బీఐ స్వయం ప్రతిపత్తికి బీటలు వారుతున్నాయనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమౌతుండటం గమనార్హం. -
నగదు స్వీకరణ మొత్తాన్ని పెంచాలి
కేంద్రాన్ని కోరిన ఏఐబీఈఏ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పాత రూ.500, రూ.1,000 నోట్లకు స్వస్తి పలికిన తర్వాత నగదు స్వీకరణ మొత్తాన్ని రూ.40,000లకు పెంచాలని ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ) ఆర్బీఐని కోరింది. పాత నోట్లను తీసుకోవడం, కొత్తవి ఇవ్వడం అంత సులువైన పని కాదని, బ్యాంకు ఉద్యోగులు ఇందుకు సిద్ధంగా లేరని ఏఐబీఈఏ కార్యదర్శి బి.ఎస్.రాంబాబు స్పష్టం చేశారు. ప్రస్తుతం రాని బాకీల వసూలులో అన్ని బ్యాంకులు నిమగ్నమయ్యాయని చెప్పారు. ప్రజలకు సేవ చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, అరుుతే సరిపడ చిన్న నోట్లు కౌంటర్లలో లేవని చెప్పారు. నగదు సరఫరా కోసం ఆర్బీఐపై ఒత్తిడి ఉంటుందని గుర్తుచేశారు. ఇప్పుడున్న రోజుకు రూ.10 వేలు లేదా వారం మొత్తంలో రూ.20 వేల నగదు స్వీకరణ పరిమితిని రూ.40 వేలకు పెంచాలన్నారు. యుద్ద ప్రాతిపదికన చిన్న నోట్ల సరఫరా పెంచాలని చెప్పారు. సిద్ధమవుతున్న సిబ్బంది.. ఇతర కార్యకలాపాల్లో నిమగ్నమైన ఉద్యోగులను నగదు మార్పిడి పనుల్లో ఉండే సిబ్బందికి సహాయకులుగా నియమిస్తామని ఎస్బీహెచ్ ఎండీ శంతను ముఖర్జీ వెల్లడించారు. మరిన్ని కౌంటర్లను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఏటీఎం మెషీన్లలో నగదును నింపుతున్నట్టు చెప్పారు. ప్రసుత్త పరిస్థితిని ఎదుర్కోవడానికి కేంద్ర బ్యాంకు అన్ని ఏర్పాట్లను చేస్తోందని ఆర్బీఐ హైదరాబాద్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కార్యదర్శి జి.క్రాంతి తెలిపారు. అదనపు పని గంటలకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. -
రుణ ఎగవేతదారుల జాబితా విడుదల
♦ 5,610 డిఫాల్టర్లు... ♦ 58,792 కోట్ల బకాయిలు: ఏఐబీఈఏ చెన్నై: బ్యాంకులు, ఆర్థిక సంస్థల వద్ద రూ.58,792 కోట్ల మేర రుణాలు పొంది ఉద్దేశపూర్వకంగా ఎగ్గొట్టిన వారి జాబితాను అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం (ఏఐబీఈఏ) బుధవారం విడుదల చేసింది. ప్రభుత్వ, ప్రైవేటు, విదేశీ బ్యాంకుల్లోని 5,610 ఖాతాలు ఈ జాబితాలో ఉన్నాయి. వీటిలో జాతీయ బ్యాంకులకు రూ.28,775 కోట్ల మేర రుణాలు ఎగవేసిన ఖాతాదారులు 3,192 మంది ఉన్నారు. ఒక్క ఎస్బీఐ, దాని అనుబంధ బ్యాంకులకే 1,546 ఖాతాదారుల నుంచి రూ.18,576 కోట్లు వసూలు కావాల్సి ఉంది. ఈ ఖాతాదారులను ఉద్దేశపూర్వక ఎగవేతదారులుగా ఎస్బీఐ గ్రూపు బ్యాంకులు ఇప్పటికే ప్రకటించాయి. ఇక ప్రైవేటు బ్యాంకులకు 792 మంది ఖాతాదారులు రూ.10,250 కోట్లు ఎగ్గొట్టారు. ఆర్థిక సంస్థలకు 42 మంది ఖాతాదారుల నుంచి రూ.728 కోట్లు, విదేశీ బ్యాంకులకు 38 ఖాతాదారుల నుంచి రూ.463 కోట్లు వసూలు కావాల్సి ఉంది. రోజురోజుకీ పెరుగుతున్న బకాయిలు ఈ సందర్భంగా ఏఐబీఈఏ జనరల్ సెక్రటరీ సీహెచ్ వెంకటాచలం మాట్లాడుతూ... బ్యాంకుల్లోని మొండి బకాయిలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయని చెప్పారు. ఈ ఏడాది మార్చి నాటికి ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మొండి బకాయిలు రూ.5.39 లక్షల కోట్లకు చేరుకున్నాయని, అంతకుముందు ఆర్థిక సంవత్సరానికి ఇవి కేవలం రూ.2.78 లక్షల కోట్లేనని ఆయన గుర్తు చేశారు. ఉద్దేశ పూర్వక ఎగవేతదారుల నుంచి రుణ బకాయిలు రాబట్టేందుకు వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
బ్యాంకింగ్ సేవలపై సమ్మె ప్రభావం పాక్షికం
నిల్చిన 21 లక్షల చెక్కుల క్లియరెన్సు లావాదేవీలు న్యూఢిల్లీ: బ్యాంకుల సిబ్బంది సమ్మెతో శుక్రవారం దాదాపు రూ. 16,000 కోట్ల విలువ చేసే 21 లక్షల చెక్కుల క్లియరెన్స్ నిల్చిపోయినట్లు అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల అసోసియేషన్ (ఏఐబీఈఏ) జనరల్ సెక్రటరీ సీహెచ్ వెంకటాచలం తెలిపారు. దేశవ్యాప్తంగా సుమారు 3,50,000 మంది బ్యాంకర్లు ఈ సమ్మెలో పాల్గొన్నట్లు వివరించారు. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ అనుబంధ బ్యాంకులు.. క్లరికల్ ఉద్యోగులపై సర్వీసు నిబంధనలను ఏకపక్షంగా రుద్దుతున్నాయన్న ఆరోపణలపై జరిగిన ఒక రోజు దేశవ్యాప్త సమ్మెతో బ్యాంకింగ్ కార్యకలాపాలపై పాక్షికంగా ప్రభావం పడింది. ఏఐబీఈఏ బలంగా ఉన్న బ్యాంకుల శాఖల్లో నగదు హ్యాండ్లింగ్, చెక్కుల క్లియరెన్సులు మొదలైన లావాదేవీలపై ప్రతికూల ప్రభావం పడింది. అధికారులు ఈ సమ్మెలో పాల్గొనలేదు. ఎస్బీఐ అనుబంధ బ్యాంకులు ద్వైపాక్షిక ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్నాయని, సిబ్బందిపై ఏకపక్షంగా నిబంధనలు రుద్దుతున్నాయన్న ఆరోపణలతో ఉద్యోగ సంఘాలు డిసెంబర్ 28న సమ్మె నోటీసులు ఇచ్చాయి. దేశవ్యాప్తంగా తమ 3,000 శాఖలు/కార్యాలయాల్లో దాదాపు 10,000 మంది, తెలంగాణలోని శాఖల్లో సుమారు 2,500 మంది పైగా ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నట్లు ఆంధ్రా బ్యాంక్ అవార్డ్ ఎంప్లాయీస్ యూనియన్ తెలంగాణ విభాగం జనరల్ సెక్రటరీ ఎన్వీ రమణ తెలిపారు. కాగా, అనుబంధ బ్యాంకుల్లో సర్వీసు నిబంధనలు మార్చని పక్షంలో ఏఐబీఈఏ నిరవధిక సమ్మెకు దిగుతుందని, జనవరి 13న చెన్నైలో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నామని రాజస్తాన్ ప్రదేశ్ బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ జనరల్ సెక్రటరీ మహేశ్ మిశ్రా తెలిపారు. -
రేపు బ్యాంకుల బంద్!
ఏఐబీఈఏ పిలుపు ముంబై: ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ) జనవరి 8న దేశవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చింది. ఎస్బీఐ తన అసంబద్ధ, అనుచిత వృత్తి సంబంధిత నిబంధనలను అనుబంధ బ్యాంకుల్లో కూడా అమల్లోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తోందని, అందుకే వాటికి వ్యతిరేకంగా బంద్‌కు పిలుపునిచ్చినట్లు ఏఐబీఈఏ తెలిపింది. ఎస్బీఐకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావన్‌కోర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాల బ్యాంకులు ఐదూ అనుబంధంగా ఉన్నాయి. వీటిని ఎస్బీఐ పరిధి నుంచి తప్పించాలని యూనియన్ డిమాండ్ చేస్తోంది. -
ఎస్బీఐ అనుబంధ బ్యాంకుల సమ్మె
ముంబై : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) అనుబంధంగా ఉన్న ఐదు బ్యాంకుల ఉద్యోగులు గురువారం సమ్మె చేశారు. ఎస్బీఐ విలీన ప్రతిపాదనకు నిరసనగా వారు ఈ సమ్మెను నిర్వహించారు. ఐదు బ్యాంకుల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనూర్ అండ్ జైపూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్కోర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా ఉన్నాయి. ఎస్బీఐ యాక్ట్ పరిధికి వెలుపల ఉండాలని అసోసియేట్స్ బ్యాంకుల ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నట్లు ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ) పేర్కొంది. మరోవైపు, ఉద్యోగుల సమ్మె.. అనుబంధ బ్యాంకుల విలీనానికి వ్యతిరేకమైనది కాదని ఎస్బీఐ స్పష్టం చేసింది. అనుబంధ బ్యాంకులను ఎస్బీఐ నుంచి డీలింక్ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారని పేర్కొంది. 24న దేశవ్యాప్త సమ్మె..: అనుబంధ బ్యాంకు ఉద్యోగుల డిమాండ్‌పై ఎస్బీఐ యాజమాన్యం ఒక నిర్ణయం తీసుకోకపోతే, జూన్ 24వ తేదీన వారికి మద్దతుగా దేశ వ్యాప్త బ్యాంకింగ్ సమ్మెకు పిలుపునిస్తున్నట్లు సైతం ఏఐబీఈఏ పేర్కొంది. -
డిఫాల్టర్లపై క్రిమినల్ కేసులు పెట్టాలి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కొండలా పెరిగిపోతున్న మొండి బకాయిలు ప్రభుత్వరంగ బ్యాంకులకు గుదిబండగా మారాయని, ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే తొలిసారిగా పీఎస్‌యూ బ్యాంకులు దివాళా తీసే పరిస్థితులు తలెత్తుతాయని ఆంధ్రప్రదేశ్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (ఏఐబీఈఏ) ఆందోళన వ్యక్తం చేసింది. పీఎస్‌యూ బ్యాంకుల్లో మార్చి, 2013 నాటికి రూ.1.64 లక్షల కోట్లుగా ఉన్న ఎన్పీఏలు సెప్టెంబర్, 2013 నాటికి 2.36 లక్షల కోట్లకు చేరాయని, ఇప్పుడివి రూ.3.50 లక్షలు దాటినట్లు ప్రాథమిక అంచనాలను బట్టి తెలుస్తోందని ఏఐబీఈఏ ప్రధాన కార్యదర్శి బి.ఎస్.రాంబాబు తెలిపారు. రుణం తీసుకొని చెల్లించని వారిపై క్రిమినల్ కేసులు పెట్టి వారి ఆస్తులను జప్తు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సోమవారం హైదరాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఏఐబీఈఏ దేశంలో రుణాలు తీసుకొని చెల్లించని సంస్థలు, వ్యక్తుల జాబితాను విడుదల చేసింది. రుణాలు ఎగ్గొట్టిన టాప్ 50 కంపెనీల్లో రాష్ట్రానికి చెందిన డెక్కన్ క్రానికల్ (రూ.700 కోట్లు), ఐసీఎస్ఏ ఇండియా (రూ.646 కోట్లు), ల్యాంకో హోస్టెక్ హైవే (రూ.533), ఎంబీఎస్ జ్యూయెలర్స్ (రూ.524 కోట్లు), రాజీవ్ స్వగృహ (రూ.385 కోట్లు), పోగ్రసివ్ కనస్ట్రక్షన్ (రూ.351 కోట్లు), సుజన యూనివర్సల్ (రూ.330 కోట్లు) ఉన్నాయి. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ బ్యాంకుల ఆడిట్ కమిటీలో ఉద్యోగ సంఘాలకు చోటు కల్పిస్తే రుణాల మంజూరులో పారదర్శకత పెరిగి మొండి బకాయిలు తగ్గుతాయన్నారు. -
కార్పొరేట్లకు బ్యాంక్ లెసైన్స్‌లు వద్దు
వడోదర: ప్రైవేట్ సంస్థలకు బ్యాంకింగ్ లెసైన్స్‌లు ఇవ్వడాన్ని ది ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్(ఏఐబీఈఏ) వ్యతిరేకిస్తోంది. కార్పొరేట్ కంపెనీలకు బ్యాంకింగ్ లెసైన్స్‌లు ఇవ్వడం దేశ ప్రయోజనాలకు హానికరమని, వాళ్ల స్వప్రయోజనాలకే వీటిని వాడుకుంటారని ఏఐబీఈఏ జనరల్ సెక్రటరీ సి.హెచ్.వెంకటాచలం పేర్కొన్నారు. అంతేకాకుండా బ్యాంకింగ్ సేవలు కూడా ఖరీదవుతాయన్నారు. ప్రభుత్వం కొత్తగా బ్యాంకింగ్ లెసైన్స్‌లు ఇవ్వాలని యోచిస్తున్న విషయం తెలిసిందే. ఇక్కడ జరిగిన ఫెడరేషన్ ఆప్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ యూనియన్స్ జాతీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. 1969కు ముందు బ్యాంకులను ప్రైవేట్ వ్యాపార సంస్థలే నిర్వహించేవని, వాటి అస్తవ్యస్త విధానాల కారణంగా అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ బ్యాంకులను జాతీయం చేశారని ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వ రంగ బ్యాంకులను పటిష్టపరచాల్సిన అవసరముందని వెంకటాచలం స్పష్టంచేశారు.