బ్యాంకింగ్ సేవలపై సమ్మె ప్రభావం పాక్షికం
నిల్చిన 21 లక్షల చెక్కుల క్లియరెన్సు లావాదేవీలు
న్యూఢిల్లీ: బ్యాంకుల సిబ్బంది సమ్మెతో శుక్రవారం దాదాపు రూ. 16,000 కోట్ల విలువ చేసే 21 లక్షల చెక్కుల క్లియరెన్స్ నిల్చిపోయినట్లు అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల అసోసియేషన్ (ఏఐబీఈఏ) జనరల్ సెక్రటరీ సీహెచ్ వెంకటాచలం తెలిపారు. దేశవ్యాప్తంగా సుమారు 3,50,000 మంది బ్యాంకర్లు ఈ సమ్మెలో పాల్గొన్నట్లు వివరించారు. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బీఐ అనుబంధ బ్యాంకులు.. క్లరికల్ ఉద్యోగులపై సర్వీసు నిబంధనలను ఏకపక్షంగా రుద్దుతున్నాయన్న ఆరోపణలపై జరిగిన ఒక రోజు దేశవ్యాప్త సమ్మెతో బ్యాంకింగ్ కార్యకలాపాలపై పాక్షికంగా ప్రభావం పడింది.
ఏఐబీఈఏ బలంగా ఉన్న బ్యాంకుల శాఖల్లో నగదు హ్యాండ్లింగ్, చెక్కుల క్లియరెన్సులు మొదలైన లావాదేవీలపై ప్రతికూల ప్రభావం పడింది. అధికారులు ఈ సమ్మెలో పాల్గొనలేదు. ఎస్‌బీఐ అనుబంధ బ్యాంకులు ద్వైపాక్షిక ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్నాయని, సిబ్బందిపై ఏకపక్షంగా నిబంధనలు రుద్దుతున్నాయన్న ఆరోపణలతో ఉద్యోగ సంఘాలు డిసెంబర్ 28న సమ్మె నోటీసులు ఇచ్చాయి.
దేశవ్యాప్తంగా తమ 3,000 శాఖలు/కార్యాలయాల్లో దాదాపు 10,000 మంది, తెలంగాణలోని శాఖల్లో సుమారు 2,500 మంది పైగా ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నట్లు ఆంధ్రా బ్యాంక్ అవార్డ్ ఎంప్లాయీస్ యూనియన్ తెలంగాణ విభాగం జనరల్ సెక్రటరీ ఎన్‌వీ రమణ తెలిపారు. కాగా, అనుబంధ బ్యాంకుల్లో సర్వీసు నిబంధనలు మార్చని పక్షంలో ఏఐబీఈఏ నిరవధిక సమ్మెకు దిగుతుందని, జనవరి 13న చెన్నైలో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నామని రాజస్తాన్ ప్రదేశ్ బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ జనరల్ సెక్రటరీ మహేశ్ మిశ్రా తెలిపారు.