ఇలా చేయకుంటే... హెల్త్‌ క్లెయిమ్‌ తిరస్కరణ! | Possible reasons for rejection of your health insurance claim | Sakshi
Sakshi News home page

Health Insurance policy: ఇలా చేయకుంటే... హెల్త్‌ క్లెయిమ్‌ తిరస్కరణ!

Published Mon, Aug 12 2024 4:44 AM | Last Updated on Mon, Aug 12 2024 8:40 AM

Possible reasons for rejection of your health insurance claim

దరఖాస్తులో పూర్తి వివరాలు ఇవ్వాల్సిందే

గత ఆరోగ్య సమాచారం వెల్లడించాలి

మినహాయింపులపై తగిన అవగాహన

నియమ, నిబంధనలు తెలిసి ఉండాలి

ఆస్పత్రిలో చేరికపై సకాలంలో సమాచారం

లేదంటే చెల్లింపులకు నిరాకరణలు

అనారోగ్యంతో ఆస్పత్రి పాలైతే.. ఆదుకుంటుందన్న భరోసాతోనే ఎవరైనా హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ  తీసుకుంటారు. తీరా అవసరం వచ్చినప్పుడు బీమా సంస్థ చెల్లింపులకు నిరాకరిస్తే..? పాలసీదారులు  కంగుతినాల్సిందే. కరోనా ఆరోగ్య విషయంలో ఎంతో మందికి కళ్లు  తెరిపించింది. ఆ ఫలితమే  తర్వాత నుంచి హెల్త్‌ ఇన్సూరెన్స్‌ తీసుకునే వారి  సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తోంది. 

ముఖ్యంగా పాలసీ నిబంధనలను  కచి్చతంగా తెలుసుకున్న తర్వాతే కొనుగోలు చేయాలి. పాలసీ నిబంధనలను అర్థం చేసుకోవడంలో లోపం చోటుచేసుకుంటే, భవిష్యత్తులో క్లెయిమ్‌లు తిరస్కరణకు గురయ్యే రిస్క్‌ కచ్చితంగా ఉంటుంది. దీనివల్ల ఒక్కసారిగా కుటుంబంపై ఆరి్థక భారం పడిపోతుంది. బీమా సంస్థ చెల్లింపులు చేయకపోవడం వెనుక ఎన్నో కారణాలు ఉండొచ్చు. వీటి పట్ల అవగాహన కలిగి ఉంటే, అలాంటి పరిస్థితులను  నివారించొచ్చు. ఈ వివరాలు అందించే  కథనమే ఇది.  
 

పాలసీ దరఖాస్తు పత్రంలో అప్పటికే తమకు ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వెల్లడించడం తప్పనిసరి. లేదంటే భవిష్యత్తులో క్లెయిమ్‌ పరంగా సమస్యలు ఎదురవుతాయి. పాలసీదారు ఆరోగ్య చరిత్ర ఆధారంగానే క్లెయిమ్‌ రిస్‌్కను బీమా సంస్థలు అంచనా వేస్తాయి. దానికి అనుగుణంగా ప్రీమియం నిర్ణయిస్తాయి. చెప్పకపోతే బీమా సంస్థకు తెలియదుగా అని చెప్పి కొందరు అనారోగ్య సమస్యలను వెల్లడించరు. ఇది బీమా ఒప్పందాన్ని ఉల్లంఘించినట్టు అవుతుంది. క్లెయిమ్‌ సమయంలో బీమా సంస్థలు వీటిని గుర్తించినట్టయితే.. చెల్లింపులకు నిరాకరించడంతోపాటు, కవరేజీని సైతం రద్దు చేయొచ్చు. ముందస్తు వ్యాధులనే కాదు, ఏదైనా అనారోగ్యానికి సంబంధించి లోగడ చికిత్స తీసుకున్నా వెల్లడించడమే మంచిది. ఫ్యామిలీ ఫ్లోటర్‌ పాలసీ అయితే, కుటుంబ సభ్యులందరి వైద్య చరిత్రను నమోదు చేయాలి.  

సరైన సమాచారం ఇవ్వాలి
బీమా సంస్థకు సమరి్పంచే ఇన్సూరెన్స్‌ క్లెయిమ్‌ పత్రంలో పూర్తి వివరాలు ఉండాలి. తేదీలు, చికిత్సల ప్రక్రియలకు సంబంధించి చిన్న దోషాలు కూడా ఉండకూడదు. రోగి వయసు, పేరులోనూ వ్యత్యాసాలు ఉండకూడదు. బీమా సంస్థలు ప్రతి క్లెయిమ్‌ దరఖాస్తును లోతుగా పరిశీలిస్తాయి. ఏవైనా వ్యత్యాసాలు గుర్తిస్తే మరింత సమాచారం కోరడం లేదా తిరస్కరించడం చేయొచ్చు. క్లెయిమ్‌ వచి్చనప్పుడు, అందులోని వ్యాధి నిర్ధారణ వివరాలను, అప్పటికే పాలసీదారు వైద్య చరిత్రతో పోల్చి చూస్తాయి. హాస్పిటల్‌ రికార్డులు, డాక్టర్‌ నోట్‌లను పరిశీలిస్తాయి. 

ఈ సమయంలో వ్యత్యాసాలు కనిపిస్తే చెల్లింపులను నిరాకరిస్తాయి. పాలసీ పత్రంలో ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం ఇచ్చి నట్టు గుర్తిస్తే దాన్ని మోసం కింద పరిగణిస్తాయి. దీంతో క్లెయిమ్‌ రాకపోవడం కాదు, పాలసీ కూడా రద్దు కావచ్చు. అదనపు సమాచారం, వివరణ, డాక్యుమెంట్లను బీమా కంపెనీ కోరొచ్చు. దీంతో నగదు రహిత క్లెయిమ్‌ కాకుండా రీయింబర్స్‌మెంట్‌ మార్గంలో రావాలని కోరే అధికారం సైతం బీమా సంస్థకు ఉంటుంది. ముఖ్యంగా రీయింబర్స్‌మెంట్‌ క్లెయిమ్‌కు సంబంధించి అన్ని రకాల డాక్యుమెంట్లను సమర్పించడం తప్పనిసరి.

మినహాయింపులు 
హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ఉన్న వారు తమ పాలసీ పరంగా ఉన్న మినహాయింపుల గురించి కచి్చతంగా తెలుసుకోవాలి. దీనివల్ల క్లెయిమ్‌ పరంగా సమస్యలు రాకుండా ముందే జాగ్రత్త పడొచ్చు. కొన్ని రకాల అనారోగ్యాలు, చికిత్సలు లేదా సేవలకు కొన్ని ప్లాన్లలో కవరేజీ ఉండదు.  

నిబంధనల్లో మార్పులు 
కొన్ని సందర్భాల్లో పాలసీ నిబంధనలు, ప్రయోజనాల్లో మార్పులు చోటు చేసుకోవచ్చు. అలాంటప్పుడు కూడా క్లెయిమ్‌లకు తిరస్కారం ఎదురవుతుంది. వాస్తవానికి ఇలాంటి వాటి గురించి పాలసీదారులకు బీమా సంస్థలు విధిగా తెలియజేస్తాయి.

సకాలంలో తెలపాలి.. 
ముందస్తుగా నిర్ణయించుకుని తీసుకునే నగదు రహిత చికిత్సలకు కనీసం 48 గంటల ముందు బీమా సంస్థకు తెలియజేయాలి. అత్యవసర వైద్యం అవసరమై ఆస్పత్రిలో చేరినప్పుడు నగదు రహిత క్లెయిమ్‌కు సంబంధించి 24 గంటల్లోపు బీమా సంస్థకు సమాచారం ఇవ్వాలి. రీయింబర్స్‌మెంట్‌ క్లెయిమ్‌ పెట్టుకునే వారు సైతం.. ముందస్తు ప్రణాళిక మేరకు తీసుకునే చికిత్సలు అయితే 48 గంటల ముందుగా, అత్యవసరంగా ఆస్పత్రిలో చేరితే 24–48 గంటల్లోపు సమాచారం ఇవ్వాల్సిందే. ఇక రీయింబర్స్‌మెంట్‌ క్లెయిమ్‌ దరఖాస్తు, డాక్యుమెంట్లను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయిన 30 రోజుల్లోపు సమరి్పంచాలి. బీమా సంస్థల మధ్య ఈ గడువులో వ్యత్యాసం ఉండొచ్చు.  

పాలసీ ల్యాప్స్‌ 
పాలసీ ప్రీమియం గడువు మించకుండా చెల్లించాలి. లేదంటే పాలసీ ల్యాప్స్‌ అవుతుంది. ఇలా ల్యాప్స్‌ అయిన పాలసీలకు సంబంధించి క్లెయిమ్‌లను బీమా సంస్థలు అనుమతించవు. పాలసీ గడువు ముగిసిన తర్వాత 15–30 రోజుల గ్రేస్‌ పీరియడ్‌ ఉంటుంది. కనీసం ఈ కాలంలో అయినా ప్రీమియం చెల్లించాలి. లేదంటే పాలసీ రద్దయిపోతుంది. దీంతో బీమా కవరేజీ కోల్పోయినట్టు అవుతుంది. ల్యాప్స్‌ అయిన పాలసీని పునరుద్ధరించుకునే వరకు కవరేజీ ఉండదు.  

వెయిటింగ్‌ పీరియడ్‌ 
హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ప్లాన్‌ తీసుకున్న తర్వాత కొన్ని రకాల క్లెయిమ్‌లకు వెయిటింగ్‌ పీరియడ్‌ (వేచి ఉండాల్సిన కాలం) ఉంటుంది. ఆ కాలంలో వచ్చే క్లెయిమ్‌లను బీమా సంస్థలు తోసిపుచ్చుతాయి. హెరి్నయా, క్యాటరాక్ట్, చెవి, ముక్కు, గొంతు సమస్యలు (ఈఎన్‌టీ), మోకాలి చిప్ప మారి్పడి తదితర చికిత్సలకు రెండేళ్ల పాటు వెయిటింగ్‌ ఉంటుంది. అలాగే, పాలసీ తీసుకునే నాటికే ఉన్న వ్యాధులకు సైతం క్లెయిమ్‌ కోసం నిర్ధేశిత కాలం పాటు వేచి ఉండాల్సిందే. ఆ కాలంలో క్లెయిమ్‌లను అనుమతించరు. 

కవరేజీ ఖర్చయిపోతే.. 
ఒక పాలసీ సంవత్సరంలో నిర్దేశిత కవరేజీ మొత్తం వినియోగించుకున్న తర్వాత వచ్చే క్లెయిమ్‌లకు బీమా సంస్థలు చెల్లింపులు చేయవు. అందుకే అన్‌ లిమిటెడ్‌ రీస్టోరేషన్‌ సదుపాయం ఉన్న పాలసీని తీసుకోవాలి. అప్పుడు బీమా ఖర్చయిపోయినా, తిరిగి అంతే మొత్తాన్ని పునరుద్దరిస్తాయి.  

ముందస్తు అనుమతి.. 
కొన్ని రకాల చికిత్సలకు ముందస్తు ఆమోదం తప్పనిసరి అంటూ బీమా సంస్థ నిబంధనలు విధించొచ్చు. అలాంటి వాటిపై ముందే అవగాహన ఉంటే క్లెయిమ్‌ నిరాకరణకు నోచుకోదు.

తిరస్కరిస్తే ఏంటీ మార్గం? 
బీమా సంస్థ సహేతుక కారణం లేకుండా చెల్లింపులకు నిరాకరిస్తే చూస్తూ ఉండిపోనక్కర్లేదు. పాలసీ నియమ, నిబంధనలను ఒక్కసారి పూర్తిగా అధ్యయనం చేయాలి. ‘పాలసీ వర్డింగ్స్‌’లో పూర్తి వివరాలు ఉంటాయి. క్లెయిమ్‌ తిరస్కరించడానికి కారణాలు తెలుసుకోవాలి. రిజెక్షన్‌ లెటర్‌లో ఈ వివరాలు ఉంటాయి. బీమా సంస్థ నిర్ణయం వాస్తవికంగా లేదని భావిస్తే అప్పుడు అప్పీల్‌కు దరఖాస్తు చేసుకోవాలి. ప్రతి బీమా సంస్థలోనూ గ్రీవెన్స్‌ రిడ్రెస్సల్‌ (ఫిర్యాదుల పరిష్కార) విభాగం ఉంటుంది. క్లెయిమ్‌ నిరాకరించడానికి తగిన కారణాలు లేవంటూ వారికి ఫిర్యాదు సమరి్పంచాలి. పరిష్కారం లభించకపోతే అప్పుడు బీమా అంబుడ్స్‌మెన్‌ను సంప్రదించాల్సి ఉంటుంది. అక్కడా న్యాయం జరగకపోతే అప్పుడు వినియోగదారుల కోర్టును ఆశ్రయించొచ్చు. క్లెయిమ్‌ పూర్తిగా కాకుండా, పాక్షికంగా చెల్లింపులు చేసిన సందర్భాల్లోనూ పాలసీదారులు న్యాయం కోరొచ్చు.  

ఐఆర్‌డీఏఐ...  
ఐఆర్‌డీఏఐ గ్రీవెన్స్‌ రిడ్రెస్సల్‌ సెల్‌ను 
సంప్రదించొచ్చు. టోల్‌ఫ్రీ నంబర్లు 155255 లేదా 1800 4254 732కు కాల్‌ చేసి చెప్పొచ్చు. లేదా  complaints@irdai.gov.inకు మెయిల్‌ పంపొచ్చు. లేదా ఐఆర్‌డీఏకు చెందిన  https://irdai. gov.in/ igms1 పోర్టల్‌ సాయంతో ఫిర్యాదు దాఖలు చేయవచ్చు. 

పరిష్కార వేదికలు
అంబుడ్స్‌మెన్‌ ద్వారా రూపాయి ఖర్చు లేకుండా పరిష్కరించుకోవచ్చు. వినియోగదారుల కోర్టుకు వెళ్లినా సరే పెద్దగా ఖర్చు కాదు. 

– సాక్షి, బిజినెస్‌ డెస్క్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement