
సీఎం పదవి సహా మంత్రుల ఎంపిక, శాఖల కేటాయింపుపై శిందే అసంతృప్తి
బీజేపీ కేంద్ర నాయకత్వం చొరవతో డిప్యూటీ సీఎం పదవి స్వీకరణ
ప్రమాణ స్వీకారం నుంచే అసంతృప్తిని బయటపెట్టిన శివసేన అధినేత
గార్డియన్ మంత్రుల నియామకం మొదలు పలు అంశాల్లో ప్రభుత్వ వ్యతిరేకవైఖరి
సీఎం, డిప్యూటీ సీఎంల మధ్య కోల్డ్‌వార్ నడుస్తోందంటూ రాజకీయ వర్గాల ప్రచారం
ముంబై: గార్డియన్ మంత్రి పదవి మొదలుకొని ప్రత్యేక వైద్య విభాగాలకు వేర్వేరుగా సమీక్షా సమావేశాలు, పర్యవేక్షణ ప్రాజెక్టుల కోసం ’వార్‌రూమ్’ల వరకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఆయన డిప్యూటీ ఏక్‌నాథ్ షిండే మధ్య భిన్నాభిప్రాయాల కోల్డ్‌వార్ జరుగుతున్నట్లు రాజకీయ వర్గాల సమాచారం. గతేడాది నవంబర్‌లో అసెంబ్లీ ఫలితాల తరువాత రాష్ట్ర సీఎంగా ఫడ్నవీస్‌ను ఎంపిక చేసింది బీజేపీ అధిష్టానం. గత ప్రభుత్వ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందే ఈసారి డిప్యూటీ సీఎం పదవితో సరిపెట్టుకోవలసి వచి్చంది. ఇందుకోసం రెండు వర్గాల మధ్య పలు ఒప్పందాలు, రాజీ చర్చలు జరిగాయి. ముఖ్యమంత్రిగా ఉన్న రెండున్నరేళ్లలో శిందే నాయకత్వం, అభివృద్ధి సంక్షేమ నిర్ణయాల వల్లే బీజేపీ, శివసేన, ఎన్సీపీ(ఏపీ)ల మహాయుతి కూటమి ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించిందని ఆయన మద్దతుదారులు భావిస్తున్నారు.డిప్యూటీ సీఎం పదవిని స్వీకరించేందుకు శిందే మొదట్లో విముఖత వ్యక్తంచేశారని, అయితే ఫడ్నవీస్ నేతృత్వంలోని ప్రభుత్వంలో భాగం కావాలంటూ ఆయన సహచరులు, బీజేపీ అగ్రనేతలు ఒప్పించారని శివసేన నేతలు పేర్కొంటున్నారు. అందువల్లే మంత్రుల ప్రమాణ స్వీకారం పూర్తైనా వారికి శాఖల కేటాయింపునకు దాదాపు వారం రోజుల సమయం పట్టిందని చెబుతున్నారు.
ప్రత్యేకంగా వ్యవహరించడం వెనుక...
అయితే ఫడ్నవీస్, శిందేలిద్దరూ తమ విభేదాలున్నాయన్న వార్తలను ఖండిస్తున్నారు. తాము పరస్పర సహాకారం, సమైక్యతతో వ్యవహరిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే ఈమధ్యకాలంలో పలు సందర్భాల్లో రాయ్‌గఢ్, నాసిక్ జిల్లాల సంరక్షక మంత్రులుగా అదితి తట్కరే, గిరీష్ మహాజన్‌ల నియామకంపై శివసేన(శిందే) అసంతృప్తి వ్యక్తంచేసింది. దీంతో ఈ నియామకాలు వాయిదా పడ్డాయి. ఇంతేకాక ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ‘వార్ రూమ్‘తో పాటు, డిప్యూటీ సీఎంలు అజిత్‌పవార్, శిందేలిద్దరూ తమ పారీ్టల మంత్రులు నిర్వహించే శాఖలు, వారు సంరక్షక మంత్రులుగా ఉన్న జిల్లాల పరిధిలోకి వచ్చే ప్రాజెక్టులను ట్రాక్ చేయడానికి మానిటరింగ్ యూనిట్లను ఏర్పాటు చేశారు. అదేవిధంగా రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధితో పాటు మెడికల్ ఎయిడ్ సెల్‌ను కూడా శిందే ఏర్పాటు చేశారు. అలాగే రాష్ట్రంలో 2027 కుంభమేళా సన్నాహాల గురించి చర్చించేందుకు నాసిక్ రీజినల్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఎన్‌ఆర్‌డీఏ) సహా ఫడ్నవీస్ ఏర్పాటు చేసిన అనేక సమావేశాలకు శిందే దూరంగా ఉన్నారు. తాజాగా ఫడ్నవీస్ పరిశ్రమల శాఖ సమీక్ష సమావేశం నిర్వహించిన అనంతరం శిందే మరో సమావేశాన్ని ఏర్పాటుచేశారు. దీనికి తోడు 20 మంది శివసేన ఎమ్మెల్యేల భద్రత తగ్గింపు కూడా శివసేనలో మరింత అసంతృప్తిని రాజేసింది.
ఎంపీల మద్దతు కోసమే బీజేపీ మౌనం: సీనియర్ జర్నలిస్ట్ ప్రకాష్ అకోల్కర్
ఈ పరిస్థితిపై సీనియర్ జర్నలిస్ట్ ప్రకాష్ అకోల్కర్ మాట్లాడుతూ ఇద్దరు నేతల మధ్య ‘ప్రచ్ఛన్న యుద్ధం‘ కొనసాగుతుందని అన్నారు. ‘అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతానని శిందే భావించారు. కానీ బీజేపీకి బంపర్ మెజారిటీ రావడంతో అది సాధ్యపడలేదు. దీంతో సహజంగానే శిందే కొంత అసంతృప్తితో ఉన్నారు. రాష్ట్ర బీజేపీలో ఫడ్నవీస్ వ్యతిరేకులు శిందేకు మద్దతునిస్తున్నారు. బీజేపీ కేంద్ర నాయకత్వానికి శిందే పార్టీలోని ఏడుగురు ఎంపీల మద్దతు అవసరం. అందుకే ఈ వ్యవహారాలపై ఆ పార్టీ నాయకత్వం పెద్దగా స్పందించడం లేదు’అని అకోల్కర్ పేర్కొన్నారు.
ఇదీ చదవండి: చీటింగ్ కేసులోమంత్రికి రెండేళ్ల జైలు శిక్ష
బహిరంగంగా ఒప్పుకోలేని పరిస్థితి: రత్నాకర్ మహాజన్
‘సంకీర్ణ ప్రభుత్వంలో భిన్నాభిప్రాయాలున్నా ఐక్యంగా కొనసాగాల్సిన అవసరముంటుంది. రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా అంతర్గత పోరు గురించి ఎవరూ బహిరంగంగా మాట్లాడలేరు. గత ఎన్నికల కంటే బీజేపీ బలం రెండింతలు పెరిగింది. అందుకే ప్రభుత్వ ఏర్పాటులో మెజారిటీ వాటా ఆశించింది. దాన్ని దక్కించుకోగలిగింది ’అని మహారాష్ట్ర కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రత్నాకర్ మహాజన్ అన్నారు.
అవన్నీ ఊహాగానాలు: ఏక్‌నాథ్ శిందే
కాగా తామిద్దరి మధ్య విబేధాలున్నట్లు వస్తున్న వార్తలను ఏక్‌నాథ్ శిందే ఖండించారు. మంగళవారం జరిగిన పార్టీ సమావేశంలో మాట్లాడుతూ.. మహాయుతి సంకీర్ణంలో ‘ప్రచ్ఛన్న యుద్ధం‘ అవాస్తవం. అంతా ‘ఠండా ఠండా కూల్ కూల్’. మేం కలిసికట్టుగా అభివృద్ధి నిరోధకులపై యుద్ధం చేస్తున్నాం’’అని పేర్కొన్నారు. ప్రతిపక్ష మహా వికాస్ అఘాడి లాగా పదవుల కోసం వెంబడించడం లేదా అధికారాన్ని దోచుకోవడం మహాయుతి ఎజెండాకు వ్యతిరేకం. ఎవరేమన్నా రాష్ట్ర అభివృద్ధి కోసం ముందుకు సాగడం, ప్రజల జీవితాల్లో సానుకూల మార్పు తీసుకురావడమే మా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం’అని ఉద్ఘాటించారు.
మీడియా సెల్ ఏర్పాటులో తప్పేంలేదు: ఫడ్నవీస్
సచివాలయంలో మీడియా సెల్ ఏర్పాటుపై విలేకరుల ప్రశ్నకు సీఎం ఫడ్నవీస్ స్పందిస్తూ, ‘ప్రజలకు సహాయం చేయడమే దాని లక్ష్యం. కాబట్టి అలాంటి సెల్ ఏర్పాటులో తప్పు లేదు, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, నేను కూడా ఇలాంటి సెల్‌ను ఏర్పాటు చేసాను.‘ అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment