
ఏక్‌నాథ్ షిండేతో సీఎం దేవేంద్ర ఫడ్నవీస్
అభిప్రాయం
రాజకీయాల్లో ఇవాళ్టి మిత్రుడు రేపు కాబోయే శత్రువు; అదే విధంగా నేటి శత్రువే రేపటి మిత్రుడు అనే నానుడికి చక్కని ఉదాహరణ మహారాష్ట్ర ప్రస్తుత రాజకీయాలు. 2024 నవంబరులో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 288 స్థానాలకు గాను మహాయుతి కూటమి ప్రధాన భాగస్వామ్య పక్షాలైన భారతీయ జనతా పార్టీ 105, ఏక్‌నాథ్ షిండే శివసేన 57 స్థానాలు కైవసం చేసున్నాయి. దీంతో ఆ కూటమి తిరిగి అధికారం చేజిక్కించుకుని పాలిస్తోంది. అయితే కూటమి రెండోసారి పాలనకు 100 రోజులు నిండేలోపే మొత్తం మరాఠా రాజకీయ చిత్రం రసవత్తరంగా తయారయ్యింది.
ఎన్నికల ఫలితాల రోజు సాయంత్రమే (2024 నవంబర్ 23) దేవేంద్ర ఫడ్నవీస్ నాగపూర్ వెళ్ళి ఆర్‌ఎస్‌ఎస్ ప్రముఖులతో; ఢిల్లీ వెళ్లి బీజేపీ అగ్ర నేతలతో చర్చలు జరిపి ముఖ్యమంత్రి పీఠం కోసం తన బాటను సుగమం చేసుకొన్నారు. చివరి వరకు ఏక్ నాథ్ షిండే సీఎం కుర్చీ వదలటానికి సుముఖంగా లేనప్పటికీ మోదీ–షాల బుజ్జగింపుతో, ఆయన ఉప ముఖ్యమంత్రి పదవితో సరిపుచ్చుకోవాల్సి వచ్చింది. తను కోరుకున్న హోం శాఖ కూడా దేవా భావు (ఫడ్న వీస్)కే దక్కింది. ఇక అప్పటి నుండి అలక పాన్పు పట్టారు షిండే. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన ఈ వంద రోజుల్లో (మార్చి 15 నాటికి) కొన్ని గమ్మత్తయిన సంఘటనలు చోటు చేసుకున్నాయి.
మాజీ ముఖ్యమంత్రి షిండే గతంలో చేపట్టిన పలు ప్రాజెక్టులను ‘తనిఖీ’ చేయవలసిందిగా ముఖ్య మంత్రిగా అధికార పగ్గాలు చేపట్టగానే ఫడ్నవీస్ అధి కారులకు హుకుమ్ జారీ చేశారు. మరో వైపు భాజ పాతో దోస్తీ వదలుకున్న శివసేన నేత ఉద్ధవ్ ఠాక్రే, సీఎం ఛాంబర్ చేరుకుని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను కలవటం షిండే వర్గీయులను ఆశ్చర్య పరచింది. ఆ తర్వాత ఫిబ్రవరి 21న కొత్త ఢిల్లీ విజ్ఞాన్ భవన్‌లో ఎన్‌సీపీ నేత శరద్ పవార్ అధ్యక్షతన జరిగిన అఖిల భారత మరాఠీ సాహిత్య సమ్మేళనంలో ఆయన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండేని అవార్డుతో సత్కరించటం ఇక్కడ ఉద్ధవ్ వర్గీయులను ఆశ్చర్య పరచింది.
పవార్ లాంటి సీనియర్ నేత తమ పార్టీ ద్రోహిని, ‘రాష్ట్రీయ గౌరవ్ పురస్కారం’తో సత్కరించటం మింగుడు పడలేదు వారికి. (శరద్ పవార్ పాచిక ప్రభావంతో 2019లో బీజేపీతో తెగదెంపులు చేసుకుని, కాంగ్రెస్–ఎన్‌సీపీ కూటమికి చేరింది అవి భక్త శివసేన). ఇది చాలదన్నట్టు ప్రధాని నరేంద్ర మోదీని ముఖ్య అతిథిగా ఆ కార్యక్రమానికి పవార్ ఆహ్వానించటంలోని రాజకీయం ఏమిటో ఎన్‌సీపీ కార్యకర్తలకు కూడా బోధ పడలేదు. ప్రస్తుత పరిస్థితు లను నిశితంగా గమనిస్తే ఎవరు ఎవరి అనుయా యులో, ఎవరు ఎవరి శత్రువులో తేల్చుకోలేని పరిస్థితి!
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని ఓటమి చవిచూసిన ఉద్ధవ్ ఠాక్రేను మరింత గాయపరచాలని, ఆయన 20 మంది ఎమ్మెల్యేలలో కొందరిని తన వైపు లాక్కొని, ఉద్ధవ్ రాజకీయ భవిషత్తునే మట్టిలో కల పాలని షిండే వ్యూహం. ఇది ఇలా ఉంటే... శివసేన పార్టీకి కంచుకోటగా ఉన్న కొంకణ్ ప్రాంతంలోని
షిండే సన్నిహితుడు, కేబినెట్ మంత్రి, ఉదయ్ సామంత్‌ను లోబరచుకుని, ఆయన ద్వారా షిండే వర్గాన్ని రెండుగా విభజించి పార్టీ చీఫ్ బలాన్ని తగ్గించే యోచనలో బీజేపీ ఉందనేది ఒక చర్చ.
అది గ్రహించిన వెంటనే ఉదయ్ సామంత్ ప్రాముఖ్యాన్ని తగ్గిస్తూ, తనే అసలైన టీం కెప్టెన్ అని షిండే తేల్చే శారు. ఇదే సమయంలో ఇక షిండే ‘బాలే ఖిల్లా’గా చెప్పుకునే, ముంబై నగర శివారులోని థానేలో బీజేపీ పాగా వేసి ఆయనను ఇరుకున పెట్టాలని బీజేపీ వర్గీయులు అక్కడ తరచుగా క్యాంపులు నిర్వహి స్తున్నారు. త్వరలోనే రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొ రేషన్ ఎన్నికలు నిర్వహించనున్నట్టు ముఖ్యమంత్రి పదవి చేపట్టిన సందర్భంగా ఫడ్నవీస్ పేర్కొనడం ఈ సందర్భంగా గమనార్హం. దానికి అనుగుణంగానే క్షేత్ర స్థాయిలో కమలనాథులు పావులు కదుపుతున్నారు.
227 కార్పొరేటర్లతో గ్రేటర్ ముంబయ్ మున్సి పల్ కార్పొరేషన్ ఆసియాలోనే అతి పెద్ద మున్సిపల్ కార్పొరేషన్‌గా ప్రసిద్ధి చెందింది. బ్రిటిష్ కాలం నాటి ఈ కార్పొరేషన్ గత నాలుగు దశాబ్దాల (1985) నుండి ‘మరాఠీ అస్మిత’(ఆత్మ గౌరవం) నినాదంతో శివసేన అధీనంలోనే ఉంది. ప్రస్తుతం రెండుగా చీలిన ఈ ప్రాంతీయ పార్టీని తిరిగి ఇక్కడ పూర్వ వైభవం వరిస్తుందా అనేది ఒక ప్రశ్న. మొన్న జరిగిన విధాన సభ ఎన్నికల్లో 36 ముంబై సిటీ అసెంబ్లీ నియోజక వర్గాల్లో ఉద్ధవ్ శివసేన కేవలం 10 సీట్లు గెలవటంతో పార్టీ కేడర్ కొంత వరకు జవసత్వాలు కోల్పోయింది.
దీనికి తోడు చీలిపోయిన శివసేన (షిండే) పార్టీ, అటు బీజేపీలు ఉద్ధవ్ పార్టీలోని క్రియాశీల కార్యకర్తలను, కార్పొరేటర్లను తమ తమ వైపు ఆకర్షించుకోవటం మొదలుపెట్టాయి. ఇక ఎన్‌సీపీ నేత, కింగ్ మేకర్ శరద్ పవార్ ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేతో; షిండే సీఎం పదవికి ఎసరుపెట్టిన దేవేంద్ర ఫడ్నవీస్ (బీజేపీ)కి ఉద్ధవ్ ఠాక్రే దగ్గర అవుతున్న వైనాన్ని గమనిస్తే మహారాష్ట్రలో రాబోయే నగర పాలక సంస్థల ఎన్నికలు ఎంత రసవత్తరంగా మార నున్నాయో అంచనా వేయొచ్చు.
జిల్లా గోవర్ధన్
వ్యాసకర్త మాజీ పీఎఫ్ కమిషనర్, ముంబయ్
మొబైల్: 98190 96949
Comments
Please login to add a commentAdd a comment