ఆరోగ్య బీమా సంస్థలు 2023–24 ఆర్థిక సంవత్సరంలో రూ.15,100 కోట్ల విలువైన క్లెయిమ్(Claim)లను అనుమతించలేదు. దాఖలు చేసిన మొత్తం క్లెయిమ్‌ల్లో ఇవి 12.9 శాతానికి సమానమని బీమా నియంత్రణ సంస్థ ఐఆర్‌డీఏఐ తాజాగా విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. సాధారణ, స్వతంత్ర ఆరోగ్య బీమా(Health Insurance) సంస్థలకు వచ్చిన మొత్తం రూ.1.17 లక్షల కోట్ల క్లెయిమ్‌లలో.. రూ.83,493.17 కోట్లు లేదా 71.29 శాతం చెల్లింపులు జరిగాయి. బీమా సంస్థలు రూ.10,937.18 కోట్ల (9.34 శాతం) క్లెయిమ్‌లను తిరస్కరించాయి. 2024 మార్చి నాటికి మొత్తం రూ.7,584.57 కోట్ల (6.48 శాతం) విలువైన క్లెయిమ్‌లు బకాయి ఉన్నాయి. 2023–24లో సుమారు 3.26 కోట్ల ఆరోగ్య బీమా క్లెయిమ్‌లు వచ్చి చేరాయి. వీటిలో 2.69 కోట్ల (82.46 శాతం) క్లెయిమ్‌లు పరిష్కారం అయ్యాయి. ఒక్కో క్లెయిమ్‌కు చెల్లించిన సగటు మొత్తం రూ.31,086గా ఉంది.
నగదు రహితం 66.16%..
సెటిల్ అయిన క్లెయిమ్‌ల సంఖ్య పరంగా 72 శాతం థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్స్ (TPA) ద్వారా, మిగిలిన 28 శాతం కంపెనీల అంతర్గత యంత్రాంగం ద్వారా పరిష్కారం అయ్యాయి. క్లెయిమ్‌ల సెటిల్‌మెంట్ విధానంలో 66.16 శాతం నగదు రహితంగా, మరో 39 శాతం రీయింబర్స్‌మెంట్ విధానంలో పరిష్కరించారు. 2023–24 సంవత్సరంలో సాధారణ, ఆరోగ్య బీమా కంపెనీలు పర్సనల్ యాక్సిడెంట్, ట్రావెల్ ఇన్సూరెన్స్ మినహాయించి రూ.1,07,681 కోట్ల ఆరోగ్య బీమా ప్రీమియం వసూలు చేశాయి. బీమా ప్రీమియం అంత క్రితం ఏడాదితో పోలిస్తే 20.32 శాతం వృద్ధిని నమోదు చేసింది. పర్సనల్ యాక్సిడెంట్(Accident), ట్రావెల్ ఇన్సూరెన్స్ బీమా కింద జారీ చేసిన పాలసీలు మినహా సాధారణ, ఆరోగ్య బీమా కంపెనీలు 2.68 కోట్ల ఆరోగ్య బీమా పాలసీల ద్వారా 57 కోట్ల మందికి కవరేజ్ ఇచ్చాయి.
ఇదీ చదవండి: ‘వ్యక్తిగత ఆదాయపన్ను తగ్గించాలి’
165.05 కోట్ల జీవితాలను..
2024 మార్చి చివరి నాటికి 25 సాధారణ బీమా సంస్థలు, 8 స్వతంత్ర ఆరోగ్య బీమా సంస్థలు సేవలు అందించాయి. గత ఆర్థిక సంవత్సరంలో వ్యక్తిగత ప్రమాద బీమా కింద పరిశ్రమ మొత్తం 165.05 కోట్ల జీవితాలను కవర్ చేసింది. ఇందులో ప్రభుత్వ ప్రధాన పథకాలు ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన (PMSBY), ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన (PMJDY), ఈ–టికెట్ కొనుగోలు చేసిన ప్రయాణికుల కోసం ఐఆర్‌సీటీసీ ప్రయాణ బీమా కింద కవర్ చేయబడిన 90.10 కోట్ల జీవితాలు ఉన్నాయి. ప్రభుత్వ రంగ సాధారణ బీమా సంస్థలైన న్యూ ఇండియా, నేషనల్, ఓరియంటల్ ఇన్సూరెన్స్ విదేశాలలో ఆరోగ్య బీమా వ్యాపారం చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment