వ్యక్తిగత ఆదాయపన్ను రేట్లను తగ్గించడం ద్వారా ప్రజల చేతుల్లో ఖర్చు చేసే ఆదాయాన్ని పెంచాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిని వాణిజ్య సంఘాలు కోరాయి. అలాగే, ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్న రంగాలకు ప్రేరణనివ్వాలని, ఇంధనం(Fuel)పై ఎక్సైజ్ సుంకం తగ్గించాలని, చైనా నుంచి చౌకగా వచ్చి పడుతున్న దిగుమతులకు వ్యతిరేకంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశాయి. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి బడ్జెట్(Budget 2025) ముందస్తు సమావేశంలో భాగంగా ఈమేరకు ప్రతిపాదనలు చేశాయి.
ఈ కార్యక్రమంలో వాణిజ్య మండళ్ల ప్రతినిధుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ సమావేశంలో దీపమ్ కార్యదర్శితోపాటు ఆర్థిక శాఖ పరిధిలోని వివిధ విభాగాల కార్యదర్శులు, ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు పాల్గొన్నారు. 2025 ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో 2025–26 బడ్జెట్ ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే. సమావేశం అనంతరం సీఐఐ ప్రెసిడెంట్ సంజీవ్ పురి మీడియాతో మాట్లాడారు. భారత ఆర్థిక వ్యవస్థ చక్కని పనితీరు చూపిస్తున్నప్పటికీ, అంతర్జాతీయంగా సవాళ్లు నెలకొన్నట్టు చెప్పారు.
‘భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఉత్పత్తులు చైనా ద్వారా దిగుమతి అవుతుండడం చూస్తున్నాం. వాతావరణానికి సంబంధించి సమస్యలు, ఇతర అంశాలు ఆహార భద్రత, ద్రవ్యోల్బణం(Inflation)పై ప్రభావం చూపిస్తున్నాయి. ఈ దిశగా మేము పలు సూచనలు చేశాం. అధిక ఉపాధికి అవకాశం ఉన్న వ్రస్తాలు, పాదరక్షలు, పర్యాటకం, ఫర్నీచర్ తదితర రంగాలకు ప్రేరణ కల్పించే చర్యలు తీసుకోవాలని కోరాం. ఎంఎస్‌ఎంఈ(MSME)లకు సంబంధించి చర్యలతోపాటు, అంతర్జాతీయ వాల్యూ చైన్‌తో భారత్‌ను అనుసంధానించాలని కోరాం. పెట్రోల్‌పై కొంత ఎక్సైజ్ సుంకం తగ్గించడం ద్వారా ఖర్చు పెట్టే ఆదాయాన్ని పెంచొచ్చని సూచించాం’ అని పురి వివరించారు.
ఇదీ చదవండి: కార్పొరేట్ వలంటీర్లు.. సేవా కార్యక్రమాలు
చైనా దిగుమతులతో ఇబ్బందులు..
చైనా సొంత ఆర్థిక వ్యవస్థ నిదానించడంతో చౌకగా ఉత్పత్తులను భారత్‌లోకి పంపిస్తోందంటూ, దీని కారణంగా ఆర్థిక వ్యవస్థ తాత్కాలిక మందగమనాన్ని ఎదుర్కొంటున్నట్టు తాము తెలియజేశామని ఫిక్కీ వైస్ ప్రెసిడెంట్ విజయ్ శంకర్ తెలిపారు. ఆదాయపన్ను తగ్గించడం వల్ల ప్రజల చేతుల్లో ఆదాయం మిగులుతుందని, వినియోగాన్ని పెంచుతుందని సూచించినట్టు పీహెచ్‌డీసీసీఐ ప్రెసిడెంట్ హేమంత్ జైన్ వెల్లడించారు. జీఎస్‌టీని సులభంగా మార్చాలని కూడా కోరినట్టు తెలిపారు. సరఫరా వ్యవస్థకు వెన్నెముకగా ఉన్న ఎంఎస్‌ఎంఈలకు కావాల్సిన వాటిపై (రుణాల లభ్యత, టీడీఎస్ సులభతరం) దృష్టి పెట్టాలని కోరినట్టు అసోచామ్ ప్రెసిడెంట్ సంజయ్ నాయర్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment