సమాజం నుంచి తీసుకోవడమే కాదు.. ఎంతో కొంత సమాజానికి తిరిగి ఇవ్వాలనే స్ఫూర్తితో పలు కార్పొరేట్ కంపెనీలు(Corporate Cos) సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. విద్య, ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ తదితర రంగాల్లో ప్రజలకు సాయమందించేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. వాటిలో వలంటీర్లు(Corporate volunteering)గా పాలుపంచుకునేలా ఉద్యోగులను కూడా ప్రోత్సహిస్తున్నాయి. ఇందుకోసం, పెయిడ్ లీవ్ ఇవ్వడమే కాకుండా తగు ప్రోత్సాహకాలు ఇస్తున్నాయి. దీంతో ఉద్యోగులు కూడా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. మరింత సమయం సైతం వెచ్చించేందుకు ముందుకు వస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనేలా ఉద్యోగులను ప్రోత్సహిస్తున్న వాటిల్లో ఇన్ఫోసిస్, పీఅండ్‌జీ, క్యాప్‌జెమిని(Cap Gemini), స్టాండర్డ్ చార్టర్డ్, హెచ్‌యూఎల్, నెట్‌యాప్ తదితర కంపెనీలు ఉన్నాయి.
వివిధ కంపెనీలు నిర్వహిస్తున్న ప్రాజెక్టుల్లో కొన్ని..
ఇన్ఫోసిస్
జీవవైవిధ్యానికి తోడ్పడేలా ప్రాంతీయంగా వృక్ష సంపదను పెంపొందించేందుకు కంపెనీ నడుం కట్టింది. ఉద్యోగులంతా కలిసి ఇటీవలే 2,00,000కు పైగా సీడ్‌బాల్స్‌ను తయారు చేశారు. వీటిని దేశవ్యాప్తంగా దాదాపు 20 ప్రాంతాల్లో అడవుల పెంపకం ప్రాజెక్టుల్లో ఉపయోగించనున్నారు. ఇక ఇన్ఫీ(Infosys)కి చెందిన బీపీఎం విభాగం ప్రాజెక్ట్ జెనిసిస్ పేరిట మరో కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. కార్పొరేట్ కంపెనీల్లో ఉద్యోగాలను అందిపుచ్చుకునేందుకు ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోని విద్యార్థులకు అవసరమైన నైపుణ్యాల్లో శిక్షణ కల్పిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో ఇలా 78,000 మందికి పైగా విద్యార్థులకు తోడ్పాటు అందించింది.
పీఅండ్‌జీ
అంతగా విద్యా సేవలు అందని ప్రాంతాల్లోని బాలలకు చదువును అందుబాటులోకి తెచ్చే దిశగా శిక్షా ప్రోగ్రాంను నిర్వహిస్తోంది. దీనితో దాదాపు యాభై లక్షల మందికి పైగా చిన్నారులు లబ్ధి పొందినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
క్యాప్‌జెమిని
విద్య, సస్టైనబిలిటీ, ఆరోగ్య సంరక్షణ, నైపుణ్యాల అభివృద్ధి మొదలైన కార్యక్రమాలపై దృష్టి పెట్టింది. వీటిలో 90,000 మందికి పైగా ఉద్యోగులు పాల్గొన్నారు. మొత్తం 2,43,000 పైగా గంటల సమయం వెచ్చించారు. గత కొన్నాళ్లుగా ఉద్యోగులు స్వచ్ఛందంగా ఇలాంటి కార్యక్రమాల కోసం వెచ్చించే సమయం వార్షికంగా 20 శాతం మేర పెరుగుతోందని సంస్థ వర్గాలు తెలిపాయి. ఉద్యోగులు మాక్ ఇంటర్వ్యూలు .. రెజ్యూమె బిల్డింగ్ వర్క్‌షాప్‌లు నిర్వహించడం, కెరియర్ విషయంలో మార్గనిర్దేశనం చేయడం మొదలైన మార్గాల్లో ఉద్యోగార్థులకు సహాయం చేస్తున్నారు. జాబ్ మార్కెట్‌కి అనుగుణంగా నైపుణ్యాలను పెంపొందించుకుని, అవకాశాలను అందిపుచ్చుకునేలా వారికి తోడ్పాటు అందిస్తున్నారు.
ఇదీ చదవండి: విల్మర్ నుంచి అదానీ ఔట్
స్టాండర్డ్ చార్టర్డ్
నైపుణ్యాలను బట్టి వివిధ సామాజిక సేవా ప్రాజెక్టుల్లో పాలుపంచుకునేలా ఉద్యోగులను ప్రోత్సహిస్తోంది. విద్యార్థులకు మార్గనిర్దేశనం చేయడం, కెరియర్‌పరంగా గైడెన్స్ ఇవ్వడం వంటి కార్యక్రమాలను చేపడుతోంది. వాటిలో పాల్గొనే ఉద్యోగులకు మూడు రోజుల పాటు పెయిడ్ లీవ్ కూడా ఇస్తోంది. ఇలాంటి కార్యక్రమాలపై ఉద్యోగులంతా కలిసి మొత్తం 1,17,376 గంటల సమయాన్ని వెచ్చించారు.
Comments
Please login to add a commentAdd a comment