న్యూఢిల్లీ: ఎఫ్‌ఎంసీజీ(FMCG) దిగ్గజం అదానీ విల్మర్ నుంచి బిలియనీర్ గౌతమ్ అదానీ గ్రూప్ వైదొలగనుంది. ఈ భాగస్వామ్య కంపెనీ(JV)లో అదానీ గ్రూప్, సింగపూర్ సంస్థ విల్మర్ విడిగా 43.94 శాతం చొప్పున వాటా కలిగి ఉన్నాయి. అయితే దీనిలో 31.06 శాతం వాటాను విల్మర్‌కు విక్రయించనున్నట్లు అదానీ గ్రూప్ కంపెనీ అదానీ ఎంటర్‌ప్రైజెస్ తాజాగా వెల్లడించింది.
షేరుకి రూ.305 ధర మించకుండా విల్మర్(Wilmar)కు వాటాను అమ్మివేయనున్నట్లు పేర్కొంది. తద్వారా రూ.12,314 కోట్లు అందుకోనుంది. కంపెనీ ఫార్చూన్ బ్రాండ్‌తో వంట నూనెలుసహా పలు ఫుడ్ ప్రొడక్టులను విక్రయిస్తున్న విషయం విదితమే. మరో 13 శాతం వాటాను పబ్లిక్‌కు కనీస వాటా నిబంధనకు అనుగుణంగా ఓపెన్ మార్కెట్లో విక్రయించనున్నట్లు అదానీ(Adani) ఎంటర్‌ప్రైజెస్ తెలియజేసింది. వెరసి పూర్తి వాటాను 200 కోట్ల డాలర్లకు(సుమారు రూ.17,100 కోట్లు) విక్రయించనుంది. తద్వారా కంపెనీ నుంచి పూర్తిగా వైదొలగనుంది. లావాదేవీలు 2025 మార్చి31కల్లా పూర్తికావచ్చని అంచనా వేసింది. ఫలితంగా అదానీ నామినీ డైరెక్టర్లు జేవీ బోర్డు నుంచి తప్పుకోనున్నట్లు
వెల్లడించింది.
వృద్ధి అవకాశాలపైనే..
అదానీ విల్మర్‌లో వాటా విక్రయం ద్వారా సమకూరే నిధులను వృద్ధి అవకాశాలపై వెచ్చించనున్నట్లు అదానీ ఎంటర్‌ప్రైజెస్(ఏఈఎల్) పేర్కొంది. ఎనర్జీ, యుటిలిటీ, ట్రాన్స్‌పోర్ట్, లాజిస్టిక్స్ తదితర కీలకమైన మౌలిక సదుపాయాల బిజినెస్ పురోభివృద్ధికి వినియోగించనున్నట్లు వివరించింది. తాజా లావాదేవీ ద్వారా అదానీ గ్రూప్ లిక్విడిటీ పరిస్థితి మెరుగుపడనుంది. కాగా.. ఏఈఎల్ నుంచి అదానీ విల్మర్‌లో గరిష్టంగా 31.06 శాతం వాటా కొనుగోలుకి విల్మర్ ఒప్పందం కుదుర్చుకుంది. అంతేకాకుండా పబ్లిక్‌కు కనీస వాటా నిబంధనమేరకు 13 శాతం వాటాను ఏఈఎల్ ఓపెన్ మార్కెట్లో విక్రయించనుంది. ఇందుకు రెండు కంపెనీలు చేతులు కలిపినట్లు ఒక ప్రకటనలో తెలియజేశాయి. ప్రస్తుతం అదానీ విల్మర్‌లో రెండు కంపెనీలకూ సంయుక్తంగా 87.87 శాతం వాటా ఉంది. అయితే క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నిబంధనల ప్రకారం లిస్టింగ్ తదుపరి పబ్లిక్‌కు కనీసం 25 శాతం వాటాను ఆఫర్ చేయవలసి ఉంది.
ఇదీ చదవండి: కొత్త ఏడాదిలో రైల్వేశాఖ కీలక నిర్ణయాలు
కంపెనీ నేపథ్యం
1999 జనవరిలో సమాన వాటాతో జేవీగా ఏర్పాటైన అదానీ విల్మర్.. ఫార్చూన్ బ్రాండుతో వంట నూనెలు, రైస్, ఆటాసహా వివిధ ఆహారోత్పత్తులను తయారు చేసి విక్రయిస్తోంది. 10 రాష్ట్రాలలో 23 ప్లాంట్లను నిర్వహిస్తోంది. ఐపీవో ద్వారా రూ. 3,600 కోట్లు సమీకరించింది. స్టాక్ ఎక్స్ఛేంజీల్లో 2022 ఫిబ్రవరిలో లిస్టయ్యింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన గతేడాది(2023–24) రూ.51,555 కోట్లకుపైగా ఆదాయాన్ని అందుకుంది. ప్రస్తుతం కంపెనీ మార్కెట్ విలువ రూ.42,785 కోట్లుగా నమోదైంది. నవంబర్‌లో గ్రూప్ వ్యవస్థాపకుడు, చైర్మన్ గౌతమ్ అదానీ తదితరులపై యూఎస్ ఫెడరల్ ప్రాసిక్యూటర్లు అవినితి ఆరోపణలు చేశాక గ్రూప్ చేపట్టిన తొలి భారీ లావాదేవీ ఇది. గ్రూప్ ఈ ఆరోపణలను తోసిపుచ్చడంతోపాటు న్యాయపరంగా ఎదుర్కొనేందుకు సిద్ధపడిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment