Health Insurance coverage
-
రూ.15,100 కోట్ల క్లెయిమ్‌లను అనుమతించలేదు!
ఆరోగ్య బీమా సంస్థలు 2023–24 ఆర్థిక సంవత్సరంలో రూ.15,100 కోట్ల విలువైన క్లెయిమ్(Claim)లను అనుమతించలేదు. దాఖలు చేసిన మొత్తం క్లెయిమ్‌ల్లో ఇవి 12.9 శాతానికి సమానమని బీమా నియంత్రణ సంస్థ ఐఆర్డీఏఐ తాజాగా విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. సాధారణ, స్వతంత్ర ఆరోగ్య బీమా(Health Insurance) సంస్థలకు వచ్చిన మొత్తం రూ.1.17 లక్షల కోట్ల క్లెయిమ్‌లలో.. రూ.83,493.17 కోట్లు లేదా 71.29 శాతం చెల్లింపులు జరిగాయి. బీమా సంస్థలు రూ.10,937.18 కోట్ల (9.34 శాతం) క్లెయిమ్‌లను తిరస్కరించాయి. 2024 మార్చి నాటికి మొత్తం రూ.7,584.57 కోట్ల (6.48 శాతం) విలువైన క్లెయిమ్‌లు బకాయి ఉన్నాయి. 2023–24లో సుమారు 3.26 కోట్ల ఆరోగ్య బీమా క్లెయిమ్‌లు వచ్చి చేరాయి. వీటిలో 2.69 కోట్ల (82.46 శాతం) క్లెయిమ్‌లు పరిష్కారం అయ్యాయి. ఒక్కో క్లెయిమ్‌కు చెల్లించిన సగటు మొత్తం రూ.31,086గా ఉంది.నగదు రహితం 66.16%.. సెటిల్ అయిన క్లెయిమ్‌ల సంఖ్య పరంగా 72 శాతం థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్స్ (TPA) ద్వారా, మిగిలిన 28 శాతం కంపెనీల అంతర్గత యంత్రాంగం ద్వారా పరిష్కారం అయ్యాయి. క్లెయిమ్‌ల సెటిల్మెంట్ విధానంలో 66.16 శాతం నగదు రహితంగా, మరో 39 శాతం రీయింబర్స్మెంట్ విధానంలో పరిష్కరించారు. 2023–24 సంవత్సరంలో సాధారణ, ఆరోగ్య బీమా కంపెనీలు పర్సనల్ యాక్సిడెంట్, ట్రావెల్ ఇన్సూరెన్స్ మినహాయించి రూ.1,07,681 కోట్ల ఆరోగ్య బీమా ప్రీమియం వసూలు చేశాయి. బీమా ప్రీమియం అంత క్రితం ఏడాదితో పోలిస్తే 20.32 శాతం వృద్ధిని నమోదు చేసింది. పర్సనల్ యాక్సిడెంట్(Accident), ట్రావెల్ ఇన్సూరెన్స్ బీమా కింద జారీ చేసిన పాలసీలు మినహా సాధారణ, ఆరోగ్య బీమా కంపెనీలు 2.68 కోట్ల ఆరోగ్య బీమా పాలసీల ద్వారా 57 కోట్ల మందికి కవరేజ్ ఇచ్చాయి.ఇదీ చదవండి: ‘వ్యక్తిగత ఆదాయపన్ను తగ్గించాలి’165.05 కోట్ల జీవితాలను..2024 మార్చి చివరి నాటికి 25 సాధారణ బీమా సంస్థలు, 8 స్వతంత్ర ఆరోగ్య బీమా సంస్థలు సేవలు అందించాయి. గత ఆర్థిక సంవత్సరంలో వ్యక్తిగత ప్రమాద బీమా కింద పరిశ్రమ మొత్తం 165.05 కోట్ల జీవితాలను కవర్ చేసింది. ఇందులో ప్రభుత్వ ప్రధాన పథకాలు ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన (PMSBY), ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన (PMJDY), ఈ–టికెట్ కొనుగోలు చేసిన ప్రయాణికుల కోసం ఐఆర్సీటీసీ ప్రయాణ బీమా కింద కవర్ చేయబడిన 90.10 కోట్ల జీవితాలు ఉన్నాయి. ప్రభుత్వ రంగ సాధారణ బీమా సంస్థలైన న్యూ ఇండియా, నేషనల్, ఓరియంటల్ ఇన్సూరెన్స్ విదేశాలలో ఆరోగ్య బీమా వ్యాపారం చేస్తున్నాయి. -
రెండు పాలసీలుంటే క్లెయిమ్ ఎలా చేయాలి?
మారుతున్న జీవనశైలికి అనుగుణంగా ఆహార అలవాట్లలో తేడాలొస్తున్నాయి. దానికితోడు శారీరక శ్రమ లోపించి చాలామంది ఆసుపత్రుల బాట పడుతున్నారు. ఏదైనా కారణాలతో హాస్పటల్లో చేరితే ఆర్థికంగా భారం కాకూడదని చాలామంది హెల్త్ ఇన్సూరెన్స్(Health Insurance) తీసుకుంటున్నారు. అయితే ఇటీవలి కాలంలో వేతన జీవుల్లో చాలా వరకు రెండు హెల్త్ పాలసీలు తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కొన్ని క్లిష్ట పరిస్థితుల్లో చికిత్స వ్యయం బీమా కవరేజీని మించిపోయే ప్రమాదం ఉంది. అలాంటి సందర్భాలను ఒకటికి మించిన పాలసీలతో సులభంగా గట్టెక్కొచ్చు. కానీ, ఒకటి కంటే ఎక్కువ పాలసీలు ఉంటే క్లెయిమ్ ఎలా చేయాలనే విషయంలో చాలా మంది అయోమయాన్ని ఎదుర్కొంటూ ఉంటారు. ఈ విషయంలో నిపుణుల సూచనలు అందించే కథనమిది.ఒక వ్యక్తికి ఒకటికి మించిన బీమా సంస్థల నుంచి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు ఉంటే, క్లెయిమ్ మొత్తాన్ని ఆయా సంస్థలు సమానంగా భరించాలనే నిబంధన గతంలో ఉండేది. 2013లో దీన్ని బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (IRDAI) తొలగించింది. దీంతో ఇప్పుడు ఒకటికి మించిన హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు కలిగి ఉన్నా కానీ, పాలసీదారు తనకు నచ్చిన చోట లేదంటే రెండు సంస్థల వద్దా క్లెయిమ్ దాఖలు చేసుకోవచ్చు. క్లెయిమ్ ఎలా?రెండు ప్లాన్లు కలిగిన వారు ఆస్పత్రిలో చేరిన తర్వాత రెండు బీమా సంస్థలకు తప్పనిసరిగా సమాచారం అందించాలి. ఒకటికి మించిన సంస్థల నుంచి హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లు కలిగి ఉంటే, అప్పుడు ముందుగా ఒక బీమా సంస్థకు ప్రతిపాదనలు పంపిస్తే సరిపోతుంది. నగదు రహిత, రీయింబర్స్మెంట్ మార్గాల్లో దేనినైనా వినియోగించుకోవచ్చు. క్లెయిమ్ మొత్తం ఒక హెల్త్ ప్లాన్ కవరేజీ దాటనప్పుడు ఒక బీమా సంస్థ వద్దే దరఖాస్తు చేసుకుంటే సరిపోతుంది. కానీ, ఒక పాలసీ కవరేజీకి మించి ఆస్పత్రి బిల్లు వచ్చినప్పుడు, రెండో బీమా సంస్థ వద్ద మిగిలిన మొత్తాన్ని క్లెయిమ్ చేసుకోవాలి. అంతే కానీ, ఒకేసారి ఒకే క్లెయిమ్‌ను రెండు సంస్థల వద్ద దాఖలు చేసేందుకు అవకాశం లేదని గుర్తుంచుకోవాలి. అలాకాకుండా రెండింటిలో దరఖాస్తు చేసుకుంటే ఒక్కోసారి రెండూ రెజెక్ట్ అయ్యే ప్రమాదం ఉందని తెలుసుకోవాలి.ఒకటికి మించిన ప్లాన్లు ఎందుకు?అసలు ఒకటికి మించి హెల్త్ పాలసీలు ఎందుకనే సందేహం రావచ్చు. ఒక్కొక్కరి అవసరాలే దీన్ని నిర్ణయిస్తాయి. ప్రైవేటు రంగంలో పనిచేసే వారికి పనిచేస్తున్న సంస్థ నుంచి గ్రూప్ హెల్త్ కవరేజీ సాధారణంగా ఉంటుంది. ఉన్నట్టుండి ఉద్యోగం నుంచి తప్పుకోవాల్సి వచ్చినా లేదంటే ఉద్యోగం కోల్పోయిన సందర్భాల్లో.. తిరిగి ఉపాధి లభించేందుకు కొంత సమయం పట్టొచ్చు. కంపెనీలు కల్పించే గ్రూప్ హెల్త్ కవరేజీ.. ఉద్యోగానికి రాజీనామా చేయడంతోనే ముగిసిపోతుంది. అందుకే వ్యక్తిగతంగా మరో ప్లాన్ కలిగి ఉంటే, ఉద్యోగం లేని సమయంలోనూ ఉపయోగపడుతుంది. వైద్య చికిత్సల వ్యయాలు గణనీయంగా పెరిగిపోతున్న తరుణంలో రెండు ప్లాన్లను కలిగి ఉండడం మంచి నిర్ణయమే అవుతుంది. లేదంటే బేస్ ప్లాన్ ఒకటి తీసుకుని, దానిపై మరింత మెరుగైన కవరేజీతో సూపర్ టాపప్ ప్లాన్(Topup Plan) జోడించుకోవడం మరొక మార్గం. -
3 కోవిడ్ టీకాలు తీసుకున్నవారికి బంపరాఫర్!
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా పలు దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ) చర్యలకు నడుం బిగించింది. మూడు డోసులు టీకా తీసుకున్న వారికి సాధారణ, హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీల పునరుద్ధరణపై డిస్కౌంట్ ఇవ్వాలని అన్ని బీమా సంస్థలను కోరింది. కరోనా క్లెయిమ్‌లను వీలైనంత త్వరితంగా పరిష్కరించాలని, డాక్యుమెంట్ల అవసరాన్ని తగ్గించాలని కోరింది. బీమా సంస్థలు తమ వెల్‌నెట్ నెట్వర్క్ ద్వారా ఆర్టీపీసీఆర్ టెస్ట్‌లు నిర్వహించుకునే విధంగా పాలసీదారులను ప్రోత్సహించాలని, ఇందుకు వారికి రాయితీలు కల్పించాలని సూచించింది. కోవిడ్ నిబంధనలను పాలసీదారులు అనుసరించేలా సామాజిక మాధ్యమాల ద్వారా వారిని ప్రోత్సహించాలని బీమా సంస్థలతో నిర్వహించిన సమావేశంలో భాగంగా కోరినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. విదేశీ ప్రయాణ బీమా పాలసీలు తీసుకునే వారికి, పలు దేశాల్లో కరోనా పరీక్షల నిర్వహణ అవసరాల గురించి తెలియజేయాలని ఐఆర్డీఏఐ సూచించింది. కరోనాతో చికిత్స కోసం వచ్చే పాలసీదారుల నుంచి నెట్వర్క్ హాస్పిటళ్లు డిపాజిట్ తీసుకోకుండా చూడాలని కోరింది. నగదు రహిత సదుపాయం ఉన్న ఆస్పత్రుల్లో చేరినప్పటికీ, కరోనా మొదటి, రెండో విడతలో చాలా ఆస్పత్రులు రోగుల నుంచి డిపాజిట్లు తీసుకున్నాయి. దీంతో ఐఆర్డీఏఐ ఈ సూచన చేసింది. కరోనా కేసులు ఒకవేళ అధికంగా వస్తే సాయం అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకోవాలని కోరింది. 2022 మార్చి నాటికి బీమా సంస్థలు కరోనాకు సంబంధించి 2.25 లక్షల క్లెయిమ్‌లను పరిష్కరించడం గమనార్హం. -
సుందరం ఫైనాన్స్ నుంచి కేర్ హెల్త్
చెన్నై: ఎన్బీఎఫ్సీ దిగ్గజం సుందరం ఫైనాన్స్ తమ కస్టమర్లకు ప్రత్యేకించిన ఆరోగ్య బీమా ప్రొడక్టులను అందించనుంది. ఇందుకు వీలుగా కేర్ హెల్త్ ఇన్సూరెన్స్‌తో ఒప్పందంపై సంతకాలు చేసింది. కంపెనీకి గల విస్తారమైన నెట్వర్క్ ద్వారా కేర్ హెల్త్‌కు సంబంధించిన కొత్త తరహా బీమా సొల్యూషన్లను కస్టమర్లకు ఆఫర్ చేయనుంది. రిటైల్, గ్రూప్ విభాగాల్లో ఆరోగ్య బీమా ప్రొడక్టులను విక్రయించనుంది. టెక్నాలజీ ఆధారంగా కంపెనీ ఇప్పటికే సమకూరుస్తున్న సేవలకుతోడు కస్టమర్ల ప్రాధాన్యతకు అనుగుణమైన ఆరోగ్య బీమా ప్రొడక్టులను సైతం అందించనున్నట్లు సుందరం ఫైనాన్స్ పేర్కొంది. వెరసి వివిధ బీమా అవసరాలకు తగిన సొల్యూషన్స్‌ను ఒకే చోట సమకూర్చనున్నట్లు తెలియజేసింది. -
ఆరోగ్య బీమా.. ఆదుకునే నేస్తం
క్రాంతి (40) ఓ ప్రైవేటు కంపెనీ ఉద్యోగి. భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఏడాది క్రితమే ఒక కంపెనీ నుంచి మరొక కంపెనీకి మెరుగైన ప్యాకేజీ కోసం మారాడు. కొన్ని నెలలు గడిచిన తర్వాతే, మెరుగైన ప్యాకేజీ ఎందుకిచ్చారో అతడికి బోధపడింది. ఉదయం 7 గంటలకు వెళితే రాత్రి ఇంటికొచ్చేసరికి 10 అవుతోంది. ‘మనకొద్దురా బాబూ ఈ జాబు’ అనుకుని ఉన్నట్టుండి రాజీనామా ఇచ్చేశాడు. మరో కంపెనీలో ఉద్యోగం కోసం వెతుకులాట మొదలు పెట్టాడు. కానీ, దురదృష్టం ప్రమాదం రూపంలో ఎదురైంది. బైక్‌పై వెళుతున్న సమయంలో ప్రమాదం కారణంగా తీవ్ర గాయాలయ్యాయి. కాలికి, చేతికి ప్లేట్లు వేయాల్సి వచ్చింది. ఆసుపత్రి బిల్లు సుమారు రూ.4 లక్షలు వచ్చింది. ఈ మొత్తాన్ని అతడు క్రెడిట్ కార్డుపై సర్దుబాటు చేయాల్సి వచ్చింది. కారణం పాత కంపెనీలో ఉన్న గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీ.. రాజీనామా ఇచ్చిన నెలతోనే ముగిసిపోయింది. అది తప్ప అతడికి మరో ప్లాన్ లేదు. ఈ చిన్న తప్పిదం అతడి మూడేళ్ల పొదుపు సొమ్మును పట్టుకుపోయింది. అందుకే హెల్త్ ఇన్సూరెన్స్ ప్రాధాన్యతను సరిగ్గా అర్థం చేసుకోవాలి. పనిచేస్తున్న కంపెనీలపై ఆధారపడకుండా, తమకంటూ మెరుగైన కవరేజీతో రక్షణ కల్పించుకున్నప్పుడే ఇలాంటి పరిస్థితులు ఎదురుకాకుండా చూసుకోవచ్చు. మనిషి ప్రాణాలను కాపాడే విషయంలో, ఆయువును పెంచడంలో వైద్య రంగం ఎంతో ప్రగతి సాధించింది. కానీ, ఇందుకు అదనపు ఖర్చు అవుతుంది. నేడు జీవన శైలి వ్యాధులు పెరిగిపోయాయి. కేన్సర్ మహమ్మారి మన సమాజంలో వేగంగా విస్తరిస్తోంది. మధుమేహం, రక్తపోటు, గుండె జబ్బులు, మూత్రపిండాలు, లివర్ వ్యాధులు కూడా పెరుగుతున్నాయి. ఇవన్నీ మారిన జీవనశైలి కారణంగా ప్రబలుతున్నవే. వీటికయ్యే వ్యయం సామాన్యులు, మధ్య తరగతి ప్రజల వల్ల అయ్యే పనికాదు. పైగా ఏటేటా వైద్య చికిత్సల వ్యయాలు 10–15 శాతం మేర భారమవుతున్నాయి. అందుకే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ఏటా కొంత ప్రీమియం చెల్లించడం ద్వారా కుటుంబం అంతటికీ రక్షణ కల్పించుకోవచ్చు. ఏటా తమ ఆదాయం నుంచి కొంత మొత్తాన్ని ప్రీమియం రూపంలో చెల్లించడం అసాధ్యమేమీ కాదు. కానీ, ఆరోగ్య సమస్య లేదా ప్రమాదం కారణంగా హాస్పిటల్లోచేరితే వచ్చే బిల్లును పాకెట్ నుంచి చెల్లించడం నిజంగా తలకు మించిన భారం అవుతుంది. దీని కారణంగా అప్పుల పాలు అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. కరోనా మహమ్మారి సామాన్య, మధ్యతరగతి కుటుంబాలు ఎన్నింటినో అప్పుల పాలు చేసింది. ఆస్తులున్న వారు అమ్ముకుని ఒడ్డెక్కాల్సి వచ్చింది. ఈ అనుభవాలు, వాస్తవలను చూసిన తర్వాత అయినా ప్రతి ఒక్క కుటుంబం ఏదో ఒక రూపంలో హెల్త్ కవరేజీ ఉండేలా చూసుకోవాలి. ప్రయోజనాలు.. ఆరోగ్య అత్యవసర సమయాల్లో ఆదుకునే సాధనం హెల్త్ ఇన్సూరెన్స్. ఇది ఉంటే అనారోగ్యం కారణంగా హాస్పిటల్లో చేరాల్సి వస్తే అక్కడ చికిత్సల చార్జీలు, వైద్యుల కన్సల్టేషన్, అంబులెన్స్ చార్జీలు, రూమ్ చార్జీలను బీమా కంపెనీలు చెల్లిస్తాయి. అంతేకాదు డిశ్చార్జ్ చేసిన తర్వాత కొన్ని రోజుల పాటు ఔషధాలు, వైద్య పరీక్షలకు అయ్యే వ్యయాలను కూడా భరిస్తాయి. హాస్పిటల్లో చేరడానికి ముందు అదే సమస్య కోసం నిర్ణీత రోజుల కు చేసిన వైద్య వ్యయాలను సైతం చెల్లిస్తాయి. ఆర్థిక స్థిరత్వం వైద్యం ఎప్పుడు అవసరపడుతుందన్నది ఎవరూ చెప్పలేరు. ఎలాంటి చికిత్స అవసరపడుతుంది? ఎంత ఖర్చవుతుందన్నది ఊహించడం కష్టం. అలాంటి పరిస్థితి వస్తే పొదుపు సొమ్ము అంతా కరిగిపోకుండా, అప్పుల పాలు కాకుండా, ఉన్న ఆస్తులు అమ్ముకోవాల్సిన అగత్యం రాకుండా హెల్త్ ఇన్సూరెన్స్ ఆదుకుంటుంది. అందుకే హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఆర్థికంగా ఆదుకునే సాధనం కూడా అవుతుంది. మెరుగైన వైద్య చికిత్సలు/రక్షణ తమతోపాటు, తమపై ఆధారపడిన వారికి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల.. వైద్యం అవసరమైన సందర్భంలో వెనుకాడాల్సిన పని ఉండదు. అదే హెల్త్ ప్లాన్ లేదనుకోండి.. తగినంత ఆర్థిక పొదుపుల్లేనప్పుడు, హాస్పిటల్‌కు వెళ్లే విషయంలో చికిత్సల వ్యయాల గురించి ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు. అదే హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే మంచి హాస్పిటల్‌కు వెళ్లి, ఖర్చుకు వెనుకాడకుండా నాణ్యమైన వైద్యం పొందే ధైర్యం వస్తుంది. ఖర్చు గురించి కాకుండా, మంచి చికిత్స గురించి ఆలోచించే స్వేచ్ఛ హెల్త్ ప్లాన్‌తో వస్తుంది. జీవిత లక్ష్యాలకు మిగులు వైద్య చికిత్సల వ్యయాలు ఏటేటా పెరుగుతుంటాయి. ముఖ్యంగా నేడు వాతావరణ కాలుష్యం, జీవనశైలి వల్ల మధుమేహం, గుండె జబ్బులు, కేన్సర్ కేసులు గణనీయంగా పెరిగిపోతున్నాయి. వీటికి పెద్ద మొత్తంలో ఖర్చవుతోంది. ఈ భారాన్ని తమపై పడకుండా చూసుకుంటే.. జీవితంలో ముఖ్యమైన పిల్లల విద్య, వారి వివాహాలు, సొంతిల్లు, రిటైర్మెంట్ కోసం ఇన్వెస్ట్ చేసుకోవడానికి వెసులుబాటు ఉంటుంది. హెల్త్ మాదిరిగా ఈ లక్ష్యాలకు ఎలాంటి కవరేజీ ఉండదని గుర్తు పెట్టుకోవాలి. పన్ను ప్రయోజనాలు హెల్త్ ఇన్సూరెన్స్ వల్ల పన్ను ప్రయోజనాలు కూడా ఉన్నాయి. సెక్షన్ 80డీ కింద 60 ఏళ్లలోపు వ్యక్తులు, తాను, తన జీవిత భాగస్వామి, పిల్లల కోసం చెల్లించే హెల్త్ ఇన్సరెన్స్ ప్రీమియం ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.25,000 వరకు ఉంటే, ఈ మొత్తంపై పన్ను మినహాయింపును క్లెయిమ్ చేసుకోవచ్చు. 60 ఏళ్లు నిండిన వృద్ధులకు రూ.50వేల ప్రీమియంపై ఆదాయపన్ను మినహాయింపు ఉంది. సొంతంగా ఉండాల్సిందే ప్రైవేటు రంగంలో పనిచేసే వారికి ఆయా సంస్థలు గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని అందిస్తుంటాయి. దీంతో వారు విడిగా హెల్త్ ప్లాన్ ఎందుకులేనని అనుకుంటుంటారు. కానీ, ప్రైవేటు రంగంలో ఉద్యోగాలకు భద్రత ఉండదని తెలుసు. కంపెనీలు ఇచ్చే గ్రూప్ హెల్త్ కవరేజీ.. ఉద్యోగం మానివేయడంతో నిలిచిపోతుంది. అందుకుని విడిగా ఒక ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్ తప్పకుండా తీసుకోవాలి. పనిచేస్తున్న సంస్థ నుంచి మెరుగైన కవరేజీ లేకపోయినా, ఇది ఆదుకుంటుంది. తక్కువ కవరేజీకి తీసుకుని, దానికి సూపర్ టాపప్ జోడించుకోవచ్చు. ఎంత ముందు అయితే అంత మంచిది వైవాహిక జీవితం ఆరంభించినప్పుడు లేదా ఉద్యోగ జీవితం ఆరంభించినప్పుడే హెల్త్ కవరేజీ ఉండాలి. 20ప్లస్‌లోనే ఆరోగ్య బీమా తీసుకోవడం వల్ల భవిష్యత్తులో క్లెయిమ్‌ల తిరస్కరణ సమస్య ఎదురుకాదు. ఎందుకంటే 20ప్లస్‌లో ఆరోగ్య సమస్యలు దాదాపుగా ఉండవు. కానీ, నేడు 30 దాటిన దగ్గర్నుంచి రక్తపోటు, కొలెస్ట్రాల్, మధుమేహం, శ్వాసకోస సమస్యలు వేధిస్తున్నాయి. ఆలస్యం చేసినకొద్దీ, ఇవన్నీ పూర్వం నుంచి ఉన్న ఆరోగ్య సమస్యల కిందకు వస్తాయి. కనుక వీటిని పాలసీ డిక్లరేషన్‌లో తప్పకుండా వెల్లడించాలి. అలా చేసినప్పుడు అధిక ప్రీమియం చెల్లించుకోవాల్సి వస్తుంది. పైగా అప్పటికే ఉన్న వాటికి కవరేజీ కోసం 3–4 ఏళ్లు వేచి చూడాల్సి రావచ్చు. పలు రకాల ప్లాన్లు.. వ్యక్తిగత ఆరోగ్య బీమా, ఫ్యామిలీ ఫ్లోటర్, క్రిటికల్ ఇల్నెస్, టాపప్, సూపర్ టాపప్ ఇలా పలు రకాల పాలసీలు ఉన్నాయి. బేసిక్ ప్లాన్ ఏదైనా కానీ, కాంప్రహెన్సివ్ అయి ఉండాలి. అంటే అన్ని రకాల కవరేజీలతో కూడి ఉండాలి. వివాహం అయిన వారు కుటుంబం అంతటికీ ఫ్యామిలీ ఫ్లోటర్ తీసుకోవాలి. వృద్ధులైన తల్లిదండ్రులు ఆధారపడి ఉంటే, వారికి విడిగా మరో ప్లాన్ తీసుకోవడం వల్ల ప్రీమియం భారం తగ్గించుకోవచ్చు. ఇక క్రిటికల్ ఇల్నెస్ ప్లాన్లు అనేవి.. కేన్సర్, మూత్ర పిండాల సమస్యలు, గుండె జబ్బులు, లివర్ ఫెయిల్యూర్, స్ట్రోక్ ఇలా దీర్ఘకాలిక సమస్యలు నిర్ధారణ అయినప్పుడు బీమా మొత్తాన్ని ఒకే విడత చెల్లించే ప్లాన్లు. టాపప్ ప్లాన్లు అనేవి.. బేసిక్ హెల్త్ కవరేజీ మించి వైద్య చికిత్సల వ్యయాలు అయినప్పుడు.. బేసిక్ కవరేజీ పోను అదనపు మొత్తాన్ని చెల్లించేవి. వీటిని దృష్టిలో పెట్టుకోవాలి.. ► ఎంపిక చేసుకునే బీమా కంపెనీ జాబితాలో ఎన్ని నెట్వర్క్ హాస్పిటల్స్ ఉన్నాయనేది చూడాలి. ముఖ్యంగా మీరు నివాసం ఉంటున్న పట్టణంలో ఎన్ని హాస్పిటల్స్ బీమా కంపెనీ నెట్వర్క్ కింద ఉన్నాయో చూడాలి. నెట్వర్క్ హాస్పిటల్ అయితే నగదు రహిత వైద్యం పొందొచ్చు. లేదంటే చికిత్సల ఖర్చు అంతా సొంతంగా భరించి, తర్వాత క్లెయిమ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇది కొంచెం శ్రమతో, సమయంతో కూడుకున్నది అవుతుంది. ► బీమా కంపెనీ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియోను చూడాలి. తనవద్దకు వచ్చే క్లెయిమ్‌లలో ఎన్నింటికి చెల్లింపులు చేస్తుంది.. అలాగే వచ్చిన క్లెయిమ్ అమౌంట్లో, ఎంత మొత్తానికి చెల్లింపులు చేసిందనే విషయాన్ని ముందే తెలుసుకోవాలి. కొన్ని బీమా కంపెనీలు పూర్తిగా తిరస్కరిస్తే, కొన్ని కంపెనీలు క్లెయిమ్‌లో కోతలు పెడుతుంటాయి. కనీసం 90 శాతానికి పైనే సెటిల్మెంట్ రేషియో ఉన్న వాటిని ఎంపిక చేసుకోవడం మంచిది. ► హాస్పిటల్లో చేరడానికి ముందు, డిశ్చార్జ్ అయిన తర్వాత ఎన్ని రోజులకు కవరేజీ ఉంటుందో (ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్) చూడాలి. సాధారణంగా 30–180 రోజుల వరకు ఈ కాలం ఉంటుంది. గరిష్ట కాలానికి చెల్లింపులు చేసే ప్లాన్లు అయితే అనుకూలం. ఎందుకంటే కొన్ని సమస్యలకు డిశ్చార్జ్ తర్వాత కూడా చాలా కాలం పాటు ఔషధాలు తీసుకోవాల్సి రావడం, మళ్లీ, మళ్లీ వైద్యుల రివ్యూలు అవసరపడతాయి. ► ఎంపిక చేసుకునే ప్లాన్‌కు తప్పకుండా రీస్టోరేషన్ సదుపాయం ఉండాలి. అంటే ఒక పాలసీ సంవత్సరంలో ఎవరైనా హాస్పిటల్లో చేరి కవరేజీ మొత్తం ఖర్చయిపోతే ఈ ఫీచర్ అక్కరకు వస్తుంది. కొన్ని ఒకటి నుంచి మూడు సార్లు రీస్టోరేషన్ ఇస్తుంటే, కొన్ని అన్లిమిటెడ్ రీస్టోరేషన్ ను కూడా ఆఫర్ చేస్తున్నాయి. దీనివల్ల అదే ఏడాది తదనంతరం హాస్పిటలైజేషన్కూ కవరేజీ ఉంటుంది. ► రూమ్ రెంట్ పరిమితులు, కోపే ఆప్షన్ లేని ప్లాన్ తీసుకుంటే భవిష్యత్తులో సమస్యలు ఉండవు. కోపే ఆప్షన్లో క్లెయిమ్ ఎదురైన ప్రతి సందర్భంలోనూ పాలసీదారు తనవంతు కొంత భరించడం. రూమ్ రెంట్ పరంగా షేరింగ్, సింగిల్ రూమ్ అనే పరిమితులు ఉంటే, హాస్పిటల్లో చేరినప్పుడు ఆయా రూమ్‌ల్లోనే చేరుతున్నామా? అన్నది జాగ్రత్త పడాలి. లేదంటే ఈ రూపంలోనూ పాలసీదారుపై అదనపు భారం పడుతుంది. ► నో క్లెయిమ్ బోనస్ ఫీచర్ కూడా ఉపయోగకరం. దీనికింద క్లెయిమ్ చేయని ప్రతీ సంవత్సరానికి నిర్ణీత శాతం మేర కవరేజీని బీమా కంపెనీలు పెంచుతాయి. క్లెయిమ్ వస్తే అంతే మేర తగ్గిస్తాయి. ► డైలీ క్యాష్ బెనిఫిట్‌ను చాలా బీమా కంపెనీలు ఆఫర్ చేస్తున్నాయి. ఆసుపత్రిలో ఎక్కువరోజుల పాటు ఉండాల్సి వస్తే, పేషెంట్‌కు సాయంగా ఉండేవారికి అయ్యే వ్యయాలకు ఇది పనికొస్తుంది. ► అదనపు సభ్యులను చేర్చుకునే ఫీచర్ ఉండాలి. ► డేకేర్ చికిత్సలకు కవరేజీ ఇచ్చే ప్లాన్ మంచిది. కొత్త టెక్నాలజీలు, పరిశోధనలతో కొన్ని సమస్యలకు చికిత్సలు తేలిగ్గా మారుతున్నాయి. వీటికి ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం పడదు. కానీ, బీమా కంపెనీలు ఆఫర్ చేసే ఇండెమ్నిటీ ప్లాన్లలో కవరేజీ కోసం కనీసం 24 గంటల పాటు అడ్మిట్ కావాల్సి ఉంటుంది. డేకేర్ చికిత్సలకు ఇది వర్తించదు. ► అంబులెన్స్ చార్జీలను చెల్లించేలా ఉండాలి. ► ఆధునిక, రోబోటిక్ చికిత్సలకు, అవయవమార్పిడి చికిత్సలకు కూడా కవరేజీ ఉండాలి. ► పెళ్లయి, పిల్లలు ఇంకా లేని వారు అయితే తప్ప కుండా మేటర్నిటీ కవరేజీ ఉండే ప్లాన్‌కు వెళ్లాలి. ► ఏడాదికోసారి ముందస్తు వ్యాధి నిర్ధారణ పరీక్షలను బీమా కంపెనీ ఉచితంగా ఆఫర్ చేస్తుందా? అన్నది చూడాలి. ► పాలసీ తీసుకునే నాటికే ఉన్న వ్యాధులకు కవరేజీ కోసం సాధారణంగా 4 ఏళ్ల వరకు వేచి ఉండాల్సి రావచ్చు. ఆ కాలంలో ముందు నుంచి ఉన్న వాటికి క్లెయిమ్ చేసుకోలేరు. కొన్ని ప్లాన్లు 1–2 ఏళ్ల వెయిటింగ్ పీరియడ్‌తో ఉంటున్నాయి. కాకపోతే వీటి ప్రీమియం అధికంగా ఉంటుంది. ► తీసుకున్న ప్లాన్ జీవిత కాలం పాటు రెన్యువల్ చేసుకునే ఫీచర్‌తో ఉండాలి. ► హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకునే ముందు కంపెనీ సేవల నాణ్యత, ఎంత వేగంగా చెల్లింపులు చేస్తుంది? ఇతర కంపెనీల ప్లాన్లతో పోలిస్తే ప్రీమియం వ్యత్యాసం ఎంతన్నది తెలుసుకోవాలి. ► కొన్ని రకాల చికిత్సలకు కవరేజీ ఉండదు. పైగా కొన్ని రకాల చికిత్సలకు 2 ఏళ్లపాటు వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. వీటి వివరాలను పాలసీ వర్డింగ్ డాక్యుమెంట్ చదివి తెలుసుకోవాలి. -
ప్రతి కుటుంబానికి ఆరోగ్య బీమా
న్యూఢిల్లీ: దేశంలో ప్రతి కుటుంబానికి ఆరోగ్య బీమాను (సార్వత్రిక ఆరోగ్య బీమా) చేరువ చేసే లక్ష్యంతో.. బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ) 15 మంది సభ్యులతో ‘హెల్త్ ఇన్సూరెన్స్ కన్సల్టేటివ్ కమిటీ’ని (ఆరోగ్య బీమా సంప్రదింపుల కమిటీ) ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. రెండేళ్ల కాలానికి ఈ కమిటీని నియమించింది. ఈ కమిటీకి ఐఆర్డీఏఐ సభ్యుడైన రాకేశ్ జోషి నేతృత్వం వహిస్తారు. హెల్త్ ఇన్సూరెన్స్ సజావుగా నిర్వహించుకునేందుకు, వ్యాపార సులభతర నిర్వహణకు సూచనలు ఇవ్వాలని ఐఆర్డీఏఐ కోరింది. దేశంలో ప్రతి కుటుంబం ఆరోగ్య బీమా కలిగి ఉండడం అవసరమని పేర్కొంది. ‘‘దేశంలో హెల్త్ ఇన్సూరెన్స్ విస్తరణను పెంచాలి. ఇందుకు అడ్డుగా ఉన్న సవాళ్లు, సమస్యలను గుర్తించి, వాటిని అధిగమించేందుకు అవసరమైన సిఫారసులు చేయాలి’’అని కమిటీని కోరింది. డేటా విశ్లేషణ సహా పలు విధానాల అమలులో ప్రామాణిక విధానాలను కూడా కమిటీ సూచించనుంది. మారుతున్న ఆరోగ్య సంరక్షణ అవసరాలకు తగ్గట్టు హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందాలని ఐఆర్డీఏఐ పేర్కొంది. ఆరోగ్య సంరక్షణ వ్యయాలను తట్టుకునేందుకు రక్షణగా బీమాను కొనుగోలు చేస్తున్న వారి.. అన్ని రకాల అవసరాలను తీర్చేలా ఉండాలని అభిప్రాయపడింది. -
ప్రయాణ బీమా పాలసీలకు డిమాండ్!
బెంగళూరు: కోవిడ్–19 విజృంభించిన సమయంలో ప్రయాణాలు దాదాపు నిల్చిపోయాయి. ప్రస్తుతం ట్రావెల్ విభాగం క్రమంగా పుంజుకుంటోంది. దీంతో ప్రయాణ బీమా పాలసీలకు డిమాండ్ పెరుగుతోంది. కోవిడ్ పూర్వం 2019–20లో నెలకొన్న పరిస్థితితో పోలిస్తే 2021–22 ఆర్థిక సంవత్సరంలో ట్రావెల్ పాలసీల విక్రయం పుంజుకున్నట్లు డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ వెల్లడించింది. తమ అంతర్గత డేటా ప్రకారం ఈ ఏడాది కూడా ఇదే ధోరణి కనిపిస్తోందని పేర్కొంది. తాము గతేడాది మొత్తం మీద అమ్మిన ట్రావెల్ పాలసీల్లో సుమారు 75 శాతం పాలసీలను ఈ ఏడాది నాలుగు నెలల్లోనే విక్రయించగలిగినట్లు పేర్కొంది. 2021–22లో 12.8 లక్షల ట్రావెల్ పాలసీలను విక్రయించినట్లు సంస్థ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ వివేక్ చతుర్వేది తెలిపారు. సాధారణంగా ట్రిప్ రద్దు కావడం, ఫ్లయిట్లు రద్దు కావడం లేదా జాప్యం జరగడం వంటి అంశాలే ట్రావెల్ క్లెయిమ్‌లకు కారణాలుగా ఉంటున్నాయని ఆయన పేర్కొన్నారు. కోవిడ్–19కు పూర్వం ట్రావెల్ ఇన్సూరెన్స్‌ను దేశీయ ప్రయాణికులు ఎక్కువగా పట్టించుకునే వారు కాదని, కాని ప్రస్తుతం అనూహ్య పరిస్థితులతో ప్రయాణాలకు అంతరాయం కలిగినా నష్టపోకుండా ఉండేందుకు చాలా మంది ఇప్పుడు ప్రయాణ బీమా పాలసీలను తీసుకుంటున్నారని పేర్కొన్నారు. -
పన్ను చెల్లింపు దారులకు శుభవార్త!! రూ.లక్షవరకు పన్ను ఆదా చేసుకోండిలా?
మీరు 2021-22 ఆర్ధిక సంవత్సరంలో ట్యాక్స్ చెల్లిస్తున్నారా? ఈ సందర్భంగా మీరు ట్యాక్స్ సేవ్ చేయాలని అనుకుంటున్నారా? అయితే మీకో శుభవార్త. సెక్షన్ 80సీ కాకుండా సెక్షన్ 80డీ కింద అదనంగా మరో రూ.1లక్ష వరకు అదా చేసుకోవచ్చని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి పన్ను చెల్లించడానికి 2022 మార్చి,31చివరి తేదీ. అయితే ఈ ట్యాక్స్ చెల్లింపు సందర్భంగా సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షల పరిమితి వరకు పన్నును ఆదా చేసుకోవచ్చు. ఇప్పుడు సెక్షన్ 80సీతో పాటు సెక్షన్ 80డీ కింద పన్ను ఆదా చేసుకోవచ్చు. సెక్షన్ 80డీలో వయస్సు ఆధారంగా నిర్దిష్ట పరిమితి వరకు మీరు తీసుకున్నహెల్త్ ఇన్స్యూరెన్స్ ప్రీమియంపై సెక్షన్ 80సీ పరిమితి కంటే ఎక్కువ మీకు అదనపు పన్ను ప్రయోజనాల్ని పొందవచ్చు. మీరు,మీ తల్లిదండ్రులు 60ఏళ్లు పైబడిన వారు అంటే సీనియర్ సిటిజన్లు అయితే హెల్త్ ఇన్స్యూరెన్స్ ప్లాన్‌ను తీసుకోవడం ద్వారా మీరు రూ.1లక్ష వరకు ఆదాయపు పన్నును ఆదా చేసుకోవచ్చు. ఇందుకోసం ప్రత్యేకమైన సీనియర్ సిటిజన్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లు అనేకం ఉన్నాయి. మీరు ఎలాంటి ఇన్స్యూరెన్స్ పాలసీ తీసుకున్నా పన్ను ఆదా చేసుకునేందుకు ఆదాయపు పన్ను చట్టం 961లోని సెక్షన్ 80డీ కిందకు వస్తుంది. ఇందులో గరిష్ట పన్ను ప్రయోజనం రూ.25,000 లేదా రూ.50,000 మాత్రమే. అయితే వాస్తవ పన్ను ప్రయోజనం ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఇది మీ వయస్సు మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీరు నిర్దిష్ట వయస్సు కంటే ఎక్కువ ఉంటే మీరు పొందే మొత్తం మినహాయింపు సుమారు రూ.లక్షరూపాయలు. ఆరోగ్య బీమా ప్రీమియం 60 ఏళ్లలోపు వ్యక్తులకు రూ. 25,000 వరకు, 60 ఏళ్లు పైబడిన వారికి రూ. 50,000 వరకు పన్ను మినహాయింపుగా క్లెయిమ్ చేయవచ్చు. 60 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు మీ కోసం, మీ తల్లిదండ్రుల కోసం (కనీసం 60 సంవత్సరాలు) ఆరోగ్య బీమా ప్లాన్‌ను కొనుగోలు చేయాలనుకుంటే, మొత్తం పన్ను ప్రయోజనాన్ని రూ.75,000 వరకు పొందవచ్చు. మీరు, మీ తల్లిదండ్రులు ఇద్దరూ 60 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు గలవారైతే, గరిష్టంగా రూ.1,00,000 వరకు మినహాయింపు పొందవచ్చు” అని క్యూబీఈ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఎండీ,సీఈఓ పంకజ్ అరోరా చెప్పారు. చెల్లించిన ప్రీమియం మీ స్థూల మొత్తం ఆదాయాన్ని సమాన మొత్తానికి తీసుకువస్తుంది. తద్వారా మీ పన్ను బాధ్యత తగ్గుతుంది. -
ప్రస్తుత మార్కెట్లో ఆ పాలసీలదే హవా!!
హైదరాబాద్, బిజనెస్ బ్యూరో: కోవిడ్–19 మహమ్మారి నేపథ్యంలో జీవిత బీమా, ఆరోగ్య సంరక్షణ పాలసీలకు సంబంధించి తగినంత కవరేజీ ఉండాల్సిన అవసరంపై అవగాహన పెరిగిందని ప్రైవేట్ రంగ బీమా సంస్థ టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ చీఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫీసర్ వెంకటాచలం అయ్యర్ తెలిపారు. అలాగే జీవిత బీమా పథకాల్లో హెల్త్ రైడర్లు కూడా కీలకమని పాలసీదారులు గుర్తిస్తున్నారని తెలిపారు. ఎటువంటి అవాంతరాలు లేకుండా జీవిత బీమా, ఆరోగ్య బీమా కవరేజీతో పాటు పెట్టుబడులపై రాబడులు కూడా అందించే పాలసీలకు ఆదరణ మరింత పెరుగుతుందని సాక్షి బిజినెస్ బ్యూరోకు ఆయన వివరించారు. మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే.. టర్మ్ పాలసీలకు, దీర్ఘకాలికంగా గ్యారంటీ ఆదాయాన్నిచ్చే పాలసీలకు డిమాండ్ మెరుగుపడింది. రాబోయే రోజుల్లోనూ ఇదే ధోరణి కొనసాగవచ్చు. వీటితో పాటు పెన్షన్, యాన్యుయిటీ పథకాలపైనా ఆసక్తి కనిపిస్తోంది. ఇక జీవిత బీమా పథకాల్లో హెల్త్ రైడర్లు చాలా కీలకంగా ఉంటున్నాయి. అనుకోని విధంగా ఆస్పత్రి పాలైనా, తీవ్ర అనారోగ్యాల బారిన పడినా ఇవి ఆదుకుంటాయి. నామమాత్రమైన అదనపు ప్రీమియంతో ఇవి గణనీయంగా ప్రయోజనం చేకూర్చగలవు. వ్యాధి బైటపడిన పక్షంలో దానికి సంబంధించి తీసుకున్న రైడర్‌కు అనుగుణంగా సమ్ అష్యూర్డ్ మొత్తం పాలసీదారుకు అందుతుంది. మిగతా హెల్త్ కవర్ ఆప్షన్లలాగా కాకుండా.. సమ్ అష్యూర్డ్‌ను క్లెయిమ్ చేయడానికి చికిత్స బిల్లులు మొదలైనవి సమర్పించాల్సిన బాదరబందీ ఉండదు. హెల్త్ రైడర్లతో పలు రిస్క్ కవరేజీలను పాలసీదారులు ఎంచుకోవచ్చు. అందుకే జీవిత బీమా, సేవింగ్స్ పథకాలు తీసుకునేటప్పుడు తప్పనిసరిగా హెల్త్, ఇతర ప్రయోజనాలు అందించే రైడర్లు కూడా పరిశీలించాలని పాలసీదారులకు మేము సూచిస్తున్నాం. టర్మ్ ఇన్సూరెన్స్ ప్రీమియంలు..కొత్త పాలసీలు జీవిత బీమా ప్రీమియంల పెరుగుదల విషయానికొస్తే.. ఇది రీఇన్సూరెన్స్ వ్యయాలు మొదలైన పలు అంశాలపై ఆధారపడి ఉంటాయి. మాతో సహా పరిశ్రమలోని మిగతా సంస్థలు కూడా వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకునే ప్రీమియంలను నిర్ణయిస్తాయి. మేము సాధ్యమైనంతవరకూ విలువకు తగ్గ స్థాయిలో సమగ్రంగా ప్రయోజనాలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. కొత్త పాలసీల విషయానికొస్తే ఇటీవలే టాటా ఏఐఏ లైఫ్ ఫార్చూన్ గ్యారంటీ పెన్షన్ పేరిట సరళతరమైన యాన్యుటీ ప్లాన్ ప్రవేశపెట్టాం. పాలసీదారులు తమ అవసరాలకు అనుగుణమైన యాన్యుటీని పొందే విధంగా దీన్ని ఎంచుకోవచ్చు. అలాగే లైఫ్ ఇన్స్ట్రాపొటెక్ట్ అనే మరో కొత్త పాలసీలో లైఫ్ కవరేజీతో పాటు ఆస్పత్రి వ్యయాలు, క్రిటికల్ ఇల్నెస్, యాక్సిడెంటల్ డెత్ మొదలైన వాటికి సంబంధించిన ప్రయోజనాలు లభిస్తాయి. ప్రస్తుత వ్యాపార పరిమాణం.. లక్ష్యాలు.. 2021 మార్చి 31 నాటికి నిర్వహణలోని ఆస్తుల పరిమాణం (ఏయూఎం) అంతక్రితం ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఏకంగా 47 శాతం పెరిగింది. రూ. 31,450 కోట్ల నుంచి రూ. 46,281 కోట్లకు చేరింది. మార్నింగ్ స్టార్ అనే రీసెర్చ్ సంస్థ అంచనాల ప్రకారం మా ఏయూఎంలో 99.93 శాతం మొత్తానికి 4 స్టార్ లేదా 5 స్టార్ రేటింగ్ ఉంది. ఇదే ధోరణి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కూడా కొనసాగుతుందని ఆశిస్తున్నాం. -
బంగారం..పెట్టుబడిగా మంచి సాధనమేనా?
ప్రశ్న: ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల నేపథ్యంలో కొత్తగా పెట్టుబడులు ప్రారంభించే ఇన్వెస్టర్లకు మీరు ఇచ్చే సూచన ఏమిటి? - రాజేష్ సమాధానం: మార్కెట్లు ఆందోళనకరంగా కనిపించొచ్చు లేదా పడిపోతాయని అనిపించొచ్చు. లేదంటే ర్యాలీని కోల్పోవచ్చు. కనుక వీటిని పట్టించుకోకుండా ప్రతీ నెలా ఎంత మొత్తాన్ని పొదుపు చేయాలనుకుంటే అంత మేరకు వెంటనే ప్రారంభించాలి. మీ పెట్టుబడుల విలువను చూడకుండా మూడేళ్లపాటు అనుకున్నట్టుగా ఇన్వెస్ట్‌చేస్తూ వెళ్లండి. ఆరంభం ఇలానే ఉండాలి. ఒకవేళ సరైన సమయంలో ప్రవేశించాలని, మార్కెట్ పతనం కోసం వేచి చూస్తే ఆ పనిచేయడం కష్టమే అవుతుంది. మార్కెట్లు పడిపోవడం మొదలవగానే అప్పుడు కూడా పెట్టుబడులు పెట్టకుండా ఒక స్థాయి వరకు పడిపోయి స్థిరపడే వరకు చూద్దాంలే అని అనుకుంటారు. ఈ తరహా ఆలోచనల నుంచి బయటకు రావాలి. ప్రారంభంలో ప్రతీ రోజూ మార్కెట్ కదలికలను చూడకుండా పెట్టుబడులు పెడుతూ వెళ్లాలి. ప్రశ్న: బంగారాన్ని పెట్టుబడిగా ఎందుకు పరిగణిస్తుంటారు? ఇది ఎంత భద్రం, పెట్టుబడిగా ఇది మంచి సాధనమేనా? - అర్చనా సావిత్రి సమాధానం: బంగారం అన్నది భౌతిక రూపంలో ఉంటూ, ధరించేందుకు అనుకూలమైనది కావడంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. దీనికి చారిత్రక, సాంస్కృతిక, సంప్రదాయాల విలువ కూడా తోడవుతుంది. చారిత్రకంగా చూస్తే భూమి తప్ప బంగారం మాదిరిగా విలువ కాపాడుకోగలిగినది మరొకటి లేదు. అయితే, కష్ట సమయాల్లో బంగారం మాదిరి భూమిని వినియోగించుకోవడం కష్టం. బంగారం నిజంగా నిల్వ చేసినా, విలువతో ఉండే సాధనమే. కానీ, పెట్టుబడులకు ఇది మంచి సాధనం కాదు. దీనికంటే కూడా ఈక్విటీ, స్థిరాదాయ పథకాలు మరింత ఉత్పాదకతతో ఉంటాయని నేను నమ్ముతాను. బంగారం ఆభరణాల గురించి మాట్లాడేట్టు అయితే వాటిని వినియోగంగానే చూడాల్సి ఉంటుంది. ఆభరణాలపై తయారీ చార్జీలు, లావాదేవీల, ఇతర చార్జీలన్నవి 10-20 శాతం వరకు ఉంటాయి. అంటే రూ.లక్ష బంగారం కొంటున్నారంటే నిజంగా రూ.80,000 విలువ బంగారాన్నే పొందుతున్నట్టుగా అర్థం చేసుకోవాలి. ప్రశ్న: పనిచేసే సంస్థ నుంచి హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీ ఉన్నప్పటికీ ఉద్యోగి సొంతంగానూ ఒక హెల్త్‌ప్లాన్ కలిగి ఉండాలనడం ఎందుకని?- శ్రీరామ్ రామనాథన్ సమాధానం: ఇందుకు రెండు కారణాలను మీరు గమనించాల్సి ఉంటుంది. మీ సంస్థ ఇస్తున్న ఇన్సూరెన్స్ కవరేజీ సంపూర్ణంగా, తగినంతగా లేకపోవడం. ఉదాహరణకు రూ.3 లక్షల కవరేజీ ఇస్తుందనుకుంటే..అది చాలదనే చెప్పుకోవాలి. కనీసం రూ.5 లక్షల కవరేజీ అయినా అవసరం. అలాగే, పనిచేసే సంస్థ ఇస్తున్న హెల్త్ ఇన్సూరెన్స్ సమగ్రంగా లేకపోవచ్చు. ఉదాహరణకు మీకు వృద్ధులైన తల్లిదండ్రులు ఉంటే వారికి బీమాను పనిచేసే సంస్థ ఇవ్వకపోవచ్చు. లేదా వారికి కూడా తీసుకోవాలంటే ప్రీమియం భారీగా ఉండొచ్చు. అలాగే, మీకు అవసరమైన అన్ని రకాల కవరేజీ ఆప్షన్లు ఉండకపోవచ్చు. వ్యక్తిగతంగా అయితే మీ అవసరాలను తీర్చే అనుకూలమైన హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవచ్చు. ఉద్యోగం మారినా, బీమా రక్షణ ఆగిపోకుండా చూసుకోవచ్చు. ప్రశ్న: మ్యూచువల్ ఫండ్స్ తాము పెట్టుబడులు పెట్టిన కంపెనీల నుంచి అందుకున్న డివిడెండ్‌పై పన్ను చెల్లించాలా? ఎందుకు? - ఆర్కే శర్మ సమాధానం: మ్యూచువల్ ఫండ్స్ పన్నులు చెల్లించవు. రెండేళ్ల క్రితం వరకు డివిడెండ్ పంపిణీ పన్ను అమల్లో ఉండేది. వ్యక్తిగత ఇన్వెస్టర్, మ్యూచువల్ ఫండ్స్ ఇలా డివిడెండ్ ఎవరికి పంచినా దానిపై కంపెనీలే పన్ను లు చెల్లించేవి. దీంతో ఇన్వెస్టర్ చేతికి వచ్చే డివిడెండ్ పూర్తిగా పన్ను రహితంగా ఉండేది. కానీ, ఇప్పుడు ఇందులో మార్పు వచ్చింది. డివిడెండ్ స్వీకరించే ఇన్వెస్టరే పన్ను చెల్లించాల్సి ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్ తమ నిర్వహణలోని పెట్టుబడులకు సంబంధించి ఎటువంటి పన్నులు చెల్లించవు. ధీరేంద్ర కుమార్ - సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
ఈ బ్యాంకులో ఖాతా తెరిస్తే రూ. 25 లక్షల బీమా మీ సొంతం..!
కోవిడ్-19 రాకతో అనేక కుటుంబాలు చిన్నభిన్నమయ్యాయి. కరోనా వైరస్ కారణంగా అనేక కుటుంబాలు ఆర్థికంగా కూడా దెబ్బతిన్నాయి. అనేక కుటుంబాలు అప్పులు ఊబిలో చిక్కుకున్నాయి. ఇన్సురెన్స్ కలిగిన కుటుంబాలు కాస్త అప్పులబారిన పడకుండా నిలిచాయి. ప్రస్తుతం చాలా మంది హెల్త్ ఇన్సురెన్స్‌ల వైపు మొగ్గుచూపుతున్నారు. తాజాగా సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ సరికొత్త హెల్త్ అండ్ వెల్నెస్ సేవింగ్స్ అకౌంట్‌ను అందుబాటులోకి తెచ్చింది. బ్యాంకులో సేవింగ్ అకౌంట్‌ను తీసుకున్న ఖాతాదారులకు ఆకర్షనీయమైన వడ్డీ రేట్లను అందించనుంది. అంతేకాకుండా మూడు ప్రధాన ఆఫర్లను ఖాతాదారులకు సూర్యోదయ బ్యాంకు ఇవ్వనుంది. ఈ బ్యాంకులో ఖాతా తీసుకున్న ఖాతాదారులకు రూ. 25 లక్షల టాప్ అప్ ఆరోగ్య భీమా లభిస్తుంది. దీంతో పాటుగా వార్షిక ఆరోగ్య సంరక్షణ ప్యాకేజీ, ఆన్ కాల్ అత్యవసర అంబులెన్స్ వైద్య సంరక్షణ సేవలను సూర్యోదయ స్మాల్ ఫినాన్స్ బ్యాంకు అందిస్తుంది. అకౌంట్‌ను ఓపెన్ చేసిన ఒక సంవత్సర కాలంపాటు టాప్ ఆప్ హెల్త్ ఇన్సూరెన్స్, హెల్త్‌కేర్ ప్యాకేజీలను ఉచితంగా ఇవ్వనుంది. 2022 మార్చి 31 వరకు దేశవ్యాప్తంగా 102 ప్రదేశాలలో 20 కి.మీ దూరం వరకు ఉచిత అంబులెన్స్ సేవను ఖాతాదారులకు అందిస్తోంది. ఈ ఆఫర్లను పొందాలంటే ఖాతాదారులు సగటున నెలసరి బ్యాలెన్స్ రూ. 3 లక్షల వరకు మెయింటెన్ చేయాల్సి ఉంటుందని బ్యాంకు పేర్కొంది. అంతేకాకుండా హెల్త్ డిక్లరేషన్ ఫారమ్‌కు అనుగుణంగా ఖాతాదారుడు అర్హతను సాధించాల్సి ఉంటుంది. హెల్త్ అండ్ వెల్నెస్ సేవింగ్ ఖాతా ప్రయోజనాలు.. కాంప్లిమెంటరీ టాప్-అప్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ రూ. 25 లక్షలు. 5 లక్షల కంటే ఎక్కువ వైద్య ఖర్చులు అయితేనే ఈ అమౌంట్‌ను పొందవచ్చును. ఈ హెల్త్ ఇన్సూరెన్స్‌తో సెల్ఫ్‌తో పాటుగా భార్యకు, ఇద్దరి పిల్లలకు వర్తించనుంది. ఉచితంగా ఆన్లైన్ డాక్టర్ సంప్రదింపులు, ఉచిత ఆరోగ్య పరీక్షలు, ఆన్లైన్ ఫార్మసీ వోచర్లు, నెట్వర్క్ డిస్కౌంట్ కార్డ్‌తో సహా నలుగురు సభ్యుల వరకు టాప్ అప్ హెల్త్ ఇన్సూరెన్స్ అందుబాటులో ఉండనుంది. మార్చి 31, 2022 వరకు ఎమర్జెన్సీ అంబులెన్స్ సేవలు. సేవింగ్ అకౌంట్‌పై 6.25 శాతం వడ్డీ లభిస్తుంది. ఖాతాదారులకు రూపే ప్లాటినం డెబిట్ కార్డును అందిస్తోంది. ఖాతాదారులు ఏటీఎమ్ నుంచి ప్రతిరోజు రూ. 1.5 లక్షల వరకు నగదును విత్‌డ్రా చేయవచ్చును. -
ఆరోగ్య బీమా బాదుడు,భారీగా పెరిగిన ప్రీమియం ధరలు
న్యూఢిల్లీ: కరోనా కవచ్, కరోనా రక్షక్.. ఈ రెండు రకాల బీమా పాలసీలు కరోనా కారణంగా ఏర్పడే వైద్య వ్యయాలను గట్టెక్కేందుకు తీసుకొచ్చిన పథకాలు. బీమా రంగ నియంత్రణ సంస్థ (ఐఆర్డీఏఐ) సూచనల మేరకు గతేడాది ఏప్రిల్ తర్వాత వీటిని బీమా సంస్థలు మార్కెట్లోకి తీసుకొచ్చాయి. అయితే, కరోనా రెండో విడతలో ఇన్ఫెక్షన్ కేసులు భారీగా పెరిగిపోవడంతో.. వాటి రూపంలో పెద్ద ఎత్తున క్లెయిమ్‌లు ఎదురవుతున్నాయి. వీటి రూపేణా వచ్చే ప్రీమియంతో పోలిస్తే చెల్లింపులు అధికంగా ఉంటుండడంతో బీమా సంస్థలు ఇలా అయితే లాభం లేదనుకుని.. బీమారంగ నియంత్రణ సంస్థ (ఐఆర్డీఏఐ) అనుమతితో అన్ని రకాల హెల్త్ పాలసీల ప్రీమియం ధరలను భారీగా పెంచేశాయి. ఈ పెంపు 50 శాతాన్ని కూడా దాటిపోయింది. మరీ ముఖ్యంగా కరోనా ఈ పాలసీల విక్రయం నుంచి కంపెనీలు వెనకడుగు వేస్తున్నాయి. అన్ని రకాల సాధారణ బీమా కంపెనీలు, ఆరోగ్య బీమా సంస్థలు కరోనా కవరేజీ పాలసీలను తప్పనిసరిగా తీసుకురావాలంటూ, వాటి పునరుద్ధరణకు వీలు కల్పించాలంటూ (రెన్యువల్) ఐఆర్డీఏఐ గతేడాది ఆదేశాలు జారీ చేసింది. అప్పటికే ఆరోగ్య బీమా కలిగిన వారికి కరోనా కవరేజీని కూడా భాగం చేస్తూ లేని వారి కోసం ప్రత్యేక పాలసీల రూపకల్పనకు నిర్దేశించింది. దీని ఫలితమే కరోనా కవచ్, కరోనా రక్షక్ పాలసీలు. ఈ పాలసీల చెల్లుబాటును 2021 సెప్టెంబర్ 30 వరకు పొడిగిస్తూ ఈ ఏడాది మార్చిలో తాజా ఆదేశాలను కూడా జారీ చేసింది. దీంతో ఇప్పటికే ఈ పాలసీలను తీసుకున్న వారికి రెన్యువల్‌ను తిరస్కరించడం కుదరదు. దీంతో బీమా సంస్థలు కొత్తవారికి ఈ పాలసీల మంజూరు విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నట్టు బ్రోకరేజీ సంస్థలు, పంపిణీదారులు పేర్కొంటున్నారు. చదవండి : Vijaya Diagnostic: పబ్లిక్ ఇష్యూకి సిద్ధం ప్రోత్సాహకాల్లేవు.. ‘‘దేశంలో రోజువారీ కరోనా కేసులు 30,000 స్థాయిలో ఉన్నప్పుడు బీమా సంస్థలు ఈ ప్రత్యేకమైన పాలసీలను ప్రవేశపెట్టాయి. ఇప్పుడు అన్ని పెద్ద రాష్ట్రాల్లోనూ రోజువారీగా ఇదే స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. ఈ ప్లాన్లు నష్టాలు తెచ్చేవిగా తేలిపోయింది. వీటి విక్రయాలపై ప్రోత్సాహకాలను ఇవ్వడం లేదు. కంపెనీలకు అవకాశం ఇస్తే వీటిని వెంటనే నిలిపివేస్తాయి’’ అని ఓ ప్రముఖ ఇన్సూరెన్స్ బ్రోకరేజీ సంస్థ తెలిపింది. చాలా బీమా సంస్థలు ఈ ప్రత్యేకమైన కరోనా పాలసీలను ఆన్లైన్లో విక్రయించడాన్ని ఇప్పటికే నిలిపివేశాయి. విక్రయాలను నిరుత్సాహపరిచేందుకు ఏజెంట్ కమీషన్లను కోత పెట్టాయి. ప్రీమియం టారిఫ్‌లను గణనీయంగా పెంచేసినట్టు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఆన్లైన్లో పాలసీల అమ్మకాలు నిలిపివేయడంతో పాలసీలను తీసుకునేందుకు బీమా సంస్థల కార్యాలయాలను నేరుగా సంప్రదించాల్సి వస్తుంది. ప్రస్తుతానికి కేవలం నాలుగు బీమా సంస్థలే ఆన్లైన్లో కరోనా పాలసీలను విక్రయిస్తున్నట్టు బేషక్ డాట్ ఓఆర్జీ నిర్వహించిన సర్వేలో తెలిసింది. న్యూ ఇండియా అష్యూరెన్స్, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్, ఆదిత్య బిర్లా జనరల్ ఇన్సూరెన్స్, రహేజా క్యూబీఈ సంస్థలు ప్రస్తుతం ఆన్లైన్లో ఈ పాలసీలను ఆఫర్ చేస్తున్నాయి. మిగిలిన సంస్థలు ఆన్లైన్ పోర్టళ్లపై కరోనా బీమా పాలసీల విక్రయాన్ని నిలిపివేయడంతోపాటు.. వీటి కోసం సమీపంలోని తమ కార్యాలయాలను సంప్రదించాలని సూచిస్తున్నట్టు బేషక్ సంస్థ సీఈవో మహావీర్ చోప్రా పేర్కొన్నారు. ప్రీమియం క్యాలిక్యులేటర్లను కూడా కొన్ని తొలగించినట్టు చెప్పారు. ప్రీమియం మరింత ప్రియం వరుణ్ వయసు 43 సంవత్సరాలు. ప్రైవేటు రంగంలో పనిచేస్తున్నాడు. రూ.5లక్షల కవరేజీతో ఏడాది క్రితమే ఫ్యామిలీ ఫ్లోటర్ ఇండెమ్నిటీ ప్లాన్‌ను ఓ ప్రైవేటు బీమా సంస్థ నుంచి తీసుకున్నాడు. ప్రీమియం రూ.15,054 రూపాయలను మొదటి ఏడాది చెల్లించాడు. ఈ ఏడాది జూన్‌లో రెన్యువల్ చేసుకోవాల్సి ఉంది. ప్రీమియం చెల్లింపునకు ఇంకా గడువు ఉండగా.. మీ పాలసీ ప్రీమియంను ఏడాదికి రూ.23,104కు సవరిస్తున్నట్టు బీమా సంస్థ నుంచి మెయిల్ వచ్చింది. అది చూసి వరుణ్ షాక్ అయ్యాడు. ఆరోగ్య బీమా ప్రీమియం భవిష్యత్తులో పెరుగుతుందని తెలుసుకానీ.. ఒక్క ఏడాదికే 50 శాతం బాదుడేంటి.. ఇలా అయితే భవిష్యత్తులో ప్రీమియం కట్టగలమా? అన్న సంశయంలో వరుణ్ ఉండిపోయాడు. వరుణ్‌కు మాత్రమే ఎదురైన అనుభవం కాదిది. ఇప్పటికే ఆరోగ్య బీమా ప్లాన్లను తీసుకున్న వారికి ప్రీమియంను కంపెనీలు భారీగా పెంచేశాయి. అదే సమయంలో కొత్తగా ఆఫర్ చేస్తున్న ప్లాన్లపై పెంపును మోస్తరుకు పరిమితం చేశాయి. ఒక్కసారి ముగ్గులోకి దిగిన తర్వాత చూసుకుందాంలేనన్నట్టు బీమా కంపెనీల ధోరణి కనిపిస్తోంది. తర్వాత తగ్గిస్తారా..? కరోనా వైరస్ కారణంగా క్లెయిమ్‌లు గణనీయంగా పెరిగిన మాట నిజమే. కానీ, కరోనా శాశ్వతంగా ఉంటుందా? అందరికీ వ్యాక్సినేషన్ పూర్తయ్యి, హెర్డ్ ఇమ్యూనిటీ ఏర్పడిన తర్వాత వైరస్ బలహీనపడిపోతుందని, సాధారణ ఫ్లూ మాదిరిగా మారిపోతుందని నిపుణులే చెబుతున్నారు. గట్టిగా మరో ఏడాది, రెండేళ్లలో కరోనా ముప్పు తొలగిపోతుంది. ఆ తర్వాత ఈ స్థాయిలో క్లెయిమ్‌లు ఉండవుగా? టీకాలు వేసేకొద్దీ వైరస్ కారణంగా ఆస్పత్రిపాలయ్యే వారి సంఖ్య కూడా తగ్గుముఖం పడుతుంది. దాంతో క్లెయిమ్‌లు కూడా తగ్గుతాయి. మరి ఇప్పుడు కరోనా పేరు చెప్పి పెంచిన ప్రీమియంను ఆ తర్వాత తగ్గిస్తాయా? కంపెనీలు వ్యాపార ధోరణితో అడ్డగోలుగా వ్యవహరిస్తున్నట్టు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
మీకు ‘క్రిటికల్’ కవచం ఉందా?
ఉదయ్ ప్రైవేటు రంగంలో పనిచేస్తున్నాడు. వయసు 46ఏళ్లు. అప్పటి వరకు ఎటువంటి అనారోగ్యాల్లేవు. ఓ రోజు తెల్లవారుజామున బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో వెంటనే సమీపంలోని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి తీసుకెళ్లడంతో ప్రాణాలు నిలిచాయి. కానీ, బిల్లు రూ.11 లక్షలు అయ్యింది. కానీ, ఉదయ్‌కు రూ.5లక్షల వరకే హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీ ఉంది. అందులోనూ రూ.40 వేల వరకు కవరేజీ రాలేదు. దీంతో రూ.6.40 లక్షలను తన జేబు నుంచి చెల్లించుకోవాల్సి వచ్చింది. మారుతున్న వైద్య ఖర్చులకు తగ్గ రక్షణ లేకపోతే పడే ఆర్థిక భారం ఎలా ఉంటుందన్నది ఈ ఉదాహరణ చూసి తెలుసుకోవచ్చు. మారిన జీవనశైలి, ఆహార అలవాట్లు, శారీరక శ్రమ లోపించడం, పని ఒత్తిళ్లు ఇవన్నీ కలసి ఎప్పుడు ఏ అనారోగ్యం బారిన పడతామో ఊహించలేకుండా ఉంది. అందుకే తమవంతుగా రక్షణ కల్పించుకోవాల్సిన అవసరం ప్రతీ ఒక్కరిపైన ఉంది. ఆ వివరాలే ఈ వారం ప్రాఫిట్ ప్లస్ కథనం.. కేన్సర్, మూత్రపిండాల వ్యాధులు, కాలేయం లేదా గుండె సంబంధిత తీవ్ర వ్యాధుల బారిన పడితే ఆ బాధ ఒక్కరికే పరిమితం కాదు. ఆ కుటుంబం మొత్తంపైనా ప్రభావం ఉంటుంది. ఆర్థికంగానే కాదు, శారీరకంగా, మానసికంగా నలిగిపోవాల్సి వస్తుంది. మంచి చికిత్స కోసం ఆస్పత్రిని ఎంపిక చేసుకోవడంతోపాటు కావాల్సిన నిధులను సమకూర్చుకోవడం శక్తికి మించిన పనిగా అనిపిస్తుంది. కుటుంబానికి ఆధారమైన వ్యక్తి తీవ్ర అనారోగ్యం బారిన పడితే అప్పటి వరకూ ప్రతీ నెలా వచ్చిన ఆదాయానికి కూడా బ్రేక్ పడొచ్చు. శాశ్వత ఉద్యోగ నష్టం ఏర్పడితే ఆర్థికంగా ఆ కుటుంబం సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి రావచ్చు. అందుకే ప్రతీ ఒక్కరికీ ముందు జాగ్రత్త, రక్షణ చర్యలు అవసరం. తీవ్ర అనారోగ్య సమస్యలన్నవి (క్రిటికల్ ఇల్నెస్) ఏ స్థాయిలో ఉంటాయో ఊహించలేము. ఉదాహరణకు కేన్సర్ మూడోదశలో ఉన్నవారికి దీర్ఘకాలం జీవించి ఉండే అవకాశాలు తక్కువ. కేన్సర్ రెండో దశలోనే బయటపడితే ఖర్చు ఎక్కువే పెట్టుకోవాల్సి వస్తుంది. గుండెపోటు తీవ్ర స్థాయిలో వస్తే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. మూ త్ర పిండాల సమస్యలు వెలుగు చూస్తే దీర్ఘకాలం పాటు కొనసాగొచ్చు. గుండెజబ్బులు కూడా దీర్ఘకాలం పాటు కొనసాగేవే అధికం. అందుకే వీటి విషయంలో సన్నద్ధత అవసరమని నిపుణులు సూ చిస్తుంటారు. కొన్ని వ్యాధుల్లో దీర్ఘకాలం పాటు చికిత్సలు అవసరం ఏర్పడతాయి. గుండె జబ్బులు, కేన్సర్, స్ట్రోక్, పక్షవాతం, మూత్రపిండాల వైఫల్యం తదితర క్లిష్టమైన అనారోగ్యాలను మన దేశంలో ఎక్కువగా చూస్తున్నాం. భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) నివేదిక ప్రకారం.. దేశంలో కేన్సర్ కేసులు 2025 నాటికి 15.7 లక్షలకు (వార్షిక రేటు) పెరుగుతాయని అంచ నా. ప్రస్తుత 13.9 లక్షలతో పోలిస్తే 12% పెరగనున్నాయి. దేశంలో ప్రతీ నాలుగు మరణాల్లో ఒక టి గుండె జబ్బుల కారణంగానే నమోదవుతోంది. మనదేశంలో 2018 నాటికి 1.29 కోట్ల జనాభా తీవ్రమైన కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నట్టు అంచనా. ఆర్థిక భారం ఎంతో.. తీవ్ర అనారోగ్య సమస్యల్లో చికిత్సా వ్యయాలు కూడా అధికంగానే ఉంటుంటాయి. ఎందుకంటే ఈ తరహా వ్యాధుల్లో దీర్ఘకాలం పాటు చికిత్సలు అవసరంపడతాయి. ‘‘కేన్సర్ అయితే ఒక్క విడత శస్త్రచికిత్స లేదా కీమోథెరపీతో సరిపోదు. దీర్ఘకాలం పాటు చికిత్స చేయాల్సి ఉంటుంది’’ అని మ్యాక్స్‌బూపా హెల్త్ ఇన్సూరెన్స్ అండర్రైటింట్ డైరెక్టర్ బబతోష్ మిశ్రా తెలిపారు. కేన్సర్ చికిత్సల కోసం రూ.15–20 లక్షలు ఖర్చు అవుతుందని.. అత్యాధునిక చికిత్సలు తీసుకునేట్టు అయితే ఈ వ్యయం రూ.కోటి వరకు కూడా పెరిగిపోవచ్చని చెప్పారు. ‘‘గుండె జబ్బులకు చికిత్స కోసం మెట్రో ల్లోని ప్రైవేటు ఆస్పత్రుల్లో రూ.1.5–15 లక్షల వరకు ఖర్చవుతుంది. స్టెంట్, బైపాస్ సర్జరీ లేదా వాల్వ్ మార్చడంపై ఈ వ్యయం ఎంతన్నది ఆధారపడి ఉంటుంది’’అని ఎడెల్వీజ్ టోకియో లైఫ్ ముఖ్య పంపిణీ అధికారి అనూప్శేత్ పేర్కొన్నారు. వైద్య రంగంలో ద్రవ్యోల్బణం 15 శాతానికి పైగా ఉంటోంది. అంటే చికిత్సల వ్యయాలు ఏటేటా ఈ స్థాయిలో పెరిగిపోతున్నాయని అర్థం చేసుకోవచ్చు. టైర్–2, టైర్ 3 పట్టణాలతో పోలిస్తే టైర్–1 పట్టణాల్లో చికిత్సల వ్యయాలు మరింత ఎక్కువగా ఉంటున్నాయి. కనుక 35 ఏళ్లు దాటిన వారు, తీవ్ర అనారోగ్య సమస్యల చరిత్ర ఉన్న కుటుంబాల్లోని వారికి తప్పకుండా ముందస్తు ప్రణాళిక అవసరం. ప్రణాళిక ప్రకారం.. ఆరోగ్యం విషయంలో ఊహించని ఖర్చులను తట్టుకునేందుకు ప్రతీ ఒక్కరికీ ప్రణాళిక అవసరం. ‘‘తీవ్ర అనారోగ్యాల విషయమై ముందు జాగ్రత్త పడే వారు 3 రకాల వ్యయాలను పరిగణనలోకి తీసుకోవాలి. మొదటిది హాస్పిటలైజేషన్. ఆస్పత్రి లో చేరాల్సి వస్తే ఎదురయ్యే ఖర్చులను బేసిక్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ సాయంతో గట్టెక్కవచ్చు. కొన్ని వ్యాధులకు దీర్ఘకాలం పాటు ఔషధాలు, పరీక్షలు అవసరంపడతాయి. కానీ, ఇండెమ్నిటీ ప్లాన్లు అన్నవి ఒక్కసారి ఒక అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరి క్లెయిమ్ చేశాక.. అదే ఏడాది మళ్లీ అదే అనారోగ్యానికి సంబంధించి పరిహారం అం దించవు. కనుక క్రిటికల్ ఇల్నెస్ పాలసీ అవసరం. మూడోది ఉద్యోగం కోల్పోవాల్సి వస్తే ఎదురయ్యే నష్టాన్ని భర్తీ చేసుకునేలా ఉండాలి’’ అని ముంబైకి చెందిన ఫైనాన్షియల్ ప్లానర్ పంకజ్ మాల్డే సూచన. అందుకే భిన్న రకాల బీమా ప్లాన్లకుతోడు అత్యవసర నిధి కూడా అవసరం అని గుర్తించాలి. హెల్త్ ఇన్సూరెన్స్.. సాధారణ హెల్త్ ఇన్సూరెన్స్ప్లాన్లనే ఇండెమ్నిటీ ప్లాన్లు అని కూడా అంటారు. ఇవి ఆస్పత్రిలో చేరి తీసుకునే చికిత్సలకు పరిహారం చెల్లిస్తాయి. జీవితంలో ఏ దశలో ఉన్నారు, ఏ పట్టణంలో నివసిస్తున్నారు, అక్కడ చికిత్సల వ్యయాలు ఏ విధంగా ఉన్నాయి, కుటుంబ ఆరోగ్య చరిత్ర అంశాల ఆధారంగా బేసిక్ ఇండెమ్నిటీ కవరేజీని నిర్ణయించుకోవాలి. ఢిల్లీ, ముంబై వంటి టైర్–1 పట్టణాల్లో అయితే రూ.20–25 లక్షల కవరేజీతో ప్లాన్ తీసుకోవాలన్నది నిపుణుల సూచన. ‘‘ఈ కవరేజీ కూడా నూరు శాతం రక్షణనివ్వదు. ఎందుకంటే కొన్ని చికిత్సల ఖర్చులు భారీగా ఉన్నాయి. ఉదాహరణకు లివర్ మార్పిడి చికిత్సకు రూ.40–50లక్షలు అవుతుంది’’ అని ఫైనాన్షియల్ ప్లానర్ పంకజ్మాల్డే వివరించారు. టైర్–2, 3 పట్టణాల్లో ఉంటే కనీసం రూ.10 లక్షలు, అదే చిన్న పట్టణాల్లోని వారు కనీసం రూ.5లక్షల బేసిక్ ఇండెమ్నిటీ ప్లాన్ తీసుకోవడం అవసరం. అధిక కవరేజీతో ప్లాన్ తీసుకోవాలంటే అందుకు ప్రీమియం కూడా ఎక్కువే చెల్లించాల్సి వస్తుంది. దీనికి బదులు తక్కువ మొత్తంతో బేసిక్ ప్లాన్ తీసుకుని, అధిక కవరేజీనిచ్చే టాపప్ ప్లాన్ జోడించుకోవడం మంచి ఆలోచన అవుతుంది. రూ.5 లక్షల ప్లాన్ తీసుకుని, రూ. 15 లక్షల టాపప్ జోడించ వచ్చు. లేకుండా వస్తుంటాయి. కొన్ని కంపెనీలు స్వల్ప ప్రీమియం ను కూడా వసూ లు చేస్తున్నాయి. క్రిటికల్ ఇల్నెస్ కవరేజీ ఇండెమ్నిటీ ప్లాన్‌కు పూర్తి భిన్నమైనది. బీమా ప్లాన్ జాబితాలోని తీవ్ర అనారోగ్యాల్లో ఏవైనా నిర్ధారణ అయితే అప్పుడు ఏకమొత్తంలో పరిహారాన్ని చెల్లించేదే క్రిటికల్ ఇల్నెస్ ప్లాన్. బేసిక్ హెల్త్ ప్లాన్‌లో కవర్ కాని ఖర్చులను ఈ ప్లాన్ ఆదుకుంటుంది. ఉద్యోగం ఆగిపోవడం లేదా కోల్పోవడం వల్ల ఆదాయ నష్టాన్ని ఈ రూపంలో కాస్తంత అయినా భర్తీ చేసుకోవచ్చు. ఒక వ్యక్తి తన వార్షిక స్థూల ఆదాయానికి 5–10 రెట్ల వరకు కవరేజీతో క్రిటికల్ ఇల్నెస్ ప్లాన్ తీసుకోవడం సూచనీయం. అయితే క్రిటికల్ ఇల్నెస్ ప్లాన్‌లో ఒక నిబంధన విషయమై కచ్చితంగా అవగాహన కలిగి ఉండాలి. సాధారణంగా క్రిటికల్ ఇల్నెస్ వెలుగు చూసిన తర్వాత సదరు రోగి కనీసం ఇన్ని రోజుల పాటు జీవించి ఉంటేనే పరిహారం చెల్లిస్తామనే నిబంధన ఉంటుంది. సాధారణంగా 30 రోజుల కాలాన్ని బీమా సంస్థలు అమలు చేస్తున్నాయి. ఉదాహరణకు స్ట్రోక్ వచ్చి చనిపోతే పరిహారం రాదు. స్ట్రోక్ వచ్చి 30 రోజులు ప్రాణాలతో ఉంటేనే ఈ ప్లాన్‌లో పరిహారం లభిస్తుంది. వాస్తవానికి తీవ్ర అనారోగ్యంతో జీవించి ఉన్న వారికే భారీగా ఖర్చు ఎదురవుతుందన్న వాస్తవాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. 30 క్రిటికల్ ఇల్నెస్ల వరకూ కవరేజీనిచ్చే ప్లాన్లు మార్కెట్లో ఉన్నాయి. కేన్సర్ లేదా గుండె జబ్బుల వంటి వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉన్నవారు ఆయా వ్యాధులకు కవరేజీనిచ్చే క్రిటికల్ ఇల్నెస్ ప్లాన్లను ఎంచుకోవాలి. ప్రతీ క్రిటికల్ ఇల్నెస్లోనూ విడిగా ఏఏ సమస్యలకు కవరేజీ ఉంటుందన్న వివరాలు పాలసీ వర్డింగ్స్ డాక్యుమెంట్లో వివరంగా ఉంటుంది. ఎక్కువ రిస్క్‌లు ఉండే గుండె జబ్బులు, కేన్సర్, స్ట్రోక్, కోమా, మూత్రపిండాల వైఫల్యం తదితర వాటికి కవరేజీ తప్పకుండా ఉండేలా ప్లాన్‌ను ఎంపిక చేసుకోవడం మంచిది. పరిశీలన తర్వాతే..: నియమ, నిబంధనలను కచ్చితంగా చదివిన తర్వాతే క్రిటికల్ఇల్నెస్ ప్లాన్‌ను ఎంపిక చేసుకోవాలి. బీమా రంగ నియంత్రణ సంస్థ (ఐఆర్డీఏఐ) మార్గదర్శకాలను చూస్తే.. కొన్ని రకాల తీవ్ర అనారోగ్య సమస్యలకే పూర్తి కవరేజీ లభిస్తుంది. కొన్నింటి విషయంలో చివరి దశలోనే పరిహారానికి అవకాశం ఉంటుంది. మూత్రపిండాలు, లివర్ సమస్యల్లో అయితే క్రిటికల్ ఇల్నెస్ కవరేజీ అన్నది కేవలం పనిచేయని, పూర్వపు స్థితికి తీసుకురాలేట్టయితేనే కవరేజీ లభిస్తుంది. అదే కేన్సర్, స్ట్రోక్, గుండెపోటు అయితే ఏ దశలో ఉన్నప్పటికీ క్రిటికల్ ఇల్నెస్ ప్లాన్లలో కవరేజీ లభిస్తుంది. లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లకు రైడర్ రూపంలో వచ్చే క్రిటికల్ ఇన్లెస్ ప్లాన్లు కూడా ఉన్నాయి. వీటికంటే కూడా విడిగా ప్లాన్‌ను తీసుకోవడం వల్ల సమగ్రమైన కవరేజీతో వస్తాయి. వీటిల్లో పరిమితులు కూడా తక్కువగా ఉంటాయి. ఉదాహరణకు కేన్సర్ మూడో దశలోనే పరిహారం చెల్లిస్తామన్న నిబంధన ఉంటే, స్టేజ్–2 బయటపడినప్పటికీ పరిహారం రాదు. అందుకే వైద్యం కోసం ప్రత్యేకంగా అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవాలి. ‘‘కనీసం రూ.3–5 లక్ష లు అయినా ఉండాలి. మెట్రోల్లో ఉండే వారికి రూ.8–10 లక్షలు అత్యవసర నిధిగా ఉంచుకోవడం అవసరం’’ అని మాల్డే సూచించారు. తీవ్ర వ్యాధులకు చికిత్సా వ్యయాలు కేన్సర్ ► శస్త్రచికిత్సకు రూ.3–6 లక్షలు ► కీమోథెరపీ ఒక్కో సెషన్‌కు రూ.50,000–2లక్షలు. సుమారు రూ.5–10 లక్షల వరకు ఖర్చు ► రేడియోథెరపీ రూ.2–20లక్షలు గుండె జబ్బులు ► యాంజియోగ్రఫీ రూ.20,000 ► యాంజియోప్లాస్టీ రూ.2.5–6.5లక్షలు ► వాల్వ్ సర్జరీ రూ.2.5–6లక్షలు ► బైపాస్ సర్జరీ రూ.2–5లక్షలు మూత్రపిండాల వైఫల్యం ► డయాలసిస్ రూ.2,000–5,000 ప్రతీ సెషన్‌కు (వారానికి మూడు పర్యాయాలు) ► మూత్రపిండాల మార్పిడి రూ.5–10లక్షలు ► బ్రెయిన్‌స్ట్రోక్ రూ.5–10 లక్షలు నోట్: ప్రాంతాలను బట్టి ఈ వ్యయాల్లో మార్పులు ఉంటుంటాయి. హెల్త్ ప్లాన్ ప్రీమియం ప్లాన్ కవరేజీ ప్రీమియం (రూ.లలో) (రూ.లలో) బేసిక్ ఇండెమ్నిటీ ప్లాన్ 10 లక్షలు 8,265 క్రిటికల్ ఇల్నెస్ ప్లాన్ 30 లక్షలు 4,551 నోట్: 30 ఏళ్ల ఢిల్లీ నివాసికి సంబంధించిన అంచనాలు -
అమెజాన్ వర్తకులకు కోవిడ్-19 ఆరోగ్య బీమా
నమోదిత వర్తకులకు కోవిడ్-19 ఆరోగ్య బీమా ఉచితంగా కల్పిస్తున్నట్టు ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ గురువారం ప్రకటించింది. ఇందులో భాగంగా రూ.50,000 వరకు కవరేజ్ ఉంటుందని వెల్లడించింది. బీమా సంస్థ ఆకో జనరల్ ఇన్సూరెన్స్‌తో అమెజాన్ ఈ మేరకు ఒప్పందం చేసుకుంది. ఈ గ్రూప్ ఇన్సూరెన్స్ కాల పరిమితి ఒక ఏడాది ఉంటుంది. 2020 జనవరి 1 నుంచి 2021 మే 1 మధ్య అమెజాన్.ఇన్ పోర్టల్‌లో నమోదైన వర్తకులు అర్హులు. వర్తకులు తమ పేర్లను 30 రోజుల్లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. వీరికి యూనిక్ హెల్త్ ఐడెంటిఫికేషన్ సంఖ్యను బీమా సంస్థ కేటాయిస్తుంది. క్లెయిమ్, రీఇంబర్స్మెంట్స్ కోసం ఈ నంబరును వినియోగించాల్సి ఉంటుంది. ఇంటి వద్ద ఉండి చికిత్స తీసుకున్నా బీమా వర్తిస్తుంది. మహమ్మారి వేళ వర్తకుల ఆరోగ్య బీమాకు అయ్యే ఖర్చును తామే భరిస్తున్నామని అమెజాన్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ మనీశ్ తివారీ ఈ సందర్భంగా తెలిపారు. గతేడాది సైతం అమెజాన్ తన వర్తకులకు కోవిడ్-19 ఆరోగ్య బీమా కల్పించింది. చదవండి: వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం తీపికబురు -
క్యాష్‌లెస్ క్లెయిమ్ తిరస్కరిస్తే.. కుదరదు
కరోనా రెండో విడతలో ఇన్ఫెక్షన్ కారణంగా ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య పెరుగుతోంది. ఆరోగ్య బీమా కలిగిన వారు సాధారణంగా నెట్వర్క్ ఆస్పత్రుల్లో నగదు రహిత వైద్య చికిత్సలను పొందొచ్చు. కానీ, ప్రస్తుత కరోనా మహమ్మారి కాలంలో చాలా ఆస్పత్రులు నగదు చెల్లించేవారికే చికిత్సలు అందిస్తూ బీమా ప్లాన్లపై నగదు రహిత వైద్య సేవలను తిరస్కరిస్తున్నాయి. దీంతో ఐఆర్డీఏఐ జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. నగదు రహిత కరోనా చికిత్సల క్లెయిమ్‌లను తిరస్కరించొద్దంటూ బీమా కంపెనీలకు ఆదేశాలు జారీ చేసింది. ఆస్పత్రులతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు పాలసీదారులకు నగదు రహిత వైద్య చికిత్సలు అందేలా చూడాలని కోరింది. కొన్ని నెట్వర్క్ ఆస్పత్రులు కరోనా చికిత్సలకు అధిక రేట్లను వసూలు చేయడమే కాకుండా.. నగదునే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఆస్పత్రుల వైఖరి వల్ల పాలసీదారులకు ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రా ణాలను కాపాడుకోవాల్సిన పరిస్థితుల్లో నగదు కోసం పాట్లు పడేలా పరిస్థితులను ఆస్పత్రులు మార్చేశాయి. ఇటువంటి ప్రతికూలతలు ఎదురైతే పాలసీదారుల ముందున్న మార్గాలేంటో చూద్దాం... బీమా సంస్థలు, ఆస్పత్రులు కుదుర్చుకున్న సేవల ఒప్పందాన్ని అమలు చేసే దిశగా బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ) ఇప్పటికే రెండు పర్యాయాలు సర్క్యులర్లను జారీ చేసింది. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించి.. నిబంధనలను పాటించాలంటూ ఆస్పత్రులను కోరింది. ‘‘నగదు రహిత చికిత్సలు అందుబాటులో ఉన్నట్టు పాలసీదారు గుర్తించినట్టయితే.. పాలసీ ఒప్పందం మేరకు ఆయా నెట్వర్క్ ఆస్పత్రిలో నగదు రహిత వైద్యం పాలసీదారుకు అందేలా బీమా సంస్థలు చర్యలు తీసుకోవాలి’’ అని తన ఉత్తర్వుల్లో ఐఆర్డీఏఐ కోరింది. నగదు రహిత వైద్యాన్ని ఆస్పత్రి తిరస్కరిస్తే.. అందుకు వీలు కల్పించాలని కోరుతూ పాలసీదారులు థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్ (బీమా సంస్థ తరఫున క్లెయిమ్ సేవలు అందించే మూడో పక్షం/టీపీఏ)కు అధికారికంగా తెలియజేయాలి. అప్పటికీ నగదు రహిత వైద్యం లభించకపోతే.. ఆస్పత్రికి వ్యతిరేకంగా బీమా సంస్థకు నేరుగా ఫిర్యాదు దాఖలు చేయాలి. నగదు రహిత వైద్యం పాలసీదారులకు ఎంతో శ్రమను తప్పిస్తుంది. కనుక ఒక నెట్వర్క్ ఆస్పత్రి ఈ సేవను తిరస్కరించినట్టయితే.. అత్యవసర పరిస్థితుల్లో ఎక్కువ సమయం వేచి చూసే పరిస్థితి ఉండదు. అటువంటి సందర్భాల్లో మరో నెట్వర్క్ ఆస్పత్రికి వెళ్లి నగదు రహిత చికిత్సలను తీసుకోవడం ఒక పరిష్కారం. దీనివల్ల పాలసీదారులు తమ జేబుల నుంచి భారీగా వ్యయం చేయాల్సిన ఇబ్బంది తప్పుతుంది. ఆస్పత్రులు అంగీకరించిన ధరలనే వసూలు చేసేలా చూడాలని కూడా బీమా సంస్థలను ఐఆర్డీఏఐ కోరింది. ‘‘నెట్వర్క్ ఆస్పత్రులు అంగీకరించిన ధరలకే పాలసీదారులకు చికిత్సలు అందించేలా బీమా సంస్థలు చూడాలి. ఎటువంటి అదనపు చార్జీలు తీసుకోకుండా చూడాలి. ఒకవేళ ఒప్పందానికి విరుద్ధంగా నగదు రహిత చికిత్సలకు తిరస్కరిస్తే, ఆయా ఆస్పత్రులపై తగిన చర్యలు తీసుకోవాలి’’ అని ఐఆర్డీఏఐ కో రింది. ఒకవేళ ఆస్పత్రులు అధికంగా చార్జీలు వసూలు చేసినట్టయితే ఆ తర్వాత ఫిర్యాదు దాఖలు చేయడం ద్వారా వాటి సంగతి తేల్చవచ్చు. మంచి ఆస్పత్రి అని భావిస్తుంటే, నగదు రహిత చికిత్సలను తిరస్కరించిన సందర్భంలో నగదు చెల్లించి ఆ తర్వాత రీయింబర్స్మెంట్ పొందడం ఒక్కటే మార్గం. ఇతర ఆస్పత్రులు నగదు రహిత చికిత్సలకు తిరస్కారం ఎదురైన సందర్భాల్లో బీమా కంపెనీ నెట్వర్క్ జాబితాలో లేని ఆస్పత్రికి సైతం వెళ్లొచ్చు. ఎందుకంటే చికిత్సల వ్యయాలను సొంతంగా భరించి, ఆ తర్వాత రీయింబర్స్మెంట్ చేసుకోవడమే కనుక ఎక్కడైనా రిజిస్టర్డ్ హాస్పిటల్లో వైద్య సేవలను పొందొచ్చు. ముఖ్యంగా ఆయా క్లిష్ట సందర్భాల్లో ప్రాణాలను కాపాడుకోవడాన్ని ప్రాధాన్య అంశంగా చూడాలి. అందుకే కీలక సమయంలో కాలయాపనకు బదులు ప్రత్యామ్నాయ మార్గాలను ఆశ్రయించడం మంచిది. నిధులు సర్దుబాటు అయితే అందుబాటులోని ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకున్న తర్వాత రీయింబర్స్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. క్లెయిమ్ వచ్చేందుకు నెల వరకు సమయం తీసుకుంటుంది. ఆస్పత్రిపై ఫిర్యాదు నగదు రహిత వైద్యం తిరస్కరణపై ఐఆర్డీఏఐ తీవ్రంగా స్పందించింది. ఎటువంటి ఆటంకాల్లేని సేవలు లభించేందుకు నెట్వర్క్ ఆస్పత్రులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులకు ఏర్పాట్లు చేసుకోవాలని బీమా కంపెనీలకు సూచించింది. పాలసీదారుల ఫిర్యాదులకు కచ్చితమైన పరిష్కారం అందించాలని.. చట్టపరమైన చర్యల కోసం స్థానిక అధికార యంత్రాంగం దృష్టికి ఆయా ఆస్పత్రుల వ్యవహారాలను తీసుకెళ్లాలని కోరింది. ఒకవేళ ఆస్పత్రుల వ్యవహారశైలి పట్ల సంతృప్తిగా లేకపోతే బీమా సంస్థకు, స్థానిక అధికార యంత్రాగానికి పాలసీదారులు కూడా ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదు దాఖలు ఎలా..? ఫిర్యాదును దాఖలు చేయడమే కాదు.. తగిన పరిష్కారాన్ని పొందడమూ ముఖ్యమే. పాలసీదారులు ముందుగా బీమా సంస్థకు చెందిన పాలసీదారుల ఫిర్యాదుల పరిష్కార విభాగాన్ని సంప్రదించాలి. 15 రోజుల్లోపు బీమా సంస్థ నుంచి సరైన పరిష్కారం లభించకపోయినా, పరిష్కారం పట్ల సంతృప్తి లేకపోయినా అప్పుడు సమగ్ర ఫిర్యాదుల పరిష్కార విభాగం రూపంలో ఐఆర్డీఏఐ దృష్టికి సమస్యను తీసుకెళ్లొచ్చు. ఈ పోర్టల్‌లో (https://igms.irda. gov.in/) పాలసీదారులు తమ వివరాలతో నమోదు చేసుకోవాలి. అనంతరం లాగిన్ అయ్యి ఫిర్యాదును దాఖలు చేయడంతోపాటు పురోగతిని తెలుసుకోవచ్చు. అలాగే ఈ మెయిల్ (complaints@irdai.gov.in) రూపంలో నూ ఐఆర్‌డీఏఐకి ఫిర్యాదు చేయవచ్చు. 1800 4254 732 టోల్‌ఫ్రీ నంబర్లో సంప్రదించొచ్చు. -
సంపూర్ణ ఆరోగ్య రక్షణ మీకుందా..?
ఈ రోజుల్లో బీమా పాలసీ లేకుండా వైద్య చికిత్సల ఖర్చులను భరించడం సామాన్యుల వల్ల అయ్యే పని కాదు. ఏటేటా వైద్య ఖర్చులు అనూహ్యంగా పెరిగిపోతున్న తరుణంలో ప్రతీ ఒక్కరి ప్రణాళికలో ఆరోగ్య బీమా (హెల్త్ పాలసీ) అవసరం ఎంతో ఉంది. అలా అని ఏదో నామమాత్రపు కవరేజీతో హెల్త్ పాలసీ తీసుకుని.. ‘హమ్మయ్య నాకు హెల్త్ కవరేజీ ఉందిలే’ అని అనుకోవద్దు. ఎందుకంటే మధ్య వయసు నుంచి వృద్ధాప్యానికి చేరువవుతున్న కొద్దీ అనారోగ్య సమస్యలు, జీవనశైలి వ్యాధుల ముప్పు ఎక్కువవుతుంది. కనుక 20ల్లో తీసుకున్న కవరేజీయే జీవితాంతం సరిపోతుందని అనుకోవద్దు. అంతేకాదు ఒక్కొక్కరి జీవన విధానం, జీవనశైలి వేర్వేరుగా ఉండొచ్చు. కొందరికి జీవనశైలి వ్యాధుల ముప్పు ఎక్కువగా ఉంటుంది. అందుకే వయసుకు తగ్గ హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీ (బీమా రక్షణ) అవసరం. అప్పటికే పలు వ్యాధులతో బాధపడుతుంటే.. ఎదురయ్యే ఖర్చులను తీర్చే స్థాయిలో బీమా రక్షణ ఉండాలి. ఇక కోవిడ్–19 వైరస్‌కు ప్రైవేటులో చికిత్స తీసుకోవాల్సి వస్తే పేదలు, మధ్యతరగతి వారు లబోదిబోమనే పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తోంది. ఎందుకంటే రోజుకు రూ.లక్ష వరకు వసూలు చేస్తున్న కార్పొరేట్ ఆస్పత్రులు కొన్ని ఉన్నాయి. దీంతో కోవిడ్ చికిత్సకు ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించాలంటే భయపడే పరిస్థితి. ఈ పరిణామాలు సైతం హెల్త్ ఇన్సూరెన్స్‌పాలసీ అవసరాన్ని గుర్తు చేస్తున్నాయి. 20–30 మధ్య వయస్సువారు... సాధారణంగా జీవనశైలి ఆరోగ్యంగానే ఉంటుంది. అయినప్పటికీ వైద్యపరంగా అత్యవసర పరిస్థితి ఏర్పడితే అందుకు సన్నద్ధమై ఉండాలి. కనుక ఇండివిడ్యువల్ హెల్త్ పాలసీ తీసుకోవాలి. ఆస్పత్రిలో చేరాల్సి వస్తే ఇది ఆదుకుంటుంది. ఔట్ పేషెంట్ చికిత్సలకు కవరేజీ ఇచ్చే పాలసీ మంచిది. పెరిగే వయసు, వైద్య ద్రవ్యోల్బణానికి తగ్గట్టు బీమా కవరేజీ పెంచుకునే ఆప్షన్ తప్పకుండా ఉండాలి. ఐఆర్డీఏఐ ఆదేశాలతో చాలా బీమా కంపెనీలు ఆరోగ్య సంజీవని పేరుతో ఓ ప్రామాణిక హెల్త్ పాలసీని తీసుకొచ్చాయి. కనుక యువత ఈ ప్లాన్‌ను పరిశీలించొచ్చు. మెట్రో నగరాలు, టైర్–1 పట్టణాల్లో ఉంటుంటే కవరేజీ కనీసం రూ.5లక్షలు, ఇతర పట్టణాల్లో ఉంటున్న వారు రూ.3 లక్షలు ఉండేలా ఎంచుకోవాలి. ఇక ఉద్యోగం ఉండి, తరచూ ప్రయాణాలు చేయాల్సి ఉంటే, రిస్క్ ఎక్కువ ఉండే రంగాల్లో పనిచేస్తుంటే.. ప్రమాదాల కారణంగా ఏర్పడే వైకల్యానికి... యాక్సిడెంటల్ డిజేబిలిటీ రైడర్ తీసుకోవాలి. కవరేజీ రూ.20 లక్షలు అయినా ఉండాలి. 30ప్లస్‌లోకి చేరితే... ఈ వయసులో వైవాహిక జీవితంలోకి ప్రవేశించడంతోపాటు తల్లిదండ్రులు అవుతుంటారు. కనుక మొత్తం కుటుంబానికి హెల్త్ కవరేజీ అవసరం. అప్పటికే తీసుకున్న ఆరోగ్య బీమా ప్లాన్‌ను ఫ్యామిలీ ఫ్లోటర్‌గా మార్చుకోవాలి. ఆ అవకాశం లేకపోతే అదే కంపెనీలో లేదా మరో మంచి కంపెనీలో ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీని ఎంచుకోవాలి. ముఖ్యంగా మెటర్నిటీ కవరేజీ, పుట్టిన బేబీకి కూడా ఆటోమేటిక్ కవరేజీ లభించే ప్లాన్‌ను ఎంచుకోవాలి. కనీసం రూ.3 నుంచి రూ.5 లక్షలు అయినా బీమా రక్షణ ఉండేలా చూసుకోవాలి. దీనికి అదనంగా రూ.10–20 లక్షల కవరేజీతో టాపప్ ప్లాన్ తీసుకోవాలి. అప్పుడు బేసిక్ కవరేజీకి మించి ఆస్పత్రి బిల్లు అయితే టాపప్ ప్లాన్ నుంచి చెల్లింపులు వెళ్లిపోతాయి. అదే విధంగా యాక్సిడెంటల్ డిజేబిలిటీ కవరేజీ తప్పక ఉండాలి. 40–50 మధ్యకు ఉన్నట్టయితే... ఈ వయసులోని వారి పిల్లలు ఎదుగుతుంటారు. దీంతో ఒత్తిళ్లు పెరిగిపోతుండడం సహజం. ఫలితంగా జీవనశైలి వ్యాధుల రిస్క్ పెరుగుతుంది. అంటే గుండెపోటు, మధుమేహం వాటి రిస్క్ ఉంటుంది. కనుక ఆరోగ్యకరమైన ఆహార, జీవన అలవాట్లు ఉండేలా చూసుకోవాలి. ప్రీమియం భారంగా మారుతున్నా కానీ ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్‌ను తప్పకుండా కొనసాగించుకోవాలి. అదనంగా కనీసం రూ.10–20 లక్షల టాపప్ ప్లాన్ ఉండాలి. దీనికి అదనంగా రూ.20–30 లక్షలతో క్రిటికల్ ఇల్నెస్ ప్లాన్‌ను తీసుకోవడం అవసరం. ఈ ప్లాన్ తీసుకున్న వారికి.. గుండెపోటు, క్యాన్సర్, స్ట్రోక్, మూత్రపిండాల వైఫల్యం తదితర తీవ్ర వ్యాధుల్లో ఏవైనా నిర్ధారణ అయితే వెంటనే పూర్తి కవరేజీని ఏక మొత్తంలో బీమా సంస్థ చెల్లించేస్తుంది. అదే విధంగా యాక్సిడెంటల్ డిజేబిలిటీ కవర్ రూ.25 లక్షలు అవసరం. 50 ప్లస్‌లోకి వచ్చేస్తే.. 50–60 మధ్యలో ఉన్న వారి పిల్లలు ఉన్నత విద్యకు చేరువ కావడం, ఉద్యోగాల్లోకి చేరిపోవడం చూస్తుంటాం. పిల్లలు 18 ప్లస్‌లోకి చేరిపోతే వారికంటూ ఇండివిడ్యువల్ ప్లాన్ తీసుకుని, దంపతుల వరకే ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్ కొనసాగించుకోవడం లేదా వారు సైతం ఇండివిడ్యువల్ ప్లాన్‌కు పోర్టింగ్ పెట్టుకోవడం చేయవచ్చు. ప్రీమియం భారం తగ్గేట్టు ఉంటేనే మారడం సరైనది. లేకపోతే ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీని అలాగే కొనసాగించుకోవాలి. ఇక ఈ వయసులో బాధ్యతలు తీరిపోతే ప్రమాద వైకల్య బీమా అవసరం అంతగా ఉండనట్టే. కాకపోతే మీకున్న హెల్త్ ప్లాన్ జీవితాంతం రెన్యువల్ చేసుకునే ఆప్షన్‌తో ఉండేలా జాగ్రత్త పడడం ఎంతో అవసరం. కనీసం రూ.5 లక్షల కవరేజీ, దీనికి అదనంగా రూ.20 లక్షల టాపప్ ప్లాన్ ఉంటే మంచిది. అదే విధంగా రూ.30 లక్షలతో క్రిటికల్ ఇన్నెస్ ప్లాన్ కూడా తీసుకోవాలి. 60 ఏళ్లు దాటితే.. ఉద్యోగులకు రిటైర్మెంట్ వయసు ఇది. వృత్తి, వ్యాపారాల్లోని వారికి మాత్రం ఆర్జనా శక్తి కొనసాగుతుంది. ఈ వయసులో దాదాపు పిల్లలకు సంబంధించిన బాధ్యతలన్నీ పూర్తయి ఉంటాయి. ఈ వయసులో వైద్య ఖర్చులు పెరుగుతుంటాయి. కనుక ఆరోగ్యపరంగా అత్యవసర పరిస్థితులకు సన్నద్ధం కావాలి. హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు ల్యాప్స్ అవకుండా ప్రీమియం ఆటోమేటిగ్గా బ్యాంకు ఖాతా నుంచి డెబిట్ అయ్యే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. ఇక విడిగా దంపతులు ఇద్దరికీ హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోతే బెటర్. ఒకవేళ ప్రీమియం భారంగా అనిపిస్తే తమ పిల్లలు ఉద్యోగం చేస్తుంటే వారి సంస్థల నుంచి లభించే గ్రూపు హెల్త్ కవరేజీలో భాగస్వాములుగా చేరాలి. ఇటువంటి పాలసీల్లో ప్రీమియం తక్కువగా ఉంటుంది. బేసిక్ ప్లాన్‌కు అదనంగా రూ.15–25 లక్షలకు సూపర్ టాపప్ ప్లాన్ తీసుకోవాలి. అలాగే, రూ.20–30 లక్షలకు క్రిటికల్ ఇల్నెస్ ప్లాన్ కూడా ఉండే విధంగా చూసుకోవాలి. ఇవి తెలుసుకోవాలి... కోపే: ఆస్పత్రిలో చేరినప్పుడు అయ్యే బిల్లులో పాలసీదారు తను సొంతంగా చెల్లించాల్సిన మొత్తమే కోపే. ఉదాహరణకు రూ.5 లక్షల కవరేజీ పాలసీలో 10 శాతం కోపే షరతు ఉందనుకుంటే.. అప్పుడు ఆస్పత్రి బిల్లులో 10 శాతం పాలసీదారే భరించాల్సి వస్తుంది. మిగిలిన 90 శాతం బీమా సంస్థ చెల్లిస్తుంది. డిడక్టబుల్: ఇది కూడా ఒక విధంగా వైద్య ఖర్చుల్లో పాలసీదారు స్వయంగా భరించాల్సిన అంశమే. ఎప్పుడు ఆస్పత్రిలో చేరినా కానీ అయ్యే బిల్లులో నిర్ణీత మొత్తాన్ని మినహాయించి, ఆ తర్వాత మిగిలిన మేర బీమా సంస్థ చెల్లిస్తుంది. డిడక్టబుల్ అన్నది పాలసీ డాక్యుమెంట్లో పేర్కొనడం జరుగుతుంది. సెటిల్మెంట్ రేషియో: బీమా సంస్థకు వచ్చే క్లెయిమ్‌లలో (పరిహారం కోసం వచ్చే దరఖాస్తులు) ఎన్నింటికి చెల్లింపులు చేసింది, ఎన్నింటిని తిరస్కరించిందన్న వివరాలను ఇది తెలియజేస్తుంది. ఎక్స్‌క్లూజన్: బీమా పాలసీలో వేటికి కవరేజీ మినహాయించేది ఈ క్లాజులో వివరంగా ఉంటుంది. హెల్త్ పాలసీల్లో కొన్నింటికి మినహాయింపులు ఉంటాయి. ఫ్రీ లుక్ పీరియడ్: పాలసీ జారీ చేసిన తర్వాత సాధారణంగా 15 రోజుల కాలాన్ని ఫ్రీ లుక్ పీరియడ్‌గా పరిగణిస్తుంటారు. ఈ కాలంలో పాలసీ వద్దనుకుంటే అదే విషయాన్ని బీమా సంస్థకు తెలియజేస్తే ఎటువంటి చార్జీలు, పెనాల్టీలు లేకుండా ప్రీమియం వెనక్కి వచ్చేస్తుంది. -
కరోనా : పాలసీదారులకు గుడ్ న్యూస్
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ విజృంభణ, దేశ వ్యాప్త లాక్ డౌన్ నేపథ్యంలో పాలసీ దారులకు ఊరటనిస్తూ ఆర్థికమంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మోటారు , ఆరోగ్య బీమా చెల్లుబాటును ఏప్రిల్ 21 వరకు పొడిగించినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. లాక్ డౌన్ సమయంలో ఈ బీమా చెల్లింపుల పునరుద్ధరణ తేదీలు వచ్చే వ్యక్తుల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ గురువారం విడుదల చేసిన నోటిఫికేషన్ లో తెలిపింది. 2020 మార్చి 25 - ఏప్రిల్ 14 (లాక్ డౌన్ సమయం) మధ్యకాలంలో చెల్లింపులు చేయాల్సిన వాహన, ఆరోగ్య పాలసీ దారులకు భారీ ఉపశమనం కల్పించింది.ఈ ఉత్తర్వు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చినట్టు వెల్లడించింది. పాలసీ దారులు ప్రీమియం బకాయిలు మొత్తాన్ని ఏప్రిల్ 21 న లేదా అంతకన్నా ముందుగానీ చెల్లించవచ్చని మంత్రిత్వ శాఖ తెలిపింది. కరోనా నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా వారి పునరుద్ధరణ ప్రీమియాన్ని సకాలంలో చెల్లించలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో దేశంలో చట్టబద్ధమైన మోటారు వాహనం థర్డ్ పార్టీ భీమా కవరేజీని కొనసాగించాలని పేర్కొంది. 2020 ఏప్రిల్ 21 ని పాలసీ పునరుద్ధరణ తేదీగా పరిగణించాలని చెప్పింది. ఆరోగ్య బీమా పాలసీల విషయంలో కూడా ఇదే వర్తిస్తుందని ప్రకటించింది. చదవండి : (హెచ్డీఎఫ్సీ గ్రూప్ : రూ.150 కోట్ల సాయం) చైనా నగరంలో కుక్క మాంసంపై శాశ్వత నిషేధం (కరోనాపై పోరు : గూగుల్ భారీ సాయం) The government has provided relief for third-party auto insurance policy holders and health insurance policy holders in light of the #Covid19 situation. The relevant notifications are attached below. #IndiaFightsCorona pic.twitter.com/5YK86vdXBw — NSitharamanOffice (@nsitharamanoffc) April 2, 2020 -
ఆయుష్మాన్ భారత్‌తో 10 వేల ఉద్యోగాలు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆయుష్మాన్ భారత్–నేషనల్ హెల్త్ ప్రొటెక్షన్ మిషన్ (ఏబీ–ఎన్‌హెచ్‌పీఎం) పథకం ద్వారా కొత్తగా 10,000 ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నాయని అధికారులు వెల్లడించారు. పథకంలో భాగంగా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో రోగులు, లబ్ధిదారులకు వివరాలు తెలిపేందుకు సుమారు లక్ష మంది వరకు ఆయుష్మాన్ మిత్రలను నియమించనున్నామని చెప్పారు. రోగులకు సహకరిస్తూ ఆస్పత్రికి, లబ్ధిదారుల మధ్య సమన్వయకర్తలుగా ఆయుష్మాన్ మిత్రలు వ్యవహరిస్తారని.. పథకం కింద ఎంపికైన ప్రతి ఆస్పత్రిలో వీరు అందుబాటులో ఉంటారని, హెల్ప్ డెస్క్ నిర్వహిస్తారని వివరించారు. పథకం కింద ఇప్పటికే 20,000 ప్రైవేటు, ప్రభుత్వ ఆస్పత్రులు ఎంపికయ్యాయని.. లబ్ధిదారులను సామాజిక, ఆర్థిక కుల గణన సర్వే (ఎస్ఈసీసీ) ఆధారంగా ఎంపిక చేయనున్నామని పేర్కొన్నారు. లబ్ధిదారులందరికీ క్యూఆర్ కోడ్స్‌తో కూడిన లేఖను అందజేయనున్నారు. ఆయుష్మాన్ మిత్రల కోసం నైపుణ్య అభివృద్ధి శాఖతో ఆరోగ్య శాఖ ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకుంది. ఆయుష్మాన్ భారత్‌తో భాగంగా దేశవ్యాప్తంగా 10 కోట్ల పేద కుటుంబాలకు రూ. 5 లక్షల ఆరోగ్య బీమా కల్పించనున్న విషయం తెలిసిందే. -
ప్రతి కుటుంబానికి రూ. 5 లక్షల ఆరోగ్య బీమా
-
వైద్య ఖర్చులకు ప్రతి కుటుంబానికి రూ. 5 లక్షలు
సాక్షి, న్యూఢిల్లీ : ప్రజారోగ్యం పట్ల ప్రభుత్వం ప్రాధాన్యత కనబరుస్తుందని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. హెల్త్ వెల్నెస్ సెంటర్ల కోసం రూ. 1200 కోట్లు కేటాయించారు. పేదలకు ఒక్కో కుటుంబానికి ఏడాదికి రూ. 5 లక్షలు ఆరోగ్య బీమా కల్పిస్తామని, 10 కోట్ల కుటుంబాలకు దీన్ని వర్తింపచేస్తామని బడ్జెట్ ప్రసంగంలో జైట్లీ చెప్పారు. ప్రపంచంలోనే ప్రభుత్వ ఆధ్వర్యంలో చేపట్టే అతిపెద్ద ఆరోగ్య కార్యక్రమంగా ఈ పథకాన్ని ఆర్థిక మంత్రి అభివర్ణించారు. ఆయుష్మాన్‌భవ సహా పలు ఆరోగ్య కార్యక్రమాలు, పథకాలను పరిపుష్టం చేస్తామని చెప్పారు. ఆరోగ్య రక్షణ పథకాలను పలు రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయని, కానీ కావాల్సిన స్థాయిలో ఆరోగ్య సంరక్షణ అందించాలని తాము కోరుకుంటున్నట్టు జైట్లీ చెప్పారు. అంతేకాక 1.5 లక్షల ఆరోగ్య సంరక్షణ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్టు కూడా చెప్పారు. ఇవి ప్రతి ఒక్క గృహదారుడికి దగ్గరగా ఉంటాయని, ఈ సెంటర్లు ప్రజలకు అవసరమైన డ్రగ్స్‌ను, డయాగ్నోసిస్‌ను ఉచితంగా అందించనున్నట్టు తెలిపారు. ప్రభుత్వం ద్వారా ప్రజలకు హెల్త్ కవర్ అందుబాటులో ఉండే పథకం కెనడా దేశంలో అవలంభవుతోంది. ప్రస్తుతం మనదేశం కూడా ప్రజలకు మెడికల్ ఇన్సూరెన్స్ ఇచ్చేందుకు నిర్ణయించింది. మెడికల్ ఇన్సూరెన్స్‌తో పాటు కొత్తగా 24 మెడికల్ కాలేజీలను ఏర్పాటుచేయనున్నట్టు ప్రకటించారు. ప్రస్తుత కాలేజీలను కూడా ఆధునీకరించనున్నట్టు తెలిపారు. దీంతో దేశంలోని ప్రతి రాష్ట్రంలో ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఉండేలా చూసుకోనున్నారు. దీంతో ప్రజల ఆరోగ్యంపై కూడా ఈ సారి ప్రభుత్వం ఈసారి ఎక్కువగా దృష్టిసారించినట్టు తెలిసింది. -
బడ్జెట్ బొనాంజా : రూ 5 లక్షల ఆరోగ్య బీమా
సాక్షి, న్యూఢిల్లీ : రానున్న బడ్జెట్లో దేశ ప్రజలందరికీ రూ 5 లక్షల వరకూ ఆరోగ్య బీమా కల్పించేందుకు మోదీ సర్కార్ సన్నాహాలు చేస్తోందని ఓ హిందీ పత్రిక కథనాన్ని ప్రచురించింది. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆరోగ్య బీమా రంగానికి కేంద్రం పథకాల కోసం రూ 5000 కోట్లు కేటాయించవచ్చని భావిస్తున్నారు. ఆరోగ్య బీమా పథకాలకు ఈ నిధుల నుంచి కేంద్రం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వాలు 40 శాతం భరిస్తాయి. దేశ ప్రజలందరికీ రూ 5 లక్షల వరకూ ఆరోగ్య బీమా కల్పించేందుకు ప్రభుత్వం ఓ ట్రస్టును ఏర్పాటు చేసే అంశాన్నీ పరిశీలిస్తోంది. దారిద్ర్య రేఖకు దిగువన ఉండేవారికి, రూ 2 లక్షల లోపు వార్షికాదాయం కలిగిన వారికి, రూ 2 లక్షల పైగా వార్షికాదాయం కలిగిన వారికి వేర్వేరుగా కళ్యాణ్, సౌభాగ్య, సర్వోదయ స్కీమ్‌లను వర్తింపచేస్తారని ప్రభాత్ ఖబర్ కథనం పేర్కొంది. దారిద్ర్యరేఖకు దిగువన ఉండే క్యాటగిరీకి బీమా ప్రీమియంను ప్రభుత్వం భరిస్తుంది. రూ 2 లక్షల పైగా వార్షికాదాయం ఉన్నవారు నామమాత్ర ప్రీమియంతో ఈ పథకంలో చేరవచ్చు. ప్రస్తుతం దేశ జనాభాలో కేవలం 4 శాతం మందే ఆరోగ్య బీమాను కలిగిఉన్నారు. ఆరోగ్య బీమాను అందరికీ అందుబాటులోకి తేవడంతో పాటు 2019 ఎన్నికల్లో రాజకీయ లబ్ధికీ ఈ పథకం ఉపకరిస్తుందని మోదీ సర్కార్ భావిస్తోంది. -
ఆరోగ్య బీమా.. జాగ్రత్త సుమా
ఎంత త్వరగా తీసుకుంటే అంత మంచిది మనకు బీమా అవసరం రాకముందుగానే పాలసీ తీసుకోవడం మంచిది. ఎందుకంటే.. మనకు అవసరం పడినప్పుడు వైద్య బీమా లభించకపోవచ్చు. కనుక.. యుక్త వయసులో, సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నప్పుడే వైద్య బీమా పాలసీ తీసుకుంటే తక్కువ ప్రీమియానికే అధిక కవరేజి లభిస్తుంది. వయసు మీద పడ్డ తర్వాత కన్నా యుక్త వయసులో పాలసీ తీసుకున్నప్పుడు విస్తృతమైన కవరేజి లభిస్తుంది. వయసు పెరుగుతున్న కొద్దీ.. ప్రీమియంలు పెరుగుతాయి. ఒకవేళ అప్పటికే ఏదైనా అనారోగ్యం బారిన పడిన పక్షంలో, సదరు అనారోగ్యానికి కవరేజి లభించదు. ఫలితంగా మొత్తం పాలసీనే నిరర్థకమవుతుంది. చాలా కంపెనీల హెల్త్ ప్లాన్లకు నిర్దిష్టమైన ఎంట్రీ వయసుపై పరిమితి ఉంటుంది. అంటే, రిటైర్మెంట్ దగ్గరపడుతున్న కొద్దీ కవరేజీ పరిధి తగ్గిపోతుంటుంది. మరో విషయం.. ఏదైనా సంవత్సరంలో క్లెయిము చేయకపోయిన పక్షంలో పాలసీని రెన్యువల్ చే సుకునేటప్పుడు నో క్లెయిమ్ బోనస్ కూడా లభిస్తుంది. పన్ను ప్రయోజనాలు ఉంటాయి..కానీ.. వైద్య బీమా కోసం కట్టే ప్రీమియంల మీద పన్నుపరమైన ప్రయోజనాలు కూడా లభిస్తాయి. ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 80డీ కింద ఈ ప్రీమియాలకు పన్ను మినహాయింపులు వర్తిస్తాయి. మీ వయసు 65 ఏళ్ల కన్నా తక్కువ ఉంటే.. మీకు, మీ జీవిత భాగస్వామి, పిల్లలు, మీ తల్లిదండ్రుల కోసం కట్టే హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం కింద రూ. 15,000 దాకా మినహాయింపులను క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంది. అంతే కాదు.. తల్లిదండ్రులు సీనియర్ సిటిజన్స్ అయి ఉండి, వారికీ కవరేజీ ఉండేలా తీసుకున్న పక్షంలో గరిష్టంగా రూ. 20,000 దాకా పన్ను మినహాయింపులను క్లెయిమ్ చేసుకోవచ్చు. అయితే, కేవలం పన్ను ప్రయోజనాలను మాత్రమే దృష్టిలో పెట్టుకుని హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోకూడదు. మీకెంత కవరేజీ అవసరమవుతుందో ముందు అంచనా వేసుకోవాలి. ఇందుకోసం కావాలంటే బీమా సలహాదారు సహాయం తీసుకోవడం మంచిది. హెల్త్ ఇన్సూరెన్స్‌లో వివిధ రకాల కవరేజీలు ప్రధానంగా రెండు రకాల వైద్య బీమా కవరేజీలు ఉన్నాయి. అవి.. వ్యక్తిగత వైద్య బీమా ఇది చాలా సింపుల్ హెల్త్ ఇన్సూరెన్స్ పథకం. పాలసీదారు ఆస్పత్రి పాలైనప్పుడు సమ్ అష్యూర్డ్ పరిమితి దాకా బీమా కవరేజి లభిస్తుంది. ఉదాహరణకు.. నలుగురు సభ్యులున్న కుటుంబంలో ఒక్కొక్కరు విడిగా రూ. 3 లక్షలకు వైద్య బీమా తీసుకున్నారనుకుందాం. అప్పుడు చికిత్సా వ్యయం రూ.3 లక్షలు దాటినా కవరేజ్ కేవలం సమ్ అష్యూర్డ్ రూ.3 లక్షల వరకే లభిస్తుంది. అంతేకాని నలుగురుకి కలిపి రూ.12 లక్షల వరకు బీమా ఉన్నా దాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోలేము. అలా కాకుండా కుటుంబంలోని నలుగురు సభ్యులు ఒకేసారి ఆసుపత్రిపాలైతే మాత్రం ఒక్కొక్కరు వ్యక్తిగతంగా రూ. 3 లక్షలు చొప్పున మొత్తం రూ.12 లక్షలు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్.. హెల్త్ ఇన్సూరెన్స్‌కి సంబంధించి ఇది మరింత మెరుగైన పథకం. ఇది కుటుంబ సభ్యులందరికీ కూడా కవరేజీని అందిస్తుంది. సమ్ అష్యూర్డ్ పరిమితి దాకా మొత్తం కుటుంబానికి కవరే జీ లభిస్తుంది. ఒక్కొక్కరికీ ఒక్కో పథకం తీసుకున్న దానికన్నా అందరికీ కలిపి వర్తించేలా ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్ తీసుకుంటే ప్రీమియంలు తక్కువగా ఉంటాయి. ఉదాహరణకు.. మీ ఇంట్లో నలుగురు కుటుంబ సభ్యులు ఉన్నారనుకుందాం. అందరికీ కలిపి రూ. 5 లక్షలకు ఫ్యామిలీ ఫ్లోటర్‌ను తీసుకోవచ్చు. ఇప్పుడు కుటుంబంలోని ఒక్కొక్కరికీ గరిష్టంగా రూ. 5 లక్షల దాకా కవరేజీ ఉంటుంది. ఒకవేళ ఎవరైనా ఆస్పత్రి పాలై, వైద్య ఖర్చులు రూ. 3 లక్షలు అయ్యాయనుకుంటే.. ఆ మొత్తాన్ని బీమా కంపెనీ చెల్లిస్తుంది. మొత్తం కుటుంబం గురించి ఆలోచించినప్పుడు ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్ తీసుకోవడం మంచిది. ఎందుకంటే, తక్కువ ప్రీమియంతో ఒకే ప్లాన్ ద్వారా అందరికీ పెద్ద ఎత్తున కవరేజీ లభిస్తుంది. పైగా.. అంతా ఒకేసారి అనారోగ్యం పాలయ్యే అవకాశాలు తక్కువ కాబట్టి, ఇది మరింత లాభదాయకంగా ఉంటుంది. కాబట్టి, మీకు అనువైన హెల్త్ పాలసీని సాధ్యమైనంత త్వరగా తీసుకోవడం ఉత్తమం. మీకు అవసరం రాక ముందే పాలసీ కొనుక్కోండి.. అదీ యుక్తవయసులోనే తీసుకోండి. గ్రూప్ మెడిక్లెయిమ్.. ఎంత ఉపయోగం.. ప్రస్తుతం చాలా సంస్థలు బేసిక్ హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీని కల్పిస్తున్నాయి. అయినప్పటికీ.. మీరు వ్యక్తిగతంగా వైద్య బీమా తీసుకుని ఉంచుకోవడం మంచిది. ఎందుకంటే .. గ్రూప్ మెడిక్లెయిమ్ కింద కంపెనీ నుంచి బీమా కవరేజి లభించినప్పటికీ.. ఇలాంటి పాలసీల్లో సమ్ అష్యూర్డ్ పరిమాణం తక్కువగానే ఉంటుంది. వైద్య బీమా ఖర్చులు ఏటా పెరిగిపోతున్న నేపథ్యంలో తీవ్రమైన సమస్య వచ్చినప్పుడు ఈ కవరేజీ సరిపోకపోవచ్చు. ఒకవేళ మీ కంపెనీ గానీ బీమా పాలసీల వ్యయాలను తగ్గించుకోవాలనుకున్న పక్షంలో మొత్తానికే కవరేజీ లేకుండా పోవచ్చు. పలు గ్రూప్ మెడిక్లెయిమ్ పాలసీల్లో ఉండే నిర్దిష్ట నిబంధనల వల్ల కొన్ని సందర్భాల్లో పాలసీదారు సొంత జేబు నుంచి కొంత కట్టుకోవాల్సి కూడా రావొచ్చు. ప్రీమియం విషయంలో వయసు చాలా కీలక పాత్ర పోషిస్తుంది. వయసు పెరిగిన కొద్దీ.. ప్రీమియం పెరుగుతూ పోతుంది. కాబట్టి.. పర్సనల్ హెల్త్ పాలసీ ఎంత ముందుగా తీసుకుంటే అంత మంచిది.