
సాక్షి, న్యూఢిల్లీ : రానున్న బడ్జెట్‌లో దేశ ప్రజలందరికీ రూ 5 లక్షల వరకూ ఆరోగ్య బీమా కల్పించేందుకు మోదీ సర్కార్ సన్నాహాలు చేస్తోందని ఓ హిందీ పత్రిక కథనాన్ని ప్రచురించింది. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆరోగ్య బీమా రంగానికి కేంద్రం పథకాల కోసం రూ 5000 కోట్లు కేటాయించవచ్చని భావిస్తున్నారు. ఆరోగ్య బీమా పథకాలకు ఈ నిధుల నుంచి కేంద్రం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వాలు 40 శాతం భరిస్తాయి. దేశ ప్రజలందరికీ రూ 5 లక్షల వరకూ ఆరోగ్య బీమా కల్పించేందుకు ప్రభుత్వం ఓ ట్రస్టును ఏర్పాటు చేసే అంశాన్నీ పరిశీలిస్తోంది.
దారిద్ర్య రేఖకు దిగువన ఉండేవారికి, రూ 2 లక్షల లోపు వార్షికాదాయం కలిగిన వారికి, రూ 2 లక్షల పైగా వార్షికాదాయం కలిగిన వారికి వేర్వేరుగా కళ్యాణ్, సౌభాగ్య, సర్వోదయ స్కీమ్‌లను వర్తింపచేస్తారని ప్రభాత్ ఖబర్ కథనం పేర్కొంది. దారిద్ర్యరేఖకు దిగువన ఉండే క్యాటగిరీకి బీమా ప్రీమియంను ప్రభుత్వం భరిస్తుంది. రూ 2 లక్షల పైగా వార్షికాదాయం ఉన్నవారు నామమాత్ర ప్రీమియంతో ఈ పథకంలో చేరవచ్చు. ప్రస్తుతం దేశ జనాభాలో కేవలం 4 శాతం మందే ఆరోగ్య బీమాను కలిగిఉన్నారు. ఆరోగ్య బీమాను అందరికీ అందుబాటులోకి తేవడంతో పాటు 2019 ఎన్నికల్లో రాజకీయ లబ్ధికీ ఈ పథకం ఉపకరిస్తుందని మోదీ సర్కార్ భావిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment