హైదరాబాద్, బిజనెస్ బ్యూరో: కోవిడ్–19 మహమ్మారి నేపథ్యంలో జీవిత బీమా, ఆరోగ్య సంరక్షణ పాలసీలకు సంబంధించి తగినంత కవరేజీ ఉండాల్సిన అవసరంపై అవగాహన పెరిగిందని ప్రైవేట్ రంగ బీమా సంస్థ టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ చీఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫీసర్ వెంకటాచలం అయ్యర్ తెలిపారు. అలాగే జీవిత బీమా పథకాల్లో హెల్త్ రైడర్లు కూడా కీలకమని పాలసీదారులు గుర్తిస్తున్నారని తెలిపారు. ఎటువంటి అవాంతరాలు లేకుండా జీవిత బీమా, ఆరోగ్య బీమా కవరేజీతో పాటు పెట్టుబడులపై రాబడులు కూడా అందించే పాలసీలకు ఆదరణ మరింత పెరుగుతుందని సాక్షి బిజినెస్ బ్యూరోకు ఆయన వివరించారు. మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే..
టర్మ్ పాలసీలకు, దీర్ఘకాలికంగా గ్యారంటీ ఆదాయాన్నిచ్చే పాలసీలకు డిమాండ్ మెరుగుపడింది. రాబోయే రోజుల్లోనూ ఇదే ధోరణి కొనసాగవచ్చు. వీటితో పాటు పెన్షన్, యాన్యుయిటీ పథకాలపైనా ఆసక్తి కనిపిస్తోంది. ఇక జీవిత బీమా పథకాల్లో హెల్త్ రైడర్లు చాలా కీలకంగా ఉంటున్నాయి. అనుకోని విధంగా ఆస్పత్రి పాలైనా, తీవ్ర అనారోగ్యాల బారిన పడినా ఇవి ఆదుకుంటాయి. నామమాత్రమైన అదనపు ప్రీమియంతో ఇవి గణనీయంగా ప్రయోజనం చేకూర్చగలవు. వ్యాధి బైటపడిన పక్షంలో దానికి సంబంధించి తీసుకున్న రైడర్‌కు అనుగుణంగా సమ్ అష్యూర్డ్ మొత్తం పాలసీదారుకు అందుతుంది. మిగతా హెల్త్ కవర్ ఆప్షన్లలాగా కాకుండా.. సమ్ అష్యూర్డ్‌ను క్లెయిమ్ చేయడానికి చికిత్స బిల్లులు మొదలైనవి సమర్పించాల్సిన బాదరబందీ ఉండదు. హెల్త్ రైడర్లతో పలు రిస్క్ కవరేజీలను పాలసీదారులు ఎంచుకోవచ్చు. అందుకే జీవిత బీమా, సేవింగ్స్ పథకాలు తీసుకునేటప్పుడు తప్పనిసరిగా హెల్త్, ఇతర ప్రయోజనాలు అందించే రైడర్లు కూడా పరిశీలించాలని పాలసీదారులకు మేము సూచిస్తున్నాం.
టర్మ్ ఇన్సూరెన్స్ ప్రీమియంలు..కొత్త పాలసీలు
జీవిత బీమా ప్రీమియంల పెరుగుదల విషయానికొస్తే.. ఇది రీఇన్సూరెన్స్ వ్యయాలు మొదలైన పలు అంశాలపై ఆధారపడి ఉంటాయి. మాతో సహా పరిశ్రమలోని మిగతా సంస్థలు కూడా వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకునే ప్రీమియంలను నిర్ణయిస్తాయి. మేము సాధ్యమైనంతవరకూ విలువకు తగ్గ స్థాయిలో సమగ్రంగా ప్రయోజనాలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. కొత్త పాలసీల విషయానికొస్తే ఇటీవలే టాటా ఏఐఏ లైఫ్ ఫార్చూన్ గ్యారంటీ పెన్షన్ పేరిట సరళతరమైన యాన్యుటీ ప్లాన్ ప్రవేశపెట్టాం. పాలసీదారులు తమ అవసరాలకు అనుగుణమైన యాన్యుటీని పొందే విధంగా దీన్ని ఎంచుకోవచ్చు. అలాగే లైఫ్ ఇన్‌స్ట్రాపొటెక్ట్ అనే మరో కొత్త పాలసీలో లైఫ్ కవరేజీతో పాటు ఆస్పత్రి వ్యయాలు, క్రిటికల్ ఇల్‌నెస్, యాక్సిడెంటల్ డెత్ మొదలైన వాటికి సంబంధించిన ప్రయోజనాలు లభిస్తాయి.
ప్రస్తుత వ్యాపార పరిమాణం.. లక్ష్యాలు..
2021 మార్చి 31 నాటికి నిర్వహణలోని ఆస్తుల పరిమాణం (ఏయూఎం) అంతక్రితం ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఏకంగా 47 శాతం పెరిగింది. రూ. 31,450 కోట్ల నుంచి రూ. 46,281 కోట్లకు చేరింది. మార్నింగ్ స్టార్ అనే రీసెర్చ్ సంస్థ అంచనాల ప్రకారం మా ఏయూఎంలో 99.93 శాతం మొత్తానికి 4 స్టార్ లేదా 5 స్టార్ రేటింగ్ ఉంది. ఇదే ధోరణి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కూడా కొనసాగుతుందని ఆశిస్తున్నాం.
Comments
Please login to add a commentAdd a comment