సంపూర్ణ ఆరోగ్య రక్షణ మీకుందా..? | COVID-19 Health Insurance Policy | Sakshi
Sakshi News home page

సంపూర్ణ ఆరోగ్య రక్షణ మీకుందా..?

Published Mon, Jul 6 2020 4:55 AM | Last Updated on Mon, Jul 6 2020 4:55 AM

COVID-19 Health Insurance Policy - Sakshi

ఈ రోజుల్లో బీమా పాలసీ లేకుండా వైద్య చికిత్సల ఖర్చులను భరించడం సామాన్యుల వల్ల అయ్యే పని కాదు. ఏటేటా వైద్య ఖర్చులు అనూహ్యంగా పెరిగిపోతున్న తరుణంలో ప్రతీ ఒక్కరి ప్రణాళికలో ఆరోగ్య బీమా (హెల్త్‌ పాలసీ) అవసరం ఎంతో ఉంది. అలా అని ఏదో నామమాత్రపు కవరేజీతో హెల్త్‌ పాలసీ తీసుకుని.. ‘హమ్మయ్య నాకు హెల్త్‌ కవరేజీ ఉందిలే’ అని అనుకోవద్దు. ఎందుకంటే మధ్య వయసు నుంచి వృద్ధాప్యానికి చేరువవుతున్న కొద్దీ అనారోగ్య సమస్యలు, జీవనశైలి వ్యాధుల ముప్పు ఎక్కువవుతుంది. కనుక 20ల్లో తీసుకున్న కవరేజీయే జీవితాంతం సరిపోతుందని అనుకోవద్దు. అంతేకాదు ఒక్కొక్కరి జీవన విధానం, జీవనశైలి వేర్వేరుగా ఉండొచ్చు. కొందరికి జీవనశైలి వ్యాధుల ముప్పు ఎక్కువగా ఉంటుంది.

అందుకే వయసుకు తగ్గ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కవరేజీ (బీమా రక్షణ) అవసరం. అప్పటికే పలు వ్యాధులతో బాధపడుతుంటే.. ఎదురయ్యే ఖర్చులను తీర్చే స్థాయిలో బీమా రక్షణ ఉండాలి. ఇక కోవిడ్‌–19 వైరస్‌కు ప్రైవేటులో చికిత్స తీసుకోవాల్సి వస్తే పేదలు, మధ్యతరగతి వారు లబోదిబోమనే పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తోంది. ఎందుకంటే రోజుకు రూ.లక్ష వరకు వసూలు చేస్తున్న కార్పొరేట్‌ ఆస్పత్రులు కొన్ని ఉన్నాయి. దీంతో కోవిడ్‌ చికిత్సకు ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించాలంటే భయపడే పరిస్థితి. ఈ పరిణామాలు సైతం హెల్త్‌ ఇన్సూరెన్స్‌పాలసీ అవసరాన్ని గుర్తు చేస్తున్నాయి.

20–30 మధ్య వయస్సువారు...
సాధారణంగా జీవనశైలి ఆరోగ్యంగానే ఉంటుంది. అయినప్పటికీ వైద్యపరంగా అత్యవసర పరిస్థితి ఏర్పడితే అందుకు సన్నద్ధమై ఉండాలి. కనుక ఇండివిడ్యువల్‌ హెల్త్‌ పాలసీ తీసుకోవాలి. ఆస్పత్రిలో చేరాల్సి వస్తే ఇది ఆదుకుంటుంది. ఔట్‌ పేషెంట్‌ చికిత్సలకు కవరేజీ ఇచ్చే పాలసీ  మంచిది. పెరిగే వయసు, వైద్య ద్రవ్యోల్బణానికి తగ్గట్టు బీమా కవరేజీ పెంచుకునే ఆప్షన్‌ తప్పకుండా ఉండాలి. ఐఆర్‌డీఏఐ ఆదేశాలతో చాలా బీమా కంపెనీలు ఆరోగ్య సంజీవని పేరుతో ఓ ప్రామాణిక హెల్త్‌ పాలసీని తీసుకొచ్చాయి. కనుక యువత ఈ ప్లాన్‌ను పరిశీలించొచ్చు. మెట్రో నగరాలు, టైర్‌–1 పట్టణాల్లో ఉంటుంటే కవరేజీ కనీసం రూ.5లక్షలు, ఇతర పట్టణాల్లో ఉంటున్న వారు రూ.3 లక్షలు ఉండేలా ఎంచుకోవాలి. ఇక ఉద్యోగం ఉండి, తరచూ ప్రయాణాలు చేయాల్సి ఉంటే, రిస్క్‌ ఎక్కువ ఉండే రంగాల్లో పనిచేస్తుంటే.. ప్రమాదాల కారణంగా ఏర్పడే వైకల్యానికి... యాక్సిడెంటల్‌ డిజేబిలిటీ రైడర్‌ తీసుకోవాలి. కవరేజీ రూ.20 లక్షలు అయినా ఉండాలి.

30ప్లస్‌లోకి చేరితే...
ఈ వయసులో వైవాహిక జీవితంలోకి ప్రవేశించడంతోపాటు తల్లిదండ్రులు అవుతుంటారు. కనుక మొత్తం కుటుంబానికి హెల్త్‌ కవరేజీ అవసరం. అప్పటికే తీసుకున్న ఆరోగ్య బీమా ప్లాన్‌ను ఫ్యామిలీ ఫ్లోటర్‌గా మార్చుకోవాలి. ఆ అవకాశం లేకపోతే అదే కంపెనీలో లేదా మరో మంచి కంపెనీలో ఫ్యామిలీ ఫ్లోటర్‌ పాలసీని ఎంచుకోవాలి. ముఖ్యంగా  మెటర్నిటీ కవరేజీ, పుట్టిన బేబీకి కూడా ఆటోమేటిక్‌ కవరేజీ లభించే ప్లాన్‌ను ఎంచుకోవాలి. కనీసం రూ.3 నుంచి రూ.5 లక్షలు అయినా బీమా రక్షణ ఉండేలా చూసుకోవాలి. దీనికి అదనంగా రూ.10–20 లక్షల కవరేజీతో టాపప్‌ ప్లాన్‌ తీసుకోవాలి. అప్పుడు బేసిక్‌ కవరేజీకి మించి ఆస్పత్రి బిల్లు అయితే టాపప్‌ ప్లాన్‌ నుంచి చెల్లింపులు వెళ్లిపోతాయి. అదే విధంగా యాక్సిడెంటల్‌ డిజేబిలిటీ కవరేజీ తప్పక ఉండాలి.

40–50 మధ్యకు ఉన్నట్టయితే...
ఈ వయసులోని వారి పిల్లలు ఎదుగుతుంటారు. దీంతో ఒత్తిళ్లు పెరిగిపోతుండడం సహజం. ఫలితంగా జీవనశైలి వ్యాధుల రిస్క్‌ పెరుగుతుంది. అంటే గుండెపోటు, మధుమేహం వాటి రిస్క్‌ ఉంటుంది. కనుక ఆరోగ్యకరమైన ఆహార, జీవన అలవాట్లు ఉండేలా చూసుకోవాలి. ప్రీమియం భారంగా మారుతున్నా కానీ ఫ్యామిలీ ఫ్లోటర్‌ ప్లాన్‌ను తప్పకుండా కొనసాగించుకోవాలి. అదనంగా కనీసం రూ.10–20 లక్షల టాపప్‌ ప్లాన్‌ ఉండాలి. దీనికి అదనంగా రూ.20–30 లక్షలతో క్రిటికల్‌ ఇల్‌నెస్‌ ప్లాన్‌ను తీసుకోవడం అవసరం. ఈ ప్లాన్‌ తీసుకున్న వారికి.. గుండెపోటు, క్యాన్సర్, స్ట్రోక్, మూత్రపిండాల వైఫల్యం తదితర తీవ్ర వ్యాధుల్లో ఏవైనా నిర్ధారణ అయితే వెంటనే పూర్తి కవరేజీని ఏక మొత్తంలో బీమా సంస్థ చెల్లించేస్తుంది. అదే విధంగా యాక్సిడెంటల్‌ డిజేబిలిటీ కవర్‌ రూ.25 లక్షలు అవసరం.

50 ప్లస్‌లోకి వచ్చేస్తే..
50–60 మధ్యలో ఉన్న వారి పిల్లలు ఉన్నత విద్యకు చేరువ కావడం, ఉద్యోగాల్లోకి చేరిపోవడం చూస్తుంటాం. పిల్లలు 18 ప్లస్‌లోకి చేరిపోతే వారికంటూ ఇండివిడ్యువల్‌ ప్లాన్‌ తీసుకుని, దంపతుల వరకే ఫ్యామిలీ ఫ్లోటర్‌ ప్లాన్‌ కొనసాగించుకోవడం లేదా వారు సైతం ఇండివిడ్యువల్‌ ప్లాన్‌కు పోర్టింగ్‌ పెట్టుకోవడం చేయవచ్చు. ప్రీమియం భారం తగ్గేట్టు ఉంటేనే మారడం సరైనది. లేకపోతే ఫ్యామిలీ ఫ్లోటర్‌ పాలసీని అలాగే కొనసాగించుకోవాలి. ఇక ఈ వయసులో బాధ్యతలు తీరిపోతే ప్రమాద వైకల్య బీమా అవసరం అంతగా ఉండనట్టే. కాకపోతే మీకున్న హెల్త్‌ ప్లాన్‌ జీవితాంతం రెన్యువల్‌ చేసుకునే ఆప్షన్‌తో ఉండేలా జాగ్రత్త పడడం ఎంతో అవసరం. కనీసం రూ.5 లక్షల కవరేజీ, దీనికి అదనంగా రూ.20 లక్షల టాపప్‌ ప్లాన్‌ ఉంటే మంచిది. అదే విధంగా రూ.30 లక్షలతో క్రిటికల్‌ ఇన్‌నెస్‌ ప్లాన్‌ కూడా తీసుకోవాలి.

60 ఏళ్లు దాటితే..
ఉద్యోగులకు రిటైర్మెంట్‌ వయసు ఇది. వృత్తి, వ్యాపారాల్లోని వారికి మాత్రం ఆర్జనా శక్తి కొనసాగుతుంది. ఈ వయసులో దాదాపు పిల్లలకు సంబంధించిన బాధ్యతలన్నీ పూర్తయి ఉంటాయి. ఈ వయసులో వైద్య ఖర్చులు పెరుగుతుంటాయి. కనుక ఆరోగ్యపరంగా అత్యవసర పరిస్థితులకు సన్నద్ధం కావాలి. హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పాలసీలు ల్యాప్స్‌ అవకుండా ప్రీమియం ఆటోమేటిగ్గా బ్యాంకు ఖాతా నుంచి డెబిట్‌ అయ్యే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. ఇక విడిగా దంపతులు ఇద్దరికీ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ లేకపోతే బెటర్‌. ఒకవేళ ప్రీమియం భారంగా అనిపిస్తే తమ పిల్లలు ఉద్యోగం చేస్తుంటే వారి సంస్థల నుంచి లభించే గ్రూపు హెల్త్‌ కవరేజీలో భాగస్వాములుగా చేరాలి. ఇటువంటి పాలసీల్లో ప్రీమియం తక్కువగా ఉంటుంది. బేసిక్‌ ప్లాన్‌కు అదనంగా రూ.15–25 లక్షలకు సూపర్‌ టాపప్‌ ప్లాన్‌ తీసుకోవాలి. అలాగే, రూ.20–30 లక్షలకు క్రిటికల్‌ ఇల్‌నెస్‌ ప్లాన్‌ కూడా ఉండే విధంగా చూసుకోవాలి.

ఇవి తెలుసుకోవాలి...
కోపే: ఆస్పత్రిలో చేరినప్పుడు అయ్యే బిల్లులో పాలసీదారు తను సొంతంగా చెల్లించాల్సిన మొత్తమే కోపే. ఉదాహరణకు రూ.5 లక్షల కవరేజీ పాలసీలో 10 శాతం కోపే షరతు ఉందనుకుంటే.. అప్పుడు ఆస్పత్రి బిల్లులో 10 శాతం పాలసీదారే భరించాల్సి వస్తుంది. మిగిలిన 90 శాతం బీమా సంస్థ చెల్లిస్తుంది.

డిడక్టబుల్‌: ఇది కూడా ఒక విధంగా వైద్య ఖర్చుల్లో పాలసీదారు స్వయంగా భరించాల్సిన అంశమే. ఎప్పుడు ఆస్పత్రిలో చేరినా కానీ అయ్యే బిల్లులో నిర్ణీత మొత్తాన్ని మినహాయించి, ఆ తర్వాత మిగిలిన మేర బీమా సంస్థ చెల్లిస్తుంది. డిడక్టబుల్‌ అన్నది పాలసీ డాక్యుమెంట్‌లో పేర్కొనడం        జరుగుతుంది.   

సెటిల్‌మెంట్‌ రేషియో: బీమా సంస్థకు వచ్చే క్లెయిమ్‌లలో (పరిహారం కోసం వచ్చే దరఖాస్తులు) ఎన్నింటికి చెల్లింపులు చేసింది, ఎన్నింటిని తిరస్కరించిందన్న వివరాలను ఇది తెలియజేస్తుంది.   

ఎక్స్‌క్లూజన్‌: బీమా పాలసీలో వేటికి కవరేజీ మినహాయించేది ఈ క్లాజులో వివరంగా ఉంటుంది. హెల్త్‌ పాలసీల్లో కొన్నింటికి మినహాయింపులు ఉంటాయి.  

ఫ్రీ లుక్‌ పీరియడ్‌: పాలసీ జారీ చేసిన తర్వాత సాధారణంగా 15 రోజుల కాలాన్ని ఫ్రీ లుక్‌ పీరియడ్‌గా పరిగణిస్తుంటారు. ఈ కాలంలో పాలసీ వద్దనుకుంటే అదే విషయాన్ని బీమా సంస్థకు తెలియజేస్తే ఎటువంటి చార్జీలు, పెనాల్టీలు లేకుండా ప్రీమియం వెనక్కి వచ్చేస్తుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement