ఆరోగ్య బీమా బాదుడు,భారీగా పెరిగిన ప్రీమియం ధ‌ర‌లు | Increase Health Insurance Policy Due To Covid 19 | Sakshi
Sakshi News home page

ఆరోగ్య బీమా బాదుడు,భారీగా పెరిగిన ప్రీమియం ధ‌ర‌లు

Published Wed, Jun 9 2021 8:51 AM | Last Updated on Wed, Jun 9 2021 9:00 AM

Increase Health Insurance Policy Due To Covid 19 - Sakshi

న్యూఢిల్లీ: కరోనా కవచ్, కరోనా రక్షక్‌.. ఈ రెండు రకాల బీమా పాలసీలు కరోనా కారణంగా ఏర్పడే వైద్య వ్యయాలను గట్టెక్కేందుకు తీసుకొచ్చిన పథకాలు. బీమా రంగ నియంత్రణ సంస్థ (ఐఆర్‌డీఏఐ) సూచనల మేరకు గతేడాది ఏప్రిల్‌ తర్వాత వీటిని బీమా సంస్థలు మార్కెట్లోకి తీసుకొచ్చాయి. అయితే, కరోనా రెండో విడతలో ఇన్ఫెక్షన్‌ కేసులు భారీగా పెరిగిపోవడంతో.. వాటి రూపంలో పెద్ద ఎత్తున క్లెయిమ్‌లు ఎదురవుతున్నాయి. వీటి రూపేణా వచ్చే ప్రీమియంతో పోలిస్తే చెల్లింపులు అధికంగా ఉంటుండడంతో బీమా సంస్థలు ఇలా అయితే లాభం లేదనుకుని.. బీమారంగ నియంత్రణ సంస్థ (ఐఆర్‌డీఏఐ) అనుమతితో అన్ని రకాల హెల్త్‌ పాలసీల ప్రీమియం ధరలను భారీగా పెంచేశాయి. ఈ పెంపు 50 శాతాన్ని కూడా దాటిపోయింది. మరీ ముఖ్యంగా కరోనా ఈ పాలసీల విక్రయం నుంచి కంపెనీలు వెనకడుగు వేస్తున్నాయి. అన్ని రకాల సాధారణ బీమా కంపెనీలు, ఆరోగ్య బీమా సంస్థలు కరోనా కవరేజీ పాలసీలను తప్పనిసరిగా తీసుకురావాలంటూ, వాటి పునరుద్ధరణకు వీలు క‌ల్పించాలంటూ (రెన్యువల్‌) ఐఆర్‌డీఏఐ గతేడాది ఆదేశాలు జారీ చేసింది. అప్పటికే ఆరోగ్య బీమా కలిగిన వారికి కరోనా కవరేజీని కూడా భాగం చేస్తూ లేని వారి కోసం ప్రత్యేక పాలసీల రూపకల్పనకు నిర్దేశించింది. దీని ఫలితమే కరోనా కవచ్, కరోనా రక్షక్‌ పాలసీలు. ఈ పాలసీల చెల్లుబాటును 2021 సెప్టెంబ‌ర్‌ 30 వరకు పొడిగిస్తూ ఈ ఏడాది మార్చిలో తాజా ఆదేశాలను కూడా జారీ చేసింది. దీంతో ఇప్పటికే ఈ పాలసీలను తీసుకున్న వారికి రెన్యువల్‌ను తిరస్కరించడం కుదరదు. దీంతో బీమా సంస్థలు కొత్తవారికి ఈ పాలసీల మంజూరు విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నట్టు బ్రోకరేజీ సంస్థలు, పంపిణీదారులు పేర్కొంటున్నారు.  చ‌ద‌వండి : Vijaya Diagnostic: పబ్లిక్‌ ఇష్యూకి సిద్ధం
 

ప్రోత్సాహకాల్లేవు.. 

‘‘దేశంలో రోజువారీ కరోనా కేసులు 30,000 స్థాయిలో ఉన్నప్పుడు బీమా సంస్థలు ఈ ప్రత్యేకమైన పాలసీలను ప్రవేశపెట్టాయి. ఇప్పుడు అన్ని పెద్ద రాష్ట్రాల్లోనూ రోజువారీగా ఇదే స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. ఈ ప్లాన్‌లు నష్టాలు తెచ్చేవిగా తేలిపోయింది. వీటి విక్రయాలపై ప్రోత్సాహకాలను ఇవ్వడం లేదు. కంపెనీలకు అవకాశం ఇస్తే వీటిని వెంటనే నిలిపివేస్తాయి’’ అని ఓ ప్రముఖ ఇన్సూరెన్స్‌ బ్రోకరేజీ సంస్థ తెలిపింది. చాలా బీమా సంస్థలు ఈ ప్రత్యేకమైన కరోనా పాలసీలను ఆన్‌లైన్‌లో విక్రయించడాన్ని ఇప్పటికే నిలిపివేశాయి. విక్రయాలను నిరుత్సాహపరిచేందుకు ఏజెంట్‌ కమీషన్లను కోత పెట్టాయి. ప్రీమియం టారిఫ్‌లను గణనీయంగా పెంచేసినట్టు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఆన్‌లైన్‌లో పాలసీల అమ్మకాలు నిలిపివేయడంతో పాలసీలను తీసుకునేందుకు బీమా సంస్థల కార్యాలయాలను నేరుగా సంప్రదించాల్సి వస్తుంది. ప్రస్తుతానికి కేవలం నాలుగు బీమా సంస్థలే ఆన్‌లైన్‌లో కరోనా పాలసీలను విక్రయిస్తున్నట్టు బేషక్‌ డాట్‌ ఓఆర్‌జీ నిర్వహించిన సర్వేలో తెలిసింది. న్యూ ఇండియా అష్యూరెన్స్, యునైటెడ్‌ ఇండియా ఇన్సూరెన్స్, ఆదిత్య బిర్లా జనరల్‌ ఇన్సూరెన్స్, రహేజా క్యూబీఈ సంస్థలు ప్రస్తుతం ఆన్‌లైన్‌లో ఈ పాలసీలను ఆఫర్‌ చేస్తున్నాయి. మిగిలిన సంస్థలు ఆన్‌లైన్‌ పోర్టళ్లపై కరోనా బీమా పాలసీల విక్రయాన్ని నిలిపివేయడంతోపాటు.. వీటి కోసం సమీపంలోని తమ కార్యాలయాలను సంప్రదించాలని సూచిస్తున్నట్టు బేషక్‌ సంస్థ సీఈవో మహావీర్‌ చోప్రా పేర్కొన్నారు. ప్రీమియం క్యాలిక్యులేటర్లను కూడా కొన్ని తొలగించినట్టు చెప్పారు.

ప్రీమియం మరింత ప్రియం

వరుణ్‌ వయసు 43 సంవత్సరాలు. ప్రైవేటు రంగంలో పనిచేస్తున్నాడు. రూ.5లక్షల కవరేజీతో ఏడాది క్రితమే ఫ్యామిలీ ఫ్లోటర్‌ ఇండెమ్నిటీ ప్లాన్‌ను ఓ ప్రైవేటు బీమా సంస్థ నుంచి తీసుకున్నాడు. ప్రీమియం రూ.15,054 రూపాయలను మొదటి ఏడాది చెల్లించాడు. ఈ ఏడాది జూన్‌లో రెన్యువల్‌ చేసుకోవాల్సి ఉంది. ప్రీమియం చెల్లింపునకు ఇంకా గడువు ఉండగా.. మీ పాలసీ ప్రీమియంను ఏడాదికి రూ.23,104కు సవరిస్తున్నట్టు బీమా సంస్థ నుంచి మెయిల్ వ‌చ్చింది. అది చూసి వరుణ్‌ షాక్‌ అయ్యాడు. ఆరోగ్య బీమా ప్రీమియం భవిష్యత్తులో పెరుగుతుందని తెలుసుకానీ.. ఒక్క ఏడాదికే 50 శాతం బాదుడేంటి.. ఇలా అయితే భవిష్యత్తులో ప్రీమియం కట్టగలమా? అన్న సంశయంలో వరుణ్‌ ఉండిపోయాడు. వరుణ్‌కు మాత్రమే ఎదురైన అనుభవం కాదిది. ఇప్పటికే ఆరోగ్య బీమా ప్లాన్లను తీసుకున్న వారికి ప్రీమియంను కంపెనీలు భారీగా పెంచేశాయి. అదే సమయంలో కొత్తగా ఆఫర్‌ చేస్తున్న ప్లాన్‌లపై పెంపును మోస్తరుకు పరిమితం చేశాయి. ఒక్కసారి ముగ్గులోకి దిగిన తర్వాత చూసుకుందాంలేనన్నట్టు బీమా కంపెనీల ధోరణి కనిపిస్తోంది. 

తర్వాత తగ్గిస్తారా..?  

కరోనా వైరస్‌ కారణంగా క్లెయిమ్‌లు గణనీయంగా పెరిగిన మాట నిజమే. కానీ, కరోనా శాశ్వతంగా ఉంటుందా? అందరికీ వ్యాక్సినేషన్‌ పూర్తయ్యి, హెర్డ్‌ ఇమ్యూనిటీ ఏర్పడిన తర్వాత వైరస్‌ బలహీనపడిపోతుందని, సాధారణ ఫ్లూ మాదిరిగా మారిపోతుందని నిపుణులే చెబుతున్నారు. గట్టిగా మరో ఏడాది, రెండేళ్లలో కరోనా ముప్పు తొలగిపోతుంది. ఆ తర్వాత ఈ స్థాయిలో క్లెయిమ్‌లు ఉండవుగా? టీకాలు వేసేకొద్దీ వైరస్‌ కారణంగా ఆస్పత్రిపాలయ్యే వారి సంఖ్య కూడా తగ్గుముఖం పడుతుంది. దాంతో క్లెయిమ్‌లు కూడా తగ్గుతాయి. మరి ఇప్పుడు కరోనా పేరు చెప్పి పెంచిన ప్రీమియంను ఆ తర్వాత తగ్గిస్తాయా? కంపెనీలు వ్యాపార ధోరణితో అడ్డగోలుగా వ్యవహరిస్తున్నట్టు విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement