Health insurance policy
-
రూ.15,100 కోట్ల క్లెయిమ్‌లను అనుమతించలేదు!
ఆరోగ్య బీమా సంస్థలు 2023–24 ఆర్థిక సంవత్సరంలో రూ.15,100 కోట్ల విలువైన క్లెయిమ్(Claim)లను అనుమతించలేదు. దాఖలు చేసిన మొత్తం క్లెయిమ్‌ల్లో ఇవి 12.9 శాతానికి సమానమని బీమా నియంత్రణ సంస్థ ఐఆర్డీఏఐ తాజాగా విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. సాధారణ, స్వతంత్ర ఆరోగ్య బీమా(Health Insurance) సంస్థలకు వచ్చిన మొత్తం రూ.1.17 లక్షల కోట్ల క్లెయిమ్‌లలో.. రూ.83,493.17 కోట్లు లేదా 71.29 శాతం చెల్లింపులు జరిగాయి. బీమా సంస్థలు రూ.10,937.18 కోట్ల (9.34 శాతం) క్లెయిమ్‌లను తిరస్కరించాయి. 2024 మార్చి నాటికి మొత్తం రూ.7,584.57 కోట్ల (6.48 శాతం) విలువైన క్లెయిమ్‌లు బకాయి ఉన్నాయి. 2023–24లో సుమారు 3.26 కోట్ల ఆరోగ్య బీమా క్లెయిమ్‌లు వచ్చి చేరాయి. వీటిలో 2.69 కోట్ల (82.46 శాతం) క్లెయిమ్‌లు పరిష్కారం అయ్యాయి. ఒక్కో క్లెయిమ్‌కు చెల్లించిన సగటు మొత్తం రూ.31,086గా ఉంది.నగదు రహితం 66.16%.. సెటిల్ అయిన క్లెయిమ్‌ల సంఖ్య పరంగా 72 శాతం థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్స్ (TPA) ద్వారా, మిగిలిన 28 శాతం కంపెనీల అంతర్గత యంత్రాంగం ద్వారా పరిష్కారం అయ్యాయి. క్లెయిమ్‌ల సెటిల్మెంట్ విధానంలో 66.16 శాతం నగదు రహితంగా, మరో 39 శాతం రీయింబర్స్మెంట్ విధానంలో పరిష్కరించారు. 2023–24 సంవత్సరంలో సాధారణ, ఆరోగ్య బీమా కంపెనీలు పర్సనల్ యాక్సిడెంట్, ట్రావెల్ ఇన్సూరెన్స్ మినహాయించి రూ.1,07,681 కోట్ల ఆరోగ్య బీమా ప్రీమియం వసూలు చేశాయి. బీమా ప్రీమియం అంత క్రితం ఏడాదితో పోలిస్తే 20.32 శాతం వృద్ధిని నమోదు చేసింది. పర్సనల్ యాక్సిడెంట్(Accident), ట్రావెల్ ఇన్సూరెన్స్ బీమా కింద జారీ చేసిన పాలసీలు మినహా సాధారణ, ఆరోగ్య బీమా కంపెనీలు 2.68 కోట్ల ఆరోగ్య బీమా పాలసీల ద్వారా 57 కోట్ల మందికి కవరేజ్ ఇచ్చాయి.ఇదీ చదవండి: ‘వ్యక్తిగత ఆదాయపన్ను తగ్గించాలి’165.05 కోట్ల జీవితాలను..2024 మార్చి చివరి నాటికి 25 సాధారణ బీమా సంస్థలు, 8 స్వతంత్ర ఆరోగ్య బీమా సంస్థలు సేవలు అందించాయి. గత ఆర్థిక సంవత్సరంలో వ్యక్తిగత ప్రమాద బీమా కింద పరిశ్రమ మొత్తం 165.05 కోట్ల జీవితాలను కవర్ చేసింది. ఇందులో ప్రభుత్వ ప్రధాన పథకాలు ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన (PMSBY), ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన (PMJDY), ఈ–టికెట్ కొనుగోలు చేసిన ప్రయాణికుల కోసం ఐఆర్సీటీసీ ప్రయాణ బీమా కింద కవర్ చేయబడిన 90.10 కోట్ల జీవితాలు ఉన్నాయి. ప్రభుత్వ రంగ సాధారణ బీమా సంస్థలైన న్యూ ఇండియా, నేషనల్, ఓరియంటల్ ఇన్సూరెన్స్ విదేశాలలో ఆరోగ్య బీమా వ్యాపారం చేస్తున్నాయి. -
రెండు పాలసీలుంటే క్లెయిమ్ ఎలా చేయాలి?
మారుతున్న జీవనశైలికి అనుగుణంగా ఆహార అలవాట్లలో తేడాలొస్తున్నాయి. దానికితోడు శారీరక శ్రమ లోపించి చాలామంది ఆసుపత్రుల బాట పడుతున్నారు. ఏదైనా కారణాలతో హాస్పటల్లో చేరితే ఆర్థికంగా భారం కాకూడదని చాలామంది హెల్త్ ఇన్సూరెన్స్(Health Insurance) తీసుకుంటున్నారు. అయితే ఇటీవలి కాలంలో వేతన జీవుల్లో చాలా వరకు రెండు హెల్త్ పాలసీలు తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కొన్ని క్లిష్ట పరిస్థితుల్లో చికిత్స వ్యయం బీమా కవరేజీని మించిపోయే ప్రమాదం ఉంది. అలాంటి సందర్భాలను ఒకటికి మించిన పాలసీలతో సులభంగా గట్టెక్కొచ్చు. కానీ, ఒకటి కంటే ఎక్కువ పాలసీలు ఉంటే క్లెయిమ్ ఎలా చేయాలనే విషయంలో చాలా మంది అయోమయాన్ని ఎదుర్కొంటూ ఉంటారు. ఈ విషయంలో నిపుణుల సూచనలు అందించే కథనమిది.ఒక వ్యక్తికి ఒకటికి మించిన బీమా సంస్థల నుంచి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు ఉంటే, క్లెయిమ్ మొత్తాన్ని ఆయా సంస్థలు సమానంగా భరించాలనే నిబంధన గతంలో ఉండేది. 2013లో దీన్ని బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (IRDAI) తొలగించింది. దీంతో ఇప్పుడు ఒకటికి మించిన హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు కలిగి ఉన్నా కానీ, పాలసీదారు తనకు నచ్చిన చోట లేదంటే రెండు సంస్థల వద్దా క్లెయిమ్ దాఖలు చేసుకోవచ్చు. క్లెయిమ్ ఎలా?రెండు ప్లాన్లు కలిగిన వారు ఆస్పత్రిలో చేరిన తర్వాత రెండు బీమా సంస్థలకు తప్పనిసరిగా సమాచారం అందించాలి. ఒకటికి మించిన సంస్థల నుంచి హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లు కలిగి ఉంటే, అప్పుడు ముందుగా ఒక బీమా సంస్థకు ప్రతిపాదనలు పంపిస్తే సరిపోతుంది. నగదు రహిత, రీయింబర్స్మెంట్ మార్గాల్లో దేనినైనా వినియోగించుకోవచ్చు. క్లెయిమ్ మొత్తం ఒక హెల్త్ ప్లాన్ కవరేజీ దాటనప్పుడు ఒక బీమా సంస్థ వద్దే దరఖాస్తు చేసుకుంటే సరిపోతుంది. కానీ, ఒక పాలసీ కవరేజీకి మించి ఆస్పత్రి బిల్లు వచ్చినప్పుడు, రెండో బీమా సంస్థ వద్ద మిగిలిన మొత్తాన్ని క్లెయిమ్ చేసుకోవాలి. అంతే కానీ, ఒకేసారి ఒకే క్లెయిమ్‌ను రెండు సంస్థల వద్ద దాఖలు చేసేందుకు అవకాశం లేదని గుర్తుంచుకోవాలి. అలాకాకుండా రెండింటిలో దరఖాస్తు చేసుకుంటే ఒక్కోసారి రెండూ రెజెక్ట్ అయ్యే ప్రమాదం ఉందని తెలుసుకోవాలి.ఒకటికి మించిన ప్లాన్లు ఎందుకు?అసలు ఒకటికి మించి హెల్త్ పాలసీలు ఎందుకనే సందేహం రావచ్చు. ఒక్కొక్కరి అవసరాలే దీన్ని నిర్ణయిస్తాయి. ప్రైవేటు రంగంలో పనిచేసే వారికి పనిచేస్తున్న సంస్థ నుంచి గ్రూప్ హెల్త్ కవరేజీ సాధారణంగా ఉంటుంది. ఉన్నట్టుండి ఉద్యోగం నుంచి తప్పుకోవాల్సి వచ్చినా లేదంటే ఉద్యోగం కోల్పోయిన సందర్భాల్లో.. తిరిగి ఉపాధి లభించేందుకు కొంత సమయం పట్టొచ్చు. కంపెనీలు కల్పించే గ్రూప్ హెల్త్ కవరేజీ.. ఉద్యోగానికి రాజీనామా చేయడంతోనే ముగిసిపోతుంది. అందుకే వ్యక్తిగతంగా మరో ప్లాన్ కలిగి ఉంటే, ఉద్యోగం లేని సమయంలోనూ ఉపయోగపడుతుంది. వైద్య చికిత్సల వ్యయాలు గణనీయంగా పెరిగిపోతున్న తరుణంలో రెండు ప్లాన్లను కలిగి ఉండడం మంచి నిర్ణయమే అవుతుంది. లేదంటే బేస్ ప్లాన్ ఒకటి తీసుకుని, దానిపై మరింత మెరుగైన కవరేజీతో సూపర్ టాపప్ ప్లాన్(Topup Plan) జోడించుకోవడం మరొక మార్గం. -
హెల్త్ ఇన్సూరెన్స్ ‘పోర్టింగ్’.. తొందరొద్దు!
హెల్త్ ఇన్సూరెన్స్ ప్రతి కుటుంబానికి అత్యంత ముఖ్యమైన ఆర్థిక సాధనం. రక్షణ కవచం కూడా. ఎప్పుడు ఏ రూపంలో అనారోగ్యం లేదా ప్రమాదం ఎదురవుతుందో ఊహించలేం. ఖరీదైన వైద్య వ్యయాల భారాన్ని మోయలేం. జీవితకాల కష్టార్జితాన్ని ఒకేసారి ఎత్తుకుపోయే కరోనా మాదిరి విపత్తులు ఎప్పుడు వస్తాయో తెలియదు. వీటన్నింటికీ పరిష్కారమే హెల్త్ ఇన్సూరెన్స్. విస్తృత ప్రచారం నేపథ్యంలో నేడు చాలా మంది ఆరోగ్య బీమా ప్రాముఖ్యాన్ని అర్థం చేసుకుంటున్నారు. ప్రీమియం కష్టమైనా తీసుకుంటున్నారు. తీరా ప్లాన్ కొనుగోలు చేసిన తర్వాత.. కంపెనీ సేవలు నచ్చకపోవచ్చు. మంచి ఫీచర్లతో తక్కువ ప్రీమియానికే మరో బీమా కంపెనీ హెల్త్‌ప్లాన్ ఆకర్షించొచ్చు. అటువంటి సందర్భంలో కనిపించే ఏకైక ఆప్షన్ పోర్టింగ్. ఒక నెట్వర్క్ నుంచి మరో నెట్‌వర్క్‌కు మొబైల్ నంబర్ మార్చుకున్నంత సులభంగానే.. హెల్త్ ఇన్సూరెన్స్‌ను సైతం పోర్ట్ పెట్టుకుని మరో కంపెనీ ప్లాన్‌లో చేరిపోవచ్చు. పోర్టింగ్‌తో ఎన్నో ప్రయోజనాలున్నాయనడంలో సందేహం లేదు. అదే సమయంలో కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. వీటి గురించి అవగాహన తప్పనిసరి. బలమైన కారణాలుంటేనే, అది కూడా సమగ్రమైన సమాచారం తెలుసుకున్న తర్వాతే ‘పోర్టింగ్’ను ఎంపిక చేసుకోవాలన్నది నిపుణుల సూచన. – సాక్షి, బిజినెస్ డెస్క్తమ కంపెనీ ప్లాన్‌లోకి ‘పోర్ట్’ పెట్టుకోవాలంటూ ఇటీవలి కాలంలో మార్కెటింగ్ కాల్స్ రావడం కొందరికి అనుభవమే. బీమా మార్కెట్లో పోటీ పెరిగిపోవడంతో ఈ ధోరణి ఏర్పడింది. కొత్త కస్టమర్ల కోసం మార్కెటింగ్ బృందాలు అన్ని మార్గాల్లోనూ జల్లెడ పడుతున్నాయి. అప్పటి వరకు అసలు ఆరోగ్య బీమా రక్షణ పరిధిలో లేని కస్టమర్లకు హెల్త్ ప్లాన్ ఇవ్వడం మంచిదే. కానీ, ఇతర బీమా కంపెనీల కస్టమర్లను సైతం ఆకర్షించేందుకు కొత్తదారులు వెతుక్కుంటున్నాయి.‘‘పోర్ట్ పెట్టేసుకుని, మా కంపెనీ ప్లాన్‌లోకి మారిపోండి. మంచి ఫీచర్లు, మెరుగైన కవరేజీతో బీమా రక్షణ పొందండి’’ అంటూ ఆఫర్లు ఇస్తున్న ధోరణి కనిపిస్తోంది. వ్యాపార వృద్ధి లక్ష్యాల్లో భాగంగా కొత్త కస్టమర్లను సంపాదించేందుకు కొందరు అనైతికంగానూ వ్యవహరిస్తున్నారు. ఇలాంటి కాల్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. సహేతుక కారణాలు ఉన్నప్పుడే పోర్టింగ్ ఆప్షన్‌ను పరిశీలించాలి. చేదు అనుభవం..కేరళ రాష్ట్రానికి చెందిన అజిత్ కుమార్ (53)కు ఎదురైన అనుభవాన్ని ఈ సందర్భంగా చెప్పుకోవాలి. అప్పటికే ఉన్న హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌తో కానీ, బీమా కంపెనీతో కానీ అతడికి ఎలాంటి సమస్యల్లేవు. కానీ, ప్రముఖ ఆన్లైన్ ఇన్సూరెన్స్ బ్రోకింగ్ ప్లాట్‌ఫామ్ నుంచి ఒకరోజు కాల్ వచ్చింది. పాలసీని పోర్ట్ పెట్టుకోవాలంటూ మార్కెటింగ్ సిబ్బంది సూచించారు. మెరుగైన సదుపాయాలున్న ప్లాన్‌ను పోర్టింగ్‌తో పొందొచ్చంటూ ఆయన్ను ప్రోత్సహించారు. ‘‘11 ఏళ్ల నుంచి నాకు హెచ్డీఎఫ్సీ ఎర్గో ఆప్టిమా సెక్యూర్ ప్లాన్ ఉంది. అన్నేళ్లలో ఒక్కసారి కూడా క్లెయిమ్ చేయలేదు.అయినా కానీ, పాలసీ ప్రీమియాన్ని గణనీయంగా పెంచేశారు. దీంతో మంచి ఫీచర్లున్న కొత్త పాలసీకి పోర్ట్ పెట్టుకోవాలంటూ పాలసీబజార్ కస్టమర్ కేర్ ప్రతినిధి నాకు సూచించారు’’అని కుమార్ తన అనుభవాన్ని పంచుకున్నారు. కానీ, జరిగిన నష్టం ఏంటో ఆ తర్వాత కానీ తెలియలేదు. పోర్టింగ్ నిర్ణయం పట్ల కుమార్ పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. కుమార్ పూర్వపు పాలసీలో రూ.10 లక్షల సమ్ అష్యూరెన్స్ ఉంది. మరో రూ.10 లక్షలకు నో క్లెయిమ్ బోనస్ (ఎన్సీబీ) కూడా ఉంది. అంటే మొత్తం రూ.20 లక్షల బీమా రక్షణ ఉన్నట్టు. పాలసీ తీసుకుని 10–11 ఏళ్లు కావడంతో అన్ని రకాల వెయిటింగ్ పీరియడ్ నిబంధనలను కుమార్ అధిగమించేశారు. పాత పాలసీలోనే కొనసాగి ఉంటే ఎలాంటి క్లెయిమ్‌కు అయినా అర్హత కొనసాగేది. కానీ, పోర్టింగ్‌తో నో క్లెయిమ్ బోనస్ కొత్త పాలసీలోకి బదిలీ కాలేదు. పైగా ఒకే విడత మూడేళ్ల ప్రీమియంలను కుమార్‌తో కట్టించారు సదరు మార్కెటింగ్ సిబ్బంది. వారి సూచనతో సూపర్ టాపప్ ప్లాన్ కూడా కొనుగోలు చేశారు. పాలసీ కొనుగోలు తర్వాత సేవలు దారుణంగా ఉన్నాయని కుమార్ విచారించడం మినహా మరో మార్గం లేకపోయింది. నో క్లెయిమ్ బోనస్, వెయిటింగ్ పీరియడ్ ప్రయోజనాలు అన్ని పోర్టింగ్ కేసుల్లోనూ తప్పనిసరిగా బదిలీ కావాలని లేదు. ఈ విషయంలో బీమా సంస్థల షరతులను అర్థం చేసుకోవాలి. పోర్టింగ్ ప్రక్రియ ఇలా..పోర్టింగ్ పెట్టుకోవాలంటే ప్రస్తుత పాలసీ రెన్యువల్ ఇంకా కనిష్టంగా 30 రోజులు, గరిష్టంగా 60 రోజుల గడువు ఉందనగా ప్రక్రియ ప్రారంభించాలి. ఉదాహరణకు ఫిబ్రవరి 28న తదుపరి ప్రీమియం చెల్లించాల్సిన గడువు అనుకుంటే, మీరు రెండు నెలల ముందుగా డిసెంబర్ 31నుంచి ప్రారంభించొచ్చు. రెన్యువల్‌కు 30 రోజుల కంటే తక్కువ వ్యవధి ఉన్నా కానీ, బీమా సంస్థ తన విచక్షణ మేరకు పోర్టింగ్ దరఖాస్తును ఆమోదించొచ్చని ఐఆర్డీఏఐ నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుత బీమా కంపెనీకి ఎలాంటి సమాచారం ఇవ్వక్కర్లేదు. పోర్టింగ్‌తో ఏ కంపెనీ ప్లాన్‌లోకి వెళ్లాలనుకుంటున్నారో, ఆ కంపెనీని సంప్రదించాలి. పోర్టబులిటీ, ప్రపోజల్ పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది.పోర్టింగ్ సమయంలో తాజా ఆరోగ్య సమాచారం మొత్తాన్ని వివరంగా వెల్లడించాల్సిందే. అప్పటి వరకు ఏదైనా అనారోగ్యంతో ఆస్పత్రి పాలైనా, లోగడ హెల్త్ క్లెయిమ్‌ల గురించి కూడా వెల్లడించాల్సి రావచ్చు. ఈ వివరాల ఆధారంగా రిస్క్‌ను మదింపు వేసి బీమా సంస్థ ప్రీమియంను నిర్ణయిస్తుంది. అవసరమైతే అప్పటికే ఉన్న ఆరోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకుని ప్రీమియంను పెంచొచ్చు.పోర్టింగ్ దరఖాస్తును కొత్త సంస్థ ఆమోదించి, పాలసీ జారీ చేసే వరకు పాత పాలసీని రద్దు చేసుకోవద్దు. ఎందుకంటే పాలసీదారు ఆరోగ్య చరిత్ర, రిస్క్, ఇతర అంశాల ఆధారంగా కొత్త సంస్థ ప్రీమియంను గణనీయంగా పెంచేస్తే అది అంగీకారం కాకపోవచ్చు. నో క్లెయిమ్ బోనస్, వెయిటింగ్ పీరియడ్ ప్రయోజనాల విషయంలోనూ కొత్త సంస్థ నిబంధనలు నచ్చకపోతే, పోర్టింగ్ అభ్యర్థనను ఉపసంహరించుకుని పాత సంస్థలో కొనసాగొచ్చు. ఆచరణ వేరు..ప్రస్తుత హెల్త్ ప్లాన్‌లో రూ.10 లక్షల బేసిక్ సమ్ అష్యూరెన్స్ ఉందనుకోండి. దీనికి మరో రూ.10 లక్షలు నో క్లెయిమ్ బోనస్ తోడయ్యింది. అప్పుడు సదరు పాలసీదారు రూ.20 లక్షల క్లెయిమ్‌కు అర్హులు. పోర్టింగ్‌తో వేరే కంపెనీ ప్లాన్‌లోకి మారాలనుకుంటే.. అప్పుడు రూ.20 లక్షల సమ్ అష్యూరెన్స్‌ను ఎంపిక చేసుకోవాలి. ఒకవేళ పాత ప్లాన్‌లో మాదిరే రూ.10 లక్షల బేసిక్ సమ్ అష్యూరెన్స్‌ను కొత్త సంస్థలోనూ ఎంపిక చేసుకుంటే.. రూ.10 లక్షల నో క్లెయిమ్ బోనస్ కోల్పోయినట్టు అవుతుంది.పోర్టింగ్‌తో రూ.20 లక్షల సమ్ అష్యూరెన్స్ ఎంపిక చేసుకుంటే అంత మొత్తానికి తాజా వెయిటింగ్ నిబంధన కొత్త సంస్థలోనూ అమలు కాదు. ముందస్తు వ్యాధులకు (పాలసీ తీసుకునే నాటికి) 3–4 ఏళ్ల పాటు వెయిటింగ్ పీరియడ్ క్లాజ్ ఉంటుంది. పాలసీ తీసుకుని అన్నేళ్ల పాటు రెన్యువల్ చేసుకున్న తర్వాతే, ఆయా వ్యాధుల తాలూకూ క్లెయిమ్‌లకు అర్హత లభిస్తుంది. కనుక ఒక ప్లాన్‌లో వెయిటింగ్ పీరియడ్ నిబంధనలు అన్నింటినీ పూర్తి చేసిన తర్వాత, మరో కంపెనీకి పోర్ట్ పెట్టుకునే ముందు సమ్ అష్యూరెన్స్ ఎంపికలో వివేకంతో వ్యవహరించాలి.ఐఆర్డీఏఐ ఉత్తర్వులు ఉన్నా...సమ్ అష్యూరెన్స్, నో క్లెయిమ్ బోనస్, నిర్దేశిత వెయిటింగ్ పీరియడ్, మారటోరియం పీరియడ్‌కు సంబంధించిన అర్హతలను పోర్టింగ్తోపాటు బదిలీ చేయాలంటూ ఈ ఏడాది ఆరంభంలో బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ)తన ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొంది. కానీ, బీమా సంస్థలు తెలివిగా ఈ నిబంధనలను అమలు చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఉదాహరణకు.. ప్రస్తుత ప్లాన్‌లో రూ.10 లక్షల బేసిక్ సమ్ అష్యూరెన్స్‌తో, అన్ని వెయిటింగ్ పీరియడ్ నిబంధనలు అధిగమించేసి ఉన్నారని అనుకుందాం.పోర్టింగ్ సమయంలో కొత్త సంస్థలో రూ.20 లక్షల సమ్ అష్యూరెన్స్ ఎంపిక చేసుకుంటే, అప్పుడు పాత ప్లాన్‌లో రూ.10 లక్షలకే వెయిటింగ్ పీరియడ్‌ను పూర్తి చేశారు కనుక, కొత్త సంస్థ కూడా అంతే మొత్తానికి ఆ ప్రయోజనాన్ని కొనసాగిస్తుంది. మరో రూ.10 లక్షల మొ త్తానికి అన్ని వెయిటింగ్ పీరియడ్లు తాజాగా అమల్లోకి వస్తాయని తెలుసుకోవాలి. దీనర్థం.. అప్పటికే ఉన్న వ్యాధులకు సంబంధించి క్లెయిమ్ మొత్తం రూ.10 లక్షలు మించిన సందర్భాల్లో రూ.10 లక్షలకే పరిహారం పరిమితమవుతుంది.కుమార్ విషయంలో ఈ తప్పిదమే చోటుచేసుకుంది. పాత ప్లాన్‌లో రూ.10 లక్షల బేసిక్ సమ్ అష్యూరెన్స్, రూ.10 లక్షల నో క్లెయిమ్ బోనస్ ఉన్నప్పటికీ.. పోర్ట్ తర్వాత రూ.10 లక్షలకే సమ్ అష్యూరెన్స్‌ను ఎంపిక చేసుకున్నారు. దీంతో నో క్లెయిమ్ బోనస్ కోల్పోవడమే కాకుండా, ఆ మొత్తానికి వెయిటింగ్ పీరియడ్ ప్రయోజనాన్ని కోల్పోయినట్టు అయింది. పోర్టింగ్ ఏ సందర్భాల్లో..?ముఖ్యమైన కారణాలుంటేనే పోర్టింగ్‌ను పరిశీలించాలని నిపుణులు సూచిస్తున్నారు. ‘‘ఏజెంట్ల సూచన మేరకు పోర్టింగ్ చేసుకుంటే, ఇన్సూరెన్స్ పాలసీ ప్రపోజల్ పత్రంలో అన్ని వివరాలు సమగ్రంగా ఉన్నాయేమో ఒక్కసారి ధ్రువీకరించుకోవాలి. చాలా సందర్భాల్లో ఏజెంట్లు అధిక కమీషన్ కోసం పోర్టింగ్ పేరుతో, తాజాగా పాలసీలు అంటగడుతుంటారు’’ అని హోలిస్టిక్ వెల్త్ సహ వ్యవస్థాపకుడు నిషాంత్ బాత్రా తెలిపారు. ఒకటికి మించిన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు, ప్రీమియం తగ్గుతుందన్న ఆశతో పోర్టింగ్ పెట్టుకునే తప్పిదం చేయవద్దన్నది బాత్రా సూచన. పోర్టింగ్ ద్వారా వచి్చన పాలసీదారులను కొత్తవారిగానే బీమా సంస్థలు పరిగణిస్తాయి. పోర్టింగ్ చేసుకున్న తర్వాత తొలినాళ్లలో క్లెయిమ్‌కు వెళితే, అందులోని వాస్తవికతను అవి సందేహించే అవకాశం లేకపోలేదు. మరి పోర్టింగ్ ఏ సందర్భాల్లో పరిశీలించాలన్న సందేహం రావచ్చు. ప్రస్తుత ప్లాన్‌లో లేని మెరుగైన ఫీచర్లు కొత్త ప్లాన్‌లో వస్తుంటే, మరిన్ని వ్యాధులకు కవరేజీ లభిస్తుంటే, అవి తమకు ఎంతో ప్రయోజనకరమని భావిస్తే అప్పుడు పోర్టింగ్‌ను పరిశీలించొచ్చు.అలాగే, ప్రస్తుత ప్లాన్‌లో రూమ్ రెంట్ విషయంలో పరిమితులు ఉండి, పోర్టింగ్‌తో వెళ్లే ప్లాన్‌లో ఎలాంటి రూమ్ రెంట్ పరిమితులు లేనట్టయితే అప్పుడు కూడా ఈ ఆప్షన్ వినియోగించుకోవడం సరైనదేనని బాత్రా సూచించారు. ఇక ప్రస్తుత బీమా సంస్థ క్లెయిమ్‌ల పరంగా ఇబ్బందులు పెడుతుంటే, క్లెయిమ్ మొత్తంలో కోతలు పెడుతుంటే లేదా క్లెయిమ్ ఆమోదంలో చాలా జాప్యం చేస్తుంటే, కస్టమర్ సర్వీస్ విషయంలో సంతోషంగా లేకపోయినా కానీ పోర్టింగ్ సహేతుకమే. ఇవి తెలుసుకోవాలి..⇒ పోర్టింగ్‌తో పాత పాలసీలో పొందిన నో క్లెయిమ్, వెయిటింగ్ పీరియడ్ క్రెడిట్ ప్రయోజనాలను కొత్త సంస్థ కూడా నిబంధనల మేరకు అందిస్తుందా? లేదా అన్నది ముందే ధ్రువీకరించుకోవాలి. ⇒ పాత కంపెనీలో ముందస్తు వ్యాధులకు 3 ఏళ్ల వెయిటింగ్ పీరియడ్ నిబంధనను పూర్తి చేశారని అనుకుందాం. పోర్టింగ్ తర్వాత కొత్త సంస్థ ప్లాన్‌లో వెయిటింగ్ పీరియడ్ 4 ఏళ్లుగా ఉంటే.. అప్పుడు మరో ఏడాది తర్వాతే క్లెయిమ్ ప్రయోజనాలకు అర్హత లభిస్తుంది. ఒకవేళ పాత కంపెనీలో వెయిటింగ్ పీరియడ్‌ను సగమే పూర్తి చేసి ఉంటే, అప్పుడు కొత్త సంస్థలో నిబంధనల మేరకు మిగిలిన కాలానికి వెయిటింగ్ పీరియడ్ కొసాగుతుంది. ⇒ పోర్టింగ్‌కు ప్రీమియం ఒక్కదానినే ప్రామాణికంగా తీసుకోవద్దు. ఎందుకంటే వయసు, ఆరోగ్య చరిత్ర వివరాల ఆధారంగా ఈ ప్రీమియం మారిపోవచ్చు. అధిక రిస్‌్కలో ఉన్నారని భావిస్తే బీమా సంస్థలు అధిక ప్రీమియంను నిర్ణయిస్తాయి. ⇒ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను నేరుగా బీమా సంస్థ నుంచి తీసుకున్నా, ఏజెంట్ సాయంతో తీసుకున్నా ప్రీమియంలో పెద్ద వ్యత్యాసం ఉండదు. కొన్ని కంపెనీలు ఏ రూపంలో పాలసీ తీసుకుంటున్నప్పటికీ ఒక్కటే ప్రీమియం అమలు చేస్తున్నాయి. ⇒ పోర్టింగ్ తర్వాత అధిక సమ్ అష్యూరెన్స్‌ను ఎంపిక చేసుకోవచ్చు. మరింత సమ్ అష్యూరెన్స్ ఇవ్వడమా? లేదా అన్న దానిని అండర్‌రైటింగ్ నిబంధనల మేరకు బీమా కంపెనీలు నిర్ణయిస్తాయి. ⇒ అన్ని వ్యక్తిగత, ఫ్యామిలీ ఫ్లోటర్ ఇండెమ్నిటీ పాలసీలకు పోర్టింగ్ అర్హత ఉంటుంది. ఇక గ్రూప్ హెల్త్ పాలసీల్లో కవరేజీ ఉన్న వ్యక్తులు, కుటుంబాలకు మాత్రం.. ఆ గ్రూప్ నుంచి తప్పుకున్నప్పుడు లేదా గ్రూప్ పాలసీలో మార్పులు చేసినప్పుడు (ప్రీమియం పెంపు సహా) లేదా గ్రూప్ పాలసీని ఉపసంహరించుకున్న సందర్భాల్లో పోర్టింగ్‌కు వీలు కల్పించాల్సి ఉంటుంది. ⇒ పోర్టింగ్ దరఖాస్తుపై 15 రోజుల్లో బీమా సంస్థ తన నిర్ణయాన్ని పాలసీదారునకు తెలియజేయాల్సి ఉంటుంది. పాత పాలసీలో ఉన్న కవరేజీకి తక్కువ కాకుండా బీమా రక్షణను కొత్త సంస్థ అందించాలి. -
ఇలా చేయకుంటే... హెల్త్ క్లెయిమ్ తిరస్కరణ!
అనారోగ్యంతో ఆస్పత్రి పాలైతే.. ఆదుకుంటుందన్న భరోసాతోనే ఎవరైనా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటారు. తీరా అవసరం వచ్చినప్పుడు బీమా సంస్థ చెల్లింపులకు నిరాకరిస్తే..? పాలసీదారులు కంగుతినాల్సిందే. కరోనా ఆరోగ్య విషయంలో ఎంతో మందికి కళ్లు తెరిపించింది. ఆ ఫలితమే తర్వాత నుంచి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తోంది. ముఖ్యంగా పాలసీ నిబంధనలను కచి్చతంగా తెలుసుకున్న తర్వాతే కొనుగోలు చేయాలి. పాలసీ నిబంధనలను అర్థం చేసుకోవడంలో లోపం చోటుచేసుకుంటే, భవిష్యత్తులో క్లెయిమ్‌లు తిరస్కరణకు గురయ్యే రిస్క్ కచ్చితంగా ఉంటుంది. దీనివల్ల ఒక్కసారిగా కుటుంబంపై ఆరి్థక భారం పడిపోతుంది. బీమా సంస్థ చెల్లింపులు చేయకపోవడం వెనుక ఎన్నో కారణాలు ఉండొచ్చు. వీటి పట్ల అవగాహన కలిగి ఉంటే, అలాంటి పరిస్థితులను నివారించొచ్చు. ఈ వివరాలు అందించే కథనమే ఇది. పాలసీ దరఖాస్తు పత్రంలో అప్పటికే తమకు ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వెల్లడించడం తప్పనిసరి. లేదంటే భవిష్యత్తులో క్లెయిమ్ పరంగా సమస్యలు ఎదురవుతాయి. పాలసీదారు ఆరోగ్య చరిత్ర ఆధారంగానే క్లెయిమ్ రిస్‌్కను బీమా సంస్థలు అంచనా వేస్తాయి. దానికి అనుగుణంగా ప్రీమియం నిర్ణయిస్తాయి. చెప్పకపోతే బీమా సంస్థకు తెలియదుగా అని చెప్పి కొందరు అనారోగ్య సమస్యలను వెల్లడించరు. ఇది బీమా ఒప్పందాన్ని ఉల్లంఘించినట్టు అవుతుంది. క్లెయిమ్ సమయంలో బీమా సంస్థలు వీటిని గుర్తించినట్టయితే.. చెల్లింపులకు నిరాకరించడంతోపాటు, కవరేజీని సైతం రద్దు చేయొచ్చు. ముందస్తు వ్యాధులనే కాదు, ఏదైనా అనారోగ్యానికి సంబంధించి లోగడ చికిత్స తీసుకున్నా వెల్లడించడమే మంచిది. ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ అయితే, కుటుంబ సభ్యులందరి వైద్య చరిత్రను నమోదు చేయాలి. సరైన సమాచారం ఇవ్వాలిబీమా సంస్థకు సమరి్పంచే ఇన్సూరెన్స్ క్లెయిమ్ పత్రంలో పూర్తి వివరాలు ఉండాలి. తేదీలు, చికిత్సల ప్రక్రియలకు సంబంధించి చిన్న దోషాలు కూడా ఉండకూడదు. రోగి వయసు, పేరులోనూ వ్యత్యాసాలు ఉండకూడదు. బీమా సంస్థలు ప్రతి క్లెయిమ్ దరఖాస్తును లోతుగా పరిశీలిస్తాయి. ఏవైనా వ్యత్యాసాలు గుర్తిస్తే మరింత సమాచారం కోరడం లేదా తిరస్కరించడం చేయొచ్చు. క్లెయిమ్ వచి్చనప్పుడు, అందులోని వ్యాధి నిర్ధారణ వివరాలను, అప్పటికే పాలసీదారు వైద్య చరిత్రతో పోల్చి చూస్తాయి. హాస్పిటల్ రికార్డులు, డాక్టర్ నోట్లను పరిశీలిస్తాయి. ఈ సమయంలో వ్యత్యాసాలు కనిపిస్తే చెల్లింపులను నిరాకరిస్తాయి. పాలసీ పత్రంలో ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం ఇచ్చి నట్టు గుర్తిస్తే దాన్ని మోసం కింద పరిగణిస్తాయి. దీంతో క్లెయిమ్ రాకపోవడం కాదు, పాలసీ కూడా రద్దు కావచ్చు. అదనపు సమాచారం, వివరణ, డాక్యుమెంట్లను బీమా కంపెనీ కోరొచ్చు. దీంతో నగదు రహిత క్లెయిమ్ కాకుండా రీయింబర్స్మెంట్ మార్గంలో రావాలని కోరే అధికారం సైతం బీమా సంస్థకు ఉంటుంది. ముఖ్యంగా రీయింబర్స్మెంట్ క్లెయిమ్‌కు సంబంధించి అన్ని రకాల డాక్యుమెంట్లను సమర్పించడం తప్పనిసరి.మినహాయింపులు హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్న వారు తమ పాలసీ పరంగా ఉన్న మినహాయింపుల గురించి కచి్చతంగా తెలుసుకోవాలి. దీనివల్ల క్లెయిమ్ పరంగా సమస్యలు రాకుండా ముందే జాగ్రత్త పడొచ్చు. కొన్ని రకాల అనారోగ్యాలు, చికిత్సలు లేదా సేవలకు కొన్ని ప్లాన్లలో కవరేజీ ఉండదు. నిబంధనల్లో మార్పులు కొన్ని సందర్భాల్లో పాలసీ నిబంధనలు, ప్రయోజనాల్లో మార్పులు చోటు చేసుకోవచ్చు. అలాంటప్పుడు కూడా క్లెయిమ్‌లకు తిరస్కారం ఎదురవుతుంది. వాస్తవానికి ఇలాంటి వాటి గురించి పాలసీదారులకు బీమా సంస్థలు విధిగా తెలియజేస్తాయి.సకాలంలో తెలపాలి.. ముందస్తుగా నిర్ణయించుకుని తీసుకునే నగదు రహిత చికిత్సలకు కనీసం 48 గంటల ముందు బీమా సంస్థకు తెలియజేయాలి. అత్యవసర వైద్యం అవసరమై ఆస్పత్రిలో చేరినప్పుడు నగదు రహిత క్లెయిమ్‌కు సంబంధించి 24 గంటల్లోపు బీమా సంస్థకు సమాచారం ఇవ్వాలి. రీయింబర్స్మెంట్ క్లెయిమ్ పెట్టుకునే వారు సైతం.. ముందస్తు ప్రణాళిక మేరకు తీసుకునే చికిత్సలు అయితే 48 గంటల ముందుగా, అత్యవసరంగా ఆస్పత్రిలో చేరితే 24–48 గంటల్లోపు సమాచారం ఇవ్వాల్సిందే. ఇక రీయింబర్స్మెంట్ క్లెయిమ్ దరఖాస్తు, డాక్యుమెంట్లను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన 30 రోజుల్లోపు సమరి్పంచాలి. బీమా సంస్థల మధ్య ఈ గడువులో వ్యత్యాసం ఉండొచ్చు. పాలసీ ల్యాప్స్ పాలసీ ప్రీమియం గడువు మించకుండా చెల్లించాలి. లేదంటే పాలసీ ల్యాప్స్ అవుతుంది. ఇలా ల్యాప్స్ అయిన పాలసీలకు సంబంధించి క్లెయిమ్‌లను బీమా సంస్థలు అనుమతించవు. పాలసీ గడువు ముగిసిన తర్వాత 15–30 రోజుల గ్రేస్ పీరియడ్ ఉంటుంది. కనీసం ఈ కాలంలో అయినా ప్రీమియం చెల్లించాలి. లేదంటే పాలసీ రద్దయిపోతుంది. దీంతో బీమా కవరేజీ కోల్పోయినట్టు అవుతుంది. ల్యాప్స్ అయిన పాలసీని పునరుద్ధరించుకునే వరకు కవరేజీ ఉండదు. వెయిటింగ్ పీరియడ్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకున్న తర్వాత కొన్ని రకాల క్లెయిమ్‌లకు వెయిటింగ్ పీరియడ్ (వేచి ఉండాల్సిన కాలం) ఉంటుంది. ఆ కాలంలో వచ్చే క్లెయిమ్‌లను బీమా సంస్థలు తోసిపుచ్చుతాయి. హెరి్నయా, క్యాటరాక్ట్, చెవి, ముక్కు, గొంతు సమస్యలు (ఈఎన్టీ), మోకాలి చిప్ప మారి్పడి తదితర చికిత్సలకు రెండేళ్ల పాటు వెయిటింగ్ ఉంటుంది. అలాగే, పాలసీ తీసుకునే నాటికే ఉన్న వ్యాధులకు సైతం క్లెయిమ్ కోసం నిర్ధేశిత కాలం పాటు వేచి ఉండాల్సిందే. ఆ కాలంలో క్లెయిమ్‌లను అనుమతించరు. కవరేజీ ఖర్చయిపోతే.. ఒక పాలసీ సంవత్సరంలో నిర్దేశిత కవరేజీ మొత్తం వినియోగించుకున్న తర్వాత వచ్చే క్లెయిమ్‌లకు బీమా సంస్థలు చెల్లింపులు చేయవు. అందుకే అన్ లిమిటెడ్ రీస్టోరేషన్ సదుపాయం ఉన్న పాలసీని తీసుకోవాలి. అప్పుడు బీమా ఖర్చయిపోయినా, తిరిగి అంతే మొత్తాన్ని పునరుద్దరిస్తాయి. ముందస్తు అనుమతి.. కొన్ని రకాల చికిత్సలకు ముందస్తు ఆమోదం తప్పనిసరి అంటూ బీమా సంస్థ నిబంధనలు విధించొచ్చు. అలాంటి వాటిపై ముందే అవగాహన ఉంటే క్లెయిమ్ నిరాకరణకు నోచుకోదు.తిరస్కరిస్తే ఏంటీ మార్గం? బీమా సంస్థ సహేతుక కారణం లేకుండా చెల్లింపులకు నిరాకరిస్తే చూస్తూ ఉండిపోనక్కర్లేదు. పాలసీ నియమ, నిబంధనలను ఒక్కసారి పూర్తిగా అధ్యయనం చేయాలి. ‘పాలసీ వర్డింగ్స్’లో పూర్తి వివరాలు ఉంటాయి. క్లెయిమ్ తిరస్కరించడానికి కారణాలు తెలుసుకోవాలి. రిజెక్షన్ లెటర్లో ఈ వివరాలు ఉంటాయి. బీమా సంస్థ నిర్ణయం వాస్తవికంగా లేదని భావిస్తే అప్పుడు అప్పీల్‌కు దరఖాస్తు చేసుకోవాలి. ప్రతి బీమా సంస్థలోనూ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ (ఫిర్యాదుల పరిష్కార) విభాగం ఉంటుంది. క్లెయిమ్ నిరాకరించడానికి తగిన కారణాలు లేవంటూ వారికి ఫిర్యాదు సమరి్పంచాలి. పరిష్కారం లభించకపోతే అప్పుడు బీమా అంబుడ్స్‌మెన్‌ను సంప్రదించాల్సి ఉంటుంది. అక్కడా న్యాయం జరగకపోతే అప్పుడు వినియోగదారుల కోర్టును ఆశ్రయించొచ్చు. క్లెయిమ్ పూర్తిగా కాకుండా, పాక్షికంగా చెల్లింపులు చేసిన సందర్భాల్లోనూ పాలసీదారులు న్యాయం కోరొచ్చు. ఐఆర్డీఏఐ... ఐఆర్డీఏఐ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సెల్‌ను సంప్రదించొచ్చు. టోల్‌ఫ్రీ నంబర్లు 155255 లేదా 1800 4254 732కు కాల్ చేసి చెప్పొచ్చు. లేదా complaints@irdai.gov.inకు మెయిల్ పంపొచ్చు. లేదా ఐఆర్‌డీఏకు చెందిన https://irdai. gov.in/ igms1 పోర్టల్ సాయంతో ఫిర్యాదు దాఖలు చేయవచ్చు. పరిష్కార వేదికలుఅంబుడ్స్మెన్ ద్వారా రూపాయి ఖర్చు లేకుండా పరిష్కరించుకోవచ్చు. వినియోగదారుల కోర్టుకు వెళ్లినా సరే పెద్దగా ఖర్చు కాదు. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
జీవిత, ఆరోగ్య బీమాపై జీఎస్టీ తొలగించండి
న్యూఢిల్లీ: జీవిత బీమా, ఆరోగ్య బీమా పాలసీలపై 18 శాతం జీఎస్టీని ఉపసంహరించుకోవాలంటూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను, సహచర కేబినెట్ మంత్రి నితిన్ గడ్కరీ కోరారు. బీమా రంగానికి సంబంధించిన అంశాలపై మంత్రి గడ్కరీకి నాగ్‌పూర్ డివిజనల్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఉద్యోగుల సంఘం వినతిపత్రం సమరి్పంచింది. వీటిని ప్రస్తావిస్తూ ఆర్థిక మంత్రి సీతారామన్‌కు గడ్కరీ లేఖ రాయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ‘‘జీవిత బీమాపై జీఎస్టీని విధించడం అంటే.. జీవితంలో ఎదురయ్యే అనిశి్చతులపై పన్ను వేయడమే. జీవితంలో అనిశి్చతుల రిస్క్ నుంచి కుటుంబానికి రక్షణ కలి్పంచేందుకు తీసుకునే కవరేజీపై పన్ను వేయకూడదని సంఘం భావిస్తోంది. అలాగే సామాజికంగా ఎంతో అవసరమైన ఆరోగ్య బీమాపైనా 18 శాతం జీఎస్టీ విధించడం ఈ విభాగంలో వృద్ధిని అడ్డుకుంటుంది. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని జీవిత, ఆరోగ్య బీమాలపై జీఎస్టీ ఉపసంహరణను పరిశీలించాలని కోరుతున్నాను’’అని గడ్కరీ పేర్కొన్నారు. జీవిత బీమా ద్వారా పొదుపు పథకాలను ప్రత్యేకంగా చూడాలని, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంపై పన్ను తగ్గింపు (నూతన విధానంలో)ను ప్రవేశపెట్టడం, ప్రభుత్వరంగ సాధారణ బీమా కంపెనీల విలీనంపైనా ఉద్యోగుల సంఘం డిమాండ్లను గడ్కరీ తన లేఖలో ప్రస్తావించారు. -
ఆరోగ్య బీమా .. పన్ను ప్రయోజనాల ధీమా
దేశీయంగా ఆరోగ్య సంరక్షణ పరిస్థితులు ఎప్పటికప్పుడు మారిపోతున్న నేపథ్యంలో మంచి హెల్త్ ఇన్సూరెన్స్ పథకం తీసుకోవడంతో పాటు మీ ఆర్థిక స్థితిని కూడా ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా అవసరం. ఇందుకోసం హెల్త్ ఇన్సూరెన్స్ సైతం మీకు తోడ్పడుతుంది. ఇది కేవలం వైద్యం ఖర్చులకే ఉపయోగపడటం కాకుండా మీకు పన్ను ప్రయోజనాలు కూడా అందిస్తుంది. ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80డీ కింద ఆరోగ్య బీమాతో మీరు ఏటా రూ. 75,000 వరకు పన్నులపరంగా ఆదా చేసుకునే వీలుంది. మీ స్వంతానికి, జీవిత భాగస్వామి, పిల్లలు, మీపై ఆధారపడిన తల్లిదండ్రుల ఆరోగ్య బీమా కోసం చెల్లించే ప్రీమియంలపై మీరు డిడక్షన్స్‌ను క్లెయిమ్ చేయొచ్చు. వయస్సుపరమైన మినహాయింపు పరిమితులను తెలుసుకోవడం, సరైన రికార్డులను దగ్గర ఉంచుకోవడం ద్వారా పన్నులపరమైన ప్రయోజనాలను పొందేందుకు వీలుంటుంది. ఇక క్రిటికల్ ఇల్నెస్ బీమా కూడా మరో కీలకమైనది. నిర్దిష్టమైన తీవ్ర అనారోగ్యానికి గురైనట్లు నిర్ధారణ అయితే, ఇది ఒకేసారి చెల్లింపును అందిస్తుంది. ఆరోగ్యపరంగా అనూహ్య ప్రతికూలతల నుంచి సమగ్ర రక్షణను అందించే ఈ రకమైన బీమా కోసం చెల్లించే ప్రీమియంలకు కూడా సెక్షన్ 80డీ కంద పన్ను మినహాయింపులు వర్తిస్తాయి. మరోవైపు, సెక్షన్ 80డి కింద మొత్తం పరిమితిలో రూ.5000 దాకా ప్రివెంటివ్ ఆరోగ్య పరీక్షల కోసం పెట్టిన ఖర్చులను తీసివేయడానికి కూడా వీలుంటుంది. ప్రివెంటివ్ హెల్త్‌కేర్ ప్రాధాన్యతను, పన్ను ప్రయోజనాలను వివరంగా తెలియజేయడం ద్వారా తరచుగా చెకప్‌లు చేయించుకునేలా, ఆరోగ్యాన్ని కాపాడుకునేలా ప్రజలను ప్రోత్సహించేందుకు సాధ్యపడుతుంది. దేశీయంగా చాలా మటుకు సంస్థలు ఉద్యోగులకు ప్రయోజనాల ప్యాకేజీ కింద ఆరోగ్య బీమాను అందిస్తున్నాయి. ఇలాంటి పాలసీల కోసం యజమానులు చెల్లించే ప్రీమియంలు, సాధారణంగా ఉద్యోగులకు పన్నురహితంగా ఉంటాయి. అయితే, ఉద్యోగులు తమకు లేదా తమ కుటుంబాల కోసం వ్యక్తిగతంగా అదనపు కవరేజీ తీసుకున్నట్లయితే వారు కట్టే ప్రీమియంలకు సెక్షన్ 80డీ కింద డిడక్షన్ లభించగలదు. అటు మొత్తం కుటుంబానికి ఒకే ప్లాన్‌లో కవరేజీ ఇచ్చేలా ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీలు కూడా ఉన్నాయి. వ్యక్తిగత ప్లాన్లతో పోలిస్తే వీటిల్లో డబ్బు ఆదా చేసేందుకు అవకాశం ఉంది. వీటికి కట్టే ప్రీమియంలకు కూడా సెక్షన్ 80డీ కింద పన్ను మినహాయింపులు ఉంటాయి. ఆదాయపు పన్ను చట్టం, 1961 సెక్షన్ 80 ఈ కింద రూ. 75,000 వరకు పన్ను ప్రయోజనాలు అందు బాటులో ఉన్నాయి. పన్ను చట్టాలలో మార్పుకు లోబడి (స్వీయ/భార్య/భర్త/తమపై ఆధారపడిన పిల్లలకు రూ. 25,000 మరియు సీనియర్ సిటిజన్ తల్లిదండ్రులకు రూ. 50,000) ఇవి ఉంటాయి.పథకాన్ని ఎంచుకోవడం కీలకంఆరోగ్య బీమా పాలసీలనేవి అనారోగ్యం వేళ ఆర్థిక భరోసాగా నిలవడమే కాకుండా మీ పన్ను భారాన్ని కూడా తగ్గించుకునేందుకు ఉపయోగపడగలవు. సెక్షన్ 80డీ తో మీ పన్ను భారాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చు. కనుక, మీరు అలాగే మీ కుటుంబం ఆర్థిక స్వేచ్ఛ సాధించే దిశగా వెళ్లే క్రమంలో సరైన ఆరోగ్య బీమా పథకాన్ని ఎంచుకోవడం చాలా ముఖ్యం.. -
ఆరోగ్య బీమా భారం తగ్గేదెలా..?
రమణ్‌సింగ్ (68)కు ఇటీవలే హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి పాలసీ రెన్యువల్ నోటీస్ వచి్చంది. చూస్తే ప్రీమియం గతేడాది కంటే గణనీయంగా పెరిగిపోయింది. ఏకంగా 30 శాతం అధికంగా చెల్లించాల్సి రావడంతో దీన్ని ఎలా అధిగమించాలా? అనే ఆలోచనలో పడ్డాడు. రమణ్‌సింగ్‌కు మాత్రమే ఈ అనుభవం పరిమితం కాదు. దాదాపు అన్ని బీమా సంస్థలు హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంను ఇటీవలి కాలంలో పెంచేశాయి. దీంతో సగటు మధ్యతరగతి వాసులపై హెల్త్ ఇన్సూరెన్స్ రూపంలో భారం పెరిగిపోయింది. కరోనా విపత్తు తర్వాత నుంచి హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంలు గణనీయంగా పెరగడం పాలసీదారులకు తెలిసిన అనుభవమే. దీనికి క్లెయిమ్‌లు భారీగా పెరిగిపోవడమే కారణమని బీమా సంస్థలు చెబుతున్నాయి. ఈ పరిణామాలతో వృద్ధులకు హెల్త్ కవరేజీ విషయంలో కొన్ని బీమా సంస్థలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. అధిక ప్రీమియంకు తోడు, పలు షరతులు పెడుతున్నాయి. వృద్ధులకు హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం భారంగా మారుతున్న తరుణంలో దీన్ని తగ్గించుకునే మార్గాల గురించి చర్చించే కథనమే ఇది. బీమా రంగ అభివృద్ధి, నియంత్రణ సంస్థ (ఐఆర్డీఏఐ) తాజా వార్షిక నివేదిక ప్రకారం.. హెల్త్ ఇన్సూరెన్స్ ఇన్కర్డ్ క్లెయిమ్ రేషియో 2020–21లో 94 శాతంగా ఉంటే, అది 2021–22 సంవత్సరానికి 109 శాతానికి పెరిగింది. ఇన్కర్డ్ క్లెయిమ్ రేషియో 100 శాతానికి దిగువన ఉంటేనే బీమా సంస్థలకు లాభం ఉన్నట్టు. 100 అంతకంటే ఎక్కువ ఉన్నట్టయితే, తమకు వస్తున్న ప్రీమియానికి మించి అవి చెల్లింపులు చేస్తున్నట్టు అర్థం చేసుకోవచ్చు. ‘‘గడిచిన కొన్ని సంవత్సరాలుగా హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లు పెరిగిపోయాయి. కరోనా తర్వాత అన్ని వయసుల వారి నుంచి క్లెయిమ్‌లు 10–30 శాతం వరకు ఎక్కువయ్యాయి. దీనివల్ల వృద్ధులపై భారం పెరిగిపోయింది. వీరు అధిక ప్రీమియం చెల్లించాల్సి వస్తోంది. పైగా వృద్ధుల్లో క్రమం తప్పకుండా ఆదాయం వచ్చే సదుపాయం అందరికీ ఉండదు’’ అని పాలసీబజార్ హెల్త్ ఇన్సూరెన్స్ బిజినెస్ హెడ్ సిద్ధార్థ్ సింఘాల్ తెలిపారు. వృద్ధాప్యంలో ఆరోగ్య సమస్యలు ఎక్కువ. దీంతో ఈ వయసులోని వారికి సహజంగానే ప్రీమియం ఎక్కువగా ఉంటుంది. దీనికితోడు ఇటీవలి కాలంలో క్లెయిమ్‌లు పెరగడంతో బీమా సంస్థలు ప్రీమియంను మరింత పెంచాయి. ‘‘వృద్ధులకు సహజంగా హెల్త్ రిస్క్‌లు ఎక్కువ. దీర్ఘకాలిక వ్యాధుల కారణంగా వీరు హెల్త్ కవరేజీ ఎక్కువగా వినియోగించుకుంటూ ఉంటారు. కనుక క్లెయిమ్‌ల రిస్క్‌ను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే బీమా సంస్థలు ప్రీమియంను నిర్ధారిస్తుంటాయి. 30 ఏళ్ల వయసు వారి ప్రీమియంతో పోలిస్తే 60 ఏళ్లకు పైబడిన వారి హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం 2.5 రెట్ల నుంచి 4 రెట్ల వరకు అధికంగా ఉంటుంది’’ అని గో డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్ డైరెక్ట్ సేల్స్ హెడ్ వివేక్ చతుర్వేది తెలిపారు. సీనియర్ సిటిజన్లలో కొందరికి బీమా సంస్థలు పాలసీలు ఇచ్చేందుకు నిరాకరిస్తుంటాయి. వారికి ముందస్తుగా నిర్వహించిన వైద్య పరీక్షల్లో వచి్చన ఫలితాలే దీనికి కారణమని బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈవో తపన్ సింఘాల్ పేర్కొన్నారు. కోపేమెంట్.. కోపేమెంట్ ఆప్షన్ ఎంపిక చేసుకుంటే, ప్రతి క్లెయిమ్‌లో పాలసీదారు తన వంతు కొంత భరించాల్సి ఉంటుంది. మిగిలిన మొత్తాన్ని బీమా సంస్థలు చెల్లిస్తాయి. సాధారణంగా ఈ కోపేమెంట్ అనేది బీమా కవరేజీలో 10 శాతం నుంచి 50 శాతం వరకు ఉంటుంది. 20 శాతం కోపేమెంట్ ఎంపిక చేసుకుంటే, క్లెయిమ్ మొత్తంలో పాలసీదారు 20 శాతం, మిగిలిన 80 శాతం బీమా సంస్థ చెల్లించాల్సి ఉంటుంది. క్లెయిమ్‌లో తన వైపు భారం తగ్గుతుంది కనుక బీమా సంస్థ ప్రీమియంలో తగ్గింపును ఇస్తుంది. ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే.. కోపేమెంట్తో ప్రీమియంలో ఆదా అయిన మొత్తం కంటే, క్లెయిమ్ వచి్చనప్పుడు పాలసీదారు తన వంతు వాటాగా చెల్లించే మొత్తమే అధికంగా ఉంటుంది. అయినా సరే భారీ ప్రీమియం చెల్లించడం కష్టమనుకునే వారు కోపేమెంట్ ఆప్షన్‌ను పరిశీలించొచ్చు. దీనివల్ల పాలసీ ప్రీమియంలో 30–40 శాతం వరకు ఆదా చేసుకోవచ్చు. ‘‘వృద్ధులకు అదనపు వైద్య సంరక్షణ అవసరం ఉంటుంది. కనుక వారు ఆసుపత్రిలో చేరితే ఎక్కువ రోజుల పాటు ఉండాల్సి రావచ్చు. అందుకని హెల్త్ ఇన్సూరెన్స్‌ను ఎంపిక చేసుకునే వారు ఇన్ పేషెంట్ (ఆసుపత్రిలో ఉండి చికిత్స పొందే వారు)లో గరిష్ట కవరేజీని ఆఫర్ చేసే ప్లాన్‌ను పరిశీలించాలి. వ్యాధుల వారీగా ఎవైనా మినహాయింపులు, ఉప పరిమితులు, కోపేమెంట్ ఉన్నాయేమో పరిశీలించాలి’’ అని తపన్ సింఘాల్ సూచించారు. డిడక్టబుల్.. పాలసీదారులు ప్రీమియం తగ్గించుకునేందుకు ఉన్న మార్గాల్లో మరొకటి డిడక్టబుల్ క్లాజ్. ఇది కూడా కోపేమెంట్ మాదిరే పనిచేస్తుంది. ఉదాహరణకు రూ.50,000 డిడక్టబుల్ అనే క్లాజ్ ఉందనుకుంటే.. రూ.50,000 మించిన క్లెయిమ్‌లకే బీమా సంస్థలు చెల్లింపులు చేస్తాయి. కోపేమెంట్ అలా కాదు. 10 శాతం కోపే ఉంటే రూ.50,000 క్లెయిమ్‌లో పాలసీహోల్డర్ రూ.5,000 చెల్లించాల్సి వస్తుంది. బీమా సంస్థ రూ.45,000 చెల్లిస్తుంది. కోపేమెంట్ అనేది ప్రతి క్లెయిమ్‌కు వర్తిస్తుంది. అదే డిడక్టబుల్ అనేది ఏడాది మొత్తానికి (కొన్ని బీమా సంస్థల్లో) స్థిరంగా ఉంటుంది. డిడక్టబుల్ ఎంత ఎక్కువ పెట్టుకుంటే, ప్రీమియం అంత మేర తగ్గుతుంది. క్లెయిమ్‌లలో ఆ మేర భారం పాలసీదారులపై పడుతుంది. మరొక ఉదాహరణలో.. ఆస్పత్రిలో చేరి సర్జరీ చేయించుకుంటే రూ.2,00,000 బిల్లు వచి్చంది. డిడక్టబుల్ రూ.20,000 ఉంటే, అప్పుడు పాలసీదారు ఈ మొత్తాన్ని చెల్లించాలి. ఆ తర్వాత మిగిలిన రూ.1,80,000 కోసం బీమా సంస్థ వద్ద క్లెయిమ్ చేసుకోవచ్చు. డిడక్టబుల్లో ఇప్పటి వరకు చెప్పుకున్నది స్వచ్చందమైనది. రూమ్ రెంట్ ఆస్పత్రిలో చేరిప్పుడు పొందే రూమ్ వసతి కూడా ప్రీమియంను నిర్ణయిస్తుంది. ఎలాంటి పరిమితులు లేని ప్లాన్‌తో పోలిస్తే సింగిల్ రూమ్, షేరింగ్ రూమ్ ఆప్షన్‌తో కూడిన పాలసీల ప్రీమియం తక్కువగా ఉంటుంది. కార్పొరేట్ ఆస్పత్రుల్లో అన్ని రకాల వసతులు ఉంటాయి. అన్నింటిలోకి షేరింగ్ తక్కువగా ఉంటుంది. కనుక షేరింగ్ ఆప్షన్ ఎంపిక చేసుకోవడం ద్వారా ప్రీమియం తగ్గేలా చూసుకోవచ్చు. ఒకవేళ షేరింగ్ ఎంపిక చేసుకుంటే.. ఆస్పత్రిలో చేరినప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ షేరింగ్ వసతికే పరిమితం కావడం మంచిది. ఖరీదైన వసతి తీసుకుంటే ఆస్పత్రి బిల్లులో కొంత పాలసీదారు చెల్లించాల్సి వస్తుంది. ఇది కేవలం రూమ్ రెంట్ వరకే పరిమితం కాదు. ఎందుకంటే ఖరీదైన వసతిలో ఉండి పొందే వైద్యం సాధారణ షేరింగ్ రూమ్‌లో పొందే వైద్యంతో పోలిస్తే అధిక వ్యయాలతో ఉంటుంది. కనుక పాలసీ క్లాజ్‌లో ఉన్న వసతికి మించి ఖరీదైన వసతిలో ఉంటే బిల్లులో కొంత మొత్తాన్ని పాలసీదారు చెల్లించాలి. ఫిట్‌గా ఉంటే ప్రయోజనం ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవడం ద్వారా ప్రీమియంలో తగ్గింపు పొందే అవకాశం ఉంది. రోజువారీ వ్యాయామం చేసే పాలసీహోల్డర్లకు బీమా సంస్థలు రివార్డు పాయింట్లు కేటాయిస్తున్నాయి. ఒక ఏడాది మొత్తం మీద ఇలా పొందిన రివార్డు పాయింట్లను, మరుసటి ఏడాది రెన్యువల్ ప్రీమియంలో తగ్గింపునకు వినియోగించుకోవచ్చు. ఉదాహరణకు రోజువారీ 10,000 అడుగులు నడవడం. లేదంటే రోజులో కనీసం 4,000 అడుగులు నడవడం వంటివి. లేదా జాగింగ్ చేయడం ద్వారా హెల్త్ రివార్డులు సంపాదించుకోవచ్చు. ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్ హెల్త్ రివార్డులతో ప్రీమియంలో నూరు శాతం డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తోంది. పోర్టింగ్ మొబైల్ నంబర్ పోర్టబులిటీ మాదిరే, హెల్త్ ఇన్సూరెన్స్‌ను కూడా ఒక బీమా సంస్థ నుంచి మరో బీమా సంస్థకు పోర్టింగ్ పెట్టుకోవచ్చు. బీమా సంస్థ సేవలు నచ్చకపోయినా, ప్రీమియం భారం అనిపించినా.. కారణం ఏదైనా పోర్టింగ్ సదుపాయం ఉంది. పోర్టింగ్ వల్ల పూర్వపు బీమా సంస్థలో పొందిన ప్రయోజనాలు క్యారీ ఫార్వార్డ్ (బదిలీ) అవుతాయి. పోర్టింగ్ వల్ల నో క్లెయిమ్ బోనస్ ఒక్కటి నష్టపోవాల్సి రావచ్చు. పాత సంస్థలో ముందు నుంచి ఉన్న వ్యాధులకు వెయిటింగ్ పీరియడ్ పూర్తి చేసి ఉంటే, కొత్త సంస్థలో మొదటి రోజు నుంచే కవరేజీ పొందొచ్చు. పాలసీ రెన్యువల్ గడువుకు 60 రోజుల నుంచి 45 రోజుల్లోపు కొత్త సంస్థ వద్ద పోర్టింగ్ అభ్యర్థన దాఖలు చేసుకోవాలి. ప్రస్తుత పాలసీలోని కవరేజీ ఫీచర్లతో పోలిస్తే, మెరుగైన సదుపాయాలతో తక్కువ ప్రీమియంతో ఆఫర్ చేస్తున్న సంస్థకు మారిపోవడం వల్ల కొంత ఆదా చేసుకోవడానికి అవకాశం ఉంది. సూపర్ టాపప్ వృద్ధాప్యంలో నామమాత్రపు కవరేజీ చాలకపోవచ్చు. మెరుగైన కవరేజీతోనే తగినంత రక్షణ లభిస్తుంది. కానీ, మెరుగైన కవరేజీ కోసం ప్రీమియం ఎక్కువగా చెల్లించాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో రెగ్యులర్ ఇండెమ్నిటీ ప్లాన్‌ను పరిమిత కవరేజీతో తీసుకోవాలి. దీనివల్ల ప్రీమియం తగ్గించుకోవచ్చు. దీనికి అదనపు కవరేజీతో సూపర్ టాపప్ తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఒకే పాలసీని అధిక కవరేజీతో తీసుకోవడంతో పోలిస్తే ప్రీమియం చాలా వరకు తగ్గుతుంది. ఉదాహరణకు రూ.5 లక్షలకు బేసిక్ ప్లాన్ తీసుకుని, దీనికి రూ.20 లక్షల సూపర్ టాపప్ చేసుకున్నారని అనుకుందాం. క్లెయిమ్ రూ.5 లక్షలు దాటినప్పుడు, అదనపు మొత్తానికి సూపర్ టాపప్ ఇచి్చన బీమా సంస్థ నుంచి చెల్లింపులు వస్తాయి. రెగ్యులర్ ప్లాన్‌తో పోలిస్తే ఇలా చేయడం వల్ల ప్రీమియంను 30 శాతం వరకు ఆదా చేసుకోవచ్చు. ఇక్కడ టాపప్ ప్లాన్లు కూడా ఉన్నాయి. కానీ టాపప్, సూపర్ టాపప్ మధ్య చాలా వ్యత్యాసం ఉంది. టాపప్ ప్లాన్‌లో ఒక పాలసీ సంవత్సరంలో ప్రతి క్లెయిమ్‌కు విడిగా నిర్ణీత మొత్తం దాటినప్పుడే చెల్లింపులు లభిస్తాయి. సూపర్ టాపప్ ప్లాన్‌లో అలా కాదు. ఏడాది మొత్తం మీద నిర్ధేశిత డిడక్టబుల్ ఒక్కటిగానే ఉంటుంది. అంటే బేస్ ప్లాన్ రూ.5 లక్షలు తీసుకున్నారు. దీనికి టాపప్ జోడించుకుంటే, ప్రతి క్లెయిమ్‌లోనూ రూ.5 లక్షలు మించినప్పుడే, రూ.5 లక్షలు మినహాయించి (డిడక్టబుల్) మిగిలినది టాపప్ నుంచి చెల్లింపులు వస్తాయి. అదే సూపర్ టాపప్‌లో.. ఒక ఏడాదిలో మూడు పర్యాయాలు ఆస్పత్రిలో చేరి (రూ.3లక్షలు, రూ.3 లక్షలు, రూ.4 లక్షలు) రూ.10 లక్షలు బిల్లు వచి్చ నా, రూ.5 లక్షలు డిడక్టబుల్ పోను, మిగిలిన రూ.5 లక్షలను క్లెయిమ్ చేసుకోవచ్చు. బేస్ ప్లాన్ పరిమిత కవరేజీతో తీసుకుని, సూపర్ టాపప్ జోడించుకోలేని వారు.. చిన్న వాటికి క్లెయిమ్ చేసుకోకుండా ఉంటే మంచిది. దీనివల్ల నో క్లెయిమ్ బోనస్ రూపంలో బీమా కవరేజీని ఎలాంటి అదనపు ప్రీమియం లేకుండా నూరు శాతం వరకు పెంచుకోవచ్చు. వీటిని అనుసరించొచ్చు.. హెల్త్ ఇన్సూరెన్స్‌ను చిన్న వయసులోనే తీసుకోవాలి. ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఆ వయసులో ఉండవు. దీంతో ప్రీమియం తక్కువగా ఉంటుంది. నేరుగా 60 ఏళ్ల తర్వాత పాలసీ తీసుకునే వారితో పోలిస్తే, ముందు నుంచే హెల్త్ కవరేజీలో ఉన్న వారికి ప్రీమియం కొంత తక్కువ ఉంటుంది. వృద్ధాప్యంలో ఆరోగ్య సమస్యలు ఎక్కువ మందిలో కనిపిస్తుంటాయి. వారికి రిస్క్ ఎక్కువగా ఉంటుందని అధిక ప్రీమియాన్ని కంపెనీలు చార్జ్ చేస్తుంటాయి. ► హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను ఆన్లైన్ ద్వారా నేరుగా బీమా సంస్థ పోర్టల్ నుంచి కొనుగోలు చేస్తే ప్రీమియం 5–10% తక్కువగా ఉంటుంది. కమీషన్లు, ఇతర వ్యయాల భారం తగ్గుతుంది కనుక బీమా సంస్థలు డిస్కౌంట్ ఇస్తాయి. పైగా ఆన్లైన్లో అన్ని బీమా సంస్థల ప్లాన్ల ఫీచర్లు, ప్రీమియంను పోల్చి చూసుకునే వెసులుబాటు పాలసీబజార్ వంటి వేదికలు కలి్పస్తున్నాయి. ఈ విధంగానూ ప్రీమియం భారం తగ్గవచ్చు. ► విడిగా ప్లాన్ తీసుకోవడానికి బదులు కుటుంబం అంతటికీ ఒక్కటే ఫ్లోటర్ పాలసీ తీసుకుంటే ప్రీమియం తగ్గుతుంది. ► అవసరం లేని కవరేజీలకు దూరంగా ఉండాలి. అవసరం లేని యాడాన్‌లను జోడించుకుంటే ప్రీమియం భారం పెరుగుతుంది. ► రూ.5 లక్షల బేసిక్ కవరేజీతో ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్ తీసుకుని, రూ.5 లక్షల డిడక్టబుల్‌తో రూ.20–50 లక్షలకు సూపర్ టాపప్ ప్లాన్ జోడించుకుంటే ప్రీమియం ఆదా అవుతుంది. ► తమ పిల్లలు కార్పొరేట్ సంస్థల్లో పనిచేస్తుంటే, వారి కార్యాలయం తరఫున తల్లిదండ్రులు కవరేజీ కల్పించుకోవడం ఒక మార్గం. గ్రూప్ ప్లాన్ కావడంతో ప్రీమియం తగ్గుతుంది. ► ఇక ప్రీమియంలో ఆదా కోరుకునే వారు ఒక ఏడాదికి కాకుండా మూడేళ్లకు ఒకేసారి ప్రీమియం చెల్లించడాన్ని పరిశీలించొచ్చు. దీనివల్ల ప్రీమియంలో 10 శాతం వరకు ఆదా అవుతుంది. -
టాటా ఏఐజీ నుంచి హెల్త్ సూపర్ చార్జ్ ప్లాన్
ముంబై: టాటా ఏఐజీ జనరల్ ఇన్సూరెన్స్.. ‘హెల్త్ సూపర్ చార్జ్’ ప్లాన్‌ను ప్రారంభించింది. దీని కింద పాలసీదారులు ఐదు రెట్లు అధికంగా హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీని పొందొచ్చు. ఏటా 50 శాతం రెన్యువల్ బోనస్ చొప్పున గరిష్టంగా 500 శాతం (ఐదు రెట్లు) కవరేజీని పెంచుకోవచ్చు. టైర్–1 నుంచి టైర్–4 వరకు పట్టణాల్లో నివసించే వారి భిన్న రకాల ఆరోగ్య సంరక్షణ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ ప్లాన్‌ను తీసుకొచ్చినట్టు సంస్థ తెలిపింది. ప్రీమియంపై 5 శాతం డిస్కౌంట్, సమ్ ఇన్సూర్డ్ అపరిమిత రీస్టోరేషన్ సదుపాయం, ముందు నుంచి ఉన్న వ్యాధుల వేచి ఉండే కాలాన్ని నాలుగేళ్ల నుంచి 30 రోజులకు తగ్గించుకునే ఆప్షన్లు ఇందులో ఉన్నాయి. ఈ ప్లాన్ కింద రూ.5–20 లక్షల కవరేజీని పొందొచ్చు. ఏటా ఉచిత హెల్త్ చెకప్ సదుపాయం కూడా ఉంది. -
క్యూఆర్ కోడ్‌తో స్టార్ హెల్త్ పాలసీ కొనుగోలు
న్యూఢిల్లీ: ఆరోగ్య బీమా పాలసీల కొనుగోలు, రెన్యువల్ ప్రక్రియను మరింత సులభతరం చేయడంపై స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా యూపీఐ క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లింపులు జరిపే సౌలభ్యాన్ని అందుబాటులోకి తెచి్చంది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) తోడ్పాటుతో దీన్ని రూపొందించినట్లు సంస్థ ఎండీ ఆనంద్ రాయ్ తెలిపారు. దీనితో లావాదేవీకి పట్టే సమయం గణనీయంగా తగ్గగలదని వివరించారు. ప్రీమియం చెల్లింపును గుర్తు చేసేందుకు పంపించే సందేశాల్లో యూపీఐ క్యూఆర్ కోడ్ ఉంటుందని, అందులో ఎంత ప్రీమియం కట్టాలనే వివరాలు నిక్షిప్తమై ఉంటాయని సంస్థ చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ చిట్టి బాబు తెలిపారు. దాన్ని స్కాన్ చేయడం ద్వారా లేదా లింక్‌ను క్లిక్ చేసి యూపీఐ యాప్ ద్వారా సెకన్లలో చెల్లింపును పూర్తి చేయొచ్చన్నారు. స్టార్ హెల్త్ కూడా సౌకర్యవంతమైన యూపీఐ ఆధారిత ప్రీమియం చెల్లింపు ఆప్షన్‌ను ప్రవేశపెట్టడం సంతోషకరమని ఎన్పీసీఐ చీఫ్ (ప్రోడక్ట్స్) కునాల్ కలావతియా చెప్పారు. -
సీనియర్ సిటిజన్స్‌కు ఆరోగ్య బీమా భరోసా
దేశీయంగా వయస్సు పైబడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. పీఆర్బీ గణాంకాల ప్రకారం 2050 నాటికి 14.4 కోట్ల మంది పైచిలుకు సీనియర్ సిటిజన్స్ ఉంటారని అంచనా. ఈ నేపథ్యంలో వారి ఆరోగ్యానికి, సంక్షేమానికి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. మన కుటుంబాల్లో కూడా పెద్దవారికి నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చూసేందుకు ఆరోగ్య బీమా అవసరం ఎంతైనా ఉంది. సీనియర్ సిటిజన్స్ కోసం ఆరోగ్య బీమా పాలసీ తీసుకునేటప్పుడు వారి అవసరాలను దృష్టిలోఉంచుకోవాలి. ఇందుకోసం అయిదు అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. ► వెయిటింగ్ పీరియడ్ తక్కువగా ఉండాలి: ఆరోగ్యబీమా పాలసీ కవరేజీ సమగ్రంగా ఉండేలా చూసుకోవాలి. తక్కువ వెయిటింగ్ పీరియడ్, అలాగే ఎలాంటి మెడికల్ చెకప్‌లు అవసరం లేకుండా అప్పటికే ఉన్న అనారోగ్య సమస్యలకు కూడా కవరేజీ లభించేలా చూసుకోవాలి. ఉదాహరణకు, మణిపాల్ సిగ్నా అందించే ప్రైమ్ సీనియర్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ అనేది సీనియర్ల విభిన్న ఆరోగ్య అవసరాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించినది. ఎటువంటి మెడికల్ చెకప్‌లు అవసరం లేకుండా 91వ రోజు నుంచే ప్రీ–ఎగ్జిస్టింగ్ అనారోగ్య పరిస్థితులకు కవరేజీని అందిస్తుంది. ► కో–పే, ఉప–పరిమితులు ఉండొద్దు: కో–పే, ఉప–పరిమితులు ఉండని హెల్త్ ప్లాన్ ఎంచుకోవడం మంచిది. ఎందుకంటే సబ్–లిమిట్ ఉన్న ప్లాన్ వల్ల మళ్లీ మన జేబుపై భారం పడుతుంది. పాలసీ పరిధిలోకి రాని కొన్ని ఖర్చులను మనమే భరించాల్సి వస్తుంది. ► అపరిమితంగా సమ్ ఇన్సూర్డ్ పునరుద్ధరణ: ఆరోగ్య బీమాలో పరిగణనలోకి తీసుకోతగిన మరో పెద్ద అంశం ఏమిటంటే, సమ్ ఇన్సూర్డ్‌ను అపరిమితంగా రీస్టోర్ చేసే అవకాశం. ఉదాహరణకు మీరు ఏదైనా నిర్దిష్ట అనారోగ్యానికి సంబంధించిన, లేక దానికి సంబంధించని మరోదాని కోసమైనా కొత్తగా క్లెయిమ్ చేసినప్పుడు, మీ హెల్త్ ప్లాన్ తప్పకుండా సమ్ ఇన్సూర్డ్ 100 శాతం పునరుద్ధరించేటువంటిదై ఉండాలి. ► క్యుములేటివ్ బోనస్: క్లెయిమ్స్ గానీ దాఖలు చేయని పక్షంలో కొన్ని ఆరోగ్య బీమా పాలసీల్లో సమ్ ఇన్సూర్డ్కి ఏటా 10 శాతం మేర క్యుములేటివ్ బోనస్ జతవుతుంటుంది. సమ్ ఇన్సూర్డ్కి 100 శాతం స్థాయికి చేరే వరకు ఈ బోనస్ ఏటా జతవుతూనే ఉంటుంది. ఫలితంగా పదేళ్లలో ఎలాంటి అదనపు ఫీజు లేకుండానే కవరేజీ రెట్టింపవుతుంది. ► ప్రివెంటివ్ చెకప్: తీవ్రమైన అనారోగ్యాలు ఉన్న వయో వృద్ధులు తరచుగా వైద్యులను సంప్రదించాల్సి వస్తుంటుంది. అపాయింట్మెంట్లు లభించడం కొన్ని సందర్భాల్లో కష్టం కావచ్చు. కాబట్టి బీమా సంస్థల నెట్వర్క్ పరిధిలోని డాక్టర్లు, స్పెషలిస్టులతో అపరిమిత టెలీకన్సల్టేషన్స్ (ఫోన్ లేదా చాట్ ద్వారా) సదుపాయం ఇచ్చే ప్లాన్‌ను ఎంచుకోవడం మంచిది. అలాగే ఏటా నగదురహిత హెల్త్ చెకప్ అందించేదిగా కూడా పాలసీ ఉండాలి. ప్రతి ఒక్కరి ఆరోగ్య అవసరాలు వివిధ రకాలుగా ఉంటాయని గుర్తుంచుకోవాలి. వివిధ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లు, వాటి ఫీచర్లు, వ్యయాలను జాగ్రత్తగా పోల్చి చూసుకోవాలి. సీనియర్ సిటిజన్స్‌కు శారీరకంగాను, ఆర్థికంగాను ప్రయోజనకరంగా ఉండే సమగ్రమైన ఆరోగ్య బీమా కవరేజీని అందించే పాలసీని ఎంచుకోవాలి. – ప్రియా గిల్భిలే, సీవోవో, మణిపాల్‌సిగ్నా హెల్త్ ఇన్సూరెన్స్ -
మనోళ్ల ‘హెల్త్ కవర్’ అంతంతే..!
సాక్షి, హైదరాబాద్: జీవిత బీమా, హెల్త్ కవర్–ఇన్సూరెన్స్, ఆరోగ్య బీమా కవరేజీ వంటి విషయాల్లో భారతీయులు అంత చురుకుగా వ్యవహరించడం లేదనే అభిప్రాయం ఉంది. కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో జీవిత బీమా, సరైన ఆరోగ్య రక్షణలు లేనివారు రూ. 20 వేల కోట్లకు పైగానే కరోనా సంబంధిత ఆరోగ్య సమస్యలపై చికిత్స కోసం వ్యయం చేయాల్సి వచ్చిదనే అనధికార అంచనాలున్నాయి. కరోనా కేసులు ఉధృతంగా ఉన్న రోజుల్లో ఎదురైన పరిస్థితుల కారణంగా మధ్య, దిగువ, పేద వర్గాల ప్రజలకు చెందిన వారు తీవ్రమైన ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొన్న ఉదంతాలు చాలానే వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం కరోనా మహమ్మారి అనంతర పరిస్థితుల్లో హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తప్పనిసరి అని 46 శాతం మంది భావిస్తున్నారు. ఇప్పుడు పెరుగుతున్న వైద్యఖర్చులకు ఈ హెల్త్ పాలసీలు ఉపయోగపడతాయని 43 శాతం మంది అభిప్రాయపడుతున్నారు. ఇదీ అధ్యయనం... తాజాగా భారతీయ టెక్–ఫస్ట్ ఇన్సూరెన్స్ కంపెనీ–అక్నో అధ్యయనంలో వివిధ అంశాలు వెల్లడయ్యాయి. 68 శాతం మందికి రూ.10 లక్షలలోపే ఆరోగ్య బీమా కవరేజీ ఉందని, వారిలోనూ 27 శాతం మందికి మెడికల్ కవర్ రూ. 5 లక్షలలోపే ఉన్నట్టుగా ఇది స్పష్టం చేసింది. దేశంలోని ఆరు మెట్రో నగరాల్లోని 28–55 ఏళ్ల మధ్య వయసున్న వారి నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఈ సంస్థ నివేదికను సిద్ధం చేసింది. అన్లిమిటెడ్ కవరేజీ, కన్జుమబుల్స్, రూమ్‌రెంట్ క్యాపింగ్ వంటి వాటిపై పాలసీ హోల్డర్లకు అంతగా అవగాహన ఉండటం లేదన్న విషయం నివేదికలో వెల్లడైంది. -
సీనియర్ సిటిజన్ల కోసం బజాజ్ నుంచి సరికొత్త ఇన్సూరెన్స్ ప్లాన్స్
హైదరాబాద్: ప్రైవేట్ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ బజాజ్ అలయాంజ్ తాజాగా సీనియర్ సిటిజన్ల కోసం ’రెస్పెక్ట్ సీనియర్ కేర్’ రైడర్‌ను ప్రవేశపెట్టింది. మూడు ప్లాన్లలో ఇది అందుబాటులో ఉంటుంది. దీనికి ప్రీమియం రూ. 700 నుంచి రూ. 7,500 వరకూ (జీఎస్టీ కాకుండా) ఉంటుందని సంస్థ తెలిపింది. ప్లాన్‌ను బట్టి ఎమర్జెన్సీ రోడ్ అంబులెన్స్ సర్వీస్, స్మార్ట్ వాచ్ ఫాల్ డిటెక్షన్, ఫిజియోథెరపి.. నర్సింగ్ కేర్ తహా హోమ్ కేర్ సర్వీసులు, మెడికల్ టెలీ–కన్సల్టేషన్ సర్వీసులు మొదలైనవి ఈ రైడర్‌తో పొందవచ్చని కంపెనీ ఎండీ తపన్ సింఘెల్ తెలిపారు. 50 ఏళ్లు పైబడి, కంపెనీ అందించే బేస్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఉన్న వారు ఈ రైడర్‌ను ఎంచుకోవచ్చు. -
ప్రతి కుటుంబానికి ఆరోగ్య బీమా
న్యూఢిల్లీ: దేశంలో ప్రతి కుటుంబానికి ఆరోగ్య బీమాను (సార్వత్రిక ఆరోగ్య బీమా) చేరువ చేసే లక్ష్యంతో.. బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ) 15 మంది సభ్యులతో ‘హెల్త్ ఇన్సూరెన్స్ కన్సల్టేటివ్ కమిటీ’ని (ఆరోగ్య బీమా సంప్రదింపుల కమిటీ) ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. రెండేళ్ల కాలానికి ఈ కమిటీని నియమించింది. ఈ కమిటీకి ఐఆర్డీఏఐ సభ్యుడైన రాకేశ్ జోషి నేతృత్వం వహిస్తారు. హెల్త్ ఇన్సూరెన్స్ సజావుగా నిర్వహించుకునేందుకు, వ్యాపార సులభతర నిర్వహణకు సూచనలు ఇవ్వాలని ఐఆర్డీఏఐ కోరింది. దేశంలో ప్రతి కుటుంబం ఆరోగ్య బీమా కలిగి ఉండడం అవసరమని పేర్కొంది. ‘‘దేశంలో హెల్త్ ఇన్సూరెన్స్ విస్తరణను పెంచాలి. ఇందుకు అడ్డుగా ఉన్న సవాళ్లు, సమస్యలను గుర్తించి, వాటిని అధిగమించేందుకు అవసరమైన సిఫారసులు చేయాలి’’అని కమిటీని కోరింది. డేటా విశ్లేషణ సహా పలు విధానాల అమలులో ప్రామాణిక విధానాలను కూడా కమిటీ సూచించనుంది. మారుతున్న ఆరోగ్య సంరక్షణ అవసరాలకు తగ్గట్టు హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందాలని ఐఆర్డీఏఐ పేర్కొంది. ఆరోగ్య సంరక్షణ వ్యయాలను తట్టుకునేందుకు రక్షణగా బీమాను కొనుగోలు చేస్తున్న వారి.. అన్ని రకాల అవసరాలను తీర్చేలా ఉండాలని అభిప్రాయపడింది. -
ప్రభుత్వ ఇన్సూరెన్స్ ప్రీమియం ధరల్ని పెంచాల్సిందే.. పోటీ పడాల్సిందే!
న్యూఢిల్లీ: జీవిత బీమా కంపెనీలు జూలై మాసంలో వ్యాపార పరంగా మంచి వృద్ధిని చూశాయి. నూతన పాలసీల రూపంలో ప్రీమియం ఆదాయం 91 శాతం పెరిగి రూ.39,079 కోట్లు వసూలైంది. 2021 జూలైలో ఎల్ఐసీ సహా 24 జీవిత బీమా సంస్థలు నూతన పాలసీల రూపంలో సంపాదించిన ప్రీమియం ఆదాయం రూ.20,435 కోట్లుగా ఉండడం గమనించాలి. ఈ ఏడాది జూలైలో ఎల్ఐసీ నూతన పాలసీ ప్రీమియం రెండు రెట్లకు పైగా వృద్ధి చెందింది. గతేడాది జూలైలో రూ.12,031 కోట్ల ఆదాయం వసూలు కాగా, ఈ ఏడాది ఇదే నెలలో రూ.29,117 కోట్లకు దూసుకుపోయింది. 19 శాతం పెరిగిన ప్రీమియం ఆదాయం జీవిత బీమా మార్కెట్లో ఎల్ఐసీ వాటా 68.6 శాతంగా ఉంది. మిగిలిన 23 ప్రైవేటు జీవిత బీమా సంస్థలకు నూతన పాలసీల ప్రీమియం ఆదాయం 19 శాతం పెరిగి రూ.9,962 కోట్లుగా ఉంది. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జూలై వరకు నాలుగు నెలల్లో 24 జీవిత బీమా సంస్థలకు కొత్త పాలసీల రూపంలో వచ్చిన ప్రీమియం ఆదాయం రూ.1,12,753 కోట్లుగా ఉంది. ఇది అంతక్రితం ఏడాది ఇదే కాలంలో రూ.73,160 కోట్లుగా ఉంది. ఒక్క ఎల్ఐసీ వరకే చూస్తే ఈ నాలుగు నెలల్లో నూతన ప్రీమియం ఆదాయం 62 శాతం వృద్ధితో రూ.77,318 కోట్లు వసూలైంది. ప్రీమియం పెంచాల్సిందే.. పోటీ పడాల్సిందే! ప్రభుత్వరంగంలోని నాలుగు సాధారణ బీమా సంస్థలు.. ప్రైవేటు సంస్థలతో పోటీ పడాలంటే ప్రీమియం పెంచాల్సిందేనని, వాటి ఐటీ వ్యవస్థలను మెరుగుపరుచుకోక తప్పదని కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) తన నివేదికలో ప్రస్తావించింది. గడిచిన ఐదు ఆర్థిక సంవత్సరాల్లో 2016–17 నుంచి 2020–21 మధ్య.. న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్, ఓరియంటల్ ఇన్సూరెన్స్, నేషనల్ ఇన్సూరెన్స్ రూ.26,334 కోట్లు నష్టపోయినట్టు తెలిపింది. ఈ సంస్థలకు ఆరోగ్య బీమా రెండో అతిపెద్ద వ్యాపారంగా ఉందంటూ.. సంబంధిత ఐదు సంవత్సరాల్లో రూ.1,16,551 కోట్ల స్థూల ప్రీమియం ఆదాయం వచ్చినట్టు పేర్కొంది. ఆరోగ్య బీమా మార్కెట్లో ఇవి క్రమంగా తమ వాటాను ప్రైవేటు సంస్థలకు కోల్పోతున్నట్టు ప్రస్తావించింది. బీమా వ్యాపారానికి సంబంధించి నిర్ధేశిత అండర్ రైటింగ్ (క్లెయిమ్‌లకు సంబంధించి) నిబంధనలను ఇవి అనుసరించడం లేదని కాగ్ గుర్తించింది. ‘‘స్టాండలోన్ గ్రూప్ పాలసీలకు కంబైన్డ్ రేషియో 95 శాతం మించకూడదు. క్రాస్ సబ్సిడీ ఉన్న గ్రూపు పాలసీలకు 100 శాతం మించకూడదు. కానీ, గ్రూపు హెల్త్ ఇన్సూరెన్స్‌ల కంబైన్డ్ రేషియో 125–165 శాతం మధ్య ఉంది. ఈ సంస్థల్లోని ఐటీ వ్యవస్థల నుంచి సరైన తనిఖీలు, నియంత్రణలు లోపించాయి’’అని వెల్లడించింది. -
రిటైల్ హెల్త్ ఇన్సూరెన్స్‌పై ఐసీఐసీఐ లాంబార్డ్ గురి..
న్యూఢిల్లీ: ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ.. వృద్ధి అవకాశాలు పుష్కలంగా ఉన్న రిటైల్ హెల్త్ ఇన్సూరెన్స్ విభాగంలో మరింత బలోపేతం కావడంపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా అదనపు పెట్టుబడులు పెట్టినట్టు సంస్థ వార్షిక నివేదికలో వాటాదారులకు తెలియజేసింది. సంస్థ స్థూల ప్రీమియం ఆదాయం (జీడీపీఐ) గత ఆర్థిక సంవత్సరానికి రూ.17,977 కోట్లుగా ఉంది. ఇది అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో రూ.14,003 కోట్లుగా ఉన్నట్టు తెలిపింది. వార్షికంగా ప్రీమియం ఆదాయంలో 28.7 శాతం వృద్ధి నమోదైంది. భారతీ ఆక్సా జనరల్ ఇన్సూరెన్స్‌కు సంబంధించి నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ వ్యాపారాన్ని విజయవంతంగా విలీనం చేసుకుంది. ఈ విలీనం అనంతరం జీడీపీఐ పరంగా పరిశ్రమలో రెండో స్థానానికి ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ చేరుకుంది. ఇక జనరల్ ఇన్సూరెన్స్ పరిశ్రమ 2021–22లో 11 శాతం వృద్ధిని చూడడం గమనార్హం. ‘‘పరిశ్రమకు హెల్త్ ఇన్సూరెన్స్ అత్యధిక వ్యాపారాన్ని తెచ్చి పెడుతోంది. ఈ విభాగంలో ఐసీఐసీఐ లాంబార్డ్ కూడా మంచి వృద్ధిని చూస్తోంది. రిటైల్ హెల్త్ విభాగంలో వృద్ధి అవకాశాల దృష్ట్యా మా పెట్టుబడులను పెంచాం. రిటైల్ హెల్త్ ఏజెన్సీ బృందంలో విక్రయదారుల సంఖ్యను పెంచాం’’అని ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈవో భార్గవ్ దాస్‌గుప్తా వాటాదారులకు వివరించారు. అధిక వృద్ధి నమోదు.. ‘‘సంస్థ మోటారు ఇన్సూరెన్స్ వ్యాపారం గత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో పరిమిత వృద్ధినే చూసింది. సరఫరా సమస్యలు, డిమాండ్ సెంటిమెంట్ తక్కువగా ఉండడం కారణాలు. ఇక ద్వితీయ ఆరు నెలల్లో మోస్తరు స్థాయికి వృద్ధి చేరుకుంది. పరిశ్రమ కంటే కంపెనీయే అధిక వృద్ధిని సాధించింది’’అని దాస్ గుప్తా తెలిపారు. ఎస్ఎంఈ విభాగంలో 17.8 శాతం వృద్ధిని చూసింది. ఫైర్ ఇన్సూరెన్స్‌లో సంస్థ వాటా 12.8 శాతం, ఇంజనీరింగ్‌లో 15.2 శాతం, మెరైన్కార్గో ఇన్సూరెన్స్‌లో 17.9 శాతానికి చేరుకుంది. -
మణిపాల్‌సిగ్నా ప్రోహెల్త్ ప్రైమ్ బీమా పాలసీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రైవేట్ ఆరోగ్య బీమా సంస్థ మణిపాల్‌సిగ్నా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ కొత్తగా ప్రోహెల్త్ ప్రైమ్ పేరిట హెల్త్ పాలసీని ఆవిష్కరించింది. ఆస్పత్రి చికిత్స వ్యయాలకు మాత్రమే పరిమితం కాకుండా క్యాష్‌లెస్ అవుట్‌పేషెంట్ డిపార్ట్మెంట్ వ్యయాలకు (డాక్టర్ కన్సల్టేషన్, వైద్య పరీక్షలు, ఫార్మసీ ఖర్చులు మొదలైనవి) కూడా కవరేజి అందించడం ఈ పాలసీ ప్రత్యేకత అని సంస్థ ఎండీ ప్రసూన్ సిక్దర్ తెలిపారు. కస్టమర్లు ఎదుర్కొంటున్న సవాళ్లపై తాము నిర్వహించిన అధ్యయనంలో దేశీయంగా అవుట్పేషంట్ డిపార్ట్ వ్యయాలు మొత్తం హెల్త్‌కేర్ ఖర్చుల్లో 62 శాతం స్థాయిలో ఉంటున్నాయని, ఆస్పత్రిలో చేరితే బిల్లులో వైద్యయేతర వ్యయాలు 10–12% మేర ఉంటున్నాయని తేలినట్లు ఆయన వివరించారు. ఈ నేపథ్యంలోనే సమగ్రమైన బీమా పాలసీని అందించాలనే ఉద్దేశంతో ప్రోహెల్త్ ప్రైమ్‌ను రూపొందించినట్లు సిక్దర్ పేర్కొన్నారు. -
ప్రెగ్నెన్సీ ఇన్సూరెన్స్ ప్లాన్: హాస్పిటల్ బిల్ ఎన్నిరోజులకు చెల్లిస్తారు!
న్యూఢిల్లీ: హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలకు సంబంధించి పరిహారం చెల్లించేందుకు.. బీమా సంస్థలు సగటున 20 నుంచి 46 రోజుల సమయాన్ని తీసుకుంటున్నట్టు ‘సెక్యూర్‌నౌ’ అనే ప్లాట్‌ఫామ్ నిర్వహించిన సర్వేలో తెలిసింది. ► మెజారిటీ పాలసీదారులు తమ ఆస్పత్రిలో చేరిన తర్వాత రీయింబర్స్మెంట్ క్లెయిమ్ విషయాన్ని బీమా సంస్థలకు వెంటనే తెలియజేస్తున్నారు. కానీ, అదే సమయంలో చెల్లింపులు చేసేందుకు అవి ఎక్కువ సమయం తీసుకుంటున్నాయి. ► మేటర్నిటీ క్లెయిమ్‌లకు (ప్రసవ సంబంధిత) చెల్లింపులు చేయడానికి 7 నుంచి 108 రోజుల సమయం తీసుకుంటున్నాయి. సిజేరియన్ క్లెయిమ్ చెల్లింపులకు 9–135 రోజుల సమయం పడుతోంది. ► అతి తక్కువగా కీమోథెరపీకి 12–35 రోజుల్లోపు పరిహారం చెల్లిస్తున్నాయి. ►ఏటా కోటి హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లు నమోదవుతున్నాయి. ►క్లెయిమ్ చేసిన మొత్తంలో 13–26 శాతాన్ని బీమా సంస్థలు కోత పెడుతున్నాయి. కన్జ్యూమబుల్స్, పరిపాలనా చార్జీల కింద ఈ పనిచేస్తు నాయి. వీటికి సాధారణంగా పరిహారం రాదు. ప్రభుత్వరంగ సాధారణ బీమా సంస్థల పరిధిలో ఆస్పత్రిలో చేరే వారి పాలసీదారుల రేటు తక్కువగా ఉంటోంది. దీంతో తక్కువ క్లెయిమ్‌లు రావడం, ఫలితంగా ప్రీమియం రేట్లు తక్కువగా ఉంటున్నాయి మరిన్ని వివరాలు వెల్లడించాలి.. ‘‘ఆరోగ్యబీమా ఎలా అభివృద్ధి చెందిందన్న దానికి ఇది సంకేతం. క్లెయిమ్‌లకు సంబంధించి పూర్తిస్థాయి వివరాలను బహిరంగ పరచడం తదుపరి అడుగు కావాలి. అప్పుడు క్లెయిమ్‌ల పరిష్కారంలో బలాలు, బలహీనతలపై దృష్టి పెట్టడానికి వీలుంటుంది’’అని సెక్యూర్‌నౌ సహ వ్యవస్థాపకుడు కపిల్ మెహతా పేర్కొన్నారు. చదవండి: ఎల్ఐసీ బంపరాఫర్, మరికొన్ని రోజులే..ఈ ఆఫర్ అస్సలు మిస్ చేసుకోవద్దు! -
Insurance: బేసిక్ పాలసీ సరిపోదు.. ఇవి కూడా ఉంటేనే లాభం
ఆరోగ్య బీమా ప్రతీ కుటుంబానికీ ఉండాలన్న అవగాహన విస్తృతమవుతోంది. ముఖ్యంగా కరోనా మహమ్మారి ప్రతాపంతో బీమా అవసరాన్ని చాలా మంది తెలుసుకున్నారు. ఊహించని పరిస్థితులు ఎదురైతే.. ఆస్పత్రుల్లో భారీ బిల్లుతో ఆర్థికంగా గుల్లవకుండా బీమా ప్లాన్ కాపాడుతుంది. అయితే, ఆరోగ్య బీమా అవసరమైనంత కవరేజీతో, సమగ్ర రక్షణతో ఉన్నప్పుడే అసలు లక్ష్యం సిద్ధిస్తుంది. కానీ, బేసిక్ పాలసీ ఒక్కటే సరిపోతుందా? అంటే సందేహమే. వ్యక్తులు తమ అవసరాలు, ఆరోగ్య చరిత్ర ఆధారంగా అదనపు రైడర్లను జోడించుకోవడం ద్వారా బీమా రక్షణను మరింత సమగ్రంగా మార్చుకోవచ్చు. ప్రమాద మరణం లేదా ప్రమాదంలో వైకల్యం, తీవ్ర అనారోగ్య పరిస్థితులు ఇలా భిన్నమైన సందర్భాల్లో ఆదుకునే రైడర్లను బేసిక్ హెల్త్ ప్లాన్లకు జోడించుకోవచ్చు. ఆ వివరాలే ఈ వారం కథనం. రైడర్ అన్నది అదనపు ప్రయోజనంతో కూడినది. సాధారణ హెల్త్ ప్లాన్లతోపాటు వీటిని తీసుకోవచ్చు. రైడర్ ద్వారా తక్కువ ప్రీమియంకే అదనపు రక్షణ సాధ్యపడుతుంది. ఈ రైడర్లు అన్నవి అందరికీ అన్నీ అవసరమవుతాయని కాదు. అవసరాలు అన్నవి భిన్నంగా ఉండొచ్చు. అందుకనే భిన్న రకాల రైడర్లు అందుబాటులో ఉన్నాయి. జీవిత బీమా కవరేజీని రైడర్ ద్వారా మరింత పెంచుకోవచ్చు. లేదంటే ప్రమాదంలో మరణిస్తే అదనపు పరిహారాన్నిచ్చే రైడర్‌ను తీసుకోవచ్చు. లేదంటే ప్రమాదం కారణంగా పాలసీదారు వైకల్యం పాలైనా పరిహారాన్నిచ్చే రైడర్‌ను అటు జీవిత బీమా పాలసీలతోనూ, ఇటు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలతోనూ కలిపి తీసుకోవచ్చు. క్రిటికల్ ఇల్నెస్ ఇలా ఎన్నో రైడర్లు ఉన్నాయి. వీటిని తీసుకోవడం వల్ల అనుకోని పరిణామం ఎదురైనా కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పాలు కాకుండా గట్టెక్కడానికి వీలుంటుంది. రైడర్ల వల్ల అంత ప్రయోజనం ఉంది. పాలసీదారులు అవసరమైన అదనపు కవరేజీలను అందుబాటు ప్రీమియంకు అందించడమే రైడర్ల ఉద్దేశ్యం. ఇక వైద్య రంగంలో ద్రవ్యోల్బణం సవాళ్లనూ రైడర్ల వల్ల అధిగమించే అవకాశం ఉంది. రూమ్ రెంట్ వెయివర్ రూమ్ రెంట్ వెయివర్ రైడర్ తీసుకున్నట్టయితే.. ఆస్పత్రిలో చేరినప్పుడు అందుబాటులో ఉన్న ఏ కేటగిరీ సదుపాయాన్నైనా తీసుకోవచ్చు. మరింత పరిమితి ఇచ్చే లేదంటే అసలు గది అద్దె పరిమితినే రద్దు చేసే రైడర్లు అందుబాటులో ఉన్నాయి. సాధారణ హెల్త్ ప్లాన్లలో స్టాండర్డ్ లేదా సెమీ ప్రైవేటు రూమ్లకే చెల్లింపులు చేసేలా నిబంధనలు ఉంటుంటాయి. లేదంటే రూమ్ రెంట్‌ను బీమా కవరేజీలో 1–2 శాతం పరిమితిగా విధిస్తుంటాయి. రూమ్ రెంట్ వెయివర్ రైడర్‌తో పాలసీదారులు తమకు ఇష్టమైన గదిని ఆస్పత్రిలో తీసుకోవచ్చు. హాస్పిటల్ క్యాష్ బెనిఫిట్ ఎక్కువ మంది పాలసీదారులు ఈ రైడర్‌ను ఎంపిక చేసుకుంటుంటారు. ఆస్పత్రిలో చికిత్స కోసం చేరినప్పుడు వైద్య పరమైన ఖర్చులే కాకుండా.. ఇతర ఖర్చులు కూడా కొన్ని ఎదురవుతుంటాయి. అటువంటి సందర్భాల్లో హాస్పిటల్ డైలీ క్యాష్ రైడర్ అక్కరకు వస్తుంది. వందల నుంచి వేల రూపాయల వరకు రోజువారీగా ఈ రైడర్ కింద పాలసీదారులకు కంపెనీలు చెల్లిస్లాయి. ఏ అవసరం కోసమైనా ఈ మొత్తాన్ని వినియోగించుకోవచ్చు. పాలసీలో కవరేజీ లేని వాటికి కంపెనీలు చెల్లింపులు చేయవు. అటువంటి వాటికి ఈ రైడర్ అవసరపడుతుంది. మెటర్నిటీ రైడర్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లలో చాలా వరకు ప్రసవ ఖర్చులను చెల్లించే ఆప్షన్ రావు. కనుక పాలసీ తీసుకునే ముందే.. మేటర్నిటీ కవరేజీ ఉందేమో చూసుకోవాలి. లేకపోతే మేటర్నిటీ రైడర్‌ను తీసుకోవచ్చు. దీనివల్ల డెలివరీ కోసం ఆస్పత్రిలో చేరినప్పుడు అయ్యే వ్యయాలను కంపెనీయే చెల్లిస్తుంది. కాకపోతే ఈ రైడర్ తీసుకున్న నాటి నుంచి కనీసం 2–3 ఏళ్లపాటు వెయిటింగ్ పీరియడ్ అమలవుతుంది. అంటే ఆ తర్వాతే మేటర్నిటీ ఖర్చులను క్లెయిమ్ చేసుకోగలరు. అందుకే పెళ్లయిన వెంటనే ఈ రైడర్‌ను జోడించుకోవడం మంచిది. క్రిటికల్ ఇల్నెస్ కవర్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌కు అదనంగా క్రిటికల్ ఇల్నెస్ కవరేజీని తీసుకోవడం ఎంతో అవసరం. మారిన జీవనశైలి, ఆహార నియమాల వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలను ఒక వయసు తర్వాత ఎదుర్కోవాల్సి వస్తోంది. కనుక క్రిటికల్ ఇల్నెస్ కవరేజీ ప్రతీ ఒక్కరికీ అవసరమే. దీన్ని అదనపు రైడర్‌గా తీసుకోవడం మంచిది. కేన్సర్ లేదా స్ట్రోక్ లేదా హార్ట్ ఎటాక్, మూత్రపిండాల వైఫల్యం ఇలా ఎన్నో క్లిష్టమైన అనారోగ్యాలకు కవరేజీని పొందొచ్చు. బీమా కంపెనీలు జాబితాలో పేర్కొనే ఏ క్రిటికల్ ఇల్నెస్ బారిన పడినా.. ఏక మొత్తంలో బీమా మొత్తాన్ని చెల్లిస్తాయి. వీటిని బెనిఫిట్ ప్లాన్లు అంటారు. అలా కాకుండా క్రిటికల్ ఇల్‌నెస్‌తో ఆస్పత్రిలో చేరినప్పుడు అయ్యే ఖర్చుల వరకే చెల్లింపులు చేసే ఇండెమ్నిటీ ప్లాన్లు కూడా ఉంటాయి. బెనిఫిట్ ప్లాన్‌ను (వ్యాధి నిర్ధారణతో చెల్లింపులు చేసేవి) తీసుకోవడం ఎక్కువ ప్రయోజనం. ఎందుకంటే తీవ్ర అనారోగ్యం కారణంగా పాలసీదారు మరణిస్తే.. నిలిచిపోయిన ఆదాయం, రుణాల చెల్లింపులకు ఆ పరిహారం ఉపయోగపడుతుంది. ఉదాహరణకు కేన్సర్ లేదా మూత్రపిండాల వైఫల్యం వెలుగు చూసిన తర్వాత.. మరణానికి మధ్య విరామం ఉంటుంది. ఆ సమయంలో ఆస్పత్రిలో చేరడం వల్లే కాకుండా ఇతర ఖర్చులు కూడా ఉంటాయి. మూత్రపిండాల వైఫల్యంలో డయాలసిస్ చేయించుకోవాల్సి ఉంటుంది. అందుకే ఏక మొత్తంలో చెల్లించేసే రైడర్లను హెల్త్ప్లాన్తో పాటు తీసుకోవాలి. కన్జ్యూమబుల్స్ కవర్ ఆస్పత్రుల్లో కన్జ్యూమబుల్స్కు అయ్యే వ్యయాలను బీమా కంపెనీలు చెల్లించవు. చికిత్సలో భాగంగా కొన్ని రకాల ఉత్పత్తులను రోగులకు వాడిన తర్వాత పడేస్తుంటారు. చేతి తొడుగులు, పీపీఈ కిట్లు, సర్జికల్ పరికరాలు ఇలాంటి కన్జ్యూమబుల్స్ చాలానే ఉంటాయి. బీమా కంపెనీలు మినహాయింపుల జాబితాలో కన్జ్యూమబుల్స్ గురించి వివరంగా పేర్కొంటాయి. వీటికి అయ్యే వ్యయాలను పాలసీదారే తన జేబు నుంచి పెట్టుకోవాల్సి ఉంటుంది. కన్జ్యూమబుల్స్ కవరేజీ తీసుకుంటే అప్పుడు వాటికయ్యే వ్యయాలన్నింటినీ కంపెనీయే చెల్లిస్తుంది. ఇది కూడా పాలసీదారులకు ఉపయోగపడే కవరేజీయే. వ్యక్తి ప్రమాద బీమా క్రిటికల్ ఇల్నెస్ మాదిరే పర్సనల్ యాక్సిడెంట్ (ప్రమాద బీమా) కవరేజీ కూడా ముఖ్యమైనదే. ప్రమాదంలో మరణించినట్టయితే సాధారణ బీమా కవరేజీకి అదనంగా ఈ మొత్తాన్ని కూడా కంపెనీ చెల్లిస్తుంది. ఒకవేళ ప్రమాదం వల్ల శాశ్వత వైకల్యం పాలైతే (పాక్షికం, పూర్తి) పరిహారాన్ని కూడా చెల్లిస్తాయి. నామమాత్రపు ప్రీమియానికే ఈ కవరేజీలు లభిస్తాయి. కనుక ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకునే వారు జీవిత బీమా ప్లాన్ లేదంటే హెల్త్ ఇన్సూరెన్స్ప్లాన్కు అనుబంధంగా ఈ రైడర్ తీసుకోవడం మర్చిపోవద్దు. ఒకవేళ రైడర్ లేకపోతే.. ఉదాహరణకు ప్రమాదం కారణంగా అంగవైకల్యం పాలైతే అప్పుడు మునుపటి మాదిరిగా జీవితం ఉండకపోవచ్చు. ఆదాయం లోటు ఏర్పడవచ్చు. ఈ పరిస్థితుల్లో రైడర్ ఆదుకుంటుంది. ఓపీడీ కవరేజీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లలో అధిక శాతం.. ఆస్పత్రిలో చేరడం వల్ల అయ్యే ఖర్చులనే చెల్లిస్తుంటాయి. ఔట్ పెషెంట్‌గా (ఓపీడీ) వెళ్లి తీసుకునే చికిత్సలకు కవరేజీ ఉండదు. అటువంటప్పుడు ఈ ఓపీడీ కవరేజీ సాయంగా నిలుస్తుంది. ఇది ఉంటే ఆస్పత్రిలో చేరకుండా డాక్టర్ వద్దకు వెళ్లి తీసుకునే చికిత్సలకు సైతం పరిహారం అందుకోవచ్చు. ఎన్సీబీ ప్రొటెక్షన్ ఒక ఏడాదిలో ఎటువంటి క్లెయిమ్ లేకపోతే నో క్లెయిమ్ బోనస్(ఎన్సీబీ)ను కంపెనీలు ప్రకటిస్తుంటాయి. తిరిగి క్లెయిమ్ ఎదురైతే అంతే పరిమా ణంలో అదనంగా ఇచ్చిన కవరేజీని కంపెనీలు తగ్గిస్తుంటాయి. క్లెయిమ్ చేసుకున్నా అప్పటికే ఎన్సీబీ రూపంలో ఇచ్చిన ప్రయోజనాన్ని కంపెనీలు ఉపసంహరించుకోకుండా ఈ రైడర్ కాపాడుతుంది. -
ఎస్బీఐ ఆఫర్, రూ.342తో రూ.4 లక్షల బెన్ఫిట్
దేశీయ ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ హెల్త్ ఇన్స్యూరెన్స్ ప్రీమియంలపై కీలక ప్రకటన చేసింది. ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ హోల్డర్స్ కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రెండు పథకాల్లోని ఇన్స్యూరెన్స్ పాలసీలపై రూ. 342 ప్రీమియం చెల్లిస్తే రూ.4 లక్షలు బెనిఫిట్ పొందే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు ఎస్బీఐ చెప్పింది. కరోనా కారణంగా ప్రపంచ దేశాల్లో ఇన్స్యూరెన్స్ పాలసీలకు డిమాండ్ పెరిగింది. మహమ్మారి నుంచి కుటుంబ సభ్యులకు అండగా నిలిచేందుకు పాలసీ దారులు పెద్ద మొత్తంలో ప్రీమియం చెల్లించి ఆయా ఇన్స్యూరెన్స్ పాలసీలను తీసుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం సైతం ప్రధాన మంత్రి సురక్ష భీమా యోజన (పీఎంఎస్బీవై), ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి భీమా యోజన( పీఎంజేజేబీవై) స్కీమ్‌లను అందుబాటులోకి తెచ్చింది. Get the insurance that suits your need and live life worry-free.#PMSBY #PMJJBY #SBI #Insurance pic.twitter.com/n7DC4eTlOV — State Bank of India (@TheOfficialSBI) October 2, 2021 అయితే తాజాగా ఎస్బీఐ ఈ స్కీములకు సంబంధించిన ప్రీమియం అంశంపై ఎస్బీఐ కీలక ప్రకటన చేసింది. 18 నుండి 70 సంవత్సరాల మధ్య వయస్సున్న పాలసీదారులు ప్రధాన మంత్రి సురక్షా భీమా యోజన పథకం కింద సంవత్సరానికి రూ.12 ప్రమియం చెల్లిస్తే యాక్సిడెంట్లో మరణించినా, పూర్తిగా వికలాంగులైనా రూ. 2 లక్షల పరిహారం అందిస్తున్నట్లు ట్వీట్ చేసింది. పాక్షికంగా లేదా శాశ్వతంగా అంగవైకల్యానికి గురైతే అతను/ఆమె రూ.1 లక్ష వరకు ప్రయోజనం పొందవచ్చని తెలిపింది. ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి భీమా యోజన పథకంలో 18 నుంచి 50ఏళ్ల లోపు వయస్సున్న సభ్యులు పాలసీ కొనుగోలు చేస్తే రూ.2 లక్షల వరకు పరిహారాన్ని అందిస్తున్నట్లు ఎస్బీఐ ట్వీట్లో పేర్కొంది. ఇక ఈ ప్రీమియం ధర సంవత్సరానికి రూ.330గా ఉందని చెప్పింది. -
కరోనా పాలసీలు, వచ్చే ఏడాది మార్చి వరకు పొడిగింపు
న్యూఢిల్లీ: కరోనా బారిన పడి ఆస్పత్రిలో చికిత్స తీసుకోవాల్సి వస్తే పరిహారం చెల్లించే స్వల్ప కాల కరోనా పాలసీలను వచ్చే ఏడాది మార్చి వరకు అందించేందుకు బీమా రంగ అభివృద్ధి, నియంత్రణ సంస్థ (ఐఆర్డీఏఐ) అనుమతించింది. కరోనా మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని ఈ ప్రత్యేక పాలసీలను తీసుకురావాలని గతేడాది ఐఆర్డీఏఐ కోరడంతో.. బీమా కంపెనీలు కరోనా రక్షక్, కరోనా కవచ్ పేరుతో పాలసీలను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఇందులో కరోనా కవచ్ అన్నది ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటే వ్యయాలను చెల్లిస్తుంది. కరోనా రక్షక్ ప్లాన్‌లో.. ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటే వాస్తవ వ్యయంతో సంబంధం లేకుండా ఎంపిక చేసుకున్న మొత్తాన్ని బీమా కంపెనీ చెల్లిస్తుంది. మూడున్నర నెలలు, ఆరున్నర నెలలు, తొమ్మిదిన్నర నెలల కాలాన్ని ఎంపిక చేసుకోవచ్చు. ఈ పాలసీల రెన్యువల్‌కు, కొత్తగా జారీ చేసేందుకు 2022 మార్చి 31 వరకు అనుమతిస్తున్నట్టు ఐఆర్డీఏఐ తాజా ఆదేశాలు జారీ చేసింది. చదవండి: Insurance Policy: ఈ పాలసీలు.. ఎంతో సులభం -
ఆరోగ్య బీమా బాదుడు,భారీగా పెరిగిన ప్రీమియం ధరలు
న్యూఢిల్లీ: కరోనా కవచ్, కరోనా రక్షక్.. ఈ రెండు రకాల బీమా పాలసీలు కరోనా కారణంగా ఏర్పడే వైద్య వ్యయాలను గట్టెక్కేందుకు తీసుకొచ్చిన పథకాలు. బీమా రంగ నియంత్రణ సంస్థ (ఐఆర్డీఏఐ) సూచనల మేరకు గతేడాది ఏప్రిల్ తర్వాత వీటిని బీమా సంస్థలు మార్కెట్లోకి తీసుకొచ్చాయి. అయితే, కరోనా రెండో విడతలో ఇన్ఫెక్షన్ కేసులు భారీగా పెరిగిపోవడంతో.. వాటి రూపంలో పెద్ద ఎత్తున క్లెయిమ్‌లు ఎదురవుతున్నాయి. వీటి రూపేణా వచ్చే ప్రీమియంతో పోలిస్తే చెల్లింపులు అధికంగా ఉంటుండడంతో బీమా సంస్థలు ఇలా అయితే లాభం లేదనుకుని.. బీమారంగ నియంత్రణ సంస్థ (ఐఆర్డీఏఐ) అనుమతితో అన్ని రకాల హెల్త్ పాలసీల ప్రీమియం ధరలను భారీగా పెంచేశాయి. ఈ పెంపు 50 శాతాన్ని కూడా దాటిపోయింది. మరీ ముఖ్యంగా కరోనా ఈ పాలసీల విక్రయం నుంచి కంపెనీలు వెనకడుగు వేస్తున్నాయి. అన్ని రకాల సాధారణ బీమా కంపెనీలు, ఆరోగ్య బీమా సంస్థలు కరోనా కవరేజీ పాలసీలను తప్పనిసరిగా తీసుకురావాలంటూ, వాటి పునరుద్ధరణకు వీలు కల్పించాలంటూ (రెన్యువల్) ఐఆర్డీఏఐ గతేడాది ఆదేశాలు జారీ చేసింది. అప్పటికే ఆరోగ్య బీమా కలిగిన వారికి కరోనా కవరేజీని కూడా భాగం చేస్తూ లేని వారి కోసం ప్రత్యేక పాలసీల రూపకల్పనకు నిర్దేశించింది. దీని ఫలితమే కరోనా కవచ్, కరోనా రక్షక్ పాలసీలు. ఈ పాలసీల చెల్లుబాటును 2021 సెప్టెంబర్ 30 వరకు పొడిగిస్తూ ఈ ఏడాది మార్చిలో తాజా ఆదేశాలను కూడా జారీ చేసింది. దీంతో ఇప్పటికే ఈ పాలసీలను తీసుకున్న వారికి రెన్యువల్‌ను తిరస్కరించడం కుదరదు. దీంతో బీమా సంస్థలు కొత్తవారికి ఈ పాలసీల మంజూరు విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నట్టు బ్రోకరేజీ సంస్థలు, పంపిణీదారులు పేర్కొంటున్నారు. చదవండి : Vijaya Diagnostic: పబ్లిక్ ఇష్యూకి సిద్ధం ప్రోత్సాహకాల్లేవు.. ‘‘దేశంలో రోజువారీ కరోనా కేసులు 30,000 స్థాయిలో ఉన్నప్పుడు బీమా సంస్థలు ఈ ప్రత్యేకమైన పాలసీలను ప్రవేశపెట్టాయి. ఇప్పుడు అన్ని పెద్ద రాష్ట్రాల్లోనూ రోజువారీగా ఇదే స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. ఈ ప్లాన్లు నష్టాలు తెచ్చేవిగా తేలిపోయింది. వీటి విక్రయాలపై ప్రోత్సాహకాలను ఇవ్వడం లేదు. కంపెనీలకు అవకాశం ఇస్తే వీటిని వెంటనే నిలిపివేస్తాయి’’ అని ఓ ప్రముఖ ఇన్సూరెన్స్ బ్రోకరేజీ సంస్థ తెలిపింది. చాలా బీమా సంస్థలు ఈ ప్రత్యేకమైన కరోనా పాలసీలను ఆన్లైన్లో విక్రయించడాన్ని ఇప్పటికే నిలిపివేశాయి. విక్రయాలను నిరుత్సాహపరిచేందుకు ఏజెంట్ కమీషన్లను కోత పెట్టాయి. ప్రీమియం టారిఫ్‌లను గణనీయంగా పెంచేసినట్టు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఆన్లైన్లో పాలసీల అమ్మకాలు నిలిపివేయడంతో పాలసీలను తీసుకునేందుకు బీమా సంస్థల కార్యాలయాలను నేరుగా సంప్రదించాల్సి వస్తుంది. ప్రస్తుతానికి కేవలం నాలుగు బీమా సంస్థలే ఆన్లైన్లో కరోనా పాలసీలను విక్రయిస్తున్నట్టు బేషక్ డాట్ ఓఆర్జీ నిర్వహించిన సర్వేలో తెలిసింది. న్యూ ఇండియా అష్యూరెన్స్, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్, ఆదిత్య బిర్లా జనరల్ ఇన్సూరెన్స్, రహేజా క్యూబీఈ సంస్థలు ప్రస్తుతం ఆన్లైన్లో ఈ పాలసీలను ఆఫర్ చేస్తున్నాయి. మిగిలిన సంస్థలు ఆన్లైన్ పోర్టళ్లపై కరోనా బీమా పాలసీల విక్రయాన్ని నిలిపివేయడంతోపాటు.. వీటి కోసం సమీపంలోని తమ కార్యాలయాలను సంప్రదించాలని సూచిస్తున్నట్టు బేషక్ సంస్థ సీఈవో మహావీర్ చోప్రా పేర్కొన్నారు. ప్రీమియం క్యాలిక్యులేటర్లను కూడా కొన్ని తొలగించినట్టు చెప్పారు. ప్రీమియం మరింత ప్రియం వరుణ్ వయసు 43 సంవత్సరాలు. ప్రైవేటు రంగంలో పనిచేస్తున్నాడు. రూ.5లక్షల కవరేజీతో ఏడాది క్రితమే ఫ్యామిలీ ఫ్లోటర్ ఇండెమ్నిటీ ప్లాన్‌ను ఓ ప్రైవేటు బీమా సంస్థ నుంచి తీసుకున్నాడు. ప్రీమియం రూ.15,054 రూపాయలను మొదటి ఏడాది చెల్లించాడు. ఈ ఏడాది జూన్‌లో రెన్యువల్ చేసుకోవాల్సి ఉంది. ప్రీమియం చెల్లింపునకు ఇంకా గడువు ఉండగా.. మీ పాలసీ ప్రీమియంను ఏడాదికి రూ.23,104కు సవరిస్తున్నట్టు బీమా సంస్థ నుంచి మెయిల్ వచ్చింది. అది చూసి వరుణ్ షాక్ అయ్యాడు. ఆరోగ్య బీమా ప్రీమియం భవిష్యత్తులో పెరుగుతుందని తెలుసుకానీ.. ఒక్క ఏడాదికే 50 శాతం బాదుడేంటి.. ఇలా అయితే భవిష్యత్తులో ప్రీమియం కట్టగలమా? అన్న సంశయంలో వరుణ్ ఉండిపోయాడు. వరుణ్‌కు మాత్రమే ఎదురైన అనుభవం కాదిది. ఇప్పటికే ఆరోగ్య బీమా ప్లాన్లను తీసుకున్న వారికి ప్రీమియంను కంపెనీలు భారీగా పెంచేశాయి. అదే సమయంలో కొత్తగా ఆఫర్ చేస్తున్న ప్లాన్లపై పెంపును మోస్తరుకు పరిమితం చేశాయి. ఒక్కసారి ముగ్గులోకి దిగిన తర్వాత చూసుకుందాంలేనన్నట్టు బీమా కంపెనీల ధోరణి కనిపిస్తోంది. తర్వాత తగ్గిస్తారా..? కరోనా వైరస్ కారణంగా క్లెయిమ్‌లు గణనీయంగా పెరిగిన మాట నిజమే. కానీ, కరోనా శాశ్వతంగా ఉంటుందా? అందరికీ వ్యాక్సినేషన్ పూర్తయ్యి, హెర్డ్ ఇమ్యూనిటీ ఏర్పడిన తర్వాత వైరస్ బలహీనపడిపోతుందని, సాధారణ ఫ్లూ మాదిరిగా మారిపోతుందని నిపుణులే చెబుతున్నారు. గట్టిగా మరో ఏడాది, రెండేళ్లలో కరోనా ముప్పు తొలగిపోతుంది. ఆ తర్వాత ఈ స్థాయిలో క్లెయిమ్‌లు ఉండవుగా? టీకాలు వేసేకొద్దీ వైరస్ కారణంగా ఆస్పత్రిపాలయ్యే వారి సంఖ్య కూడా తగ్గుముఖం పడుతుంది. దాంతో క్లెయిమ్‌లు కూడా తగ్గుతాయి. మరి ఇప్పుడు కరోనా పేరు చెప్పి పెంచిన ప్రీమియంను ఆ తర్వాత తగ్గిస్తాయా? కంపెనీలు వ్యాపార ధోరణితో అడ్డగోలుగా వ్యవహరిస్తున్నట్టు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
మీకు ‘క్రిటికల్’ కవచం ఉందా?
ఉదయ్ ప్రైవేటు రంగంలో పనిచేస్తున్నాడు. వయసు 46ఏళ్లు. అప్పటి వరకు ఎటువంటి అనారోగ్యాల్లేవు. ఓ రోజు తెల్లవారుజామున బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో వెంటనే సమీపంలోని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి తీసుకెళ్లడంతో ప్రాణాలు నిలిచాయి. కానీ, బిల్లు రూ.11 లక్షలు అయ్యింది. కానీ, ఉదయ్‌కు రూ.5లక్షల వరకే హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీ ఉంది. అందులోనూ రూ.40 వేల వరకు కవరేజీ రాలేదు. దీంతో రూ.6.40 లక్షలను తన జేబు నుంచి చెల్లించుకోవాల్సి వచ్చింది. మారుతున్న వైద్య ఖర్చులకు తగ్గ రక్షణ లేకపోతే పడే ఆర్థిక భారం ఎలా ఉంటుందన్నది ఈ ఉదాహరణ చూసి తెలుసుకోవచ్చు. మారిన జీవనశైలి, ఆహార అలవాట్లు, శారీరక శ్రమ లోపించడం, పని ఒత్తిళ్లు ఇవన్నీ కలసి ఎప్పుడు ఏ అనారోగ్యం బారిన పడతామో ఊహించలేకుండా ఉంది. అందుకే తమవంతుగా రక్షణ కల్పించుకోవాల్సిన అవసరం ప్రతీ ఒక్కరిపైన ఉంది. ఆ వివరాలే ఈ వారం ప్రాఫిట్ ప్లస్ కథనం.. కేన్సర్, మూత్రపిండాల వ్యాధులు, కాలేయం లేదా గుండె సంబంధిత తీవ్ర వ్యాధుల బారిన పడితే ఆ బాధ ఒక్కరికే పరిమితం కాదు. ఆ కుటుంబం మొత్తంపైనా ప్రభావం ఉంటుంది. ఆర్థికంగానే కాదు, శారీరకంగా, మానసికంగా నలిగిపోవాల్సి వస్తుంది. మంచి చికిత్స కోసం ఆస్పత్రిని ఎంపిక చేసుకోవడంతోపాటు కావాల్సిన నిధులను సమకూర్చుకోవడం శక్తికి మించిన పనిగా అనిపిస్తుంది. కుటుంబానికి ఆధారమైన వ్యక్తి తీవ్ర అనారోగ్యం బారిన పడితే అప్పటి వరకూ ప్రతీ నెలా వచ్చిన ఆదాయానికి కూడా బ్రేక్ పడొచ్చు. శాశ్వత ఉద్యోగ నష్టం ఏర్పడితే ఆర్థికంగా ఆ కుటుంబం సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి రావచ్చు. అందుకే ప్రతీ ఒక్కరికీ ముందు జాగ్రత్త, రక్షణ చర్యలు అవసరం. తీవ్ర అనారోగ్య సమస్యలన్నవి (క్రిటికల్ ఇల్నెస్) ఏ స్థాయిలో ఉంటాయో ఊహించలేము. ఉదాహరణకు కేన్సర్ మూడోదశలో ఉన్నవారికి దీర్ఘకాలం జీవించి ఉండే అవకాశాలు తక్కువ. కేన్సర్ రెండో దశలోనే బయటపడితే ఖర్చు ఎక్కువే పెట్టుకోవాల్సి వస్తుంది. గుండెపోటు తీవ్ర స్థాయిలో వస్తే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. మూ త్ర పిండాల సమస్యలు వెలుగు చూస్తే దీర్ఘకాలం పాటు కొనసాగొచ్చు. గుండెజబ్బులు కూడా దీర్ఘకాలం పాటు కొనసాగేవే అధికం. అందుకే వీటి విషయంలో సన్నద్ధత అవసరమని నిపుణులు సూ చిస్తుంటారు. కొన్ని వ్యాధుల్లో దీర్ఘకాలం పాటు చికిత్సలు అవసరం ఏర్పడతాయి. గుండె జబ్బులు, కేన్సర్, స్ట్రోక్, పక్షవాతం, మూత్రపిండాల వైఫల్యం తదితర క్లిష్టమైన అనారోగ్యాలను మన దేశంలో ఎక్కువగా చూస్తున్నాం. భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) నివేదిక ప్రకారం.. దేశంలో కేన్సర్ కేసులు 2025 నాటికి 15.7 లక్షలకు (వార్షిక రేటు) పెరుగుతాయని అంచ నా. ప్రస్తుత 13.9 లక్షలతో పోలిస్తే 12% పెరగనున్నాయి. దేశంలో ప్రతీ నాలుగు మరణాల్లో ఒక టి గుండె జబ్బుల కారణంగానే నమోదవుతోంది. మనదేశంలో 2018 నాటికి 1.29 కోట్ల జనాభా తీవ్రమైన కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నట్టు అంచనా. ఆర్థిక భారం ఎంతో.. తీవ్ర అనారోగ్య సమస్యల్లో చికిత్సా వ్యయాలు కూడా అధికంగానే ఉంటుంటాయి. ఎందుకంటే ఈ తరహా వ్యాధుల్లో దీర్ఘకాలం పాటు చికిత్సలు అవసరంపడతాయి. ‘‘కేన్సర్ అయితే ఒక్క విడత శస్త్రచికిత్స లేదా కీమోథెరపీతో సరిపోదు. దీర్ఘకాలం పాటు చికిత్స చేయాల్సి ఉంటుంది’’ అని మ్యాక్స్‌బూపా హెల్త్ ఇన్సూరెన్స్ అండర్రైటింట్ డైరెక్టర్ బబతోష్ మిశ్రా తెలిపారు. కేన్సర్ చికిత్సల కోసం రూ.15–20 లక్షలు ఖర్చు అవుతుందని.. అత్యాధునిక చికిత్సలు తీసుకునేట్టు అయితే ఈ వ్యయం రూ.కోటి వరకు కూడా పెరిగిపోవచ్చని చెప్పారు. ‘‘గుండె జబ్బులకు చికిత్స కోసం మెట్రో ల్లోని ప్రైవేటు ఆస్పత్రుల్లో రూ.1.5–15 లక్షల వరకు ఖర్చవుతుంది. స్టెంట్, బైపాస్ సర్జరీ లేదా వాల్వ్ మార్చడంపై ఈ వ్యయం ఎంతన్నది ఆధారపడి ఉంటుంది’’అని ఎడెల్వీజ్ టోకియో లైఫ్ ముఖ్య పంపిణీ అధికారి అనూప్శేత్ పేర్కొన్నారు. వైద్య రంగంలో ద్రవ్యోల్బణం 15 శాతానికి పైగా ఉంటోంది. అంటే చికిత్సల వ్యయాలు ఏటేటా ఈ స్థాయిలో పెరిగిపోతున్నాయని అర్థం చేసుకోవచ్చు. టైర్–2, టైర్ 3 పట్టణాలతో పోలిస్తే టైర్–1 పట్టణాల్లో చికిత్సల వ్యయాలు మరింత ఎక్కువగా ఉంటున్నాయి. కనుక 35 ఏళ్లు దాటిన వారు, తీవ్ర అనారోగ్య సమస్యల చరిత్ర ఉన్న కుటుంబాల్లోని వారికి తప్పకుండా ముందస్తు ప్రణాళిక అవసరం. ప్రణాళిక ప్రకారం.. ఆరోగ్యం విషయంలో ఊహించని ఖర్చులను తట్టుకునేందుకు ప్రతీ ఒక్కరికీ ప్రణాళిక అవసరం. ‘‘తీవ్ర అనారోగ్యాల విషయమై ముందు జాగ్రత్త పడే వారు 3 రకాల వ్యయాలను పరిగణనలోకి తీసుకోవాలి. మొదటిది హాస్పిటలైజేషన్. ఆస్పత్రి లో చేరాల్సి వస్తే ఎదురయ్యే ఖర్చులను బేసిక్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ సాయంతో గట్టెక్కవచ్చు. కొన్ని వ్యాధులకు దీర్ఘకాలం పాటు ఔషధాలు, పరీక్షలు అవసరంపడతాయి. కానీ, ఇండెమ్నిటీ ప్లాన్లు అన్నవి ఒక్కసారి ఒక అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరి క్లెయిమ్ చేశాక.. అదే ఏడాది మళ్లీ అదే అనారోగ్యానికి సంబంధించి పరిహారం అం దించవు. కనుక క్రిటికల్ ఇల్నెస్ పాలసీ అవసరం. మూడోది ఉద్యోగం కోల్పోవాల్సి వస్తే ఎదురయ్యే నష్టాన్ని భర్తీ చేసుకునేలా ఉండాలి’’ అని ముంబైకి చెందిన ఫైనాన్షియల్ ప్లానర్ పంకజ్ మాల్డే సూచన. అందుకే భిన్న రకాల బీమా ప్లాన్లకుతోడు అత్యవసర నిధి కూడా అవసరం అని గుర్తించాలి. హెల్త్ ఇన్సూరెన్స్.. సాధారణ హెల్త్ ఇన్సూరెన్స్ప్లాన్లనే ఇండెమ్నిటీ ప్లాన్లు అని కూడా అంటారు. ఇవి ఆస్పత్రిలో చేరి తీసుకునే చికిత్సలకు పరిహారం చెల్లిస్తాయి. జీవితంలో ఏ దశలో ఉన్నారు, ఏ పట్టణంలో నివసిస్తున్నారు, అక్కడ చికిత్సల వ్యయాలు ఏ విధంగా ఉన్నాయి, కుటుంబ ఆరోగ్య చరిత్ర అంశాల ఆధారంగా బేసిక్ ఇండెమ్నిటీ కవరేజీని నిర్ణయించుకోవాలి. ఢిల్లీ, ముంబై వంటి టైర్–1 పట్టణాల్లో అయితే రూ.20–25 లక్షల కవరేజీతో ప్లాన్ తీసుకోవాలన్నది నిపుణుల సూచన. ‘‘ఈ కవరేజీ కూడా నూరు శాతం రక్షణనివ్వదు. ఎందుకంటే కొన్ని చికిత్సల ఖర్చులు భారీగా ఉన్నాయి. ఉదాహరణకు లివర్ మార్పిడి చికిత్సకు రూ.40–50లక్షలు అవుతుంది’’ అని ఫైనాన్షియల్ ప్లానర్ పంకజ్మాల్డే వివరించారు. టైర్–2, 3 పట్టణాల్లో ఉంటే కనీసం రూ.10 లక్షలు, అదే చిన్న పట్టణాల్లోని వారు కనీసం రూ.5లక్షల బేసిక్ ఇండెమ్నిటీ ప్లాన్ తీసుకోవడం అవసరం. అధిక కవరేజీతో ప్లాన్ తీసుకోవాలంటే అందుకు ప్రీమియం కూడా ఎక్కువే చెల్లించాల్సి వస్తుంది. దీనికి బదులు తక్కువ మొత్తంతో బేసిక్ ప్లాన్ తీసుకుని, అధిక కవరేజీనిచ్చే టాపప్ ప్లాన్ జోడించుకోవడం మంచి ఆలోచన అవుతుంది. రూ.5 లక్షల ప్లాన్ తీసుకుని, రూ. 15 లక్షల టాపప్ జోడించ వచ్చు. లేకుండా వస్తుంటాయి. కొన్ని కంపెనీలు స్వల్ప ప్రీమియం ను కూడా వసూ లు చేస్తున్నాయి. క్రిటికల్ ఇల్నెస్ కవరేజీ ఇండెమ్నిటీ ప్లాన్‌కు పూర్తి భిన్నమైనది. బీమా ప్లాన్ జాబితాలోని తీవ్ర అనారోగ్యాల్లో ఏవైనా నిర్ధారణ అయితే అప్పుడు ఏకమొత్తంలో పరిహారాన్ని చెల్లించేదే క్రిటికల్ ఇల్నెస్ ప్లాన్. బేసిక్ హెల్త్ ప్లాన్‌లో కవర్ కాని ఖర్చులను ఈ ప్లాన్ ఆదుకుంటుంది. ఉద్యోగం ఆగిపోవడం లేదా కోల్పోవడం వల్ల ఆదాయ నష్టాన్ని ఈ రూపంలో కాస్తంత అయినా భర్తీ చేసుకోవచ్చు. ఒక వ్యక్తి తన వార్షిక స్థూల ఆదాయానికి 5–10 రెట్ల వరకు కవరేజీతో క్రిటికల్ ఇల్నెస్ ప్లాన్ తీసుకోవడం సూచనీయం. అయితే క్రిటికల్ ఇల్నెస్ ప్లాన్‌లో ఒక నిబంధన విషయమై కచ్చితంగా అవగాహన కలిగి ఉండాలి. సాధారణంగా క్రిటికల్ ఇల్నెస్ వెలుగు చూసిన తర్వాత సదరు రోగి కనీసం ఇన్ని రోజుల పాటు జీవించి ఉంటేనే పరిహారం చెల్లిస్తామనే నిబంధన ఉంటుంది. సాధారణంగా 30 రోజుల కాలాన్ని బీమా సంస్థలు అమలు చేస్తున్నాయి. ఉదాహరణకు స్ట్రోక్ వచ్చి చనిపోతే పరిహారం రాదు. స్ట్రోక్ వచ్చి 30 రోజులు ప్రాణాలతో ఉంటేనే ఈ ప్లాన్‌లో పరిహారం లభిస్తుంది. వాస్తవానికి తీవ్ర అనారోగ్యంతో జీవించి ఉన్న వారికే భారీగా ఖర్చు ఎదురవుతుందన్న వాస్తవాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. 30 క్రిటికల్ ఇల్నెస్ల వరకూ కవరేజీనిచ్చే ప్లాన్లు మార్కెట్లో ఉన్నాయి. కేన్సర్ లేదా గుండె జబ్బుల వంటి వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉన్నవారు ఆయా వ్యాధులకు కవరేజీనిచ్చే క్రిటికల్ ఇల్నెస్ ప్లాన్లను ఎంచుకోవాలి. ప్రతీ క్రిటికల్ ఇల్నెస్లోనూ విడిగా ఏఏ సమస్యలకు కవరేజీ ఉంటుందన్న వివరాలు పాలసీ వర్డింగ్స్ డాక్యుమెంట్లో వివరంగా ఉంటుంది. ఎక్కువ రిస్క్‌లు ఉండే గుండె జబ్బులు, కేన్సర్, స్ట్రోక్, కోమా, మూత్రపిండాల వైఫల్యం తదితర వాటికి కవరేజీ తప్పకుండా ఉండేలా ప్లాన్‌ను ఎంపిక చేసుకోవడం మంచిది. పరిశీలన తర్వాతే..: నియమ, నిబంధనలను కచ్చితంగా చదివిన తర్వాతే క్రిటికల్ఇల్నెస్ ప్లాన్‌ను ఎంపిక చేసుకోవాలి. బీమా రంగ నియంత్రణ సంస్థ (ఐఆర్డీఏఐ) మార్గదర్శకాలను చూస్తే.. కొన్ని రకాల తీవ్ర అనారోగ్య సమస్యలకే పూర్తి కవరేజీ లభిస్తుంది. కొన్నింటి విషయంలో చివరి దశలోనే పరిహారానికి అవకాశం ఉంటుంది. మూత్రపిండాలు, లివర్ సమస్యల్లో అయితే క్రిటికల్ ఇల్నెస్ కవరేజీ అన్నది కేవలం పనిచేయని, పూర్వపు స్థితికి తీసుకురాలేట్టయితేనే కవరేజీ లభిస్తుంది. అదే కేన్సర్, స్ట్రోక్, గుండెపోటు అయితే ఏ దశలో ఉన్నప్పటికీ క్రిటికల్ ఇల్నెస్ ప్లాన్లలో కవరేజీ లభిస్తుంది. లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లకు రైడర్ రూపంలో వచ్చే క్రిటికల్ ఇన్లెస్ ప్లాన్లు కూడా ఉన్నాయి. వీటికంటే కూడా విడిగా ప్లాన్‌ను తీసుకోవడం వల్ల సమగ్రమైన కవరేజీతో వస్తాయి. వీటిల్లో పరిమితులు కూడా తక్కువగా ఉంటాయి. ఉదాహరణకు కేన్సర్ మూడో దశలోనే పరిహారం చెల్లిస్తామన్న నిబంధన ఉంటే, స్టేజ్–2 బయటపడినప్పటికీ పరిహారం రాదు. అందుకే వైద్యం కోసం ప్రత్యేకంగా అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవాలి. ‘‘కనీసం రూ.3–5 లక్ష లు అయినా ఉండాలి. మెట్రోల్లో ఉండే వారికి రూ.8–10 లక్షలు అత్యవసర నిధిగా ఉంచుకోవడం అవసరం’’ అని మాల్డే సూచించారు. తీవ్ర వ్యాధులకు చికిత్సా వ్యయాలు కేన్సర్ ► శస్త్రచికిత్సకు రూ.3–6 లక్షలు ► కీమోథెరపీ ఒక్కో సెషన్‌కు రూ.50,000–2లక్షలు. సుమారు రూ.5–10 లక్షల వరకు ఖర్చు ► రేడియోథెరపీ రూ.2–20లక్షలు గుండె జబ్బులు ► యాంజియోగ్రఫీ రూ.20,000 ► యాంజియోప్లాస్టీ రూ.2.5–6.5లక్షలు ► వాల్వ్ సర్జరీ రూ.2.5–6లక్షలు ► బైపాస్ సర్జరీ రూ.2–5లక్షలు మూత్రపిండాల వైఫల్యం ► డయాలసిస్ రూ.2,000–5,000 ప్రతీ సెషన్‌కు (వారానికి మూడు పర్యాయాలు) ► మూత్రపిండాల మార్పిడి రూ.5–10లక్షలు ► బ్రెయిన్‌స్ట్రోక్ రూ.5–10 లక్షలు నోట్: ప్రాంతాలను బట్టి ఈ వ్యయాల్లో మార్పులు ఉంటుంటాయి. హెల్త్ ప్లాన్ ప్రీమియం ప్లాన్ కవరేజీ ప్రీమియం (రూ.లలో) (రూ.లలో) బేసిక్ ఇండెమ్నిటీ ప్లాన్ 10 లక్షలు 8,265 క్రిటికల్ ఇల్నెస్ ప్లాన్ 30 లక్షలు 4,551 నోట్: 30 ఏళ్ల ఢిల్లీ నివాసికి సంబంధించిన అంచనాలు -
కోవిడ్ ఎఫెక్ట్... ఆరోగ్య బీమా జోరు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కోవిడ్–19 పుణ్యమాని భారత్‌లో ఆరోగ్య బీమా పాలసీలు ఒక్కసారిగా పెరిగాయి. ఆసుపత్రి ఖర్చులకు భయపడ్డ ప్రజలు ప్రైవేటు బీమా కంపెనీల వద్దకు పరుగెత్తారు. అటు ఐఆర్డీఏఐ చొరవతో బీమా కంపెనీలు కరోనా కవచ్ పేరుతో ప్రత్యేక పాలసీలను సైతం ఆఫర్ చేశాయి. దీంతో 2020 ఏప్రిల్–సెప్టెంబర్‌లో నాన్–లైఫ్ బీమా కంపెనీలు వసూలు చేసిన మొత్తం ప్రీమియంలో హెల్త్ ఇన్సూరెన్స్ వాటా దూసుకెళ్లి 29.7 శాతం కైవసం చేసుకుంది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 15.8 శాతం అధికం. ఇక మోటార్ ఇన్సూరెన్స్ వాటా 13.8% తగ్గి 29%కి పరిమితమైంది. నాన్–లైఫ్ ఇన్సూరెన్స్ సెగ్మెంట్లో ఆరోగ్య బీమా గత 2 దశాబ్దాల్లో తొలిసారి గా వాహన బీమా విభాగాన్ని దాటడం గమనార్హం. 2014–15లో ఆరోగ్య బీమా వాటా 23.4%, మోటార్ విభాగం వాటా 44.4% నమోదైంది. ఈ ఏడాది సెప్టెంబరుతో ముగిసిన ఆరు నెలల కాలంలో వృద్ధి పరంగా ఫైర్ విభాగం 33.5 శాతంతో తొలిస్థానంలో ఉండగా, ఆ తర్వాతి స్థానంలో ఆరోగ్య బీమా వచ్చి చేరింది. ఇండివిడ్యువల్ పాలసీలే అధికం.. వాస్తవానికి ఆరోగ్య బీమా రంగంలో గ్రూప్ పాలసీలదే హవా. ఈసారి మాత్రం ఇండివిడ్యువల్స్ నుంచి దరఖాస్తులు ఎక్కువయ్యాయి. గతేడాదితో పోలిస్తే ఇండివిడ్యువల్ పాలసీల ప్రీమియం 2020 ఏప్రిల్–సెప్టెంబర్‌లో 34 శాతం అధికమైతే, గ్రూప్ పాలసీల వృద్ధి 16 శాతానికే పరిమితమైంది. దీంతో హెల్త్ ప్రీమియంలో ఇండివిడ్యువల్ పాలసీల శాతం 36 నుంచి 41 శాతానికి చేరింది. అయితే నాన్–లైఫ్ విభాగంలో పోటీ పడుతున్న 32 సంస్థల్లో 23 కంపెనీలు వృద్ధిని నమోదు చేశాయి. హెల్త్ విభాగంలో దిగ్గజ కంపెనీ న్యూ ఇండియా అష్యూరెన్స్ కేవలం 5 శాతం వృద్ధి సాధించింది. యునైటెడ్ ఇండియా అష్యూరెన్స్ 57.9 శాతం, స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ 45.6 శాతం వృద్ధిని దక్కించుకున్నాయి. 2014–15 నుంచి 2018–19 మధ్య కంపెనీలు వసూలు చేసిన ప్రతి రూ.100 ప్రీమియంలో క్లెయిమ్స్ కింద సగటున రూ.96 చెల్లించాయి. అదే మోటార్ విభాగంలో రూ.84, ఫైర్ సెగ్మెంట్లో రూ.81 చెల్లించాయి. మహమ్మారి కారణంగా.. జూలై 2017–జూన్ 2018 మధ్య చేపట్టిన నేషనల్ శాంపిల్ సర్వే ప్రకారం దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో 85.9%, పట్టణాల్లో 80.9% మందికి బీమా పాలసీలు లేవని గణాంకాలు చెబుతున్నాయి. ఆరోగ్య బీమా ప్రయోజనాల పట్ల అవగాహన లేకపోవడమే ఇందుకు కారణమని మణిపాల్‌సిగ్నా హెల్త్ ఇన్సూరెన్స్ సీఈవో ప్రసూన్ సిక్దర్ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ‘కోవిడ్–19తో ఆరోగ్య బీమా తప్పనిసరన్న భావన ప్రజల్లో వచ్చింది. ఆరోగ్య బీమా పరిశ్రమ (పర్సనల్ యాక్సిడెంట్‌తో కలిపి) ఈ ఏడాది ఏప్రిల్–సెప్టెంబర్‌లో 14% వృద్ధి చెంది రూ.31,132 కోట్ల ప్రీమియం వసూలైంది. మణిపాల్‌సిగ్నా 30% వృద్ధితో రూ.329 కోట్ల ప్రీమియం పొం దింది. రానున్న రోజుల్లో పరిశ్రమ సానుకూలంగా ఉంటుంది’ అని చెప్పారు. కాగా, బీమా కంపెనీలకు రూ.8,000 కోట్ల విలువైన కోవిడ్–19 క్లెయిమ్స్ వచ్చినట్టు తెలుస్తోంది. ఇందులో రూ.3,500 కోట్ల విలువైన క్లెయిమ్స్ సెటిల్ అయ్యాయని సమాచారం. -
పెద్దలకు పరిపూర్ణ రక్షణ
మన దేశ జనాభాలో వృద్ధులు (సీనియర్ సిటిజన్లు) 2015 నాటికి 8 శాతానికి చేరారు. 2050 నాటికి 19 శాతం వృద్ధులే ఉంటారని అంచనా. ప్రతీ ఇంటిలోనూ 60 ఏళ్లు నిండిన వయసు వారు ఆ కుటుంబానికి ఓ పెద్ద ఆస్తి వంటివారే. కుటుంబం కోసం అప్పటి వరకు వారు ఎంతో పాటు పడి, ఎంతో శ్రమకోర్చి ఉంటారు. కానీ, వృద్ధాప్యంలో వారిని చుట్టుముట్టే ఆరోగ్య, జీవనశైలి సమస్యలెన్నో. వీటి కోసం చేయాల్సిన ఖర్చు కొన్ని సందర్భాల్లో భారీగానూ ఉంటుంది. వయసుతోపాటు పెరిగే ఆరోగ్య సంరక్షణ వ్యయాలకు ప్రతీ కుటుంబం తగినంత సన్నద్ధతతో ఉండాలి. అయితే, సీనియర్ సిటిజన్లు, వారి పిల్లలు హెల్త్ కవరేజీ విషయంలో తగినంత రక్షణతో లేనట్టు ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్ ఇటీవల నిర్వహించిన సర్వే ద్వారా తెలిసింది. ‘‘ఉమ్మడి కుటుంబాలు కాస్తా ఏక కుటుంబంగా మారుతున్న రోజుల్లో.. పిల్లలు పెద్ద పట్టణాలకు, విదేశాలకు జీవనోపాధి కోసం తరలిపోతుండడంతో పెద్దల జీవనం, వారి సంరక్షణ సవాలుగా మారుతున్నాయి’’ అని ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్ సీఈవో మయాంక్ భత్వాల్ పేర్కొన్నారు. ఈ క్రమంలో వృద్ధాప్యంలో సంక్షేమం, ఆరోగ్యం కోసం అవసరమైన చర్యలను ముందు నుంచే తీసుకోవడం ద్వారా నిశ్చితంగా ఉండొచ్చు. ఇందుకోసం వైద్య బీమా తీసుకోవడంతోపాటు ఇతరత్రా చర్యలు కూడా అవసరమేనని సూచించే కథనమే ఇది. ఆరోగ్య అత్యవసర నిధి 50 ఏళ్లకు వచ్చిన వారికి పదవీ విరమణ తీసుకునేందుకు మరో 10 ఏళ్ల వరకు సమయం మిగిలి ఉంటుంది. ఈ కాలాన్ని వైద్య అత్యవసర నిధి సమకూర్చుకునేందుకు వినియోగించుకోవాలి. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో సిప్ రూపంలో పదేళ్ల పాటు ఇన్వెస్ట్ చేయడం ద్వారా అవసరమైనంత నిధిని సమకూర్చుకోవచ్చని సెబీ రిజిస్టర్డ్ పెట్టుబడి సలహాదారులు రేణు మహేశ్వరి సూచించారు. హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నప్పటికీ తన వంతుగా రోగి చెల్లించాల్సి వస్తే అందుకోసం వైద్య అత్యవసర నిధి అక్కరకు వస్తుంది. అవుట్ పేషెంట్‌గా తీసుకునే చికిత్సలకు పాలసీలు అన్నింటిలోనూ కవరేజీ ఉండకపోవచ్చు. కనుక అవుట్ పేషెంట్ వైద్య సేవలకు చేసే చెల్లింపులు, ఆస్పత్రికి రాను, పోను చార్జీలు ఇవన్నీ రోగి తన పాకెట్ నుంచే పెట్టుకోవాల్సి రావచ్చు. ఒక్కసారి నిధిని సిద్ధం చేసుకున్న తర్వాత.. మొత్తాన్ని ఒకే చోట కాకుండా.. సేవింగ్స్ డిపాజిట్, లిక్విడ్ ఫండ్స్, అల్ట్రా షార్ట్ టర్మ్ డెట్ ఫండ్స్, ఫిక్స్డ్ డిపాజిట్స్ రూపంలో ఉంచుకోవాలి. గ్రూపు హెల్త్ ఇన్సూరెన్స్‌లో చోటు ఉద్యోగం చేసే చోట గ్రూపు హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీని సంస్థ ఆఫర్ చేస్తుంటుంది. ఇందులో తమ తల్లిదండ్రుల పేర్లను కూడా యాడ్ చేసుకోవడం మంచి నిర్ణయం అవుతుంది. ఎందుకంటే సాధారణంగా గ్రూప్ హెల్త్ కవరేజీలో ప్రీమియం కొంచెం తక్కువగా ఉంటుంది. ముందు నుంచే తల్లిదండ్రులను యాడ్ చేసుకోవడం ద్వారా ప్రీమియం భారం తక్కువగా ఉండేలా చూసుకోవచ్చు. దీనికి తోడు తల్లిదండ్రులకు విడిగా హెల్త్ కవరేజీ కూడా తీసుకోవాలి. ‘‘చాలా కార్పొరేట్ సంస్థలు తల్లిదండ్రులకు దీర్ఘకాలం పాటు కవరేజీని ఆఫర్ చేయడం లేదు. అందుకే ముందు తల్లిదండ్రులను గ్రూపు హెల్త్ ఇన్సూరెన్స్‌లో చేర్చుకున్నా కానీ, కొన్ని సంవత్సరాల తర్వాత ఖర్చులను తగ్గించుకునేందుకు తొలగించాల్సి రావచ్చు. పైగా ఈ పాలసీల్లో పెద్దలకు కవరేజీ తక్కువగా రూ.2–3 లక్షల వరకే ఉంటుంది. ఉద్యోగం మానివేసినా, లేక సంస్థ మారినా ఈ కవరేజీని కోల్పోవాల్సి వస్తుంది’’ అని నిపుణులు పేర్కొంటున్నారు. అవసరమైన కవరేజీ.. వయసు పెరుగుతున్న కొద్దీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం అధికమవుతుంది. ‘‘మెట్రో నగరంలోనా లేక చిన్న పట్టణంలో నివసిస్తున్నారా?, మీ జీవన శైలి, ప్రస్తుత ఆరోగ్య పరిస్థితులు.. వీటి ఆధారంగా ఎంత మేర సమ్ ఇన్సూర్డ్ (బీమా మొత్తం) తీసుకోవాలన్నది ఆధారపడి ఉంటుంది’’ అని మణిపాల్ సిగ్నా హెల్త్ ఇన్సూరెన్స్ ఎండీ ప్రసూన్ సిక్దర్ తెలిపారు. మెట్రోలో ఉంటున్న వారు, ఆస్పత్రిలో సింగిల్‌రూమ్ కోరుకునే వారు అధిక కవరేజీ తీసుకోవడం అవసరం. వృద్ధ దంపతులకు రూ.10–20 లక్షల కవరేజీ, ఆ వయసులో విడిగా ఒకరికి అయితే రూ.7–10 లక్షల వరకైనా బీమా తీసుకోవాలి. కఠిన నిబంధనలు 50 ఏళ్లకి వచ్చే సరికి దంపతులు ఎట్టి పరిస్థితుల్లోనూ వైద్య బీమా కవరేజీ ఉండేలా చూసుకోవాలి. వైద్య బీమా అన్నది తగినంత లేకపోతే సూపర్ టాపప్ ద్వారా దాన్ని పెంచుకోవాలి. అదే 60 ఏళ్లు నిండిన తర్వాత కొత్తగా హెల్త్ పాలసీ తీసుకోవాలన్నా, సమ్ ఇన్సూర్డ్ మొత్తాన్ని పెంచుకోవాలన్నా లేక సూపర్ టాపప్ తీసుకోవాలన్నా అది కష్టంగా మారుతుంది. ‘‘ఒక వ్యక్తి 60 ఏళ్ల వయసులోకి ప్రవేశించారంటే వారికి కఠిన అండర్‌రైటింగ్ నిబంధనలు అమలవుతాయి. ఉదాహరణకు పాలసీ తీసుకునే ముందు వైద్య పరీక్షలు తప్పనిసరి’’ అని సిక్దర్ తెలిపారు. ముందస్తు వ్యాధులున్న వారికి బీమా కంపెనీలు బీమాకు నిరాకరిస్తున్నాయి కూడా. సీనియర్ సిటిజన్ల కోసం ఉద్దేశించిన పాలసీలు నేడు ఎన్నో అందుబాటులో ఉన్నాయి. ముందస్తు వ్యాధులకు ఇవి కవరేజీని ఆఫర్ చేస్తున్నప్పటికీ.. ఎన్నో పరిమితులను విధిస్తున్నాయి. వెయిటింగ్ పీరియడ్ ఆప్షన్లు పాలసీల్లో రెండు రకాల వెయిటింగ్ పీరియడ్ ఆప్షన్లు ఉంటుంటాయి. ముందు నుంచీ ఉన్న వ్యాధులకు కవరేజీ ఒకటి. పాలసీ తీసుకున్న అనంతరం రెండు నుంచి నాలుగేళ్లు గడిచిన తర్వాతే వీటికి కవరేజీనిస్తాయి. కేటరాక్ట్, మోకీలు మార్పిడి తదితర చికిత్సలకు కవరేజీ కోసం పాలసీ తీసుకున్న అనంతరం రెండేళ్ల పాటు ఆగాల్సి రావడం మరొకటి. అంటే ఈ కాలంలో చికిత్సలు చేయించుకోవాల్సి వస్తే అందుకు అయ్యే వ్యయాలను పాలసీదారులే పెట్టుకోవాలి. ఉప పరిమితులు బీమా సంస్థలు చెల్లింపుల్లో ఉప పరిమితులను కూడా విధిస్తుంటాయి. అంటే, ఫలానా వ్యాధికి గరిష్టంగా ఇంత మొత్తమని లేదా సమ్ ఇన్సూర్డ్‌లో నిర్ణీత శాతాన్ని చెల్లిస్తామన్న నిబంధనలు పాలసీల్లో ఉంటాయి. ఉదాహరణకు గుండె సంబంధిత సమస్యలకు గరిష్టంగా రూ.3 లక్షలే చెల్లిస్తామనే పరిమితి ఉండొచ్చు. అదే కేటరాక్ట్ సర్జరీ అయితే గరిష్ట చెల్లింపులను రూ.25,000కు పరిమితం చేస్తాయి. ఒకవేళ ఇంతకు మించి వ్యయం అయితే ఆ మొత్తాన్ని పాలసీదారులే భరించాల్సి ఉంటుంది. అలాగే అన్ని పాలసీల్లో కాకపోయినా కొన్నింటిలో రూమ్ రెంట్, ఐసీయూ రెంట్ పరంగా ఉప పరిమితులు కూడా ఉంటుంటాయి. ఈ పరిమితులతో మొత్తం పాలసీ చెల్లింపులు కూడా మారిపోతాయి. అందుకే పాలసీ తీసుకునే ముందు పూర్తి అవగాహనకు వచ్చిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలి. ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్ సర్వే అంశాలు ► 18 శాతం తల్లిదండ్రులకే హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీ ఉంది. అంటే మెజారిటీకి కవరేజీ లేదు. ► 26 శాతం తల్లిదండ్రులు వైద్య పరంగా అత్యవసర పరిస్థితుల్లో చెల్లింపులకు పిల్లలపైనే ఆధారపడుతున్నారు. అంటే నాలుగింట మూడొంతులు మందికి తగినంత పెట్టుబడులు, పొదుపు నిధుల్లేవు. ► 29 శాతం మంది తమ తల్లిదండ్రులను కంపెనీ లేదా ప్రభుత్వ వైద్య బీమా కవరేజీలో భాగం చేసినట్టు చెప్పారు. వీరికి ప్రత్యేకంగా కవరేజీ అవసరం కూడా ఉంది. కొన్ని పాలసీలను చూస్తే... బీమా కంపెనీ ప్లాన్ పేరు వార్షిక ప్రీమియం రెలిగేర్ హెల్త్ కేర్ సీనియర్ రూ.39,374 స్టార్ హెల్త్ సీనియర్ సిటిజన్ రెడ్‌కార్పెట్ రూ.43,135 ఆదిత్యబిర్లాహెల్త్ యాక్టివ్కేర్స్టాండర్డ్ రూ.55,598 అపోలోమ్యునిక్హెల్త్ ఆప్టిమారీస్టోర్ రూ.61,312 హెడీఎఫ్సీ ఎర్గో హెల్త్సురక్షా గోల్డ్స్మార్ట్ రూ.65,785 నోట్: మెట్రోలో నివసించే 63 ఏళ్ల వృద్ధుడు, 61 ఏళ్ల ఆయన జీవిత భాగస్వామికి రూ.10 లక్షల కవరేజీ కోసం ప్రీమియం వివరాలు ఇవి.. కో పేమెంట్ ఎంత..? పాలసీల్లో ఎక్కువ వాటిల్లో కో పేమెంట్ ఆప్షన్ ఉంటోంది. అంటే వైద్య చికిత్సా వ్యయాల్లో రోగి తన వంతుగా చెల్లించాల్సిన వాటా. ఇది పాలసీలను బట్టి 10–30% మధ్య ఉండొచ్చు. -
అందరి కోసం.. ఆరోగ్య సంజీవని!
ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవడం అన్నది ఎన్నో జాగ్రత్తలు, పరిశీలనలతో.. కాస్తంత శ్రమతో కూడుకున్నది. పాలసీలో కవరేజీ వేటికి లభిస్తుంది, వేటికి మినహాయింపులు, షరతులు, నియమ నిబంధనలు.. చూడాల్సిన జాబితా పెద్దదే. పైగా అందరికీ ఇవి అర్థమవుతాయని చెప్పలేము. దీంతో బీమా కంపెనీల వందలాది పాలసీల్లో ఏది మెరుగైనది అని తేల్చుకోవడం అంత ఈజీ కాదు. బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ) ఈ విషయాన్ని అర్థం చేసుకుని.. అన్ని రకాల సాధారణ కవరేజీ సదుపాయాలతో ఒకే ప్రామాణిక పాలసీని ‘ఆరోగ్య సంజీవని’ పేరుతో 2020 ఏప్రిల్ నాటికి తీసుకురావాలని బీమా సంస్థలను ఆదేశించింది. దీంతో అన్ని సాధారణ, ఆరోగ్య బీమా సంస్థలు ఆరోగ్య సంజీవని పాలసీని అందుబాటులోకి తీసుకొచ్చాయి. వైద్య సేవల ఖర్చులు ఏటేటా పెరిగిపోతున్న తరుణంలో ప్రతి ఒక్కరికీ ఆరోగ్య బీమా కవరేజీ అవసరం ఎంతో ఉంది. ‘ఆరోగ్య సంజీవని’ అందరికీ అనుకూలమేనా..? గరిష్టంగా రూ. 5 లక్షల వరకు హెల్త్ కవరేజీని ఆరోగ్య సంజీవని పాలసీ కింద అందించాలన్నది తొలుత ఐఆర్డీఏఐ నిర్దేశించిన షరతు. రూ.5లక్షలకు మించి కూడా ఆఫర్ చేయవచ్చంటూ ఐఆర్డీఏఐ ఇటీవలే సవరణలు తెచ్చింది. ఈ ప్లాన్‌లో క్లెయిమ్ చేసుకోని ప్రతీ సంవత్సరానికి గాను సమ్ ఇన్సూర్డ్ (బీమా రక్షణ) 5 శాతం పెరుగుతూ వెళుతుంది. గరిష్టంగా 50 శాతం వరకు ఇలా బీమా రక్షణ కవరేజీ పెరిగేందుకు అవకాశం ఉంది. మోస్తరు ప్రీమియానికే విస్తృతమైన కవరేజీనిచ్చే ఈ ప్లాన్‌ను మొదటిసారి తీసుకునే వారు ఎంచుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ‘‘పరిమిత బడ్జెట్ ఉన్న వారికి ఇది మంచి ఎంపికే అవుతుంది. హెల్త్ ఇన్సూరెన్స్ అవసరం పట్ల అవగాహన పెరుగుతున్నా కానీ, తీసుకుంటున్న వారి సంఖ్య మన దేశంలో ఇప్పటికీ చాలా తక్కువగానే ఉంటోంది. అర్థం చేసుకునేందుకు సంక్లిష్టతలు, ప్రీమియం భరించలేనంత ఉండడం సగటు గృహస్తుడు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కొనుగోలు చేయకుండా అడ్డుపడుతోంది. కానీ, ఆరోగ్య సంజీవని పాలసీ సులభంగా, సమంజసమైన ప్రీమియంతో ఉండడం అనుకూలత’’ అని ఫిన్‌ఫిక్స్ రీసెర్చ్ అండ్ అనలైటిక్స్ మేనేజింగ్ పార్ట్నర్ ప్రబ్లీన్ బాజ్‌పాయ్ పేర్కొన్నారు. ఆర్జన ఆరంభమై, తనపై ఆధారపడిన వారు లేకుంటే (అవివాహితులు) ఈ ప్లాన్‌ను తప్పకుండా పరిశీలించొచ్చని ఆయన సూచించారు. ‘‘ఆరోగ్య సంజీవని పాలసీ సమగ్ర కవరేజీ కోరుకునే యువతీయువకులకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఇతర పాలసీల కంటే ప్రీమియం తక్కువగా ఉండడంతోపాటు రోజువారీ చికిత్సలు సహా కవరేజీ విస్తృతంగా ఉంటుంది’’ అని ఫిన్‌సేఫ్ వ్యవస్థాపక డైరెక్టర్ మృణ్ అగర్వాల్ తెలిపారు. ‘‘ఆరోగ్య సంజీవని పాలసీ అన్నది సులభమైన ప్రాథమిక పాలసీ. పైగా చౌక అయినది. కాకపోతే ఇందులో 5 శాతం కోపేమెంట్ (ఆస్పత్రి బిల్లులో 5 శాతాన్ని పాలసీదారు భరించడం) షరతు ఉండగా, పూర్తి స్థాయి ఆరోగ్య బీమా ప్లాన్లలో ఇది ఉండదు’’ అని పాలసీఎక్స్ డాట్‌కామ్ సీఈవో నావల్ గోయల్ తెలిపారు. వీటిని చూసి తీసుకుంటే మంచిది.. అనుకూలమేనా..? రూ.5 లక్షల గరిష్ట కవరేజీకే ప్రస్తుతం అవకాశం ఉంది. కాకపోతే అంతకుమించి ఆఫర్ చేయవచ్చని ఐఆర్డీఏఐ తాజాగా అనుమతించడం సానుకూలం. పెరిగిపోతున్న ఆరోగ్య సంరక్షణ ఖర్చుల దృష్ట్యా రూ.5 లక్షల కవరేజీ అందరికీ, అన్ని వయసుల వారికీ, ముఖ్యంగా పెద్ద పట్టణాల్లో నివసించే వారికి సరిపోకపోవచ్చు. కనుక రూ.5 లక్షలకు మించి కవరేజీ పెంచుకునే అవకాశం ఉంటే ఈ పాలసీని పరిశీలించొచ్చు. పెంచుకునేందుకు అవకాశం లేకపోతే మధ్య వయసు నుంచి వృద్ధాప్యంలో ఉన్న వారికి ఈ పా లసీ అంత అనుకూలం కాదనే చెప్పుకోవాలి. ‘‘అధిక ప్రీమియం చెల్లించే సామర్థ్యం ఉండి, మెట్రోల్లో నివసిస్తున్న వారు అయితే ఆరోగ్య సంజీవని పాలసీ కాకుండా సమగ్ర కవరేజీనిచ్చే ఇతర ప్లాన్లను పరిశీలించొచ్చు’’ అని బాజ్‌పాయ్ సూచిం చారు. ‘‘తనపై పిల్లలు, తల్లిదండ్రులు ఆధారపడి ఉంటే అధిక కవరేజీ అవసరమవుతుంది. సరిపడా కవరేజీనిచ్చే ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీని ఎంచుకోవాలి’’ అని మృణ్ అగర్వాల్ సూచించారు. ఒకవేళ ఇప్పటికే సమగ్ర కవరేజీతో కూడిన ఆరోగ్య బీమా ప్లాన్ కలిగిన వారు ఆరోగ్య సంజీవనిని పరిశీలించాల్సిన అవసరం లేదు. ప్రీమియంలో వ్యత్యాసం..: ‘‘ఎన్ని క్లెయిమ్‌లు రావచ్చన్న అంచనా రేషియోల ఆధారంగా బీమా సంస్థలు ప్రీమియం నిర్ణయిస్తుంటాయి. ప్రతీ బీమా సంస్థకు యాక్చుయేరియల్ బృందం ఉంటుంది. వారి అంచనాలు వేర్వేరుగా ఉండడం వల్లే ప్రీమియం రేట్లలో వ్యత్యాసం ఉంటుంది. అలాగే, అన్ని బీమా సంస్థ సేవల నాణ్యత ఒకే విధంగా ఉండదు. ప్రీమియంలో వ్యత్యాసానికి ఇది కూడా ఒక కారణం’’అని నావల్ గోయల్ వివరించారు. ఇన్కర్డ్ క్లెయిమ్ రేషియో ఒక బీమా కంపెనీ ఒక ఏడాదిలో పాలసీల ప్రీమియం రూపేణా ఆర్జించిన ప్రతీ రూ.100 నుంచి ఎంత మొత్తాన్ని క్లెయిమ్‌లకు చెల్లింపులు చేసిందో తెలియజేస్తుంది. ఇన్కర్డ్ క్లెయిమ్ రేషియో ఎక్కువగా ఉంటే అది పాలసీదారులకు ప్రయోజనం. కానీ, ఇది నూరు శాతం మించితే అది బీమా కంపెనీకి నష్టం. ఎందుకంటే ప్రీమియం ఆదాయానికి మించి క్లెయిమ్‌లు వస్తే బీమా సంస్థ నష్టపోవాల్సి వస్తుంది. దాంతో ప్రీమియంలు భారీగా పెంచేయాల్సి వస్తుంది. లేదంటే క్లెయిమ్‌లకు కొర్రీలు వేయాల్సి వస్తుంది. ఈ రేషియో 60 శాతానికి తక్కువ కాకుండా ఉన్న కంపెనీని ఎంచుకోవాలి. క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో తనకు వచ్చిన మొత్తం క్లెయిమ్ దరఖాస్తులలో ఎన్నింటికి కంపెనీ చెల్లింపులు చేసిందో దీన్ని చూసి తెలుసుకోవచ్చు. ఈ రేషియో 90 శాతానికి పైన ఎంత ఎక్కువగా ఉంటే అంత మంచిది. వేగం, సేవలు క్లెయిమ్‌లను వేగంగా పరిష్కరించే సంస్థ నుంచి పాలసీ తీసుకోవడం సౌకర్యాన్నిస్తుంది. అలాగే, కస్టమర్ సేవలు మెరుగ్గా ఉండే కంపెనీని ఎంచుకోవాలి. నెట్వర్క్ ఆస్పత్రులు బీమా కంపెనీ నెట్వర్క్ ఆస్పత్రుల జాబితాలో మీరు నివసించే ప్రాంతాలకు సమీపంలోని ఆస్పత్రులు ఉన్నాయేమో చూసుకోవాలి. దీనివల్ల నగదు రహిత సేవలను ఆయా ఆస్పత్రుల్లో పొందొచ్చు. ప్రీ, పోస్ట్ హాస్పిటలైజేషన్ అనారోగ్యానికి సంబంధించి ఆస్పత్రి లో చేరడానికి ముందు వ్యాధి నిర్ధారణ తదితర ఖర్చులు ఎదురవుతాయి. ఆస్పత్రిలో చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా కొంత కాలం పాటు ఖర్చులు ఎదురవుతాయి. కనుక ప్రీ, పోస్ట్ హాస్పిటలైజేషన్ కింద ఎక్కువ రోజులకు కవరేజీనిచ్చే పాలసీని ఎంపిక చేసుకోవాలి. రూమ్ రెంట్ ఆస్పత్రిలో చేరిన తర్వాత ఐసీయూ నుంచి వార్డుకు లేదా షేరింగ్ రూమ్‌కు లేదా ప్రైవేటు రూమ్‌కు షిఫ్ట్ చేస్తుంటారు. ఏ రూమ్ అయినా సరే అన్న నిబంధన ఉండే పాలసీని ఎంచుకోవాలి. అలా కాకుండా పాలసీలో రూమ్ రెంట్ పరిమితి ఉంటే.. అంతకుమించిన చార్జీలతో కూడిన రూమ్ తీసుకుంటే.. ఆయా ఖరీదైన స్టేయింగ్ వద్ద చేసే వైద్య ఖర్చులు కూడా అధికంగానే ఉంటాయి. ఇటువంటి సందర్భాల్లో బీమా కంపెనీ పూర్తి స్థాయి చార్జీలను చెల్లించదు. సబ్ లిమిట్స్ కొన్ని రోజువారీ చికిత్సలు, కొన్ని రకాల వ్యాధులకు సంబంధిం చి ఇంతే పరిహారం చెల్లిస్తామనే నిబంధనలు ఉంటాయి. వాటి ని కూడా పరిశీలించి సమ్మతం అనుకుంటేనే ముందుకు వెళ్లాలి. రీస్టోరేషన్ సదుపాయం ఉదాహరణకు రూ.5 లక్షలకు ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ తీసుకున్నారనుకోండి. ఒక ఏడాదిలో ఎవరైనా ఆస్పత్రి పాలై బిల్లు రూ.5 లక్షలకు మించితే అప్పుడు మరో రూ.5 లక్షలు ఆటోమేటిక్‌గా కవర్‌ను బీమా సంస్థ విడుదల చేస్తుంది. ఇదే రీస్టోరేషన్ బెనిఫిట్. ఒకరికి మించి కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేరాల్సి వచ్చి బిల్లు సమ్ ఇన్సూర్డ్ మొత్తం దాటిపోయిన సందర్భాల్లోనూ ఇది ఆదుకుంటుంది. అయితే ఈ రీస్టోరేషన్ బెనిఫిట్‌ను ఒక ఏడాదిలో అప్పటికే చికిత్స పొందిన సమస్య కోసం చాలా బీమా సంస్థలు అందించడం లేదు. అంటే పాలసీదారు వేరొక సమస్య కోసం రీస్టోరేషన్‌ను పొందొచ్చు. ఏ సమ స్య అయిన రీస్టోరేషన్‌ను అనుమతించే పాలసీ మంచి ఎంపిక. కోపే ఆప్షన్ ఆస్పత్రి బిల్లులో పాలసీదారు ఎంత పెట్టుకోవాలన్నది ఇందులో ఉంటుంది. కొన్ని పాలసీల్లో కోపే షరతు ఉంటోంది. ఇలా ఉన్న పాలసీల ప్రీమియం కొంత తక్కువగా ఉంటుంది. సూపర్ టాపప్..: హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీని పెంచుకునేందుకు సూపర్ టాపప్ లేదా టాపప్ పేరుతో ఉండే ప్లాన్‌ను కొనుగోలు చేసుకోవచ్చని నిపుణుల సూచన. బేసిక్ హెల్త్ కవరేజీకి యాడాన్‌గా (జోడింపుగా) ఈ ప్లాన్ తక్కువ ప్రీమియానికే లభిస్తుంది.