న్యూఢిల్లీ: ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ.. వృద్ధి అవకాశాలు పుష్కలంగా ఉన్న రిటైల్ హెల్త్ ఇన్సూరెన్స్ విభాగంలో మరింత బలోపేతం కావడంపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా అదనపు పెట్టుబడులు పెట్టినట్టు సంస్థ వార్షిక నివేదికలో వాటాదారులకు తెలియజేసింది.
సంస్థ స్థూల ప్రీమియం ఆదాయం (జీడీపీఐ) గత ఆర్థిక సంవత్సరానికి రూ.17,977 కోట్లుగా ఉంది. ఇది అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో రూ.14,003 కోట్లుగా ఉన్నట్టు తెలిపింది. వార్షికంగా ప్రీమియం ఆదాయంలో 28.7 శాతం వృద్ధి నమోదైంది. భారతీ ఆక్సా జనరల్ ఇన్సూరెన్స్‌కు సంబంధించి నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ వ్యాపారాన్ని విజయవంతంగా విలీనం చేసుకుంది. ఈ విలీనం అనంతరం జీడీపీఐ పరంగా పరిశ్రమలో రెండో స్థానానికి ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ చేరుకుంది. ఇక జనరల్ ఇన్సూరెన్స్ పరిశ్రమ 2021–22లో 11 శాతం వృద్ధిని చూడడం గమనార్హం.
‘‘పరిశ్రమకు హెల్త్ ఇన్సూరెన్స్ అత్యధిక వ్యాపారాన్ని తెచ్చి పెడుతోంది. ఈ విభాగంలో ఐసీఐసీఐ లాంబార్డ్ కూడా మంచి వృద్ధిని చూస్తోంది. రిటైల్ హెల్త్ విభాగంలో వృద్ధి అవకాశాల దృష్ట్యా మా పెట్టుబడులను పెంచాం. రిటైల్ హెల్త్ ఏజెన్సీ బృందంలో విక్రయదారుల సంఖ్యను పెంచాం’’అని ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈవో భార్గవ్ దాస్‌గుప్తా వాటాదారులకు వివరించారు.
అధిక వృద్ధి నమోదు..
‘‘సంస్థ మోటారు ఇన్సూరెన్స్ వ్యాపారం గత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో పరిమిత వృద్ధినే చూసింది. సరఫరా సమస్యలు, డిమాండ్ సెంటిమెంట్ తక్కువగా ఉండడం కారణాలు. ఇక ద్వితీయ ఆరు నెలల్లో మోస్తరు స్థాయికి వృద్ధి చేరుకుంది. పరిశ్రమ కంటే కంపెనీయే అధిక వృద్ధిని సాధించింది’’అని దాస్ గుప్తా తెలిపారు. ఎస్‌ఎంఈ విభాగంలో 17.8 శాతం వృద్ధిని చూసింది. ఫైర్ ఇన్సూరెన్స్‌లో సంస్థ వాటా 12.8 శాతం, ఇంజనీరింగ్‌లో 15.2 శాతం, మెరైన్‌కార్గో ఇన్సూరెన్స్‌లో 17.9 శాతానికి చేరుకుంది.
Comments
Please login to add a commentAdd a comment