ఒకోసారి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కింద భారీగా కవరేజీ ఉన్నా.. క్లెయిమ్ సమయంలో అరకొర మాత్రమే చేతికి రావొచ్చు. ఉదాహరణకు మనకు రూ. 2 లక్షల దాకా కవరేజీ ఉందనుకుందాం. వైద్య చికిత్స బిల్లు రూ.లక్షే అయింది. ఇలాంటప్పుడు కవరేజీ రూ.2 లక్షల దాకా ఉంది కాబట్టి.. క్లెయిమ్ చేసిన రూ. లక్ష తిరిగి వస్తుందనే చాలా మంది అనుకుంటారు. కానీ వాస్తవానికి పలు సందర్భాల్లో క్లెయిమ్ చేసిన దాంట్లో పాక్షికంగానే ఇన్సూరెన్స్ సంస్థ ఇచ్చే అవకాశం ఉంది. దీనికి కారణం సబ్–లిమిట్ నిబంధన. దానిపై అవగాహన కల్పించేదే ఈ కథనం.
సబ్ లిమిట్స్ అంటే...
మీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కింద కొన్ని రకాల చికిత్సలకు చెల్లింపులపరంగా నిర్దేశించిన కొన్ని పరిమితులనే సబ్ లిమిట్స్‌గా వ్యవహరిస్తారు. ఇవి సాధారణంగా ఈ ఆరోగ్య సమస్య చికిత్సకు ఇంత మొత్తం మాత్రమే ఇవ్వడం జరుగుతుందనో లేదా మొత్తం సమ్ ఇన్సూ ర్డ్‌లో నిర్దిష్ట శాతం మాత్రమే ఇవ్వడం జరుగుతుందనో కంపెనీ పేర్కొంటుంది. ఈ పరిమితులను పాలసీలో అంతర్గతంగానే పేర్కొనడం జరుగుతుంది. హెల్త్ పాలసీని తీసుకునేటప్పుడు ప్రధానంగా రెండు రకాల సబ్ లిమిట్స్‌ని దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. మొదటిది హాస్పిటల్ రూమ్ రెంట్ కాగా, రెండోది నిర్దిష్ట ఆరోగ్య సమస్యల చికిత్స వ్యయాలపై నిర్దేశించే పరిమితులు.
సబ్ లిమిట్స్ ప్రభావాలు..
గది అద్దెపై పరిమితుల ప్రభావాలు.. మిగతా హాస్పిటల్ చార్జీల మీద కూడా ఉం టాయి. ఉదాహరణకు డాక్టర్ విజిట్, శస్త్ర చికిత్స, నర్సింగ్ చార్జీలు, ఆపరేషన్ థియేటర్ చార్జీలు, సర్జన్ ఫీజులు, అనెస్థటిస్ట్, స్పెషలిస్టుల ఫీజులు, ఇతరత్రా వైద్య చికిత్సా వ్యయాలు.. ఇవన్నీ కూడా మీరు ఎంచుకునే గది మీదే ఆధారపడి ఉంటాయి.
ఉదాహరణకు.. నిర్దిష్ట శస్త్ర చికిత్సకు ట్విన్ షేరింగ్ గదిలోనైతే.. రూ. 20,000, సింగిల్ రూమ్‌లోనైతే రూ. 40,000 వ్యయం అవుతుందనుకుందాం. ట్విన్ షేరింగ్ రూమ్‌లో డాక్టర్ విజిట్ ఫీజు రూ. 1,000 కాగా.. సింగిల్ రూమ్‌లో రూ. 2,000 అనుకుందాం. ఇక మీరు రోజుకు రూ. 5,000 టారిఫ్ ఉండే గదిని తీసుకున్నారనుకుందాం. ఇప్పుడు లెక్కేస్తే.. 4రోజులకు మీ గది అద్దె రూ. 20,000 అవుతుంది. అయితే, మీ హెల్త్ పాలసీలో గది అద్దెపై గరిష్ట పరిమితి రూ.2,000 మాత్రమే. దీంతో మిగతా రూ. 12,000 (అదనంగా రోజుకు రూ. 3,000 చొప్పున, 4 రోజులకు) మొత్తాన్ని మీరే కట్టాల్సి వస్తుంది. ఇది ఇక్కడితో అయిపోలేదు. ముందుగా అనుకున్నట్లే.. మనం ఎంచుకున్న రూమ్‌ని బట్టి చికిత్సా వ్యయాలూ మారి పోతుంటాయి. కాబట్టి మీరు ఎంచుకున్న రూ. 5,000 టారిఫ్ గది ప్రకారం.. డాక్టర్ విజిట్, సర్జరీ, మెడికల్ టెస్టులు మొదలైన వాటికి రూ. 2లక్షలు అయ్యాయనుకుందాం. ఇది మీ పాలసీ సమ్ ఇన్సూర్డ్ రూ. 2లక్షలకు లోబడే ఉంది. కానీ.. మీ పాలసీలో నిర్దేశించిన రూమ్ రెంట్ సబ్ లిమిట్స్ ప్రకారం.. రూ. 2,000 టారిఫ్ గదిలో ఈ వ్యయాలు రూ. 1.50 లక్షలే అవుతాయి. అంటే నిర్దేశించిన సబ్ లిమిట్స్‌ని మించిన రూమ్‌ని తీసుకోవడం వల్ల గది అద్దె అదనపు మొత్తంతోపాటు.. మరో రూ. 50,000 కూడా మీ జేబు నుంచే కట్టాల్సి ఉంటుంది.
నిర్దిష్ట చికిత్సల వ్యయాలపై పరిమితులు
అత్యధిక కవరేజీ ఉండేలా హెల్త్ పాలసీ తీసుకున్నా.. కొన్ని ఆరోగ్య సమస్యల చికిత్సల వ్యయాలపై నిర్దిష్ట పరిమితులు ఉంటాయి. వీటిని గురించిన వివరాలు పాలసీలో ప్రత్యేకంగా కంపెనీ పేర్కొంటుంది. ఇలాంటి చికిత్సల వ్యయాలపై వేర్వేరు కంపెనీలు విధించే పరిమితులు వేర్వేరుగా ఉండొచ్చు. స్థూలంగా చెప్పొచ్చేదేమిటంటే.. సమ్ ఇన్సూర్డ్ అధికంగా ఉన్నంత మాత్రాన ప్రతీ వైద్య చికిత్సకూ పూర్తి స్థాయిలో క్లెయిమ్ చేసుకోవడానికి సాధ్యం కాకపోవచ్చు. ఆయా చికిత్సా వ్యయాలపై సబ్ లిమిట్సే ఇందుకు కారణం. చికిత్స వ్యయాలపై సబ్ లిమిట్స్‌కి ఒక ఉదాహరణ చూద్దాం. ఉదాహరణకు కార్డియాక్ సమస్య చికిత్సకు సబ్–లిమిట్ 50 శాతం మాత్రమే ఉన్న పక్షంలో మీ సమ్ అష్యూర్డ్ రూ. 5 లక్షలు ఉన్నప్పటికీ.. రూ. 2.5 లక్షలకు మించి క్లెయిమ్ చేయడానికి ఉండదు. అలాగే, కిడ్నీలో రాళ్ల సమస్య చికిత్స వ్యయాలు రూ. 1 లక్ష అయ్యాయనుకుందాం. కానీ హెల్త్ పాలసీ ప్రకారం.. దీని చికిత్సకు రూ. 40,000 మాత్రమే సబ్ లిమిట్ ఉంటే.. మిగతా రూ. 60,000 మన జేబు నుంచి కట్టాల్సి వస్తుంది.
సబ్ లిమిట్స్ విషయంలో గుర్తుంచుకోదగిన విషయాలు..
►వీలైనంత వరకూ సబ్–లిమిట్స్ లేని హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని ఎంచుకోండి. అలా కుదరకపోతే.. ఏ చికిత్సకు ఎంత వరకూ వ్యయ పరిమితి ఉంటుందో క్షుణ్నంగా తెలుసుకున్నాకే తీసుకోండి.
►వెసులుబాటు బట్టి సమ్ ఇన్సూర్డ్ అత్యధికంగా ఉండేలా చూసుకుంటే.. ఒకవేళ సబ్–లిమిట్స్ ఉన్నా.. వాటి పరిమితి కూడా అధికంగానే ఉంటుంది.
►అయితే, సమ్ ఇన్సూర్డ్ ఎక్కువయ్యే కొద్దీ.. కట్టాల్సిన ప్రీమియం కూడా పెరుగుతుంది. కాబట్టి నెలవారీ ఖర్చులను బేరీజు వేసుకుని దాని ప్రకారం నిర్ణయం తీసుకోవాలి.
► హెల్త్ కవర్ ప్లాన్ షరతులు, నిబంధనలు మొదలైన వాటన్నింటినీ క్షుణ్నంగా చదివి, అర్థం చేసుకోవాలి.
►మీ ఆర్థిక పరిస్థితులు, అవసరాలకు అనుగుణమైన హెల్త్ పాలసీని ఎంపిక చేసుకునేటప్పుడు.. ఏయే వ్యాధులు కవరేజీ పరిధిలోకి రావో, వేటికి మినహాయింపులు ఉన్నాయో తెలుసుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment