coverage
-
ఆరోగ్యశ్రీ కవరేజీ రూ. 10 లక్షలు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినవిధంగానే ఆరోగ్యశ్రీ కవరేజీని రూ. 5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. శనివారం నుంచే రాష్ట్రవ్యాప్తంగా అన్ని నెట్వర్క్ ఆస్పత్రుల్లో పెరిగిన కవరేజీ అందుబాటులోకి రానుంది. వాస్తవానికి గతంలో ఆరోగ్యశ్రీ కింద రూ.2 లక్షల వరకు మాత్రమే కవరేజీ ఉండేది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఆయుష్మాన్ భారత్ పథకం కూడా ఆరోగ్యశ్రీతో కలిపి చేస్తుండటంతో కవరేజీని రూ.5లక్షలకు పెంచారు. ఇక నుంచి ఏడాదికి ఈ పథకాల కింద ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల వరకు కవరేజీ ఉంటుంది. ఈ పథకం కోసం ప్రభుత్వం ఏటా ఇప్పటివరకు రూ. 800 కోట్ల వరకు ఖర్చు చేస్తుండగా, ఇకనుంచి అది రెట్టింపు అవుతుందని అంచనా వేస్తున్నారు. అయితే దీనిపై ఇంకా స్పష్టత రాలేదు. 77.19 లక్షల మందికి ఆరోగ్యశ్రీ కార్డులు రాష్ట్రంలో 293 ప్రైవేట్ ఆస్పత్రులు, 198 ప్రభుత్వ పెద్దాస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఇటీవల ప్రభుత్వం 809 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్సీ)లోనూ ఆరోగ్యశ్రీ కింద సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది. మొత్తంగా రాష్ట్రంలో 1,310 ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులో ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 77.19 లక్షల మందికి ఆరోగ్యశ్రీ కార్డులున్నాయి. ఉద్యోగులు, జర్నలిస్టుల ఆరోగ్య పథకాన్ని కూడా ఆరోగ్యశ్రీ ట్రస్టు ద్వారా అమలు చేస్తున్నారు. రాష్ట్రంలోని లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులు, జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులు ఈజేహెచ్ఎస్ కిందకు వస్తారు. లబ్ధిదారుల్లో ఎవరికైనా ఏదైనా జబ్బు వస్తే నగదు రహిత వైద్యం పొందడానికి అవకాశం ఉంటుంది. అయితే బకాయిలు పేరుకుపోవడంతోపాటు ఆరోగ్యశ్రీ కింద ఆస్పత్రులకు ఇచ్చే ప్యాకేజీ సొమ్ము సరిపోవడం లేదని యాజమాన్యాలు చెబుతున్నాయి. 2013 ప్యాకేజీ ప్రకారమే ఆస్పత్రులకు సొమ్ము అందుతుంది. దీనిని సవరించాలని ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు కోరుతున్నాయి. అది పెంచకపోతే కవరేజీ రెట్టింపు చేసినా, తమకు ఎలాంటి ప్రయోజనం ఉండదని అంటున్నారు. ప్రస్తుతం ఆరోగ్యశ్రీ కింద 1,376 శస్త్రచికిత్సలు, 289 వైద్య సేవలున్నాయి. ఆయుష్మాన్ భారత్ కింద 1,949 వ్యాధులకు వైద్యం అందుతుంది. ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్‌లో ఈ రెండింటిలో ఉన్న వ్యాధులను కలిపి అమలు చేస్తున్నారు. అయితే ఆయుష్మాన్ భారత్ పథకం కింద కేంద్రం 2022లో ప్యాకేజీలను సవరించింది. కానీ రాష్ట్రంలో అది జరగకపోవడంతో పథకం సక్రమంగా అమలు కావడం లేదు. కాగా, మరికొన్ని కొత్త వ్యాధులను కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురావాలని ఆరోగ్యశ్రీ ట్రస్టు నిర్ణయించింది. 611 కొత్త వ్యాధులను తీసుకురావాలని ప్రతిపాదించగా, వాటిల్లో 539 కొత్త వాటిని ఖరారు చేశారు. -
టాటా ఏఐజీ నుంచి హెల్త్ సూపర్ చార్జ్ ప్లాన్
ముంబై: టాటా ఏఐజీ జనరల్ ఇన్సూరెన్స్.. ‘హెల్త్ సూపర్ చార్జ్’ ప్లాన్‌ను ప్రారంభించింది. దీని కింద పాలసీదారులు ఐదు రెట్లు అధికంగా హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీని పొందొచ్చు. ఏటా 50 శాతం రెన్యువల్ బోనస్ చొప్పున గరిష్టంగా 500 శాతం (ఐదు రెట్లు) కవరేజీని పెంచుకోవచ్చు. టైర్–1 నుంచి టైర్–4 వరకు పట్టణాల్లో నివసించే వారి భిన్న రకాల ఆరోగ్య సంరక్షణ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ ప్లాన్‌ను తీసుకొచ్చినట్టు సంస్థ తెలిపింది. ప్రీమియంపై 5 శాతం డిస్కౌంట్, సమ్ ఇన్సూర్డ్ అపరిమిత రీస్టోరేషన్ సదుపాయం, ముందు నుంచి ఉన్న వ్యాధుల వేచి ఉండే కాలాన్ని నాలుగేళ్ల నుంచి 30 రోజులకు తగ్గించుకునే ఆప్షన్లు ఇందులో ఉన్నాయి. ఈ ప్లాన్ కింద రూ.5–20 లక్షల కవరేజీని పొందొచ్చు. ఏటా ఉచిత హెల్త్ చెకప్ సదుపాయం కూడా ఉంది. -
మనోళ్ల ‘హెల్త్ కవర్’ అంతంతే..!
సాక్షి, హైదరాబాద్: జీవిత బీమా, హెల్త్ కవర్–ఇన్సూరెన్స్, ఆరోగ్య బీమా కవరేజీ వంటి విషయాల్లో భారతీయులు అంత చురుకుగా వ్యవహరించడం లేదనే అభిప్రాయం ఉంది. కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో జీవిత బీమా, సరైన ఆరోగ్య రక్షణలు లేనివారు రూ. 20 వేల కోట్లకు పైగానే కరోనా సంబంధిత ఆరోగ్య సమస్యలపై చికిత్స కోసం వ్యయం చేయాల్సి వచ్చిదనే అనధికార అంచనాలున్నాయి. కరోనా కేసులు ఉధృతంగా ఉన్న రోజుల్లో ఎదురైన పరిస్థితుల కారణంగా మధ్య, దిగువ, పేద వర్గాల ప్రజలకు చెందిన వారు తీవ్రమైన ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొన్న ఉదంతాలు చాలానే వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం కరోనా మహమ్మారి అనంతర పరిస్థితుల్లో హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తప్పనిసరి అని 46 శాతం మంది భావిస్తున్నారు. ఇప్పుడు పెరుగుతున్న వైద్యఖర్చులకు ఈ హెల్త్ పాలసీలు ఉపయోగపడతాయని 43 శాతం మంది అభిప్రాయపడుతున్నారు. ఇదీ అధ్యయనం... తాజాగా భారతీయ టెక్–ఫస్ట్ ఇన్సూరెన్స్ కంపెనీ–అక్నో అధ్యయనంలో వివిధ అంశాలు వెల్లడయ్యాయి. 68 శాతం మందికి రూ.10 లక్షలలోపే ఆరోగ్య బీమా కవరేజీ ఉందని, వారిలోనూ 27 శాతం మందికి మెడికల్ కవర్ రూ. 5 లక్షలలోపే ఉన్నట్టుగా ఇది స్పష్టం చేసింది. దేశంలోని ఆరు మెట్రో నగరాల్లోని 28–55 ఏళ్ల మధ్య వయసున్న వారి నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఈ సంస్థ నివేదికను సిద్ధం చేసింది. అన్లిమిటెడ్ కవరేజీ, కన్జుమబుల్స్, రూమ్‌రెంట్ క్యాపింగ్ వంటి వాటిపై పాలసీ హోల్డర్లకు అంతగా అవగాహన ఉండటం లేదన్న విషయం నివేదికలో వెల్లడైంది. -
సైబర్ ఇన్సూరెన్స్ గురించి తెలుసా? రూ. కోటి వరకూ కవరేజీ..
డిజిటల్ పరికరాల్లో వ్యక్తిగత డేటాను భద్రపర్చుకోవడం, వాటి ద్వారా షేర్ చేసుకోవడం, సేకరించడం వంటి ధోరణులు గణనీయంగా పెరిగాయి. దీంతో బడా కార్పొరేట్లు మొదలుకుని సాధారణ వ్యక్తుల వరకూ అందరూ ఆన్లైన్ మోసాలు, గుర్తింపు చోరీ, మాల్‌వేల్ బారిన పడే ముప్పులూ పెరుగుతున్నాయి. ఫలితంగా బోలెడంత నష్టపోవాల్సి కూడా వస్తోంది. ఇలాంటి వాటి నుంచి సరైన సాఫ్ట్వేర్ కొంత రక్షణ కల్పిస్తుండగా, మరి కొంత భరోసానిచ్చేదే సైబర్ బీమా. 18 ఏళ్లు పైబడిన వారు దీన్ని తీసుకోవచ్చు. ఇండివిడ్యుయల్ సైబర్ పాలసీల కింద కవరేజీ రూ. 1 లక్ష మొదలుకుని రూ. 1 కోటి వరకూ ఉంటోంది. ఈ పాలసీని తీసుకునే ముందు అర్థం చేసుకోవాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. అవేమిటంటే.. క్యూఆర్ కోడ్ వల్ల జరిగే క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డు మోసాలు, మనీ ట్రాన్స్ఫర్ స్కాముల సందర్భాల్లోనూ రిటైల్ కస్టమరుకు రక్షణ లభించగలదు. ‘బ్యాంకు ఖాతా, క్రెడిట్..డెబిట్ కార్డులను బ్లాక్ చేస్తున్నాం, ఐడెంటిటీని ధృవీకరించడానికి లింక్‌పై క్లిక్ చేయండి‘ అంటూ మోసపూరిత మెయిల్స్ వస్తుంటాయి. ఇలాంటి వాటి వల్ల ఆర్థిక నష్టం వాటిల్లితే పాలసీ ద్వారా దాన్ని భర్తీ చేసుకోవచ్చు. గుర్తింపు చోరీ కవరేజీ: కంప్యూటర్లో భద్రపర్చిన వ్యక్తిగత సమాచారాన్ని దుర్వినియోగం చేయడం, చెరిపివేయడం, మార్చేయడం వంటి సందర్భాల్లో ఇది ఉపయోగపడుతుంది. థర్డ్ పార్టీపై కేసు వేస్తే ప్రాసిక్యూషన్‌కు అయ్యే వ్యయాలకు కవరేజీ కల్పిస్తుంది. మాల్వేర్ కవర్: ఎస్ఎంఎస్, ఫైల్ ట్రాన్స్ఫర్, లేదా ఇతరత్రా ఇంటర్నెట్ .. డిజిటల్ మాధ్యమాల ద్వారా మీ కంప్యూటర్ లేదా డిజిటల్ డివైజ్‌లోకి డౌన్లోడ్ చేసుకున్న కంప్యూటర్ ప్రోగ్రాంతో మాల్వేర్ వంటిదేమేనా చొరబడి, నష్టం వాటిల్లితే ఇది భర్తీ చేస్తుంది. ఫిషింగ్ కవర్: నమ్మకంగా కనిపిస్తూనే .. ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ద్వారా యూజర్ నేమ్స్, పాస్వర్డ్లు, క్రెడిట్ కార్డుల వివరాలను (కొన్ని సందర్భాల్లో పరోక్షంగా డబ్బు) చోరీ చేసే యత్నాల వల్ల వాటిల్లే నష్టాన్ని భర్తీ చేసుకునేందుకు, ప్రాసిక్యూషన్ ఖర్చులకు ఫిషింగ్ కవరేజీ ఉపయోగపడుతుంది. థర్డ్ పార్టీ ద్వారా ప్రైవసీ, డేటా ఉల్లంఘన: మీ వ్యక్తిగత డేటాను థర్డ్ పార్టీ అనధికారికంగా బైటపెట్టినా లేదా థర్డ్ పార్టీ కంప్యూటర్ సిస్టమ్‌లో భద్రపర్చిన మీ వ్యక్తిగత డేటాకు అనధికారికంగా యాక్సెస్ పొందినా లేదా ఉపయోగించినా, తత్ఫలితంగా వాటిల్లే నష్టాలను భర్తీ చేసుకునేందుకు ఈ కవరేజీ పని చేస్తుంది. కౌన్సిలింగ్ సర్వీసులు: పైన పేర్కొన్న ఏ కారణాల వల్లనైనా పాలసీదారు ఒత్తిడి, ఆందోళనకు లోనై అక్రెడిటెడ్ సైకియాట్రిస్ట్, సైకాలజిస్ట్ లేదా కౌన్సిలర్ వద్ద చికిత్స పొందితే దానికి అయ్యే వ్యయాలను భర్తీ చేసుకోవచ్చు. మాల్వేర్ దాడి జరిగిన సందర్భంలో కంప్యూటర్ సాఫ్ట్వేర్, డేటాను రీస్టోర్ చేసేందుకు అయ్యే ఖర్చులకు సైబర్ బీమా కవరేజీ లభిస్తుంది. పాలసీదారు ఒకవేళ డేటా నష్టానికి థర్డ్ పార్టీ సర్వీస్ / సర్వీస్ ప్రొవైడర్‌పై దావా వేయదల్చుకుంటే అందుకయ్యే లీగల్ ఖర్చులకు కంపెనీ కవరేజీ ఇస్తుంది. వీటికి తోడు, బీమా పాలసీ కింద కౌన్సిలింగ్ సర్వీసులు, సైబర్ దోపిడీ నష్టాలు, కోర్టుకు వెళ్లేందుకయ్యే ఖర్చులు మొదలైనవి కూడా కవర్ అవుతాయి. ఇలా సైబర్ బీమాతో పలు ప్రయోజనాలు ఉన్నాయి. సైబర్ ప్లాన్ తీసుకోవడంతో పాటు మీ డిజిటల్ జీవితాన్ని భద్రంగా ఉంచుకునేందుకు మరిన్ని పటిష్టమైన చర్యలు తీసుకోవడం కూడా కీలకం. ముఖ్యమైన డేటాను బ్యాకప్ తీసుకోండి. సమర్ధమంతమైన యాంటీ–వైరస్ సాఫ్ట్వేర్, ఫైర్వాల్స్పై కొంత ఇన్వెస్ట్ చేయడం శ్రేయస్కరం. ఆన్లైన్లో వ్యాపార లావాదేవీలు నిర్వహించేటప్పుడు జాగ్రత్త వహించాలి. సైబర్ ఎక్స్టార్షన్ కవర్: ప్రైవసీ, డేటా ఉల్లంఘన లేదా సైబర్ దాడి ముప్పులకు దీని ద్వారా కవరేజీ పొందవచ్చు. ఐటీ కన్సల్టెంట్ సర్వీసులు: వాటిల్లిన నష్టాన్ని రుజువు చేసేందుకు ఐటీ కన్సల్టెంట్ సహాయం తీసుకుంటే దానికయ్యే వ్యయాలను కూడా బీమా కంపెనీ చెల్లిస్తుంది. సోషల్ మీడియా కవర్: బాధిత వ్యక్తికి చెందిన సోషల్ మీడియా ఖాతా నుంచి వారి ఐడెంటిటీని చోరీ చేస్తుంటారు. ఇలాంటి సైబర్ దాడులప్పుడు ప్రాసిక్యూషన్, డిఫెన్స్ ఖర్చులను పాలసీ భర్తీ చేస్తుంది. సైబర్ స్టాకింగ్ కవర్: మిమ్మల్ని వేధించడానికో లేదా భయపెట్టేందుకో డిజిటల్ మాధ్యమం ద్వారా ఎవరైనా పదే పదే వెంటబడుతూ ఉంటే, దాని వల్ల వాటిల్లే నష్టాల భర్తీకి ఈ కవరేజీ ఉపయుక్తంగా ఉంటుంది. -
గుడ్‌న్యూస్,తొలిసారి ట్విటర్లో...మస్క్ క్లారిటీ !
న్యూఢిల్లీ: బిలియనీర్, ట్విటర్ బాస్ ఎలాన్ మస్క్ మరో సంచలన ప్రకటన చేశారు. మైక్రో-బ్లాగింగ్ ట్విటర్లో ప్రపంచ కప్ కవరేజ్ ఇస్తున్నట్టు ప్రకటించారు. తొలి (ఫుట్ బాల్) మ్యాచ్‌పై ఫ్యాన్స్‌కు అదిరిపోయే వార్త అందించారు. ఆదివారం ప్రారంభం కానున్నప్రపంచకప్ ఫస్ట్ మ్యాచ్‌కు బెస్ట్ కవరేజ్, రియల్ టైం కమెంటరీ అందిస్తున్నట్టు మస్క్ ట్వీట్ చేశారు. (మునుగుతున్న ట్విటర్ 2.0? ఉద్యోగుల సంఖ్య తెలిస్తే షాకవుతారు!) ట్విటర్ టేకోవర్ తరవాత ప్రతిరోజూ ఏదో ఒక సంచలన, విచిత్రమైన ప్రకటనలతో వార్తల్లో ఉంటూ వస్తున్న మస్క్ తాజా ప్రకటన మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. తాజా ట్వీట్‌తో ట్విటర్ ఇక మూతపడనుందనే ఊహాగానాలకు చెక్ చెప్పారు. అయితే ధృవీకరణగా ఎలాంటి హ్యాష్‌ట్యాగ్‌లను ఉపయోగించనప్పటికీ, నవంబర్ 20న ఖతార్‌లో ఫిఫా ప్రపంచ కప్ షురూ కానుండంటంతో దీనిగురించే మస్క్ ట్వీట్ చేశారని అభిమానులు ధృవీకరించుకున్నారు. (ట్విటర్ ఉద్యోగి కీలక చర్య: ఎలాన్ మస్క్‌కు మరో షాక్!) మరోవైపు రానున్న ఫిఫా వరల్ట్ కప్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఫుట్‌బాల్ అభిమానులు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. జపాన్-దక్షిణ కొరియాలో సంయుక్త జరిగిన 2002లో 17వ టోర్నమెంట్ తర్వాత ఇది మధ్యప్రాచ్యంలో తొలి, ఆసియాలో రెండో ప్రపంచకప్ కావడంతో మరింత ఆసక్తి నెలకొంది.మొదటి మ్యాచ్‌లో ఆతిథ్య ఖతార్ ఈక్వెడార్‌తో తలపడనుంది. ఇప్పటికే ఆయా జట్లు ఖతార్ చేరుకున్నాయి. కాగా పోర్చుగల్ స్టార్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డోప్రాతినిధ్యం వహిస్తున్న ఇంగ్లండ్ ఫుట్‌బాల్ క్లబ్ మాంచెస్టర్ యునైటెడ్‌ను కొనుగోలు చేయనున్నట్టు ఈ ఏడాది ఆగస్టులో ట్విటర్ ద్వారా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ డీల్ పూర్తి చేసిందీ లేనిదీ క్లారిటీ లేదు. First World Cup match on Sunday! Watch on Twitter for best coverage & real-time commentary. — Elon Musk (@elonmusk) November 18, 2022 -
ధీమాగా బీమా ఇలా..!
ఆరోగ్య బీమా అవసరాన్ని గతంతో పోలిస్తే నేడు ఎక్కువ మంది గుర్తిస్తున్నారు. డిజిటల్ వేదికలు విస్తృతం కావడం, స్మార్ట్ఫోన్ల వినియోగం ఊపందుకోవడం హెల్త్ ఇన్సూరెన్స్‌పై అవగాహన పెరగడానికి సాయపడుతున్నాయి. కరోనా మహమ్మారి కూడా హెల్త్ ఇన్సూరెన్స్ అవసరాన్ని తెలిసేలా చేసింది. కానీ, ఇప్పటికీ హెల్త్ ఇన్సూరెన్స్ విషయంలో చాలా మందికి రకరకాల సందేహాలున్నాయి. బీమా పాలసీని తీసుకునేందుకు ఇవి అడ్డుపడొచ్చు. అలాగే, హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీ పనిచేసే విధానం, క్లెయిమ్‌కు సంబంధించి కూడా రకరకాల అపోహలు ఉన్నాయి. వీటిని తొలగించుకుంటే హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీ తీసుకునేందుకు ఎక్కువ మంది ముందుకు వస్తారు. ఇలాంటి కొన్ని అపోహలు, వాటికి సంబంధించి వాస్తవాలను నివాబూపా హెల్త్ ఇన్సూరెన్స్ అండర్ రైటింగ్ ప్రొడక్ట్స్, క్లెయిమ్స్ డైరెక్టర్ బబతోష్ మిశ్రా వెల్లడించారు. ఆస్పత్రిలో చేరి కనీసం 24 గంటల పాటు చికిత్స తీసుకుంటేనే బీమా క్లెయిమ్‌కు అర్హత లభిస్తుందన్నది అపోహే. కానీ వాస్తవం వేరు. ఆధునిక పరిశోధన ఆధారిత ఔషధాలు, అత్యాధునిక చికిత్సా విధానాలు అందుబాటులోకి రావడంతో చాలా చికిత్సలకు నేడు 24 గంటల పాటు ఆస్పత్రిలో ఉండాల్సిన అవసరం ఏర్పడడం లేదు. వీటిని డే కేర్ ట్రీట్మెంట్స్గా (రోజులో వచ్చి తీసుకుని వెళ్లే వీలున్నవి) చెబుతారు. కీమోథెరపీ, రేడియోథెరపీ, క్యాటరాక్ట్ ఆపరేషన్, కిడ్నీల్లో రాళ్లు తొలగించే సర్జరీ ఇలాంటివన్నీ డేకేర్ ట్రీట్మెంట్స్ కిందకు వస్తాయి. డేకేర్ ట్రీట్మెంట్స్లో చాలా వాటికి హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లలో కవరేజీ లభిస్తోంది. కేన్సర్‌కు సంబంధించి ఓరల్ కీమోథెరపీకి అన్ని రకాల ఇండెమ్నిటీ హెల్త్ ప్లాన్లలో కవరేజీ ఉంటోంది. క్లెయిమ్ మొత్తం వస్తుందనుకోవద్దు నియంత్రణ సంస్థ అనుమతి మేరకు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు వేటికి చెల్లింపులు చేయవో తెలియజేస్తూ ఒక జాబితా నిర్వహిస్తుంటాయి. పీపీఈ కిట్, మాస్క్, బ్యాండేజ్, నెబ్యులైజర్ తదితర ఇలా చెల్లింపులు చేయని వాటి జాబితాను బీమా సంస్థలు పాలసీ వర్డింగ్స్లో ప్రత్యేకంగా పేర్కొంటాయి. అందుకుని ఆస్పత్రిలో అయ్యే బిల్లు మొత్తాన్ని బీమా సంస్థలు చెల్లిస్తాయని అనుకోవద్దు. అయితే, వీటికి కూడా చెల్లింపులు చేసే రైడర్లను కొన్ని బీమా సంస్థలు ఆఫర్ చేస్తున్నాయి. రైడర్‌ను జోడించుకుని, కొంత అదనపు ప్రీమియం చెల్లించడం ద్వారా డిస్పోజబుల్స్‌కు సైతం క్లెయిమ్ తీసుకోవచ్చు. ఇక పాలసీల్లో మరికొన్ని ఇతర పరిమితులు కూడా ఉంటాయి. కోపేమెంట్, రూమ్‌రెంట్, డాక్టర్ కన్సల్టేషన్ చార్జీల పరంగా చెల్లింపుల పరిమితులు ఉంటాయి. అంటే వీటికి సంబంధించి బీమా సంస్థలు పాలసీ నియమ, నిబంధనల్లో పేర్కొన్న మేరకే చెల్లింపులు చేస్తుంటాయి. కనుక క్లెయిమ్ మొత్తం వస్తుందని అనుకోవద్దు. చెల్లింపుల్లో పరిమితులు ఉంటాయి. ఉదాహరణకు సింగిల్ రూమ్ అని పాలసీ డాక్యుమెంట్లో ఉంటే.. హాస్పిటల్లో సాధారణ సింగిల్ రూమ్‌లో చేరినప్పుడే చికిత్సకు అయ్యే వ్యయాలపై పూర్తి చెల్లింపులు పొందడానికి ఉంటుంది. డీలక్స్ రూమ్/సూట్లో చేరితే అది పరిమితికి మించినది అవుతుంది. దీంతో క్లెయిమ్‌లో కొంత మేర కోత పడుతుంది. దీన్నే రూమ్ రెంట్ క్యాప్ అని కూడా అంటారు. వీటిపై పాలసీదారులు ముందే తగిన అవగాహనతో ఉండాలి. అందుకని కచ్చితంగా పాలసీ డాక్యుమెంట్‌ను పూర్తిగా చదివి అర్థం చేసుకోవాలి. లేదంటే బీమా సంస్థ కస్టమర్ కేర్ లేదా ఏజెంట్‌ను సంప్రదించాలి. కూలింగ్ ఆఫ్ పీరియడ్ కూలింగ్ ఆఫ్ పీరియడ్ అన్నది పేషెంట్ కోలుకున్న తర్వాత నిర్ణీత కాలం పాటు అతనికి బీమా సంస్థ కొత్త పాలసీని ఆఫర్ చేయకపోవడం. కానీ, దీన్ని బీమా సంస్థలు కచ్చితంగా ఎత్తివేయాలని పాలసీదారులు భావిస్తుంటారు. అంతేకాదు, బీమా సంస్థలు ఆరోగ్యవంతులు, ఆస్పత్రి అవసరం ఏర్పడని వారికే పాలసీని ఆఫర్ చేస్తాయని అనుకుంటారు. కానీ, ఇది నిజం కాదు. కూలింగ్ ఆఫ్ పీరియడ్ వెనుక ఉన్న తార్కికత ఏమిటంటే.. ఒక ఆరోగ్య సమస్యకు చికిత్స తీసుకున్న తర్వాత ఏవైనా కొత్త సమస్యలు ఏర్పడతాయేమో అంచనా వేసేందుకు కావాల్సిన సమయంగా అర్థం చేసుకోవాలి. కరోనా చికిత్స లేదా సర్జరీ నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత పాలసీదారులు మరింత కవరేజీకి అర్హత సాధిస్తారు. వీటిని ముందస్తు నుంచి ఉన్న సమస్యలుగా బీమా సంస్థలు పరిగణించవు. అలాగే క్లెయిమ్ సమయంలో అస్పష్టతను కూడా తగ్గిస్తుంది. ఎక్కడైనా క్యాష్‌లెస్ బీమా క్లెయిమ్ ప్రక్రియను మరింత సులభతరం, పారదర్శకం, సౌకర్యంగా మార్చడంపై బీమా సంస్థలు దృష్టి సారిస్తున్నాయి. క్లెయిమ్‌ను క్యాష్‌లెస్ (పాలసీదారు చెల్లించాల్సిన అవసరం లేకుండా) లేదా రీయింబర్స్మెంట్ విధానంలో దాఖలు చేసుకోవచ్చు. కానీ, నగదు రహిత చికిత్స సేవలు పొందాలంటే మీరు చేరే హాస్పిటల్.. బీమా సంస్థ క్యాష్‌లెస్ హాస్పిటల్ నెట్‌వర్క్‌లో భాగమై ఉండాలి. ఇలా కాకుండా పాలసీదారు చికిత్స తీసుకుని అందుకు సంబంధించిన మొత్తం వారే చెల్లించి తర్వాత బీమా సంస్థ వద్ద క్లెయిమ్ దాఖలు చేసుకోవచ్చు. ఇందుకోసం అన్ని రకాల పత్రాలను సమర్పించాలి. అప్పుడే బీమా సంస్థ క్లెయిమ్‌ను ప్రాసెస్ చేయగలదు. క్యాష్‌లెస్ అన్నది సౌకర్యమైనది. దీనివల్ల ఆస్పత్రిలో చేరాల్సి వస్తే చికిత్సకు అయ్యే వ్యయాలను పాలసీదారు సొంతంగా సమకూర్చుకునే ఇబ్బంది తప్పుతుంది. పైగా డిశ్చార్జ్ ప్రక్రియ క్యాష్‌లెస్ విధానంలో సులభంగా పూర్తవుతుంది. బీమా వ్యాపారం అన్నది ప్రజల నిధులతో కూడుకున్నదని అర్థం చేసుకోవాలి. ప్రజల డిపాజిట్లకు సంరక్షకుడిగా బీమా సంస్థ అన్ని రకాల నిజమైన క్లెయిమ్‌లను గౌరవించాల్సి ఉంటుంది. బీమా సంస్థలు పాలసీ డాక్యుమెంట్‌ను అర్థం చేసుకునేందుకు వీలుగా సులభ పరిభాషతో రూపొందిస్తున్నాయి. ప్రతి ఒక్కరూ కొనుగోలుకు ముందు శ్రద్ధగా వీటిని చదవడం వల్ల.. క్లెయిమ్‌ల సమయంలో అనవసర తలనొప్పులను రాకుండా ముందే జాగ్రత్త పడొచ్చు. అధిక కవరేజీ కోసం హెల్త్ చెకప్ పాలసీ జారీ చేసే ముందు అన్ని బీమా సంస్థలూ వైద్య పరీక్షలు చేయించుకోవాలని కోరడం లేదు. పెద్ద వయసులో ఉన్నారని లేదా అధిక కవరేజీ కోరుతున్నారని వైద్య పరీక్షలు కచ్చితంగా చేయించుకోవాలనేమీ లేదు. ఉదాహరణకు ప్రముఖ హెల్త్ ప్లాన్లు అన్నింటికీ ముందస్తు వైద్య పరీక్షలు అవసరం లేదు. కొన్ని ప్రత్యేక కేసుల్లోనే నిర్ధేశిత వైద్య పరీక్షలను బీమా సంస్థలు కోరుతుంటాయి. దరఖాస్తుదారులకు ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే లేదా గతంలో ఏవైనా ఎదుర్కోని ఉంటే ప్రస్తుత ఆరోగ్య స్థితిని తెలుసుకునేందుకు వైద్య పరీక్షలు చేయించుకోవాలని కోరతాయి. ఇందుకు అయ్యే వ్యయాలను బీమా సంస్థలు పూర్తిగా భరిస్తుంటాయి. -
పది కోట్ల ప్రమాద బీమా! నివాబూపా కొత్త పాలసీ
న్యూఢిల్లీ: నివాబూపా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ (మ్యాక్స్‌బూపా హెల్త్ ఇన్సూరెన్స్) స్టాండలోన్ వ్యక్తిగత ప్రమాదబీమా పాలసీని విడుదల చేసింది. ప్రమాదం కారణంగా మరణం, పాక్షిక, తాత్కాలిక వైకల్యం, శాశ్వత వైకల్యం వంటి వాటివల్ల కుటుంబానికి రక్షణను ఈ ప్లాన్‌లో పొందొచ్చు. ప్రమాదాల విషయంలో ఎటువంటి ఆందోళన చెందకుండా జీవితాన్ని ప్రశాంతంగా సాగించాలనే ఉద్దేశ్యంతో ఈ ప్లాన్‌ను రూపొందించినట్టు కంపెనీ ప్రకటించింది. రూ. 10 కోట్లు వార్షిక ఆదాయానికి గరిష్టంగా 25 రెట్ల వరకు (రూ.10కోట్లు) ఈ ప్లాన్‌లో కవరేజీని పొందొచ్చు. ప్రమాదం వల్ల అంగవైకల్యానికి గురి అయితే పాలసీ నిబంధనలకు అనుగుణంగా బీమా కవరేజీలో 2 శాతానికి ప్రతీ వారం చొప్పున (గరిష్టంగా ఒక వారానికి రూ.లక్ష) కంపెనీ చెల్లిస్తుంది. ఇలాంటి ఎన్నో రకాల ఆప్షన్లతో ఈ ప్లాన్ అందుబాటులో ఉంది. పాలసీదారు ప్రమాదంలో మరణిస్తే.. చైల్డ్ సపోర్ట్ బెనిఫిట్ ఆప్షన్ కింద పిల్లల విద్య కోసం రూ.5లక్షల వరకు కంపెనీ చెల్లిస్తుంది. రుణానికి భద్రత కల్పించే ప్రయోజనం కూడా ఇందులో ఉంది. చదవండి : ఫిట్‌గా ఉన్న ఉద్యోగులకు బంపర్ఆఫర్ ప్రకటించిన జెరోదా..! -
అందరి కోసం.. ఆరోగ్య సంజీవని!
ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవడం అన్నది ఎన్నో జాగ్రత్తలు, పరిశీలనలతో.. కాస్తంత శ్రమతో కూడుకున్నది. పాలసీలో కవరేజీ వేటికి లభిస్తుంది, వేటికి మినహాయింపులు, షరతులు, నియమ నిబంధనలు.. చూడాల్సిన జాబితా పెద్దదే. పైగా అందరికీ ఇవి అర్థమవుతాయని చెప్పలేము. దీంతో బీమా కంపెనీల వందలాది పాలసీల్లో ఏది మెరుగైనది అని తేల్చుకోవడం అంత ఈజీ కాదు. బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ) ఈ విషయాన్ని అర్థం చేసుకుని.. అన్ని రకాల సాధారణ కవరేజీ సదుపాయాలతో ఒకే ప్రామాణిక పాలసీని ‘ఆరోగ్య సంజీవని’ పేరుతో 2020 ఏప్రిల్ నాటికి తీసుకురావాలని బీమా సంస్థలను ఆదేశించింది. దీంతో అన్ని సాధారణ, ఆరోగ్య బీమా సంస్థలు ఆరోగ్య సంజీవని పాలసీని అందుబాటులోకి తీసుకొచ్చాయి. వైద్య సేవల ఖర్చులు ఏటేటా పెరిగిపోతున్న తరుణంలో ప్రతి ఒక్కరికీ ఆరోగ్య బీమా కవరేజీ అవసరం ఎంతో ఉంది. ‘ఆరోగ్య సంజీవని’ అందరికీ అనుకూలమేనా..? గరిష్టంగా రూ. 5 లక్షల వరకు హెల్త్ కవరేజీని ఆరోగ్య సంజీవని పాలసీ కింద అందించాలన్నది తొలుత ఐఆర్డీఏఐ నిర్దేశించిన షరతు. రూ.5లక్షలకు మించి కూడా ఆఫర్ చేయవచ్చంటూ ఐఆర్డీఏఐ ఇటీవలే సవరణలు తెచ్చింది. ఈ ప్లాన్‌లో క్లెయిమ్ చేసుకోని ప్రతీ సంవత్సరానికి గాను సమ్ ఇన్సూర్డ్ (బీమా రక్షణ) 5 శాతం పెరుగుతూ వెళుతుంది. గరిష్టంగా 50 శాతం వరకు ఇలా బీమా రక్షణ కవరేజీ పెరిగేందుకు అవకాశం ఉంది. మోస్తరు ప్రీమియానికే విస్తృతమైన కవరేజీనిచ్చే ఈ ప్లాన్‌ను మొదటిసారి తీసుకునే వారు ఎంచుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ‘‘పరిమిత బడ్జెట్ ఉన్న వారికి ఇది మంచి ఎంపికే అవుతుంది. హెల్త్ ఇన్సూరెన్స్ అవసరం పట్ల అవగాహన పెరుగుతున్నా కానీ, తీసుకుంటున్న వారి సంఖ్య మన దేశంలో ఇప్పటికీ చాలా తక్కువగానే ఉంటోంది. అర్థం చేసుకునేందుకు సంక్లిష్టతలు, ప్రీమియం భరించలేనంత ఉండడం సగటు గృహస్తుడు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కొనుగోలు చేయకుండా అడ్డుపడుతోంది. కానీ, ఆరోగ్య సంజీవని పాలసీ సులభంగా, సమంజసమైన ప్రీమియంతో ఉండడం అనుకూలత’’ అని ఫిన్‌ఫిక్స్ రీసెర్చ్ అండ్ అనలైటిక్స్ మేనేజింగ్ పార్ట్నర్ ప్రబ్లీన్ బాజ్‌పాయ్ పేర్కొన్నారు. ఆర్జన ఆరంభమై, తనపై ఆధారపడిన వారు లేకుంటే (అవివాహితులు) ఈ ప్లాన్‌ను తప్పకుండా పరిశీలించొచ్చని ఆయన సూచించారు. ‘‘ఆరోగ్య సంజీవని పాలసీ సమగ్ర కవరేజీ కోరుకునే యువతీయువకులకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఇతర పాలసీల కంటే ప్రీమియం తక్కువగా ఉండడంతోపాటు రోజువారీ చికిత్సలు సహా కవరేజీ విస్తృతంగా ఉంటుంది’’ అని ఫిన్‌సేఫ్ వ్యవస్థాపక డైరెక్టర్ మృణ్ అగర్వాల్ తెలిపారు. ‘‘ఆరోగ్య సంజీవని పాలసీ అన్నది సులభమైన ప్రాథమిక పాలసీ. పైగా చౌక అయినది. కాకపోతే ఇందులో 5 శాతం కోపేమెంట్ (ఆస్పత్రి బిల్లులో 5 శాతాన్ని పాలసీదారు భరించడం) షరతు ఉండగా, పూర్తి స్థాయి ఆరోగ్య బీమా ప్లాన్లలో ఇది ఉండదు’’ అని పాలసీఎక్స్ డాట్‌కామ్ సీఈవో నావల్ గోయల్ తెలిపారు. వీటిని చూసి తీసుకుంటే మంచిది.. అనుకూలమేనా..? రూ.5 లక్షల గరిష్ట కవరేజీకే ప్రస్తుతం అవకాశం ఉంది. కాకపోతే అంతకుమించి ఆఫర్ చేయవచ్చని ఐఆర్డీఏఐ తాజాగా అనుమతించడం సానుకూలం. పెరిగిపోతున్న ఆరోగ్య సంరక్షణ ఖర్చుల దృష్ట్యా రూ.5 లక్షల కవరేజీ అందరికీ, అన్ని వయసుల వారికీ, ముఖ్యంగా పెద్ద పట్టణాల్లో నివసించే వారికి సరిపోకపోవచ్చు. కనుక రూ.5 లక్షలకు మించి కవరేజీ పెంచుకునే అవకాశం ఉంటే ఈ పాలసీని పరిశీలించొచ్చు. పెంచుకునేందుకు అవకాశం లేకపోతే మధ్య వయసు నుంచి వృద్ధాప్యంలో ఉన్న వారికి ఈ పా లసీ అంత అనుకూలం కాదనే చెప్పుకోవాలి. ‘‘అధిక ప్రీమియం చెల్లించే సామర్థ్యం ఉండి, మెట్రోల్లో నివసిస్తున్న వారు అయితే ఆరోగ్య సంజీవని పాలసీ కాకుండా సమగ్ర కవరేజీనిచ్చే ఇతర ప్లాన్లను పరిశీలించొచ్చు’’ అని బాజ్‌పాయ్ సూచిం చారు. ‘‘తనపై పిల్లలు, తల్లిదండ్రులు ఆధారపడి ఉంటే అధిక కవరేజీ అవసరమవుతుంది. సరిపడా కవరేజీనిచ్చే ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీని ఎంచుకోవాలి’’ అని మృణ్ అగర్వాల్ సూచించారు. ఒకవేళ ఇప్పటికే సమగ్ర కవరేజీతో కూడిన ఆరోగ్య బీమా ప్లాన్ కలిగిన వారు ఆరోగ్య సంజీవనిని పరిశీలించాల్సిన అవసరం లేదు. ప్రీమియంలో వ్యత్యాసం..: ‘‘ఎన్ని క్లెయిమ్‌లు రావచ్చన్న అంచనా రేషియోల ఆధారంగా బీమా సంస్థలు ప్రీమియం నిర్ణయిస్తుంటాయి. ప్రతీ బీమా సంస్థకు యాక్చుయేరియల్ బృందం ఉంటుంది. వారి అంచనాలు వేర్వేరుగా ఉండడం వల్లే ప్రీమియం రేట్లలో వ్యత్యాసం ఉంటుంది. అలాగే, అన్ని బీమా సంస్థ సేవల నాణ్యత ఒకే విధంగా ఉండదు. ప్రీమియంలో వ్యత్యాసానికి ఇది కూడా ఒక కారణం’’అని నావల్ గోయల్ వివరించారు. ఇన్కర్డ్ క్లెయిమ్ రేషియో ఒక బీమా కంపెనీ ఒక ఏడాదిలో పాలసీల ప్రీమియం రూపేణా ఆర్జించిన ప్రతీ రూ.100 నుంచి ఎంత మొత్తాన్ని క్లెయిమ్‌లకు చెల్లింపులు చేసిందో తెలియజేస్తుంది. ఇన్కర్డ్ క్లెయిమ్ రేషియో ఎక్కువగా ఉంటే అది పాలసీదారులకు ప్రయోజనం. కానీ, ఇది నూరు శాతం మించితే అది బీమా కంపెనీకి నష్టం. ఎందుకంటే ప్రీమియం ఆదాయానికి మించి క్లెయిమ్‌లు వస్తే బీమా సంస్థ నష్టపోవాల్సి వస్తుంది. దాంతో ప్రీమియంలు భారీగా పెంచేయాల్సి వస్తుంది. లేదంటే క్లెయిమ్‌లకు కొర్రీలు వేయాల్సి వస్తుంది. ఈ రేషియో 60 శాతానికి తక్కువ కాకుండా ఉన్న కంపెనీని ఎంచుకోవాలి. క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో తనకు వచ్చిన మొత్తం క్లెయిమ్ దరఖాస్తులలో ఎన్నింటికి కంపెనీ చెల్లింపులు చేసిందో దీన్ని చూసి తెలుసుకోవచ్చు. ఈ రేషియో 90 శాతానికి పైన ఎంత ఎక్కువగా ఉంటే అంత మంచిది. వేగం, సేవలు క్లెయిమ్‌లను వేగంగా పరిష్కరించే సంస్థ నుంచి పాలసీ తీసుకోవడం సౌకర్యాన్నిస్తుంది. అలాగే, కస్టమర్ సేవలు మెరుగ్గా ఉండే కంపెనీని ఎంచుకోవాలి. నెట్వర్క్ ఆస్పత్రులు బీమా కంపెనీ నెట్వర్క్ ఆస్పత్రుల జాబితాలో మీరు నివసించే ప్రాంతాలకు సమీపంలోని ఆస్పత్రులు ఉన్నాయేమో చూసుకోవాలి. దీనివల్ల నగదు రహిత సేవలను ఆయా ఆస్పత్రుల్లో పొందొచ్చు. ప్రీ, పోస్ట్ హాస్పిటలైజేషన్ అనారోగ్యానికి సంబంధించి ఆస్పత్రి లో చేరడానికి ముందు వ్యాధి నిర్ధారణ తదితర ఖర్చులు ఎదురవుతాయి. ఆస్పత్రిలో చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా కొంత కాలం పాటు ఖర్చులు ఎదురవుతాయి. కనుక ప్రీ, పోస్ట్ హాస్పిటలైజేషన్ కింద ఎక్కువ రోజులకు కవరేజీనిచ్చే పాలసీని ఎంపిక చేసుకోవాలి. రూమ్ రెంట్ ఆస్పత్రిలో చేరిన తర్వాత ఐసీయూ నుంచి వార్డుకు లేదా షేరింగ్ రూమ్‌కు లేదా ప్రైవేటు రూమ్‌కు షిఫ్ట్ చేస్తుంటారు. ఏ రూమ్ అయినా సరే అన్న నిబంధన ఉండే పాలసీని ఎంచుకోవాలి. అలా కాకుండా పాలసీలో రూమ్ రెంట్ పరిమితి ఉంటే.. అంతకుమించిన చార్జీలతో కూడిన రూమ్ తీసుకుంటే.. ఆయా ఖరీదైన స్టేయింగ్ వద్ద చేసే వైద్య ఖర్చులు కూడా అధికంగానే ఉంటాయి. ఇటువంటి సందర్భాల్లో బీమా కంపెనీ పూర్తి స్థాయి చార్జీలను చెల్లించదు. సబ్ లిమిట్స్ కొన్ని రోజువారీ చికిత్సలు, కొన్ని రకాల వ్యాధులకు సంబంధిం చి ఇంతే పరిహారం చెల్లిస్తామనే నిబంధనలు ఉంటాయి. వాటి ని కూడా పరిశీలించి సమ్మతం అనుకుంటేనే ముందుకు వెళ్లాలి. రీస్టోరేషన్ సదుపాయం ఉదాహరణకు రూ.5 లక్షలకు ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ తీసుకున్నారనుకోండి. ఒక ఏడాదిలో ఎవరైనా ఆస్పత్రి పాలై బిల్లు రూ.5 లక్షలకు మించితే అప్పుడు మరో రూ.5 లక్షలు ఆటోమేటిక్‌గా కవర్‌ను బీమా సంస్థ విడుదల చేస్తుంది. ఇదే రీస్టోరేషన్ బెనిఫిట్. ఒకరికి మించి కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేరాల్సి వచ్చి బిల్లు సమ్ ఇన్సూర్డ్ మొత్తం దాటిపోయిన సందర్భాల్లోనూ ఇది ఆదుకుంటుంది. అయితే ఈ రీస్టోరేషన్ బెనిఫిట్‌ను ఒక ఏడాదిలో అప్పటికే చికిత్స పొందిన సమస్య కోసం చాలా బీమా సంస్థలు అందించడం లేదు. అంటే పాలసీదారు వేరొక సమస్య కోసం రీస్టోరేషన్‌ను పొందొచ్చు. ఏ సమ స్య అయిన రీస్టోరేషన్‌ను అనుమతించే పాలసీ మంచి ఎంపిక. కోపే ఆప్షన్ ఆస్పత్రి బిల్లులో పాలసీదారు ఎంత పెట్టుకోవాలన్నది ఇందులో ఉంటుంది. కొన్ని పాలసీల్లో కోపే షరతు ఉంటోంది. ఇలా ఉన్న పాలసీల ప్రీమియం కొంత తక్కువగా ఉంటుంది. సూపర్ టాపప్..: హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీని పెంచుకునేందుకు సూపర్ టాపప్ లేదా టాపప్ పేరుతో ఉండే ప్లాన్‌ను కొనుగోలు చేసుకోవచ్చని నిపుణుల సూచన. బేసిక్ హెల్త్ కవరేజీకి యాడాన్‌గా (జోడింపుగా) ఈ ప్లాన్ తక్కువ ప్రీమియానికే లభిస్తుంది. -
85 ఏళ్ల వరకు కవరేజీ
హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీదారుల అవసరాలను గుర్తిస్తూ ప్రజాదరణ పొందిన ‘క్లిక్2 ప్రొటెక్ట్ 3డీ ప్లస్’ ప్లాన్‌లో బీమా కవరేజీ గరిష్ట వయసును పెంచింది. ఇప్పటి వరకు గరిష్టంగా 75 ఏళ్లు వచ్చే వరకే బీమా కవరేజీ పొందే ఆప్షన్ ఇందులో ఉండగా, దీన్ని 85 సంవత్సరాలు చేసింది. తమ నిరంతర ఉత్పత్తుల పరిశోధనలో భాగంగా... మెరుగైన వైద్య సదుపాయాలు, నాణ్యమైన జీవనంతో పెరుగుతున్న ఆయుర్దాయం నేపథ్యంలో గరిష్ట వయసు వరకు (రిటైర్మెంట్ తర్వాత కూడా) పాలసీదారులకు బీమా అవసరాన్ని గుర్తించినట్టు సంస్థ ప్రకటించింది. దీనికితోడు యువతలో టర్మ్ ప్లాన్లపై అవగాహన పెరుగుతున్న దృష్ట్యా క్లిక్2 ప్రొటెక్ట్ 3డీ ప్లస్ పాలసీలో గరిష్ట కాలాన్ని 85 ఏళ్ల వరకు పెంచామని, 85లో తమ వయసును తీసివేయగా మిగిలిన కాలానికి కవరేజీ పొందొచ్చని కంపెనీ తెలిపింది. లైఫ్ ఆప్షన్, ఎక్స్ట్రా లైఫ్ ఆప్షన్, 3డీ లైఫ్ ఆప్షన్ అలాగే, మెచ్యూరిటీ తర్వాత ప్రీమియం తిరిగి చెల్లించే ఆప్షన్లకు ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది. -
ఈ ప్రోత్సహకాలు లాభాన్నిచ్చేవే..!
కొన్ని ఆప్షన్లు కంపెనీలకే కాదు... వినియోగదారులకూ మేలు చేస్తాయి. ఉదాహరణకు జీవిత బీమా పాలసీ అనేది, పెరిగే బాధ్యతలకు అనుగుణంగా కవరేజీ దానంతట అదే పెరుగుతూ వెళితే ఎంత సౌకర్యంగా ఉంటుందో ఆలోచించండి. అలాగే, సెక్షన్ 80సీ కింద పన్ను రాయితీలు కూడా. సంబంధిత సాధనాల్లో ఇన్వెస్ట్ చేసే వారి ఆర్థిక జీవితం మెరుగ్గా ఉంటుంది. అదే సమయంలో వారి పెట్టుబడులపై కంపెనీలకు రాబడులు వస్తాయి. ఇటు వ్యక్తిగతంగా లాభాలను చేకూర్చుతూనే మరోవైపు ఆర్థికవ్యవస్థకూ ప్రయోజనం చేసే పథకాల గురించిన చర్చే ఈ వారం ప్రాఫిట్ ప్లస్ కథనం... మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసే వారిలో చాలా మంది తమ పెరుగుతున్న ఆదాయానికి తగినట్టు పెట్టుబడులను పెంచుకోరు. ఇటువంటి వారిని దృష్టిలో ఉంచుకుని మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు (ఏఎంసీలు) స్టెప్ అప్ లేదా టాపప్ సిప్‌లను ఆఫర్ చేస్తున్నాయి. అంటే ప్రతి నెలా చేస్తున్న సిప్ మొత్తం, నిర్ణీత కాలానికి ఓ సారి (వార్షికంగా లేదా మీరు నిర్ణయించిన దాని ప్రకారం) నిర్ణీత శాతం పెరుగుతూ ఉంటుంది. దీంతో, ఇన్వెస్టర్లు స్వయంగా సిప్‌ను పెంచుకోవాల్సిన అవసరం ఉండదు. ఒక్క టాపప్ సిప్ ఆప్షన్ ఎంచుకుంటే చాలు, మ్యూచువల్ ఫండ్స్ సంస్థే ఆ పని చేసేస్తుంది. ఇక బ్యాంకు సేవింగ్స్ ఖాతాల్లో రాబడులు తక్కువేనన్న విషయం తెలిసిందే. సేవింగ్స్ ఖాతాలో మిగులు నిధులను, లిక్విడ్ ఫండ్స్‌లోకి సులభంగా బదలాయించుకోవడం ద్వారా అధిక రాబడులు పొందే అవకాశాన్ని మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు కల్పిస్తున్నాయి. ఫలితంగా లిక్విడ్ ఫండ్స్‌లోకి నిధుల రాక పెరిగింది. ఉదాహరణకు ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఏఎంసీ సంస్థ ‘యాక్టివ్ అకౌంట్ యాప్’ను ఆఫర్ చేస్తోంది. ఈ యాప్‌ను ఇన్స్టాల్ చేసుకుని, తమ వివరాలను ఇవ్వడం ద్వారా అకౌంట్‌ను క్రియేట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఒక్క సింగిల్ క్లిక్‌తోనే ఈ యాప్ సాయంతో బ్యాంకు సేవింగ్స్ ఖాతా బ్యాలెన్స్‌ను లిక్విడ్ ఫండ్‌లోకి పంపుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో ఇన్వెస్ట్ చేయాలని చాలా మంది అనుకుంటుంటారు. కానీ, పెట్టుబడుల కేటాయింపు విషయంలో వారికి సమస్య ఎదురవుతుంది. ఈక్విటీల్లో ఎంత ఇన్వెస్ట్ చేయాలి, డెట్‌లో ఎంత ఇన్వెస్ట్ చేయాలన్నది వారి సందేహం. ఇన్వెస్టర్ల తరఫున ఈ బాధ్యతను తీసుకుని ఇన్వెస్ట్ చేసేవే బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్. ‘‘ఈక్విటీల విలువ (వ్యాల్యూషన్స్) పెరిగింద నుకోండి, ఆ సమయంలో ఈక్విటీల్లో పెట్టుబడులను తగ్గించి, డెట్ విభాగంలో పెట్టుబడులు పెంచడం ఈ పథకాల్లో జరుగుతుంది. అలాగే, ఈక్విటీ మార్కెట్లు బాగా దిద్దుబాటుకు గురై, స్టాక్స్ ఆకర్షణీయంగా ఉన్నాయనుకోండి, అప్పుడు డెట్ విభాగంలో పెట్టుబడులు తగ్గించి, ఈక్విటీల్లో పెంచడం జరుగుతుంది. దీంతో ఈక్విటీ మార్కెట్లు అస్థిరతంగా మారినా, డెట్ విభాగంలోని పెట్టుబడుల వల్ల ఆ ప్రభావం తగ్గించడం జరుగుతుంది’’ అని ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీ సీఐవో, ఈడీ ఎస్.నరేష్ తెలిపారు. స్వీప్ అకౌంట్లు ఇప్పుడు చాలా బ్యాంకులు స్వీప్ అకౌంట్లను ఆఫర్ చేస్తున్నాయి. ఈ ఖాతాల్లో కనీస బ్యాలెన్స్ రూ.10,000–25,000 మధ్య ఉంటుంది. ఇది బ్యాంకులను బట్టి వేర్వేరుగా ఉండొ చ్చు. నిర్ణీత బ్యాలెన్స్‌కు మించి అదనంగా ఉన్న బ్యాలెన్స్‌ను ఫిక్స్డ్ డిపాజిట్‌గా బ్యాంకు మారుస్తుంది. ఇదంతా ఆటోమేటిగ్గా జరిగిపోతుంటుంది. సేవింగ్స్ ఖాతాల్లో బ్యాలెన్స్‌పై వార్షికంగా 3.5 శాతం వడ్డీనే గిడుతుందని తెలిసిందే. అదే ఫిక్స్డ్ డిపాజిట్‌గా మార్చడం వల్ల అధిక వడ్డీ రేటు పొందే అవకాశం లభిస్తుంది. కస్టమర్ బ్యాంకుకు వెళ్లి తన సేవింగ్స్ బ్యాంకు ఖాతాను స్వీప్ అకౌంట్‌గా మార్చుకుంటే సరిపోతుంది. బీమా డిజైనర్ పాలసీలు వ్యక్తి వయసును బట్టి వివిధ దశల్లో బీమా కవరేజీ అవసరాలు మారిపోతుంటాయి. యువతీ, యువకులు వివాహ జీవితంలోకి అడుగుపెట్టిన తర్వాత బాధ్యతలు అధికమవుతాయి. అలాగే, వారికి పిల్లలు జన్మించిన తర్వాత బాధ్యతలు ఇంకాస్త పెరుగుతాయి. అందుకనే బీమా సంస్థలు వీటిని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా డిజైన్ చేసిన పాలసీలను ఆఫర్ చేస్తున్నాయి. టర్మ్ ప్లాన్ లలో సమ్ అష్యూరెన్స్ నిర్ణీత కాలానికి (ఐదేళ్లు) ఒకసారి ఆటోమేటిగ్గా పెరిగిపోతుంది. సాధారణ టర్మ్ ప్లాన్ తీసుకుని, తమ అవసరాలకు అనుగుణంగా మళ్లీ అదనపు టర్మ్ ప్లాన్ తీసుకోవడం, అందుకోసం వైద్య పరీక్షలు తరహా ఫార్మాలిటీస్‌ను పూర్తి చేయడం కంటే బీమా మొత్తాన్ని పెంచుకునేందుకు ఈ తరహా పాలసీలు అనుకూలంగా ఉంటాయి. విడిగా టర్మ్ ప్లాన్ తీసుకోవడంతో పోలిస్తే, ఇలా ఉన్న ప్లాన్స్లోనే ఆటోమేటిగ్గా కవరేజీ పెరగడం వల్ల చెల్లించాల్సిన ప్రీమియం తక్కువగా ఉండడం మరో సానుకూలత. పన్ను రాయితీలు.. ఇక కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఆదాయపన్ను రాయితీలు కూడా... వ్యక్తులు తమ ఆర్థిక క్రమశిక్షణ మెరుగుపరిచేందుకు ఇస్తున్న ప్రోత్సాహకాలుగానే చూడాల్సి ఉంటుంది. రాయితీల కోసమైనా వ్యక్తులు జీవిత బీమా, రిటైర్మెంట్ ప్లాన్లు, ఇతర పెట్టుబడి సాధనాల వంటి వాటిపైపు దృష్టి సారిస్తారని అంచనా. ఆర్థిక సంవత్సరం చివర్లో సెక్షన్ 80సీ కింద పన్ను ప్రయోజనాలకు అర్హమైన పథకాల్లో పెట్టుబడులు పెట్టేందుకు వేతన జీవులు పరుగులు పెట్టడం ఇదే తెలియజేస్తుంది. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల ఈటీఎఫ్ (సీపీఎస్ఈ ఈటీఎఫ్)లో పెట్టుబడులకూ ఇకపై సెక్షన్ 80సీ కింద పన్ను ప్రయోజనాన్ని కల్పిస్తున్నట్టు తాజా బడ్జెట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించడం మరొకటి. ఇక విశ్రాంత జీవన అవసరాలను ముందుగానే గుర్తించి, రిటైర్మెంట్ పథకమైన ఎన్‌పీఎస్‌లో ఇన్వెస్ట్ చేయించేందుకు ఎన్‌పీఎస్‌లో పెట్టుబడులకూ కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇస్తోంది. సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షల ఆదాయ రాయితీకి అదనంగా ఎన్‌పీఎస్‌లో రూ.50వేల పెట్టుబడికి సెక్షన్ 80సీసీడీ 1బీ కింద పూర్తి పన్ను ప్రోత్సాహకాలు ఉన్నాయి. తాజా బడ్జెట్లోనూ ఎన్పీఎస్ పథకానికి సంబంధించి రాయితీలను కల్పించారు. లైఫ్‌సైకిల్ ఫండ్ ఇక ఎన్పీఎస్ పథకంలోని లైఫ్‌సైకిల్ ఫండ్ కూడా ప్రోత్సాహకమే. ఎన్‌పీఎస్‌లో చాలా మంది రిటైల్ ఇన్వెస్టర్లకు ఈక్విటీలు, కార్పొరేట్, ప్రభుత్వ బాండ్లు, ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్లో ఏ విభాగంలో ఎంత ఇన్వెస్ట్ చేయాలనే విషయాన్ని క్లిష్టంగా చూస్తున్నారు. అదే లైఫ్ సైకిల్ ఫండ్ ఎంచుకుంటే, ఇన్వెస్టర్ వయసు ఆధారంగా ఆయా విభాగాలకు కేటాయింపులు జరుగుతుంటాయి. వయసు పెరుగుతూ, రిటైర్మెంట్ సమీపిస్తుంటే, ఈక్విటీలకు వాటా తగ్గుతూ డెట్ విభాగాలకు పెరగడం ఇందులో చూడొచ్చు. ఇక ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో అందుబాటు ధరల గృహాలకు (రూ.45 లక్షల వరకు) మరో ప్రోత్సాహకంగా, ఇంటి రుణంపై చెల్లించే వడ్డీ రాయితీని మరో రూ.1.5 లక్షలు పెంచారు. అంటే ఒక ఆర్థిక సంవత్సరంలో ఇంటి రుణంపై చెల్లించే వడ్డీ రూ.3.5 లక్షల వరకు ఆదాయపన్ను రాయితీ పొందొచ్చు. ఇది మొదటిసారి ఇంటి కొనుగోలుదారులకు ప్రోత్సాహకంగానే పనిచేస్తుందన్నారు దీపేష్ రాఘవ్. ప్రోత్సాహకాలతో జాగ్రత్త ► ఇన్స్టంట్ పర్సనల్ లోన్స్ ఆన్లైన్ లోనే, కొన్ని క్లిక్‌లతోనే పొందొచ్చనే ఆఫర్లను ప్రోత్సాహకాలుగా చూడొద్దు. ఇవి అధిక రుణ భారం పెంచే ప్రమాదం ఉంది. ► ప్రతీ నెలా మీ చేతికి అందే వేతనంలో ఇంటి రుణ ఈఎంఐ 50 శాతం మించకుండా చూసుకోవాలి. ► వినియోగ వస్తువులకు రుణాలను తీసుకోరాదన్న సూత్రానికి కట్టుబడి ఉండాలి. కేవలం ఇల్లు వంటి విలువైన ఆస్తి సమకూర్చుకునేందుకు రుణం తీసుకోవడం సమంజసం అవుతుంది. ► ఆకట్టుకునే బెనిఫిట్స్‌ను చూపించి సంప్రదాయ ఎండోమెంట్ బీమా పాలసీలను అంటగట్టే ప్రయత్నాన్ని బీమా సంస్థలు, ఏజెంట్లు చేస్తుంటారు. వీటిల్లో రాబడుల తక్కువగా ఉంటాయన్న విషయాన్ని గమనించాలి. ప్రత్యేకించి ఆయా సందర్భాల్లో రాబడులపై దృష్టి పెట్టాలి. ► మాల్స్‌కు వెళ్లినప్పుడు వారి మాయల్లో పడి ఏవి పడితే అవి కొనుగోలు చేయకుండా ఉండేందుకు గాను క్రెడిట్, డెబిట్ కార్డుల వంటి ప్లాస్టిక్ మనీని తీసుకెళ్లొద్దు. కావల్సినంత నగదునే వెంట తీసుకెళ్లడం మంచిది. -
డెంగ్యూకీ ఉందో పాలసీ
డెంగ్యూ వ్యాధి నిర్ధారణ, చికిత్స చాలా ఖర్చుతో కూడుకున్నవే. అనేక దఫాలుగా రక్త పరీక్షలు, ఔషధాలు, ఇంజెక్షన్లు... ఈ ట్రీట్మెంట్ అంతా ఖరీదైనదే. అందుకే బీమా సంస్థలు ప్రత్యేకంగా డెంగ్యూ కవరేజీ కోసం హెల్త్ పాలసీలను ప్రవేశపెట్టాయి. ఇన్–పేషంట్ హాస్పిటలైజేషన్‌తో పాటు ప్రీ– హాస్పిటలైజేషన్, పోస్ట్ హాస్పిటలైజేషన్ దాకా ఇవి కవరేజీని అందిస్తున్నాయి. పేద, గొప్ప తారతమ్యం లేకుండా ఎవరికైనా డెంగ్యూ సోకే ప్రమాదముంది కనక.. ఈ వర్షాకాలంలో డెంగ్యూ నుంచి కుటుంబానికి రక్షణ కల్పించేందుకు సమగ్రమైన కవరేజీని అందించే పాలసీని ఎంచుకోవడం శ్రేయస్కరం. సాధారణంగా ఆరోగ్య బీమా పాలసీని కొనేటపుడు చాలా అంశాలు చూసుకోవాలి. మొత్తం కుటుంబానికి కవరేజీ ఉంటుందా లేదా, సమ్ అష్యూర్డ్.. ప్రీమియం ఎంత? అప్పటికే ఉన్న వ్యాధులకు కవరేజీ ఇచ్చేందుకు వెయిటింగ్ పీరియడ్ ఎంత? నెట్వర్క్ ఆస్పత్రుల వివరాలు, క్యాష్‌లెస్ సదుపాయం, ప్రీ–పోస్ట్ హాస్పిటలైజేషన్, రూమ్ రెంటు పరిమితులు మొదలైనవన్నీ ఇందులో ఉంటాయి. డెంగ్యూ పాలసీలోనూ ఇలాంటివి ఉండేలా చూసుకోవచ్చు. ఈ పాలసీని కొనుగోలు చేసేటప్పుడు ప్రధానంగా పరిశీలించాల్సిన అంశాల్లో కొన్ని ఇవి.. తక్కువ ప్రీమియం ఎక్కువ కవరేజీ ఆరోగ్య బీమా పాలసీని కొనేటపుడు కట్టే ప్రీమియానికి తగినంత విలువ లభిస్తోందో లేదో చూసుకోవాలి. ప్రీమియం తక్కువగా ఉండాలి. అత్యధిక కవరేజీ లభించాలి. ఇటు హాస్పిటలైజేషన్, అటు అవుట్పేషంట్ ట్రీట్‌మెంట్‌కూ పనికొచ్చేదిగా చూసుకోవాలి. ఓపీడీ కవరేజీ.. డయాగ్నస్టిక్ టెస్టుల నుంచి కన్సల్టేషన్, హోమ్ నర్సింగ్, ఫార్మసీ దాకా అన్నింటికి కవరేజీనిచ్చేలా డెంగ్యూ పాలసీ ఉండాలి. సాధారణంగా డెంగ్యూ చికిత్స ఇంటి వద్దే పొందవచ్చు. కొనుగోలు ప్రక్రియ సులభంగా పాలసీ ఎంత సరళతరంగా ఉంటే అంత మంచిది. ఏ వయస్సు వారైనా çఏడాది మొత్తానికి ఒకేసారి ప్రీమి యం కట్టేసే పాలసీ తీసుకోవాలి. ముందస్తు వైద్య చికిత్సలు తదితర బాదరబందీ లేకుండా పాలసీ నిబంధనలు సరళంగా ఉన్నది ఎంచుకోవాలి. వెయి టింగ్ పీరియడ్ కూడా తక్కువ ఉండేలా చూసుకోవాలి. ఇతరత్రా సాధారణ ఆరోగ్య బీమా పాలసీలకు రిజెక్ట్ చేసిన వారికి సైతం డెంగ్యూ కేర్ పాలసీ వర్తించేలా ఉండాలి. ఆస్పత్రిలో చేరాకా.. గది అద్దె వంటి వైద్యయేతర ఖర్చులకు కూడా కవరేజీ ఉండాలి. భారీగా చికిత్స ఖర్చులు.. డెంగ్యూ పాలసీని తీసుకోవాలా వద్దా అన్న ఆలోచనలో ఉన్నవారు ఒకసారి దీని చికిత్స వ్యయాలు ఏ స్థాయిలో ఉంటున్నాయో చూసి నిర్ణయం తీసుకోవడం మంచిది. సాధారణంగా డెంగ్యూ వైద్య పరీక్షలకే చాలా ఖర్చవుతుంటుంది. ఇక తీవ్రమైన కేసు అయిన పక్షంలో అప్పటికప్పుడు ఆస్పత్రిలో చేర్చి, ప్లేట్లెట్స్ ఎక్కించాలి. వైద్య పరీక్షలకే దాదాపు రూ.5,000 నుంచి రూ. 10,000 దాకా ఖర్చవుతుంది. ఇక ఆస్పత్రిలో చేరాల్సి వస్తే చికిత్సా వ్యయాలు సుమారు రూ. 35,000 నుంచి రూ.70,000 దాకా ఉంటున్నాయి. ఇవన్నీ పరిగణనలోకి తీసుకునే బీమా సంస్థలు డెంగ్యూ కేర్ పాలసీలను అందుబాటులోకి తెచ్చాయి. వైద్య పరీక్షల నుంచి చికిత్స వ్యయాల దాకా అన్నింటికీ కవరేజీ అందించేవిగా ఇవి ఉన్నాయి. ఇప్పటికే హెల్త్ పాలసీ ఉంటే... ఒకవేళ ఇప్పటికే మీకో హెల్త్ పాలసీ ఉన్నా.. డెంగ్యూ పాలసీని ప్రత్యేకంగా తీసుకోవడం మంచిదే. తద్వారా మీ ప్రైమరీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ మీద వచ్చే బోనస్‌ను యథాతథంగా అందుకోవచ్చు. సాధారణంగా ఏ క్లెయిమూ చేయని పాలసీదారుకు బీమా సంస్థలు కొంత బోనస్ ఇస్తుంటాయి. సమ్ అష్యూర్డ్‌ను పెంచడం రూపంలోనో లేదా ప్రీమియంలో డిస్కౌంటు ఇవ్వడం రూపంలోనో ఇది ఉంటుంది. ప్రత్యేకంగా డెంగ్యూ కవరేజీ తీసుకోవడం వల్ల.. పాలసీదారు తన ప్రైమరీ హెల్త్ పాలసీలో దీన్ని క్లెయిమ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఆ రకంగా బోనస్‌లను కాపాడుకోవచ్చు. కాబట్టి.. ఈ వర్షాకాలంలో.. ప్రాణాంతకమైన డెంగ్యూ నుంచి మీకు, మీ కుటుంబసభ్యులందరికీ రక్షణ కల్పించేలా స్వల్ప ఖర్చుతో డెంగ్యూ పాలసీ తీసుకోవడం అన్నివిధాలా శ్రేయస్కరం. ఆంటోనీ జేకబ్ సీఈవో, అపోలో మ్యూనిక్ హెల్త్ -
వైరల్ : మరోసారి మహిళ జర్నలిస్ట్‌పై..
యెకాటెరిన్బర్గ్(రష్యా) : రష్యాలో జరుగుతున్న సాకర్ ప్రపంచకప్ కవరేజ్‌కు వెళ్లిన మహిళ రిపోర్టర్లకు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. ఈ నెల 15న ఓ జర్మన్ న్యూస్ ఛానల్లో పనిచేస్తున్న జూలియట్ గోంజాలెజ్ థెరాన్ లైవ్ రిపోర్ట్ చేస్తున్న సమయంలో ఓ వ్యక్తి వచ్చి ముద్దు పెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా బ్రెజిల్ స్పోర్ట్ జర్నలిస్ట్ జూలియా గుమారాస్, యోకాటెరిన్బర్గ్ నుంచి రిపోర్ట్ చేస్తున్న సమయంలో ఓ ఆకతాయి ఆమెకు ముద్దు పెట్టే ప్రయత్నం చేశాడు. రిపోర్టింగ్ సమయంలో అప్రమత్తతో ఉన్న జూలియా అతని నుంచి తప్పించుకున్నారు. అంతేకాకుండా ఇంకెప్పుడు ఇలా చేయకు అంటూ జూలియా అతనిపై మండిపడ్డారు. ‘ఇది మంచి పద్దతి కాదు.. ఓ మహిళ పట్ల ఇలా ప్రవర్తించడం సరైనది కాదు.. దీనిని రిపీట్ చేయకు’ అంటూ అతనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై జూలియా ట్విటర్లో స్పందించారు. ‘ఆ ఘటన గురించి చెప్పడానికి మాటలు రావడం లేదు. అదృష్టవశాత్తు నేను తప్పించుకున్నాను. ఇక్కడ ఇలా జరగడం రెండోసారి.. రష్యా, ఈజిప్ట్ మధ్య జరిగిన ప్రపంచకప్ తొలి మ్యాచ్ సమయంలో కూడా మాస్కోలో ఇదే రకమైన అనుభవం ఎదురైంది. రష్యాలో కొన్ని పరిస్థితలు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయ’ని ఆమె ట్వీట్లో పేర్కొన్నారు. కాగా జూలియా చర్యను తోటి జర్నలిస్టులు.. నెటిజన్లు ప్రశంసిసస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. -
బీమా ఉన్నా... బిల్లు మొత్తం రాదు!!
ఒకోసారి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కింద భారీగా కవరేజీ ఉన్నా.. క్లెయిమ్ సమయంలో అరకొర మాత్రమే చేతికి రావొచ్చు. ఉదాహరణకు మనకు రూ. 2 లక్షల దాకా కవరేజీ ఉందనుకుందాం. వైద్య చికిత్స బిల్లు రూ.లక్షే అయింది. ఇలాంటప్పుడు కవరేజీ రూ.2 లక్షల దాకా ఉంది కాబట్టి.. క్లెయిమ్ చేసిన రూ. లక్ష తిరిగి వస్తుందనే చాలా మంది అనుకుంటారు. కానీ వాస్తవానికి పలు సందర్భాల్లో క్లెయిమ్ చేసిన దాంట్లో పాక్షికంగానే ఇన్సూరెన్స్ సంస్థ ఇచ్చే అవకాశం ఉంది. దీనికి కారణం సబ్–లిమిట్ నిబంధన. దానిపై అవగాహన కల్పించేదే ఈ కథనం. సబ్ లిమిట్స్ అంటే... మీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కింద కొన్ని రకాల చికిత్సలకు చెల్లింపులపరంగా నిర్దేశించిన కొన్ని పరిమితులనే సబ్ లిమిట్స్గా వ్యవహరిస్తారు. ఇవి సాధారణంగా ఈ ఆరోగ్య సమస్య చికిత్సకు ఇంత మొత్తం మాత్రమే ఇవ్వడం జరుగుతుందనో లేదా మొత్తం సమ్ ఇన్సూ ర్డ్‌లో నిర్దిష్ట శాతం మాత్రమే ఇవ్వడం జరుగుతుందనో కంపెనీ పేర్కొంటుంది. ఈ పరిమితులను పాలసీలో అంతర్గతంగానే పేర్కొనడం జరుగుతుంది. హెల్త్ పాలసీని తీసుకునేటప్పుడు ప్రధానంగా రెండు రకాల సబ్ లిమిట్స్‌ని దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. మొదటిది హాస్పిటల్ రూమ్ రెంట్ కాగా, రెండోది నిర్దిష్ట ఆరోగ్య సమస్యల చికిత్స వ్యయాలపై నిర్దేశించే పరిమితులు. సబ్ లిమిట్స్ ప్రభావాలు.. గది అద్దెపై పరిమితుల ప్రభావాలు.. మిగతా హాస్పిటల్ చార్జీల మీద కూడా ఉం టాయి. ఉదాహరణకు డాక్టర్ విజిట్, శస్త్ర చికిత్స, నర్సింగ్ చార్జీలు, ఆపరేషన్ థియేటర్ చార్జీలు, సర్జన్ ఫీజులు, అనెస్థటిస్ట్, స్పెషలిస్టుల ఫీజులు, ఇతరత్రా వైద్య చికిత్సా వ్యయాలు.. ఇవన్నీ కూడా మీరు ఎంచుకునే గది మీదే ఆధారపడి ఉంటాయి. ఉదాహరణకు.. నిర్దిష్ట శస్త్ర చికిత్సకు ట్విన్ షేరింగ్ గదిలోనైతే.. రూ. 20,000, సింగిల్ రూమ్‌లోనైతే రూ. 40,000 వ్యయం అవుతుందనుకుందాం. ట్విన్ షేరింగ్ రూమ్‌లో డాక్టర్ విజిట్ ఫీజు రూ. 1,000 కాగా.. సింగిల్ రూమ్‌లో రూ. 2,000 అనుకుందాం. ఇక మీరు రోజుకు రూ. 5,000 టారిఫ్ ఉండే గదిని తీసుకున్నారనుకుందాం. ఇప్పుడు లెక్కేస్తే.. 4రోజులకు మీ గది అద్దె రూ. 20,000 అవుతుంది. అయితే, మీ హెల్త్ పాలసీలో గది అద్దెపై గరిష్ట పరిమితి రూ.2,000 మాత్రమే. దీంతో మిగతా రూ. 12,000 (అదనంగా రోజుకు రూ. 3,000 చొప్పున, 4 రోజులకు) మొత్తాన్ని మీరే కట్టాల్సి వస్తుంది. ఇది ఇక్కడితో అయిపోలేదు. ముందుగా అనుకున్నట్లే.. మనం ఎంచుకున్న రూమ్‌ని బట్టి చికిత్సా వ్యయాలూ మారి పోతుంటాయి. కాబట్టి మీరు ఎంచుకున్న రూ. 5,000 టారిఫ్ గది ప్రకారం.. డాక్టర్ విజిట్, సర్జరీ, మెడికల్ టెస్టులు మొదలైన వాటికి రూ. 2లక్షలు అయ్యాయనుకుందాం. ఇది మీ పాలసీ సమ్ ఇన్సూర్డ్ రూ. 2లక్షలకు లోబడే ఉంది. కానీ.. మీ పాలసీలో నిర్దేశించిన రూమ్ రెంట్ సబ్ లిమిట్స్ ప్రకారం.. రూ. 2,000 టారిఫ్ గదిలో ఈ వ్యయాలు రూ. 1.50 లక్షలే అవుతాయి. అంటే నిర్దేశించిన సబ్ లిమిట్స్‌ని మించిన రూమ్‌ని తీసుకోవడం వల్ల గది అద్దె అదనపు మొత్తంతోపాటు.. మరో రూ. 50,000 కూడా మీ జేబు నుంచే కట్టాల్సి ఉంటుంది. నిర్దిష్ట చికిత్సల వ్యయాలపై పరిమితులు అత్యధిక కవరేజీ ఉండేలా హెల్త్ పాలసీ తీసుకున్నా.. కొన్ని ఆరోగ్య సమస్యల చికిత్సల వ్యయాలపై నిర్దిష్ట పరిమితులు ఉంటాయి. వీటిని గురించిన వివరాలు పాలసీలో ప్రత్యేకంగా కంపెనీ పేర్కొంటుంది. ఇలాంటి చికిత్సల వ్యయాలపై వేర్వేరు కంపెనీలు విధించే పరిమితులు వేర్వేరుగా ఉండొచ్చు. స్థూలంగా చెప్పొచ్చేదేమిటంటే.. సమ్ ఇన్సూర్డ్ అధికంగా ఉన్నంత మాత్రాన ప్రతీ వైద్య చికిత్సకూ పూర్తి స్థాయిలో క్లెయిమ్ చేసుకోవడానికి సాధ్యం కాకపోవచ్చు. ఆయా చికిత్సా వ్యయాలపై సబ్ లిమిట్సే ఇందుకు కారణం. చికిత్స వ్యయాలపై సబ్ లిమిట్స్‌కి ఒక ఉదాహరణ చూద్దాం. ఉదాహరణకు కార్డియాక్ సమస్య చికిత్సకు సబ్–లిమిట్ 50 శాతం మాత్రమే ఉన్న పక్షంలో మీ సమ్ అష్యూర్డ్ రూ. 5 లక్షలు ఉన్నప్పటికీ.. రూ. 2.5 లక్షలకు మించి క్లెయిమ్ చేయడానికి ఉండదు. అలాగే, కిడ్నీలో రాళ్ల సమస్య చికిత్స వ్యయాలు రూ. 1 లక్ష అయ్యాయనుకుందాం. కానీ హెల్త్ పాలసీ ప్రకారం.. దీని చికిత్సకు రూ. 40,000 మాత్రమే సబ్ లిమిట్ ఉంటే.. మిగతా రూ. 60,000 మన జేబు నుంచి కట్టాల్సి వస్తుంది. సబ్ లిమిట్స్ విషయంలో గుర్తుంచుకోదగిన విషయాలు.. ►వీలైనంత వరకూ సబ్–లిమిట్స్ లేని హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని ఎంచుకోండి. అలా కుదరకపోతే.. ఏ చికిత్సకు ఎంత వరకూ వ్యయ పరిమితి ఉంటుందో క్షుణ్నంగా తెలుసుకున్నాకే తీసుకోండి. ►వెసులుబాటు బట్టి సమ్ ఇన్సూర్డ్ అత్యధికంగా ఉండేలా చూసుకుంటే.. ఒకవేళ సబ్–లిమిట్స్ ఉన్నా.. వాటి పరిమితి కూడా అధికంగానే ఉంటుంది. ►అయితే, సమ్ ఇన్సూర్డ్ ఎక్కువయ్యే కొద్దీ.. కట్టాల్సిన ప్రీమియం కూడా పెరుగుతుంది. కాబట్టి నెలవారీ ఖర్చులను బేరీజు వేసుకుని దాని ప్రకారం నిర్ణయం తీసుకోవాలి. ► హెల్త్ కవర్ ప్లాన్ షరతులు, నిబంధనలు మొదలైన వాటన్నింటినీ క్షుణ్నంగా చదివి, అర్థం చేసుకోవాలి. ►మీ ఆర్థిక పరిస్థితులు, అవసరాలకు అనుగుణమైన హెల్త్ పాలసీని ఎంపిక చేసుకునేటప్పుడు.. ఏయే వ్యాధులు కవరేజీ పరిధిలోకి రావో, వేటికి మినహాయింపులు ఉన్నాయో తెలుసుకోవాలి. -
క్రిటికల్ ఇల్నెస్ కవరేజీ ఉండాలి
ఈ సారి బడ్జెట్లో వయో వృద్ధులు కొన్ని రకాల చికిత్సల కోసం చేసే వ్యయంపై పన్ను మినహాయింపును రూ.లక్ష వరకూ పెంచారు జైట్లీ. అంటే క్రిటికల్ ఇల్నెస్ చికిత్సకన్న మాట. ప్రస్తుతం ఇది సీనియర్ సిటిజన్ల విషయంలో రూ.60వేలుగా, అత్యంత సీనియర్ సిటిజన్లకు రూ.80వేలుగా ఉంది. ఇకపై అందరికీ ఇది రూ.లక్షగా ఉంటుందన్న మాట. అసలింతకీ ఈ క్రిటికల్ ఇల్నెస్ అంటే ఏంటి? దీనికి ఖర్చులెంతవుతాయి? దీనికి బీమా కవరేజీ ఉంటుందా? కవరేజీ కావాలంటే ఏం చేయాలి? అసలు క్రిటికల్ ఇల్నెస్కు బీమా కవరేజీ ఎందుకు అవసరం? ఇవన్నీ వివరించేదే ఈ ప్రాఫిట్ ప్లస్ ప్రధాన కథనం... (సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం) తీవ్రమైన అనారోగ్యం రూపంలో... ఊహించని సందర్భాలు ఎదురవటం కొత్తేమీ కాదు. అలాంటి సందర్భాల్లో వైద్య బీమా పూర్తిగా ఆదుకుంటుందని చెప్పలేం. ఎందుకంటే కవరేజీ పరంగా పరిమితులు ఉంటాయి. అదే క్రిటికల్ ఇల్నెస్ పాలసీ తీసుకుని ఉంటే ఆ పాలసీ పరిధిలో ఉన్న వ్యాధుల బారిన పడినపుడు నిర్దేశిత పరిహారం అందుతుంది. ఈ తరహా బీమా 15 ఏళ్ల నుంచీ ఉన్నదే. మొదట్లో జీవిత బీమా పాలసీలకు రైడర్‌గా వచ్చేది. అయితే, ఈ కవరేజీ తీసుకునేందుకు ఎన్నో వైద్య పరీక్షలు అవసరం కనక అప్పట్లో దీని పట్ల పెద్ద ఆసక్తి ఉండేది కాదు. దీంతో వీటి అమ్మకాలు చాలా తక్కువగా నడిచాయి. వీటికి ఉన్న ప్రాముఖ్యత దృష్ట్యా బీమా సంస్థలే చొరవతో ఆ తర్వాత పూర్తి స్థాయి, స్టాండలోన్ పాలసీలుగా తీసుకురావడం మొదలెట్టాయి. దీంతో వాటి క్లెయిమ్ చెల్లింపుల చరిత్రను ట్రాక్ చేసే అవకాశం లభించింది. క్రిటికల్ ఇల్నెస్ పాలసీలు సమగ్రమైన కవరేజీతో ఉండడం అదనపు ఆకర్షణ. ‘క్రిటికల్’ పాలసీ వేరు... కుటుంబీకులో, బంధుమిత్రులో కేన్సర్, గుండెజబ్బు వంటి వాటి బారిన పడ్డట్లు వినటమనేది పెరిగిపోయింది. చిన్న వయసులో ఉన్న వారు కూడా వీటికి అతీతం కాకపోవడం ఆందోళన కలిగించేదే. ఈ నేపథ్యంలో క్రిటికల్ ఇల్నెస్ పాలసీ తీసుకోవాల్సిన అవసరం పెరిగిపోయిందనే చెప్పాలి. చాలా మంది సాధారణ వైద్య బీమా పాలసీకి, క్రిటికల్ ఇల్నెస్ కవరేజీ పాలసీకి మధ్య తేడా లేదనుకుంటుంటారు. కానీ ఇది తప్పు. ఈ రెండూ వేర్వేరు అవసరాలను తీర్చేవని, ఒకదానికొకటి తోడుగా మరింత రక్షణనిస్తాయని అర్థం చేసుకోవాలి. వైద్య బీమా అంటే ఆసుపత్రి ఖర్చులను మాత్రమే భరిస్తుంది. కానీ, క్రిటికల్ ఇల్నెస్ పాలసీ ఖర్చుతో సంబంధం లేకుండా వ్యాధుల బారిన పడినప్పుడు నిర్దేశిత మొత్తం చెల్లిస్తుంది. ఏ కారణంతో ఆస్పత్రి పాలైనా వైద్య బీమా ఆదుకుంటుంది. కానీ, క్రిటికల్ ఇల్నెస్ కవరేజీ అన్నది ముందుగా పేర్కొన్న వ్యాధుల బారిన పడితే పరిహారం చెల్లిస్తుంది. వైద్య బీమా పాలసీని జీవితాంతం రెన్యువల్ చేసుకోవచ్చు. క్రిటికల్ ఇల్నెస్ పాలసీ మాత్రం ఒకసారి క్లెయిమ్ చేస్తే ఆగిపోతుంది. ఎలా ఎంచుకోవాలి? పాలసీ ప్రీమియం, క్లెయిమ్‌ల పరిష్కార శాతం అన్నవి కీలకం. అలాగే, విడిగా ఆయా పాలసీలు ఎన్ని వ్యాధులకు రక్షణ కల్పిస్తున్నాయి? ముందు నుంచీ ఉన్న వ్యాధులకూ కవరేజీ పొందాలంటే ఎన్నాళ్లు వేచి ఉండాలి? పాలసీ కాల వ్యవధి ఎంత? గరిష్టంగా ఎంత బీమాకు అవకాశముంది? వంటివన్నీ చూడాలి. సాధారణంగా కంపెనీని బట్టి 10 నుంచి 37 వ్యాధుల వరకు కవరేజీనిచ్చే పాలసీలున్నాయి. అయితే ఇక్కడ సంఖ్య కాదు ముఖ్యం. కవరేజీనిస్తున్న వ్యాధులు ఎలాంటివన్నది చూడాలి. అంధత్వం, చెవిటితనం, మాట్లాడే శక్తిని కోల్పోవడం, అల్జీమర్స్ (జ్ఞాపకశక్తి క్షీణించిపోవడం), మల్టిపుల్ స్కెలరోసిస్, స్ట్రోక్ తదితర వ్యాధులకు పరిహారం చెల్లించే వాటికి ప్రాధాన్యం ఇచ్చేవారూ ఉన్నారు. ఎందుకంటే వీటికి ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం ఉండదు. క్రిటికల్ ఇల్నెస్ పాలసీ ద్వారా నిర్ణీత పరిహారం పొందొచ్చు. వీటికి సాధారణ వైద్య బీమా పాలసీలో కవరేజీ పరిమితంగానే ఉంటుంది. ఉదాహరణకు అపోలో మ్యూనిక్ క్రిటికల్ ఇల్నెస్ పాలసీ అయితే వ్యాధుల సంఖ్య పరంగా, వ్యాధుల పరంగా మెరుగైన పాలసీయేనని చెప్పొచ్చు. ముందు నుంచీ ఉన్న వ్యాధులకు కవరేజీ ఇవ్వని పాలసీలకు దూరంగా ఉండటమే మంచిది. ఎందుకంటే భవిష్యత్తులో ఒకవేళ ఆయా వ్యాధులకు సంబంధించి క్లెయిమ్ ఎదురైతే తిరస్కరణకు గురికావొచ్చు. టాటా ఏఐజీ, హెచ్డీఎఫ్సీ ఎర్గో అయితే ముందు నుంచీ ఉన్న వ్యాధుల కవరేజీకి నాలుగేళ్ల పాటు వేచి ఉండాలన్న నిబంధన విధిస్తున్నాయి. చికిత్సా వ్యయాలు క్లిష్టమైన అనారోగ్యం బారిన పడితే చికిత్సా వ్యయాలను తట్టుకోవటం సామాన్యులకు భారమే. కేన్సర్, అవయవ మార్పిడి, ఓపెన్‌హార్ట్ సర్జరీలకు వ్యయం రూ.10 లక్షలకు తక్కువ కాదు. ఈ వ్యాధులకు చికిత్సా వ్యయాలు ఏటా 15–20 శాతం స్థాయిలో పెరుగుతున్నాయి. అంటే ఓ పదేళ్ల తర్వాత ఈ వ్యాధులకయ్యే వ్యయం రూ.50 లక్షలకు చేరొచ్చు. అందుకే సమ్ అష్యూర్డ్ (బీమా కవరేజీ) ఎక్కువ ఉండాలి. చాలా వరకు క్రిటికల్ ఇల్నెస్ పాలసీలు జీవితాంతం రెన్యువల్‌కు అవకాశం ఉన్నవే. అయితే ముందే వీటిని తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. రెలిగేర్, మ్యాక్స్ బూపా సంస్థలు అయితే రూ.కోటికి పైగా కవరేజీతో క్రిటికల్ ఇల్నెస్ పాలసీలను అందిస్తున్నాయి. సర్వైవల్ పీరియడ్ క్రిటికల్ ఇల్నెస్ పాలసీల్లో సాధారణంగా 30 నుంచి 90 రోజుల వరకు సర్వైవల్ పీరియడ్ ఉంటుంది. అంటే వ్యాధి బారిన పడిన తర్వాత ఇన్ని రోజుల పాటు జీవించి ఉంటేనే పరిహారం క్లెయిమ్ చేసుకోగలరు. నిజానికి ఇది ఆమోదనీయం కాదు. ఎందుకంటే తీవ్ర వ్యాధుల బారిన పడిన తర్వాత కొన్ని రోజుల్లోనే ప్రాణాలు కోల్పోయిన కేసులు ఎన్నో ఉంటున్నాయి. ఉదాహరణకు హార్ట్ ఎటాక్ వచ్చి గంటల వ్యవధిలోనే ప్రాణాలు కోల్పోతున్న కేసులు చూస్తూనే ఉన్నాం. ఐసీఐసీఐ లాంబార్డ్ సంస్థ మాత్రం ఈ విధమైన సర్వైవల్ పీరియడ్ షరతు విధించడం లేదు. కొన్ని నెలల క్రితం 600 క్లెయిమ్‌లను (ఇవన్నీ వివిధ బీమా కంపెనీలకు సంబంధించిన గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్వి) ఓ సంస్థ విశ్లేషించగా తేలిన విషయం ఏమిటంటే... ఇందులో 50 క్రిటికల్ ఇల్నెస్వి. వీటిలోనూ 15 క్లెయిమ్‌లు సమ్ అష్యూర్డ్ పరిమితి దాటినవే. కనుక ప్రతీ ఒక్కరికీ క్రిటికల్ ఇల్నెస్ పాలసీ ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా ఎంతో అవసరమని అర్థం చేసుకోవాలి. -
ఆరోగ్య బీమా...ఖర్చుకాదు పెట్టుబడి
♦ ఏదో ఒక పాలసీ అనుకోవద్దు ♦ కవరేజీలో అన్ని అంశాలూ చూశాకే ఓకే చెప్పాలి ప్రస్తుతం ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవడమనేది తప్పనిసరైపోయింది. ఒకరకంగా ఇది కూడా పెట్టుబడే. ఎందుకంటే వైద్య శాస్త్రం పురోగమిస్తున్న కొద్దీ కొత్త వ్యాధులు పుట్టుకొస్తున్నాయి. పర్యావరణ కాలుష్యం, క్రమపద్ధతి లోపించిన జీవన విధానాలు తదితరాలతో హృద్రోగాలు, క్యాన్సర్, హైపర్‌టెన్షన్, గ్యాస్ట్రిక్ సమస్యలు, ఊపిరితిత్తుల సమస్యలు.. ఇలాంటివెన్నో తలెత్తుతున్నాయి. వీటి చికిత్సా వ్యయాలు కూడా భారీగా ఉంటూ తలకు మించిన భారమవుతున్నాయి. వీటి వల్ల అప్పుల బారిన పడే సందర్భాలూ తలెత్తుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో మధుమేహ వ్యాధిగ్రస్తులు భారత్‌లోనే ఉన్నారు. పరిస్థితులు తీవ్రంగా ఉంటున్నప్పటికీ... దేశీయంగా తగినంత స్థాయిలో ఆరోగ్య బీమా పాలసీ తీసుకునే వారి సంఖ్య చాలా తక్కువే. మొత్తం జనాభాలో స్వచ్ఛందంగా ఏదో ఒక హెల్త్ కవరేజీ తీసుకున్న వారి సంఖ్య 3 శాతం కన్నా తక్కువే ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆరోగ్య బీమా పాలసీ ప్రాధాన్యం తెలిపేందుకే ఈ కథనం. సరైన ప్లాన్ ఎంచుకోవాలి.. ప్రస్తుతం ప్రభుత్వ రంగ, ప్రైవేట్ రంగ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు అనేక ఆప్షన్లతో ఆరోగ్య బీమా పాలసీలు అందిస్తున్నాయి. అనేకం ఉన్నప్పటికీ.. మనకు అనువైనది ఎంచుకోవడం చాలా ముఖ్యం. పాలసీ ఎంపికలో ప్రీమియం ఒక్కటే ప్రామాణికం కాదు. ప్రీమియం తక్కువగా ఉండటంతో పాటు పాలసీ సమగ్రమైనదిగా ఉండాలి. వ్యక్తిగత పాలసీ తీసుకో వాలా లేక ఫ్యామిలీ ఫ్లోటర్ ఎంచుకోవాలా అన్నది చూసుకోవాలి. గతం నుంచీ ఉన్న వ్యాధులకు కూడా కవరేజీ ఉంటోందా? లైఫ్‌టైమ్ రెన్యూవల్ సదుపాయం ఉందా? ప్రీ..పోస్ట్ హాస్పిటలైజేషన్ వ్యయాలకు కవరేజీ లభిస్తోందా? నగదు రహిత చికిత్స ప్రయోజనాలు .. డే కేర్ ట్రీట్మెంట్ వంటి వి ఉన్నాయా? ఇవన్నీ పరిశీలించుకోవాలి. అలాగే దేనికి ఎంత వరకూ కవరేజీ (సబ్ లిమిట్స్) ఉం టోంది చూసుకోవాలి. క్యాన్సర్, హార్ట్ఎటాక్, పక్షవాతం వంటి ప్రాణాంతక సమస్యలు సర్వసాధారణంగా మారిపోతున్న నేపథ్యంలో వీలైతే రెగ్యులర్ ప్లాన్‌తో పాటు టాప్ అప్ ప్లాన్ కూడా తీసుకునే అవకాశాన్నీ పరిశీలించవచ్చు. ఆరోగ్య జీవన విధానానికి రివార్డులు.. ఈ మధ్య కొన్ని హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు.. ఆరోగ్యకరమైన జీవన విధానం సాగించే పాలసీదారులకు నో క్లెయిమ్ బోనస్‌తో పా టు మరికొన్ని ప్రత్యేక ప్రయోజనాలు కల్పిస్తున్నాయి. నగదుకు సమానమైన రివార్డులు అందిస్తున్నాయి. ఔషధాలు కొనుక్కునేందు కు, వైద్య పరీక్షల ఖర్చుల చెల్లింపులకు, అవుట్ పేషంట్ వ్య యాలు, డే కేర్ ట్రీట్మెంట్ లాంటి వాటికి వీటిని ఉపయోగించుకోవచ్చు. లేదా భవిష్యత్ ప్రీమియంల చెల్లింపులకు సర్దుబాటు కూడా చేసుకోవచ్చు. గుర్తుంచుకోవాల్సిన అంశాలు.. పాలసీ తీసుకునేటప్పుడు ఆరోగ్యానికి సంబంధించిన అంశాలేమీ దాచిపెట్ట కుండా ఉండటం శ్రేయస్కరం. సగం సగం సమాచారమిచ్చినా.. లేదా తప్పుడు వివరాలు ఇచ్చినట్లు తేలినా .. కచ్చితంగా అవసరం తలెత్తినప్పుడు పాలసీని కంపెనీలు తిరస్కరించే ప్రమాదం ఉంది. కనుక ఆరోగ్యం.. అనారోగ్యం వివరాలేమీ దాచిపెట్టకుండా వెల్లడించడమే శ్రేయస్కరం. అలాగే.. పాలసీ పరిభాషను, నిబంధనలను కూడా క్షుణ్నంగా తెలుసుకోవాలి. పాలసీ సెటిల్మెంట్ టైమ్, సెటిల్మెంట్ నిష్పత్తి, కో–పేమెంట్ షరతులు మొదలైన నిబంధనలు అనేకం ఉంటాయి. పన్ను ఆదాకు మించి ప్రయోజనాలు ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80డీ కింద హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంలపై కొంత పన్ను ప్రయోజనాలూ లభిస్తాయి. దీంతో పన్ను ఆదా అవుతుంది కదా అనే ఉద్దేశంతో కూడా ఈ పాలసీలు తీసుకునే వారున్నారు. అయితే, కేవలం ఆ దృష్టితో మాత్రమే చూడకుండా.. అనూహ్యంగా తలెత్తే చికిత్స ఖర్చులతో అస్తవ్యస్తం కాకూడదన్నదే పాలసీ కొనుగోలు పరమార్ధం అయి ఉండాలి. -
సిలిండర్ పేలితే.. రూ.40 లక్షల బీమా
-
జీవిత బీమా పరిభాష..
బేసిక్స్ జీవిత బీమా తీసుకునేటప్పుడు రకరకాల పదాలు వినవస్తుంటాయి. వీటిలో కొన్నింటిని గురించి క్లుప్తంగా.. సమ్ అష్యూర్డ్ దీన్నే కవరేజ్ అని కూడా అంటారు. బీమా కంపెనీ పాలసీకి సంబంధించి గ్యారంటీగా ఇచ్చే సొమ్ము ఇది. పాలసీని బట్టి బోనస్‌లు, వడ్డీ మొదలైనవి కూడా దీనికి జత కావొచ్చు. పాలసీ మెచ్యూర్ అయ్యాక (వ్యవధి పూర్తయిపోయాక) పాలసీదారుకు ఈ మొత్తాన్ని కంపెనీ చెల్లిస్తుంది. ఒకవేళ ఈలోగానే పాలసీదారు మరణించిన పక్షంలో వారి వారసులకు దీన్ని అందిస్తుంది. ప్రీమియం.. పాలసీ కవరేజీ కోసం పాలసీదారు తరచుగా కొంత మొత్తం బీమా కంపెనీకి కట్టాలి. దీన్నే ప్రీమియం అంటారు. ఒక రకంగా ఇది ఇన్స్టాల్మెంట్ అనుకోవచ్చు. పాలసీదారు వయసును బట్టి ప్రీమియం మారుతుంటుంది. ఉదాహరణకు, 25 ఏళ్ల వ్యక్తి తీసుకునే పాలసీకి, 40 ఏళ్ల వ్యక్తి తీసుకునే పాలసీకి ప్రీమియంలు వేర్వేరుగా ఉంటాయి. ఆయా పాలసీలను బట్టి పాలసీదారు ఏకమొత్తంగా ఒకేసారైనా కట్టేయొచ్చు లేదా ఏడాదికో, ఆర్నెల్లకో, మూడు నెలలకోసారి కట్టే విధానాన్ని ఎంచుకోవచ్చు. ప్రతి పాలసీకి ఇన్ని సంవత్సరాలు ప్రీమియం చెల్లించాలని ఉంటుంది. యాన్యుటీ పథకాలు.. కంపెనీకి ఒకేసారి ఏకమొత్తంగా కట్టేసి.. జీవితాంతం నెలకి కొంత చొప్పున తిరిగి పొందే పథకాలు ఇవి. ఇందులో ఇమ్మీడియట్ అని.. డిఫర్డ్ అని రెండు రకాలు ఉంటాయి. ఇమ్మీడియట్ విధానంలో .. కంపెనీకి డబ్బు కట్టేసిన మరుసటి నెల నుంచి మనకు రావాల్సిన చెల్లింపులు మొదలవుతాయి. ఇక రెండో విధానంలో.. మనం ఎప్పట్నుంచి కావాలని కోరుకుంటామో అప్పట్నుంచే కంపెనీ చెల్లించడం మొదలుపెడుతుంది. మనకు నెలకు ఎంత వస్తుందనేది.. ఇన్వెస్ట్ చేసిన మొత్తాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. -
విలేకరిని కొట్టిన సీఐపై చర్యలు తీసుకోవాలి
కమాన్‌పూర్, న్యూస్‌లైన్: పోలింగ్ సందర్భంగా కాంగ్రెస్,టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య చోటుచేసుకున్న ఘర్షణను కవరేజీ చేస్తున్న విలేకరినికొట్టిన సీఐపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జర్నలిస్టులు రాస్తారోకో చేశారు. బుధవారం మండలంలోని బేగంపేటలో ఓటింగ్ జరుగుతుండగా కాంగ్రెస్ కార్యకర్త ఒకరు ఓటర్లకు పార్టీ గుర్తు చూపిస్తూ ఓట్లు అభ్యర్థించడంతో టీఆర్ఎస్ కార్యకర్తలు అభ్యంతరం తెలిపారు. దీంతో ఇరువర్గాలు తోపులాడుకున్నాయి. పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. విలేకరులు ఫొటోలు తీస్తూ, వివరాలు తెలుసుకుంటున్నారు. గోదావరిఖని టూటౌన్ సీఐ భద్రయ్య టీఆర్ఎస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకుంటూనే అక్కడ ఉన్న విలేకరి మల్యాల సురేశ్‌పై చేయిచేసుకున్నారు. మిగితా లేకరులను కూడా దుర్భాషలాడారు. దీంతో విలేకరులు సీఐపై చర్యలు తీసుకోవాలని సెంటినరీకాలనీలోని తెలంగాణ చౌరస్తాలో రాస్తారోకో చేశారు. గోదావరిఖని వన్‌టౌన్ సీఐ శ్రీధర్, కమాన్‌పూర్ ఎస్సై సతీశ్ వచ్చి విలేకరులను సముదాయించారు. విచారణ జరిపి సీఐపై చర్యలు తీసుకుంటామని గోదావరిఖని డీఎస్పీ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ ఆందోళనలో పూదరి సత్యనారాయణ, పీవీ రావు, బబ్బార్ఖాన్, బుర్ర తిరుపతి, పోసు భిక్షపతి, బండ సాయిశంకర్, గాదె బాలయ్య, బొల్లవరం వాసు, విజయ్, మాటేటి కుమార్, చేతి రవి, ఆరెపెల్లి శంకర్ తదితరులు పాల్గొన్నారు.