క్రిటికల్‌ ఇల్‌నెస్‌ కవరేజీ ఉండాలి | Critical Illness coverage should have | Sakshi
Sakshi News home page

క్రిటికల్‌ ఇల్‌నెస్‌ కవరేజీ ఉండాలి

Published Mon, Feb 12 2018 12:10 AM | Last Updated on Mon, Feb 12 2018 12:10 AM

Critical Illness coverage should have - Sakshi

ఈ సారి బడ్జెట్లో వయో వృద్ధులు కొన్ని రకాల చికిత్సల కోసం చేసే వ్యయంపై పన్ను మినహాయింపును రూ.లక్ష వరకూ పెంచారు జైట్లీ. అంటే క్రిటికల్‌ ఇల్‌నెస్‌ చికిత్సకన్న మాట. ప్రస్తుతం ఇది సీనియర్‌ సిటిజన్ల విషయంలో రూ.60వేలుగా, అత్యంత సీనియర్‌ సిటిజన్లకు రూ.80వేలుగా ఉంది. ఇకపై అందరికీ ఇది రూ.లక్షగా ఉంటుందన్న మాట. అసలింతకీ ఈ క్రిటికల్‌ ఇల్‌నెస్‌ అంటే ఏంటి? దీనికి ఖర్చులెంతవుతాయి? దీనికి బీమా కవరేజీ ఉంటుందా? కవరేజీ కావాలంటే ఏం చేయాలి? అసలు క్రిటికల్‌ ఇల్‌నెస్‌కు బీమా కవరేజీ ఎందుకు అవసరం? ఇవన్నీ వివరించేదే ఈ ప్రాఫిట్‌ ప్లస్‌ ప్రధాన కథనం... (సాక్షి, పర్సనల్‌ ఫైనాన్స్‌ విభాగం)


తీవ్రమైన అనారోగ్యం రూపంలో... ఊహించని సందర్భాలు ఎదురవటం కొత్తేమీ కాదు. అలాంటి సందర్భాల్లో వైద్య బీమా పూర్తిగా ఆదుకుంటుందని చెప్పలేం. ఎందుకంటే కవరేజీ పరంగా పరిమితులు ఉంటాయి. అదే క్రిటికల్‌ ఇల్‌నెస్‌ పాలసీ తీసుకుని ఉంటే ఆ పాలసీ పరిధిలో ఉన్న వ్యాధుల బారిన పడినపుడు నిర్దేశిత పరిహారం అందుతుంది. ఈ తరహా బీమా 15 ఏళ్ల నుంచీ ఉన్నదే.

మొదట్లో జీవిత బీమా పాలసీలకు రైడర్‌గా వచ్చేది. అయితే, ఈ కవరేజీ తీసుకునేందుకు ఎన్నో వైద్య పరీక్షలు అవసరం కనక అప్పట్లో దీని పట్ల పెద్ద ఆసక్తి ఉండేది కాదు. దీంతో వీటి అమ్మకాలు చాలా తక్కువగా నడిచాయి. వీటికి ఉన్న ప్రాముఖ్యత దృష్ట్యా బీమా సంస్థలే చొరవతో ఆ తర్వాత పూర్తి స్థాయి, స్టాండలోన్‌ పాలసీలుగా తీసుకురావడం మొదలెట్టాయి. దీంతో వాటి క్లెయిమ్‌ చెల్లింపుల చరిత్రను ట్రాక్‌ చేసే అవకాశం లభించింది. క్రిటికల్‌ ఇల్‌నెస్‌ పాలసీలు సమగ్రమైన కవరేజీతో ఉండడం అదనపు ఆకర్షణ.

‘క్రిటికల్‌’ పాలసీ వేరు...
కుటుంబీకులో, బంధుమిత్రులో కేన్సర్, గుండెజబ్బు వంటి వాటి బారిన పడ్డట్లు వినటమనేది పెరిగిపోయింది. చిన్న వయసులో ఉన్న వారు కూడా వీటికి అతీతం కాకపోవడం ఆందోళన కలిగించేదే. ఈ నేపథ్యంలో క్రిటికల్‌ ఇల్‌నెస్‌ పాలసీ తీసుకోవాల్సిన అవసరం పెరిగిపోయిందనే చెప్పాలి. చాలా మంది సాధారణ వైద్య బీమా పాలసీకి, క్రిటికల్‌ ఇల్‌నెస్‌ కవరేజీ పాలసీకి మధ్య తేడా లేదనుకుంటుంటారు. కానీ ఇది తప్పు. ఈ రెండూ వేర్వేరు అవసరాలను తీర్చేవని, ఒకదానికొకటి తోడుగా మరింత రక్షణనిస్తాయని అర్థం చేసుకోవాలి.

వైద్య బీమా అంటే ఆసుపత్రి ఖర్చులను మాత్రమే భరిస్తుంది. కానీ, క్రిటికల్‌ ఇల్‌నెస్‌ పాలసీ ఖర్చుతో సంబంధం లేకుండా వ్యాధుల బారిన పడినప్పుడు నిర్దేశిత మొత్తం చెల్లిస్తుంది. ఏ కారణంతో ఆస్పత్రి పాలైనా వైద్య బీమా ఆదుకుంటుంది. కానీ, క్రిటికల్‌ ఇల్‌నెస్‌ కవరేజీ అన్నది ముందుగా పేర్కొన్న వ్యాధుల బారిన పడితే పరిహారం చెల్లిస్తుంది. వైద్య బీమా పాలసీని జీవితాంతం రెన్యువల్‌ చేసుకోవచ్చు. క్రిటికల్‌ ఇల్‌నెస్‌ పాలసీ మాత్రం ఒకసారి క్లెయిమ్‌ చేస్తే ఆగిపోతుంది.

ఎలా ఎంచుకోవాలి?
పాలసీ ప్రీమియం, క్లెయిమ్‌ల పరిష్కార శాతం అన్నవి కీలకం. అలాగే, విడిగా ఆయా పాలసీలు ఎన్ని వ్యాధులకు రక్షణ కల్పిస్తున్నాయి? ముందు నుంచీ ఉన్న వ్యాధులకూ కవరేజీ పొందాలంటే ఎన్నాళ్లు వేచి ఉండాలి? పాలసీ కాల వ్యవధి ఎంత? గరిష్టంగా ఎంత బీమాకు అవకాశముంది? వంటివన్నీ చూడాలి. సాధారణంగా కంపెనీని బట్టి 10 నుంచి 37 వ్యాధుల వరకు కవరేజీనిచ్చే పాలసీలున్నాయి. అయితే ఇక్కడ సంఖ్య కాదు ముఖ్యం. కవరేజీనిస్తున్న వ్యాధులు ఎలాంటివన్నది చూడాలి.

అంధత్వం, చెవిటితనం, మాట్లాడే శక్తిని కోల్పోవడం, అల్జీమర్స్‌ (జ్ఞాపకశక్తి క్షీణించిపోవడం), మల్టిపుల్‌ స్కెలరోసిస్, స్ట్రోక్‌ తదితర వ్యాధులకు పరిహారం చెల్లించే వాటికి ప్రాధాన్యం ఇచ్చేవారూ ఉన్నారు. ఎందుకంటే వీటికి ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం ఉండదు. క్రిటికల్‌ ఇల్‌నెస్‌ పాలసీ ద్వారా నిర్ణీత పరిహారం పొందొచ్చు. వీటికి సాధారణ వైద్య బీమా పాలసీలో కవరేజీ పరిమితంగానే ఉంటుంది.

ఉదాహరణకు అపోలో మ్యూనిక్‌ క్రిటికల్‌ ఇల్‌నెస్‌ పాలసీ అయితే వ్యాధుల సంఖ్య పరంగా, వ్యాధుల పరంగా మెరుగైన పాలసీయేనని చెప్పొచ్చు. ముందు నుంచీ ఉన్న వ్యాధులకు కవరేజీ ఇవ్వని పాలసీలకు దూరంగా ఉండటమే మంచిది. ఎందుకంటే భవిష్యత్తులో ఒకవేళ ఆయా వ్యాధులకు సంబంధించి క్లెయిమ్‌ ఎదురైతే తిరస్కరణకు గురికావొచ్చు. టాటా ఏఐజీ, హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో అయితే ముందు నుంచీ ఉన్న వ్యాధుల కవరేజీకి నాలుగేళ్ల పాటు వేచి ఉండాలన్న నిబంధన విధిస్తున్నాయి.  

చికిత్సా వ్యయాలు
క్లిష్టమైన అనారోగ్యం బారిన పడితే చికిత్సా వ్యయాలను తట్టుకోవటం సామాన్యులకు భారమే. కేన్సర్, అవయవ మార్పిడి, ఓపెన్‌హార్ట్‌ సర్జరీలకు వ్యయం రూ.10 లక్షలకు తక్కువ కాదు. ఈ వ్యాధులకు చికిత్సా వ్యయాలు ఏటా 15–20 శాతం స్థాయిలో పెరుగుతున్నాయి.

అంటే ఓ పదేళ్ల తర్వాత ఈ వ్యాధులకయ్యే వ్యయం రూ.50 లక్షలకు చేరొచ్చు. అందుకే సమ్‌ అష్యూర్డ్‌ (బీమా కవరేజీ) ఎక్కువ ఉండాలి. చాలా వరకు క్రిటికల్‌ ఇల్‌నెస్‌ పాలసీలు జీవితాంతం రెన్యువల్‌కు అవకాశం ఉన్నవే. అయితే ముందే వీటిని తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. రెలిగేర్, మ్యాక్స్‌ బూపా సంస్థలు అయితే రూ.కోటికి పైగా కవరేజీతో క్రిటికల్‌ ఇల్‌నెస్‌ పాలసీలను అందిస్తున్నాయి.

సర్వైవల్‌ పీరియడ్‌
క్రిటికల్‌ ఇల్‌నెస్‌ పాలసీల్లో సాధారణంగా 30 నుంచి 90 రోజుల వరకు సర్వైవల్‌ పీరియడ్‌ ఉంటుంది. అంటే వ్యాధి బారిన పడిన తర్వాత ఇన్ని రోజుల పాటు జీవించి ఉంటేనే పరిహారం క్లెయిమ్‌ చేసుకోగలరు. నిజానికి ఇది ఆమోదనీయం కాదు. ఎందుకంటే తీవ్ర వ్యాధుల బారిన పడిన తర్వాత కొన్ని రోజుల్లోనే ప్రాణాలు కోల్పోయిన కేసులు ఎన్నో ఉంటున్నాయి. ఉదాహరణకు హార్ట్‌ ఎటాక్‌ వచ్చి గంటల వ్యవధిలోనే ప్రాణాలు కోల్పోతున్న కేసులు చూస్తూనే ఉన్నాం.

ఐసీఐసీఐ లాంబార్డ్‌ సంస్థ మాత్రం ఈ విధమైన సర్వైవల్‌ పీరియడ్‌ షరతు విధించడం లేదు. కొన్ని నెలల క్రితం 600 క్లెయిమ్‌లను (ఇవన్నీ వివిధ బీమా కంపెనీలకు సంబంధించిన గ్రూప్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌వి) ఓ సంస్థ విశ్లేషించగా తేలిన విషయం ఏమిటంటే... ఇందులో 50 క్రిటికల్‌ ఇల్‌నెస్‌వి. వీటిలోనూ 15 క్లెయిమ్‌లు సమ్‌ అష్యూర్డ్‌ పరిమితి దాటినవే. కనుక ప్రతీ ఒక్కరికీ క్రిటికల్‌ ఇల్‌నెస్‌ పాలసీ ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా ఎంతో అవసరమని అర్థం చేసుకోవాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement