సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినవిధంగానే ఆరోగ్యశ్రీ కవరేజీని రూ. 5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. శనివారం నుంచే రాష్ట్రవ్యాప్తంగా అన్ని నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో పెరిగిన కవరేజీ అందుబాటులోకి రానుంది. వాస్తవానికి గతంలో ఆరోగ్యశ్రీ కింద రూ.2 లక్షల వరకు మాత్రమే కవరేజీ ఉండేది.
కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఆయుష్మాన్ భారత్ పథకం కూడా ఆరోగ్యశ్రీతో కలిపి చేస్తుండటంతో కవరేజీని రూ.5లక్షలకు పెంచారు. ఇక నుంచి ఏడాదికి ఈ పథకాల కింద ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల వరకు కవరేజీ ఉంటుంది. ఈ పథకం కోసం ప్రభుత్వం ఏటా ఇప్పటివరకు రూ. 800 కోట్ల వరకు ఖర్చు చేస్తుండగా, ఇకనుంచి అది రెట్టింపు అవుతుందని అంచనా వేస్తున్నారు. అయితే దీనిపై ఇంకా స్పష్టత రాలేదు.
77.19 లక్షల మందికి ఆరోగ్యశ్రీ కార్డులు
రాష్ట్రంలో 293 ప్రైవేట్ ఆస్పత్రులు, 198 ప్రభుత్వ పెద్దాస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఇటీవల ప్రభుత్వం 809 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్‌సీ)లోనూ ఆరోగ్యశ్రీ కింద సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది. మొత్తంగా రాష్ట్రంలో 1,310 ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులో ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 77.19 లక్షల మందికి ఆరోగ్యశ్రీ కార్డులున్నాయి. ఉద్యోగులు, జర్నలిస్టుల ఆరోగ్య పథకాన్ని కూడా ఆరోగ్యశ్రీ ట్రస్టు ద్వారా అమలు చేస్తున్నారు.
రాష్ట్రంలోని లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులు, జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులు ఈజేహెచ్‌ఎస్ కిందకు వస్తారు. లబ్ధిదారుల్లో ఎవరికైనా ఏదైనా జబ్బు వస్తే నగదు రహిత వైద్యం పొందడానికి అవకాశం ఉంటుంది. అయితే బకాయిలు పేరుకుపోవడంతోపాటు ఆరోగ్యశ్రీ కింద ఆస్పత్రులకు ఇచ్చే ప్యాకేజీ సొమ్ము సరిపోవడం లేదని యాజమాన్యాలు చెబుతున్నాయి. 2013 ప్యాకేజీ ప్రకారమే ఆస్పత్రులకు సొమ్ము అందుతుంది. దీనిని సవరించాలని ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు కోరుతున్నాయి. అది పెంచకపోతే కవరేజీ రెట్టింపు చేసినా, తమకు ఎలాంటి ప్రయోజనం ఉండదని అంటున్నారు.
ప్రస్తుతం ఆరోగ్యశ్రీ కింద 1,376 శస్త్రచికిత్సలు, 289 వైద్య సేవలున్నాయి. ఆయుష్మాన్ భారత్ కింద 1,949 వ్యాధులకు వైద్యం అందుతుంది. ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్‌లో ఈ రెండింటిలో ఉన్న వ్యాధులను కలిపి అమలు చేస్తున్నారు. అయితే ఆయుష్మాన్ భారత్ పథకం కింద కేంద్రం 2022లో ప్యాకేజీలను సవరించింది. కానీ రాష్ట్రంలో అది జరగకపోవడంతో పథకం సక్రమంగా అమలు కావడం లేదు. కాగా, మరికొన్ని కొత్త వ్యాధులను కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురావాలని ఆరోగ్యశ్రీ ట్రస్టు నిర్ణయించింది. 611 కొత్త వ్యాధులను తీసుకురావాలని ప్రతిపాదించగా, వాటిల్లో 539 కొత్త వాటిని ఖరారు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment